ఎం కోటేశ్వరరావు
అధ్యక్ష పదవికి ఎన్నికైన వెంటనే డోనాల్డ్ ట్రంప్ ఇలా చెప్పాడు.’ దివంగత మహానుభావుడు అబ్రహాం లింకన్ తప్ప ఇప్పటివరకు అధ్యక్షులుగా పనిచేసిన వారందరికంటే నేను మెరుగైన అధ్యక్షుడిగా వుండగలనని మీకు చెప్పగలను’ అన్నాడు. ఏడాది తరువాత ట్రంప్ మానసిక స్ధితిపై జాతీయ స్ధాయిలో చర్చ జరగకుండా చూడటం ఎలా అని అధ్యక్షభవనం మల్లగుల్లాలు పడుతూ తలలు పట్టుకుంటోందని అమెరికాలోని ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్టు ఒక వార్తకు శీర్షికగా పెట్టింది. ట్రంప్ పాలన ప్రారంభమై ఈనెల 20తో ఏడాది పూర్తి అవుతుంది. ఈ తరుణంలో ప్రపంచ అగ్రరాజ్య అధిపతి గురించి ఇలాంటి విశ్లేషణ రావటానికి కారణం ఏమిటి ?
‘రగలటం మరియు కోపావేశం’ పేరుతో ట్రంప్ ఎన్నికల ప్రచారం, గతేడాది కాలంలో అధ్యక్ష భవనంలో వ్యవహరించిన తీరు తెన్నులపై అంతరంగిక కధనాలతో మైఖేల్ వూల్ఫ్ అనే రచయిత ఒక పుస్తకం రాశాడు. దీనిపై స్పందిస్తూ తాను నిజంగానే తగిన శక్తి సామర్ధ్యాలు, స్ధిరమైన మేథావిగా వున్నానని ట్విటర్ ద్వారా స్పందించాడు. ముసలోడు దెబ్బలాటకు సిద్ధం అన్నట్లుగా వున్నప్పటికీ ఆయన సహాయకులు మాత్రం అటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారట. నిజానికి ట్రంప్ మానసిక స్ధితి గురించి ఎన్నికలకు ముందే చర్చ ప్రారంభమైంది. దాని గురించి ఇప్పుడు పుస్తకం కూడా వెలువడటంతో బహిరంగ చర్చకు నాంది పలికినట్లు కావటంతో అధ్యక్ష భవనం కూడా ఏదో ఒకటి చేయాల్సింది వుంది. చెత్త పుస్తకం రాసిన చెత్త రచయిత అని వ్యాఖ్యానించిన ట్రంప్ సలహాదారుడు తమనేత గొప్ప రాజకీయ మేథావి అని వర్ణించాడు. విమర్శకుల నోరు మూయించటం, ట్రంప్ గురించి పొగడ్తలకు దిగటం సహాకులకు మామూలే. కొందరు విమర్శకులు చెబుతున్నట్లు ట్రంప్ మానసిక స్ధితి నిజంగానే బాగా లేదా ?
