Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో శుక్రవారం రాత్రి పన్నెండు గంటల నుంచి అక్కడి ప్రభుత్వం పనిచేయటం ఆగిపోయింది. మూడు రోజుల తరువాత ముగిసింది. దీనికంటే ముఖ్యవిషయం ఏమంటే డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ పెద్దమనిషి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది గడచిన సందర్భంగా లక్షలాది మంది మహిళలు అమెరికా అంతటా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం మూతపడినందువలన ఎక్కువగా ప్రభావితమయ్యేది మిలిటరీ గనుక తెరిచేందుకు ముందుకు రావాలని మూతకు కారకులైన డెమోక్రాట్లకు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశాడు. ఏడాది పాలనలో తన ఆర్ధిక విజయం, సంపదల సృష్టికి గాను పండుగ చేసుకొనేందుకు ఈ రోజు ప్రదర్శనలు మహిళలకు ఇది సరైన సమయం అంటూ ట్రంప్‌ వారిని రెచ్చగొట్టే విధంగా మరో ట్వీట్‌ద్వారా వ్యాఖ్యానించాడు. నిజానికి ప్రభుత్వ మూత అనేది పెద్ద్ద ప్రహసనం. డెమోక్రాట్లను బందీలుగా మార్చటంతో మరో మార్గం లేక దిగి వచ్చారని అధ్యక్షుడు ట్రంప్‌ తనదైన శైలిలో మూత ముగిసిన తరువాత ట్వీట్‌ చేశాడు. అధ్యక్షుడు తమతో తెరవెనుక ఒప్పందానికి వచ్చారని డెమోక్రాట్‌ సెనెటర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. వలసదారుల సమస్యలపై తరువాత చర్చ జరిపేందుకు రిపబ్లికన్లు సమ్మతించారు గనుక డెమోక్రాట్లు మూత ఎత్తివేతకు అంగీకరించారని వార్తలు. అయితే అలాంటి చర్చ జరుగుతుందో లేదో హామీ లేదని, డెమోక్రాట్లు దేనిమీదా గట్టిగా నిలబడరని మరోసారి రుజువైందని అనేక విమర్శలు వచ్చాయి. రెండు రోజు తరువాత స్వయంగా ట్రంపే అసలు విషయాన్ని బయటపెట్టారు. అక్రమ వలసదారులను నిరోధించేందుకు మెక్సికో-అమెరికా సరిహద్దులలో నిర్మించతలపెట్టిన గోడ నిర్మాణానికి 25బిలియన్‌ డాలర్ల ఖర్చుకు బడ్జెట్‌లో డెమోక్రాట్లు ఆమోదం తెలిపితే పది పన్నెండు సంవత్సరాల వ్యవధిలో చిన్నవయస్సులో చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామని విలేకర్లతో చెప్పారు. ఇది సమస్యను మరోవైపు మళ్లించేయత్నం తప్ప పరిష్కారానికి చిత్తశుద్ది కనిపించటం లేదు.

ప్రపంచంలో ఎక్కడా ఏ రోజూ, ఏక్షణం కూడా ప్రభుత్వ వ్యవస్ధలు మూతపడటం అనేది లేదు. అదొక మిధ్య అంటే అతిశయోక్తి కాదు. ట్రంప్‌ ఒక సామ్రాజ్యవాద ప్రతినిధి కనుక ఆ పెద్దమనిషి నోటి నుంచి ఆ భాషే వెలువడుతుంది. నిజానికి మూతపడిన రోజుల్లో పనికి దూరమైన ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు నష్టపోతారు, ఆమేరకు వారు చేసే ఖర్చు తగ్గుతుంది కనుక ఆమేరకు వ్యాపారలావాదేవీలు, వ్యాపారులకు లాభాలు తగ్గుతాయే తప్ప నష్టపోయేదేమీ వుండదు. సంక్షేమ పధకాలు నిలిచిపోతాయి. వుద్యానవనాలు, మ్యూజియంలు, ఇతర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్శనీయ స్ధలాలు మూతపడిన కారణంగా వచ్చే ఆదాయాన్ని కూడా నష్టంగా లెక్కవేస్తున్నారు. వాయిదా పడిన సేవలు తరువాత అయినా అందించేందుకు వీలుంటుంది కనుక వాటిని నష్టాలుగా చెప్పటం కొంతమేరకు అతిశయోక్తి అవుతుంది.

