Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

డిసెంబరు 17న లాటిన్‌ అమెరికాలోని చిలీ అధ్యక్ష తుది ఎన్నికలు జరిగాయి. మితవాద అభ్యర్ధి సెబాస్టియన్‌ పినెరా గెలిచాడు అనటం కంటే వామపక్ష అభ్యర్ధి అలెజాండ్రో గలియర్‌ ఓటమి పాలయ్యాడని చెప్పాలి. ఆశ్చర్యంగా వుంది కదూ ! సగానికిపైగా ఓటర్లు అసలు ఎన్నికల్లో పాల్గనలేదు, మొదటి దఫా పోలైన ఓట్లలో 64శాతం ఓట్లు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులుగా వున్న అభ్యర్ధులకే వచ్చాయి. తుదివిడత పోటీలో వారి మధ్య ఐక్యత లోపించిన కారణంగా వామపక్ష అభ్యర్ధి ఓటమి పాలయ్యారు. జనాభాలో 45శాతంగా వున్న ఆదివాసులు ఎక్కువ మంది మితవాద పినేరా వైపు మొగ్గుచూపినట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.తొలి విడత పోలింగ్‌లో ఓటర్లు కేవలం 46.72 శాతం మాత్రమే ఓటర్లు పాల్గన్నారు. తుది విడతలో 49శాతం వరకు పెరిగినప్పటికీ ఎన్నికలకు దూరంగా వున్న ఓటర్లను సమీకరించటంలో వామపక్ష కూటమి పెద్దగా చేసిందేమీ లేనట్లు స్పష్టమైంది. ఓటింగ్‌ శాతం తగ్గిన అత్యధిక సందర్భాలలో మితవాద, ప్రజావ్యతిరేక శక్తులే చురుకుగా వుంటాయన్నది ప్రపంచ అనుభవం.

ఎన్నికల గడువు దగ్గర పడిన తరువాత నూతన వామపక్ష కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌లోని పార్టీలు, తొలిదశలో పోటీ పడిన ఇతర అభ్యర్ధులు గులియర్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ అప్పటికే సమయం మించిపోయింది. వారికి వచ్చిన ఓట్లన్నీ గులియర్‌కు పడి వుంటే ఎంతో సులభంగా విజయం లభించి వుండేది. అలా జరగలేదు. సోషలిస్టుపార్టీ నేత బాచ్‌లెట్‌ ప్రభుత్వం పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య ఒప్పందం వైపు మొగ్గు చూపటం, వెనెజులాపై ఆరోపణల దాడి జరపటం వంటి అంశాలు కొత్తగా ముందుకు వచ్చిన వామపక్ష కూటమివైపు వామపక్ష అభిమానులు గణనీయంగా మొగ్గు చూపేందుకు దోహదం చేశాయి. బ్రాడ్‌ ఫ్రంట్‌ నేతలు కూడా ప్రచారంలో మితవాద పినేరా కంటే గులియర్‌పై దాడిని ఎక్కుపెట్టటం కూడా దాని మద్దతుదారులు రెండో విడత ఎన్నికలలో ఓటింగ్‌కు దూరం కావటమో లేక నామమాత్రంగా గులియర్‌కు వేసి వుండటమో జరిగింది.

లాటిన్‌ అమెరికాలో ఒక మార్క్సిస్టుగా ఎన్నికలలో ఎన్నికైన ఒక దేశాధ్యక్షుడిగా సాల్వెడార్‌ అలెండీ చరిత్రకు ఎక్కారు. ప్రజాస్వామ్యబద్దంగా 1970లో చిలీ అధ్యక్షుడిగా ఎన్నికైన అలెండీని కొనసాగనిస్తే లాటిన్‌ అమెరికా అంతటా అదే పరిణామం పునరావృతం అవుతుందని భయపడిన అమెరికా కుట్ర చేసి మిలిటరీ జనరల్‌ పినోచెట్‌ నాయకత్వంలో తిరుగుబాటుకు తెరదీసింది. దానిని ఎదుర్కొనేందుకు స్వయంగా తుపాకి పట్టి కుట్రదారుల చేతుల్లో బలైన నేత అలెండీ.

