Tags

, , , ,

ఎం. కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు ఆసియాను అవమానించారా? అవును, పన్నెండు మంది దేశాధినేతలు హాజరైన తూర్పు ఆసియా సభ ప్రారంభం కావటం రెండు గంటల పాటు ఆలస్యమైందంటూ చిందులు వేస్తూ సభను బహిష్కరించి విమానమెక్కి స్వదేశానికి చెక్కేయటం, వాషింగ్టన్‌ వెళ్లిన తరువాత తాను ఒక ప్రకటన చేస్తానని చెప్పటం అవమానం గాక మరేమిటి? ఆసియా పర్యటన చేస్తూ తూర్పు ఆసియా సభలో పాల్గనకపోతే ఆసియా పట్ల అమెరికన్లకు ఆసక్తి లేదనే విమర్శలు వస్తాయనే కారణంతో ఈకార్యక్రమాన్ని కూడా చివరిలో పర్యటనలో చేర్చారు.చివరికి ఆలస్యం సాకు చూపి సభను బహిష్కరించారు.నిర్ణీత సమయానికి 30 నిమిషాల ముందుగానే ట్రంప్‌ విమానం ఫిలిప్పైన్స్‌నుంచి బయలుదేరింది.

విమానంలో విలేకర్లతో మాట్లాడుతూ మధ్యాహ్నభోజన సమయంలో చివరిగా తాను చెప్పదలచుకున్న అభిప్రాయాలను చెప్పేశానని, తన బదులు విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ పాల్గంటారని తెలిపారు.మనం పడ్డ కష్టానికి మంచి ఫలితాలే రానున్నాయని, 300బిలియన్‌ డాలర్ల మేరకు పరికరాలు, ఇతరాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని, త్వరలో లక్షకోట్ల డాలర్లకు పెరుగుతాయని చెప్పారు. తూర్పు ఆసియా సమ్మేళనంలో పాల్గనకపోవటం ట్రంప్‌ రాజకీయ గూండాయిజంగా మారుతుందని ప్రొఫెసర్‌ కార్ల్‌ థయర్‌ వ్యాఖ్యానించారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా అధికారం తగ్గిపోవటానికి,ఆసియన్‌ నేతలు ఆ స్ధానాన్ని భర్తీ చేయటానికి ఈ పర్యటన కీలకమైనదిగా చరిత్రకారులు ఈతేదీని నమోదు చేస్తారని మరో ప్రొఫెసర్‌ అనెలైస్‌ రైల్స్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ అధికారంలోకి రాగానే చేపట్టిన తొలి చర్యలలో భాగంగా పసిఫిక్‌ ఇరుసులో వున్న దేశాలతో వాణిజ్య ఒప్పందాన్ని వదలివేశారని, అమెరికా ప్రమేయం లేకుండా శనివారం నాడు ఆసియన్‌ నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె చెప్పారు. పెద్ద ఒప్పందాలు మన చేతులను కట్టివేస్తాయని, ఏ దేశానికి ఆదేశంతో ఒప్పందాలు చేసుకోవటంపై తాను కేంద్రీకరిస్తానని అదేరోజు ట్రంప్‌ ప్రకటించారు. ఫసిపిక్‌ భాగస్వామ్య దేశాల ఒప్పందాన్ని వమ్ము చేసే ట్రంప్‌ యంత్రాంగ యత్నాలను ఆసియన్‌ నాయకులు పట్టించుకోలేదని, తాము స్వంతంగా ముందుకు పోవాలని నిర్ణయించారని, ట్రంప్‌కు ఘనస్వాగతం చెప్పినప్పటికీ ఆయన అజెండాను మొత్తంగా పట్టించుకోలేదని రైల్స్‌ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడేమిటి? ఇలా మాట్లాడుతున్నాడేమిటి అని అనేక మంది ముక్కుమీద వేలేసుకున్నారు. గత అధ్యక్షులందరినీ అధిగమించి డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నెండు రోజుల గత రికార్డును బద్దలు కొట్టి 13రోజులతో కొత్త ఆసియా పర్యటన రికార్డును స్ధాపించాడు. నవంబరు ఐదున జపాన్‌తో మొదలై 14వ తేదీన ఫిలిప్పీన్స్‌లో ముగిసింది. మధ్యలో చైనా, దక్షిణ కొరియా, వియత్నాం పర్యటించారు. ఊరకరారు మహాత్ములు అన్నట్లు అమెరికా అధ్యక్షులు మన ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాదిరి ఏదో ఒక సాకుతో విదేశీ పర్యటనలు చేయరు. రాజకీయ, ఆర్ధిక, మిలిటరీ వంటి అనేక అంశాలుంటాయి. అయితే ఈ పర్యటనలో సాధించినదాని కంటే పొగొట్టుకున్న పరువే ఎక్కువగా వుందని చెప్పవచ్చు.

