Tags
BJP, BJP’s trolling army, India economy, india ratings, moody’s india ratings, Narendra Modi, narendra modi bhakts
ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి నేతలు జరిపిన విదేశీయాత్రలు, అందుకు అయిన విమానఖర్చుల మేరకు కూడా వారు విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులను సమీకరించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మోడీ విదేశీ పర్యటనలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో విమర్శకుల నోరు మూయించేందుకు వారికి ఒక అస్త్రం దొరికింది. గత పదమూడు సంవత్సరాలుగా మన స్ధానాన్ని చెత్త రేటింగ్ ఎగువన, పెట్టుబడి రేటింగ్‌కు దిగువున వుంచిన మూడీస్ అనే అమెరికా సంస్ధ దేశ ఆర్ధిక రేటింగ్‌ను ఒక మెట్టు పైకి పెంచింది. కొద్ది రోజుల క్రితం అదే అమెరికాకు చెందిన ప్యూ అనే సంస్ధ విడుదల చేసిన సర్వేలో కాస్త పలుకుబడి తగ్గినప్పటికీ ఇప్పటికీ నరేంద్రమోడీయే తిరుగులేని నాయకుడిగా వున్నాడని తేలిందని పేర్కొన్నారు.(ఆ సర్వే తొమ్మిదినెలల క్రితం చేసింది, ఇప్పుడు ఎందుకు విడుదల చేశారన్నది ఒక ప్రశ్న) వాణిజ్య సులభతర సూచికలో గతేడాది కంటే ఏకంగా 30పాయింట్లు తగ్గి ఎగువకు చేరింది. ఇప్పుడు మూడీస్ బూస్ట్ ఈజ్‌ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అన్నట్లు దేశవ్యాపితంగా బిజెపి శ్రేణులు,నేతలు గంతులు వేస్తున్నాయి. దానికి వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ ఎన్నికలలో ప్రచారానికి వీటిని వుపయోగించుకొని బయటపడగలమనే సంతోషమే కారణం. అయితే వీటి ప్రభావం ఎంత మేరకు వుంటుందన్నది ప్రశ్నార్ధకమే. ఒక వేళ మోడీ-అమిత్ షా రేటింగ్‌ను ఓట్ల కోసం వాడితే మిగతా రెండు సంస్ధల మాటేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా వూరుకుంటాయా? తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక చక్కటి డైలాగ్ వుంది. నేను నియోగిని ఎలా కావాలంటే అలా వినియోగపడతాను అంటాడు రామకృష్ణ(నిజానికి ఆ కవి అలాంటి వాడో కాదో తెలియదు) భజన మీడియా మాత్రం అలాంటిదే. కనుక దాని చిత్రణ చూసి గంతులేస్తే గోతిలో పడతారు. ఇప్పటికీ కాస్త విమర్శనాత్మకంగా చూసే విశ్లేషకులు ఒంటి మీద బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండా గంతులేయాల్సినంతగా తాజా రేటింగ్‌లో ఏముందంటున్నారు.
మూడీస్ సంస్ధ రేటింగ్ చరిత్రలోకి వెళితే బిజెపి భజన బృందాలకు కాస్త ఇబ్బందేమరి. ఎందుకంటే తమ నేత వాజ్‌పేయి కాలంలో దేశం వెలిగిపోయిందని చెప్పుకున్న కాలంలో కూడా మన రేటింగ్ అధ్వాన్నంగానే వుంది మరి. పెట్టుబడిదారులు, భూస్వాములకు లబ్ది చేకూర్చేందుకు మన పాలకులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ వళ్లు వంచి ఎంతో కష్టపడుతున్నారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలతో బంధం ముడిపడిన తరువాత చేపట్టిన చర్యలకు సంస్కరణలు అని పేరు పెట్టారు. ప్రధానులుగా పని చేసిన వారిలో నూతన ఆర్ధిక విధానాలకు శ్రీకారం చుట్టిన ఖ్యాతి తెచ్చుకున్న రాజీవ్ గాంధీ పాలనలో మూడీస్ సంస్ధ మన దేశానికి పెట్టుబడిలో ఆరవ ర్యాంకు(1988) ఇచ్చింది. విపిసింగ్ ఎనిమిది(1990) చంద్రశేఖర్ పది(1991) పివి నరసింహారావు పాలనలో పెట్టుబడేతర చెత్త రాంకులు పదకొండులో రెండోది(1991), ఆయన పాలనలోనే 1994లో పెట్టుబడిలో పదవరాంకు తరువాత దేవెగౌడ పాలనలో 1998లో కూడా దాన్నే కొనసాగించింది. అదే ఏడాది వాజ్‌పేయి అధికారానికి వచ్చిన తరువాత తిరిగి రెండవ చెత్త రాంకులోకి దిగజారింది. తరువాత ఒకటవ చెత్త రాంకులోకి, తరువాత 2004లో పెట్టుబడిపదవ రాంకులోకి పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పదేండ్ల పాలనలో అదే కొనసాగి ఇప్పుడు నరేంద్రమోడీ మూడున్నర ఏండ్ల తరువాత పదినుంచి తొమ్మిదవ రాంకులోకి పెంచింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే వాజ్‌పేయి హయాంలో చెత్తకు అటూ ఇటూగా వున్నందుకే తమ పాలనలో దేశం వెలిగిపోయిందంటూ బిజెపి వారు పెద్ద ఎత్తున వందల కోట్లతో ప్రచారానికి తెరతీసి జనం ముందుకు వచ్చి బక్కబోర్లా పడిన విషయాన్ని మరచి పోకూడదు. అందువలన ఈ మాత్రానికే మోడీ పరివారం పండగ చేసుకోవాలా అని కొందరు అంటున్నారు.
