Tags
Aurora, Bolshevik Revolution, Bolshevik Revolution warship, Lenin, Russia’s 1917 Bolshevik Revolution, winter palace
వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం- వర్తమానం -1
ఎం కోటేశ్వరరావు
నవంబరు ఏడు, ప్రపంచవ్యాపితంగా ఎందరో విప్లవదీక్షకు పునరంకితమయ్యే రోజు. విప్లవాలకు దారితీస్తాయని భావించిన, భయపడిన వుద్యమాలను ఏడు నిలువుల లోతున పాతివేయాలన్న దోపిడీదార్ల కసిని మరింతగా పెంచే రోజు. అంతకు ముందు కూడా పెట్టుబడిదారీ వర్గం అణచివేతకు పాల్పడినప్పటికీ అక్టోబరు విప్లవం తరువాత మరింత అప్రమత్తమై గత వంద సంవత్సరాలుగా దాడిని మరింతగా పెంచుతోంది. కమ్యూనిస్టు తత్వశాస్త్రానికి ఒక స్పష్టమైన శాస్త్రీయ భాష్యం చెప్పిన మార్క్స్-ఎంగెల్స్ ద్వయంలో కారల్ మార్క్స్ ద్విశత జయంతి,(మార్క్స్‌పేరు నుంచి విడదీయజాలని ఆయన స్నేహితుడు, వుద్యమ సహచరుడు ఎంగెల్స్‌కు వయస్సులో తేడా రెండున్నర సంవత్సరాలే) మార్క్స్ రచన కాపిటల్ మొదటి సంపుటి వెలువడి 150, సంవత్సరాలు, దానిని ఆచరణలోకి తెచ్చి తొలి సోషలిస్టు రాజ్య స్ధాపనకు నాంది పలికిన రష్యన్ బోల్షివిక్ విప్లవానికి వంద సంవత్సరాలు నిండాయి. దాన్ని కూల్చివేయటంలో సామ్రాజ్యవాదుల కుట్ర,హస్తం వున్నప్పటికీ, అంతర్గత కారణాలు కూడా వున్నందున వందేండ్ల వార్షికోత్సవం అనటం సముచితంగా అనిపించటం లేదు. అందుకే సింహావలోకనం చేసుకోవాల్సిన సందర్భమిది. బోల్షివిక్ విప్లవం వునికిలోకి తెచ్చిన ప్రధమ సోషలిస్టు సోవియట్ యూనియన్ ప్రగతిశీల వాదులు, కమ్యూనిస్టులు సహజంగానే తమ సిద్ధాంతం, ఆచరణ, అనుభవాల గురించి మదింపు వేసుకొని పునరంకిత మయ్యేందుకు ఈ సందర్భాలను వినియోగించుకుంటున్నారు. మరోవైపు తమ దోపిడీని అంతమొందించే కమ్యూనిస్టు తత్వశాస్త్రాన్ని అణగదొక్కేందుకు దోపిడీదార్లు తమ ఆయుధాలకు మరింతగా పదునుపెట్టుకుంటున్న తరుణమిది. తమ లక్ష్యాలను సాధించుకొనేందుకు ఏం చెయ్యాలి? ఎక్కడ మొదలు పెట్టాలి అనే తర్జన భర్జన రెండు వర్గాలలోనూ జరుగుతోంది.
అది బానిస సమాజమైనా, ఫ్యూడల్, పెట్టుబడిదారీ సమాజంలో కూడా దోపిడీ నిరాఘాటంగా కొనసాగటానికి ఆ వర్గాలు ఎన్నో ఆయుధాలను కనుగొన్నాయి, నవీకరించుకున్నాయి. ఇదే సమయంలో ప్రతి చోటా సర్వేజనా సుఖినోభవంతు అని సర్వజన సంక్షేమాన్ని కోరుకున్నవారెందరో వుద్భవించారు. వారంతా సంస్కర్తలుగానే మిగిలిపోయారు. ఆ క్రమంలోనే మరెందరో దోపిడీ వ్యతిరేక పోరులో తమ ప్రాణాలనే అర్పించారు.తమ కాలపు దోపిడీ నగ్న స్వరూపాన్ని గమనించి, సమ సమాజమార్పును తమ ముందుతరాల వారి తత్వం,భావజాలం, త్యాగనిరతిని ఆపోసన పట్టిన వారిలో ఒక రైన మార్క్స్ వర్గాల వేల సంవత్సరాలుగా దోపిడీకి గురవుతున్న వర్గానికి దీనిలో జయాపజయాలు ఎవరివి?