అసలు అమెరికా ప్రభుత్వం ఎందుకు మూతపడింది ? నాలుగు దశాబ్దాల క్రితం సవరించిన రాజ్యాంగం ప్రకారం బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంట్‌లోని వుభయ సభలు నిర్ణీత మెజారిటీ ఓటుతో ఆమోదించాల్సి వుంది. సాధారణంగా మన పార్లమెంట్‌, అసెంబ్లీ సమావేశాలలో అలాంటి సందర్భాలు వచ్చినపుడు ఓటింగ్‌లో పాల్గనటం గురించి రాజకీయ పక్షాలు అవసరమైతే విప్‌లు జారీ చేస్తాయి. అమెరికాలో అలాంటి ఏర్పాట్ల గురించి, మన మాదిరి అక్కడ కూడా జరిగే అపహాస్యాలు, ప్రహసనాల లోతుల్లోకి పోలేదు కనుక వాటి గురించి పక్కన పెడదాం. పార్లమెంట్‌ ఎగువ సభసెనెట్‌లోని వంద స్ధానాలకు గాను రిపబ్లికన్లకు 51,డెమోక్రాట్లకు 47 మంది, ఇద్దరు స్వతంత్రులు వున్నారు. బడ్జెట్‌ ఆమోదానికి కనీసం 60మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రభుత్వఖర్చుల ఆమోదానికి శుక్రవారం నాడు (మన ఓట్‌ఆన్‌ అకౌంట్‌ మాదిరి) జరిగిన ఓటింగ్‌లో అనారోగ్యం కారణంగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఒకరు గైర్హాజరు కాగా 50 మంది అనుకూలంగానూ 49 వ్యతిరేకంగానూ ఓటు చేశారు. ఐదుగురు అధికార పక్ష సభ్యులు ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటు చేయగా ఐదుగురు ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా తమ పార్టీ వైఖరికి విరుద్దంగా ఓటు చేశారు. దాంతో తగిన మద్దతు లేక బిల్లు వీగిపోయింది. నిధుల మంజూరు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి నిలిచిపోయింది. దీన్నే ప్రభుత్వ మూత అంటున్నారు. ఒప్పందం కుదిరిన తరువాత జరిగిన ఓటింగ్‌లో సెనెట్‌లో 81-18, దిగువ సభ కాంగ్రెస్‌లో 266-150 మెజారిటీతో ప్రతిష్టంభన ముగిసింది.

బడ్జెట్‌కు వుభయ సభల ఆమోదం, అదుపునకు సంబంధించి దశకలో నిబంధనలు సవరించిన తరువాత 1976 నుంచి ఇలాంటి మూతలు తాజా వుదంతంతో సహా పద్దెనిమిది సార్లు జరిగాయి. ఇవి ముగ్గురు రిపబ్లికన్లు, ముగ్గురు డెమోక్రాట్‌ పార్టీల అధ్యక్షుల హయాంలో జరిగాయి. పదకొండు సార్లు డెమోక్రాట్లు కారణంకాగా ఏడు రిపబ్లిక్‌ పార్టీ ఖాతాలో వున్నాయి. వీటిని స్ధూలంగా పరిశీలించినపుడు అత్యధిక సందర్భాలలో కార్మికవర్గానికి వ్యతిరేకమైన ప్రతిపాదనలను ముందుకు తెచ్చినపుడే జరిగాయని గమనించవచ్చు. రెండు పార్టీలు ఒకే వర్గానికి ప్రాతినిధ్యం వహించుతాయనే విషయంలో ఎలాంటి భ్రమలకు లోనుకానవసరం లేదు. వున్నంతలో ఏది తక్కువ హాని చేసే పార్టీ అని బేరీజు వేసుకొని మెజారిటీ కార్మికవర్గం,వలస కార్మికులు డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారులుగా వుంటున్నందున వారిని నిలబెట్టుకొనేందుకు ఆ పార్టీ రిపబ్లికన్లతో పోల్చితే సంక్షేమ చర్యల గురించి ఎక్కువగా మాట్లాడుతోంది.

తాజా మూత విషయానికి వస్తే బాలలుగా వున్నపుడు అమెరికాకు అక్రమంగా తీసుకువచ్చి వారిచేత తక్కువ వేతనాలకు పని చేయించుకొని ఇప్పుడు పెరిగి పెద్దవారైన తరువాత మార్చినెలలో బయటకు గెంటివేయాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమస్యపై వారి సంక్షేమం కోసం నిధుల కేటాయింపు సక్రమంగా లేదంటూ డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అక్రమంగా వలస వచ్చిన వారి బెదిరింపులకు లంగకూడదంటూ రిపబ్లికన్లు పట్టుబట్టారు. ఈ వివాదంపై రెండు పార్టీల మధ్య రాజీకుదిరి తిరిగి ఓటింగ్‌ జరిపి ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే అప్పుడు ఖర్చులకు నిధులను వినియోగించవచ్చు. అది జరగపోతే ఇటు సూర్యుడు అటు పొడుస్తాడా అంటే అంతసీనేమీ వుండదని గత అనుభవాలు రుజువు చేశాయి. నిజంగా అది ప్రతిబంధకమై ముందుకు పోలేని స్ధితి వుంటే అది పునరావృతం కాకుండా సాధారణ మెజారిటీతో ఆమోదం పొందే విధంగా రెండవ మూత సంభవించకుండానే నిబంధనల సవరణ చేసి వుండేవారు. ప్రతిసారీ అత్యధిక సందర్భాల్లో ఏదో ఒక రాజకీయంలో భాగంగానే జరుగుతోంది. ఇప్పుడు అమెరికాకు వలస వచ్చిన వారి గురించి అధికార ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

