Tags

, , , , , ,

ఐరోపా దేశాలలో ప్రజాకర్షక పచ్చిమితవాద పార్టీలు

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. అలాగే ఏ దేశమైనా వలస కార్మికులను అనుమతించటం, ఆహ్వానిస్తున్నదంటే అది అక్కడి కార్పొరేట్ల లాభాలను పెంచటం కోసమే అన్నది స్పష్టం. కార్పొరేట్ల లాభాల వేటే ప్రపంచంలో మితవాద, పచ్చిమితవాద శక్తుల ముప్పును ప్రపంచానికి తెస్తోంది. 2017లో జరిగిన పరిణామాలను నెమరు వేసుకుంటే ఈ ధోరణి మరింత స్పష్టంగా వెల్లడి అయింది. అందుకే కొందరు పరిశీలకులు దీన్ని మితవాద సంవత్సరంగా వర్ణించారు.ఐరోపా, లాటిన్‌ అమెరికా ఖండాలలోని పలు దేశాలలో వెల్లడైన ధోరణులు ఇందుకు అవకాశమిచ్చాయి. అయితే దీన్ని చూసి ఇప్పటికిప్పుడు గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేనప్పటికీ ఒక ప్రమాదకరమైన సంకేతమిది. ఏ దేశ పాలకవర్గమైనా తన ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుంది. అవసరమైతే మితవాద శక్తులను ప్రోత్సహిస్తుంది, నష్టం అనుకుంటే అదుపులో వుంచుతుంది.

2017 సంవత్సరాన్ని అవలోకించుకుంటే ప్రపంచ వ్యాపితంగా మితవాద అనుకూల,అభ్యుదయ, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల ప్రభావం పెరగటంతో పాటు కమ్యూనిస్టు వ్యతిరే వాదనల ఆకర్షణ తగ్గటం కూడా మరోవైపున కనిపిస్తోంది. ఇదొక విచిత్ర పరిస్ధితి. ఆర్ధిక అసమానతలు తీవ్రం కావటం, సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్దలను కూల్చివేసిన తరువాత సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడటం ఇటీవలి కాలంలో పెరుగుతున్నది.2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలో పెట్టుబడిదారీ వ్యవస్ధకు అంతుబట్టటం లేదు. ఇలాంటి సంక్షోభాలను జనం మీదకు నెట్టి తాము బయటపడటం దోపిడీ వర్గ నైజం. పైన పేర్కొన్న కారణాలతో అనేక దేశాలలో యువతలో అసంతృప్తి పెరుగుతోంది. మితవాదులు, వుదారవాదులుగా ఇంతకాలం రాజకీయ రంగంలో వున్న సాంప్రదాయ పార్టీలు పెట్టుబడిదారీ వ్యవస్ధలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించటంలో విఫలమయ్యాయి. అందువల్లనే ఇటీవలి కాలంలో ఏ ఒక్క పార్టీ కూడా వరుసగా రెండవ సారి ఎన్నికల విజయం సాధించటం లేదు. ఈ పూర్వరంగంలో ప్రత్యామ్నాయంగా పచ్చి మితవాద ఫాసిస్టు శక్తులు ప్రపంచమంతటా ప్రజాకర్షక నినాదాలను, వలసదారుల వ్యతిరేక ముఖ్యంగా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో ముందువరుసలో వున్నాయి. మన దేశంలో సంఘపరివార్‌ కూడా అదే చేస్తున్న విషయం తెలిసిందే.

