Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

మార్చి 18న జరిగే రష్యా ఏడవ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం మొదలైంది. నామినేషన్లు దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్ధులు తమ అర్హత పత్రాలను ఈనెల ఏడు, పార్టీల అభ్యర్ధులు పన్నెండవ తేదీలో సమర్పించాల్సి వుంది. ఎన్నికల ప్రచారం అధికారికంగా డిసెంబరు18న ప్రారంభమైంది. అప్పటి నుంచి 25 రోజుల లోగా అంటే జనవరి పదహారవ తేదీలోపు తాము ఫలానా వారిని అభ్యర్ధులుగా నియమించినట్లు పార్టీలు సమావేశాలలో అధికారికంగా చేసిన తీర్మానాలను ఎన్నికల కమిషన్‌కు అందచేయాలి. అధ్యక్ష పదవికి ఎన్నికవ్వాలంటే యాభైశాతంపైగా ఓట్లు తెచ్చుకోవాలి. ఎవరికీ ఆమేరకు రానట్లయితే మూడు వారాల్లోపు మొదటి రెండు స్ధానాలలో వున్న అభ్యర్ధుల మధ్య తుది పోటీ నిర్వహించాల్సి వుంది.

అధ్యక్ష పదవికోసం మరోసారి పోటీ పడుతున్న వ్లదిమిర్‌ పుతిన్‌, కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధిగా లెనిన్‌ వ్యవసాయ కంపెనీ పారిశ్రామికవేత్త పావెల్‌ గ్రడినిన్‌, ఇతర పార్టీల తరఫున వ్లదిమిర్‌ జిరినోవస్కీ, గ్రిగొరీ యెవలిన్‌స్కీ,సెనియా సోబ్‌చెక్‌ తదితరులు వున్నారు. రష్యా నిబంధనల ప్రకారం పార్టీల అభ్యర్ధులుగా పార్టీ సభ్యులు కాని వారిని కూడా నియమించవచ్చు.దానికి అనుగుణ్యంగానే కమ్యూనిస్టు పార్టీ తొలిసారిగా పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని పార్టీ అభ్యర్ధిగా ఎంపిక చేసింది. ప్రస్తుతం రష్యాలో నమోదైన పార్టీలు 69 వున్నాయి. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలంటే మూడులక్షల సంతకాలను సేకరించాల్సి వుంది, అయితే ఏ ఒక్క రాష్ట్రంలోనూ అవి ఏడున్నరవేలకు మించకూడదు. అంటే దేశమంతటా పలుకుబడి కలిగిన వారే పోటీకి అర్హులు అవుతారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేని పార్టీల అభ్యర్ధులు లక్ష సంతకాలను సమీకరించాల్సి వుంది. ఏరాష్ట్రంలోనూ అవి రెండున్నరవేలకు మించకూడదు.ఒక ఓటరు ఒక అభ్యర్ధికి మాత్రమే మద్దతుగా సంతకం చేయాలి. ఫిిబ్రవరి మొదటి వారంలో నామినేషన్ల పరిశీలన, ఖరారు చేస్తారు.

పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వున్న కమ్యూనిస్టు పార్టీ తొలిసారిగా పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని అధ్యక్షపదవికి అభ్యర్ధిగా నిర్ణయించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. డిసెంబరు 23న కమ్యూనిస్టు పార్టీ వార్షిక ప్లీనరీ సమావేశంలో పావెల్‌ గ్రడినిన్‌ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు. పార్టీ అధినేత జుగనోవ్‌ అభ్యర్ధి గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారు.’ ఆయనొక శక్తి వంతుడు, అనుభవశాలి. సోషలిస్టు పద్దతులలో తన సంస్ధను నిర్మించారు. గ్రడినిన్‌ను బలపరిస్తే ఈ అనుభవాన్ని ప్రతిచోటా వ్యాపింపచేయవచ్చు. ఆయన వ్యాపారే, మాటలు చెప్పరు, వ్యాపారాన్ని జాతీయ దృక్పధంతో చేస్తున్నారు. సోవియట్‌ విలువలకు మద్దతు ఇస్తారు. ఆయన సంస్ధ అత్యుత సాంకేతిక పరిజ్ఞానంతో కూడి వుంది. ఒక బ్యాంకు చైర్మన్‌ మాదిరి గాక ఒక కమ్యూనిస్టు డైరెక్టర్‌లా వ్యవహరిస్తారు. నిరంకుశుడు కాదు, జన సేవకుడు. రష్యన్‌ ప్రభుత్వం అన్నింటినీ వదిలించుకోవాలనే కార్యక్రమం కలిగి వుంది. ఆ సవాలును దేశభక్తులు స్వీకరించారు. వారి ప్రధాన లక్ష్యం జనం గురించిన ఆందోళనే. సొమ్మును దోచుకోలేదు, విదేశాల్లో దాచుకోలేదు,పెట్టుబడులు పెట్టాడు. ప్రజల మనిషిగా అన్ని పరీక్షలు నెగ్గాడు. పార్టీ మద్దతు, దేశభక్తుల విశాల కూటమితో పనిచేశాడు. గ్రామీణ సామాజిక జీవనాన్ని పటిష్టం గావించారు. మార్కెట్‌ శక్తులు, దోపిడీదారులు, అవినీతి పరుల మధ్య పోటీలో ఒక స్ధిరమైన సంస్ధను నిర్మించారు. ఆయనకు వుత్పత్తి ఎలా చేయాలో మాత్రమే కాదు గౌరవ ప్రదమైన వేతనాలు, పెన్షన్లు ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. గరిష్ట వేతనాలు, సిబ్బంది సంరక్షణ చూశారు.వుచిత గృహవసతి, విద్య, వైద్యం కల్పించారు. సోవియట్‌ కాలం నాటి కార్మిక నిబంధనలన్నీ పాటించారు. పార్టీ మొత్తంగా ఆయన విజయానికి పని చేయాలి.మన అభ్యర్ధి ఒక మంచి, విలువైన వ్యక్తి అని మనం రుజువు చేయాలి, ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా ఆయన విజయానికి కృషి చేయాలి.’ అని జుగనోవ్‌ చెప్పారు.