      నవంబరు 19న జరిగిన పోలింగ్‌లో ఎనిమిది మంది పోటీ పడగా వారిలో పినెరాకు 36.64, గలియర్‌కు 22.7, మరో వామపక్ష అభ్యర్ధి బియాట్రిజ్‌ సాంఛెజ్‌కు 20.27శాతం ఓట్లు వచ్చాయి. ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాని కారణంగా తొలి రెండు స్ధానాలలో వున్నవారి మధ్య తుది పోటీ జరిగింది. గలియర్‌ న్యూ మెజారిటీ పేరుతో వున్న అధికార వామపక్ష ప్రజాతంత్ర కూటమి అభ్యర్ధి. ఈ కూటమిలో చిలీ అనగానే గుర్తుకు వచ్చే సాల్వెడార్‌ అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీ నాయకురాలు కాగా కమ్యూనిస్టుపార్టీ, సోషలిజం- పెట్టుబడిదారీ విధానాలలోని మంచిని అమలు జరపాలని చెప్పే విరుద్ద విధానాల క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఇతర చిన్న పార్టీలు వున్నాయి.. మొదటి ఇద్దరి మధ్య తుదివిడత పోటీలో పినేరా 54.58 శాతం ఓట్లతో విజయం సాధించాడు. ఈ ఎన్నికలకు దూరంగా మెజారిటీ ఓటర్లు 51.5శాతం వున్నారు. అధికారంలో వున్న న్యూ మెజారిటీ కూటమి అనుసరించిన విధానాలతో ఓటర్లు ఎంతగా విసిగిపోయారో ఈ అంకె వెల్లడించింది. ఈ కారణంగానే చిలీలో ఇద్దరు ప్రజాభిమానం లేని అభ్యర్ధుల మధ్య పోటీ అనే శీర్షికతో ఒక మీడియా వార్తనిచ్చింది. అధికార కూటమి అభ్యర్ధి ఓటమిని అనేక మంది ముందే సూచించారు. ఎన్నికలకు నెల రోజుల ముందే క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధికార కూటమి నుంచి వైదొలగి తన అభ్యర్ధిని పోటీకి పెట్టింది. ఆరు సంవత్సరాల క్రితం వువ్వెత్తున ఎగిసిన విద్యార్ధి వుద్యమానికి నాయకత్వం వహించిన వారితో పాటు కొన్ని చిన్న వామపక్ష పార్టీలతో ఈ ఏడాది ప్రారంభంలో బ్రాడ్‌ ఫ్రంట్‌ పేరుతో ఏర్పడిన కూటమి అభ్యర్ధే రెండవ స్ధానంలో వుంటారా అన్న వాతావరణం నవంబరు ఎన్నికల సమయంలో ఏర్పడింది. సోషలిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అమలు జరిపిన విధానాలపై విబేధాల కారణంగా అన్ని వామపక్ష పార్టీలు,శక్తుల మధ్య ఐక్యత కుదిరేది కాదని ముందే తేలిపోయింది.

