Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

కాలిఫోర్నియాలోనే కాదు, మొత్తం అమెరికాలోనే లాస్‌ ఏంజల్స్‌ కౌంటీ లేబర్‌ ఫెడరేషన్ను ఎంతో శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. అలాంటి ఫెడరేషన్‌ వెలి యుగానికి మంగళం,స్వాగతానికి నాంది పలికే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కార్మిక సంఘాలలో కమ్యూనిస్టులకు స్ధానం లేదు అనే నిబంధన తొలగిస్తూ డిసెంబరు 18న నిబంధనావళిని సవరించింది. ఇది నిజంగా ప్రపంచ కమ్యూనిస్టులకు ఎంతో వుత్సాహాన్నిచ్చే అంశం. కమ్యూనిస్టులంటే ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్తుల కంటే ఎక్కువగా దూరంగా పెట్టే విధంగా ప్రచారం చేసిన అమెరికాలోని ఒక ప్రముఖ రాష్ట్రంలో ఇలాంటి ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవటం చిన్న విషయమేమీ కాదు. అక్కడి పరిస్ధితిలో మార్పు ప్రారంభానికి అదొక సూచిక. దీనికి ఒక మహిళ ఆద్యురాలు కావటం మరొక విశేషం.

కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకొనేందుకు 1798నాటి పరాయి శత్రు మరియు దేశద్రోహ చట్టాలకు 1917,18లో దుమ్ము దులిపింది.కమ్యూనిజంపై ప్రచ్చన్న యుద్ధానికి నాందిగా 1947లో టాఫ్ట్‌-హార్టలే చట్టాన్ని చేసింది. వీటిని ప్రయోగించి కార్మిక సంఘాలలో కమ్యూనిస్టులకు స్ధానం లేకుండా చేసేందుకు కార్మిక సంఘాల నాయకత్వాలపై బెదిరింపులకు పాల్పడి వత్తిడి తెచ్చింది. దాంతో అనేక సంఘాలు ఆమేరకు తమ నిబంధనావళులను సవరించాయి. కమ్యూనిస్టులుగా తెలిసిన వారెవరినీ అనుమతించకుండా అడ్డుకున్నాయి. అప్పటికే కమ్యూనిస్టులని తెలిసివారిని బహిష్కరించాయి. కార్మిక సంఘాలపై కమ్యూనిస్టుల ప్రభావాన్ని తగ్గించే పేరుతో కార్మిక నాయకులుగా వున్న అనేక మంది నాయకులు సిఐఏ, విదేశాంగశాఖతో కుమ్మక్కయి విదేశాలలో కమ్యూనిస్టు ప్రభావితమైన వనే పేరుతో కార్మిక యూనియన్లను విచ్చిన్నం చేసేందుకు కొమ్ముకాశారు.

లాస్‌ ఏంజల్స్‌ ఫెడరేషన్‌లో ఇలాంటి పురోగామి మార్పుకు కారణం మరియా ఎలెనా డురాజో అనే ఒక మహిళ చొరవ అంటే అతిశయోక్తి కాదు. ఆరులక్షల మంది సభ్యులున్న ఆ కార్మిక సంఘానికి తొలిసారిగా నాయకత్వం వహించిన అతివగా కూడా ఆమె చరిత్రకెక్కింది.2006 నుంచి 14 వరకు కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యత నిర్వహించిన ఆమె అమెరికా జాతీయ కార్మిక సంఘంలో బాధ్యతలకు ఎన్నికై లాస్‌ ఏంజల్స్‌ ఫెడరేషన్‌ నాయకత్వం నుంచి తప్పుకున్నారు. 2018లో జరగనున్న కాలిఫోర్నియా సెనెట్‌ ఎన్నికలలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. లాస్‌ ఏంజల్స్‌ రాజకీయాలలో ఏకైక శక్తివంతమైన మహిళ అని లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది.

