ఎం కోటేశ్వరరావు
జర్మనీ, ఐరోపాయూనియన్ అనే ఒక రైలు బండికి ఇంజను వంటిది. గత రెండు నెలలుగా అది ఆగిపోయి ముందుకు కదలటం లేదు. దాన్ని తిరిగి ఎలా నడుపుతారో ప్రస్తుతానికైతే తోచటం లేదు. బండి ప్రయాణించకపోతే జర్మన్లకే కాదు, మొత్తం ఐరోపా ప్రయాణీకులందరికీ ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. కొందరు విశ్లేషకులు పేర్కొన్నట్లు జర్మనీ రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఎరుగనంత రాజకీయ అనిశ్చితి, సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నది. సెప్టెంబరు 24న ఎన్నికలు జరిగాయి. ఇంతవరకు కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా పచ్చిమితవాదులు పన్నెండుశాతంపైగా ఓట్లతో మూడవ పెద్ద పార్టీగా పార్లమెంటులో ప్రవేశించారు. క్రిస్మస్ నాటికి ఒక కొలిక్కి రానట్లయితే మహాసంఘటన చర్చలు విఫలమైనట్లుగా భావించాలని ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆ తరువాతే మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమౌతుంది. రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కనుక తన రాజకీయ సంక్షోభాన్ని జర్మనీ ఎలా పరిష్కరించుకుంటుందనేదే ఆసక్తికరం. మొత్తం ఐరోపా పధకాలే గందరగోళంలో పడతాయని బ్రస్సెల్స్(ఐరోపా యూనియను ప్రధాన కేంద్రం) భయంకరమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.ఐరోపా యూనియను సముద్రంలో వుంది, దాన్ని ఆదుకొనే పెద్ద స్నేహితుడు మధ్య ఐరోపాలో మనకు లేడు అంటూ ఐరోపా ప్రపంచం అనే పత్రిక ప్రచురణకర్త చేసిన వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుంది. అమెరికా ట్రంప్ తప్పుడు అంతర్జాతీయ విధానాల ఫలితంగా భద్రత మరియు విదేశీ వ్యవహారాలలో ఐరోపా యూనియను కలసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం వుంది, అందుకు గాను ఇంజను వంటి బలమైన జర్మనీ అవసరం అని భావిస్తున్నారు. అలాంటి జర్మనీలో ప్రభుత్వం ఏర్పడుతుందో లేదో తిరిగి ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని స్ధితి ఏర్పడింది. మరోవైపు యూనియన్ నుంచి విడిపోయేందుకు 50బిలియన్ పౌండ్లు చెల్లించేందుకు సిద్ధపడి బ్రిటన్ తనదారి తాను చూసుకుంటున్నది.ఐరోపా అంతటా పచ్చి మితవాద, నయా ఫాసిస్టు, నాజీ శక్తులు తలెత్తటం ఐరోపా యూనియన్ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. సహజంగానే ఈ పరిస్ధితి అమెరికన్లకు సంతోషం కలిగిస్తుంది.
తమ విధానాలకు ప్రత్యామ్నాయం లేదని విర్రవీగిన పెట్టుబడిదారీ కావలి బంట్లలో ఏంజెలా మెర్కెల్ ఒకరు. వరుసగా మూడు సార్లు ఛాన్సలర్‌గా ప్రభుత్వాలను నడిపిన ఆమెకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఆమె ప్రభుత్వంలో పన్నెండు సంవత్సరాలలో ఎనిమిది సంవత్సరాలు భాగస్వామిగా చేరిన సోషలిస్టులం అనిచెప్పుకొనే సోషల్ డెమోక్రటిక్ పార్టీకి వెన్నుదన్నుగా వుండే కార్మికులు ఈ ఎన్నికలలో దూరం, కావటం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అతి తక్కువ ఓట్లు తెచ్చుకోవటం శరాఘాతం వంటిది. మెర్కెల్‌తో జతకడితే రానున్న రోజుల్లో వున్న ఓట్లుకూడా పోతాయోమోననే భయం ఆ పార్టీని వెన్నాడుతున్నది. అయితే తాజా వార్తలను బట్టి వారు సంకీర్ణ సంప్రదింపులకు తలుపులను పూర్తిగా మూసివేయలేదు. అదే సమయంలో 20శాతం బలంతో వందశాతం డిమాండ్లు పెడితే అంగీకరించేది లేని మెర్కెల్ శిబిరం హెచ్చరికలు జారీ చేసింది. ఈ పూర్వరంగంలో ఎవరు ఎంత మేరకు రాజీపడినప్పటికీ కార్మికవర్గానికి జరిగే మేలు ఏమిటన్నది అసలు సమస్య.
