Tags

, , , ,

ఎం. కోటేశ్వరరావు

దేవుడు తప్ప తనను మరొకరు గద్దె దింపలేరని ఒక నాడు విర్రవీగి గత కొద్ది రోజులుగా తప్పుకొనేది లేదని బిర్రబిగిసిన జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే 37సంవత్సరాల తరువాత అవమానకరంగా మంగళవారం రాత్రి తనంతటతానే రాజీనామా చేసి గద్దె దిగాడు. ఆ వార్త వినగానే దేశంలో సంబరాలు మిన్నంటాయి. దాదాపు ఆరు దశాబ్దాల పాటు జింబాబ్వే రాజకీయాలను అనధికారికంగా అధికారికంగా శాసించిన ముగాబే(93) శకం అంతమైంది. అంతకు ఒక రోజు ముందు వుద్వాసనకు గురై దక్షిణాఫ్రికాలో రక్షణ పొందుతున్న మాజీ వుపాధ్యక్షుడు ఎమర్సన్‌ మంగాగ్వాకు అధికారం అప్పగించేందుకు ముగాబే సిద్దపడినట్లు రక్షణ దళాల కమాండర్‌ జనరల్‌ కానస్టాంటినో చివెంగా జర్నలిస్టులతో చెప్పారు. అధికారపక్ష కేంద్రకమిటీ ఆదివారం నాడు సమావేశమై 24గంటలలోగా రాజీనామా చేయని పక్షంలో అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తామని హెచ్చరించింది. దానిని కూడా ముగాబే ధిక్కరించటంతో మిలిటరీతో బలప్రదర్శనకు దిగుతాడా అన్న సందేహాలు తలెత్తాయి. దేశంలో ఎలాంటి ప్రదర్శనలు జరపవద్దని మిలిటరీ జనరల్‌ కోరారు.శనివారం నాడు జింబాబ్వే జాతీయ విముక్తి పోరాట యోధుల సంఘం ఒక ప్రదర్శన జరిపి ముగాబే రాజీనామాను డిమాండ్‌ చేసింది. మరోమారు ప్రదర్శన జరుపుతామని హెచ్చరించింది. ముగాబే గద్దె దిగకపోతే తాము పరీక్షలను బహిష్కరిస్తామని విశ్వవిద్యాలయ విద్యార్ధులు చేశారు. మంగళవారం వుదయం విదేశాలలో ఒక గుర్తు తెలియని ప్రాంతం నుంచి చేసిన ప్రకటనలో ముగాబే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, తన ప్రాణ రక్షణకు హామీతో పాటు దేశంలోని రాజకీయ పరిస్ధితులపై చర్చకు ఆహ్వానం పంపాలని కోరినట్లు వార్తా సంస్ధలు పేర్కొన్నాయి. గృహనిర్బంధంలో వున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ముుగాబే గత శుక్రవారం నాడు జింబాబ్వే ఓపెన్‌ యూనివర్సిటీ పట్టాల ప్రదాన కార్యక్రమంలో ఛాన్సలర్‌ హోదాలో పాల్గనటం, తరువాత బయట కనిపించకపోవటం కూడా అనుమానాలకు తావిచ్చింది. తాము అధికారాన్ని స్వీకరించలేదని, నేరగాండ్లను ఏరివేయటానికి కొన్ని చర్యలు తీసుకున్నామని, ముగాబే, ఆయన కుటుంబం క్షేమంగా వుందని అంతకు ముందు మిలిటరీ ప్రకటించింది. తనపై ప్రతీకారం తీర్చుకోవటం, కక్ష్యపూరితంగా వుండటం వలన ఎలాంటి ప్రయోజనం వుండదని రాజధాని, దేశంలోని ప్రతి ఒక్కరిని తన అభిమానులు క్షమించివదలి వేయాలని ముగాబే విశ్వవిద్యాలయ ప్రసంగంలో పేర్కొనటాన్ని బట్టి గద్దె దిగేందుకు సుముఖంగా లేనని చెప్పటమే అని పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో మంగళవారం నాడు పార్లమెంట్‌లో అభిశంసన ప్రక్రియ ప్రారంభమైన కొద్ది సేపటికే తాను రాజీనామా చేస్తున్నట్లు ముగాబే ప్రకటించటంతో పార్లమెంట్‌ వాయిదా పడింది.

