Tags
Doing business India rank, Doing business rankings, mughal king jahangir, Narendra Modi, red carpet to foreign investors
సూరత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు అనుమతి కోరుతూ 1615లో మొఘల్ చక్రవర్తి జహంగీర్ వద్దకు ఇంగ్లండ్ రాజు ఒకటవ జేమ్సు ప్రతినిధిగా వచ్చిన సర్ థామస్ రో
ఎం కోటేశ్వరరావు
దారీతెన్నూ తెలియని అడవిలో తచ్చట్లాడుతున్నవారికి తెల్లవారు ఝామున వేగు చుక్క కనపడినట్లు నరేంద్రమోడీ సర్కార్‌కు ప్రపంచబ్యాంకు వెల్లడించిన తాజా సులభవాణిజ్య సూచిక దొరికింది. మునిగిపోయే వారికి గడ్డిపరక దొరికినా దానిని పట్టుకొని బయటపడాలని చూసినట్లుగా బిజెపి నాయకత్వ ఆత్రం కనిపిస్తోంది. ప్రపంచబ్యాంకు నివేదిక వార్తలతో పాటే ప్రజల సొమ్ముతో పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు జారీ చేయించి పండగ చేసుకుంది. భక్తులు పరమానంద భరితులౌతున్నారు. విమర్శించిన వారి మీద ఎదురుదాడులకు దిగుతున్నారు. ఎందుకటా! ఇప్పటి వరకు 190 దేశాలలో 130వ స్ధానంలో వున్న మనం ఒక్క ఏడాదిలో ఏకంగా100వ స్ధానంలోకి ఎగబాకినందుకట. దానికిగాను తమ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, చర్యలు ఇవీ అంటూ కేంద్ర ప్రభుత్వం పూర్తి పేజీని నింపి జనం మీదకు వదిలింది. నిజానికి అవేవీ కొత్తవి కాదు, మోడీ సర్కార్ గద్దె నెక్కిన దగ్గర నుంచీ వూదరగొడుతున్నవి, కొద్ది మంది కార్పొరేట్లకు తప్ప సామాన్య జన సంక్షేమానికి సంబంధం లేనివి, ఒక పట్టాన అర్ధం కానివి.
మోడీ సర్కారు పూర్తి పేజీ ప్రకటనలో లేనిదీ ప్రపంచబ్యాంకు నివేదిక అట్ట మీద వున్నదానిని జనం గమనించాలి. ‘డూయింగ్ బిజినెస్ 2018, రిఫార్మింగ్ టు క్రియేట్ జాబ్స్’ అన్నది నివేదికకు పెట్టిన నామం. మన ప్రధాని పూర్తి పేజీ ప్రచారంలో జాబ్స్ అదే వుపాధి ప్రస్తావనకు ఎగనామం పెట్టారు. నివేదిక పేరును తెలుగులో అనువదించుకుంటే ‘2018లో వ్యాపారం, వుపాధి సృష్టికి సంస్కరణ’ అని అర్ధం. ప్రచార ప్రకటనలో వందవ ర్యాంకు సాధన గురించి పేర్కొని సంస్కరణలు దీనిని సాధ్యం చేశాయి అంటూ పన్నుల చెల్లింపు, అల్పసంఖ్యాక పెట్టుబడిదారులకు రక్షణ, కాట్రాక్ట్ సేవకరణ, వ్యాపార ప్రారంభం, సరిహద్దులలో వ్యాపారం, రిసాల్వింగ్ ఇన్సాల్వెన్సీ(దివాలా పరిష్కారం) రుణం పొందటం, విద్యుత్ పొందుట, అనుమతులు రూపకల్పన విషయాలలో తీసుకున్న చర్యలను క్లుప్తంగా పేర్కొన్నారు. వాటి ఫలితంగా సంభవించాల్సిన వుపాధి కల్పన గురించి ఎక్కడైనా