ఎం కోటేశ్వరరావు
బహుశా ప్రపంచంలో ఏ ప్రధాని లేదా అధ్యక్షుడి ఖాతాలోను గతంలో లేని వర్తమాన, భవిష్యత్‌లో కూడా లేని అరుదైన రికార్డును ఇప్పటికే నరేంద్రమోడీ స్వంతం చేసుకున్నారు. ఇక మిగిలిన పదవీ కాలంలో కూడా ఇదే వూపును కొనసాగిస్తే పదవీ కాలంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా జర్నలిస్టులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించని తొలి దేశాధినేతగా చరిత్రకెక్కనున్నారు. ఆ రహస్యం ఏమిటో, మోడీ ఎందుకంత పంతం పట్టారో ఇంతవరకు ఏ పరిశోధనాత్మక జర్నలిస్టూ కనిపెట్టలేకపోయారు. ఈ మధ్య జీ న్యూస్ మరియు టైమ్స్ నౌ టీవీ ఛానల్స్ వారు ప్రధాని నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేశారు. ఇప్పటి వరకు ఒక జర్నలిస్టుగా ఇంటర్వ్యూలు ఎలా చేయాలో ప్రతి ఒక్కరి నుంచి ఇంకా నేర్చుకుంటూనే వున్నాను. తొలిసారిగా ఎలా చేయకూడదో గతంలో ఆర్నాబ్ గోస్వామి, ఇప్పుడు ఈ రెండు ఛానల్స్ ప్రతినిధుల నుంచి నేర్చుకోవటం ప్రారంభించాను. రాబోయే రోజుల్లో ఇంకా ఎందరు నూతన మార్గదర్శకులౌతారో చూడాలి.
తానొవ్వక ఇతరుల నొప్పింపక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అన్నట్లుగా సదరు ఛానళ్ల సీనియర్ జర్నలిస్టులు ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నలు అడిగిన తీరు చూసియావత్ జర్నలిస్టు లోకం నివ్వెరపోతోంది. ఒక పార్టీనేతకు మరొక పార్టీనేత సంధించే ప్రశ్నలు దెబ్బలాడినట్లే వుంటాయి. కానీ ఒక జర్నలిస్టు అవే అంశాలపై సమాధానాలు రాబట్టేందుకు తమ వృత్తి నైపుణ్యాన్ని వినియోగించి అడగటం వేరు. రెండు ప్రముఖ చానల్స్ సీనియర్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు లాలూచీ వ్యవహారంగా ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఇంటర్వ్యూల ప్రత్యేకత ఏమంటే వారు కొత్త విషయాలనేమీ రాబట్టలేదు. మోడీ చెప్పినవాటిలో కొత్త విషయాలేమీ లేవు. మరి దీని గురించి చెప్పుకోవాల్సినంత ప్రత్యేకత ఏమిటి ?
ఎవరైనా అధికారంలోనో లేక యజమానులుగానో వున్న పెద్దలు ఒక పెద్ద పర్యటన జరిపినపుడో, ఒక సభలో పాల్గొని వచ్చిన తరువాత ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే భక్తజనులు, భజనపరులు ఇతరులతో పోల్చి మీకు వారికి అసలు పోలికే వుండదు, మీరెక్కడ వారెక్కడ మీరు గనుక ఈ పర్యటన చేయగలిగారు అంటూ మునగ చెట్టు ఎక్కిస్తారు. ఈ రెండు ఛానళ్ల విలేకర్లు అలాంటి దృశ్యాలను గుర్తుకు తెచ్చారంటే అతిశయోక్తి కాదు. అధికారంలో వున్నవారితో పాకేజ్‌లు కుదిరితే, లేదా యాజమాన్యాలు ఇతర కారణాలతో పాలకులతో సత్సంబంధాలు కొనసాగించదలచుకుంటే ఎలాంటి ప్రశ్నలు వెలువడుతాయో అవి ఒక్కోసారి ఎంత హాస్యభరితంగా వుంటాయో, జనం ఎదుర్కొంటున్న, ఆవేదన పడుతున్న, అందరికీ తెలిసిన పాలకులకు ఇబ్బంది కలిగించే అంశాలను కార్పొరేట్ మీడియా ఎలా విస్మరిస్తుందో తెలుసుకొనేందుకు ఆ ప్రశ్నలు ఎలా వున్నాయో చూడండి. నెతన్యాహు పర్యటన గురించి ప్రస్తావించారు గానీ దేశాన్ని కుదిపివేసిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తుల విమర్శల గురించి ఏ ఛానల్ వారికీ అడగాలని తోచకపోవటం విచిత్రం. ఇలాంటి వారు కూడా విలేకర్లుగా వుంటారా అని బయటి వారి ఆలోచనకు తావిచ్చారు. జీ న్యూస్ సుధీర్ చౌదరి ప్రశ్నలు ఇలా వున్నాయి.