ఆతిధ్యం ఇచ్చేవారు పెట్టింది తిని, మర్యాదలను స్వీకరించటం సంస్కారం. కొంత మంది మా పిల్లలు అది తినరు తినరు అనిముందే చెప్పి ఇబ్బంది పెడతారు. అలవాటైన ఆహారం తప్ప కొత్తదానిని రుచిచూసేందుకు ఇచ్చగించని తరహా మనిషి ట్రంప్‌. ఇరవై ఏడు సంవత్సరాల క్రితం జపాన్‌ వచ్చిన ట్రంప్‌ అక్కడ వడ్డించిన చేపను చూసి అది వద్దంటూ బర్గర్‌ కావాలని మరీ మారాం చేసి తెప్పించుకుతిన్నాడంటూ ఈ సందర్భంగా వార్తలు వచ్చాయంటేనేే ట్రంప్‌కు పెద్ద అవమానం. ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఆయా దేశాల వారు వడ్డించిందా లేక మరేం తింటారు అంటూ ఐరోపా, జపాన్‌ మీడియాలో కథనాలు రాశాయి. మా వృద్ధ ట్రంప్‌ బర్గర్‌ తప్ప మరొకటి తినడు అని అధికారులుప్పందించారేమో జపాన్‌ ప్రధాని షింజో అబే పర్యటన ప్రారంభంలోనే వారి సాంప్రదాయ వంటకాల బదులు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న బీఫ్‌తో తయారు చేసిన బర్గర్‌నే మధ్యాహ్న విందుగా వడ్డించే ఏర్పాటు చేయాల్సి వచ్చిందట.

ట్రంప్‌ అభిరుచులు, అలవాట్లు వ్యక్తిగతం. గొడ్డు, పంది మాంసంతో తయారు చేసే హాంబర్గర్‌లు ఎన్ని తిన్నా ప్రపంచానికేమీ ఇబ్బంది లేదు. ఆ పెద్దమనిషి పర్యటనలో ఆతిధ్యం ఇచ్చిన జపాన్‌ వారు పెట్టింది తినకపోవటం, దక్షిణ కొరియాలో పెట్టింది తినటం రెండూ వివాదాస్పదం కావటం విశేషం. జపాన్‌-దక్షిణ కొరియాల మధ్య వివాదాస్పదంగా వున్న దీవుల జలాల నుంచి తెప్పించిన రొయ్యలతో సహా దక్షిణ కొరియా వంటకాలు వడ్డించటం, వాటిని లట్టలు వేసుకుంటూ ట్రంప్‌ తినటం అంటే ఆ దీవులపై దక్షిణ కొరియా హక్కును అమెరికా గుర్తించినట్లే, ఇది జపాన్‌ వ్యతిరేకమైనది అని జపాన్‌ మీడియా వ్యాఖ్యానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కొరియాను ఆక్రమించిన జపాన్‌ తన సైనికుల కోసం దక్షిణ కొరియా యువతులను చెరపట్టి అప్పగించారు. అలాంటి వారిలో ఒకరైన 88 సంవత్సరాల లీ యాంగ్‌ సూ ట్రంప్‌ విందు ఆహ్వానితుల జాబితాలో ఒకరుగా ప్రకటించటం తమను నేరగాళ్లుగా పరిగణించటమే అని జపనీస్‌ ప్రభుత్వం భావించింది. దౌత్య పద్దతులలో అమెరికాకు ఆ మేరకు నిరసన తెలిపినట్లు, వుత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా పని చేస్తున్న తరుణంలో ఇలాంటి పనులు తగవని పేర్కొన్నట్లు వెల్లడైంది. మీరు మా ఇంటికొచ్చినా, మేం మీ ఇంటికొచ్చినా మాకు కావాల్సిందే తేవాలి, పెట్టాలి అనే అమెరికా సామ్రాజ్యవాదంతోనే అసలు సమస్య. అందువలన ట్రంప్‌కు ఏం పెట్టారు, ఏ తిన్నారు అనేది కూడా రాజకీయాలు, ఆర్ధికాంశాలతో ముడి పడి వుంటాన్నాయన్నది గమనించాల్సి వుంది.

