Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర జింబాబ్వేలో 37 సంవత్సరాల పాటు తిరుగులేని నేతగా వెలిగిపోయిన రాబర్టు ముగాబే(93) రాజీనామాతో అక్కడ మరో అధ్యాయం మొదలైంది. వుపాధ్యక్షుడిగా వుద్వాసనకు గురైన మాజీ గెరిల్లా నేత ఎమర్సన్‌ మంగాగ్వా(75) నవరబరు 24న దేశాధ్యక్షపదవిని చేపట్టారు. ముగాబే అనంతరం జింబాబ్వే పరిణామాలు ఎలా వుంటాయోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిగిలిపోయిన వలసలు, శ్వేతజాతి మైనారిటీ పాలకుల చేతిలో మగ్గిపోయిన దేశాలలో జింబాబ్వే ఒకటి. జాతీయవాదులుగా, తరువాత మార్క్సిస్టులుగా మారి దేశ విముక్తి కోసం ఆయుధాలు పట్టిన సంస్ధలకు నాయకత్వం వహించిన ముగాబే, మంగాగ్వా వంటి వారు అధికారంలోకి వచ్చిన తరువాత చీలికలు పేలికలై అధికార కుమ్ములాటలలో నిమగ్నం కావటం ఏమిటనే ప్రశ్నలు కొంత మందిలో తలెత్తుతున్నాయి. సుదీర్ఘరాజకీయ, అధికారిక బాధ్యతల్లో వున్న ముగాబే ఏ జనం చేత జేజేలు కొట్టించుకున్నారో వారి చేతే అధికారపు చివరి రోజుల్లో ఛీ ఛీ అనిపించుకోవటం నిజంగా ఒక విషాదమే. ఒక జాతీయవాది, ఒక మార్క్సిస్టు ఇలా దిగజారిపోతే మిగతా నేతలకు వీరికి తేడా ఏమిటి, ఎవరిని చూసి స్ఫూర్తి పొందాలి అనే నిర్వేదం కొంత మందిలో కలగటం సహజం.1924 ఫిబ్రవరి 21న ఒక కార్పెంటర్‌ కుటుంబంలో జన్మించిన ముగాబే విద్యాభాస అనంతరం ఒక టీచర్‌గా 1945లో జీవితం ప్రారంభించారు. టీచర్‌గా వుండగానే దక్షిణాఫ్రికాలోని పోర్ట్‌ హరే విశ్వవిద్యాలయంలో బిఏ చదివేందుకు స్కాలర్‌షిప్పు రావటంతో 1949 నుంచి 52వరకు అక్కడ వున్నారు. ఆ క్రమంలోనే ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టుపార్టీలతో సంబంధాలు ఏర్పడ్డాయి. తిరిగి స్వదేశం చేరుకొని టీచర్‌ వృత్తిలో చేరారు.1960దశకం ప్రారంభంలో జాతీయోద్యమంలో భాగస్వామి అయ్యారు.1980లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రధానిగా, తరువాత అధ్యక్షుడిగా 37 సంవత్సరాలు పదవిలో వున్నారు.

ఆఫ్రికా ఖండంలో వలసపాలకులకు వ్యతిరేకంగా సాగిన వుద్యమాలలో జాతీయవాదులు,కమ్యూనిస్టులు కలసి పోరాడటం ఒక ప్రత్యేక పరిణామంగా కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టుపార్టీ, కొసాటు(కార్మిక సంఘాల సమాఖ్య) శ్వేతజాతి దురహంకార పాలనకు వ్యతిరేకంగా జరిపిన సమిష్టి పోరాటం ఆ ప్రాంత దేశాల జాతీయోద్యమాలను ఎంతగానో ప్రభావితం చేసింది. 1990దశకం ముందు వరకు( సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేయనంత వరకు) ఒక మార్క్సిస్టు-లెనినిస్టుగా వర్ణించుకున్న ముగాబే తరువాత ఒక సోషలిస్టును అని, తాను అనుసరించే విధానాలను ముగాబేయిజంగా చెప్పుకున్నాడు.పదవి నుంచి దిగిపోయే నాటికి ఒక ప్రజావ్యతిరేకిగా తేలాడు.

ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలలో అనేక మంది నేతలు ఇలా మారిపోవటం, చరిత్ర చెత్తబుట్టలోకి జారిపోవటం కనిపిస్తుంది. ఈ పరిణామాలను జీర్ణించుకోవటం కాస్త కష్టమే, ఆయా దేశాలలో పురోగామి శక్తులకు నష్టం జరిగినప్పటికీ ఎత్తిన జండా దించని అభ్యుదయగాములు ఎందరో వున్నారు. పరిస్ధితులకు అనుగుణ్యంగా వుద్యమాలు నివురు కప్పిన నిప్పులా వున్నాయి. ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో తలెత్తిన మితవాద, అతివాద ధోరణులతో పాటు జాతీయవాద నాయకత్వాలపై నయా వుదారవాద ధోరణుల ప్రభావం వంటి అనేక అంశాలు ముగాబే వంటి వారు దిగజారిపోవటానికి కారణమయ్యాయి. ఏ కారణం, ఎక్కడ ఎంత ప్రభావం చూపిందనేది ఆయా దేశాల నిర్ధిష్ట పరిస్ధితులు, ధోరణులను కూలంకషంగా అధ్యయనం చేస్తే తప్ప చెప్పలేము. వుదాహరణకు దక్షిణాఫ్రికా అధికార కూటమిలోని ఎఎన్‌సి, కమ్యూనిస్టుపార్టీ, కార్మిక సంఘాల సమాఖ్యలకు చెందిన వారు ఎఎన్‌సి అభ్యర్ధులుగానే పార్లమెంట్‌కు ఎన్నికవుతున్నారు. జాతీయోద్యమంలో కలసి పని చేసిన శక్తులు స్వాతంత్య్రం రాగానే ఎవరిదుకాణాన్ని వారు ఏర్పాటు చేసుకోవటం చూశాము. కానీ దక్షిణాఫ్రికాలో గత 23 సంవత్సరాలలో జరిగిన ఐదు ఎన్నికలలో కూటమి ఐక్యంగా వుండటం ఒక విశేషం. అయితే అదే దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా పనిచేసిన సంస్ధలకు కమ్యూనిస్టులు, కాని వారు కూడా నాయకత్వం వహించారు. కమ్యూనిస్టులుగా ముద్రపడిన వారు అనేక మంది అక్కడ కమ్యూనిస్టులతో విబేధించటం చూస్తున్నాము.నెల్సన్‌ మండేలా తరువాత అధ్యక్షుడిగా ఎన్నికైన తాబో ఎంబెకీ, తరువాత ప్రస్తుత అధ్యక్షుడు జాకబ్‌ జుమా కూడా కమ్యూనిస్టులుగా వున్నవారే. కానీ వారిద్దరూ కమ్యూనిస్టు పాలకుల మాదిరి వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం జాకబ్‌ జుమా-కమ్యూనిస్టుపార్టీ మధ్య తీవ్ర విబేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు పార్టీ మంత్రి ఒకరిని మంత్రి వర్గం నుంచి తొలగించారు. జుమాను తొలగించాలని కమ్యూనిస్టుపార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఇదే సమయంలో ఎవరు అధ్యక్షులుగా వున్నప్పటికీ దక్షిణాఫ్రికా పాలక కూటమి మొత్తంగా నయా వుదారవాద విధానాల ప్రభావంలోకి పోయిందనే విమర్శలు కూడా లేకపోలేదు. దక్షిణాఫ్రికా ఎఎన్‌సి నుంచి స్ఫూర్తి పొంది రంగంలోకి వచ్చిన జింబాబ్వే నాయకత్వంలో అలాంటి ఐక్యత కానరాదు, ముగాబేతో విబేధించిన వారిని రాజకీయంగా, ఇతరంగా కూడా అణచివేశారనే విమర్శలు లేకపోలేదు. వీటికితోడు నయావుదారవాద విధానాలతో పూర్తిగా దేశాన్ని సర్వనాశనం చేశారనే విమర్శలు వచ్చాయి.