పిల్లి ఏ రంగుదని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా సంస్కరణలు ఏ ప్రధాని ఎలా అమలు జరిపారన్నది కాదు, దాని వలన జనానికి ఒరిగిందేమిటి అన్నదే గీటురాయి. రేటింగ్‌లో మార్పు కోసం నరేంద్రమోడీ సర్కార్ తెగతాపత్రయ పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా చివరకు పైరవీలకు ప్రయత్నించి విఫలమైందని రాయిటర్స్ సంస్ధhttps://in.reuters.com/article/india-ratings-moody-s/exclusive-how-india-lobbied-moodys-for-ratings-upgrade-but-failed-idINKBN14E09A గతేడాది డిసెంబరు 25న ఒక వార్తను ప్రచురించింది. ఈ విషయంలో మన్మోహన్ సింగ్ సర్కార్ కూడా అదే పని చేసి భంగపడిందని వార్తలు వెలువడ్డాయి.
రాయిటర్స్ కథన సారాంశం ఇలా వుంది. మూడీస్ రేటింగ్ పద్దతులను భారత్ విమర్శించింది. రేటింగ్ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని సంబంధిత పత్రాలలో రాయిటర్స్ గమనించింది, అయితే దుర్బలంగా వున్న బ్యాంకుల తీరుతెన్నులను ఎత్తి చూపుతూ వత్తిడికి లంగేందుకు అమెరికా సంస్ధ తిరస్కరించింది. అధికారానికి వచ్చిన నాటి నుంచి పెట్టుబడులను పెంచేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు, ద్రవ్య,కరెంట్ ఖాతాలోటు తేడాను తగ్గించేందుకు నరేంద్రమోడీ చర్యలు తీసుకున్నారు.అయితే ఇంకా చర్యలు తీసుకోవాలని మూడు రేటింగ్ సంస్దలు కోరాయి. ఆర్ధిక మంత్రిత్వశాఖ-మూడీస్ మధ్య నడిచిన వుత్తర ప్రత్యుత్తరాలలో రుణభారం,136బిలియన్ డాలర్ల విలువగల బ్యాంకుల పారుబాకీల గురించి రేటింగ్ సంస్ధలకు భరోసా ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్లు వెల్లడైంది. అక్టోబరులో రాసిన లేఖలు, ఇమెయిల్స్‌లో మూడీస్ సంస్ధ లెక్కలు కట్టే విధానాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్నంతా ఆశావహంగా రుణభార సమస్య లేదని, బ్యాంకుల తీరు ఆందోళన కలిగిస్తోందని మూడీస్ అ వాదనలను తిరస్కరించింది. రేటింగ్ సంస్ధలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అసాధారణంగా వుందని, రేటింగ్ ఏజన్సీలపై వత్తిడి చేయలేమని ఆర్ధికశాఖ మాజీ అధికారి అరవింద్ మాయారామ్ చెప్పారు. బిఏఏ రేటింగ్ వున్న దేశాల జీడిపిలో ఆదాయం 21.7శాతం మీడియన్(మధ్యరేఖ) కాగా భారత్‌లో 21శాతమే వుందని అందువలన మూడీస్ సంస్ధ పెట్టుబడులలో కనిష్ట రేటింగ్ ఇచ్చింది. రేటింగ్ ఎక్కువ వున్న దేశంలో రుణాలు పొందటానికి అయ్యే వ్యయం తక్కువగా వుంటుంది కనుక పెట్టుబడులు పెట్టేవారు ముందుకు వస్తారు. దేశంలో వచ్చే ఆదాయంలో ఐదోవంతుకు పైగా అప్పులపై వడ్డీ చెల్లింపులకే పోతోంది.
