Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

గుజరాత్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎలాగైతేనేం అక్కడ మా మోడీ విజయం సాధించాడా లేదా అని బుర్రలో గాక మరెక్కడో మెదళ్లున్నవారు చేసే వాదనలు పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే అలాంటి అలగా తరగతి ఎప్పుడూ అన్ని పాలకవర్గ పార్టీల వెనుకా వుంటుంది. ఇలాంటి వారు నిజంగా ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే శక్తులకు వుత్తేజమిస్తుంటారు. తాము అధికారంలోకి వస్తే, విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి బ్యాంకు ఖాతాల్లో తలా పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నట్లుగా ఎన్నికల ప్రచారంలో జనాన్ని నమ్మించారు. ఇదేమిటయ్యా అమిత్‌ షా అని ఎన్నికల తరువాత అడిగితే ఎన్నికల జుమ్లా , ఓట్ల కోసం అనేకం చెబుతుంటాం అని చిరునవ్వు నవ్వేశాడు. గుజరాత్‌లో ఈసారి తమకు 150 సీట్లు వస్తాయని ఆ పెద్దమనిషే ప్రచారం చేశాడు. అవెక్కడ అంటే జుమ్లా అని మరోసారి నవ్వేస్తారు. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు సందర్భంగా కొన్ని గంటల పాటు బిజెపి నేతలకు ముచ్చెమటలు పట్టాయి.

సంఘపరివార్‌ ప్రయోగశాల గుజరాత్‌. గత రెండు దశాబ్దాలుగా మైనారిటీల వ్యతిరేక, మెజారిటీ అనుకూల మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓటు బ్యాంకును తయారు చేసేందుకు అది చేయని అవాంచనీయ చర్యలు లేవు.అలాంటి చోట కూడా బిజెపి చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా స్వల్పమెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంది. సమగ్ర విశ్లేషణలకు సమాచారం ఇంకా అందుబాటులోకి రావాల్సి వుంది. పూర్తిగా పట్టణ లేదా లేదా అత్యధిక భాగం పట్టణ ఓటర్లున్న 53 నియోజకవర్గాలలో బిజెపి 45చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 129 గ్రామీణ నియోజకవర్గాలలో 72 చోట్ల గెలిచింది. మతోన్మాదం పట్టణాలలో ఎక్కినంతగా గ్రామీణంలో ఎక్కదని, ఎక్కినా వ్యవసాయ సంక్షోభంలో తమకు మతం వండి వార్చేదేమీ వుండదని గ్రామీణులు గ్రహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదొక మంచి సంకేతం. పట్టణ ప్రాంతాలలో కూడా బిజెపి సీట్లు తెచ్చుకున్నప్పటికీ దాని ఓట్లు 2014తో పోల్చితే పదకొండు శాతం వరకు తగ్గాయి. ఈ పరిణామం కూడా బిజెపి ఆందోళన కలిగించేదే. మొత్తం మీద చూసినపుడు లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే బిజెపి ఓట్లు 10.2 నుంచి 10.9 మధ్య తగ్గగా ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఓట్లు 6.2 నుంచి 10.8శాతం వరకు పెరిగాయి. అంటే బిజెపికి తగ్గిన ఓట్లు పూర్తిగా కాంగ్రెస్‌కు పడలేదు.

ఒక నమూనా రాష్ట్రంగా అభివృద్ధి చేశానని చెప్పుకున్న చోటే నరేంద్రమోడీ ఆ విషయం మినహా మిగతా విషయాలన్నీ ముందుకు తెచ్చారు. కాంగ్రెస్‌ నేత నీచ్‌ కిసామ్‌కా ఆద్మీ( నీచపు పనులు చేసే వ్యక్తి) అని చేసిన వ్యాఖ్యకు కాళిదాసు కవిత్వానికి తన పైత్యాన్ని జోడించినట్లుగా గుజరాత్‌లో అత్యధికంగా చదివే గుజరాత్‌ సమాచార్‌ పత్రిక ‘మోడీ నీచ్‌ జాతినో మానాస్‌ ఛే (ఒక తక్కువ కులంలో పుట్టిన మోడీ) అన్నట్లుగా కులాన్ని, మోడీ పేరును జతచేసి మొదటి పేజీలో సంచలనాత్మకంగా ప్రకటించి చివరి క్షణంలో బిజెపికి మేలు చేసింది. కీలక సమయాల్లో మీడియా ఎలాంటి పాత్ర పోషించగలదో ఈ ఎన్నికలు నిరూపించాయి. బిజెపి, మోడీ మీద కోపంతో ఓటర్లు మరొక ప్రత్యామ్నాయం లేదు కనుక కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు తప్ప నిజానికి కాంగ్రెస్‌ మీద అభిమానం కలగటానికి ఒక ప్రతిపక్షంగా గత రెండు దశాబ్దాలలో అక్కడ అది చేసిందేమీ లేదు. ఈ పూర్వరంగంలో గుజరాత్‌ ఎన్నికల ఫలితాల పర్యవసానాలు ఎలా వుంటాయి అన్నది చర్చనీయాంశంగా ముందుకు వస్తోంది.

