ఎం కోటేశ్వరరావు
చైనాలో ఏం జరిగినా అది కమ్యూనిస్టులకు, పెట్టుబడిదారులకూ ఆసక్తికరంగానే వుంటుంది. ఒకే దేశమైనా అక్కడ రెండు వ్యవస్ధలను అనుమతించే విధంగా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయం తీసుకుంది. తమకు అవసరమైన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం కోసం విదేశీ సంస్ధలు, పెట్టుబడులకు అనుమతివ్వాలని 1970దశకం చివరిలోనే చైనా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయించింది. అందువలన ఆ తరువాత రెండు దశాబ్దాలకు బ్రిటీష్, పోర్చుగీసువారి కౌలు గడువు ముగిసిన తరువాత చైనాలో విలీనం కావాల్సిన హాంకాంగ్, మకావో ప్రాంతాలలోని పెట్టుబడిదారీ వ్యవస్ధను 2050 వరకు కొనసాగనిస్తామని హామీ ఇచ్చింది. హాంకాంగ్ అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ద వున్న ప్రాంతాలలో ఒకటి. ఎక్కడి నుంచో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నపుడు తనలో విలీనం అయ్యే ప్రాంతాలలో వారిని తిరస్కరించటంలో అర్ధం వుండదు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ గురించి తెలిసిందే. కమ్యూనిస్టుపార్టీ ఇచ్చిన వెసులుబాటును అవకాశంగా తీసుకొని ప్రపంచ పెట్టుబడిదారులు విలీన ప్రాంతాలలో శాశ్వతంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగించేందుకు లేదా చైనా నుంచి విడగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. వాటిని ఎదుర్కొంటూనే మరోవైపు చైనా తన దైన పద్దతులలో ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు కమ్యూనిస్టుపార్టీ గతంలోనే ప్రకటించింది.
స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌లో ఇటీవలనే పెట్టుబడిదారీ జలగల వార్షిక జాతర జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి మాదిరిగా బయటిలోకానికి పరిచయం అవుతున్న కెటిఆర్ ఆ జాతరకు వెళ్లి వచ్చారు. దేశంలో, తమ రాష్ట్రాలలో లాభాలను పీల్చుకొనేందుకు వున్న అవకాశాల గురించి వివరించి మరీ వచ్చారు. అక్కడికి వచ్చిన వారిలో మారియట్ ఇంటర్నేషనల్ సిఇఓ ఆర్నె సోరెన్సన్ ఒకరు. అంతర్జాతీయ ప్రయాణాలు తగ్గాయని దానిలో భాగంగానే ఈరోజు అమెరికాను ఆహ్వానించేవారు తగ్గిపోయారని దానికి కారణం డోనాల్డ్ ట్రంప్ అని చెప్పాడు. చైనాలో పూర్తిగా కమ్యూనిస్టు నిరంకుశత్వం వుందని కూడా ఆరోపించాడు. ప్రత్యక్షంగా ఘర్షణ పడటానికి సిద్దంగా లేనప్పటికీ చైనాను దెబ్బతీసేందుకు సామ్రాజ్యవాదులు చేయన్ని యత్నం లేదు. చైనాలో 300 హోటల్స్ నిర్వహిస్తున్న మారియట్ కొద్ది వారాల క్రితం ఒక ఇమెయిల్ సర్వే జరిపింది. దానిలో టిబెట్, హాంకాంగ్, మకావో, తైవాన్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా పేర్కొన్నది. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే చైనా ప్రభుత్వం మారియట్ మొబైల్ ఆప్‌ను, తరువాత దాని వెబ్‌సైట్‌ను పనిచేయకుండా చేసింది. వెంటనే ఇందుకు పాల్పడిన తమ సిబ్బందిపై చర్యతీసుకుంటామని, మరోమారు అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని మారియట్ క్షమాపణలు చెప్పింది. సదరు ప్రాంతాలు చైనా నుంచి విడిపోవాలని కోరే శక్తులు, లేదా వ్యక్తులకు తమ మద్దతు వుండదని, సమస్య తీవ్రతను గుర్తించామని పేర్కొన్నది.
చైనాలో వ్యాపారం చేస్తూ ఆ దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలో విదేశీ కంపెనీలు ఎలాంటి పాత్ర నిర్వహిస్తాయో ఈ వుదంతం చెప్పకనే చెప్పింది. కిటికీ తెరిచినపుడు మంచిగాలితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయని, వాటిని ఎలా అదుపు చేయాలో తమకు తెలుసని సంస్కరణలకు ఆద్యుడిగా భావిస్తున్న డెంగ్‌సియావో పింగ్ ప్రారంభంలోనే చెప్పిన విషయం తెలిసిందే. చైనాలో విదేశీ కంపెనీలను ఎలా అదుపు చేస్తున్నారనేది సహజంగానే ఆసక్తి కలిగించే అంశం. దీనికి సంబంధించి బహిరంగంగా చైనా చేసిన ప్రకటనలు లేదా విధానాల వివరాలు మనకు అందుబాటులో లేవు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై విదేశీ సంస్ధలు, వ్యక్తులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు కొన్ని సందర్భాలలో రామునితోక పివరుండు అన్నట్లుగా వుంటాయి కనుక యధాతధంగా తీసుకోనవసరం లేదు. అయితే ఆ సమాచారం కొన్ని విషయాలను వెల్లడిస్తున్నది. వాటి మంచి చెడ్డలు, పర్యవసానాలను పక్కన పెట్టి వాటిని చూద్దాం.