అది 1917 అక్టోబరు 25 రాత్రి, సెంట్‌పీటర్స్‌బర్గ్‌లోని రష్యా అధికార కేంద్రమైన వింటర్ పాలెస్. ఎప్పుడేం జరుగుతుందో, ఒకవైపు కెరెన్క్సీ ప్రభుత్వ నాయకత్వంలోని జార్ సేనలు, మరోవైపు బోల్షివిక్ తిరుగుబాటుదారులు వుత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సాయంత్రమే అందాల్సిన సంకేతం రాక బోల్షివిక్‌లలో క్షణ క్షణానికి పెరుగుతున్న ఆతృత…. సరిగ్గా 9.45 బాల్టిక్ సముద్రతీరంలోని సెంట్ పీటర్స్‌బర్గ్ రేవులో మరమ్మతుల కోసం లంగరు వేసిన అరోరా యుద్ధ నౌక నుంచి ఫిరంగి పేలుడు. ఏ రష్యన్ సామ్రాజ్యవాదుల తరఫున జపాన్ సామ్రాజ్యవాదులపై దాడి జరిపిందో అదే యుద్ద నౌకలోని నావికులు తిరుగుబాటు చేసి శ్రామికుల పక్షాన అదే ఫిరంగి పేల్చారు.(పెట్టుబడిదారులు తమకు లాభాలను చేకూర్చే కార్మికులతో పాటు తమ దోపిడీని అంతం చేసే శ్రామికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేయటం అంటే ఇదే. విప్లవ పరిస్ధితులే వస్తే శ్రామికవర్గం ఆయుధాల కోసం తడుముకోనవసరం లేదు) అంతే బోల్షివిక్ యోధులు దాడి ప్రారంభించారు. తెల్లవారు ఝామున అంటే 26వ తేదీ వుదయం రెండు గంటలకు వింటర్ పాలెస్ పూర్తిగా కమ్యూనిస్టుల వశమైంది. ఎర్రజెండా రెపరెపలాడింది. తిరుగబాటు సైరన్ మోగిన అక్టోబరు 25 తరువాత కాలంలో సవరించిన రష్యన్ కాలండర్ ప్రకారం నవంబరు ఏడవ తేదీ అయింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకే అక్టోబరు విప్లవం, నవంబరు విప్లవం అన్నా రెండూ ఒకటే.(పదకొండు సంవత్సరాల క్రితం ఈ వ్యాస రచయితకు వింటర్ పాలెస్ పరసరాలు, అరోరా నౌక, నెవా నది తదితర ప్రాంతాలను సందర్శించే అవకాశం వచ్చిందని తెలపటానికి సంతోషంగా వుంది)
పెద్ద కుదుపుతో చరిత్ర గతిని మరో మలుపు తిప్పిన సందర్భమది. అందుకే ప్రఖ్యాత అమెరికన్ జర్నలిస్టు జాన్ రీడ్ ఆ సమయంలో ప్రత్యక్షంగా చూసిన పరిణామాలను వర్ణిస్తూ ‘ప్రపంచాన్ని కుదిపివేసిన పది రోజులు’ అనే పేరుతో గ్రంధస్థం చేశారు. దోపిడీని శాశ్వతం చేసుకొనేందుకు దోపిడీదార్లకు ఆ వర్గం నేర్పిన పాఠాలు అపారం. దోపిడీకి మతం, కులం, ప్రాంతం, భాష, రంగు, ఆడమగా తేడా లేదు. అమెరికా అయినా అనకాపల్లి అయినా ఒకటే. కానీ దోపిడీదార్లను, దోపిడీని అంతం చేసే శ్రామికవర్గ ఐక్యతను దెబ్బతీసేందుకు పైన చెప్పుకున్న సకల అవకాశాలనూ వాడుకోవటాన్ని మనం గమనించవచ్చు. కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడక ముందే మన దేశంలో ప్రవేశించిన ఆంగ్లేయ పెట్టుబడిదారులు, పాలకులు, వారిని అనుసరించిన స్వదేశీ పెట్టుబడిదారులు పైన చెప్పుకున్న అంశాలన్నింటినీ వినియోగించుకున్నారు. ఇప్పటికీ వాటిని ప్రయోగిస్తున్నారు. అందువల్లనే శ్రామికుల మధ్య ఐక్యమత్యం సాధించటానికి, తామంతా ఒక్కటే అనే చైతన్యం కలిగించటానికి ఎంత సమయం పడుతుందో, ఆ తరుణం కోసం ఎంతకాలం వేచి చూడాలో ఎవరు జోస్యం చెప్పగలరు. అందులోనూ అనేక కులాలు,భాషలు, సంప్రదాయాలు, సామాజిక అసమానతలు, వివక్షతో కూడిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధ వేల సంవత్సరాలుగా వేళ్లూనుకొని నర నరాన జీర్ణించుకుపోయిన మన దేశంలో శ్రామికవర్గ ఐక్యతను సాధించటానికి ఇంకా ఎక్కువ శ్రమపడటం తప్ప దగ్గరదారులు లేవు.