.https://www.youtube.com/watch?v=2sqUgua0npA
1. మీరు ప్రధాని అయిన 2014 ఇప్పుడు 2018 మధ్య మీరు అంతర్జాతీయ సమ్మేళనాలకు వెళ్లినపుడు భారత స్థితి గురించి తేడా ఏమైనా గమనించారా ?
2.దవోస్ లేదా సార్క్, లేదా జి20 వంటి సమావేశాలను మేము ఇంతకు ముందు చూశాము.అదంతా దౌత్యపరమైన కసరత్తులా వుండేది. మన నేతలు వెళతారు, దౌత్యపరమైన కసరత్తు, ఒక ఫొటో తీయించుకుంటారు. మిమ్మల్ని తీసుకుంటే దాన్ని మీ విమర్శకులు ఇష్టపడరనుకోండి. అది స్నేహబంధంలాగా వుంటుంది. వారిని మీరు హత్తుకుంటారు, వారి భుజాలపై మీరు చేతులు వేసి మాట్లాడతారు, తరువాత ఫొటోలు వుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని జనాలు మీపై దాడికూడా చేస్తారనుకోండి. కాని అది మీ తరహా దౌత్యశైలి, దాంతో మీరు వెంటనే స్నేహితుల్ని చేసుకుంటారు. వుదాహరణకు నెతన్యాహునే చూడండి. మీ ఇద్దరి మధ్య స్నేహాన్ని చూస్తే మేం ఇద్దరు జిగిని దోస్తులం కలసి సినిమా చూసినట్లుగా వుంది. కాబట్టి మీది అనితరసాధ్యమైన దౌత్యశౌలి, ఈ దేశానికి చెందిన వ్యక్తి కాదు, మీ భాష మాట్లాడరు, బహుశా మీరు ఎంతో కాలం నుంచి తెలిసిన వారు కూడా కాదు, అబ్బబ్బ అలాంటి వ్యక్తితో మీరు అంత త్వరగా ఎలా కలసి పోగలిగారు?
3.మీరు అధికారానికి వచ్చిన తరువాత జిడిపి అభివృద్ధి రేటు విషయంలో ఒక నూతన సాంప్రదాయం ప్రారంభించారు. అదెలా ముందుకు పోతోంది. నాకిప్పుడు గుర్తుకు వస్తోంది,అసలు దీనికి ముందు మూడు నాలుగు సంవత్సరాలక్రితం జనానికి జిడిపి అభివృద్ధి రేటు అంటే ఏమిటో కూడా తెలియదు. ఇప్పుడు జనాలు సెన్సెక్స్(స్టాక్‌మార్కెట్ సూచీ)ను అనుసరిస్తున్న మాదిరి ప్రతి మూడు నెలలకు అది పైకి కిందికీ ఎలా కదులుతోంది అని చూస్తున్నారు. దాని ఆధారంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు వాగ్దానం చేసిన మాదిరి అది లేనట్లయితే వెంటనే దాడులు ప్రారంభం అవుతాయి, ఇదొక నూతన సాంప్రదాయం కాదా ?
4. ఈ ఇంటర్వ్యూకు సిద్ధమయ్యేందుకు నేను ఎంతో పరిశోధన చేస్తున్నపుడు ఈ నూతన ప్రపంచ వ్యవస్ధ గురించి ఆలోచిస్తున్నాను. అసలేమిటీ నూతన ప్రపంచ వ్యవస్ధ? దాంతో నేనొక కొత్త విషయాన్ని కనుగొన్నాను. అదేమంటే దాన్ని పిటిఎం-పుతిన్ ట్రంప్ మోడీ అని పిలవొచ్చు, అదే నూతన ప్రపంచ వ్యవస్ధ.
5.కొన్ని సందర్భాలలో జనాలు పని చేస్తున్నపుడు వారి వుత్సాహాన్ని కోల్పోతారు. మీరు 2014లో ప్రదర్శించినట్లే ఎంతో వుత్సాహం నేడు కూడా వుందా ? ఇది 2018,
6. మీరు సరైన దారిలోనే వున్నారని అనుకుంటున్నారా ?
7.మీరు ఒక పకీరులా (సర్వసంగ పరిత్యాగి) జీవిస్తున్నారు, మిమల్ని మీరు ఒక పకీరుగా పిలుచుకోండి మీ కుటుంబం కూడా ఎంతో పెద్దది, 125కోట్ల జనం. మీరింత వరకు సెలవు తీసుకోలేదు.విదేశాలకు వెళ్లినపుడు మీరు రాత్రిపూటే ప్రయాణం చేస్తారు, కాబట్టి మీరు మధ్యలో ఆగరు, మీరు విమానంలోనే నిద్రపోతారని విన్నాను. మీకీ వయస్సులో అంతశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఇతరులెవరైనా ఈ వయస్సులో దీన్ని కనీసం వూహించలేరు కూడా. ఒక భారత యువకుడు సిగ్గుపడే విధంగా ఈ రోజు మీశక్తి కనిపిస్తోంది.