బిజెపికి పోటీగా మరో పార్టీలేని చోట్ల తమవైపు తిరిగి ఓటర్లు మొగ్గుతారని కాంగ్రెస్‌లో ఆశలు రేగుతాయి. అనేక పార్టీలున్న చోట్ల ఎవరికి వారే తామే ప్రత్యామ్నాయంగా ఓటర్ల ముందుకు వచ్చేందుకు కాంగ్రెసేతర పార్టీలు పోటీ పడతాయి. కాంగ్రెస్‌ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా వున్న చోట్ల ఆప్‌, బిఎస్‌పి వంటి పార్టీలు దెబ్బతింటాయి. ఓటర్లు తమకు ఇష్టం వున్నా లేకపోయినా బిజెపిపై తలెత్తిన అసంతృప్తితో నిఖరంగా ఆ పార్టీని ఓడించగల శక్తివైపే మొగ్గు చూపవచ్చు.ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న చోట్ల కాంగ్రెస్‌ పరిస్ధితి ఇప్పుడున్న మాదిరే వుండవచ్చు లేదా దిగజారవచ్చు. అటు కాంగ్రెస్‌ లేదా బిజెపి బలంగా లేని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల ఇప్పటి వరకు బిజెపితో అంటకాగిన లేదా బిజెపి పంచన చేరాలని చూస్తున్న పార్టీలలో పునరాలోచన మరింత తీవ్రంగా జరగవచ్చు. ప్రాంతీయ పార్టీలను మింగి తాను ఎదగాలని బిజెపి చూస్తున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల గుజరాత్‌ ఫలితాలు బిజెపిని ఇరుకున పెడతాయి.శివసేన, తెలుగుదేశం వంటి పార్టీలు నష్ట నివారణ చర్యలకు దిగుతాయి, సమయం వచ్చినపుడు, వాటంగా వుంటే బిజెపిని వదలిపోయినా ఆశ్చర్యం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి తాను బలపడేందుకు అటు తెలుగుదేశం, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏది వాటంగా వుంటే దానితో వుండేందుకు గల అవకాశాలను చూస్తున్నది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను నిరాకరించిన బిజెపి దాని కంటే మెరుగైన ప్రత్యేక పాకేజీ ఇస్తామని చెప్పి దానికి కూడా మొండి చేయి చూపింది. పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి అటు తెలుగుదేశం పార్టీ ఇటు బిజెపి ఎవరి నాటకాన్ని వారు బాగారక్తి కట్టిస్తున్నారు. ఒక వేళ బిజెపి తో తెగతెంపులు చేసుకొంటే రాష్ట్రానికి బిజెపి చేసిన ఈ ద్రోహాలను జనం ముందు పెట్టి తెలుగుదేశం ఒంటి కంటితో( ఎందుకంటే చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం ప్రకారం మరో కన్ను తెలంగాణా కనుక ఆయనకు మిగిలింది మరొకటి మాత్రమే అనే అవగాహనతో) ఏకధారగా నీరు గార్చి ఓటర్ల ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకొని ముందస్తు ఎన్నికలకు పోవాలని ఆలోచన చేస్తున్నారన్నది బలంగా వినిపిస్తున్న వార్తలు. ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విషయానికి వస్తే గుజరాత్‌ ఫలితాలు జగన్‌లో ముఖ్యమంత్రి పీఠంపై మరింతగా ఆశలు పెంచవచ్చు. ఒక ప్రతిపక్షంగా విఫలమైనప్పటికీ గుజరాత్‌ ఓటర్లు బిజెపి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో వున్న ప్రధాన ప్రతిపక్షం తామే గనుక తమ మీద ఇష్టం వున్నా లేకపోయినా చంద్రబాబు మీద వ్యతిరేకతతో జనం ఓట్లు వేస్తారనే ఆశలు కలగవచ్చు.