1976లో తొలి మూత పడటానికి కారణం రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌( ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ యజమాని). కార్మికులు,విద్య,వైద్యం,సంక్షేమ పధకాలకు గాను 56బిలియన్‌ డాలర్ల మేరకోత విధిస్తూ వీటో జారీచేసినపుడు దానికి వ్యతిరేకంగా అదే ఏడాది అమలులోకి వచ్చిన బడ్జెట్‌ అదుపు చట్టాన్ని వినియోగించుకొని డెమోక్రాట్లు ఖర్చులను అడ్డుకున్నారు. అది ఎన్నికల సంవత్సరం అని గమనించాలి. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన డెమోక్రాట్‌ జిమ్మీకార్టర్‌ 1977లో అధికారానికి వచ్చిన తొలిఏడాదే మూడుసార్లు రిపబిక్లన్లు 12,8,8 రోజుల చొప్పున ప్రభుత్వాన్ని మూతవేయించారు. అబార్షన్లు చేయించుకున్నపుడు వైద్యసాయం చేసేందుకు నిధుల కేటాయిపునుఅ అసలు అబార్షన్లనే వ్యతిరేకించే రిపబ్లికన్లు అడ్డుకున్నారు. అవసరం లేని మిలిటరీ పరికరాల కొనుగోలుకు ప్రతిపాదన చేశారంటూ 37బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని కార్టర్‌ వీటో చేయటాన్ని వ్యతిరేకిస్తూ 26 రోజుల పాటు రిపబ్లికన్లు ప్రభుత్వాన్ని మూతవేయించారు.1979 ఎన్నికల సంవత్సరంలో పార్లమెంటు సభ్యులు మరియు వున్నతాధికారులకు 5.5శాతం వేతనాల పెంపు ప్రతిపాదనను, అబార్షన్లకు నిధులను రిపబ్లికన్లు అడ్డుకొని మరోసారి 11రోజుల పాటు మూతకు కారణమయ్యారు. తరువాత అధికారానికి వచ్చిన రిపబ్లికన్‌ రోనాల్డ్‌ రీగన్‌ తొలి నాలుగు సంవత్సరాల పదవీ కాలంలో ఆరుసార్లు (మొత్తం 12రోజులు) మూత వేయించి డెమోక్రాట్లు రికార్డు సృష్టించారు. తదుపరి నాలుగు సంవత్సరాల కాలంలో రెండుసార్లు, రెండురోజులు మూతపడవేయించి అత్యధిక మూతల అధ్యక్షుడిగా రికార్డులకెక్కించారు. తరువాత డెమోక్రాట్‌ బిల్‌క్లింటన్‌ హయాంలో మెజారిటీ దిగువసభలోని రిపబ్లికన్ల బిల్లును వీటోను చేయటంతో రిపబ్లికన్లు ప్రభుత్వాన్ని మూతవేయించారు. ఇది గరిష్టంగా 21రోజులు సాగి అత్యధిక ప్రతిష్టంభనగా నమోదైంది. చివరికి బిల్‌క్లింటనే రాజీపడి ప్రభుత్వ ఖర్చు తగ్గింపు, పన్నుల పెంపుదల ప్రతిపాదన ఆమోదానికి బాటవేశారు. తరువాత బరాక్‌ ఒబామా హయాంలో పేదలకు అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్యబీమా చట్టాన్ని వ్యతిరేకించిన రిపబ్లికన్లు 2013లో 16రోజుల పాటు మూత వేయించారు. ఆ తరువాత తిరిగి మూతపడటం ఇదే ప్రధమం.

