Tags

, , , , ,

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-5

ఎం కోటేశ్వరరావు

మతాలన్నీ ఏదో ఒక తత్వశాస్త్ర ప్రాతిపదికన ఏర్పడినవే. చరిత్రలో ప్రతి మతం అంతకు ముందున్నది సామాన్య జనం నుంచి దూరమైనపుడు దాని మీద తిరుగుబాటుగా వుద్భవించిందే. అందువల్లనే ప్రతిదీ ప్రారంభంలో ప్రజల పక్షమే,పురోగామి వైఖరినే కలిగి వుంటుంది. కాల క్రమంలో దోపిడీ వర్గం ప్రతిమతాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటం కనిపిస్తుంది. అందువల్లనే ప్రతి మతం ఆయా సమాజాలలో వున్న దోపిడీ వర్గానికే మద్దతుపలికిందన్నది చరిత్ర సారం. ఆ దోపిడీ సమాజాన్ని అంతం చేసేందుకు శాస్త్రీయ అవగాహనతో ముందుకు వచ్చిందే మార్క్సిస్టు తత్వశాస్త్రం. మతాలకు దీనికి వున్న ప్రధాన తేడా ఏమంటే ప్రతికొత్త మతం అంతకు ముందున్న ఏదో ఒక మతంపై తిరుగుబాటుగా వస్తే మార్క్సిస్టు తత్వశాస్త్రం అన్ని మతాలను ఒకేగాటన కట్టి ప్రతిదాన్నీ వ్యతిరేకించింది. మతం జనం పాలిట మత్తు మందు అని సాధారణ సూత్రీకరణ చేసింది. సహజంగానే దోపిడీ శక్తులకు కొమ్ముగాసే మతం, మతాలకు వెన్నుదన్నుగా నిలిచే దోపిడీశక్తులు పరస్పరం ఆధారపడటం, సహకరించుకోవటం జగమెరిగిన సత్యం. ఆందువల్లనే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మార్క్స్‌,170 సంవత్సరాల నాడు వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక, 150 సంవత్సరాల నాడు జనానికి అందుబాటులోకి వచ్చిన కాపిటల్‌ గ్రంధం మొదటి భాగాలపై దోపిడీవర్గం, అన్ని రకాల మతశక్తులు దాడులు చేస్తూనే వున్నాయి.

కమ్యూనిస్టు ప్రణాళిక 1848 ఫిబ్రవరి చివరిలో 23పేజీల పుస్తకంగా జర్మన్‌ భాషలో లండన్‌లోని బిషప్స్‌ గేట్‌లో వెలువడింది. దానిని రహస్యంగా వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ప్రచురించింది. బ్రిటన్‌లోని జర్మన్‌ల కోసం ప్రచురితమయ్యే డచ్‌ లండనర్‌ జీటుంగ్‌ పత్రిక సీరియల్‌గా ప్రచురణలో తొలి భాగాన్ని మార్చినెల మూడవ తేదీన అచ్చువేసింది. మరుసటి రోజే బెల్జియంలో వున్న మార్క్స్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మార్చి 20నాటికి దానిని మూడుసార్లు అచ్చువేశారు. వాటిలో వెయ్యి కాపీలు ఏప్రిల్‌ మొదటి వారానికి పారిస్‌ చేరాయి, అక్కడి నుంచి జర్మనీ చేర్చారు. ఏప్రిల్‌- మే మాసాలలో ఆ పుస్తకంలోని అచ్చుతప్పులను సరిదిద్దారు. తరువాత అది 30పేజీలకు పెరిగింది. సంచలనం కలిగించించిన ఈ పరిణామంతో చర్చ్‌ వులిక్కి పడింది. మరుసటి ఏడాది 1849 డిసెంబరు ఎనిమిదిన నాటి పోప్‌ తొమ్మిదవ పయస్‌ ఇటాలియన్‌ ద్వీపకల్పంలోని తన పాలిత దేశాలైన ఇటలీ, వాటికన్‌ సిటీ, ఇటలీ ఆధీనంలోని శాన్‌మారినోలో వున్న ఆర్చిబిషప్‌లు, బిషప్‌లకు పంపిన సర్క్యులర్‌లో సోషలిజం, కమ్యూనిజాల గురించి తొలి హెచ్చరిక చేశారు. సోషలిజం, కమ్యూనిజాలనే నూతన సిద్ధాంతాల పేరుతో మత విశ్వాసులను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.కాథలిక్‌ చర్చ్‌ ఐహిక అధికారాన్ని కూలదోసేందుకు విప్లవకారులు, హేతువాదులు పన్నుతున్న కుట్రలు,కూహకాలను గమనించాలని కోరారు. మత వ్యవహారాలలో నిరాసక్తతగా వుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటాలియన్లు తమ న్యాయబద్దమైన రాజకీయ అధికారులకు బద్దులై వుండాలని నిజమైన స్వేచ్చ, సమానత్వాన్ని క్రైస్తవం మాత్రమే రక్షించగలదని, అందువలన విప్లవాలు పనికిమాలినవని పోప్‌ పయస్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఆస్ట్రియా సామ్రాజ్యం నుంచి ఇటలీ స్వాతంత్య్రం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి. తరువాత వెయ్యి సంవత్సరాల పోప్‌ ఆధిపత్యాన్ని అంతం చేస్తూ 1861 రెండవ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ ఇటలీ రాజుగా ప్రకటించుకున్నాడు. అందువలన పోప్‌ అధికారాన్ని తొలిసారిగా సవాలు చేసింది రాజరికం తప్ప కమ్యూనిస్టులు కాదని గుర్తించటం అవసరం.