లాభార్జనకు అవసరమైన విధాన నిర్ణేత అగ్రగామిగా వున్న ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్తే. దానికి అవసరం అయినపుడు స్వేచ్చా వాణిజ్యం నష్టం అనుకున్నపుడు రక్షణాత్మక విధానాలను ముందుకు తెచ్చినదీ అదే వ్యవస్ధ. ప్రపంచీకరణ, స్వేచ్చామార్కెట్‌ నినాదాలను తారక మంత్రాలుగా పఠించిన ఘనాపాఠీలు ఇప్పుడు మరో పల్లవి అందుకుంటున్నారు. వాటిలో భాగంగా 2001లో ప్రారంభించిన దోహా దఫా చర్చలు ఎప్పుడు ముగుస్తాయో తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రపంచ వాణిజ్య సంస్ధ వైఫల్యాన్ని సూచిస్తున్నది.ఒకవైపు ఈ చర్చలను ముందుకు సాగనివ్వకుండా చేస్తున్న ధనిక దేశాలు మరోవైపు తమ ఆర్ధిక, అంగబలాన్ని వుపయోగించి దేశాలతో బేరసారాలాడి ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఐరోపా యూనియన్‌లో వుండి పొందే లబ్ది కంటే దాన్నుంచి బయటపడి ఎక్కువ లాభాలు సంపాదించాలనే యావతోనే బ్రిటన్‌ నష్ట పరిహారం చెల్లించి మరీ బయటకు వచ్చేందుకు నిర్ణయించింది. ప్రతి అగ్రరాజ్యం తన స్వీయ రక్షణాత్మక విధానాలకు తెరతీసింది. మార్కెట్లను పంచుకొనే క్రమంలో విబేధాలు ముదిరి చివరకు యుద్ధాలకు కూడా కారణం కావటం చూశాము.రక్షణాత్మక విధానాల గురించి నిరంతరం చర్చ జరుగుతోంది. ఏదో ఒక రక్షణాత్మక విధానం లేకుండా ఏ ధనిక రాజ్యం అభివృద్ధి చెందలేదనేది ఒక అభిప్రాయమైతే, స్వేచ్చావాణిజ్యం అనేది ఒక మినహాయింపు రక్షణాత్మక విధానం ఒక వ్యవస్ధ అని ఒకరు భాష్యం చెప్పారు. కార్పొరేట్‌ సంస్ధలు బహుళజాతి సంస్ధలుగా రూపాంతరం చెందిన తరువాత ఇది కొన్ని మార్పులకు లోనైనప్పటికీ దాని మౌలిక స్వభావమైన మార్కెట్ల ఆక్రమణ, నిరోధాలతో పాటు సంక్షేమచర్యల వ్యతిరేకత, సంక్షోభాలకు గురికావటంలో మార్పు లేదు. ఒకవైపు రక్షణాత్మక చర్యలతో పాటు వలస కార్మికులను ఆహ్వానించటం తాజా ధోరణిగా వుంది.