వుందా అని దుర్భిణీవేసి వెతికినా కనిపించలేదు. అందుకే పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడాలన్నట్లుగా ఇంతకాలంగా నరేంద్రమోడీ చేపట్టిన సంస్కరణలు ఇచ్చిన ఫలితాలేమిటన్నది గీటురాయి. సంస్కరణలనే పిల్లికి మన్మోహన్ సింగ్ పాలుపోసినా లేక నరేంద్రమోడీ మోడీ అంతకంటే మంచి ఆహారం అందించినా అది ఎలుకలను పట్టకపోతే ఎందుకు చేరదీసినట్లు ? వుపాధిని పెంచని, వుద్యోగాలను వూడగొట్టే, సంక్షేమ చర్యలకు మంగళం పాడే సంస్కరణలెందుకు? నరేంద్రమోడీ సంస్కరణలలో ప్రపంచబ్యాంకు సూచికను తయారు చేసే వారిని ప్రధానంగా ఆకర్షించింది కంపెనీల దివాలా పరిష్కారాన్ని సులభతరం చేయటం. అనేక మంది పెద్దలు పరిశ్రమలు, వ్యాపారాల పేరుతో వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవటం, వాటిని వేరే మళ్లించి చివరకు దివాళా, ఐపి పెట్టటం అందరికీ బాగా తెలిసింది. ఈ ప్రక్రియ ఇప్పటివరకు కాస్త కఠినంగా వుంది. అయినప్పటికీ ఎందరో మహానుభావులు లక్షల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టారు.
2014 జూన్ నాటికి అంటే నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించే నాటికి 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్థులుగా వర్గీకరించిన మొత్తం రు.2.34లక్షల కోట్లు కాగా 2016 డిసెంబరు నాటికే ఆ మొత్తం రు.6.46లక్షల కోట్లకు చేరింది. అయితే రద్దు చేసినవి, పునర్‌వ్యవస్థీకరించినవి, పారుబాకీలుగా తేల్చిన మొత్తాన్ని లెక్కకడితే అది 20లక్షల కోట్ల రూపాయల వరకు వుంటుందని రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ కెసి చక్రవర్తి చెప్పారు. కంపెనీల నుంచి గోళ్లూడగొట్టి ఎగవేసిన రుణాలను వసూలు చేయాల్సిన సర్కార్ పధకం ప్రకారం దివాలా ప్రకటించిన వారిని సులభంగా బయటపడవేయించేందుకు మోడీ సర్కార్ ప్రకటించిన దివాలా సంస్కరణలు ప్రపంచ వాణిజ్యవేత్తలను, వారికి ప్రతినిధిగా వున్న ప్రపంచబ్యాంకుకు సంతోషం కలిగించకుండా ఎలా వుంటాయి. నూతన దివాలా చట్టం నిధులను పక్కదారి పట్టించి కొల్లగొట్టేందుకు అనుమతిస్తుందని, అందువలన ఈ వుదంతంలో వాణిజ్యాన్ని సులభతరం గావిస్తుందా సొమ్ము లూటీని సులభతరం చేస్తుందా అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం చేయటాన్ని సులభతరం చేసేందుకు చేపట్టిన సంస్కరణల లక్ష్యం కొత్త వుద్యోగాల సృష్టి అన్నది ప్రపంచబ్యాంకు చెబుతున్నమాటే. మరి వాటి సంగతిని మోడీ సర్కార్ ఎక్కడా చెప్పదేం? భక్తులైనా నోరు విప్పరేం?
