Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

అధికారాంతమందు చూడవలె ఆ ఆయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు ఒక్కొక్కటీ ఎదురుతన్నుతుండటంతో గతంలో మాదిరి రొమ్ము విరుచుకొనే పరిస్థితులు లేవు. ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు అన్నట్లుగా రేటింగ్స్‌ మోజు నరేంద్రమోడీ పైకి చెప్పుకోలేని చోట మరో దెబ్బతగిలేట్లు చేసింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. పద్నాలుగు సంవత్సరాలుగా రేటింగ్‌తో నిమిత్తం లేకుండా తెచ్చుకుంటున్న అప్పులు, వస్తున్నాయని చెబుతున్న పెట్టుబడులతో ముందుకు పోకుండా అత్యాశకు పోనేల, ఇలా ఇబ్బందులను కొని తెచ్చుకోవటం ఎందుకు అని మోడీ మంత్రాంగం, యంత్రాంగం ఇప్పుడు తలలు పట్టుకోవటం గురించి చెప్పనవసరం లేదు. మూడు వన్‌డే మాచ్‌ల సీరీస్‌లో ఒకటి అటు ఇటు అయితే మూడవది ఇరు జట్లపై ఎంతో వత్తిడి, అభిమానులలో వుత్కంఠను పెంచినట్లుగా ఇప్పుడు అగ్రశ్రేణి రేటింగ్‌ కంపెనీలో మూడవదైన ‘ఫిచ్‌’ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. కారణాలు పైకి ఏం చెప్పినా మూడీస్‌ మన సార్వభౌమ రేటింగ్‌ను చెత్తకు దగ్గరగా వున్న స్ధానాన్ని ఒక మెట్టు పైకి పెంచింది. స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌(ఎస్‌ అండ్‌ పి) మాత్రం గతంలో ఏ స్ధానంలో వుంచిందో దానిని మార్చాల్సినంత సీనేమీ లేదని శుక్రవారం నాడు స్పష్టం చేసింది.ఈ రెండు కంపెనీలు అమెరికావి, మూడవది బ్రిటన్‌ది.

సులభతర వాణిజ్య ర్యాంకును 130 నుంచి 100కు ప్రపంచబ్యాంకు పెంచింది. అలాగే అమెరికాకు చెందిన పూ పరిశోధనా సంస్ధ ఫిబ్రవరిలో చేసిన సర్వే ఫలితాలను నవంబరులో విడుదల చేసి నరేంద్రమోడీకి ఆదరణేమీ తగ్గలేదని, తిరుగులేని నేతని చెప్పింది.విశ్వసనీయ ప్రభుత్వంగా ప్రపంచంలో మోడీ సర్కార్‌ మూడో దేశంగా వుందని 2016లో చేసిన సర్వేలో ఓయిసిడి మరో రాంకు ఇచ్చింది. మూడీస్‌ సంస్ధ చెత్త పక్కన వున్న రాంకును కాస్త ఎగువకు జరిపింది. వాటిని మోడీ భజంత్రీలు ఆయన ఖాతాలో వేసి వీరుడు, శూరుడు అని పొగుడుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలను కలిగి వున్న దేశాలు తీవ్ర సంక్షోభం, వాటి పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయి. మన దేశానికి ఆ సంక్షోభ సెగ తగలటం ప్రారంభమయ్యే సమయంలో నరేంద్రమోడీ అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి మాజిక్‌ చేస్తానని జనాన్ని నమ్మించి సీట్ల రీత్యా తిరుగులేని మెజారిటీ సాధించారు. అలాంటి స్ధితిలో ఎస్‌ అండ్‌ పి వున్న ర్యాంకును కొనసాగించటం తప్ప పెంచే అవకాశం లేదని చెప్పి గాలితీసిందంటే అది దేశద్రోహం అన్నట్లుగా విరుచుకుపడుతున్నారు.