యాభైఏడు సంవత్సరాల గ్రడినిన్‌ మెకానికల్‌ ఇంజనీరు, మాస్కో సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో 1990 దశకం నుంచి పనిచేస్తున్నారు.ఆయన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించగానే రష్యన్‌ మీడియా ఆసక్తితో పాటు దాడులు కూడా ప్రారంభించింది. కమ్యూనిస్టు పార్టీ తన పలుకుబడిని పెంచుకొనేందుకు పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని పోటీకి నిలిపినట్లు అనేక మంది వ్యాఖ్యానించారు.జుగనోవ్‌ ఇతర కమ్యూనిస్టు పార్టీ నేతలతో కలసి వేసిన నామినేషన్‌ కార్యక్రమానికి పెద్ద ప్రచారం కల్పించారు.

ఎన్నికల ప్రచారం లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ ఇంకా వూపందుకోలేదు.పోలింగ్‌కు సరిగ్గా నెల రోజు ముందు మీడియాలో అభ్యర్ధుల ప్రచారం ప్రారంభం అవుతుంది. గతంలో జరిగిన ఎన్నికలపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సారి ఎలా జరుగుతాయో వూహించటం కష్టం కాదు. 2016 అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందన్న తీవ్ర విమర్శలు, ఆరోపణల నేపధ్యంలో ఈ సారి దానికి పోటీగా అమెరికా జోక్యం చేసుకుంటుందా అన్నది ప్రశ్న.ప్రస్తుతం వెల్లడవుతున్న అభిప్రాయాల ప్రకారం పుతిన్‌ తిరిగి విజయం సాధించటం ఖాయం అనే వాతావరణం వుంది. డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా రష్యన్లు జోక్యం చేసుకున్నారనే విమర్శల నేపధ్యంలో ఇపుడు రష్యా ఎన్నికలలో జోక్యం అనే వార్తలు వస్తున్నాయి. అవినీతి కేసులలో శిక్షపడిన అలెక్సీ నవాల్నే పోటీకి అనర్హుడని ప్రకటించటంతో రష్యన్‌ ఎన్నికలను బహిష్కరించాలని అతడు పిలుపునిచ్చాడు. తను రంగంలో వుంటే పుతిన్‌ అవకాశాలు దెబ్బతింటాయనే కారణంతోనే తనను తప్పించారని చేసిన ఆరోపణను అమెరికన్‌ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ చర్య తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని పుతిన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఖండించారు. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేయటమే తమ ముఖ్య లక్ష్యంగా ఎంచుకున్న సామ్రాజ్యవాదులు ముఖ్యంగా అమెరికన్లు తదుపరి పర్యవసానాలను పూర్తిగా అంచనా వేయలేకపోయారా అన్నది ఒక అంశం. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత రష్యా కూడా ఐరోపాలోని ఇతర దేశాల మాదిరి తనకు లొంగి వుంటుందని అమెరికన్లు భావించి వుండవచ్చు. కానీ ఆచరణలో అది కూడా పోటీదారుగా మారుతుందని, ప్రపంచ రాజకీయాలలో తన పట్టు పెంచుకొనేందుకు ముందుకు వస్తుందని సామ్రాజ్యవాద దేశాలు అంచనా వేసి వుంటే పరిణామాలు కచ్చితంగా మరో విధంగా వుండేవి. మార్కెట్ల వేట పోటీలో సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసికొత్తగా ముందుకు వచ్చిన రష్యా సహజంగానే తన వాటాను డిమాండ్‌ చేయటమే మిగతా పశ్చిమ దేశాలు, దానికి వున్న వివాదం.

