Tags

, , , , , , ,

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-3

ఎం కోటేశ్వరరావు

అక్టోబరు విప్లవానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన జాతీయ, ప్రాంతీయ మీడియాతో పోల్చితే పశ్చిమదేశాల మీడియాలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. తరువాత కూడా అది ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. ధనిక దేశాలలో పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు పరిష్కారం అవుతుందో పెట్టుబడిదారీ పండితులకు అంతుబట్టటం లేదు. దాదాపు ప్రతి దేశంలోనూ ఒకసారి ఎన్నికైన పార్టీ వెంటనే రెండోసారి అధికారంలో కొనసాగే పరిస్థితి లేదు. పాలకపార్టీల పేర్లు, కొన్ని అంశాలపై భిన్న వైఖరులు కలిగి వుండటం తప్ప అనుసరిస్తున్న విధానాలన్నీ ఒకే విధంగా వుంటున్నాయి. పళ్లూడగొట్టించుకొనేందుకు ఏ రాయి అయితేనేం అన్నట్లుగా జనం మీద భారాలు మోపటానికి, సంక్షేమ పధకాలకు కోత పెట్టటంలో ఏ పార్టీ అయినా ఒకే విధంగా వ్యవహరించటమే దీనికి కారణం.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, దానికి వెన్నుదన్నుగా నిలిచిన కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో పెల్లుబికిన కమ్యూనిస్టు వుద్యమంపై మొదటి, రెండవ సాదారణ ఎన్నికల సందర్భంగా నాటి మీడియా ఎంత తప్పుడు ప్రచారం చేసిందో పాత తరాలకు, చరిత్ర కారులకు తెలిసిందే.అయితే పశ్చిమ దేశాలలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి ఇప్పటివరకు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా సాగుతూనే వుంది. దాని కొనసాగింపుగానే వందేండ్ల బోల్షివిక్‌ విప్లవం గురించి ఇప్పుడు కూడా చెడరాసిపారేస్తున్నారు. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల మానస పుత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక నవంబరు ఆరున వంద సంవత్సరాల కమ్యూనిజంలో వందమిలియన్ల మంది హత్య అంటూ ఒక శీర్షికతో ఒక వార్త, అంతకు మూడు రోజుల ముందు కమ్యూనిజపు రక్త శతాబ్దం పేరుతో మరొక వార్తను ప్రచురించింది. ఇంకా అనేక పత్రికలు గతంలో కూడా ఆ సమాచారాన్నే అటూ ఇటూ మార్చి గత కొద్ది సంవత్సరాలుగా పాఠకుల మీద రుద్దుతున్నాయి. వాటిని జనం పూర్తిగా నమ్మటం లేదని అక్టోబరులో అమెరికాకు చెందిన కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ విడుదల చేసిన ఒక సర్వేలో పేర్కొన్న విషయం తెలిసిందే.(అమెరికాలో అక్కడి ప్రభుత్వం కమ్యూనిస్టులను వేటాడి వేధించింది తప్ప కమ్యూనిస్టుల బాధితులు లేకపోయినా ఆ పేరుతో ఒక సంస్ధ ఏర్పాటు చేయటమే విడ్డూరం) ఈ ప్రచారం ఎంత హాస్యాస్పదం అంటే రష్యా, చైనాలలో సంభవించిన కరువుల వంటి ప్రకృతి వైపరీత్యాలలో మరణించిన వారిని కూడా కమ్యూనిస్టులే చంపివేశారని చెబుతారు. అంతకంటే అత్యంత దుర్మార్గమైన ప్రచారం ఏమంటే ఫాసిస్టులు-నాజీలు, వారి పీచమణిచి ప్రపంచాన్ని రక్షించిన కమ్యూనిస్టులను ఒకేగాట కట్టి జనాన్ని చంపటంలో కమ్యూనిస్టులకు, ఫాసిస్టులకు తేడా లేదు. ఇద్దరూ మారణహోమానికి పాల్పడ్డారంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియా మొత్తంగా సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, వారికి వూడిగం చేసే వారి చేతుల్లో వుంది కనుక గోబెల్స్‌ మాదిరి పదే పదే ప్రచారం చేసి అనేక మంది బుర్రలను కలుషితం చేస్తున్నారు.