ఇప్పుడున్న స్ధితిలో ఎవరెన్ని ర్యాంకులు ఇచ్చినా, తెచ్చుకున్నా, రాబోయే రోజుల్లో మార్కెట్లో ఇంకా మరికొన్నింటిని జనం ముందు ప్రదర్శించినా స్ధాయి పెంచిన మూడీస్‌గానీ, యథాతధంగా వుంచిన ఎస్‌ అండ్‌పి గానీ లేవనెత్తున్న అంశాలేమిటి? మోడీ భక్తులు దాని గురించి మాట్లాడటం లేదెందుని? దేశంలో నేడున్న పరిస్ధితులలో అనేక కారణాల రీత్యా ప్రజాకర్షణలో నరేంద్రమోడీ మిగతా పార్టీల నేతల కంటే ఎంతో ముందున్న మాట నిజం. చరిత్రలో అనేక మంది నేతలు ఇలాగే ప్రజాకర్షణలో తారాజువ్వల మాదిరి దూసుకుపోయి అంతే వేగంతో పడిపోయిన వారు కూడా లేకపోలేదు. గత మూడున్నర సంవత్సరాలుగా ఇంతగా జనం విశ్వసిస్తున్న దేశ ప్రధానిని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్ధలు ఎందుకు నమ్మటం లేదు అని మోడీ భక్తులు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సంస్ధలకు చట్టబద్దత లేకపోయినా, లొసుగులున్నా, ఎవరు అవునన్నా కాదన్నా ఏ దేశానికైనా రుణం ఇవ్వాలన్నా,పెట్టుబడులు పెట్టాలన్నా ఈ సంస్ధల సిఫార్సులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అందుకే కదా నరేంద్రమోడీ సర్కార్‌ తమ రేటింగ్‌ పెంచమని పైరవీలు కూడా జరిపింది. మరోవైపు అందని ద్రాక్ష పండ్లు పుల్లన అన్నట్లు ఫోజు పెడుతున్నారు.