మొత్తం సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతానికి తీవ్ర ఎదురు దెబ్బలు తగిలి, పురోగమనానికి అనేక ఆటంకాలు ఏర్పడిన సమయమిది. అందువలన పురోగామి వాదులు తలా ఒక చేయి వేసి ఈ మహోద్యామాన్ని ముందుకు తీసుకుపోయేందుకు పూనుకోవాల్సిన అవసరం వుంది. కమ్యూనిజం అంతమైంది, తిరిగి లేవకుండా దాన్ని పూడ్చిపెట్టాం, చరిత్ర ముగిసింది అని చెప్పినవారికి గతంలో లేని కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వంద సంవత్సరాలకు ముందు ముందు వరకు పెట్టుబడిదారీ, భూస్వామిక వ్యవస్ధ కంటే వూహాజనితమైన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యవస్ధలు ఎలా మెరుగ్గా వుంటాయో చెప్పి జనాన్ని ఒప్పించేందుకు కమ్యూనిస్టులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఈ వందసంవత్సరాలలో సోవియట్, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలు విఫలమైనప్పటికీ అచిర కాలంలోనే అవిసాధించిన విజయాలను అంతసులభంగా తుడిచిపెట్టలేరని తేలిపోయింది. కొంత కాలం సోషలిస్టు వ్యవస్ధలో జీవనం గడిపి, తిరిగి పెట్టుబడిదారీ వ్యవస్ధలోకి పోయిన చోట్ల కొంత మంది అయినా సోషలిస్టు వ్యవస్ధ గురించి బెంగ పెట్టుకున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అదే పెట్టుబడిదారీ విధానం గురించి దోపిడీ శక్తులు తప్ప సామాన్యులు బెంగపెట్టుకున్నట్లు మనకు ఎక్కడా కనపడదు. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్ధలో పునరావృతం అవుతున్న సంక్షోభాలు పూర్వం వచ్చిన వాటికంటే తీవ్రంగా వుండటంతో పాటు, అనేక తీవ్ర సమస్యలను ముందుకు తెస్తున్నాయి. కొత్త సమాజం గురించి ఆశలేకపోయినా వున్న సమాజం ఎంత త్వరగా పోతే అంత మంచిదని ప్రతి పెట్టుబడిదారీ దేశంలోని శ్రామికులు భావిస్తున్నారు. వంద సంవత్సరాలకు ముందు ఒక్క పెట్టుబడిదారీ సమాజం తప్ప దానితో పోల్చుకొనేందుకు మరొక వ్యవస్ధ లేదు. పెట్టుబడిదారీ వ్యవస్ధలతో పోల్చినపుడు సోషలిస్టు వ్యవస్ధలు తక్కువకాలంలోనే అభివృద్ది చెందుతాయి అనటానికి విఫలమైనప్పటికీ గతంలో సోవియట్ యూనియన్, వర్తమానంలో చైనా మన కళ్ల ముందున్నాయి. అందువలన ఇప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్ధలతో పాటు, ఎక్కడేం జరిగినా క్షణాల్లో ప్రపంచమంతా తెలుసుకోగలిగిన ఆధునిక సమాచార వ్యవస్ధ అందుబాటులోకి వచ్చింది.