ఆల్ ఈజ్ వెల్(అంతా మంచిగా వుంది) అనుకుంటున్న జర్మనీలో ఎన్నికలు అధికార కూటమిని అనూహ్యకుదుపునకు గురిచేశాయి.నిజానికి జర్మనీలో ఒక విధంగా చెప్పాలంటే ఒక్క వామపక్షపార్టీ తప్ప మిగిలినవన్నీ అవి తెచ్చుకొనే సీట్లను బట్టి, అక్కడి పాలకవర్గ వాంఛలను బట్టి అధికార-ప్రతిపక్ష పాత్రలను పోషిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలలో 2013లో రెండు పెద్ద పార్టీలైన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్(సిడియు), దానితో కలసి వుండే క్రిస్టియన్ సోషలిస్టు యూనియన్ అనే ఒక ప్రాంతీయ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ(ఎస్‌డిపి) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజా ఎన్నికలలో రెండు పార్టీలకు దిమ్మదిరిగే విధంగా గతంలో ఎన్నడూరానన్ని తక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయి. పార్లమెంట్‌లోని 709 స్థానాలకు గాను మెజారిటీ 355కాగా ఈ మూడు పార్టీలకు 399 వచ్చినప్పటికీ తాము ప్రతిపక్షంలో వుంటామని 143 సీట్లు తెచ్చుకున్న ఎస్‌డిపి ప్రకటించటం జర్మనీలో రాజకీయ అనిశ్చితికి దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పార్లమెంట్‌కు 18సార్లు ఎన్నికలు జరిగాయి.ఇరవై అయిదు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వీటిలో అత్యధికం సిడియు, దాని మిత్రపక్ష ప్రభుత్వాలు. ఎస్‌పిడి దాని మిత్రపక్షాలతో కలసి అధికారానికి వచ్చింది. ఈ రెండు పార్టీలు కలసి ఐదుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర వుంది.
ఏంజెలా మెర్కెల్ నాయకత్వంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీతో కలసి మరోసారి అధికారాన్ని పంచుకొనేందుకు తొలి స్పందనగా ససేమిరా అని పేర్కొన్నది. ధనిక దేశాలలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం పదవ సంవత్సరంలోకి ప్రవేశించనుంది. దాని దెబ్బకు ఐరోపాలోని మితవాద పార్టీలతో పాటు సోషలిస్టులుగా వున్నవారు కూడా ఎన్నికలలో చావు దెబ్బలు తింటున్నారు. ఒకసారి అధికారానికి వచ్చిన వారు మరోసారి మట్టికరుస్తున్నారు.జర్మనీలో మితవాద సిడియు, వామపక్షంగా చెప్పుకొనే ఎస్‌డియు రెండూ గత నాలుగు సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కారణంగా రెండుపార్టీల ఓట్లు, సీట్లు పడిపోయాయి.1998లో గరిష్టంగా 40.9శాతం ఓట్లు తెచ్చుకున్న ఎస్‌పిడి తరువాత అధికారానికి వచ్చి ఇప్పుడు 20.5శాతానికి పడిపోయింది. అందువలన మరోసారి సిడియుతో జతకట్టవద్దని ఆ పార్టీలో పైనుంచి కింది వరకు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఐరోపాలోని మిగతా ధనిక దేశాలతో పోల్చితే జర్మనీ ఆర్ధిక పరిస్ధితి కాస్త మెరుగ్గా వున్నప్పటికీ సాంఘిక సంక్షేమ పధకాలకు కోతపెట్టటంలో రెండుపార్టీలు ఏకాభిప్రాయంతో వ్యవహరించాయి. ఈ అసంతృప్తి కార్మికవర్గంలో వుంది. అందుకే వెంటనే తాము ప్రతిపక్షంలో వుంటామని చెప్పింది. అయితే అది కూడా ఒక బూర్జువాపార్టీయే గనుక కార్పొరేట్ శక్తుల వత్తిళ్లకు లంగి సంకీర్ణం గురించి చర్చించేందుకు సిద్ధం అంటున్నది.తొలిసారిగా ముస్లిం, వలసకార్మికుల వ్యతిరేక నినాదాలతో ఎన్నికలలో పోటీచేసి మూడవ పెద్ద పార్టీగా ఆవిర్భవించిన జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీని బూచిగా చూపి మరోసారి మెర్కెల్‌తో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోలేదు.