1917లో బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైన తరువాత రష్యన్‌ ఆర్ధడాక్స్‌ చర్చి అధికారులు పైకి కొన్ని సందర్భాలలో తటస్ధంగా వుంటున్నట్లు ప్రకటించినా 1922 వరకు విప్లవ వ్యతిరేకులు జరిపిన తిరుగుబాటులో అభ్యుదయగాములుగా వున్న కొద్ది మంది చర్చ్‌ అధికారులు మినహా అత్యధికులు బోల్షివిక్‌ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన ఇటలీ ఎన్నికలలో కమ్యూనిస్టులు 31శాతం ఓట్లు సాధించారు. అనేక దేశాలలో విప్లవ, జాతీయోద్యమాలు వూపందుకొని విజయాలు సాధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చైనాలో కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది. ఈ పూర్వరంగంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే కుట్రలో భాగంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదులు కాథలిక్‌ చర్చిని కూడా భాగస్వామిగా చేసుకున్నారు. దానిలో భాగంగా పోప్‌ పన్నెండవ పయస్‌ 1949లో ఒక ప్రకటన చేస్తూ కమ్యూనిజాన్ని బోధించిన వారిని మత వ్యతిరేక తిరుగుబాటుదారులుగా పరిగణించి మతం నుంచి వెలివేయాలని ఆదేశించి కమ్యూనిజంపై ప్రత్యక్ష దాడికి నాంది పలికారు.

ప్రచ్చన్న యుద్ధం పేరుతో అమెరికా సాగించిన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలలో ఎక్కడ ఏమతం పెద్దదిగా వుందో అక్కడదానిని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వినియోగించారు. ఇండోనేషియాలో ముస్లింలు మెజారిటీ వున్నారు కనుక అక్కడ ఇస్లామిక్‌ మతోన్మాదులను రంగంలోకి దించి మిలిటరీతో జతకట్టించి పదిలక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోయించిన విషయం తెలిసిందే. తూర్పు ఐరోపాలో రోనాల్డ్‌ రీగన్‌ పాలనా కాలంలో సోషలిస్టు దేశాలలో తిరుగుబాట్లు, కూల్చివేతలకు తెరతీసిన కుట్రలో సిఐఏ, పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి తెలిసిందే. సాలిడారిటీ పేరుతో జరిపిన సమీకరణల వెనుక సిఐఏ నిధులు, వాటికన్‌ బ్యాంకు నిధులు, చర్చి అధికారుల మద్దతు బహిరంగ రహస్యం.

తూర్పు ఐరోపా, సోవియట్‌లో అమలు జరిపిన కుట్రకంటే ముందు చర్చిద్వారా కమ్యూనిజం, కమ్యూనిస్టులపై ప్రపంచవ్యాపితంగా దాడి చేసేందుకు జరిపిన ఒక ప్రయత్న వివరాలను గతనెల(అక్టోబరు) 25న లైఫ్‌ సైట్‌ న్యూస్‌ తొలిసారిగా ఆంగ్ల తర్జుమాను ప్రచురించింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత మారిన పరిస్ధితులలో చర్చి పాత్ర, సంస్కరణల గురించి, గడచిన వంద సంవత్సరాలలో తలెత్తిన మత సంబంధ సిద్ధాంతాల పరిష్కారానికి రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ అవసరమని 1959లో భావించారు. ఆమేరకు అది 1962 నుంచి 1965వరకు కొనసాగింది.

లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనంలోని అంశాలు ఇలా వున్నాయి. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌లో ఇతర విషయాలతో పాటు కమ్యూనిస్టులు, కమ్యూనిజానికి దండనా విధి నిర్ణయానికి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసేందుకు కొందరు నిర్ణయించారు. తరువాత దానిని పక్కన పెట్టారు. మార్క్సిజం, కమ్యూనిజం ప్రభావానికి ప్రతిగా, వాటి తెంపరితనాన్ని బహిర్గతపరిచేందుకు, ఓడించేందుకు ప్రపంచవ్యాపితంగా ఎలా సమన్వయంతో వ్యవహరించాలో పెద్ద ప్రణాళికను రూపొందించారు. అయితే కౌన్సిల్‌ కమిషన్లను రైన్‌ గ్రూప్‌ (రైన్‌ నదీ పరివాహక దేశాల)బిషప్పులు ఆక్రమించటంతో కమ్యూనిజం, మార్క్సిజాలను నేరుగా ఖండించాలనే ప్రయత్నాలన్నింటినీ వారు తిరస్కరించి పక్కన పెట్టారు. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ ముగిసిన తరువాత ఆ పత్రాలన్నీ అధికారిక తయారీ పత్రాల రికార్డు రూముకు చేరాయి. లాటిన్‌(స్పానిష్‌)భాషలో రాసిన ఆపత్రాలకు గత కొన్ని దశాబ్దాలుగా దుమ్ముపట్టింది.

వాటిలో మూడు రకాల ప్రకటనలను రూపొందించారు.మార్క్సిజం తీవ్రమైన, ప్రపంచవ్యాపిత ప్రమాదం, కమ్యూనిజం దేవుడితో నిమిత్తం లేని ఒక మతం వంటిది, క్రైస్తవ నాగరికతల పునాదుల కూల్చివేతను కోరుకొంటుంది. ఇలాంటి కమ్యూనిజం నుంచి మానవాళిని రక్షించేందుకు వున్నత స్ధాయిలో ప్రపంచవ్యాపితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి వుంది.ఈ అంశాలతో కూడిన పత్రాలను వుదారవాదులైన రైన్‌ గ్రూప్‌ బిషప్పులు కౌన్సిల్‌ తొలి నెలల్లోనే తిరస్కరించి పక్కన పెట్టారని లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనం పేర్కొన్నది.

క్రైస్తవ మతంలో కొందరు మార్క్సిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేందుకు అమెరికా సిఐఏ, ఇతర గూఢచార, వాటి ముసుగు సంస్ధలతో చేతులు కలిపారు. అదే సమయంలో లాటిన్‌ అమెరికాలో కొందరు క్రైస్తవ మతాధికారులు దారిద్య్రం, సామాజిక సమస్యలను మతవ్యవహారాలతో సమన్వయంచేసి విముక్తి వాదం లేదా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అలాంటి వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకించలేదు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించాలంటూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించేవారిని ప్రతిఘటించారు కూడా. అలాంటి వారిలో ఒకరే కమ్యూనిస్టు పోప్‌గా కొందరు చిత్రించిన పోప్‌ ఫ్రాన్సిస్‌.అర్జెంటీనాకు చెందిన ఆయన 2013 నుంచి వాటికన్‌ అధిపతిగా కొనసాగుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ఆయనను ఇలా అడిగారు.’ కాబట్టి మీరు సమానత్వానికి పెద్ద పీటవేసే సమాజం కావాలని కాంక్షిస్తున్నారు. అది మీకు తెలిసినదే మార్క్సిస్టు సోషలిజం తరువాత కమ్యూనిజపు కార్యక్రమం. కాబట్టి మీరు మార్క్సిస్టు తరహా సమాజం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు.

దానికి పోప్‌ ఇలా సమాధానం చెప్పారు.’ దీని గురించి అనేకసార్లు చెప్పాను, నా స్పందన ఎల్లవేళలా అదే, ఏదైనా వుంటే కమ్యూనిస్టులు కూడా క్రైస్తవుల మాదిరే ఆలోచిస్తారు’ అని చెప్పారు.మార్క్సిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన విమర్శలను తోసిపుచ్చుతూ మార్క్సిస్టు సిద్దాంతం తప్పు, అయితే నా జీవితంలో అనేక మంది ఎంతో మంచివారైన మార్క్సిస్టులను ఎరుగుదును, కనుక నేను తప్పుచేసినట్లుగా భావించటం లేదు’ అని పోప్‌గా ఎన్నికైన కొత్తలోనే చెప్పారు. మార్క్సిజానికి తాను వ్యతిరేకం కాదని పరోక్షంగా చెప్పేందుకు గాను బలీవియాలో వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ నుంచి సుత్తీ,కొడవలి చిహ్నంగా వున్న శిలువను బహుమతిగా స్వీకరించటం తెలిసిందే. ఆయన జారీచేసిన లాడాటో సి సర్క్యులర్‌ తయారీకి మార్క్సిజంతో స్ఫూర్తి పొందిన విముక్త మత సిద్ధాంత వాదిగా పేరుబడిన లియోనార్డో బోఫ్‌ వంటి వారితోడ్పాటును స్వీకరించారని వార్తలు వచ్చాయి. ఇటీవల కొత్త సుపీరియర్‌ జనరల్‌గా ఎన్నికైన వెనెజులాకు చెందిన ఆర్ధరో సోసా అబాస్కల్‌ మార్క్సిజంతో క్రైస్తవం సమాధానపడాలని బహిరంగంగా చెప్పారు.