ఈ పూర్వరంగంలో జరిగిన తుది విడత ఎన్నికలలో మితవాది పినేరా విజయం సాధించాడు. పార్లమెంట్‌ దిగువ సభలోని 155 స్ధానాలకు గాను పినేరా నాయకత్వంలోని కూటమి72 సాధించగా న్యూ మెజారిటీ కూటమి 43, బ్రాడ్‌ ఫ్రంట్‌ 20, క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌పార్టీ కూటమి 14 స్ధానాలు సాధించాయి. ఇతర పార్టీలకు 6 వచ్చాయి. న్యూ మెజారీటీ కూటమిగతం కంటే ఒక సీటును కోల్పోగా దాని భాగస్వామి కమ్యూనిస్టు పార్టీ ఆరు నుంచి ఎనిమిది సీట్లకు పెంచుకుంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన, మరోసారి గెలిచిన పినేరా చిలీ నియంత పినోచెట్‌ అనుచరుడు. అతనికి దేశంలోని 15 రాష్ట్రాలలో 13చోట్ల ఆధిక్యత లభించింది. తుది విడత పోటీ పడిన ఇద్దరు అభ్యర్ధుల పట్ల ఓటర్లు అనాసక్తి కనపరచటానికి కారణం వివిధ తరగతుల జీవితాలు చిన్నా భిన్నం కావటానికి కారణమైన స్వేచ్చామార్కెట్‌ లేదా నయా వుదారవాద విధానాలపై ఇద్దరూ వ్యతిరేకంగా మాట్లాడకపోవటమే. తాను గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరిస్తానని గలియర్‌ ప్రకటించగా, తాను కార్పొరేట్‌లాభాలపై పన్నులు తగ్గిస్తానని పినేరా వాగ్దానం చేశాడు. వామపక్ష ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో వున్నప్పటికీ నియంత పినోచెట్‌ హయాంలో రూపొందించిన ప్రజావ్యతిరేక రాజ్యాంగాన్ని మార్చటానికి పెద్దగా ప్రయత్నించలేదు. తనను ఎన్నుకుంటే ఆ పని చేస్తానని వామపక్ష కూటమి అభ్యర్ధి గలియర్‌ ప్రకటించినప్పటికీ జనంలో విశ్వాసం కలగలేదని ఓటర్ల అనాసక్తి వెల్లడించింది. గతంలో తాము కోల్పోయిన భూములను తిరిగి పొందేందుకు పోరాడుతున్న ఆదివాసులపై బాచ్‌లెట్‌ ప్రభుత్వం నియంత పాలనలో చేసిన వుగ్రవాద చట్టాన్ని ప్రయోగించి మిగతాపార్టీలకూ వామపక్షాలకు తేడా లేదన్న విమర్శలను మూటగట్టుకుంది. విద్యారంగంలో కూడా జనం కోరిన విధంగా విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ప్రయత్నం చేయలేదు.మిగతా లాటిన్‌ అమెరికా దేశాల మాదిరే ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయని కారణంగా పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభ ప్రభావం చిలీపై కూడా ఎన్నికలకు ముందు బాచ్‌లెట్‌ ప్రభుత్వానికి జనాదరణ అత్యంత తక్కుగా వున్నట్లు సర్వేలు వెల్లడించాయి.

ప్రపంచ సాంప్రదాయ పెట్టుబడిదారీ, ఇటీవలి కాలపు ద్రవ్య పెట్టుబడిదారీ విధానాలు, వాటికి వున్నత రూపమైన సామ్రాజ్యవాద ప్రయోగశాలగా లాటిన్‌ అమెరికాను మార్చారు. పోరాట సాంప్రదాయం కలిగిన లాటిన్‌ అమెరికాలో తమ దోపిడీకి అడ్డులేకుండా చేసుకొనేందుకు, వామపక్ష, ప్రజావుద్యమాలను వుక్కుపాదంతో అణచివేసేందుకు ప్రజాస్వామిక వ్యవస్ధలను ప్రహసన ప్రాయంగా మార్చి ప్రతి దేశంలోనూ మిలిటరీ నియంతలను రంగంలోకి తెచ్చిన చరిత్ర తెలిసిందే. ‘చికాగో పిల్లలు’గా పిలిపించుకున్న అమెరికన్‌ సలహాదారులు అందచేసిన దివాలాకోరు నయా వుదారవాద విధానాల అమలు ఫలితంగా ఆర్ధికంగా దివాలా, అప్పులపాలైన ఆ ప్రాంత దేశాలలో మిలిటెంట్‌ వుద్యమాలు, తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. తీవ్రమైన అమెరికా వ్యతిరేకత పెల్లుబికింది. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా అమెరికా ప్రతిష్టించిన పాలకులను సమర్ధించటానికి జంకే పరిస్ధితులు ఏర్పడ్డాయి. సరిగ్గా ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసి ప్రచ్చన్న యుద్ధంలో తాము విజయం సాధించామని ప్రకటించుకుంది అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి. అంత పెద్ద విజయం సాధించిన తరువాత తమ పెరటితోటలో నియంతల స్ధానంలో నయా వుదారవాద విధానాలను అమలు జరిపే సరికొత్త శక్తులను రంగంలోకి తెచ్చేందుకు అమెరికా అనుమతించింది. ఆక్రమంలో ఆ పాలకుల వైఫల్యం, ఆ కారణంగా ఏర్పడే ఖాళీలో వామపక్ష శక్తులు విజయం సాధిస్తాయన్నది సామ్రాజ్యవాద శక్తులు వూహించని పరిణామం. ఆ క్రమాన్ని అడ్డుకోవటం అంటే తిరిగి సైనిక, మితవాద నియంతలను ప్రతిష్టించటం లేదా మరోసారి ప్రజాస్వామ్య పీకనులిమినట్లు ప్రపంచానికి తెలియచెప్పటమే. అందువలన తనను వ్యతిరేకించే శక్తులను అనుమతించటం తప్ప వారికి మరొక తక్షణ మార్గం లేకపోయింది.