అనేక దేశాలలో సంక్షేమ చర్యలను వ్యతిరేకించే సాంప్రదాయ మితవాదులు గణనీయ భాగం వుండటం తెలిసిందే. ఇప్పుడు ఐరోపాను ప్రభావితం చేస్తున్నది పచ్చి మితవాదులు, ఆశ్చర్యం ఏమంటే వారు తమ స్ధానాన్ని మరింత బలపరుచుకొనేందుకు ప్రజాకర్షక నినాదాలు పెద్ద ఎత్తున ముందుకు తెస్తున్నారు. వారికి వలస కార్మికులు, ఇస్లామిక్‌ దేశాల నుంచి వచ్చే వారు లక్ష్యంగా మారి స్ధానిక యువత, కార్మిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. బ్లూమ్‌బెర్గ్‌ విశ్లేషణ ప్రకారం గత మూడు దశాబ్దాల కాలంలో 22 ఐరోపా దేశాలలో ప్రజాకర్షక పచ్చిమితవాద పార్టీలకు గతం కంటే మద్దతు పెరిగింది. ఇటీవలి పార్లమెంటరీ ఎన్నికలలో సగటున ఆపార్టీలు 16శాతం ఓట్లు సంపాదించాయి. అదే 1997లో ఐదుశాతం వుంటే దశాబ్దం క్రితం 11శాతం వచ్చినట్లు పేర్కొన్నది. ఒక లెక్క ప్రకారం గత నాలుగు సంవత్సరాలలో ఐరోపాలో ఇటువంటి పార్టీలకు మూడు కోట్ల మంది ఓట్లు వేయగా, ఒక్క 2017లోనే మూడు దేశాలలో కోటీ 79లక్షల మంది వున్నారు కనుకనే దీన్ని మితవాద సంవత్సరంగా పరిగణిస్తున్నారు. చౌకగా శ్రమ చేయటానికి ముందుకు వచ్చే వలస కార్మికులతో పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు లాభాలు ఎక్కువ కనుకే వారు వలసలను ఆహ్వానిస్తున్నారు. గతంలో తమకు అవసరమైన ముడి సరకులను దిగుమతి చేసుకొని తమ పారిశ్రామిక వస్తువులను ఎగుమతి చేసి లబ్ది పొందిన కార్పొరేట్లు ఇప్పుడు ద్రవ్యపెట్టుబడిదారులుగా మారారు. వారు ఫ్యాక్టరీలు పెట్టరు, వస్తువులను వుత్పత్తి చేయరు కానీ లాభాలను పిండుకుంటారు. ధనిక దేశాలలోని పెట్టుబడిదారులు, వ్యాపారులు స్ధానికంగా వస్తువులను తయారు చేయించటం కంటే శ్రమశక్తి చౌకగా వుండే చోట వస్తు తయారీ, దిగుమతులు చేసుకోవటం వారికి లాభసాటిగా వుంది. అందుకు గాను గతంలో వ్యక్తం చేసిన కమ్యూనిస్టు వ్యతిరేకతను పక్కన పెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారిన చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారు. దీని వలన స్ధానికులలో నిరుద్యోగం ఏర్పడి లేదా వేతనాలు తగ్గిపోయి ఐరోపా దేశాలలో మితవాదశక్తులు జనాన్ని రెచ్చగొట్టటానికి వీలుకలుగుతోంది.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ చేసిన ఒక అధ్యయనం ప్రకారం 1990-2015 మధ్య ధనిక దేశాలలో పని చేయగలిగిన వయస్సు జనాభాలో వలస వచ్చిన వారు 15-20శాతం మధ్య వున్నారు. స్విడ్జర్లాండ్‌లో గరిష్టంగా 35శాతం,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా వంటి చోట్ల 25శాతం వరకు వున్నారు. అందువలననే ఇటీవలి కాలంలో అమెరికా కంటే ఈ దేశాలకు మన తెలుగు ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా వుంటున్నాయి.పనిచేసే వయస్సుగల వారిలో ఒక శాతం వలసవచ్చిన వారు వుంటే దీర్ఘకాలంలో ఆయా దేశాల జిడిపిలో రెండుశాతం పెరుగుదలకు దారితీస్తుందని ఐఎంఎఫ్‌ పేర్కొన్నది.స్ధానికంగా లభ్యమయ్యేవారు తక్కువగా వుండటంతో వారి స్ధానంలో ఇంటి పనులు, పిల్లల సంరక్షణ వంటి పని చేసేందుకు పెద్ద నైపుణ్యం లేని వారిని కూడా ధనిక దేశాలు ఆహ్వానిస్తున్నాయి. అది కూడా వారికి లాభసాటిగానే వుంది. ధనిక దేశాలలో వచ్చిన ఈ మార్పు కార్పొరేట్లు, కొంత మేరకు స్ధానికులకు కూడా లాభసాటిగానే వుంటున్నప్పటికీ దివాలాకోరు ఆర్ధిక విధానాల కారణంగా ఆర్ధిక అసమానతలు పెరిగి, సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. వలస వచ్చేవారు చౌకగా దొరుకుతుండటంతో స్ధానికుల బేరమాడే శక్తి తగ్గుతున్నది. ఇలాంటి అంశాలన్నీ పచ్చిమితవాదం పెరగటానికి బాగా అనువుగా వున్నాయి.