మీ గురించి కావాలంటే ఎన్ని మెచ్చుకోలు మాటలైనా చెబుతాం గాని ఆ ఒక్కటీ అడగవద్దు అన్నట్లుగా రేటింగ్‌ సంస్ధలు మన దేశం పట్ల వ్యవహరిస్తున్నాయి. గత 14 సంవత్సరాలుగా రేటింగ్‌ను పెంచకపోయినా మేం అప్పులు తెచ్చుకోగలిగాం, అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, గతం కంటే ఇప్పుడు మా రుణభార శాతం తక్కువగా వుంది. మాకంటే ఎక్కువ రుణభారం వారికి మెరుగైన రేటింగ్‌ ఇచ్చారు, అలాంటపుడు మా రేటింగ్‌ ఎందుకు పెంచరు అని నరేంద్రమోడీ సర్కార్‌ గతేడాది మూడీస్‌ సంస్ధను నిలదీసింది. దీనిలో పాక్షిక సత్యం లేకపోలేదు.1991 నుంచి 2016 వరకు మన దేశ జిడిపి-రుణ నిష్పత్తి సగటున 73.42 శాతం వుంది. అంటే మన ఆదాయం 100 అయితే 73.42 అప్పు తీసుకుంటున్నాం. గతేడాది 2016లో ఇది 69.50 శాతం, గత పాతిక సంవత్సరాలలో కనిష్టంగా 1996లో 66, గరిష్టంగా 2003లో 84.20 శాతం నమోదైంది. రెండవ ఘనత బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయికి దక్కింది. ఆయన పాలనలోనే రుణభారం విపరీతంగా పెరిగింది. అంతకు ముందున్న కనిష్ట స్ధాయికి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు నరేంద్రమోడీ హయాంలో అంతకు ముందున్నదాని కంటే ఒక శాతం పెరిగింది. రేటింగ్‌ లేకపోయినా అప్పులు తెచ్చుకుంటున్నాం అంటున్నారు. అది కూడా తిరుగులేని సత్యమే. ముందు అప్పు ఇవ్వండి వడ్డీ మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోండి అంటున్నాం. ముందే చెప్పినట్లు మన అప్పు నూటికి నూరుశాతం స్ధాయికి పెరగలేదు.మిగతా దేశాలకు ఇస్తే వడ్డీ కంటే రెట్టింపునకు పైగా భారత్‌లో వస్తోంది. అందువలన రేటింగ్‌ను పక్కన పెట్టి ఇచ్చినా ఫరవాలేదు, కొంత వడ్డీ పోయినా ఇబ్బంది లేదు అని విదేశీ సంస్ధలు అనుకుంటున్నాయి. రోజువారీ అధిక వడ్డీలకు ఇచ్చే వారు తీసుకొనే వాడి జుట్టు చేతిలో పెట్టుకుంటున్నట్లే అలాంటి రుణాలకు మనం తప్పించుకోలేని షరతులను రుద్దుతాయి.https://tradingeconomics.com/india/government-bond-yield మన దేశం తీసుకొనే రుణాలకు చెల్లించే వడ్డీ (దాన్నే బాండ్‌ రేటు అంటున్నారు) పది సంవత్సరాల బాండ్‌కు దాదాపు 7 శాతం కాగా అదే చైనా 4.04, అమెరికా 2.33, బ్రిటన్‌ 1.25,ఫ్రాన్సు 0.68, జపాన్‌ 0.03 వుండగా మన కంటే ఎక్కువ వడ్డీలు చెల్లించి రుణాలు పొందే దేశాలు బ్రెజిల్‌ 10.09, మెక్సికో 7.26 వున్నాయి. అందువలన అప్పు తీసుకోవటం గొప్ప కాదు, దానిని ఎలా తీరుస్తామనేదే సమస్య.ష్https://thelogicalindian.com/story-feed/opinion/indias-debt-trap-25-of-the-budget-is-spent-on-paying-of-debts/ మనం తీసుకొనే అప్పులకు బడ్జెట్‌లో 25శాతం మొత్తం చెల్లిస్తున్నాము, అదే అమెరికా కేవలం ఆరుశాతమే. మన పాలకులు అప్పులు తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పేది ఒట్టిమాట, పాత అప్పులు, వాటి వడ్డీలు కట్టేందుకే మనం కొత్త అప్పులు తీసుకుంటున్నాం.

రేటింగ్‌ సంస్ధలు దీని గురించే పట్టుబడుతున్నాయి. అనధికారికంగా అధిక వడ్డీలకు ఆశపడి ఎవరైనా అప్పులు ఇచ్చి రిస్కుతీసుకుంటే అది వారి సమస్య, తమ రేటింగ్‌ను బట్టి అప్పు ఇచ్చేవారిని నట్టేట ముంచేందుకు సిద్ధంగా లేమంటున్నాయి ఆ సంస్ధలు. ఎందుకంటే అన్ని దేశాల పరిస్ధితులను అధ్యయనం చేసి తగు సలహాలనిచ్చేందుకు ఆ సంస్ధలు పెద్ద మొత్తంలో మదుపుదార్లనుంచి ఫీజులు వసూలు చేస్తాయి. మన దేశ తలసరి ఆదాయం కనిష్ట స్ధాయిలో వుండటం, రుణభారం పెరుగుతుండటం మదుపుదార్లకు ఆందోళన కలిగించే అంశమే. మూడు సంవత్సరాలలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశానని మోడీ చేసుకుంటున్నది ప్రచారం తప్ప వాస్తవం కాదని చెప్పటమే గత రేటింగ్‌ను యథాతధంగా వుంచటానికి అర్ధం. అంటే మోడీ అభివృద్ధి, సంస్కరణల గాలితీసినట్లే.