అక్టోబరు నెలలో మూడీస్ ప్రతినిధికి పంపిన ఇమెయిల్‌లో సంస్ధ రేటింగ్ పద్దతిని మోడీ ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జపాన్, పోర్చుగల్ వంటి దేశాలు వాటి ఆర్ధిక వ్యవస్ధల కంటే రెట్టింపు రుణభారం కలిగి వున్నప్పటికీ మెరుగైన రేటింగ్ ఇచ్చారని పేర్కొన్నది.2004 తరువాత భారత రుణభారం గణనీయంగా తగ్గినప్పటికీ రేటింగ్స్‌లో అది ప్రతిబింబించలేదని, విదేశీమారక ద్రవ్య నిల్వలు మెరుగ్గా వుండటం, ఆర్ధిక పురోగతిని కూడా పరిగణనలోకి తీసుకోవటం లేదని అభ్యంతరం తెలిపింది. దానికి మూడీస్ ప్రతినిధి వెంటనే సమాధానమిస్తూ భారత్‌తో సమాన రేటింగ్ వున్న దేశాలతో పోల్చితే రుణభారం ఎక్కువగా వుందని, అదే సమయంలో రుణాన్ని భరించగల స్ధితి కూడా తక్కువగా వుందని పేర్కొన్నారు.బ్యాంకుల పారుబాకీల సమస్య సమీప భవిష్యత్‌లో పరిష్కారమయ్యే అవకాశాలు కూడా కనిపించటం లేదని పేర్కొన్నారు. సానుకూల వైఖరి కనిపిస్తున్నప్పటికీ గతంలో ఇచ్చిన బిఏఏఏ3 రేటింగ్‌ను మార్చే అవకాశం లేదని గ్రేడ్ పెంచే పరిస్ధితులు లేవని నవంబరు 16న మూడీస్ తెలిపింది.’
1980దశకం నాటి స్ధాయిలో లేకపోయినప్పటికీ ఇప్పుడు రేటింగ్ పెంచిన కారణంగా తక్కువ వ్యయ్యంతో విదేశాలలో భారత్ నిధులు తెచ్చుకొనే అవకాశాలు పెరుగుతాయని పరిశీలకులు వ్యాఖ్యానించారు. అయితే మిగతా రెండు ప్రధాన రేటింగ్ సంస్ధలైన్ ఎస్‌అండ్‌పి, ఫిచ్‌కూడా రేటింగ్ పెంచితేనే అది సాధ్యం అవుతుంది. అవి కూడా వెంటనే ఆ పని చేయకపోతే మూడీస్ చర్యను అంతర్జాతీయ పెట్టుబడిదారులు అనుమానించే అవకాశం వుంది. అదే జరిగితే రేటింగ్‌ను తగ్గించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రెండవది ఈ రేటింగ్‌ను నిలుపుకొనే విధంగా ప్రభుత్వ చర్యల్లేకపోయినా తిరిగి తగ్గించే అవకాశాలు లేకపోలేదు. రేటింగ్ మెరుగ్గా లేకపోయినప్పటికీ దానితో నిమిత్తం లేకుండానే గత పద మూడు సంవత్సరాలుగా విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులు కొంత మేరకు పెరిగాయి. దానికి తమ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే అని మన్మోహన్‌సింగ్, నరేంద్రమోడీ ఎవరికి వారు చెప్పుకోవటం సహజం. అయితే ఇప్పుడు ఈ రేటింగ్‌తో అదనంగా వచ్చేదేమిటి అన్నది ఒక ప్రశ్న. రేటింగ్ మెరుగైన కారణంగా ఇంకా విదేశీ నిధులు వచ్చిపడితే జరిగేదేమిటి? ఒకటి నిధులు, రుణాల వ్యయం తగ్గటం ఒక సానుకూల అంశం. ధనిక దేశాల బ్యాంకులలో మన కంటే వడ్డీరేట్లు మరీ తక్కువగా వున్నాయి. వాటితోపోల్చితే మన దగ్గర ఎక్కువ. అందువలన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన హామీ వుంటే విదేశీ సంస్ధలు ముందుకు వస్తాయి.