ఐరోపాకు గుండెకాయ వంటి జర్మనీలో ఎన్నికలలో ప్రత్యామ్నాయ పార్టీ పేరుతో ముందుకు వచ్చిన పచ్చిమితవాదులు 1961తరువాత 13శాతం ఓట్లు, 90సీట్లతో పార్లమెంటులో అడుగు పెట్టారు. నాలుగు సంవత్సరాల క్రితం 4.7శాతం మాత్రమే వచ్చాయి. ఇటీవల ఎన్నికలలో ఆస్ట్రియాలో 46.2, పోలెండ్‌లో 38, ప్రాన్స్‌లో 34, డెన్మార్క్‌లో 21, హంగరీలో 20, ఫిన్లాండ్‌లో 18, నెదర్లాండ్‌, స్వీడన్లలో 13 శాతం చొప్పున ఓట్లు తెచ్చుకున్నారు.అనేక తూర్పు ఐరోపా దేశాలలో ఇలాంటి శక్తులు పెరుగుతున్నాయి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో పదిలక్షల మంది వలస కార్మికులను అనుమతిస్తామని ఏంజెలా మెర్కెల్‌ చేసిన ప్రకటన కారణంగా 1949 తరువాత ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ అతి తక్కువ ఓట్లు పొందింది.ఇస్లాంపై నిషేధం విధించాలనే నినాదంతో చెక్‌ రిపబ్లిక్‌లో మితవాదులు రెండవ స్ధానంలో ఓట్లు తెచ్చుకున్నారు.

పచ్చిమితవాద శక్తుల పెరుగుదల ఐరోపాకే పరిమితం అనుకుంటే పొరపాటు. అమెరికాలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అక్కడ కూడా పరిస్ధితి అలాగే వుంది. అనేక చోట్ల నయా నాజీ బృందాలు రెచ్చిపోతున్నాయి. సకల అవాంఛనీయ శక్తులను ఆహ్వానించటం, మద్దతివ్వటం అమెరికా పాలకవర్గానికి కొత్తేమీ కాదు. ఫాసిస్టులకు కూక్లక్స్‌క్లాన్‌ వంటి సంస్ధలు, అనేక మంది పెట్టుబడిదారులు నాజీలకు బహిరంగంగా మద్దతు ఇచ్చారు.1930 దశకంలో హిట్లర్‌ బ్రౌన్‌ షర్టులు,ముస్సోలినీ బ్లాక్‌ షర్టుల మాదిరి అమెరికాలో సిల్వర్‌ షర్టులు, ఖాకీ షర్టుల వంటి ఫాసిస్టు మూకలు అవతరించినా పెద్దగా ఎదగలేదు.దానికి కారణం తొలి దశలో అంతర్గతంగా అమెరికన్లు కూడా హిట్లర్‌కు మద్దతు ఇచ్చినా రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తరువాత అమెరికా హిట్లర్‌ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపింది. అప్పటి వరకు ఫాసిస్టు షర్టులను చూసీ చూడనట్లు వున్న అమెరికా యంత్రాంగం అమెరికా వైఖరితో మారటంతో వారిని అదుపు చేసేందుకు పూనుకుంది, దాంతో వారు దేశద్రోహులుగా జనం భావించారు. ప్రస్తుతం దేశ వ్యాపితంగా నాజీల మాదిరి నినాదాలతో ఏదో ఒక చోట ప్రదర్శనలు జరపని రోజు లేదు.వారి తీరుతెన్నులపట్ల ఎంతో సానుభూతితో వుండే డోనాల్డ్‌ ట్రంప్‌కు జనం వేసిన ఓట్లలో మెజారిటీ లేకపోయినా ఎలక్టరల్‌ కాలేజీ పేరుతో నడుస్తున్న అప్రజాస్వామిక ఎన్నికల విధానం ద్వారా అధ్యక్షుడయ్యాడు. భయం పెరిగినపుడు మూఢత్వం కూడా పెరుగుతుంది. అనేక ధనిక దేశాలలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభంతో జనంలో భయం పెరుగుతూనే వుంది. అందువలన రానున్న రోజులలో మూఢత్వం ఇంకా పెరగటం అనివార్యం.