దశాబ్దాల తరబడి లేని ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించటం, తక్షణం వుపశమనం కలిగించే చర్యలు, కొన్ని సంక్షేమ పధకాలను అమలు జరిపిన కారణంగా వెనెజులా, బ్రెజిల్‌, అర్జెంటీనా, బలీవియా వంటి చోట్ల వరుసగా వామపక్ష శక్తులు విజయాలు సాధించటం అది ఇతర దేశాలకు వ్యాపించిన చరిత్ర తెలిసిందే. అయితే నయావుదారవాదం, ద్రవ్యపెట్టుబడిదారీ విధానాల ప్రాతిపదికన ఏర్పడిన దోపిడీ వ్యవస్ధ మూలాలను దెబ్బతీయకుండా వాటి పెరుగుదలను అనుమతిస్తూనే మరోవైపు సంక్షేమ చర్యలను అమలు జరపటం ఎంతో కాలం సాధ్యం కాదని గుర్తించటంలో లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల వైఫల్యం కనిపిస్తోంది. నయా వుదారవాద విధానాల చట్రం నుంచి బయటపడని కారణంగా ఆ ప్రభుత్వాలు కూడా ప్రజల అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి తోడు వామపక్షాలుగా వున్న కొన్ని పార్టీల నేతల అవినీతి అక్రమాలు, విధానపరమైన వైఫల్యాల కారణంగా మితవాద, కార్పొరేట్‌ శక్తులు జనాన్ని రెచ్చగొట్టటంలో కొంత మేర జయప్రదం అయ్యాయి. అర్జెంటీనా, బ్రెజిల్‌లో మితవాదులు అధికారానికి రాగా వెనెజులా పార్లమెంట్‌లో ఆధిక్యతను సాధించారు. చిలీలోని వామపక్ష శక్తులు కూడా నయావుదారవాద పునాదుల మీదే పాలన సాగించటం, అధ్యక్షురాలు బాచ్‌లెట్‌ కుటుంబ సభ్యులపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలపై విచారణ వంటివి అక్కడ ఓటమికి కారణం. మితవాది పినేరా విజయం సాధించటానికి దారితీసిన పూర్వరంగాన్ని నెమరువేసుకోవటం అవసరం. చిలీ రాజ్యాంగం ప్రకారం ఒక దఫా అధ్యక్షపదవికి ఎన్నికైన వారు తదుపరి ఎన్నికలలో పాల్గనటానికి అవకాశం లేదు. తాజా ఎన్నికలలో విజయం సాధించిన సెబాస్టియన్‌ పినేరా 2010-14 మధ్య అధ్యక్షుడిగా పని చేశాడు. తరువాత అధ్యక్షురాలిగా ఎన్నికైన మిచెల్లీ బాచ్‌లెట్‌ అంతకు ముందు ఒకసారి అధ్యక్షరాలిగా పని చేశారు. అంటే గత పదమూడు సంవత్సరాలలో బాచ్‌లెట్‌-పినేరా పాలనా తీరుతెన్నులను చూసిన చిలీ ఓటర్లు పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయినా ఒకటే అనే నిర్వేదానికి లోనయ్యారంటే అతిశయోక్తి కాదు. నియంత పినోచెట్‌ పాలన 1990లో అంతరించినా వాడి హయాంలో రూపొందించిన కార్పొరేట్‌ అనుకూల, ప్రజావ్యతిరేక రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు లేకుండా గత 27 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఎవరు అధికారంలోకి వచ్చినా ఒకటే అని ఓటర్లు భావిస్తున్నందున ఇటీవలి ఎన్నికలలో మెజారిటీ ఓటర్లు పోలింగ్‌ బూత్‌లవైపు చూడటం లేదు. తాజా ఎన్నికలకు ముందు జరిగిన ఒక సర్వేలో కేవలం 29శాతం మంది మాత్రమే రాజకీయ పార్టీల పట్లవిశ్వాసం వెలిబుచ్చగా సగం మంది తమకు రాజకీయాలంటే