Tags

, , , , , , , ,

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం- వర్తమానం -2

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కొన్ని సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన తీవ్ర ఎదురుదెబ్బలు ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇదే సమయంలో విద్య, సమాచార వ్యవస్ధ కొత్త పుంతలు తొక్కి అరచేతిలోకి అందుబాటులోకి రావటం వంటి పరిణామాలతో కమ్యూనిస్టు సిద్ధాంతంపై దాడి కగతం కంటే తీవ్రంగా జరుగుతోంది. కొత్త ఎత్తుగడలు అనుసరించటాన్ని అన్ని రంగాలలో చూడవచ్చు. గతంలో మాదిరి కమ్యూనిజాన్ని నేరుగా వ్యతిరేకిస్తే లాభం వుండదని గత వంద సంవత్సరాల అనుభవాలు దోపిడీ వర్గానికి నేర్పాయి. అంటే దొంగ దెబ్బలకు పూనుకున్నాయి, దీంతో కమ్యూనిస్టుల పనిని మరింత సంక్లిష్టం గావించాయని చెప్పాలి. శత్రువును చంపదలచుకుంటే ప్రత్యక్ష పోరాటంలో ఎంతో కష్టపడాలి, అదే తీపి మాటలతో వెన్నుపోటు పొడిచి అంతం చేయటం ఎంతో సులభం. ఈ కుటిల నీతిని కమ్యూనిస్టు వ్యతిరేకులు బాగా ప్రయోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో నవతరం సోషలిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితులు కావటం గతం మాదిరి సులభం కాదు. అయితే దోపిడీ వ్యవస్ధ ఎప్పటికపుడు తనకు తెలియకుండానే యువతరాన్ని ఆవైపు నెడుతోంది. పీడితులు కూడా తమ ఆయుధాలను సన్నద్దం చేసుకోవటం అనివార్యం.

అమెరికాలోని కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ అనే సంస్ధ తన వార్షిక నివేదికలో భాగంగా యు గవ్‌ అంటే మీ ప్రభుత్వం అనే ఒక పరిశోధనా సంస్ధతో కలసి అక్టోబరు చివరి వారంలో ఒక సర్వే నివేదికను విడుదల చేసింది. ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సంస్ధ ప్రమేయంతో ఇలాంటి నివేదికల తయారీకి రూపొందించే ప్రశ్నావళి స్వభావం,లక్ష్యం ఎలా వుంటుందో తెలిసిందే. వెన్నుపోటు ఎత్తుగడలో ఇదొక భాగం. ఈ సర్వే సెప్టెంబరు 28 అక్టోబరు 5 మధ్య జరిగింది. అమెరికా ప్రధాన మీడియా అంతటా ఆ సమయంలో అమెరికా దృష్టిలో ధూర్త దేశంగా వున్న సోషలిస్టు-కమ్యూనిస్టు వుత్తర కొరియా జపాన్‌ మీదుగా, అమెరికా తీరంలోని దీవులలో కూడా పడే ఖండాంతర క్షిపణి ప్రయోగాలను జరిపిందని, అమెరికన్లకు ముప్పు తెచ్చిందంటూ ముమ్మరంగా ప్రచార దాడి జరిపిన సమయమది. సర్వేపై దాని ప్రభావం పడకుండా ఎలా వుంటుంది. అందువలన దానికి వుండే పరిమితులను గమనంలో వుంచుకోవాలి. ఈ నివేదికలో కొన్ని అసంబద్దతలు, తర్కానికి నిలబడని అంశాలున్నాయి.