ప్రతి ఏటా కోటి కొత్త వుద్యోగాలను సృష్టిస్తానని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మోడీ మంత్రదండంతో నిజంగానే వుద్యోగాలస్తాయనే గట్టి నమ్మకంతో ఆంధ్రప్రదేశ నలో మా బాబస్తే మీ జాబచ్చినట్లే అని తెలుగు దేశం పార్టీ ప్రచారం చేసింది. ఇక కెసిఆర్ బంగారు తెలంగాణా గురించి చెప్పాల్సిన పని లేదు. మూడు సంవత్సరాల మోడీ సర్కార్ తీరుతెన్నులను చూస్తే పదేండ్ల కనిష్టానికి కొత్త వుపాధి సృష్టి పడిపోయిందని అధికారిక సమాచారమే వెల్లడించింది. మన్మోహన్ సింగ్ సర్కార్ 2009లో పదిలక్షల వుద్యోగాలను సృష్టిస్తే మోడీ హయాంలో 2015లో 1.55లక్షలు, 2016లో 2.31లక్షలు మాత్రమే వచ్చాయి. నాటి కోటి వాగ్దానానికి, నేటి ఆచరణకు పొంతన ఎక్కడ? మోడీ విదేశీ పర్యటనలు చేసి విమనాల్లో జీవించే ప్రధాని అని చెడ్డ పేరు తెచ్చుకోవటం తప్ప సాధించిందేమిటి? మేకిన్ ఇండియా జాడలెక్కడ? మరోవైపు కొంత తగ్గినప్పటికీ ఏడుశాతం వరకు అభివృద్ధి జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నారు, సంస్కరణలు సరేసరి, ఇన్ని చేసినా వుద్యోగాలెందుకు రావటం లేదు. అలాంటపుడు అభివృద్ధి అంటే ఏమిటి, అది ఎవరికోసం? వుపాధి లేని యువత దేశానికి వరమా? శాపమా ? ఐటి రంగంలో దిగ్గజ సంస్ధలు ఈ ఏడాది 56వేల మందిని ఇంటికి పంపేందుకు పధకాలు వేశాయని ఒకవైపు వార్తలు, మరోవైపు రానున్న మూడు సంవత్సరాలలో ఐటి రంగంలో ఇప్పుడున్న వారిలో సగం మంది అవసరం లేని మిగులుగా తేలుతారని మెకెన్సీ కంపెనీ అంచనా వేసింది.
ఎందుకీ పరిస్ధితి? నిరుద్యోగం, దారిద్య్ర భూతాల వంటివి మోడీని వ్యతిరేకించే వారినే పట్టి పీడిస్తాయి, అభిమానించేవారి జోలికి రావని ఎవరైనా అనుకుంటే జాలిపడటం తప్ప చేసేదేమీ లేదు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి ఎవరినీ వదల్లేదని ఇప్పటికే రుజువైంది కదా ! పెట్టుబడిదారులకు కావాల్సింది లాభాలు తప్ప మరొకటి కాదు. ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువైనా కార్మికులు తక్కువగా వుండే పరిశ్రమలు, వ్యాపార సంస్ధల కోసం మన దేశంలో తీవ్రవెతుకులాట ప్రారంభమైంది. పశ్చిమ దేశాలలో ఇప్పటికే వుపాధి రహిత అభివృద్ధి దశలో వున్నాయి. మనం కూడా అదేబాట పట్టాము. మరోవైపు చైనాలో వేతనాలు పెరుగుతున్నాయి కనుక మా దేశంలో చౌక శ్రమశక్తితో పని చేయించుకోవచ్చు రండహో అని మోడీ, చంద్రబాబు, కెసిఆర్ లేకపోతే వారి తనయులు ప్రపంచమంతా తిరిగి చెప్పినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. మేకిన్ ఇండియా అంటే అదొక ప్రహసనంగా తయారైంది. సింఫనీ టెక్నాలజీ గ్రూపు కంపెనీల అధిపతి రమేష్ వాధ్వానీ ఒక పత్రికలో రాసిన దాని ప్రకారం ‘ 2005-12 మధ్య భారత జిడిపి 54శాతం పెరగ్గా నిఖర వుద్యోగ పెరుగుదల మూడుశాతం మాత్రమే. కేవలం కోటీ యాభైలక్షల కొత్త వుద్యోగాలు మాత్రమే వచ్చాయి.