Tags

, , , ,

మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ యుఎంఎల్‌ అధ్యక్షుడు కెపి శర్మ ఓలీ

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కమ్యూనిస్టులకు ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో నేపాల్‌ కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు.ఒక నాడు ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా ప్రకటించిన నేపాల్‌లో అన్ని మతాలకు సమాన గుర్తింపు నిచ్చే లౌకిక, ప్రజాస్వామ్య నూతన రాజ్యాంగం రచనలో కమ్యూనిస్టులు భాగస్వాములు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన స్ధానాలలో మూడింట రెండు వంతులపైగా మెజారిటీ ఇప్పటికే సాధించారు. దామాషా స్ధానాలను కలిపినపుడు కూడా అదే మెజారిటీ పొందే అవకాశాలున్నాయి. కమ్యూనిస్టులే సంపూర్ణ మెజారిటీతో ఏర్పాటు చేసే ప్రభుత్వం నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాతే ఇదే ప్రధమం. నవంబరు 26, డిసెంబరు ఏడవ తేదీన రెండు విడతలుగా 275 సీట్లకు జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టుల విజయం హిమాలయ దేశంపై ఆసక్తి చూపుతున్న అన్ని దేశాలలో ముఖ్యంగా కమ్యూనిస్టులు అధికారానికి రావద్దని కోరుకుంటున్న వారిలో వేడిపుట్టించిందంటే అతిశయోక్తికాదు.

పార్లమెంట్‌లోని 275 స్ధానాలు ఏడు రాష్ట్రా( ప్రాంతాలు)లలో విస్తరించి వున్నాయి. వాటిలో 165 నియోజకవర్గాలకు మనదేశంలో మాదిరి ప్రత్యక్ష ఎన్నికలు, 110 స్ధానాలకు పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి దామాషా పద్దతిలో ఎన్నికలు జరిగాయి.  165కు గాను 116 చోట్ల కమ్యూనిస్టులు విజయం సాధించారు. మొత్తం ఓట్లు లెక్కింపు పూర్తి అయిన తరువాత పదిహేనవ తేదీన దామాషా ప్రాతిపదికన వచ్చిన సీట్లను పార్టీలకు కేటాయిస్తారు. బుధవారం నాటికి జరిగిన లెక్కింపు వివరాల మేరకు దామాషా ఓట్లలో నేపాలీ కమ్యూనిస్టుపార్టీ యుఎంఎల్‌ 35.35శాతం ఓట్లతో ముందుండగా నేపాలీ కాంగ్రెస్‌ 33.62శాతంతో రెండవ స్ధానంలో, 13.63 శాతంతొ మావోయిస్టు సెంటర్‌ మూడవ స్ధానంలో కొనసాగుతోంది. మరో మూడు పార్టీలు సాధించాల్సిన కనీస మూడుశాతం కంటే ఎక్కువ తెచ్చుకొని దామాషా సీట్లలో ప్రాతినిధ్యం పొందనున్నాయి. మొత్తం స్ధానాలలో 33శాతం మహిళలకు కేటాయించారు. ఏడు ప్రాంతాల శాసనసభకు జరిగిన ఎన్నికలలోనూ నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ యుఎంఎల్‌ అభ్యర్ధులు ఆరు చోట్ల మెజారిటీలో వున్నారు. ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. రాష్ట్రాల శాసన సభలలో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల స్ధానాలలో యుఎంఎల్‌ 166,మావోయిస్టు సెంటర్‌ 73, నేపాలీ కాంగ్రెస్‌ 45, ఇతర పార్టీలు 45 తెచ్చుకున్నాయి. దామాషా సీట్లకు గాను నమోదైన పార్టీలు కనీసంగా ప్రతి రాష్ట్రంలో 1.5శాతం ఓట్లు తెచ్చుకుంటే ప్రాతినిధ్యం పొందుతాయి.

మావోయిస్టు సెంటర్‌ నేత ప్రచండ

తమ కూటమి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందనే విశ్వాసాన్ని ఎన్నికల ముందు వ్యక్తపరచిన యుఎంఎల్‌ నాయకుడు కెపి శర్మ ఓలీ మాటలను అతిశయోక్తిగా వర్ణిస్తూ మహా అయితే స్వల్ప మెజారిటీ సాధించవచ్చునేమో అని అనేక మంది కొట్టిపారేశారు. మావోయిస్టులు అధికారంలో కొనసాగుతూనే ప్రతిపక్షంలో వున్న యుఎంఎల్‌ పార్టీతో అవగాహనకు రావటంపై సహజంగానే వుభయ పార్టీలలో కొంత అసంతృప్తి రేపింది. సీట్లు కోల్పోయిన వారు, రాని వారు కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తారేమోనని సందేహించారు. కమ్యూనిస్టు పార్టీల మధ్య అవగాహనను దెబ్బతీసేందుకు మావోయిస్టు సెంటర్‌ నేత ప్రచండకు చివరి క్షణంలో నేపాలీ కాంగ్రెస్‌నేతలు ప్రధాని పదవిని ఎరవేసినా ఆశ్చర్యం లేదని కొందరు వూహించారు. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కమ్యూనిస్టులు విజయకేతనం ఎగుర వేశారు. మూడింట రెండువంతుల కంటే ఎక్కువగా సీట్లను పొందారు.