ప్రపంచానికి కమ్యూనిజం ఇప్పటికీ ఒక సమస్యగానే వుందని నమ్ముతున్న అమెరికన్లు 75శాతం వున్నారని, గతేడాది కంటే ఐదుశాతం ఎక్కువంటూ సర్వే తొలి అంశంగా ఆ నివేదిక ప్రారంభమైంది. ప్రతి పదిమందిలో ఏడుగురు అమెరికన్లకు కమ్యూనిజం అంటే ఏమిటో తెలియకపోవటం లేదా తప్పుగా గుర్తించారట. ఇదే సమయంలో నూతన సహస్రాబ్ది యువతరంగా పరిగణించబడేవారిలో సోషలిజం పట్ల సానుకూలత పెరుగుతోంది. జనాభా మొత్తంగా చూసినపుడు 63శాతం పెట్టుబడిదారీ, నాలుగు శాతం ఫాసిస్టు దేశంలో జీవించాలన్న అభిలాషను వ్యక్తం చేయగా సోషలిస్టు-కమ్యూనిస్టు దేశంలో నివశించాలన్న కోర్కె 37 శాతం మందిలో వ్యక్తమైంది. ఇదే సహస్రాబ్ది యువతలో 49, 51శాతం వున్నారు. ప్రస్తుతం అమెరికా జనాభాలో సహస్రాబ్దితరంగా పరిగణించబడేవారు ఎక్కువగా వున్నారు. నివేదిక మొత్తంలో కమ్యూనిస్టు వ్యతిరేకతనే ప్రధానంగా చూపినప్పటికీ ఈ ఒక్క అంశంపై కమ్యూనిస్టు వ్యతిరేకులు కలవర పడుతున్నారు. గతంలో విదేశాలలో పెరుగుతున్న సోషలిస్టు అభిమానులను చూసి భయపడిన అమెరికన్‌ కమ్యూనిస్టు వ్యతిరేకులు ఇప్పుడు తమ యువతను చూసి తామే భయపడుతున్నారన్నమాట. ఎంతలో ఎంత మార్పు? సహస్రాబ్ది యువతలో ఇటువంటి భావాలు ఏర్పడటానికి కారణం 53శాతం మంది అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అభిప్రాయం పడటం కావచ్చని సర్వే రచయితలు వ్యాఖ్యానించారు.

‘ ప్రస్తుతం అమెరికాలో సహస్రాబ్ది తరం అతి పెద్ద సమూహంగా వుంది. ఆందోళన కలిగించే కొన్ని ధోరణులు తీవ్ర ఆందోళన కలిగించటాన్ని చూస్తున్నాం. సహస్రాబ్ది యువత పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు మళ్లటం పెరుగుతోంది, చివరికి కమ్యూనిజం కూడా ఆచరణీయ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు’ అని కమ్యూనిజం బాధితుల స్మార ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.ఇదే సమయంలో 1946-64 మధ్య పుట్టిన వారు ఎక్కువగా పెట్టుబడిదారీ విధానానికి,26శాతం మందే సోషలిజానికి మద్దతు ఇస్తున్నారు. అమెరికాలో స్టాలిన్‌ను ప్రతి ఐదుగురిలో ఒకరు హీరోగా భావిస్తుండగా, లెనిన్‌, వుత్తరకొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌లను అభిమానించే వారు ప్రతి నలుగురిలో ఒకరు వున్నారని తేలింది. సోషలిజం, కమ్యూనిజాలకు తేడాతో పాటు అసలు వాటి గురించి తెలియని కారణం, కమ్యూనిస్టు పాలిత దేశాలలో చంపివేయబడిన జనం గురించి తక్కువ అంచనా వేయటం వల్లనే యువత ఈ బాటలో వున్నారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు ‘ఎర్ర శతాబ్దం’ పేరుతో రాసిన సానుకూల వ్యాసాలు కూడా కమ్యూనిజం వెనుక వున్న నిజాన్ని పట్టించుకోకుండా చేశాయని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు.’ సోషలిజం, కమ్యూనిజాల విషయంలో అమెరికన్‌ సమాజంలో చారిత్రక పాండిత్యం ఎంత తక్కువగా వుందో అలజడి వైపు తిప్పుతున్న ఈ పరిణామం వెలుగులోకి తెస్తోంది.వంద సంవత్సరాల క్రితం జరిగిన బోల్షివిక్‌ విప్లవం తరువాత కమ్యూనిజం కారణంగా జరిగిన మారణహోమం, వినాశనం, దుఖం గురించి విద్యార్ధులకు బోధించటంలో వ్యవస్ధ వైఫల్యం గురించి కూడా ఇది వెల్లడించింది.’ అని కూడా మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.