ఇక బిజెపి విషయానికి వస్తే అన్ని పార్టీల కంటే గుజరాత్‌లో గెలిచిన సంతోషం కంటే దాని పర్యవసానాల గురించి ఆందోళన పెరగటం ఖాయం. పార్టీలో నరేంద్రమోడీ ఏకపక్ష వైఖరితో ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న శక్తులు మరింతగా దాడిని పెంచుతాయా లేక మొదటికే మోసం వస్తే ఎలా అని సర్దుబాటు చేసుకుంటాయా అన్నది ఒక అంశం. అధికారమే పరమావధిగా వుండే పాలకపార్టీలలో అత్యధిక సందర్భాలలో బాధితులు రాజీపడిన సందర్భాలు తక్కువ. గ్రామీణుల ఆదాయాలను రెట్టింపు చేసి అదనంగా అన్న వస్త్రాలను అంద చేస్తామని చెప్పిన నరేంద్రమోడీ విధానాలు వున్న వస్త్రాలను కూడా లాగివేస్తున్నాయి. లోకసభ ఎన్నికల నిర్దిష్ట గడువు వరకు పరిస్ధితి ఇలాగే వుంటే పట్టణ ప్రాంతాలతో పాటు అంతకంటే ఎక్కువగా గ్రామీణంలో బిజెపి వ్యతిరేకత పెరగటం అనివార్యం.

బిజెపి లేదా కాంగ్రెస్‌ గానీ ప్రజావ్యతిరేక, ద్రవ్యపెట్టుబడిదారీ అనుకూల, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యసంస్ధ ఆదేశిత విధానాల అమలులో తక్షణమే వెనక్కు తిరిగి రాలేనంతగా కూరుకుపోయాయి. వాటిని మరింత వేగంగా, ఎక్కువగా అమలు జరపాలనే వత్తిడి పెరుగుతోంది. అదే జరిగితే గ్రామీణ వ్యవస్ధ మరింత తీవ్ర సంక్షోభానికి గురి కావటం అనివార్యం. నరేంద్రమోడీ విషయానికి వస్తే తాను ప్రజలకు చేసిన వాగ్దానాలకంటే పైన చెప్పుకున్న శక్తుల విధానాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా రూపొందించే సులభతర వాణిజ్య ర్యాంకులో మోడీ సర్కార్‌ ఏకంగా 130 నుంచి వందవ స్ధానానికి ఎగబాకింది. ప్రపంచ ధనిక దేశాలలో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక సంక్షోభం 2018లో పదవ సంవత్సరంలో ప్రవేశించనుం ది. అది ఎప్పటికి పరిష్కారం అవుతుందో, కనీసం సంక్షోభ పూర్వపు స్ధాయికి అయినా ఎప్పుడు వస్తుందో తెలియని స్ధితి. దాని పర్యవసానాలు మన ఆర్ధిక వ్యవస్ధపై బలంగా పడే సమయంలో నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. గత మూడున్నర సంవత్సరాలలో వుత్పాదక, ఎగుమతి రంగాలలో దిగజారుడు ఆ సంక్షోభపర్యవసానాలే. అయితే చమురు ధరలు గణనీయంగా పడిపోవటంతో దిగుమతుల బిల్లు తగ్గిపోయి జనానికి పెద్దగా నొప్పి కలగలేదు. గత కొద్ది నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి, రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయని జోశ్యం చెబుతున్నారు. ఇప్పటికే లీటరుకు పది రూపాయలకు పైగా ధరలు పెరిగాయి, కిరోసిన్‌, గ్యాస్‌ సబ్సిడీ క్రమంగా తగ్గిస్తున్నారు. ఇప్పటి మాదిరే వున్నప్పటికీ మన దిగుమతుల బిల్లు పెరిగిపోయి, దానిని సర్దుబాటు చేసేందుకు వ్యవసాయ రంగానికి, ఇతర సంక్షేమ చర్యలకు ఇస్తున్న సబ్సిడీలను మరింతగా కోత పెట్టటం, లేదా పన్ను భారాలను పెంచటం మినహా మరొక దగ్గరదారి లేదు. వీటన్నింటినీ చూసినపుడు ఏం చేసినా అది మోడీ ప్రతిష్టను మరింత దిగజార్చుతుంది. అందువలన గడువుకు ముందే ముందస్తున్న ఎన్నికలకు పోతారని గత కొంతకాలంగా వినవస్తున్నది. గుజరాత్‌లో భారీ మెజారిటీతో గెలిస్తే దాన్ని చూపి దేశమంతటా ప్రచారం చేసేందుకు ముందుస్తున్న ఎన్నికలకు పోతారని ముందుగానే పండితులు అంచనాలు వేశారు. ఇప్పుడు గెలిచినా దాన్ని పెద్దగా చెప్పుకొని సంబర పడే స్దితి లేదు.వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌ఘర్‌ బిజెపి పాలితం కాగా కర్ణాటక కాంగ్రెస్‌, త్రిపుర సిపిఎం ఏలుబడిలో వున్నాయి. వాటి ఫలితాలు కూడా లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైతే అది రాజకీయంగా బిజెపికి నష్టం. ఇది కూడా ముందస్తు ఎన్నికలను ముందుకు తెస్తుందనే చెప్పవచ్చు.