గత కొద్ది వారాలుగా జరిగిన పరిణామాలను చూస్తే ముగాబే మాజీ కావటం ఖాయం అని తేలిపోయింది. మిలిటరీ అధికారులతో సన్నిహిత సంబంధాలున్న రాజకీయవేత్తగా పార్టీలో, మిలిటరీ, పోలీసుల్లో వుపాధ్యక్షుడి వర్గం ఆధిపత్యం రుజువైనా, లేక భార్య గ్రేస్‌ది పైచేయి అయినా ముగాబే ఆధిపత్యం ముగిసినట్లే. ఇప్పుడు మొదటిదే రుజువైంది. ముగాబేను మిలిటరీ గృహనిర్భంధంలో వుంచటంతో అక్కడి రాజకీయ సంక్షోభ తీవ్రత ప్రపంచానికి తెలిసింది. సైన్యాధికారులు తీసుకున్న రాజకీయ-మిలిటరీ చర్య ఒక కోణంలో ప్రమాద సూచికలను వెల్లడించినప్పటికీ మొత్తం మీద దేశవ్యాపితంగా ఆమోదం లభించటం విశేషంగా చెప్పవచ్చు. ఇప్పటివరకు సంభవించిన పరిణామాలలో అధికారాన్ని మిలిటరీ తీసుకొనే సూచనలు లేవు.

తిరుగులేని నేతగా వున్న ముగాబే 1980 నుంచి 87వరకు ప్రధానిగా, తరువాత నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన పూర్వరంగంలో తొమ్మిది పదులు దాటిన ముగాబే అధికార వారసత్వం కోసం అధికారపక్షంలో పోరు మొదలైంది.ముగాబే తన కంటే 41 సంవత్సరాలు చిన్నదైన రెండవ భార్య గ్రేస్‌(52)కు పదవిని కట్టబెట్టేందుకు పూనుకోవటంతో పార్టీలో తిరుగుబాటుకు బీజం పడింది. వైమానిక దళ పైలట్‌ భార్య అయిన గ్రేస్‌ ఒక బిడ్డ పుట్టిన తరువాత అధ్యక్షకార్యాలయంలో వుద్యోగినిగా చేరింది. భర్తతో పాటు ముగాబేతో కూడా సంసారం చేసింది. వివాహేతర బంధంతో ముగాబే ద్వారా ఇద్దర్ని వివాహం తరువాత మరొకర్ని కన్నది. గ్రేస్‌కు విడాకులు ఇవ్వాలని ముగాబే అధికారబలంతో వత్తిడి తెచ్చి, తరువాత మొదటి భర్తతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసేందుకు పైలట్‌ను విదేశాంగ శాఖ వుద్యోగిగా ఎంతో దూరంలో వున్న చైనాకు పంపించాడు. గ్రేస్‌తో సంబంధం వున్న మరో ఇద్దరిని అనుమానాస్పద స్ధితిలో హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం భార్య బ్రతికి వుండగా విడాకులు తీసుకోకుండా మరో వివాహం చేసుకొనే అవకాశం లేదు. అందువలన ఏండ్ల తరబడి వివాహేతర బంధాన్ని కొనసాగించాడు. తరువాత భార్య మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత దశాబ్దిలో కనీవినీ ఎరుగని రీతిలో అట్టహాసంతో గ్రేస్‌ను వివాహం చేసుకున్నాడని విదేశీ పత్రికలు రాస్తే శతాబ్దిలో ఇలాంటి ఆడంబరాన్ని చూడలేదని జింబాబ్వే మీడియా పేర్కొన్నది. ఇలాంటి వ్యక్తిత్వం కారణంగా ముగాబేను సహించినప్పటికీ గ్రేస్‌ను ఎన్నడూ పార్టీకార్యకర్తలు, సాధారణ పౌరులు గౌరవించలేదు. ముగాబే తన అధికారాన్ని దుర్వినియోగం చేసి భార్య సారా పేరుతో ఐరోపాలో అక్రమ ఆస్థులను దాచాడు. ఆమె ఘనావియన్‌ కావటంతో 1992లో ఆమె మరణించినపుడు ఘనావియన్‌ చట్ట ప్రకారం ఆమె పేరుతో వున్న ఆస్థులు పుట్టింటి వారికి చెందుతాయి తప్ప మెట్టినింటికి దక్కవు. దాంతో భార్య మరణించగానే దాచుకున్న సంపదంతా పోయిందనే ఆక్రోశంతో తన నివాసంలోని కిటికీలన్నింటినీ ముగాబే పగలగొట్టినట్లు మీడియాలో కధనాలు వచ్చాయి. మొదటి భార్య సారాను ఆప్యాయంగా ఇప్పటికీ జింబాబ్వియన్లు తమ అమ్మగా పిలుచుకుంటారు. గ్రేస్‌కు అధికారాన్ని అప్పగించేందుకు పూనుకోవటంతో చివరకు ముగాబేను కూడా తోసిపుచ్చేందుకు పార్టీలోని వారికి అవకాశం దొరికింది. అయితే ఈ వ్యవహారం తక్షణ అంశంగా కనిపిస్తున్నప్పటికీ తిరుగుబాటు అసలు కారణంగా దేశం ఆర్ధికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కోవటం వాటిని పరిష్కరించటంలో ముగాబే వైఫల్యం అని చెప్పాలి.