అక్టోబరు రెండవ తేదీన నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(యుఎంఎల్‌) నేపాలీ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు సెంటర్‌) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 60:40 దామాషా పద్దతిలో రెండు పార్టీలు పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత పార్టీల ఐక్యతా క్రమాన్ని ప్రారంభిస్తారు. యుఎంఎల్‌ పార్టీ 80, మావోయిస్టు సెంటర్‌ 36 సీట్లు గెలుచుకుంది. రద్దయిన పార్లమెంటులో పెద్ద పార్టీగా వున్న నేపాలి కాంగ్రెస్‌కు 23, ఇతర పార్టీలకు 26 సీట్లు వచ్చాయి. మావోయిస్టు సెంటర్‌ నుంచి విడిపోయి నయాశక్తి పార్టీ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని బాబూరామ్‌ భట్టారాయ్‌ని తమ గుర్తుపై పోటీ చేసేందుకు మావోయిస్టు సెంటర్‌ నిరాకరించింది. దాంతో ఆయన నేపాలీ కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చి పార్లమెంటుసీటులో విజయం గెలిచారు. వచ్చిన వార్తలను బట్టి యుఎంఎల్‌ పార్టీ అధ్యక్షుడు కెపి శర్మ ఓలి ప్రధానిగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. నేపాల్‌ నూతన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన 30 రోజుల లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వుంది. ఎన్నికల తరువాత రెండు పార్టీల విలీనం జ రుగుతుందని గతంలో ప్రకటించారు.

. రాచరిక వ్యవస్ధ అంతరించిన తరువాత నేపాల్‌ రాజకీయ అవనికపై నేపాలీ కాంగ్రెస్‌, యుఎంఎల్‌, మావోయిస్టు సెంటర్లే ప్రధాన పాత్ర పోషించాయి. వాటి మధ్యే సంకీర్ణ కూటమి అవగాహనలు కుదిరాయి, ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి, విడిపోయాయి. అందువలన వైఫల్యాలకు మూడు పార్టీలను బాధ్యులను చేయాల్సి వుంటుంది. అసలే పేద దేశం దానికి తోడు దశాబ్దాల పాటు ఫూడల్‌ రాచరిక వ్యవస్ధలో ప్రజాస్వామ్యం, ఎలాంటి అభివృద్ధి లేని దేశంలో రాచరికానికి వ్యతిరేకంగా దీర్ఘకాలం సాగిన అంతర్యుద్ధం, అది ముందుకు తెచ్చిన అంశాలు, వేర్పాటు వాదం వంటి సమస్యలు నూతన ప్రభుత్వం ముందున్నాయి.చైనాతో సన్నిహిత సంబంధాలతో పాటు ఆ దేశ పెట్టుబడులను ఆహ్వానించాలని కమ్యూనిస్టులు కోరుకుంటున్న కారణంగానే జలవిద్యుత్‌ ప్రాజక్టుల వంటివి ఆలశ్యమయ్యాయని విమర్శకులు ఆరోపించారు. అదే సమయంలో నేపాలీ కాంగ్రెస్‌కు గతంలో భారత్‌తో వున్న సంబంధాల కారణంగా భారత్‌తో స్నేహంగా వుండాలనే వైపు మొగ్గు చూపారని కూడా విశ్లేషకులు పేర్కొన్నారు.

రాచరిక వ్యవస్ధ కూలిపోయిన తరువాత ఏర్పడిన అనేక సంకీర్ణ ప్రభుత్వాలు, భాగస్వామ్య పక్షాల మధ్య తలెత్తిన సమస్యలు, నూతన రాజ్యాంగంపై ఏర్పడిన ప్రతిష్ఠంభన, కొన్ని ప్రాంతాలలో వ్యతిరేకత వ్యక్తం కావటం, ఇరుగు పొరుగు దేశాలజోక్యం, ప్రభావం,పేదరికం, దారిద్య్రం, ప్రజల ఆకాంక్షల వంటి అనేక సమస్యలు నూతన ప్రభుత్వం ముందున్నాయి. ఈ పూర్వరంగంలో నూతన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగటమే ఒక ముఖ్యాంశంగా చెప్పాల్సి వుంటుంది. రిపబ్లికన్‌, ఫెడరల్‌ లక్షణాలతో కూడిన నూతన రాజ్యాంగాన్ని 2015 సెప్టెంబరులో ఆమోదించారు. 2018జనవరిలోగా కొత్త రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాలన్నది ఆదేశం. రద్దయిన పార్లమెంట్‌లో అధికార కూటమిలో వున్న నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు సెంటర్‌) ప్రధాన ప్రతిపక్షంగా వున్న నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(యుఎంఎల్‌)తో అవగాహనకు రావటం దేశ రాజకీయాలలో నూతన వుత్తేజాన్ని నింపటంతో పాటు ప్రజామోదం పొందినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.

