Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

త్వరలో ప్రధాని నరేంద్రమోడీ తన అధికార నాలుగోవార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. ఈ కాలంలో ఆయన వ్యతిరేకులకు, మద్దతుదార్లకు ఒక విషయంపై ఏకాభిప్రాయం వుంది. అదేమంటే ఆయన చెప్పేదొకటి చేసేదొకటి, పదవిలోకి వచ్చినప్పటి నుంచి దేశం గిడసబారిపోయింది తప్ప ఎదుగుల లేదు. ఏ దివాలాకోరు విధానాలనైతే కాంగ్రెసు అనుసరించిందో వాటినే మరింత వేగంగా అమలు జరుపుతున్నారు తప్ప కొత్తవి, సరైనవి లేనందున నరేంద్రమోడీ విఫలం కావటం అనివార్యమని ఆయన విధానాలను వ్యతిరేకించే వారు మొదటి నుంచీ బహిరంగంగా చెబుతున్నారు. మద్ధతుదార్లకు ఇప్పటికీ సమాధానం అంతుబట్టటం లేదు. ఆయన అనేక మంచి చర్యలను చేపట్టినప్పటికీ దేశం ఎందుకు గిడసబారిపోయింది, తీసుకున్న చర్యలు వ్యతిరేక ఫలితాలు ఎందుకు ఇస్తున్నాయి అనే ప్రశ్నలకు వారు అంతర్గతంగా తమలో తాము సతమతం అవుతున్నారు తప్ప బయట పడేందుకు సిద్ధం కావటం లేదు. పెద్ద నోట్ల రద్దుపేరుతో జనం దగ్గరున్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయించిన మోడీ ఇప్పుడు ఆ డిపాజిట్లను కొల్లగొట్టేందుకు పూనుకున్నారని అదే జనం గగ్గోలు పెడుతున్నారు. అనేక మంది బ్యాంకుల్లో వున్న డిపాజిట్లను వెనక్కు తీసుకోవాలా వద్దా తీసుకుంటే ఎక్కడ దాచుకోవాలి, తీసుకోకపోతే ఆ డిపాజిట్లను ఏదో ఒకసాకుతో స్వాహా చేస్తే ఎలా అనే గుంజాటనలో వున్నారు.

నల్లధనం వెలికితీత, వుగ్రవాదులకు నిధులు అందకుండా చేసేందుకో మరొక లోకకల్యాణం కోసమో పెద్ద నోట్లను రద్దుచేశామని చెబితే దేశ జనులందరూ నెలల తరబడి బ్యాంకుల ముందు క్యూలు కట్టి తమ వద్ద వున్న నోట్లను డిపాజిట్‌ చేయటం కొత్త నోట్లను తీసుకున్నారు. దానినొక దేశభక్తి కర్తవ్యంగా భావించారు. ఏడాది గడచిపోయినా ఇంకా నోట్ల రద్దుకు ముందున్న పరిస్ధితి పునరుద్ధరణ కాలేదు. ఏటిఎంలలో నో క్యాష్‌ బోర్డులు కనిపిస్తూనే వున్నాయి. రద్దయిన నోట్లెన్ని, నల్లధనం ఎంత బయటికి వచ్చిందో నోట్ల రద్దు వలన కలిగిన లాభమెంత, నష్టమెంత అని చెప్పేవారే లేరు. నోట్ల రద్దును ఎంతో ఘనంగా ప్రకటించిన మోడీ దాని లాభనష్టాల గురించి కనీసం మన్‌కీబాత్‌లో అయినా ఎందుకు చెప్పటం లేదు. రద్దయిన పాతనోట్లతో బ్యాంకుల గదులన్నీ నిండిపోయినందున నాణాలు పెట్టేందుకు స్ధలం లేనందున వాటి ముద్రణ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వుద్యోగుల ఆందోళనతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.పనికిరాని పాతనోట్లను ఇంకా ఎంతకాలం దాస్తారు, దాచి ఏం చేస్తారు? మరి నాణాలకు స్ధలం అంతలోనే ఎలా దొరికింది? ఏదో ఒకసాకుతో నాణాల ముద్రణ నిలిపివేసి టంకశాలలను మూసివేయటం లేదా నాణాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొనేందుకు వేసిన ఎత్తుగడ తప్ప నాణాలకు స్ధలం లేదంటే ఎవరైనా నమ్ముతారా? కేంద్ర ప్ర భుత్వం చెబుతున్న మాటలకు విశ్వసనీయత లేకుండా పోతోంది. నోట్ల రద్దు తాత్కాలికంగా ఆర్ధిక వ్యవస్ధకు చేటు తెచ్చినప్పటికీ అభివృద్ధి కొద్ది నెలల్లోనే తిరిగి పట్టాలెక్కుతుందని ఆర్ధికవేత్తలనేక మంది ప్రభుత్వానికి మద్దతు పలికారు.2017 ఏప్రిల్‌ నుంచి జూన్‌ మాసానికి అభివృద్ధి 6.5-7శాతం వరకు వుంటుందని అనేకమంది అంచనాలు వేశారు. తీరా అది 5.7శాతమని ప్రభుత్వమే ప్రకటించటంతో ఆర్ధికవేత్తల నోళ్లు మూతబడ్డాయి. రోగి తట్టుకోగలిగినపుడే ఆపరేషన్‌ చెయ్యాలి, అందుకే ఇప్పుడు నోట్లు రద్దు చేశామని చెప్పిన నరేంద్రమోడీ చర్యతో వున్న ఆరోగ్యం కాస్తా మరింత దిగజారింది.

నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు మనం దిగుమతి చేసుకున్న పీపా ముడి చమురు ధర 109 డాలర్లయితే ఇప్పుడు 56 డాలర్లకు అటూ ఇటూ వుంది. మోడీ తొలి మూడు సంవత్సరాలలో ఇంకా తక్కువ వుంది. ఖజానాకు ఎంతో కలసి వచ్చింది. కానీ వినియోగదారుడికి ఏం ఒరిగింది. తిరిగి పెట్రోలు మూడేండ్ల గరిష్టానికి చేరింది. డీజిల్‌పై సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారు, గ్యాస్‌, కిరోసిన్‌పై నొప్పి తగుల కుండా ప్రతినెలా కొంత చొప్పున కోత పెడుతున్నారు. చిల్లర ద్రవ్యోల్బణం అదుపులో వుందని, ధరల పెరుగుదల తక్కువగా వుందని సంతోషిస్తున్నవారికి అది కూడా పెరగటం ప్రారంభమై 5.13శాతానికి చేరినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. నోట్ల రద్దు ప్రయోజనం ఏమైనట్లు, జిఎస్‌టి విప్లవ ఫలితాలేమిటి? వుత్పత్తి పడిపోయింది, ఎగుమతులు తగ్గిపోయాయి, దిగుమతులు పెరుగుతున్నాయి. దేశాన్ని ఎటు తీసుకుపోతున్నట్లు ? వాస్తవ పరిస్ధితిని దాచి తిమ్మినిబమ్మిని చేసేందుకు, అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకు కొత్త సమస్యలను ముందు తెచ్చి ఇంతకాలం ప్రయత్నించారన్న అనుమానం కలుగుతోంది. ఏదైనా అసలు ప్రధాని నోరు విప్పి వాస్తవాలు చెబితే కదా !