డెమోక్రటిక్‌ పార్టీ అధినేత బరాక్‌ ఒబామా హయాంలో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం ట్రంప్‌, తరువాత ఎందరు అధ్యక్షులు వచ్చిం తరువాత పరిష్కారం అవుతుందో వారికే తెలియని స్ధితి.రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యం మాదిరి ప్రపంచ మార్కెట్‌ను చాపచుట్టినట్లుగా తమ చంకన పెట్టుకోవాలని చూస్తున్న అమెరికన్‌ సామ్రాజ్యవాదుల పరిస్ధితి పీకసన్నం-బానకడుపులా వుంది. భవిష్యత్‌ పరిణామాలు ఎలా వుంటాయో జోస్యం చెప్పలేము గాని, గతం మాదిరి ఏకఛత్రాధిపత్యం వహించటం సాధ్యం కాని పరిస్థితి నేడు నెలకొంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర మాత్రం కాదన్నట్లు సామ్రాజ్యవాదులు మొత్తంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులు, దేశాలకు వ్యతిరేకత విషయంలో ఐక్యంగా వుంటున్నారు, ప్రపంచ మార్కెట్‌ను పంచుకోవటంలో విబేధాలను దాచుకోవటం లేదు.

ఐదు ఆసియా దేశాల పర్యటనలో తొలి పాదం మోపిన జపాన్‌లో ప్రధాని షింజో అబేతో గోల్ఫ్‌ ఆడటానికి వెళ్లబోయే ముందు యోకోటా వైమానికస్ధావరంలో అమెరికన్‌ సైనికులతో మాట్లాడారు. పరోక్షంగా వుత్తర కొరియాను వుద్దేశించి మాట్లాడుతూ అమెరికా సంకల్పాన్ని ఎవ్వరూ, ఏ నియంత, ఏ ప్రభుత్వమైనా తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరికలు జారీ చేశాడు. గతంలో తమను తక్కువ అంచనా వేసిన ఎవరికీ అది సంతోషకరంగా లేదు, మేము లంగలేదు, ఎలాంటి సడలింపులు లేవు అన్నాడు. తరువాత దక్షిణ కొరియా పార్లమెంట్‌ సభ్యుల నుద్ధేశించి మాట్లాడుతూ ట్రంప్‌ ఇదే మాదిరి హెచ్చరికలు జారీ చేయటమే కాదు, అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి తయారీ కార్యక్రమాన్ని నిలిపివేయకపోతే మిలిటరీ చర్య తీసుకుంటామని సోషలిస్టు కొరియాపై బెదిరింపులకు దిగాడు.

రాజధాని టోకియోలో వుభయ దేశాల వాణిజ్యవేత్తల సమావేశంలో మాట్లాడుతూ జపాన్‌ అక్రమ వ్యాపార పద్దతులను అనుసరిస్తోందని ట్రంప్‌ విమర్శలు గుప్పించాడు.’ గత కొన్ని దశాబ్దాలుగా జపాన్‌ విజయం సాధిస్తోందని మీరు తెలుసుకోవాలి, ప్రస్తుతం జపాన్‌తో మా వ్యాపారం న్యాయబద్దంగా లేదు, మాకు మార్కెట్‌ను తెరవలేదు. మీరు ఇక్కడి నుంచి కార్లను షిప్పుల్లో రవాణా చేయటం కాదు, అమెరికాలో తయారు చేసేందుకు ప్రయత్నించండి, అలా అడగటం మొరటుగా వుందా’ అని ప్రశ్నించాడు. చైనా తరువాత అమెరికన్ల వాణిజ్యలోటు కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతుల కారణంగా జపాన్‌తోనే ఎక్కువగా వుంది. రాజకీయంగా అమెరికాతో వున్న బంధం కారణంగా జపాన్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. నిజానికి రెండు దేశాల మధ్య ఈ వాణిజ్య విబేధాలు కొత్తవి కాదు. అమెరికాలో అమ్ముడౌతున్న జపాన్‌ బ్రాండ్‌ కార్లలలో 75శాతం అమెరికాలోనే తయారు చేస్తున్నామని కార్ల తయారీ వాణిజ్య సంస్ధల అసోసియేషన్‌ తెలిపింది. పసిఫిక్‌ సముద్ర ప్రాంత దేశాల స్వేచ్చా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్‌ నిర్ణయించారు, కొనసాగాలని జపాన్‌ కోరుతోంది. రెండు దేశాల మధ్య పన్నుల విషయంలో విబేధాలు ఎడతెగటం లేదు. అమెరికన్‌ కార్ల అమ్మకాలపై జపాన్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని, ఘనీభవింపచేసిన గొడ్డు మాంసం, వ్యవసాయ వుత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