అమెరికాలోని రెండు రాజకీయపక్షాలలో తక్కువ ప్రమాదకారిని ఎంచుకోవాలనే రాజకీయం నడుస్తోంది. ఇటీవలి కాలంలో దాన్నుంచి బయటపడాలనే మధనం అనేక తరగతులలో ప్రారంభమైంది. తక్కువ ప్రమాదకారి రాజకీయాలకు స్వస్ధి పలకాలని అమెరికా ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ మరియు కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్స్‌(ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ) అక్టోబరు చివరి వారంలో జరిగిన సమావేశం ఆమోదించిన ప్రధాన రాజకీయ తీర్మానంలో పేర్కొనటం అమెరికా కార్మికోద్యమం, రాజకీయాలలో ఒక ముఖ్యపరిణామం. రెండింటిలో ఏది తక్కువ ప్రమాదకారి అని చూడటానికే మనం పరిమితం కావటంలోనే ఎంతో సమయం గడచిపోయిందని తీర్మానం పేర్కొన్నది. అయితే స్పష్టమైన ప్రత్యామ్నాయం ఎలా వుండాలనే అంశపై చర్చలో భిన్న అభిప్రాయాలు వెలువడినప్పటికీ ఒక ప్రత్యామ్నాయం కావాలనే అంశంపై మొత్తం మీద ఏకీభావం వెల్లడి కావటం విశేషం. సమాఖ్య రాజకీయ కమిటీ, మరియు ,అఖిల అమెరికా మున్సిపల్‌ వుద్యోగుల సంఘాధ్యక్షుడు లీ సాండర్స్‌, అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టీచర్స్‌ అధ్యక్షుడు రాండీ వెయిన్‌ గార్టన్‌ పై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికాలో ఈ రెండు అతి పెద్ద వుద్యోగ సంఘాలు. మొత్తం మీద సభ నిర్వాహకులు పేరు పెట్టకపోయినా ఒక కార్మికపార్టీ పెట్టాలని అందరితో అనిపించారు. కార్పొరేట్స్‌, ధనికులకు అనుకూలంగా పనిచేస్తున్న రాజకీయ వ్యవస్ధ కార్మికవర్గానికి స్ధంభాలుగా వుంటూ మంచి వుద్యోగాలు, భద్రతకు మద్దతు ఇచ్చేవాటిని ఒకదాని తరువాత మరొకదానిని హరించిందని, రాజకీయ వ్యవస్ధ కార్మికులను దశాబ్దాలుగా విఫలులను చేసిందని వెయిన్‌ గార్టన్‌ పేర్కొన్నారు.