దీనిలో పశ్చిమ దేశాలను సవాలు చేసేంతగా రోజు రోజుకూ అన్ని రకాలుగా బలం పెంచుకుంటున్న సోషలిస్టు చైనా అనేక అంశాలలో రష్యాతో చేయి కలుపుతోంది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, సైనిక సమీకరణలు లేకపోవటం వుభయులకు ప్రయోజనకరమైన అంశం. అందువల్లనే అమెరికా, దాని మిత్ర దేశాలతో ఆసియాలో, ఐరోపాలో రష్యన్లు ఏకు మేకై కూర్చున్నారు. రష్యా పక్కనే వున్న వుక్రెయిన్‌లో పాగా వేసేందుకు నాటో కూటమి నిరంతరం ప్రయత్నిస్తున్నది.రష్యా అడ్డుకుంటున్నది. క్రిమియా ప్రాంతాన్ని తనలో కలిపివేసుకోవటం ద్వారా ఆ ప్రాంతంలో తమకు ఎదురులేదని రష్యా లోకానికి చాటింది. ఆ పేరుతోనే వుక్రెయిన్‌లో పాగా వేసేందుకు పశ్చిమ దేశాలు పావులు కదుపుతున్నాయి, పోటీ పడుతున్నాయి. వుక్రెయిన్‌ పరిరక్షణకు తాము టాంకులను ధ్వంసం చేసే క్షిపణులతో సహా అధునాతన మారణాయుధాలు అందచేసేందుకు సిద్దంగా వున్నామని తొలిసారిగా కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రకటించింది రష్యా. వాటిని ఆత్మరక్షణ కోసమే వాడతాం తప్ప ఎదురుదాడికి కాదని వుక్రెయిన్‌ చెబుతున్నది. అమెరికా ప్రకటనను తప్పు పడుతున్న జర్మనీ అదనపు ఆయుధ విక్రయాల గురించి ప్రశ్నిస్తున్నది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయుధాలతో పనేముంది వేరే మార్గం వుందన్నట్లుగా జర్మనీ రంగంలోకి దిగింది. ఎన్నికలలోపే వుక్రెయిన్‌లో ఐరాస శాంతి దళాలను ఏర్పాటు చేయాలని బుధవారం నాడు జర్మనీ విదేశాంగ మంత్రి వుక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో కోరటం దానిలో భాగమే. వుక్రెయిన్‌లో ఐరాస దళాల ఏర్పాటుకు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు ఫ్రాన్స్‌తో కలసి జర్మనీ ప్రయత్నిస్తోంది. రష్యా ఎన్నికలను సాకుగా చూపరాదని కోరుతోంది. వుక్రెయిన్‌ విషయంలో తనకు పెద్దన్న పాత్ర వుండాలని అమెరికా కోరుకుంటుండగా అటువంటి అవకాశం ఇవ్వరాదని జర్మనీ, ఫ్రాన్స్‌ సహజంగానే కోరుకుంటాయి. ఐరోపా సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, ఇతరుల పాత్ర వుండరాదని అవి చెబుతున్నాయి. ఈ రెండు పరిణామాలు పరోక్షంగా రష్యన్‌ ఎన్నికలలో జోక్యం చేసుకోవటమే అవుతుంది. తమకు కొరకరాని కొయ్యగా తయారైన పుతిన్‌ మీద పశ్చిమ దేశాలకు సానుకూల వైఖరి వుండదు. అయితే తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించగల బలమైన మరొక నాయకుడు, శక్తి పశ్చిమ దేశాలకు దొరకటం లేదు. అధికారపక్ష బలంతో పోల్చుకుంటే తక్కువే అయినప్పటికీ గత పాతిక సంవత్సరాలుగా అక్కడ కమ్యూనిస్టుపార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా వుంటోంది. వర్గ స్వభావ రీత్యా పశ్చిమ దేశాలు కమ్యూనిస్టులను బలపరిచే సమస్యే లేదు. ఇదొక విచిత్ర పరిస్ధితి. ఇతర పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌ దేశాలలో పశ్చిమ దేశాలు తమకు అనుకూలమైన శక్తులను సంపాదించటంలో కొంత మేరకు జయప్రదమయ్యాయి. అనేక సందర్భాలలో రష్యాను వ్యతిరేకించే, పశ్చిమ దేశాల అనుకూల శక్తులే ఎన్నికలలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.