కమ్యూనిస్టుల పాలనలో రోమన్‌ కాధలిక్‌ మతగురువులతో సహా చంపిన వారి సంఖ్య పది లక్షలలోపే అని సర్వేలో పాల్గన్నవారిలో పదిశాతం, 1-250లక్షలని 21, 250-500లక్షలని 15, 500-750లక్షలని 12, 750-1000లక్షలని 11, పది కోట్లకు పైగా అని31శాతం చొప్పున నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఈ అంకెలకు ఎలాంటి ఆధారాలు లేవు. గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా వీటిని తిప్పుతున్నారు. ఈ అతిశయోక్తులను మొత్తంగా 69శాతం మంది తక్కువ చేసి చూశారు. సహస్రాబ్ధి యువతలో గతేడాది మాదిరే తప్ప మార్పు లేదు. గత కొద్ది కాలంగా ముఖ్యంగా 2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం తరువాత అమెరికన్‌ యువతలో సోషలిజం, కమ్యూనిజం గురించి సానుకూల వైఖరి వ్యక్తమౌతోంది. అందువలన వారిని గందరగోళంలో పడేయటానికి ఇలాంటి సర్వేలతో ఒకవైపు వారిలో తలెత్తిన మార్పును చెబుతూనే మరోవైపు వెనక్కు లాగేందుకు చేస్తున్న ప్రయత్నాలు మనం చూడవచ్చు. అయితే ఇవి ఎంతవరకు ఫలిస్తాయి? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం, బకెట్లతో సముద్రనీటిని తోడటం ఎలా సాధ్యం కాదో భావజాల వ్యాప్తిని, అసంతృప్తిని అణచివేయటం, పక్కదారి పట్టించటం కూడా అలాంటిదే.

సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం నిజానికి ఒక ప్రయోగం. దాని ఫలితాలు ప్రపంచానికి తెలియవు. అందువలన నిర్మాణంలో ఏవైనా లోపాలుంటే వాటిని స్నేహపూర్వకంగా లేదా సైద్ధాంతికంగా చెప్పటం వేరు. గతంలో సోవియట్‌ యూనియన్‌ను సోషల్‌ సామ్రాజ్యవాదంగా వర్ణించిన నక్సల్స్‌ తాము కూడా కమ్యూనిస్టులమే అని చెప్పుకున్నారు. అలాగే ఇప్పుడు చైనా అనుసరిస్తున్న విధానాలపై కూడా కొంతమంది అదే రకమైన దాడి చేస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు సామ్రాజ్యవాదులుగా మారినవి వున్నాయి. అదే విధంగా పెట్టుబడిదారీ పంధాలో పయనిస్తూ అభివృద్ధిలో బాగా వెనుకబడిన దేశాలూ వున్నాయి. అటువంటి దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలు వస్తే ఎంతకాలం అనేది ఎవరూ చెప్పలేకపోవచ్చుగాని కొంత కాలం అదే మాదిరి తేడాలు లేకుండా ఎలా వుంటాయి? చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ అనేది బూటకం, పేరుకే కమ్యూనిస్టు పార్టీ, అక్కడ ఆర్ధిక అంతరాలు చాలా ఎక్కువగా వున్నాయి, ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా దాడి జరుగుతోంది. ఇక్కడ సోషలిజం పట్ల కారుస్తున్న మొసలి కన్నీరును కడవలతో కొలవజాలం. నిజమైన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణ జరగటం లేదని తీవ్ర విచార ప్రదర్శన. ఇదంతా కమ్యూనిస్టు వ్యతిరేకులు, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు కూడా కొందరు చేస్తున్నారు. ఇదంతా సమాజంలోని ఒక భాగం లేదా వ్యక్తులను మానసికంగా తిమ్మినిబమ్మిని చేసి ఇబ్బందులకు గురిచేసే చిత్త భ్రమణ తంత్ర విద్యలో భాగమే.