జింబాబ్వే తాజా పరిణామాలలో చైనా పాత్ర గురించి కొంత మంది కమ్యూనిస్టులుగా చెప్పుకొనే వారు(నక్సల్స్‌) తప్పుడు ప్రచారానికి దిగారు. గతంలో అలాంటి బాపతే సోవియట్‌ను సోషల్‌ సామ్రాజ్యవాదిగా వర్ణించిన విషయాన్ని మరచిపోరాదు. జింబాబ్వే విముక్తి పోరాటంలో పాల్గన్న శక్తులు, సంస్ధలకు నాటి సోవియట్‌ యూనియన్‌, చైనా కూడా ఆయుధాలతో సహా అన్ని రకాల సాయం అందించాయి. 1960దశకంలో ముగాబే నాయకత్వంలోని శక్తులు చైనా సాయం తీసుకున్నాయి, అక్కడ శిక్షణ కూడా పొందాయి. అలాంటి వారిలో ప్రస్తుత అధ్యక్షుడు మంగాగ్వా ఒకరు.రొడీషియాగా పిలిచిన జింబాబ్వేలో శ్వేత జాతి దురహంకారపాలనను శాశ్వతం కావించేందుకు, అక్కడున్న తమ పెట్టుబడులను కాపాడుకొనేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం 1965లో ఏకపక్షంగా స్వాతంత్య్రం ప్రకటించింది. అప్పటి వరకు అక్కడ పోరాడుతున్న శక్తులకు సోవియట్‌ సాయం అందించింది. స్వాతంత్య్రప్రకటన అనంతరం పోరాట సంస్ధలలో తలెత్తిన నూతన ఆలోచనల్లో భాగంగా గెరిల్లా పోరాటం జరిపేందుకు చైనా సాయం కోరాలని కొందరు నిర్ణయించుకొని ఆమేరకు మద్దతుతీసుకున్నారు. అందువలన ఇటీవలి కాలంలో చైనా కంపెనీలు పెట్టిన పెట్టుబడులను రక్షించుకొనేందుకు ముగాబేకు వ్యతిరేకంగా సమీకృతమైన శక్తులకు చైనా మద్దతు ఇచ్చిందని, సైనిక జనరల్‌ చైనా పర్యటన జరిపిన తరువాత సైన్యం జోక్యం చేసుకున్నదని ప్రచారం చేస్తున్నారు. సైనికజనరల్‌ నవంబరు 8,9 తేదీలలో చైనా పర్యటించారు. ఏడవ తేదీన మంగాగ్వాను ముగాబే పదవీచ్యుతుని కావించారు. అంటే జనరల్‌ చైనా ప్రయాణంలో వుండగా అది జరిగింది. అందకు కొద్ది నెలల ముందే మంగాగ్వాకు మద్దతు ఇచ్చే వారిగా అనుమానిస్తున్న జనరల్‌ చివెంగాతో సహా అనేక మంది సైన్యాధికారులకు వుద్వాసన పలికేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. దీనంతటికీ కారణం ముగాబే భార్య గ్రేస్‌ను వుపాధ్యక్షరాలుగా నియమించేందుకు పూనుకోవటం, ఆచర్యను వ్యతిరేకించే రాజకీయ, మిలిటరీ అధికారులకు వుద్వాసన పలకటం అనే ప్రమాదకర ఆలోచనలోకి ముగాబే వెళ్లినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. తన స్ధానంలో తన భార్యను గద్దెనెక్కించేందుకు పూనుకోవటం, విబేధించిన వారిపై చర్యలకు పూనుకోవటమే తాజా పరిణామాలకు మూలంగా కనిపిస్తోంది.Image result for mnangagwa swearing