రొడీషియా పేరుతో గుర్తింపు లేని బ్రిటీష్ వారి స్వయం పాలిత వలస రాజ్యంగా వున్న ఆఫ్రికా ఖండంలోని నేటి జింబాబ్వేలో తొలిసారిగా ఈ ఏడాది కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. అనేక కమ్యూనిస్టుపార్టీల మాదిరే అది దక్షిణాఫ్రికాలోని జింబాబ్వే ప్రవాస కార్మికులతో అది ఏర్పడింది.గతంలో రొడీషియా వలస పాలకులకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు కూడా భాగస్వాములుగా వున్నారు.1940వ దశకంలో ఏర్పడిన కమ్యూనిస్టుపార్టీని నాటి పాలకులు నిషేధించారు. దాంతో కమ్యూనిస్టులు జాతీయోద్యమానికి ప్రాతినిధ్యం వహించిన రెండు పార్టీలలో భాగస్వాములుగా పని చేశారు.1980లో స్వతంత్ర జింబాబ్వే ఏర్పడిన తరువాత ప్రజాస్వామిక మార్పు కొరకు వుద్యమం( మువ్‌మెంట్ ఫర్ డెమోక్రటిక్ ఛేంజ్(ఎండిసి) పేరుతో సాగిన సంస్ధలో పని చేశారు.
అనేక అనుభవాల తరువాత ఎండిసి, ప్రవాసంలో దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీలోసభ్యులుగా వున్న జింబాబ్వియన్లు తాజాగా కమ్యూనిస్టుపార్టీని ఏర్పాటు చేశారు.అదింకా బాల్యావస్ధలోనే వుంది. వచ్చే ఏడాది అక్కడ జరిగే ఎన్నికలలో తాము పాల్గనటం లేదని, ఇతర ప్రతిపక్షపార్టీల మాదిరి అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను గద్దెదింపే లక్ష్యం తమ ముందు లేదని, గత కొద్ది సంవత్సరాలుగా గిడసబారిపోయిన దేశ ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించి ప్రజలకోసం వుపయోగపడే విధంగా చేసే అంశాలను చర్చకు పెడతామని కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నకబుతో మహెబినా ప్రకటించారు. ప్రపంచంలో తాజాగా ఏర్పడిన కమ్యూనిస్టుపార్టీ ఇదని చెప్పవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన తరువాత కూడా కార్మికులను విముక్తి చేయగలిగేది కమ్యూనిజం ఒక్కటే అనే విశ్వాసం ప్రపంచంలో ప్రతి మూలా నిత్యం వ్యక్తమౌతుందటం.
ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిజాన్ని అంతం చేస్తామంటూ కత్తి పట్టుకు తిరుగుతున్న అమెరికాలోనే నూతన సహస్రాబ్ది యువతలో 42శాతం మంది సోషలిస్టు వ్యవస్తే సురక్షితంగా వుంటుందని నమ్ముతుండగా, ఏడుశాతం మంది ఎలాంటి శషభిషలు లేకుండా తాము సోషలిస్టు వ్యవస్ధలోనే జీవించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేసినట్లు తాజాగా జరిగిన సర్వేలో వెల్లడైందని ఒక సంస్ధ వెల్లడించింది. అమెరికా యువతలో ఇలాంటి ధోరణులు వెల్లడి కావటం పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించేదైతే, అభ్యుదయ వాదులకు అంతకంటే ఆనందం కలిగించేదేముంటుంది? వివరాల కొరకు వచ్చే భాగం వరకు వేచి చూడండి.
(గమనిక:సోషలిస్టు దేశాలలో సంభవిస్తున్న మార్పులు, అనుభవాలు, గుణపాఠాల గురించి తద్దినం మాదిరి ఆరోజుకు స్మరించుకొని మరుసటి రోజు నుంచి మరచి పోవటం కాకుండా నిరంతర మధనం కొనసాగించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా తరువాయి భాగాలలో మరికొన్ని అంశాలను రేఖా మాత్రంగా అయినా ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తాను.)