చైనా జనజీవితంలో కమ్యూనిస్టు పార్టీ పాత్రను పెంచటానికి, అగ్రగామిగా వుంచటానికి అక్కడి నాయకత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. విదేశీ సంస్ధలకు ద్వారాలు తెరిచిన తరువాత అన్యవర్గ ధోరణులైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పార్టీ , సోషలిస్టు వ్యతిరేక ధోరణులు చైనా సమాజంపై పడకుండా చూసేందుకు అవి అన్నది స్పష్టం. వాషింగ్టన్ పోస్టు అనే అమెరికా పత్రిక కొద్ది రోజుల క్రితం విదేశీ కంపెనీలలోకి ప్రవేశించేందుకు, అదుపు చేసేందుకు కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తున్నది అనే పేరుతో అది ఒక విశ్లేషణ రాసింది. దాని భాష్యాన్ని మనం యధాతధంగా తీసుకోనవసరం లేదు. చైనా సర్కారుతో కలసి సంయుక్త భాగస్వామ్య సంస్ధలను నెలకొల్పిన అమెరికా మరియు ఐరోపా కంపెనీలు వాటిలోని నిర్ణయాత్మక కమిటీలు, ఎగ్జిక్యూటివ్‌లు, వాణిజ్య బృందాలలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని ఇటీవల చైనా కోరిందన్నది వార్త సారం. చైనాలోని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు జేమ్స్ జిమర్‌మన్ ‘ కమ్యూనిస్టు పార్టీ యంత్రాంగం ఇంతవరకు విదేశీ పెట్టుబడులున్న సంస్ధలలోకి పెద్ద ఎత్తున పాకి చొరబడినట్లు కనిపించటం లేదు గాని జరుగుతున్న విషయాలను చూస్తే అదే మార్గంలో పయనిస్తున్నాయి’ అన్నారు. విదేశీ కంపెనీల యాజమాన్య నిర్ణయాలలో పాత్రను కమ్యూనిస్టుపార్టీ కోరటం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని, ఇదే సమయలో ఇంటర్నెట్‌పై సెన్సార్‌షిప్ విదేశీ కంపెనీలపై ప్రభావితం చేయటానికి నాంది అని, తాను ఆర్ధికంగా బలంగా వున్నందున పశ్చిమ దేశాల వాణిజ్యాన్ని తగ్గించేయవచ్చని చైనా భావిస్తున్నట్లు ఆ పత్రిక వ్యాఖ్యాత పేర్కొన్నారు. కంపెనీల నిర్వహణలో మరొక దొంతరను ప్రవేశపెట్టటం సంయుక్త భాగస్వామ్య కంపెనీల స్వతంత్ర నిర్ణయాలు చేసే సామర్ద్యాన్ని దెబ్బతీస్తాయని, పెట్టుబడులకు ఆటంకం అవుతుందని చైనాలోని యూరోపియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొన్నది. విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే అనేక ఆర్ధిక రంగాలలో సంయుక్త భాగస్వామ్యం వున్న కంపెనీలలో చేరాలని చైనా చట్టాలు నిర్ధేశిస్తున్నాయి.
ఇంటర్నెట్‌ను విదేశీ కంపెనీలు వినియోగించుకోవాలంటే ‘ చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన ఏడు నిబంధనలకు కట్టుబడి వుంటామని, సోషలిస్టు వ్యవస్ధ, ప్రజాభద్రత, సామాజిక నైతికతను దెబ్బతీయబోమని, దేశ ప్రయోజనాలను వుల్లంఘించబోమని ఒక హమీ పత్రాన్ని ఇవ్వాల్సి వుంటుంది. గతేడాది జూన్ నుంచి చైనాలో అమలులోకి వచ్చిన ఇంటర్నెట్ భద్రతా చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అయితే తమ వ్యాపార రహస్యాలు, మేథాసంపత్తి బహిర్గతం అవుతాయనే పేరుతో ప్రభుత్వ నియంత్రణను విదేశీ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. చైనాలో వున్న అన్ని విదేశీ కంపెనీలలో శాఖలను ఏర్పాటు చేసేవిధంగా కమ్యూనిస్టుపార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నదని ఆక్స్‌ఫర్డ్ అనలిటికా అనే బ్రిటీష్ కంపెనీ తాజాగా ఒక నివేదికను తన కెనడా ఖాతాదారులకు పంపింది.దానిలోని అంశాలపై కెనడా మీడియా వ్యాఖ్యానాలు చేస్తున్నది. ఆ మేరకు ఆ నివేదికలోని అంశాల సారాంశం ఇలా వుంది.