గతేడాది అమెరికా ఎన్నికల ప్రచారంలో చైనా శత్రువు అని చెప్పిన ట్రంప్‌ చైనా పర్యటనలో పొగడ్తలు కురిపించాడు. గ్రేట్‌ హాల్‌లో మాట్లాడుతూ రెండు పెద్ద దేశాల మధ్య పెద్ద వాణిజ్యంలో తమకు న్యాయం జరగలేదని అయితే దానికిి చైనా తప్పేమీ లేదని, తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పర్యటన సందర్భంగా 25వేల కోట్ల డాలర్ల మేరకు ఆర్ధికలావాదేవీలపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ట్రంప్‌ పర్యటన లేకపోయినా రెండు దేశాల మధ్య అది జరిగి వుండేదని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

చైనాతో వాణిజ్యం గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఆసియా పర్యటనలో ఇంతవరకు చేసిన పెద్ద తప్పిదం, సిగ్గు చేటు, అమెరికా, ఆ ప్రాంత కార్మికులకు ఇది భయంకర వర్తమానం, డెమోక్రాట్లకు ఇది మాంస విందు అవుతుంది అని అమెరికాలోని చైనా అధ్యయనాల సంస్ధ నిపుణుడు ఎలీ రాట్నర్‌ వ్యాఖ్యానించాడు. చైనాతో వాణిజ్యలోటుకు తమ గతపాలకులదే బాధ్యత అని చైనాలో చెప్పిన ట్రంప్‌ తరువాత అపెక్‌ సమావేశంలో నాలుకను మరోవైపు తిప్పాడు.చైనా పేరు ప్రస్తావించకుండా ఈ ప్రాంత దేశాలు అనుచిత వ్యాపార పద్దతులు అనుసరిస్తున్నాయని, ఇక ముందు తమతో అలా కుదరదు అన్నాడు. దుర్విధి అనే నరకంలో పడకుండా తప్పించేందుకు అమెరికన్లు మతి తప్పిన ముసలి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని తమపై చేసిన వ్యాఖ్యలపై వుత్తర కొరియా వ్యాఖ్యానించింది. ఈ పర్యటనలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు నిజంగానే దాన్ని నిర్ధారిస్తున్నాయి. వుత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ కొవ్వుబలిసిన పొట్టోడంటూ అవమానకరవ్యాఖ్యలు చేసిన నోటితోనే కొద్ది గంటల తరువాత భవిష్యత్‌లో ఇరువురం స్నేహితులుగా వుండవచ్చు అన్నాడు. వియత్నాంలో మానవహక్కులకు భంగం కలిగిస్తున్నారని దుమ్మెత్తి పోసిన ట్రంప్‌ తాజా పర్యటనలో ప్రపంచంలోని గొప్ప అద్భుతాలలో వియత్నాం ఒకటి అని పేర్కొన్నాడు. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకోలేదని అధ్యక్షుడు పుతిన్‌ చెప్పిన మాటలను నేను నమ్ముతున్నాను అని గతంలో చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు మాట మార్చాడు. రిపబ్లికన్‌ పార్టీకి(ట్రంప్‌కు) అనుకూలంగా రష్యన్లు జోక్యం చేసుకున్నారని సిఐఏ నివేదించిన విషయం తెలిసిందే. అమెరికా గూఢచార, దర్యాప్తు సంస్ధల నివేదికలను నేను విశ్వసిస్తానా లేదా అన్నది సమస్యకాదు, వాటికినేను కట్టుబడి వున్నాను, ప్రత్యేకించి ప్రస్తుతం పని చేస్తున్న సంస్ధలు మంచివారిని కలిగి వున్నాయి అని చెప్పాడు. ట్రంప్‌ పర్యటన అన్నింటిలో అమెరికాకు ప్రధమ స్ధానం అన్నలక్ష్యంతో సాగిందా లేక ఆ స్ధానంలో చైనాను ప్రవేశ పెట్టేందుకు వచ్చారా అన్నది అర్ధం కావటం లేదన్న వ్యాఖ్య కూడా వెలువడింది.ఆసియా పర్యటనలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అనేక మంది పరిశీలకులు తలలు పట్టుకుంటున్నారు.అనేక మందికి ఆశించిన కిక్కు రాలేదు. తన తీరుతెన్నులను తప్పుపడితే ట్రంప్‌కు కోపం, పొగిడితే జనాల్లో పలుచన. కార్పొరేట్‌ మీడియాకు ఇరకాటమే మరి !