గతేడాది చేసిన నోట్ల రద్దు ద్వారా సాధించిన ఫలితాలేమిటో ఏడాది పూర్తయిన సందర్భంగా అయినా మోడీ నోరు విప్పుతారేమోనని ఆశించిన దేశభక్తులను నిరాశపరిచారు. జిఎస్‌టి గురించి ఎలాంటి కసరత్తు, పర్యవసానాల గురించి ఆలోచించకుండా బలవంతంగా అమలు జరపటంతో జరిగిందేమిటో చూస్తున్నాం. ఒక పన్ను పద్దతిని రద్దు చేసి మరొక పన్ను విధానాన్ని ప్రవేశపెట్టటం అంటే తెల్లచొక్కా తీసి వేసి కాషాయ చొక్కా తొడుక్కున్నంత సులభం అన్నట్లుగా చెప్పిన కబుర్లు ఏమయ్యాయి. గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలు, గుజరాత్‌ వ్యాపారులు తీవ్ర నిరసనల కారణంగా జిఎస్‌టిలో మార్పులు చేశారని అందరూ ఎరిగిందే. ఆ పని పూర్తయిన తరువాత తిరిగి రేట్లు పెంచరన్న హామీ ఏముంది. భారత్‌లో పన్ను ఆదాయం తక్కువగా వుందని, దాన్ని పెంచకుండా, తగినంత ఆదాయం లేకుండా అప్పులు ఎలా తీరుస్తారని గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ మన ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నాయి. అందువలన నరేంద్రమోడీ మరింతగా మూసుకోవటం తప్ప నోరు తెరిచే అవకాశం లేదు. నిజానికి మోడీకి వాస్తవాలు తెలియక కాదు, జర్నలిస్టులలో చెప్పింది రాసుకొనే స్టెనోగ్రాఫర్లే కాదు, ఏమిటి, ఎందుకు, ఎలా,ఎవరు, ఎక్కడ అని ప్రశ్నలడిగే నోరున్న వారు కూడా వున్నారు గనుక ప్రధాని పదవి స్వీకరించిన తరువాత మోడీ ఇంతవరకు పత్రికా గోష్టి పెట్టలేదు. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం మనది, అందులోనూ ప్రధాని విధిగా పత్రికా గోష్టి పెట్టాలని ఎక్కడా రాసిలేదు మరి. ఈ విషయంలో గిన్నిస్‌బుక్‌ రికార్డులకు ఎక్కుతారనేది జనాభిప్రాయం.

యధారాజా తధా ప్రజ సామెతలో ప్రజ బదులు సలహాదారులు అని మార్పు చేసుకోవాల్సిన అగత్యం కనపడుతోంది. ఈ మధ్య కాలంలో ప్రధాని, ముఖ్యమంత్రులు పుష్పకవిమానాలను నింపినట్లు తమ కార్యాలయాలను సలహాదారులతో నింపివేస్తున్నారు. వారు తమ ప్రావీణ్యత వున్న రంగాలలో గతంలో ఏం చేశారో తెలియదు గానీ సలహాదారులుగా మారిన తరువాత యజమాని మనసెరిగి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాదంటే వారి వుద్యోగాలుండవు మరి. మహాభారతంలో శకుని మామ గురించి తెలిసినదే. ప్రధాని నరేంద్రమోడీకి బయటి ప్రత్యర్ధులెవరో అందరికీ తెలిసిందే. సమస్య అంతర్గత శక్తులతోనే. అందుకని ఎవరే పాత్ర పోషిస్తున్నప్పటికీ అది ఆ పెద్ద మనిషి స్వయంకృతం. ‘చివరాఖరికి ‘ చెప్పొచ్చేదేమంటే నరేంద్రమోడీ అంతకంటే ఆయనను అనుసరించే గుడ్డి భక్తకోటి రోజు రోజుకూ ఇరకాటంలో కూరుకుపోతున్నారు. దానివలన ఎవరికీ నష్టం లేదు సమస్యల్లా సామాన్య జనం, దేశం అధోగతి పాలు కావటం గురించే.