ఈ అంతరం రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. వార్షిక వృద్ధి రేటు 7-8శాతం మధ్య వుంటుందనే అంచనా ప్రకారం 2025నాటికి దేశ జిడిపి రెట్టింపు అవుతుంది. కొత్తగా వుద్యోగాలు కావాల్సిన వారు ఎనిమిది కోట్ల మంది వుంటారు, అయితే ఇప్పుడున్న రేటులో కేవలం మూడు కోట్ల కొత్త వుద్యోగాలు మాత్రమే, అవీ ఎక్కువగా అసంఘటితరంగం, తక్కువ వేతనాలున్నవి మాత్రమే సృష్టి అవుతాయి.’ ఇప్పుడున్న పరిస్ధితి ప్రకారం 2020 నాటికి దేశ జనాభా సగటు వయస్సు 29 వుంటుంది, ప్రతి ఏటా వుద్యోగాలవేటలో చేరేవారి సంఖ్య కోటీ ఇరవై నుంచి కోటిన్నర వరకు వుండవచ్చు. వారిని సంతృప్తి పరచపోతే సామాజిక అశాంతి ఏ రూపంలో బద్దలు అవుతుందో చెప్పలేము. నిరుద్యోగం పెరగటం లేదా కొత్త వుద్యోగాల సృష్టి లేకపోవటానికి దారితీసే కారణాలలో పెట్టుబడి సమీకరణ(ఆస్థుల సమీకరణ అని కూడా అంటారు) పురోగతి నెమ్మదించటం ఒకటని నిపుణులు చెబుతారు. ఆ మేరకు 2016 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2017లో పెరుగుదల కేవలం రెండుశాతమే వుంది.జర్మన్ డచ్ బ్యాంకు నివేదిక ప్రకారం నెమ్మదిగా సాగే పెట్టుబడి సమీకరణ జిడిపి పురోగతిపై పరిమితులు విధించటం, వుపాధి కల్పనను నిరోధిస్తుంది.’
వాణిజ్య సులభతరం సూచనలో 130న నుంచి 100కు 30 పాయింట్ల పురోగతి సాధించామని బిజెపి తనకు తానే కితాబునిచ్చుకుంటున్నది. సంస్కరణలతో పాటు అవినీతి నిరోధం గురించి కూడా నరేంద్రమోడీ అంతే గట్టిగా చెప్పారు. అవినీతిని అరికట్టి వాణిజ్యాన్సి సులభతరం గావించామని ఆర్ధిక మంత్రి అరుణ్ జెట్లీ కాంగ్రెస్ నేతలకు ఒక ట్వీట్‌లో చురకలంటించారు. అయితే అవినీతి నిరోధక సూచికలో మోడీ సర్కార్ 176 దేశాలలో 2016లో తన సూచికను 76 నుంచి 79కి మూడు పాయింట్లు మాత్రమే మెరుగుపరచుకుంది. అంటే మోడీ సర్కార్‌కు కార్పొరేట్లకు వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు తీసుకొనే చర్యల పట్ల వున్న శ్రద్ద అవినీతి నిరోధకంలో లేదని ఈ సూచిక స్పష్టం చేయటం లేదూ !
పదహారవ శతాబ్ది ప్రారంభంలో నాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ మన దేశంలో సులభంగా వాణిజ్యం చేసుకొనేందుకు ఎర్రతివాచీ పరిచాడు. పద్దెనిమిదవ శతాబ్ది చివరికి ఆ కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్ వారు చివరకు మన దేశాన్ని ఆక్రమించుకొని వలస దేశంగా చేసుకున్నారు. ఇప్పుడు 130 నుంచి 100వ స్ధానానికి ఎగబాకించటం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ మరో జహంగీర్‌గా చరిత్రకు ఎక్కారు. దీని పర్యవసానాలు ఎలా వుంటాయో చెప్పనక్కరలేదు. నాడు బ్రిటీష్ వారు ప్రత్యక్ష పాలకులుగా మారితే అంతర్జాతీయ కార్పొరేట్లు పరోక్షంగా చక్రం తిప్పి ప్రతి జీవన రంగాన్ని శాసించేందుకు మోడీ ద్వారాలు బార్లా తెరిచినట్లుగా వేరే చెప్పనవసరం లేదు. అసలు ద్వారాలే లేకుండా చేసే ప్రయత్నాల్లో వున్నారు.