పార్లమెంట్‌లోని 709 స్ధానాలకు గాను 299 సీట్లకు ప్రత్యక్ష పద్దతిలో 410 సీట్లకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. వివిధ పార్టీలు దిగువ విధంగా సీట్లు సంపాదించాయి.(బ్రాకెట్లలోని అంకెలు గత ఎన్నికలలో సాధించిన సీట్లు) క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ(సిడియు),క్రిస్టియన్ సోషల్ యూనియన్(సిఎస్‌యు) 246(311), సోషల్ డెమోక్రటిక్ పార్టీ(ఎస్‌డిపి) 153(193), జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎడి) 94(కొత్త పార్టీ), ఫ్రీ డెమోక్రటిక్ పార్టీ 80(0), వామపక్ష పార్టీ 69(64), గ్రీన్ పార్టీ 67(63). మిగతా ఐరోపా దేశాలలో మాదిరే జర్మనీలో కూడా ఈ ఎన్నికలలో తొలిసారిగా పచ్చిమితవాద జర్మనీ ప్రత్యామ్నా పార్టీ మూడవ పెద్ద పార్టీగా అవతరించింది. వామపక్ష,గ్రీన్ పార్టీలు గతం కంటే కొద్దిగా సీట్లు పెంచుకున్నా ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవటంలో విఫలమయ్యాయి.
మెర్కెల్ నాయకత్వంలోని సిడియుతో జతకట్టేందుకు ఎస్‌డిపి తిరస్కరించటంతో ఒక సంక్లిష్ట పరిస్ధితి ఏర్పడింది. ఎస్‌పిడి,వామపక్ష,గ్రీన్ పార్టీలతో కూటమి ఏర్పడినా మెజారిటీ సాధించే అవకాశం లేదు. సిడియు పరిస్ధితి కూడా అంతే పచ్చిమితవాద జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీని, ఫ్రీడెమోక్రటిక్ పార్టీని కలుపుకుంటే తప్ప మెజారిటీ సాధించే పరిస్ధితి లేదు.ఆ మూడు కలిసే అవకాశం లేదు. అయితే జర్మనీ పాలకవర్గం సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీల మీద వత్తిడి చేస్తోంది. మరోసారి ఎన్నికలు జరిపినా పరిస్ధితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేకపోగా సిడియు పరిస్ధితి మరింత దిగజారినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్ధితుల్లో ఏకైక పెద్ద పార్టీగా సిడియు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మినహా మరొక మార్గం లేదు. అందుకు సిద్దపడటం కంటే తిరిగి ప్రజాతీర్పు కోరటం మేలనే వైఖరితో మెర్కెల్ వున్నారు. అయితే అందుకు ఆ పార్టీనాయకత్వం అంగీకరిస్తుందా, లేక ఆమెను పక్కకు నెట్టి కొత్తనేతతో సంకీర్ణ లేదా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది వచ్చే ఏడాది జనవరిలో గానీ స్పష్టం అయ్యే అవకాశం లేదు.ఎస్‌డిపితో కలసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సుమఖత తెలియచేస్తూ సిడియు తీర్మానించింది. మరోవైపు ఎస్‌డిపి యువజన విభాగం కూడా ఒక తీర్మానం చేసి మహా సంఘటన ఏర్పాటుకు ప్రయత్నించటం కంటే ప్రతిపక్షంలోని పార్టీలతో సంకీర్ణానికి ప్రయత్నించాలని తీర్మానించి పార్టీ నాయకత్వంపై వత్తిడి తెచ్చింది.
దేశ జనాభాలో గణనీయ భాగం 2000 సంవత్సరంలో సంపాదించిన ఆదాయ మొత్తంలో సగం కూడా ఇప్పుడు పొందటం లేదని విశ్లేషణలు తెలుపుతున్నాయి. ఇటువంటి స్ధితిలో వామపక్షాలు ప్రత్యామ్నాయంగా లేకపోతే జనం పచ్చిమితవాద, నయా ఫాసిస్టు శక్తులవైపు మొగ్గుతారని జర్మనీతో సహా అన్ని ఐరోపా దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి. ఇవి వామపక్ష, కమ్యూనిస్టు పార్టీలకు కూడా మేలుకొలుపు వంటివే. పెట్టుబడిదారీ వ్యవస్ధ జరుపుతున్నదాడులు, నయావుదారవాద విధానాలను నిఖరంగ ఎదిరించే మొనగాళ్లుగా వామపక్షాలు జనానికి కనిపించకపోతే మితవాదులే మెరుగని జనం భావిస్తారు. తాజా ఎన్నికలలో పూర్వపు పశ్చిమ జర్మనీ ప్రాంతంలో వామపక్ష పార్టీ కొంత మేరకు ఓట్లు పెంచుకుందిగానీ, తూర్పు జర్మనీలో ఆరుశాతం కోల్పోయింది, ఆ ఓట్లు ఎడి పార్టీకి పడ్డాయి. స్వల్పంగా ఓట్లు, సీట్లు పెంచుకున్నప్పటికీ మిగతాపార్టీలకంటే తాము భిన్నం అనే గుర్తింపును జనంలో తెచ్చుకోలేకపోయింది. కొన్ని రాష్ట్రాలలో సమతూక బడ్జెట్ పేరుతో కోతలకు, రోడ్ల ప్రయివేటీకరణకు అంగీకరించటం వంటి చర్యలు అందుకు నిదర్శనం.