ఇక బ్యాంకుల్లో వున్న జనం డిపాజిట్లను ప్రభుత్వం తీసుకుంటుందటగా అనే జన ఆందోళన గురించి చూద్ధాం. ఇది ఆధారం లేని లేదా నరేంద్రమోడీని వ్యతిరేకించే ప్రతిపక్షాలు చేసే ఆరోపణ కాదు. స్వయంగా నరేంద్రమోడీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఫైనాన్సియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌(ఎఫ్‌ఆర్‌డిఐ) బిల్లులోనే వుంది. తాజాగా ముగిసిన శీతాకాల సమావేశాల చివరి రోజున పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లును సెలెక్టు కమిటీకి పంపారు. అది తరువాత ఏమౌతుందో చూడాల్సి వుంది. వున్నది వున్నట్లుగా బిల్లును ఆమోదించినట్లయితే జరిగేదేమిటో చూద్దాం. బ్యాంకుల పరిస్ధితి ప్రాణాంతకంగా అంటే తీవ్రపరిస్ధితి ఏర్పడినపుడు పరిష్కరించేందుకు వ్యవస్ధ ‘రిజల్యూషన్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటు ఈ బిల్లులో వుంది. దీనిలో ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ అధికారులే సభ్యులుగా వుంటారు. బ్యాంకుల పరిస్థితి సంక్లిష్టంగా మారినపుడు డిపాజిట్లతో సహా డబ్బుదాచుకున్నవారి సొమ్మును బ్యాంకులు దివాలా ఎత్తకుండా వినియోగించేందుకు పరిశీలించే అవకాశం ఈ కార్పొరేషన్‌కు దఖలు పడుతుంది. ఇప్పటి వరకు అటువ ంటి పరిస్ధితులు ఏర్పడితే అంటే విజయమాల్య వంటి వారు తీసుకున్న వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయినా, స్వదేశంలోనే వుండి కాళ్లు బార్లా చాపినా దివాలా తీసిన లేదా అంతదగ్గరగా వెళ్లిన ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వమే బడ్జెట్‌ ద్వారా నిధులు ఇచ్చి వాటిని నిలబెడుతోంది. దీన్నే బెయిల్‌ అవుట్‌ అంటున్నారు.ఇప్పుడు పార్లమెంటులో ప్రవే శపెట్టిన బిల్లులో బెయిల్‌ ఇన్‌ అనే కొత్త పద్దతిని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం తాను ఆదుకొనే బాధ్యతను వదిలించుకొని అవసరమైతే డిపాజిటర్ల సొమ్ముతోనే బ్యాంకులను నిలబెడతారు. అప్పుడేమవుతుంది. ఏమైనా జరగవచ్చు. బ్యాంకులు దివాలా తీస్తే బ్యాంకులలో డిపాజిట్లు చేసుకున్నవారిలో లక్షలోపు వున్నవారికి బీమాను వర్తింప చేసి వారికి చెల్లించటం జరుగుతోంది. దీనికి గాను రిజర్వుబ్యాంకుకు అనుబంధంగా వుండే డిపాజిట్‌ ఇన్సూరెన్సు అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ద్వారా సొమ్ము చెల్లిస్తారు. కొత్త బిల్లు ప్రకారం దాన్ని మూసివేస్తారు, దాని స్ధానంలో కొత్త వ్యవస్ధ గురించి ప్రస్తావన లేదు. నిజానికి ఆ సంస్ధకంటే ఇప్పటి వరకు ప్రభుత్వ బ్యాంకుల మీద జనంలో వున్న నమ్మకం ముఖ్యమైనది. గతంలో ప్రయివేటు బ్యాంకుల అనుభవాలను చూసిన జనం బ్యాంకులకు బదులు ఇండ్లలోనే డబ్బుదాచుకొనేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. తరువాత బ్యాంకుల జాతీయకరణతో వడ్డీ తక్కువ ఇచ్చినప్పటికీ ఆ నమ్మకం ఎంతోపెరిగింది. ఇప్పుడు దానికి ముప్పు వచ్చింది. నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు, మరోసారి పెద్ద నోట్ల రద్దు అనే ప్రచారాల నడుమ ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లుతో బ్యాంకు డిపాజిట్లు కూడా సురక్షితం కాదనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ఈ భావం మరింత పెరిగితే బ్యాంకులకు డిపాజిట్లు తగ్గిపోతాయి. బంగారం, ఇండ్ల స్ధలాలు, భూముల రూపంలో దాచుకొనేందుకు జనం చూస్తారు. ఇది ఆర్ధిక కోణంలో చూస్తే తిరోగమనమే.

ప్రతిదానిని తమ ఘనతగా చూపేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయద్రవ్య సంస్ధలు, విదేశీ కార్పొరేట్‌ కంపెనీల వత్తిడి మేరకు దేశమంతటా ఏకరూప పన్ను విధానం వుండాలని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ప్రతిపాదించింది. అప్పుడు ప్రతిపక్షంలో వున్న బిజెపి దానిని వ్యతిరేకించింది. తీరా తాను అధికారానికి వచ్చిన తరువాత తన ఘనతగా చెప్పుకొంటోంది. ఇప్పుడు ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు ద్వారా డిపాజిటర్లకు మరింత రక్షణ కల్పిస్తామని, రుణాలు ఎగవేసినవారిపై మరింత కఠినచర్యలు తీ సుకొనేందుకే ఈ బిల్లును తెస్తున్నట్లు చెబుతోంది. పది సంవత్సరాల కితం అమెరికాలోని బడా బ్యాంకులు దివాలా తీసిన తీరు చూసిన బ్యాంకులను ఆదుకొనేందుకు డిపాజిటర్ల సొమ్మును వాడుకోవటంతో సహా వివిధ చర్యలను చేపట్టేందుకు విధంగా ఒక వ్యవస్ధను ఏర్పాటు చేయాలని భారత్‌ భాగస్వామిగా వున్న జి20 దేశాల కూటమి నిర్ణయించింది. దాని పర్యవసానమే ఈ బిల్లు.

ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అమెరికా, ఐరోపా వంటి ధనిక దేశాలలో బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్దలన్నీ ప్రయివేటు రంగంలో వున్నాయి. అటువంటివి దివాలా తీసినపుడు ప్రభుత్వ సొమ్ముతో ఆదుకోవటానికి, ప్రభుత్వరంగంలోని బ్యాంకులు దివాలా తీసినపుడు వాటిని ఆదుకొనేందుకు ప్రజల సొమ్మును వినియోగించటానికి తేడా వుంది. ప్రభుత్వరంగంలోని బ్యాంకులు పాలకపార్టీల నేతలతో కుమ్మక్కయ్యే పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు లక్షల కోట్ల రూపాయలు రుణాలిస్తున్నాయి. వాటిని పక్కదారి పట్టించి, కాగితాల మీద దివాలా చూపించి రుణాలు ఎగవేస్తున్నవారే ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి కుమ్మక్కు, కావాలని ఎగవేసే వారిని నియంత్రించటం, వసూలు చేయటం ఒక అంశం. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ పధకాలు, సామాజిక అవసరాలను కూడా తీరుస్తున్నందున అవి ఇబ్బందులలో పడినపుడు వాటిని ఆదుకోవటానికి ప్రభుత్వ నిధులు కేటాయించటంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు ప్ర భుత్వం ఆ బాధ్యతను కూడా విస్మరించి డిపాజిటర్ల సొమ్ముతోనే ఆపని చేసేందుకు పూనుకుంది. అంటే కుమ్మక్కు, కావాలని ఎగవేసే రుణాలు ఇంకా పెరిగేందుకు అవకా శం వుంటుంది. ఇప్పటి వరకు మన దేశ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అటువంటి పారుబాకీల సమస్య వున్నప్పటికీ మొత్తం మీద అవి నిర్వహిస్తున్న పాత్రతో పోల్చితే వుద్యోగ సంఘాలు సూచిస్తున్న విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటే అధిగమించరాని పెద్ద సమస్య కాదు.

ప్రపంచ ద్రవ్యపెట్టుబడిదారులు బ్యాంకులలో ప్రభుత్వ పాత్ర తగ్గాలని డిమాండ్‌ చేస్తున్నారు. పశ్చిమ దేశాల బ్యాంకింగ్‌ వ్యవస్దకు మనకు చాలా తేడా వుంది. దాని రోగం వేరు. బాసల్‌ పేరుతో పశ్చిమ దేశాల బ్యాంకుల రోగానికి సూచిస్తున్న చికిత్సను మన జాతీయ బ్యాంకులకు చేయటం అర్దంలేని పని. బాసల్‌ పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వం తన వాటాను తగ్గించుకొని బ్యాంకులలో తగిన మేర నిధులు వుంచే పేరుతో ప్రయివేటీకరణకు బాటలు వేస్తున్నది. ఇప్పుడు డిపాజిటర్ల సొమ్ముతో ప్రభుత్వ బ్యాంకుల దివాలాను నిరోధించటమంటే అది మరింత వేగం కావటానికి దారి తీస్తుంది. బ్యాంకులు దివాలా తీసినపుడు డిపాజిట్లలో కొంత మొత్తాన్ని బ్యాంకుల వాటా ధనంగా మార్చుతారు. అది మరోసారి దివాలా తీస్తే గీస్తే వాటాల ధర మరింతగా పతనం అవుతుంది. సొమ్ము అవసరమైన వారు ఆ వాటాలను అయినకాడికి, లేదా అవసరం అయినపుడు ప్రయివేటు వారికి అమ్ముకోవటం తప్ప మరొక మార్గం వుండదు. తన వాటాలనే విక్రయిస్తున్న ప్రభుత్వం సామాన్యడిపాజిటర్ల వాటాను కొనుగోలు చేస్తుందని ఎలా భావించగలం? ప్రభుత్వం ఒక వైపున బ్యాంకులకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు 2.11లక్షల కోట్లను ప్రభుత్వ రంగబ్యాంకులకు సమకూర్చనున్నట్లు ప్రకటించింది. అలాంటపుడు బిల్లు ద్వారా డిపాజిటర్ల సొమ్ము వినియోగానికి అవకాశ ం కల్పించటం ఎందుకు అనే ప్ర శ్న వుత్పన్నం అవుతోంది. ఈ బిల్లును యధాతధంగా ఆమోదిస్తే రానున్న రోజుల్లో డిపాజిట్లకు భద్రత సమస్యకు నాందిపలికినట్లే. లేదు కొంత మంది చెబుతున్నట్లుగా బిల్లు ఆమోదం పొందటం కోసం ప్రభుత్వరంగ బ్యాంకు డిపాజిట్లకు తాత్కాలిక మినహాయింపు ఇచ్చినా తరువాత దొడ్డిదారిన దానిని అమలు జరపరన్న గ్యారంటీ ఏముంది? పాలకుల మాటలు నీటి మీది రాతలు, అందునా అవసరమైనపుడు హడావుడి చేసి ఆనన నోరు మెదపని నరేంద్రమోడీ వంటి వారి చేతలు మరింత ప్రమాదకరం. ఆలోచించండి ! నిన్న జనానికి ప్రయోజనం లేని, దేశానికి నష్టం కలిగించిన పెద్ద నోట్ల రద్దు, నేడు సామాన్య డిపాజిటర్ల సొమ్ము కొల్లగొట్టేందుకు ఎఫ్‌ఆర్‌డిఐ, రేపు ఏ ముప్పు తేనున్నారు మోడీ గారూ అని అడగాల్సిన తరుణం రాలేదా ?