మన దగ్గర దేవాలయాల కింద వేలాది ఎకరాల భూములు వున్నట్లుగానే పశ్చిమ దేశాలలో చర్చ్‌లకు అంతకంటే ఎక్కువ ఆస్ధులున్నాయి. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయిన కారణంగా వాటిని స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్న ఎన్‌టి రామారావు పెద్ద దైవభక్తుడు, కమ్యూనిస్టు కాదు. రష్యా, ఐరోపాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత పెద్ద మొత్తాలలో వున్న చర్చి ఆస్ధులను ప్రజల పరం చేశారు. అంతే తప్ప చారిత్రక ప్రాధాన్యత వున్న ఏ ఒక్క చర్చిని కూల్చివేయలేదు. కమ్యూనిస్టులు అధికారంలో వున్నంత కాలం వాటిని కూల్చివేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత ఆయా దేశాలలోని చర్చ్‌లకు ఎలాంటి హాని జరగలేదని తేలిపోయిన తరువాత వారంతా తేలు కుట్టిన దొంగల మాదిరి మిన్నకుండిపోయారు.ఇప్పుడు చైనాలో బైబిల్‌ పఠించిన కారణంగా శిక్షలు వేస్తున్నట్లు కొందరు క్రైస్తవులతో పాటు నిత్యం క్రైస్తవులను ద్వేషించే మనువాదులు కూడా కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు.చైనా చట్టాల ప్రకారం దేవుడిని ఇంటికే పరిమితం చేయాలి తప్ప వీధులకు ఎక్కించకూడదు. వీధులలో బైబిలే కాదు, ఏ మత గ్రంధ పఠనాన్ని ప్రోత్సహించినా, పఠించినా, అనుమతి లేకుండా ప్రార్ధనా మందిరాలను నిర్మించినా అది నేరమే.దానికి అనుగుణంగానే శిక్షలు వేస్తున్నారు తప్ప మరొకటి కాదు.దీనిలో మనోభావాల సమస్య వుత్పన్నం కాదు. మన దేశంలో తెల్లవారే సరికి నడిరోడ్లమీద, వివాదాస్పద స్ధలాల్లో దేవుళ్లు, దేవతలు వెలుస్తుంటారు. చైనా వంటి చోట్ల అది కుదరదు. మెజారిటీ, మైనారిటీ ఎవరైనా అలాంటి పనులు చేస్తే కటకటాల వెనక్కు పోవాల్సిందే.

కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడిన ప్రారంభంలో వెల్లడైన వ్యతిరేకతకు, నేటికి వచ్చిన మార్పులను చూస్తే క్రైస్తవ మతాన్ని కూడా సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా పాలకవర్గాలు ఎలా వుపయోగించుకోచూశాయో చూశాము. తొలుత ఒక సిద్ధాంతంగా పనికిరాదని విమర్శ చేశారు. తరువాత బోల్షివిక్‌ విప్లవ సమయంలో రష్యాలో ప్రత్యక్షంగా కమ్యూనిస్టు వ్యతిరేక తిరుగుబాటులో భాగస్వాములయ్యారు. తరువాత ప్రచ్చన్న యుద్ధంలో తమ వంతు పాత్రను మరింతగా పోషించేందుకు కమ్యూనిజం మతానికి వ్యతిరేకమని ప్రకటించటమే కాదు, సోవియట్‌, తూర్పు ఐరోపాలో జరిగిన కుట్రలో భాగస్వాములయ్యారు. ఇప్పటికీ అనేక చోట్ల అటువంటి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

ఇదే సమయంలో క్రైస్తవమతంలో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపేందుకు నిరాకరించేశక్తులు కూడా వున్నాయని స్పష్టమైంది. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే మతాధిపతులు చెప్పిన భాష్యాలకు ఏ బైబిల్‌ అంశాలు ఆధారమయ్యాయో అదే గ్రంధంలోని అంశాలను మార్క్సిజంతో మతాన్ని సఖ్యత పరిచేందుకు కమ్యూనిజపు సానుభూతిపరులైన మతాధిపతులు కూడా తమ భాష్యాలకు వుపయోగించారు. మొదటి వారు మారణకాండను ప్రోత్సహించిన వారి తరఫున వుంటే రెండో తరగతివారు మానవ కల్యాణాన్ని కోరుకున్న వారి పక్షాన నిలిచారు. మరి మనం ఎటు వుండాలి?