అమెరికా అధ్యక్ష భవనంలో ఎవరు కొలువుతీరారన్నది పెద్దగా ప్రాముఖ్యత కలిగిన విషయం కాదు. వ్యక్తులుగా ప్రవర్తనలో మంచిచెడ్డలు విధానాలపై ప్రభావం పెద్దగా చూపవు.పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణ్యంగా జాతీయ, అంతర్జాతీయ విధానాలు వుంటాయి. ఎవర, ఏ పార్టీ నేత పీఠంపై వున్నా దోపిడీ, ప్రపంచాధిపత్యం, యుద్ధోన్మాదం కనిపిస్తూనే వుంటుంది. అయితే ఏడు పదులు దాటిన ట్రంప్ ముదిమది తప్పి వ్యవహరిస్తున్నట్లుగా కొన్ని సందర్భాలలో అనిపించటం లేదా ? ఒక సందర్భంలో జర్నలిస్టులను లేపేయాలని తన మనసులోని మాటను వెల్లడించిన ట్రంప్ మరో సందర్భంలో నకిలీ వార్తల గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అత్యంత విస్వసనీయతలేని, అవినీతి మీడియా అవార్డులను ఈ ఏడాదికి ప్రకటించబోతున్నట్లు చెప్పాడు. అదే ట్రంప్ తాజాగా మీడియా అంతిమంగా తనను బలపరచకతప్పదని లేకపోతే టిఆర్‌పి రేటింగ్ పడిపోతుందని ఎద్దేవా చేశాడు. ఇలాంటి ప్రవర్తన చూసినపుడు మతితప్పి వ్యవహరిస్తున్నట్లే అనిపించవచ్చుగానీ వాస్తవం కాదు. అమెరికా ఇంటా బయటా ఎదుర్కొంటున్న వైఫల్యాలు, తీవ్ర సమస్యల మధ్య నాయకత్వం ఎదుర్కొంటున్న తలనొప్పులను వ్యక్తీకరించటంలో సమతూకం తప్పటం తప్పటం తప్ప మరొకటి కాదు. అది స్ధానిక మీడియా కావచ్చు వుత్తర కొరియా అధ్యక్షుడి గురించి కావచ్చు, అన్నింటా అది కనిపిస్తుంది.
అంతర్గతంగా గతేడాది కాలంలో ట్రంప్ సర్కార్ ఏ విధంగా వ్యవహరించిందో చూద్దాం. ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే ఇండియానా పోలీసు ప్రాంతంలో జరిపిన పర్యటన గురించి పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేసింది. అక్కడి ఒక వుక్కు కర్మాగారంలో తాను పదకొండు వందల పర్మనెంటు వుద్యోగాలను రక్షించానని చెప్పుకున్న గొప్పలను అక్కడి కార్మికనేత అంతసీన్ లేదని, చాలా తక్కువ అని గాలితీశాడు. నా పరువు తీస్తావా అంటూ సదరు నేతపై ట్రంప్ ట్విటర్ దాడి చేశాడు. అదే పెద్దమనిషి ఏడాది తరువాత తానొక స్ధిరమైన మేథావినని డబ్బా కొట్టుకున్నాడు. ట్రంప్ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన పదవీ స్వీకారం జరిగిన వెంటనే జరిపిన భారీ మహిళా ప్రదర్శన తరువాత గతేడాది కాలంలో జరిగిన ప్రదర్శనల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గంటున్నారు. మేకలకు తోడేళ్లను సంరక్షకులుగా నియమించినట్లు ఒక పెద్ద ఫాస్ట్ ఫుడ్ కంపెనీ యజమాని ఆండ్రూపుడెర్‌ను కార్మికశాఖ మంత్రిగా నియమించటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావటంతో వుపసంహరించకతప్పలేదు. అనేక మంది పేదలకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఒబామా ఆరోగ్యసేవల పధకంగా పిలిచిన దానికి తూట్లు పొడిచేందుకు ట్రంప్ చేసిన యత్నాన్ని తాత్కాలికంగా అయినా కార్మికులు అడ్డుకోగలిగారు. ఒకవైపు కార్మికుల సంక్షేమ చర్యలను నీరు గార్చేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు రాబోయే పది సంవత్సరాల కాలంలో ధనికులు, కార్పొరేట్లకు లక్షన్నరకోట్ల డాలర్ల మేర పన్ను రాయితీలు ఇచ్చేందుకు చేసిన నిర్ణయాన్ని కార్మికులు అడ్డుకోలేకపోయారు. కార్మిక వ్యతిరేక చట్టాలకు అనుమతి, వుద్యోగ భద్రత రక్షణ, ఆరోగ్య రక్షణ వుపసంహరణ, ఆర్ధిక పరమైన రక్షణలకు మంగళం పాడే అనేక నిర్ణయాలకు అనుమతినిచ్చాడు. జాతీయ కార్మిక సంబంధాల బోర్డుతో సహా అనేక కమిటీలు, బోర్డులను కార్మిక వ్యతిరేకులతో నింపివేశారు.పర్యవసానంగా మూడు కార్మిక అనుకూల తీర్పులను తిరస్కరించారు. ట్రంప్ ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాలలో వున్న విబేధాలు కూడా ట్రంప్ కార్మిక వ్యతిరేకచర్యలను వేగవంతంగావిస్తున్నాయి.