నిజానికి పుతిన్‌ అధికార రాజకీయాలలో తలపండిన వ్యక్తి. తన ఎన్నికకు మార్గం సుగమం చేసుకొనేందుకు గత ఏడాది కాలంగా ఇంటా బయటా అనేక చర్యలు తీసుకున్నాడు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తారనే అనుమానం వున్న గవర్నర్లను తొలగించటం,బదిలీ చేయటం వంటి వాటిని కొద్దినెలల ముందుగానే పూర్తి చేశాడు.విదేశాలలో సొమ్ము దాచుకున్నవారిపై కఠిన చర్యలంటూ ఆర్భాటం చేసినప్పటికీ ఎన్నికల నేపధ్యంలో వారికి అనుకూలమైన చర్యలు తీసుకున్నాడు. ఆర్ధికశాఖ నిషేధజాబితాలో వున్న దేశాలలో తప్ప ఇతర దేశాలలో దాచుకున్న సొమ్మును రష్యా తీసుకురానవసరం లేదని, పన్నులు చెల్లించక్కరలేదని లెక్కలు ప్రకటిస్తే చాలనే వెసులుబాటు కల్పించాడు. నిధుల వివరాలు వెల్లడించిన వారి మీద ఒకటి రెండుశాతం పన్ను విధించి క్షమించి వదలి వేయాలనే ఆలోచన వున్నట్లు వార్తలు రాయించారు. జనవరి ఒకటి నూతన సంవత్సరాది సందర్భంగా చిన్న సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ పుతిన్‌ పలు చర్యలు ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల అక్రమాలు తప్ప మరొకటి కాదు.

అంతర్జాతీయంగా రష్యా తన పట్టునిలుపుకొనే క్రమంలో అమెరికాను వ్యతిరేకిస్తున్నప్పటికీ దాని ఆర్ధిక పరిస్ధితి అంత సజావుగా లేదు. ఇతర ధనిక దేశాల మాదిరే ఆర్ధిక సంక్షోభప్రభావం తీవ్రంగా పడింది. గత కొంత కాలంగా దాని అభివృద్ధి రేటు గిడసబారింది. గతేడాది అభివృద్ధి రేటు 1.8-2.2శాతం మధ్య వుండవచ్చని డిసెంబరు మధ్యలో రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంకు ప్రకటించింది. దాని అంచనా ప్రకారం 2018లో 1.5-2శాతం మధ్య వుంటుందని పేర్కొన్నది. రానున్న పది సంవత్సరాలలో రష్యా ఆర్ధిక పరిస్ధితి నిరాశాజనకమే అని బ్లూమ్‌బెర్గ్‌ విశ్లేషించింది. 2021నాటికి చమురు పీపా ధర 20డాలర్లకు పడిపోతుందని, రష్యన్‌ప్రభుత్వం బడ్జెట్‌ సమస్యలతో పాటు కార్మికుల సమ్మెలతో తలెత్తే పరిస్ధితిని ఎదుర్కోవాల్సి వుంటుందని పేర్కొన్నది.2024నాటికి చమురు ధర పదిడాలర్లకు పడిపోతుందని,2028నాటికి రాజకీయ రంగం నుంచి పుతిన్‌ కనుమరుగవుతారని జోస్యం చెప్పింది.ఈ జోస్యం ఫలించినా లేదా ఇప్పుడున్న ఆర్ధిక మాంద్యం కొనసాగినా పుతిన్‌కు ఇవే చివరి ఎన్నికలైనా ఆశ్చర్యం లేదు. గతంతో పోలిస్తే చమురు ధరలో పెద్దగా పెరుగుదల లేకపోయినా దివాలాకోరు ఆర్ధిక విధానాల కారణంగా రష్యన్‌ ఆర్ధిక వ్యవస్ధకున్న పరిమితులు వెల్లడయ్యాయి.

ఈ పూర్వరంగంలో జరుగుతున్న ఎన్నికలను ఆర్ధిక స్ధితి పెద్దగా ప్రభావితం చేయబోదని పుతిన్‌ విజయం సాధిస్తారని మీడియా పండితులు చెబుతున్నారు. ఆర్ధిక పరిస్ధితి ఇలాగే కొనసాగితే రష్యన్‌ సమాజంలో ఎలాంటి అసంతృప్తి తలెత్తుతుందనేది ఇప్పుడే జోస్యం చెప్పలేము. అయితే సోషలిజాన్ని పోగొట్టుకున్న పాతికేండ్ల తరువాత సాధించిందేమిటి అని నెమరువేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బోల్షివిక్‌ విప్లవం జరిగి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 58శాతం మంది సోవియట్‌ను కోల్పోయినందుకు విచారం వెలిబుచ్చుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. గతం మాదిరే చరిత్ర పునరావృతం కాదుగాని ముందుకే పోతుంది, అది పురోగమనం వైపే అన్నది చరిత్ర చెప్పిన సత్యం.