ఎన్నికలకు ముందు నేపాల్‌లో కొన్ని ఆసక్తికర పరిణామాలు సంభవించాయి. నేపాలీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వంలో మావోయిస్టు సెంటర్‌ భాగస్వామి. దాని మంత్రులు రాజీనామా చేయకుండానే ప్రతిపక్ష యుఎంఎల్‌ పార్టీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. దీంతో నేపాలీ కాంగ్రెస్‌ దేశంలోని కమ్యూనిస్టేతర పార్టీలన్నింటినీ ప్రభుత్వంలోకి ఆహ్వానించటమే గాక కొత్త మంత్రులను కొందరిని చేర్చుకొని వారికి మావోయిస్టు మంత్రుల శాఖలను కేటాయించారు. రాచరిక వ్యవస్ధను సమర్ధించే రాష్ట్రీయ ప్రజాతంత్రపార్టీ, మధేశీపార్టీల వంటి వాటిని చేరదీశారు. అయితే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా వాటి మధ్య ఐక్యత కానరాలేదు. మధేశీ పార్టీలలో ఒకటైన ఎన్‌డిఎఫ్‌ మాత్రమే నేపాలీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఎన్నికల ప్రచార తీరు తెన్నులను చూస్తే కమ్యూనిజమా లేక ప్రజాస్వామ్యమా అన్న పద్దతిలో మార్చివేసిన కమ్యూనిస్టేతర పార్టీలు దేశంలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టచూశాయి. ఇదే సమయంలో ఎన్నికలను విచ్చిన్నం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. అసంతృప్తి చెందిన మావోయిస్టులు, ఇతరులు కొందరు కొన్ని చోట్ల బాంబుల దాడులు కూడా జరిపారు. కొన్ని చోట్ల సైన్యాన్ని దింపాల్సి వచ్చింది. మొత్తం మీద ఎన్నికలు జరగటం ఒక విశేషంగానే పరిశీలకులకు కనిపించింది.

మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ యుఎంఎల్‌ అధ్యక్షుడు కెపి శర్మ ఓలీ విజయోత్సవ సభలో మాట్లాడుతూ ప్రజలు మా కార్యక్రమాన్ని ఆమోదించారు. వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు అభివృద్ధికోసం ప్రతిపక్షాలను కూడా కలుపుకుపోతాం, దేశాభివృద్ధికి ఏకాభిప్రాయం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదన్నారు. ఇతర శక్తులను విమర్శించే లేదా నిందించే రోజులు పోయాయి, ఇప్పుడు దేశం స్ధిరత్వాన్ని చూడనుంది, మేం అభివృద్ధి గురించి తప్ప రాజకీయాలు మాట్లాడబోం అన్నారు.పార్లమెంటరీ మెజారిటీ సాధించటంతోనే స్ధిరత్వం రాదని అభివృద్ధి, సంపదల సృష్టికి నేతలు సుముఖత చూపితేనే సాధ్యమని చెప్పారు.

ఎన్నికల తరువాత దేశం రాజకీయ స్ధిరత్వం మరియు అభివృద్ధి బాటలో ప్రవేశించిందని మావోయిస్టు సెంటర్‌ అధ్యక్షుడు పుష్ప కమాల్‌ దహాల్‌( ప్రచండ) వ్యాఖ్యానించారు.చిటవాన్‌ మూడవ నంబరు పార్లమెంటరీ స్ధానం నుంచి విజయం సాధించిన సందర్భంగా ఎన్నికల సంఘ అధికారి ధృవీకరణ పత్రం అందచేసే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రచండ పాల్గన్నారు. దేశం ఇంకేమాత్రం గందరగోళ పరిస్ధితులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని వామపక్ష కూటమికి ప్రజలిచ్చిన బాధ్యతను వమ్ముకానివ్వబోమని చెప్పారు. ఈ విజయం ప్రపంచవ్యాపితంగా వివిధ కారణాలతో నీరసపడి వున్న పురోగామివాదులు, కమ్యూనిస్టులలో ఎంతో వుత్సాహాన్ని నింపుతుందని వేరే చెప్పనవసరం లేదు.