బ్రిటీష్‌ వలసపాలనలో రోడీషియాగా పిలిచిన జింబాబ్వే స్వాతంత్య్రపోరాటంలో ముగాబే కీలకపాత్ర పోషించాడు. పక్కనే వున్న దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు, ఎఎన్‌సి వుద్యమాలతో వున్న సంబంధాలు, నాడున్న అంతర్జాతీయ పరిస్ధితులలో ఒక వామపక్షవాదిగా వున్న ముగాబే తరువాత కాలంలో బూర్జువారాజకీయవేత్తగా మారాడు. శ్వేతజాతీయుల చేతులలో వున్న భూముల పంపకం వంటి కొన్ని చర్యలతో దేశంలో తిరుగులేని నేతగా మారాడు.వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నీ ఆయనకు మద్దతు ఇచ్చాయి.

ముగాబే పార్టీ, అధికార పదవుల నుంచి తప్పుకోవాలని కూడా అధికారపక్ష కేంద్రకమిటీ తీర్మానించింది.ఆయన స్ధానంలో ప్రస్తుతం ప్రవాసంలో వున్న మంగాగ్వాను నాయకుడిగా, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో అధ్యక్ష అభ్యర్ధిగా ఎన్నుకున్నట్లు ఆదివారం నాడు ప్రకటించారు. సోమవారం లోగా పదవి నుంచి తప్పుకోనట్లయితే పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ద్వారా పదవీచ్యుతుని గావిస్తామని హెచ్చరించింది. గడువు ముగిసినా ముగాబే అందుకు సిద్దపడకపోగా అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధంగా పడినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఈ పూర్వరంగంలో వెనక్కు తగ్గేందుకు సుముఖంగా వున్నట్లు సైనికాధికారులు చెప్పటం తెరవెనుక యత్నాలు జరిగిన విషయాన్ని నిర్ధారించింది. మంగళవారం నాడు మంగాగ్వా చేసిన ప్రకటనలో ముగాబే తన హత్యకు పధకం వేసినట్లు పేర్కొన్నారు. తనను వుపాధ్యక్ష పదవి నుంచి తొలగించిన తరువాత బందీగా తీసుకొని హతమార్చాలని పధకం వేసినట్లు గత నవంబరునెలలోనే తనకు స్నేహితులైన భద్రతా అధికారి హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు. పదవి నుంచి తొలగించిన ప్రకటన వెలువడగానే మంగాగ్వా దేశం విడిచిపెట్టిన విషయం తెలిసిందే.

గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తల ప్రకారం దేశ ప్రజలలో మంగాగ్వా పట్ల కూడా అంతగా సదభిప్రాయం లేదు. ఒక నాడు తిరుగులేని నేతగా వున్న ముగాబేను వద్దని కోరుకుంటున్న జనం మరో ప్రత్యామ్నాయం లేకనే మంగాగ్వాను ఆహ్వానిస్తున్నారని చెప్పాల్సి వుంది. దేశాన్ని అస్తవ్యస్తం గావించటంలో ముగాబే పాత్ర ఎంతో ఇంతకాలం ప్రభుత్వ విధానాలను సమర్ధిస్తూ వచ్చిన మంగాగ్వాకూ దానిలో వాటా వుంది. మధ్యలో ముగాబే తన భార్యను రంగం మీదకు తేవటంతో పాలకపార్టీలో తిరుగుబాటుకు నాంది అయింది తప్ప విధానాల పరంగా ఎలాంటి తేడా లేదు. ముగాబేపై జనంలో తలెత్తిన విముఖత, మిలిటరీ మొగ్గు మంగాగ్వా వైపు వుందని పసిగట్టిన పశ్చిమ దేశాలు ఇంతవరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా మంగాగ్వాకు మద్దతు పలుకుతున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి.