వ్యాపార, వాణిజ్యాలు స్వతంత్రరంగానికి చెందినవి కాదు. ఇప్పటి వరకు ప్రయివేటు వాణిజ్యాన్ని రాజ్యమే క్రమబద్దీకరించింది తప్ప పార్టీ కాదు, కానీ ఇప్పుడు గ్జీ జింపింగ్ వాణిజ్యాన్ని పార్టీ అదుపు చేయాలని కోరుతున్నారు.ముఖ్యంగా టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ల కంపెనీలపై పార్టీ ప్రభావం, అదుపు వుండాలి. విదేశీ కంపెనీలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేయటం ద్వారా వాణిజ్య నిర్ణయాలపై పార్టీ ప్రభావం ఏమిటో తెలుసుకోవటానికి వీలుకలుగుతుంది. మారియట్ హోటల్స్ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో టిబెట్, తైవాన్, హాంకాంగ్, మకావోలను వేరే దేశాలుగా పేర్కొనటాన్ని పార్టీ శాఖలే కనుగొన్నాయి. ప్రతి రంగంలోనూ పార్టీ ప్రమేయం వుండాలని గతేడాది జరిగిన పార్టీ మహాసభ చేసిన నిర్ణయానికి అనుగుణంగా వందలాది ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రధాన నిర్ణయాలపై పార్టీ కమిటీలను సంప్రదించే విధంగా మార్గదర్శకాలను సవరించాయి.
ఏ సంస్ధలో అయినా ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పార్టీ సభ్యులుంటే అక్కడ పార్టీ విధానం, సూత్రాలు అమలు జరుగుతున్నదీ లేనిదీ వారు చూడాలని పార్టీ నిబంధనావళి పేర్కొంటున్నది. అయితే 1980వ దశకంలో సంస్కరణల కారణంగా దీని అమలును సడలించారు. తరువాత రెండు దశాబ్దాల కాలంలో వ్యూహాత్మకం కాని ప్రభుత్వ రంగ సంస్ధలపై ప్రత్యక్ష నియంత్రణలను సడలించారు. ప్రభుత్వ, పార్టీ అదుపును సవాలు చేసే స్ధితిలో లేని చిన్న ప్రయివేటు, మరియు ప్రభుత్వ రంగ సంస్దలపై కమ్యూనిస్టు పార్టీ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే 2001లో ప్ర పంచవాణిజ్య సంస్ధలో చేరేందుకు గాను వ్యాపార, వాణిజ్య రంగాలలో వున్నవారిని కూడా పార్టీలో చేరేందుకు అనుమతించారు. ఈ చర్యతో అనేక కొత్త కంపెనీలను ఆశ్రిత పక్షపాతంతో పార్టీలో వున్నవారి బంధువులు, ఆశ్రితులతో ఏర్పాటు చేయించారు. ఆ సమయంలో కేవలం మూడుశాతం ప్రయివేటు కంపెనీలలో మాత్రమే పార్టీ శాఖలున్నాయి.తరువాత కాలంలో చైనా ఆర్ధిక వ్యవస్ధలో ప్రయివేటు కంపెనీలు, వాటిలో కమ్యూనిస్టుపార్టీ శాఖల సంఖ్య కూడా పెరిగింది. 2015 నుంచి ఏర్పాటయిన 36లక్షల ప్రయివేటు సంస్దలలో మెజారిటీ సంస్ధలలో పార్టీ శాఖలున్నాయి. సభ్యులు అనేక కంపెనీలలో అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు వుండటం పెరిగింది. టెన్సెంట్ అనే ఇంటర్నెట్ కంపెనీ సిబ్బందిలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులు 23శాతం అయినప్పటికీ 60శాతం కీలక బాధ్యతలలో వారున్నారు. 2002లో చైనాలోని 17శాతం విదేశీ కంపెనీలలో మాత్రమే పార్టీ శాఖలుంటే అక్కడున్న ఏడున్నర లక్షల విదేశీ కంపెనీలలో 70శాతంలో పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు.
చైనా మాదిరే మన దేశం కూడా సంస్కరణలకు తెరతీస్తే ఇక్కడి కమ్యూనిస్టులు అక్కడ బలపరుస్తూ ఇక్కడ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించటం తెలిసిందే. చైనాలో ప్రయివేటు కంపెనీలను విచ్చలవిడిగా అనుమతించిన తరువాత అది సోషలిజం ఎలా అవుతుందని కమ్యూనిస్టు అభిమానుల్లో సందేహాలు వున్నాయి. అందువలన అక్కడ జరుగుతున్న తీరుతెన్నులను రేఖా మాత్రంగా తెలిపే ఈ సమాచారం సోషలిస్టు వ్యవస్ధను బలపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా చెప్పవచ్చు.