Image result for US youth, socialism

బ్రెజిల్‌కు చెందిన లూయీస్‌ కార్లోస్‌ బ్రెస్సెర్‌ పెరీరా అనే సామాజిక, ఆర్ధికవేత్త పెట్టుబడిదారీ విధానంలో ఐదు నమూనాలు వున్నాయని విశ్లేషించారు. ఆయనతో ఏకీభవించాలనేమీ లేదు. ధనిక దేశాలలో వుదారవాద ప్రజాస్వామిక లేదా ఆంగ్లో-శాగ్జన్‌ నమూనా, సామాజిక లేదా ఐరోపా, అంతర్జన్య లేదా జపాన్‌, వర్ధమాన దేశాలలో వుదారవాద ఆధారిత నమూనాలు ఆసియాలో ఒక విధంగా, బ్రెజిల్‌తో సహా ఇతర దేశాల నమూనాలు భిన్నంగా వుంటాయని ఆయన చెప్పారు. ఇదే సూత్రం సోషలిస్టు దేశాలకు మాత్రం ఎందుకు వర్తించదు? అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గ నాయకత్వాన విప్లవాలు జయప్రదమౌతాయని మార్క్స్‌-ఎంగెల్స్‌ అంచనా వేశారు. ఆ తరువాత బోల్షివిప్లవానికి ముందు సైద్ధాంతిక చర్చ తప్ప సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం గురించి తప్ప నమూనా, విప్లవ మార్గం గురించి పెద్ద సమస్యలు ముందుకు రాలేదు. బోల్షివిక్‌ విప్లవం తరువాతే ఆచరణలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ తెల్లవారే సరికి పరిష్కారిస్తామని, పరిష్కారమౌతాయని గానీ ఏ కమ్యూనిస్టూ చెప్పజాలరు. వాటిని కూడా దోపిడీ శక్తులు తమ కమ్యూనిస్టు వ్యతిరేక భావజాల అమ్ముల పొదిలో చేర్చుకున్నాయి. పద్దతులను కూడా మార్చుకున్నాయి. గతంలో మాదిరి సోవియట్‌ను వ్యతిరేకించినట్లుగా నేడు చైనాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగేందుకు ముందుకు రావటం లేదు. ఎందుకంటే గతంలో సోవియట్‌ తయారీ వస్తువులతో పాశ్చాత్య దేశాల మార్కెట్లను నింపలేదు, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మేడిన్‌ చైనా దర్శనమిస్తోంది.అయితే అదే సమయంలో సోవియట్‌ను తొక్కివేసేందుకు, కూల్చివేసేందుకు చేసిన కుట్రలకు ఏమాత్రం తీసిపోకుండా చైనాకు వ్యతిరేకంగా చేయాల్సినవి చేస్తున్నాయని మర్చిపోరాదు. అధికారికంగా సంబంధాలు, అనధికారికంగా చైనా, కమ్యూనిస్టుపార్టీ, కమ్యూనిజం మీద విషపూరిత దాడి జరుగుతోంది.

గత వంద సంవత్సరాలలో ఫాసిస్టు శక్తులను అణచివేయటంలో కమ్యూనిస్టులు ఎంతటి త్యాగాలకు పాల్పడతారో, ఎలా సన్నద్దమౌతారో లోకానికి తెలియ చెప్పటంలో సోవియట్‌ యూనియన్‌ జయప్రదమైంది. సోషలిజాన్ని కాపాడుకుంటూ అచిర కాలంలోనే ఒక నూతన అభివృద్ది నమూనాను ప్రపంచం ముందుంచటంలో చైనా జయప్రదమైంది. చైనాలో సమస్యలేమీ లేవా అంటే కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమల వంటివి కూడా జరబడతాయని వాటిని అదుపు చేయాల్సి వుంటుందని కూడా తమకు తెలుసునని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ చెప్పారు. సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని ఇప్పుడు అధికారికంగా వారే చెబుతున్నపుడు లేవని ఎవరంటారు? అన్ని పెట్టుబడిదారీ దేశాలూ ఒకే విధంగా అభివృద్ధి ఎందుకు చెందలేదు, అన్ని ఖండాలలో ఒకేసారి పారిశ్రామిక విప్లవం ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలకు సమాధానంలోనే సోషలిజానికి కూడా జవాబు దొరుకుతుంది.