అదే సమయంలో విదేశీ నిధుల ప్రవాహం మన రూపాయి విలువపై ప్రభావం చూపటం అనివార్యం. ఇప్పటికే రూపాయి విలువ పెరిగిన కారణంగా ఎగుమతిదార్లు పోటీని ఎదుర్కోలేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రూపాయి విలువ ఇంకా పెరిగితే ఎగుమతులు మరింతగా పడిపోతాయి. వాణిజ్యలోటు పెరుగుతుంది. ఆ ప్రభావం మన కార్మికులు, రైతులు,వ్యవసాయ కార్మికులపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. రేటింగ్ వార్త వెలువడిన శుక్రవారం నాడు 30పైసల మేరకు విలువ పెరిగింది. అయితే రూపాయి విలువ ఎంత పెరిగితే ఆ మేరకు చమురు ధరలు తగ్గుతాయి. ఇతర ప్రయోజనాలు, ప్రభావాల గురించి అనేక అభిప్రాయాలు వెలువడుతున్నప్పటికీ రేటింగ్‌తో నిమిత్తం లేకుండానే విదేశీ నిధులు ఇప్పటికే వచ్చినందున రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం వుంటుందో చూడాల్సి వుంది.
ఒకటి మాత్రం స్పష్టం. ఏదో ఒక పేరుతో ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టారు. పెట్రోలు, డీజిల్‌పై పూర్తిగా సబ్సిడి ఎత్తివేశారు. గ్యాస్, కిరోసిన్‌పై ఎత్తివేత క్రమంగా అమలు జరుగుతోంది. ఇలాంటి చర్యలు ద్రవ్యలోటును ఎంత మేరకు పూడ్చగలవనేది చూడాల్సి వుంది. నోట్ల రద్దు ద్వారా మూడు లక్షల కోట్ల మేరకు లబ్ది చేకూరుతుందన్న అంచనాలు పోయి నష్టాలు మిగిలాయి. దీనికి తోడు బ్యాంకులకు పెట్టుబడులు సమకూర్చేందుకు ప్రభుత్వం 2.11లక్షల కోట్లను కేటాయించాల్సి వుంది. అన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వాన్ని పాలక ఎన్‌డిఏ కూటమి, దానితో జతకట్టాలని వుబలాటపడుతున్నవారికి ఆందోళన కలిగించే అంశం పెరుగుతున్న చమురు ధరలు. ఇప్పటికే 60డాలర్లున్న పీపా ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందనే జోస్యాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రేటింగ్ ప్రయోజనాలన్నీ ఒక్క దెబ్బతో ఎగిరిపోతాయి. చమురు ధరల పెరుగుదల పర్యవసానాలను మోడీ సర్కార్ ఎలా పరిష్కరిస్తుందన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న. భారం మొత్తాన్ని జనంపై మోపితే ధరలు విపరీతంగా పెరుగుతాయి. దానితో సంబంధం వున్న వేతనాలు,భత్యాల వంటివి పెరగాల్సి వుంది.
దేశాల రేటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలలో ఆ దేశాల రుణభారం ఒకటి. మన పొరుగునే వున్న చైనా జిడిపి వంద రూపాయలనుకుంటే దాని అప్పులు 43, అదే మన దేశానికి వస్తే 68 రూపాయలుగా వుంది. మన వంటి రేటింగ్ వున్న దేశాల మీడియన్ 44 మాత్రమే. అమెరికా, బ్రిటన్‌లకు 70శాతం వుంది. ఆ దేశాలకు అంత అప్పు వున్నప్పటికీ వాటికి తీర్చే సత్తా కూడా వుంది. మన పరిస్ధితి అది కాదు.ఎస్ అండ్ పూర్ రేటింగ్ సంస్ధ మన దేశ అప్పు దామాషా 60లోపుగా వుండాలని షరతు లాంటి వత్తిడి చేస్తోంది. రేటింగ్ పెంపుదల కోసం మూడీస్ సంస్ధతో మోడీ సర్కార్ లాబీయింగ్(పైరవీ) చేసిందని చెప్పిన రాయిటర్స్ మరో అమెరికన్ సంస్ధ ఎస్ అండ్ పి, బ్రిటన్ కంపెనీ ఫిచ్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు మూడీస్ చేసిన సవరణను మిగతా రెండు సంస్ధలు కూడా అనుసరిస్తాయా? అది తేలేంత వరకు మోడీ భక్తులకు బిపి పెరగటం ఖాయం.