ఆసక్తిలేదని పేర్కొన్నారు. పినోచెట్‌ నియంతృత్వానికి గురైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా మిచెల్లీ బాచ్‌లెట్‌పై వున్న గౌరవం, అధ్యక్షుడిగా పినేరా అవినీతి అక్రమాలతో విసిగిపోయిన జనం గత ఎన్నికలలో బాచ్‌లెట్‌వైపు మొగ్గారు. ఈసారి ఆమె పోటీకి అనర్హురాలు కావటంతో జర్నలిస్టు అయిన గులియర్‌ను అభ్యర్ధిగా నిలిపారు. అయితే అతనిని బయటి వ్యక్తిగా చూశారని విశ్లేషకులు చెబుతున్నారు. తాను ప్రజలందరి అధ్యక్షుడిని అని ప్రచారం చేసుకోవటం కూడా దెబ్బతీసి వుండవచ్చు.

ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా అర్జెంటీనా, బ్రెజిల్‌లో ఇటీవల పెద్ద ఎత్తున అక్కడి మితవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జనం తిరిగి వీధులలోకి వస్తున్నారు. అందువలన ఇప్పటికీ అధికారంలో వున్న లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులుగానీ, అధికారం కోల్పోయిన దేశాల్లోని శక్తులుగానీ నయావుదారవాద మూలాలను దెబ్బతీసి దోపిడీ నుంచి కార్మికవర్గాన్ని కాపాడే ప్రత్యామ్నాయ అర్ధిక విధానాలకు రూపకల్పన చేసి ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనటం తప్ప మరొక దగ్గర మార్గం కనిపించటం లేదు. గత రెండు దశాబ్దాలలో సాధించిన విజయాలు,తాజాగా ఎదురవుతున్న అపజయాలను సమీక్షించుకొని ముందుకు ఎలా పోవాలా అన్న మధనం ఇప్పటికే అక్కడి వామపక్ష శక్తులలో ప్రారంభమైంది. నయా వుదారవాద పునాదులపై నిర్మించిన వ్యవస్ధలను కూల్చకుండా ప్రత్యామ్నాయ నిర్మాణాలు చేయలేమని తేలిపోయింది. ప్రపంచ సోషలిస్టు శక్తులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన సమయంలోనే లాటిన్‌ అమెరికాలో అరుణపతాక రెపరెపలు ప్రారంభమయ్యాయి. సోషలిస్టు శిబిరానికి తగిలిన ఎదురుదెబ్బల కంటే ప్రస్తుతం లాటిన్‌ అమెరికాలో ఎదురవుతున్న ఓటములు పెద్దవేమీ కాదు. ఇప్పటికే వెనెజులాలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మిగతా దేశాలలో కూడా ఆ క్రమం అనివార్యం. కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ వూహించినట్లుగా తమకాలంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో విప్లవం సంభవించలేదు. అనూహ్యంగా ఇతర చోట్ల వచ్చింది. లాటిన్‌ అమెరికాలో తదుపరి దశ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు, కార్పొరేట్‌, మితవాద శక్తుల పునాదులను కూల్చివేయటమే కనుక వాటి నుంచి ప్రతిఘటన గతం కంటే తీవ్రంగా వుంటుంది. ఆ పరిణామాలు ఎలా వుంటాయన్నది జోశ్యం చెప్పే అంశం కాదు.చుంచెలుక భూమిలో నిరంతరం తవ్వుతూ అప్పుడప్పుడు బయటికి కనిపించినట్లుగా విప్లవ క్రమం అంతర్గతంగా నిరంతరం జరుగుతూనే వుంటుంది. అది ఎప్పుడు, ఎలా,ఎక్కడ బయటకు వస్తుందో చెప్పలేము.