సైన్యాధికారులకు చైనా కంపెనీలలో వాటాలు వున్నట్లు వూహాగానాలు తప్ప నిర్ధారణగా ఎలాంటి ఆధారాలు ఇంతవరకు బయటకురాలేదు. విదేశీ కంపెనీలలో స్వదేశీ సంస్ధలకు వాటాల గురించి ముగాబే సర్కార్‌ తీసుకున్న విధానానికి అనుగుణంగా ఎవరైనా బినామీలుగా కంపెనీలలో వాటాలు కలిగి వుండటాన్ని కాదనలేము. కానీ ముగాబే వుద్వాసనకు అదే అసలైన కారణాలని చెప్పలేము. ఎందుకంటే చైనా పెట్టుబడులకు ముగాబే వ్యతిరేకమేమీ కాదు. ఆ మాటకు వస్తే తన మార్కెట్‌ను, రాజకీయ సంబంధాలను పెంచుకొనే క్రమంలో ఇటీవలి సంవత్సరాలలో చైనా ఆఫ్రికాపై దృష్టి సారించింది. అమెరికా, ఐరోపాలతో తన వాణిజ్య మిగులను అక్కడ పెట్టుబడులుగా అందచేస్తోంది. అదేమీ రహస్యం కాదు. చైనాను రాజకీయంగా వంటరిపాటు చేసేందుకు అమెరికా తన మిలిటరీ, రాజకీయ, ఆర్ధిక శక్తులను వుపయోగించి ప్రపంచ దేశాలను ప్రభావితం చేయటం నిరంతరం కొనసాగిస్తుండగా దానికి వ్యతిరేకంగా, తనను తాను కాపాడుకొనేందుకు తన వ్యూహాన్ని చైనా అమలు జరుపుతున్నది. ఒకే దేశం-రెండు వ్యవస్ధలు అనే విధానం కింద హాంకాంగ్‌, మకావో దీవులలో వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధను, కంపెనీలను 2050 వరకు కదలించేది లేదని వాటి విలీనం సందర్భంగా చైనా కమ్యూనిస్టు పార్టీ హామీ ఇచ్చింది. అందువలన జింబాబ్వేలో లేదా ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టే చైనా కంపెనీలన్నీ చైనా ప్రధాన భూభాగానికి చెందినవే కానవసరం లేదు.

దేశియం పేరుతో ముగాబే సర్కార్‌ ఆమోదించిన విధానాల ప్రకారం విదేశీ కంపెనీలు తమ వాటాను 49శాతానికి పరిమితం చేసి 51శాతం జింబాబ్వియన్లకు కేటాయించాలి.ఈ విధానాన్ని స్వదేశీ బూర్జువాశక్తులు తమకు అనుకూలంగా మార్చుకొని దేశాన్ని గుల్లచేశారు. తాను సామ్రాజ్యవాదానికి,పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం అని ముగాబే చెప్పుకున్నప్పటికీ ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరించారు.1991 నుంచి నయావుదారవాద విధానాలను అమలులోకి తెచ్చారు. నూతన అధ్యక్షుడు మంగాగ్వా రాజీనామా చేసిన ముగాబేతో విధానాలపరంగా విబేధించినట్లు కనపడదు. తమ, తమ మద్దతుదార్ల గురించి తలెత్తిన సమస్యలతో వచ్చిన కుమ్ములాటలుగానే వున్నాయి. ఇంతవరకు మంగాగ్వా తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దానికంటే దేశాన్ని దివాలా తీయించిన విధానాల మార్పు గురించి ఇంతవరకు సూచన ప్రాయంగా కూడా వెల్లడించలేదు.