డెమోక్రటిక్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీలు రెండూ కార్పొరేట్ల ఆధిపత్యంలో వున్నాయని కార్మికవర్గ పార్టీని ఏర్పాటు చేయాలని కోరిన ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను గట్టిగా ముందుకు తెచ్చిన తపాలా కార్మిక సంఘాధ్యక్షుడు మార్క్‌ డైమండ్‌స్టెయిన్‌ మాట్లాడుతూ 1993లో నాఫ్టాను ఆమోదించిన నాటి నుంచి తానీ ప్రతిపాదనను ముందుకు తెస్తూనే వున్నానని పేర్కొన్నారు.2008 ఎన్నికలలో అమెరికా పార్లమెంట్‌ వుభయ సభలలో మెజారిటీతో పాటు అధ్యక్ష పదవిని చేపట్టినపుడు డెమోక్రటిక్‌ పార్టీ కార్మికవర్గానికి ప్రాధాన్యత, కార్మిక సంస్కరణలకు పూనుకోకుండా పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్యం పేరుతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం వంటి వాటిని ముందుకు తెచ్చిందని డైమండ్‌స్టెయిన్‌ చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున ప్రతిస్పందన లభించింది. రిపబ్లికన్లు యూనియన్లను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారు. డెమోక్రటిక్‌ అధ్య క్షుడు బిల్‌క్లింటన్‌ వాల్‌స్ట్రీట్‌(కార్పొరేట్లు)పై నియంత్రణలను ఎత్తివేశారు. ఒక కార్మికవర్గపార్టీ నిర్మాణం అన్నది దీర్ఘకాలిక పధకంగా వుండాలి, దానికి కార్మికవర్గంతో పాటు ఇతర సమాజ మద్దతు కూడా కావాలి.రెండు పార్టీల వ్యవస్ధకు పరిమితమై వుండాలని చెప్పటం ఎంత తప్పవుతుందో కార్మికవర్గ పార్టీకే మన వుద్యమం పరిమితం కావాలనం కూడా అంతే తప్పువుతుందని డైమండ్‌ స్టెయిన్‌ వ్యాఖ్యానించారు. ఆయనకు వ్యవసాయ కార్మిక సంఘనేత బాల్డ్‌మర్‌ వెల్‌స్క్వెజ్‌,ఇతరులు మద్దతు ఇచ్చారు. కార్మికపార్టీని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదిస్తున్న డడ్జిక్‌ మాట్లాడుతూ కార్మికవర్గ పార్టీ నిర్మాణానికి ఒక దృక్కోణం వుండాలి, ఇసుక గూళ్లను కడితే లాభం లేదని కింది నుంచి కార్మికోద్యమ నిర్మాణం జరగాలని అన్నారు. ఇపుడున్న విధానంతోనే కొనసాగుతూ భిన్నమైన ఫలితాలు రావాలని ఆశించటం పరిష్కారం కాదని ఒక ప్రతినిధి స్పష్టం చేశారు. కార్మికవర్గం వెనుక పట్టుపట్టిన వర్తమాన స్ధితిలో కార్మికవర్గ పార్టీ నిర్మాణం చేయలేమని కొందరు వాదించారు. ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు గ్రెగ్‌ జునేమన్‌ మాట్లాడుతూ నడవబోయే ముందు మన దోగాడాలి, పరుగెత్తబోయే ముందు నడవాలి, దౌడు తీయబోయే ముందు పరుగెత్తాలి అన్నారు. కార్మికవర్గ పార్టీని పెట్టటానికి సుముఖంగా వున్నవారు ముందు స్ధానిక, రాష్ట్ర ఎన్నికలలో పాల్గనాలి, డెమోక్రటిక్‌ పార్టీ వారు మనకెలాంటి వుపకారం చేయటం లేదు, చేయబోరు అని వ్యవసాయ కార్మిక సంఘనేత చేసి వ్యాఖ్యను అందరూ అంగీకరించారు. మన విప్లవానికి అనుకూలమైన కార్మివర్గం అనే అంశంపై జరిగిన ఒక చర్చలో ఏడు జాతీయ సంఘాల ప్రతినిధులు పాల్గన్నారు. గతేడాది డెమొక్రటిక్‌ పార్టీ ప్రాధమిక శాఖల సమావేశాలలో బెర్నీ శాండర్స్‌ సవాలుతో తలెత్తిన వుద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశ నిర్ణయంతో వెంటనే అమెరికాలో కార్మికవర్గ దృక్పధంతో పనిచేసే కొత్త పార్టీ ఏర్పడనుందనే భ్రమలకు లోనుకావాల్సిన అవసరం లేదు. రెండు ప్రధాన పార్టీలను (నిజానికి అనేక పార్టీలున్నా ఎన్నికలలో ప్రధానంగా పోటీ పడే రెండు పార్టీలే పోటీ పడుతుండటంతో అక్కడ నిజంగా రెండు పార్టీలే వున్నాయని జనం అనుకుంటారు) ముందుకు తీసుకు వచ్చి అవే ఒకదానికొకటి ప్రత్యామ్నాయం అని నమ్మించటంలో అమెరికాతో సహా అనేక ధనిక దేశాలలో పాలకవర్గం జయప్రదమైంది. మరొక ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో కనిపించని ఏది తక్కువ ప్రమాదకారి అయితే దాన్ని ఎంచుకోవటానికి జనం కూడా అలవాటు పడ్డారు. అయితే ధనిక దేశాలలో పెరుగుతున్న ఆర్ధిక అంతరాలు,కార్మికవర్గం సాధించుకున్న విజయాలు ఒక్కొక్కటి వమ్ముకావటం ప్రారంభమైన తరువాత రెండు పార్టీలు ఒకటే అనే నిర్ధారణకు జనం రావటం ప్రారంభమైంది. పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం ఈ ఆలోచనను మరింతగా పెంచి ఒక మధనానికి దారితీసింది. సాంప్రదాయ పార్టీలను జనం నమ్మటం లేదని గ్రహించటంతో వారి అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు పచ్చిమితవాద శక్తులు ముందుగా రంగంలోకి దిగాయి.ఇది కూడా వర్గ సమీకరణలను వేగవంతం చేసేందుకు పురికొల్పే పరిణామమే. వర్గదృక్పధం గల శక్తులు ఏ రూపంలో ముందుకు వస్తాయనేది చూడాల్సి వుంది.

అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య చేసిన తీర్మానం డెమోక్రటిక్‌ పార్టీకి ఒక తీవ్ర హెచ్చరిక వంటిది. తక్కువ హానికరం చేసేదనే పేరుతో మితవాద రిపబ్లికన్‌ పార్టీకి బదులు తమకు ఓట్లు వేయటం తప్ప కార్మికులకు మరొక మార్గం లేదని ఆ పార్టీ ఇంకేమాత్రం భ్రమలో వుండకూడదని వేసిన తొలి కేక ఇది. సమాఖ్య సమావేశంలో తక్కువ హాని చేసే పార్టీని ఎంచుకోవాలనే వైఖరికి స్వస్తి పలకాలనే తీర్మానాన్ని ముందుకు తెచ్చిన నేతలిద్దరూ రాజకీయంగా డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ కమిటీ సభ్యులే. అందువలన తమ తీర్మానం స్వయంగా తమ పార్టీకే వ్యతిరేకమని వారికి తెలియనిది కాదు. పార్టీలతో నిమిత్తం లేకుండా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో కార్మికఅనుకూల అజెండాను ముందుకు తేవాలని కూడా పై తీర్మానం పిలుపునిచ్చింది. ఈ అజెండా, తీర్మానాన్ని కార్మికవర్గంలోని అన్ని తరగతుల వారికి వివరించేందుకు అవసరమైన సమాచార వ్యవస్ధను కూడా కార్మిక సమాఖ్య నిర్ణయించింది.