ఒబామా సర్కార్ హయాంలోనే మంచివేతనాలతో కూడిన వుద్యోగాల సంఖ్య తగ్గి,వేతన మొత్తాలు తక్కువగా వుండే వుపాధి పెరుగుదల ప్రారంభమైంది. అది ట్రంప్ ఏడాది కాలంలో మరింతగా పెరిగింది. అందువలన నిరుద్యోగం తగ్గినట్లు కనిపించినా ఆరోగ్య సంరక్షణ, బార్లు, హోటళ్లలో పనిచేసే వారి సంఖ్య పెరిగింది. పర్యవసానంగా వేతన ఆదాయం తగ్గటంతో యూనియన్లలో చేరే కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోతోంది. దీంతో రాష్ట్రాలలలో కార్మిక వ్యతిరేక చట్టాలకు ప్రతిఘటన కూడా తగ్గిపోయింది.
అంతర్జాతీయ వ్యవహారాలలో డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి మిగతావారి కంటే భిన్నంగా కనిపించినప్పటికీ ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లు అమెరికా పాలకవర్గ మౌలిక ప్రయోజనాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీలేకుండా మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్ మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అయితే మీడియాతో వ్యవహరించేతీరులో, ట్విటర్ వ్యాఖ్యల విషయంలో అందరూ అనుకొంటున్నట్లుగా ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అన్నట్లుగానే వుంది. అమెరికాలో పెరుగుతున్న ఆర్ధిక అంతరాలు, ఆర్ధికరంగంలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న సంక్షోభం, ఇరాక్, ఆఫ్ఘ్‌నిస్తాలో తగిలిన ఎదురు దెబ్బలు, చైనాతో పెరుగుతున్న వాణిజ్యలోటు, లాటిన్ అమెరికాలో ప్రతిఘటన వంటి అనేక కారణాలు అంతర్జాతీయ రంగంలో అమెరికాను గుక్కతిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. తన సంక్షోభాన్ని ఎక్కడో ఒక చోట యుద్ధంద్వారానో మరో విధంగానో ఇతరులపై రుద్ధేందుకు ట్రంప్ యంత్రాంగం కూడా చేయని యత్నం లేదు. వుత్తర కొరియా అణు,క్షిపణి పరీక్షలను సాకుగా చూపి కాలుదువ్వటం దానిలో భాగమే. ఈ పూర్వరంగంలో ట్రంప్ ప్రభుత్వ వైఖరి భారత వుపఖండంలో ఎలా వుందో చూడటం అవసరం.
పాకిస్ధాన్ వుగ్రవాదులకు మద్దతు ఇస్తున్న కారణంగా అందచేస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ సర్కార్ గొప్పగా చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల సృష్టిలో, మన దేశంలో పంజాబ్, కాశ్మీరుల్లో వుగ్రవాదులకు అవసరమైన శిక్షణ, ఆయుధాల అందచేతలో అమెరికా ప్రయోజనాలకు అనుగుణ్యంగా పాకిస్ధాన్ వ్యవహరించిన తీరు లోకవిదితం.