చైనాలో వున్నది పెట్టుబడిదారీ విధానం అనే వాదనలతో విబేధిస్తున్నవారు ముందుకు తెస్తున్న అంశాలేమిటో చూద్దాం.పెట్టుబడిదారీ పాలనా విధానంలో అప్రయత్న పూర్వకమైన సంబంధాలతో వస్తూత్పత్తి లాభాల కోసం జరుగుతుంది.లాభాల రేటు పెట్టుబడుల వర్తులాను నిర్దేశించటంతో పాటు ఆర్ధిక సంక్షోభ ఆవర్తనాలను కూడా వుత్పత్తి చేస్తుంది. ఇది చైనాకు ఇంతవరకు వర్తించలేదు. ప్రణాళిక, ప్రభుత్వరంగంలో వుత్పత్తిపై యాజమాన్య పద్దతే ఇప్పటికీ ఆధిపత్యం వహిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ అధికార పునాదివేళ్లు ప్రజాయాజమాన్యంలోనే వున్నాయి.పెట్టుబడిదారీ తరహా వుత్పత్తి పద్దతి లేకుండానే చైనా ఆర్ధికంగా ఎదుగుదలను సాధించింది. కీలకమైన 102 ప్రభుత్వ రంగ సంస్దల విలువ ఏడున్నరలక్షల కోట్ల డాలర్లు. వీటిని ప్రయివేటీకరిస్తారని ఎవరైనా ఆశపడుతుంటే అలాంటిదేమీ వుండదని పరోక్షంగా హెచ్చరిస్తూ ప్రధానమైన ప్రజాయాజమాన్య స్ధితి, ప్రభుత్వ రంగ ఆర్ధిక వ్యవస్ధ నాయకత్వ పాత్రపై ఎలాంటి డోలాయమానం వుండదని అధ్యక్షుడు గీ జింగ్‌ పింగ్‌ గతేడాది స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల వారు గత మూడున్నర దశాబ్దాలుగా చైనా ఆ బాటను వీడి స్వేచ్చా మార్కెట్‌,ప్రయివేటు రంగం నాయకత్వ పాత్ర వహించాలని కోరుతూనే వున్నారు.లాభాపేక్షలేని ప్రణాళికా బద్దమైన ప్రభుత్వరంగ పాత్ర నాయకత్వంలో తలెత్తే సమస్యలను పెద్దవిగా చూపుతూ వాటిని అవకాశంగా మార్చుకోవాలని కంటున్న కలలు ఇంతవరకు కల్లలుగానే మిగిలిపోయాయి. సామాజిక-ఆర్ధిక అంశాల రూపకల్పన, జయప్రదంగా అమలు చేయటంపై నిజానికి చైనా కమ్యూనిస్టుపార్టీ ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నది.

2008లో పెట్టుబడిదారీ ధనిక దేశాలలో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత కూడా చైనా అభివృద్ధి రేటు ఏడుశాతం కొనసాగుతున్నది. తమ తరువాత సంక్షోభంలోకి కూరుకుపోవటం చైనా వంతు అని చెప్పిన వారి జోస్యం వాస్తవం కాదని తేలిపోయింది. కొన్ని వడిదుడుకులు తప్ప గత పదిసంవత్సరాలుగా సజావుగా పురోగమిస్తోంది. ఇది కమ్యూనిస్టుపార్టీ, సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకత. ఇప్పుడు పెట్టుబడిదారీ ధనిక దేశాలలోని యువతను ఆకర్షించే అంశం ఇది. ఏ స్టోర్‌లో చూసినా చైనా వస్తువులే, పశ్చిమ దేశాల వుద్యోగాలను హరించి చైనా తన వారికి పని కలిపిస్తున్నదన్న వార్తలు ఏదో ఒక రూపంలో వారిని చేరుతూనే వున్నాయి. ఈ నేపధ్యంలో పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అనేదే గీటు రాయి అనుకుంటే ఇప్పటి వరకు పెట్టుబడిదారీ విధానం ఒరగబెట్టిందేమీ లేదు, రాబోయే రోజుల్లో ఏదో చేస్తుందనే ఆశ కనిపించటం లేదు, అందువలన సోషలిజమే మెరుగు, దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అన్న ఆలోచన తలెత్తుతోంది. సోషలిస్టు భావన వునికిలోకి వచ్చిన తరువాత సాధించిన పెద్ద విజయాలలో ఇదొకటి అంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ సిద్ధాంత వేత్తలు సోషలిస్టు వ్యవస్ధల వైఫల్యాలను బూతద్దంలో పెట్టి చూపటం,అవాస్తవాలను ప్రచారం చేసి సోషలిజం గురించి చిత్త భ్రమణ తంత్ర విద్యను( మైండ్‌ గేమ్‌ ఆడటం) ప్రయోగించి తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు తప్ప పెట్టుబడిదారీ విధానం ఎలా మెరుగైనదో దానికి పోతుగడ్డ అంటున్న అమెరికా యువతకు చెప్పలేకపోతున్నారు. అదే పెద్ద బలహీనత. దీన్ని దెబ్బకొట్టి యువతను సోషలిజం వైపు మళ్లించటమే కమ్యూనిస్టుల ముందున్న పెద్ద సవాలు !