వారాంతంలో లేదా వరుసగా సెలవులు వున్నపుడు మూతపడిన సందర్భాలలో పెద్ద ప్రభావం చూపలేదుకనుక కొన్ని అసలు చర్చనీయాంశం కాలేదు, అసలు మూతపడినట్లే కొందరికి తెలియలేదు. ఎక్కువ రోజులు కొనసాగితే ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు పని లేకుండా ఇళ్లకు పోవటం లేదా తరువాత వేతనాలు తీసుకొనే ప్రాతిపదికన పని చేయటం ఇలాంటి సందర్భాలలో సర్వసాధారణం. మిలిటరీలో పనిచేసే పౌరవుద్యోగులకు కూడా ఇదే వ ర్తింస్తుంది. మిలిటరీ, గూఢచార, వుగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో వున్న సిబ్బందికి ఈ మూత వర్తించదు కనుక వారికి ఎలాంటి ఇబ్బంది వుండదు. అయితే ఈ సారి మిలిటరీ సిబ్బందికోసం ప్రసారాలు చేసే టీవీ నెట్‌వర్కు మూతపడినందున తమకు ఇబ్బంది కలిగిందని స్వదేశంలోనూ, విదేశాల్లో వున్న మిలిటరీ సిబ్బంది విమర్శలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.కొన్ని కవాతులు, మిలిటరీలోకి తీసుకోవటం కొన్ని కార్యక్రమాలకు పరిమితంగా ఆటంకం కలుగుతుంది తప్ప అమెరికన్లు విదేశాల్లో జరిపే దాడులు, దుండగాలకు, పోలీసు, అత్యవసర సేవలుగా ప్రకటించిన వాటికి మాత్రం ఎలాంటి ఇబ్బంది వుండదు. గత నాలుగు సందర్భాలలో జరిగిన ఇలాంటి పరిణామాలను గమనంలో వుంచుకొనే అనేక తాత్కాలిక ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఐదు సంవత్సరాల క్రితం ఒబామా హయాంలో 16రోజుల మూత సమయంలో ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ వుద్యోగులను వేతనాలు లేకుండా ఇళ్లకు పంపివేశారు. అమెరికాలో పనిచేయకపోతే వేతనం ఇచ్చే విధానం లేని విషయం తెలిసినదే. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది. అందువలన ముందే చెప్పుకున్నట్లు జరిగే నష్టం కార్మికవర్గానికే.

నిజానికి మూసివేత సమస్యకు మూడు రోజుల వేతనం పోగొట్టుకున్న కార్మికులకు ఎలాంటి సంబంధం లేదు. ఆంబోతుల పోరులో లేగదూడల మాదిరి నష్టపోయారు. డోనాల్డ్‌ ట్రంపు చెప్పినట్లు అక్రమంగా వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వాలంటే 25 బిలియన్ల డాలర్ల బడ్జెట్‌ కేటాయింపు అంటే అది మరోవిధంగా జనంపై భారమే. ట్రంపు ప్రతిపాదిత గోడను డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. అందువలన ప్రభుత్వ మూతను ఎత్తివేసి ఫిబ్రవరి 6వరకు బడ్జెట్‌ ఖర్చుల ఆమోదానికి గాను అధికార ప్రతిపక్షాలకు ఇరువురకూ ఇబ్బంది లేని రీతిలో కుదిరిన రాజీ అని చెప్పవచ్చు. అయితే ఏదన్నా నష్టం జరిగితే రిపబ్లికన్లకే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. గోడ నిర్మాణానికి ఆమోదం తెలపటం అంటే డెమోక్రాట్లకూ ఇబ్బందే. నిజానికి అక్రమవలసదారులతో తక్కువ వేతనానికి పనిచేయించుకున్న కార్పొరేట్‌ కంపెనీల నుంచే అవసరం అనుకుంటే ఈ మొత్తాన్ని వసూలు చేయాలి. ఎందుకంటే వారి లాభాలకోసమే ఎవరు అధికారంలో వున్న అక్రమవలసలను ప్రోత్సహించిన విషయం జగద్విదితం.

జనవరి 20నాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం ఏడాది పూర్తవుతుంది. దానికి ముందుగానే ఇటువంటిదేదో జరగనుందని కొన్ని సూచనలు వెలువడినా ప్రభుత్వ యంత్రాంగం అంత తీవ్రంగా తీసుకోలేదని వార్తలు వెలువడ్డాయి. జరిగిన నష్టం ఎంతో తరువాత వెల్లడి అవుతుంది. ప్రభుత్వం ఈ ఏడాది 4.1లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.దీనిలో సగానికిపైగా మిలిటరీకి ఇతర సంస్ధలకు కేటాయిస్తారు. మూడోవంతుకు అటూ ఇటూగా వున్న మొత్తానికి మాత్రమే పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి వుంటుంది. డెమోక్రాట్లు సృష్టించిన ఈ మూత, దానికి కారణమైన రిపబ్లికన్ల ప్రతిపాదనలు రెండూ ఈ ఏడాది నవంబరులో జరగనున్న పార్లమెంటు దిగువసభ ఎన్నికల దృష్టితోనే అన్నది గమనించాలి.