కార్మికవర్గంలో తొలుగుతున్న భమ్రలు, జరుగుతున్న మధనానికి ప్రతిబింబమే కార్మిక సమాఖ్య తీర్మానం.దీనికి గతేడాది డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడిన బెర్నీ శాండర్స్‌ తాను సోషలిస్టును అని బహిరంగంగా ప్రకటించి బరిలోకి దిగటం, పెద్ద ఎత్తున యువత నీరాజనం పట్టటం కూడా అనుకోకుండా జరిగింది కాదు. నవంబరు 11-12 తేదీలలో అమెరికా కమ్యూనిస్టుపార్టీ నిర్మాణ మహాసభ జరిగింది. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నిక అవటం, అతగాడి విధానాలు కమ్యూనిస్టుపార్టీ నిర్మాణానికి నూతన పరిస్ధితిని కల్పించిందని నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల తరువాత ఏడాదిలో వెయ్యి మంది కొత్త సభ్యులు చేరారని తెలిపారు. ఫేస్‌బుక్‌లో పార్టీ సభ్యత్వ కార్డు బమ్మను పోస్టు చేయగానే వందల మంది సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంత మంది వ్యక్తిగతంగా చేరగా మరికొందరు బృందాలుగా సభ్యత్వం కోసం వచ్చారు. ఓహియో విశ్వవిద్యాలయంలో ఒక సభలో కమ్యూనిస్టుపార్టీ నేత చేసిన వుపన్యాసం తరువాత అక్కడికక్కడే పన్నెండు మంది సభ్యత్వం కావాలని అడిగారు. ఇలా అనేక నగరాలలో యువత ముందుకు వస్తోందని నివేదికలో పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన క్లబ్బుల ద్వారా ముందుగా జనాన్ని పిటీషన్లపై సంతకాలు చేయమని, తరువాత ప్రదర్శనలకు హాజరు కమ్మని అడుగుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. అలా వచ్చిన వారిని మీరు కమ్యూనిస్టుపార్టీలో ఎందుకు చేరకూడదని చర్చ పెడుతున్నారు. అలాంటి పద్దతుల్లో చేరిన వారు కూడా ఎందరో వున్నారు. ఈ అనుభవాన్ని చూసిన తరువాత అనేక చోట్ల కమ్యూనిస్టు పార్టీ క్లబ్బులను ఏర్పాటు చేసి జనాన్ని ఆకర్షించేందుకు పూనుకుంది. ఇటీవలి కాలంలో పార్టీ ఫేస్‌బుక్‌, వెబ్‌సైట్లను సందర్శి ంచే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పార్టీ పెరుగుదల కేవలం ప్రారంభం మాత్రమే. అయితే ఇది అన్ని చోట్లా ఒకే విధంగా లేదు. అనేక చోట్ల కార్యక్రమాలు నిర్వహించటం సాధ్యం కానప్పటికీ పార్టీలో చేరుతున్న తీరుతెన్నులను ఇటీవలి కాలంలో చూడలేదని నివేదిక పేర్కొన్నది. లోపాల గురించి వివరిస్తూ పెరుగుదల సంతోషకరమే అయినప్పటికీ అతిగా చెప్పనవసరం లేదు, అనేక చోట్ల సభ్యుల, నాయకుల వయస్సుపైబడిన తీరు కనిపిస్తోంది.కొందరు సమావేశ ం కావటం లేదు, రోజువారీ పోరాటాలలో పాల్గనటం లేదు, కొందరు వెబ్‌సైట్లకే పరిమితం అవుతున్నారు. సభ్యులతో సంబంధాలు, ఇతర అంశాలకు సంబంధించి అనేక అంశాలను ఈ సభలోచర్చించి అవసరాలకు అనుగుణ్యంగా కార్యకలాపాలను పెంచి ప్రజాబాహుళ్య పార్టీగా పెంపొందించాలని నిర్ణయించారు.