మంగాగ్వాకు రాజ్యాంగబద్దంగా అధికారం అప్పగించాలంటే కొన్ని నిబంధనలు అడ్డువస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్షుడు పార్లమెంట్‌ స్పీకర్‌కు రాజీనామాను సమర్పించిన 24గంటల లోగా ప్రత్యామ్నాయంగా వుపాధ్యక్షుడికి బాధ్యతలను అప్పగించాల్సి వుంది. అయితే మంగాగ్వాను వుపాధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించినకారణంగా ఆ స్ధానం ఖాళీగా వుంది. ఇప్పుడు రాజీనామా చేస్తే స్పీకరే ఆ బాధ్యతలను స్వీకరించాల్సి వుంటుంది. రాజ్యాంగ పద్దతుల ప్రకారం అధ్యక్షుడిగా ముగాబే తిరిగి మంగాగ్వాను వుపాధ్యక్షపదవిలో నియమించి తాను పదవినుంచి తప్పుకోవాలి.బహుశా ఈ కారణంగానే ముగాబే తననుఆహ్వానించాలని మంగాగ్వా మంగళవారం నాడు చేసిన ప్రకటనలో డిమాండ్‌ చేసి వుండాలి. మంగాగ్వా పునర్‌నియామకం జరగకుండానే ముగాబే రాజీనామా చేసినందున మరొక ప్రక్రియ ద్వారా కొత్త నేత ఎంపిక జరగాల్సి వుంది.

మిలిటరీచర్య దేశంలో ఏర్పడిన అల్లకల్లోలం ముఖ్యంగా అధికార పార్టీలో ఏర్పడిన అస్తవ్యస్థ పరిస్థితుల ఫలితమే అని ఇటీవలనే ఏర్పడిన జింబాబ్వే కమ్యూనిస్టు పార్టీ చేసిన వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి నఖబుతో మబెహెనా ఒక ప్రకటన చేస్తూ దేశ ప్రజలు దుర్భరదారిద్య్రంలో మగ్గుతుంటే అధికారపార్టీ ప్రముఖులు భోగలాలసులుగా తయారయ్యారని పేర్కొన్నారు. పరిశ్రమలు మూతబడ్డాయి, సంఘటిత రంగంలో 90శాతానికిపైగా నిరుద్యోగం వుంది. అధికార ప్రతిపక్షా వ్యక్తిగత రాజకీయాలలో మునిగిపోయాయి. గత 37 సంవత్సరాలలో ఎన్నడూ ఇలాంటి పరిస్ధితి ఏర్పడలేదు. రాజకీయ ప్రముఖుల సామూహిక దోపిడీతో కూడిన ఒక అప్రజాస్వామిక రాజకీయ వ్యవస్ధ అభివృద్ధి అయింది, ఫలితంగా అర్ధికదిగజారుడుకు దారితీసింది. సాధారణ పరిస్థితులలో మిలిటరీ చర్యను సమర్ధించకూడదు.అయితే అధికారం కొద్ధి మంది, అతి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావటం, ప్రజాబాహుళ్య అదుపు లేదా అసమ్మతి తెలిపేందుకు వున్న అవకాశాలన్నీ మూసుకుపోయిన స్థితిలో ఈ వుదంతంలో మిలిటరీ చర్యకు దారితీసింది, దీనిని అత్యధిక జింబాబ్వియన్లు ఒకే తీరులో కానప్పటికీ సంతోషంగా అంగీకరించారు. రాజ్యాంగబద్దమైన ప్రజాస్వామ్యంలో శాంతియుత,రాజ్యాంగ పద్దతుల్లో అధికారమార్పిడి జరగాలి, అందుకు అనువైన పరిస్ధితులను ఏర్పరచాలి అని కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. సహేతుకమైన కాల వ్యవధిలో స్వేచ్చ,అక్రమాలకు తావులేని ఎన్నికలు జరిపేందుకు ఒక తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు జరగాలని సూచించింది.

దేశియం పేరుతో ముగాబే సర్కార్‌ ఆమోదించిన విధానాల ప్రకారం విదేశీ కంపెనీలు తమ వాటాను 49శాతానికి పరిమితం చేసి 51శాతం జింబాబ్వియన్లకు కేటాయించాలి.ఈ విధానాన్ని స్వదేశీ బూర్జువాశక్తులు తమకు అనుకూలంగా మార్చుకొని దేశాన్ని గుల్లచేశారు. తాను సామ్రాజ్యవాదానికి,పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం అని ముగాబే చెప్పుకున్నప్పటికీ ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరించారు.1991 నుంచి నయావుదారవాద విధానాలను అమలులోకి తెచ్చారు. ఈ పూర్వరంగంలో మంగాగ్వా లేదా మరొకరి నాయకత్వంలో వచ్చే ప్రభుత్వం ఈ విధానాలను మార్చుకోనట్లయితే జనంలో వ్యతిరేకత రావటానికి ఎక్కువ కాలం పట్టదు. మరొక ముగాబేను దీర్ఘకాలం అధికారంలో తిష్ట వేయటానికి అంగీకరించే అవకాశాలు తక్కువ.