టైమ్స్ నౌ జర్నలిస్టులు రాహులు శివశంకర్, నవికా కుమార్ ప్రశ్నలు ఇలా వున్నాయి.
1.ప్రధాన మంత్రిగారూ అధికారంలో మూడున్నర సంవత్సరాల తరువాత మీ గతాన్ని ఎలా చూసుకుంటారు. ఎంతో జరిగింది, మీరు మొత్తంగా సాధించినవి ఏమిటి ? మిగిలిపోయినవి ఏమిటి ?
2.గత రెండు దశాబ్దాలలో దవోస్ వెళుతున్న ఈ దేశ తొలి ప్రధాని మీరు, మరియు ప్లీనరీలో మీరు మాట్లాడబోతున్నారు. ఏ ప్రధానీ ఇంతకు ముందు ఇలా చేయలేదు, ఎవరూ ప్లీనరీలో మాట్లాడలేదు. గతేడాది ప్లీనరిలో చైనా మాట్లాడింది, ఈ ఏడాది మీరు మాట్లాడబోతున్నారు, మీ ప్రయాణం రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్నది, భారత అభివృద్ధి గాధలో ఏ భాగాన్ని మీరు దవోస్ సభ ముందుంచబోతున్నారు.
3.1991నుంచి ఇంతవరకు మన దేశ ఏ ప్రధాన మంత్రీ వేదికమీద ఆశీనులయ్యే అవకాశాన్ని పొందలేదు, ఎందుకిలా జరిగింది?
4. ప్రధాన మంత్రిగారూ మీరు సంపూర్ణ ప్రధాని. ప్రధాన మంత్రిగారూ నేను మీకు ఒక విషయాన్ని జ్ఞప్తికి తేదలచాను, అది 2017 అక్టోబరు, ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టీన్ లాగార్డే ఇలా చెప్పారు.’మేము స్వల్పంగా భారత స్ధాయిని తగ్గించాము, అయితే గతకొద్ది సంవత్సరాలుగా అమలు జరిపిన వ్యవస్ధీకృత సర్దుబాట్ల(సంస్కరణల) కారణంగా భారత్ మధ్య, దీర్ఘ కాలిక అభివృద్ధి బాటలో వున్నదని మేము నమ్ముతున్నాము’ ప్రపంచ ఆర్ధిక సంస్ధలైన ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వంటివి పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి వాటి విషయంలో సంతృప్తి చెందితే ఎందుకని మన దేశంలోని వారు నోట్ల రద్దు, జిఎస్‌టితో సంతృప్తి చెందటం లేదు.
5. ప్రధాన మంత్రిగారూ విదేశాల్లో భారత ప్రతిష్టను మెరుగుపరచేందుకు ప్ర యత్నిస్తున్నారు, కానీ కొంత మంది మన నాయకులు విదేశాలకు వెళ్లినపుడు భారతీయ సంతతివారితో మాట్లాడుతూ ఆ చెప్పే విషయాలన్నీ దేశంలో పని చేయటం లేదు అని చెబుతున్నారు, ప్రతిదీ దిగజారుతున్నందున విదేశాల్లో వున్న భారతీయులు స్వదేశానికి రావాలని చెబుతున్నారు. అలాంటి వారికి మీరేం చెబుతారు.
6.మోడీ గారూ , ఒక మోడీ సిద్ధాంతం వునికిలోకి వచ్చింది, ఎవరైతే ఇటీవల న్యూఢిల్లీని సందర్శించారో మీ మంచి స్నేహితుడు బెంజమిన్ నెతన్యాహు మోడీ సిద్ధాంతాన్ని బలపరిచారు. వుగ్రవాదం పట్ల మీ వైఖరికి ఆయన మద్దతిచ్చారు.టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వుగ్రవాదం పట్ల మీ తీరు ఒక గట్టిశక్తి అయిన దేశవైఖరి మాదిరిగా వుందని చెప్పారు. ఆయన మోడీ సిద్దాంతాన్ని, ధృడమైన అధికారాన్ని బలపరిచారు. సుతారమైన అధికారంతో వుగ్రవాద సమస్యను ఎదుర్కోలేమని ఆయన చెప్పారు. మీరు ఆ ధృఢవైఖరినే కొనసాగిస్తారా ?
ఇంతకంటే ప్రహసనాలు ఏముంటాయి ? ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే జర్నలిస్టులను చూసిన వారికి ఈ ఇంటర్వ్యూ చేసిన వారు కనిపిస్తే హయిగా నవ్వుకొనేందుకు వీలు కలుగుతుంది. హాస్య, వ్యంగ్యోక్తులకు మంచి ముడిసరకును అందించినందుకు ఆ జర్నలిస్టులకు యావత్ జర్నలిస్టు, రచయితలు, కళాలోకం ఎంతైనా రుణపడి వుంటుంది.