నరహంతకులు ధరాధిపతులైనారన్నట్లు లాభాల కోసం పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ప్రపంచంలో మానవాళిపై జరిపినన్ని దుర్మార్గాలు మరొకరు జరపలేదు. మానవత్వాన్నే పరిహసించారు. వారు హరించిన మానవ హక్కులకు అంతేలేదు. పెట్టుబడిదారీ విధానం, దానిని పరిరక్షించేందుకు కంకణం కట్టుకున్న పాలకులు జరిపిన దాడులు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో జనాన్ని గాలికి వదలి వేయటం వంటి బాధ్యతా రాహిత్యం వంటి సకల అనర్ధాలు వలన పెట్టుబడిదారీ విధానం నూట అరవై కోట్ల మందికిపైగా జనాల మరణాలకు కారణమైందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.https://prolecenter.wordpress.com/2017/08/21/1-6-billion-killed-by-capitalism/ కమ్యూనిస్టుల పాలనలో కరువులలో మరణించినా అందుకు వారే బాధ్యులంటున్న వారు ఆ ప్రాతిపదికను మిగతావారికి ఎందుకు వర్తింప చేయరు?

బ్రిటీష్‌ వారి ఆక్రమణ సమయంలో మన దేశంలో సంభవించిన బెంగాల్‌ కరవులో కోటి మంది, అంతకు ముందు సంభవించిన వాటిలో మూడు కోట్ల మంది మరణించారు. మన దేశాన్ని బ్రిటీష్‌ వారు ఆక్రమించే క్రమంలో జరిగిన యుద్ధాలు, దాడులు, ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరో రెండు కోట్లు. ఇక ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు ఐరోపా ధనిక దేశాలు ఐరోపా ఖండంలో, ఇతర ఖండాలలో జరిపిన యుద్ధాలు, వాటిలో చిందిన రక్తం, పోయిన ప్రాణాలకు బాధ్యత ఎవరిది? రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వియత్నాం, కంపూచియా, లావోస్‌లతో కూడిన ఇండో చైనా ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు జపాన్‌,ఫ్రాన్స్‌, అమెరికా జరిపిన దాడుల్లో మరణించిన లేదా గాయపడిన వారు దాదాపు కోటి మంది వున్నారు. మారణాయుధాల గుట్టలను వెలికితీసే పేరుతో ఇరాక్‌పై అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు జరిపిన దాడులు, ఆంక్షల కారణంగా మరణించిన లక్షల మంది గురించి తెలిసిందే. ఇక రెండు ప్రపంచ యుద్ధాలకు కారకులు ప్రజాస్వామిక దేశాలుగా చెప్పుకొనే అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఫాసిస్టు, నాజీలు, నియంతలుగా పేరు పడిన జర్మనీ, జపాన్‌,ఇటలీ వారితో చేతులు కలిపిన వారు తప్ప కమ్యూనిస్టులు కాదే. ఆ యుద్ధాలలో జరిగిన ప్రాణ నష్టాలను ఎవరి ఖాతాలో వేయాలి? వియత్నాం యుద్ధంలో అమెరికన్లు ప్రయోగించిన రసాయనిక ఆయుధాల వలన యుద్ధం ముగిసిన నాలుగు దశాబ్దాల తరువాత కూడా అనేక ప్రాంతాలలో పంటలు పండకపోవటం, జనం రోగాల బారిన పడటం చూస్తున్నదే. జపాన్‌పై అమెరికా ప్రయోగించిన అణ్వాయుధ ప్రభావం డెబ్బయి సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అనుభవిస్తున్నారు. మ్యూనిజాన్ని అరికట్టేపేరుతో ఇండోనేషియాలో నియంత సుహార్తోను ప్రోత్సహించి దాదాపు పది లక్షల మంది మ్యూనిస్టులు,అభిమానులను హత్య చేయించటంలో అమెరికన్లకు పాత్ర వుందని ఇటీవలే బయటపడిన విషయం తెలిసిందే. పెట్టుబడిదారీ విధానంలో భాగంగా సంభవించిన ఆర్ధిక సంక్షోభాలలో చితికిపోయిన కుటుంబాలు, మరణాలకు బాధ్యత ఎవరిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరాలు, దారుణాలకు పాల్పడిన దేశాలు, వారిని నడిపించిన పెట్టుబడిదారీ విధానం, ప్రజాస్వామ్యం మాటేమిటి?