అవథ్ నవాబు రాజ్యాన్ని తిరిగి అప్పగించినందుకు బహుమానంగా నాటి బెంగాల్ ప్రాంతం(బెంగాల్,బీహార్,ఒడిషా)లో పన్నులు వసూలు చేసుకొనే అధికారాన్ని నాటి బ్రిటీష్ రాజ్య ప్రతినిధి రాబర్టు క్లైవ్‌కు 1765 అగస్టు పన్నెండున అప్పగిస్తున్న మొఘల్ రాజు రెండవ రెండవ షా ఆలమ్.
ఇప్పటికే వాణిజ్యాన్ని సులభతరం చేసే పేరుతో మన సంపదలను విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టటాన్ని కాంగ్రెస్ పాలకులు ప్రారంభించారు. సంస్కరణల పేరుతో 1990 దశకంలో ప్రారంభించిన చర్యలతో సులభవాణిజ్యంలో మన దేశాన్ని 130వ స్ధానానికి తెచ్చారు. కాంగ్రెస్ వారు మూడు దశాబ్దాలలో చేయలేని దానిని స్వదేశీ నరేంద్రమోడీ అత్యంత వేగంతో విదేశీయులకు విందు చేసేందుకు మూడు సంవత్సరాలలో 100కు తెచ్చారు. విశాఖలోని గంగవరం రేవును ప్రయివేటు రంగానికి కట్టబెట్టారు. ఒక పత్రికలో వచ్చిన వార్త ప్రకారం ఈ రేవులో అమెరికా సంస్ధ వార్‌బర్గ్ పింకస్ తనకున్న 31.5శాతం వాటాను దుబాయ్ కంపెనీకి విక్రయించాలని చూస్తోందని, పదేండ్ల క్రితం 150 కోట్లు పెట్టుబడి పెట్టిన అది ఇప్పుడు తన వాటాను రు.2560 కోట్ల రూపాయలకు విక్రయించాలని చూస్తోందన్నది వార్త సారాంశం. వ్యాపార సులభతరంలో భాగమే ఇది. అంటే అంత మొత్తం మన దేశం నుంచి సంపద అమెరికాకు తరలిపోయినట్లే. మన స్ధానం వంద నుంచి ఒకటికి తెచ్చేందుకు మోడీ సర్కార్ కృషి చేయవచ్చు, దాని వలన అంత మొత్తానికి వాటా కొనుగోలు చేసిన దుబాయ్ అదిగాక పోతే మరొక విదేశీ సంస్ధ మరో పదేండ్ల తరువాత అదే దామాషాలో సంపదను తరలించుకుపోతే మన జనానికి ఒరిగేదేమిటి ? మూడు సంవత్సరాల నుంచి తీసుకున్న చర్యలతో విదేశీ కంపెనీల పని సులభం అయిందిగానీ మన బతుకులు దుర్భరం అయ్యాయని మోడీ ప్రభుత్వ విధానాలు స్పష్టం చేయటం లేదా? అందువలన సంఘపరివార్ అదే, బిజెపి మాతృసంస్ధ భాషలో చెప్పాలంటే ‘విదేశీ ‘ ముస్లిం మొఘల్ చక్రవర్తి జహంగీర్ మన దేశం బ్రిటీషు వారి పాలనలోకి పోవటానికి ఆద్యుడైతే నేడు ‘స్వదేశీ ‘ హిందూ నరేంద్రమోడీ విదేశీ కార్పొరేట్ల చేతుల్లోకి దేశాన్ని అప్పనంగా అప్పగించేందుకు పూనుకున్న వారిలో నెంబర్ ఒన్ రాంక్ పొందినట్లే !