ఇంతకాలం తాము చేసిన సాయాన్ని తీసుకొని తమకు అబద్దాలు చెప్పటం, మోసం చేయటం తప్ప పాకిస్ధాన్ మాకు చేసిందేమీ లేదని అమెరికా ఆరోపించింది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో వైఫల్యాలకు అమెరికా తమను బలిపశువులుగా చేస్తోందని పాక్ రక్షణ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ ప్రతి విమర్శ చేశాడు. ఇప్పుడు అమెరికా సాయం నిలిపివేసినందున తమకు వచ్చే నష్టమేమీ లేదని పాక్ తిప్పికొట్టింది. చైనా తరువాత అతి పెద్దదిగా వున్న భారత మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు అమెరికా సామ,దాన,భేద,దండోపాయాలను అనుసరించింది. వుగ్రవాదులకు సాయం, ప్రోత్సాహం దానిలో భాగమే. ఇప్పటికీ అమెరికా మనపై వత్తిడి తెస్తూనే వుంది. వాణిజ్యం విషయంలో మన దేశంలోని కార్పొరేట్‌శక్తులు అటు సోవియట్‌ను ఇటు అమెరికా, ఇతర ఐరోపా ధనికదేశాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నించిన అనుభవాలున్నాయి. సోవియట్ అంతరించిన తరువాత చైనాకు వ్యతిరేకంగా పాకిస్ధాన్, మన దేశాన్ని కూడా తన గుప్పెటలో వుంచుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే దానికి భిన్నంగా జరిగిన పరిణామాలలో గత పాతిక సంవత్సరాలలో ఒక్కొక్క అడుగు మన దేశం అమెరికాకు దగ్గర అవటం, అదే సమయంలో చైనాకు పాకిస్ధాన్ దగ్గరయింది. దీంతో పాకిస్ధాన్‌కు సాయం నిలిపివేసి మన దేశానికి ఏదో మేలు చేస్తున్నట్లు ట్రంప్ ఫోజు పెడుతున్నాడు. నరేంద్రమోడీని, మన దేశాన్ని పొగుడుతూ మునగ చెట్టిక్కించటంతప్ప ఇంత వరకు ఏ ఒక్క విషయంలోనూ సానుకూల వైఖరిని అనుసరించలేదు. వీసాల విషయంలో లక్షలాది మంది భారత కార్మికులు, వుద్యోగులను భయకంపితులను గావించటంలో ఇప్పటివరకు అమెరికా అధ్య క్షులలో ట్రంప్ తరువాతే ఎవరైనా. ప్రపంచ రాజకీయాలలో మన దేశాన్ని జూనియర్ భాగస్వామిగా చేసుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రపంచ వేదికమీద భారత్‌కు విశ్వసనీయమైన భాగస్వామి కావాలి…… ఆ భాగస్వామి అమెరికానే, అది నూరేళ్ల బంధం ‘ అని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిలర్సన్ మనల్ని ఎక్కడికో తీసుకుపోయేందుకు ప్రయత్నించాడు. పెరుగుతున్న చైనా ప్రాభవాన్ని అడ్డుకొనేందుకు అమెరికా పెద్ద వ్యూహం పన్నింది. దానిలో మన దేశాన్ని నిలిపేందుకు పూనుకుంది. వాణిజ్యం విషయంలో మనపై అమెరికా తెస్తున్న వత్తిడిని దేశీయ కార్పొరేట్ శక్తులు ప్రతిఘటిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్ధలతో చేతులు కలిపి తాము కూడా లాభాలను పంచుకోవాలనుకుంటున్నాయి తప్ప తమ లాభాలను ఫణంగా పెట్టి అంతర్జాతీయ సంస్ధలకు లొంగిపోవాలని అవి కోరుకోవటం లేదు. అందువలన మన దేశం తనకు లొంగకపోతే మరోసారి పాకిస్ధాన్‌ను దగ్గరకు తీసుకొని మనపై దానిని ప్రయోగించినా ఆశ్చర్యం లేదు. పాకిస్ధాన్‌కు తాత్కాలికంగా సాయం నిలిపివేత ప్రచార ఆర్బాటం మనకు ఎర తప్ప చిత్తశుద్ధితో కాదు. పాక్‌తో పూర్తి సంబంధాలు తెగతెంపులు చేసుకొంటే అమెరికన్లకు ఎంత నష్టమో తెలియంది కాదు. అందువలన ట్రంప్ మెచ్చుకోళ్లకు మురిసిపోతే మనం వూబిలో దిగినట్లే. తనకు మాలిన ధర్మానికి పాల్పడినట్లు అమెరికా చరిత్రలో ఒక్కటంటే ఒక్క వుదంతం లేదు.