Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

మన దేశంలో ఎక్కడ అధికారం వుంటే అక్కడకు చేరే పార్టీలు, చట్ట సభలకు ఎన్నికైన వారు అర్రులు చాచటం కనిపిస్తోంది. అధికార ప్రలోభానికి అర్రులు చాస్తే వున్న జన మద్దతు కూడా పోయేట్లుందని ఐరోపాలో అనేక పార్టీలు భయపడే స్ధితికి చేరుకున్నాయి. ఐరోపాకు గుండెకాయ వంటి జర్మనీలో అదే స్ధితి. గతేడాది సెప్టెంబరు 24న ఎన్నికలు జరిగినా ఇంతవరకు కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. గత నెల రోజులుగా జరుగుతున్న చర్చలను నాలుగో గడువు ఆదివారం నాటితో ముగించాలని అనుకున్నప్పటికీ అది కూడా ముగిసి పోయింది. ఒకవైపు కార్మికవర్గ సమ్మె సైరన్లు మోగుతుంటే మరోవైపు ఇతర దేశాలతో పాటు జర్మన్‌ స్టాక్‌ మార్కెట్‌ కూడా కుప్పకూలింది. వెంటనే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పడాల్సిన అత్యవసరాన్ని స్టాక్‌ మార్కెట్‌ పరిణామాలు పెంచాయని అందరం ఇబ్బందుల్లో వున్నామని ఆపద్ధర్మ ప్రభుత్వ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించారు. తమ మాదిరే ఇతర పార్టీలు కూడా చర్చలు ముగించి బాధాకరమైన రాజీకి రావాలని ఆమె కోరారు. కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు కోపం అన్నట్లుగా జర్మనీలో పరిస్ధితి వుంది. జర్మన్‌ రాజకీయాలలో సోషల్‌ డెమోక్రటిక్‌పార్టీ పొదుపు చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే రానున్న రోజుల్లో మరిన్ని కోతలు ఖాయమని కార్మికులు భావిస్తారు. ప్రపంచ మార్కెట్లో నిలబడే పేరుతో కార్మిక సంక్షేమ చర్యలు, హక్కులకు మరింత కోత పెట్టాలని కార్పొరేట్‌ శక్తులు పట్టుపడుతుంటే వాటిని నిలుపుకొనేందుకు అవసరమైతే మరిన్ని సమ్మెలకు దిగుతామని మూడు రోజుల హెచ్చరిక సమ్మెలతో కార్మికవర్గం స్పష్టం చేసింది.

క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ(సిడియు) నాయకత్వంలో అధికార భాగస్వామిగా వున్న సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌పిడి) తాజా ఎన్నికలలో దిమ్మదిరిగే పరాజయాన్ని చవి చూసింది. దాంతో అటు సూర్యుడు ఇటు పొడిచినా, సప్త సముద్రాలు ఇంకిపోయినా తాము తిరిగి సంకీర్ణ కూటమి సర్కార్‌లో చేరేది లేదని ప్రకటించిన ఎస్‌పిడి మరోసారిసిడియుతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు దారులు వెతుకుతోంది. సంకీర్ణ ప్రభుత్వంపై ఎస్‌పిడి యువ నాయకత్వంలో తలెత్తిన వ్యతిరేకతను బుజ్జగించేందుకు పూనుకున్నారు. ఇదే సమయంలో జర్మన్‌ కార్మికవర్గం 2003 తరువాత తొలిసారిగా తమ డిమాండ్లపై సమ్మెకు దిగింది. పార్లమెంటు రద్దు కాకుండా చూసేందుకు, ఎన్నికలను నివారించేందుకు జర్మన్‌ పెట్టుబడిదారులు వివిధ పార్టీలపై వత్తిడి తెస్తున్నారు. ఇది రాసే సమాయానికి ప్రయత్నాల గురించి వార్తలు తప్ప నిర్ధిష్ట రూపం తీసుకోలేదు.

పార్లమెంట్‌లోని 709 స్ధానాలలో ప్రస్తుత ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వంలోని సిడియు దాని మిత్రపక్షానికి 246, ప్రధాన ప్రతిపక్షమైన ఎస్‌డిపికి 153, జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎఎఫ్‌డి)కి 94, ఫ్రీ డెమోక్రటిక్‌ పార్టీకి 80, వామపక్షం(పూర్వపు కమ్యూనిస్టు పార్టీ) 69, గ్రీన్‌ పార్టీకి 67 వచ్చాయి. గతంలో అవి చేసిన ప్రకటనలు, వాటి విధానాల ప్రకారం ఈ పార్టీలలో ఏ రెండూ భావసారూప్యత కలిగినవి కావు. అయినప్పటికీ చివరి నిమిషంలో అనూహ్య పరిణామం జరిగితే తప్ప సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సిడియు మరియు ఎస్‌పిడి సిద్ధం అవుతున్నాయి. అయితే ఆ సంకీర్ణం ఎంతకాలం మనగలుగుతుందనేది ప్రశ్నార్దకం. తిరిగి ప్రభుత్వంలో చేరాలా వద్దా అని చర్చించేందుకు డిసెంబరు ఆరున ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌పిడి ప్రతినిధులు సంకీర్ణ కూటమి చర్చలకు అంగీకారం తెలిపారు. అయితే సమావేశం హాలు వెలుపల పార్టీ యువజన విభాగం నిరసన ప్రదర్శనలు చేసింది. జనవరి పన్నెండున తాము ప్రతిష్ఠంభనను అధిగమించి ఒక అంగీకారానికి వచ్చామని రెండు పార్టీలు ప్రకటించాయి. జనవరి 21న ఎస్‌పిడి అసాధారణ పార్టీ సమావేశం జరపగా 642 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దానిలో సంకీర్ణ ప్రభుత్వంలో చేరేందుకు 362 అనుకూలంగా 279 మంది వ్యతిరేకంగా ఓటు చేశారు. జనవరి 26న అంతిమంగా రెండు పార్టీలు లాంఛనంగా చర్చలు ప్రారంభించాయి.

Related image

రాజకీయ రంగంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్న సమయంలోనే జర్మన్‌ కార్మికులు అనేక పరిశ్రమలలో వాటితో నిమిత్తం లేకుండా ఆందోళనల సన్నాహాలు జరిపి గత కొద్ది వారాలుగా హెచ్చరిస్తున్న విధంగానే సమ్మెకు దిగారు. కార్మికుల్లో తలెత్తిన ఆందోళన ఎస్‌పిడిలో విబేధాలకు తెరతీసిందని చెప్పవచ్చు. జనవరి 31, ఫిబ్రవరి 1,2 తేదీలలో జర్మనీ అంతటా ఆటోమోటివ్‌, ఎలక్ట్రికల్‌ పరిశ్రమలలో మూడు రోజుల పాటు 24 గంటల చొప్పున సమ్మె చేశారు. ఇతర పరిశ్రమలకు ఈ ఆందోళన వ్యాపించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఎనిమిదిశాతం వేతనాలు పెంచాలని, వారానికి పని గంటలను 28కి తగ్గించాలన్నవి వారి ప్రధాన డిమాండ్లు. లోహపరిశ్రమలలో కూడా సమ్మె బ్యాలట్‌ నిర్వహించగా 95నుంచి 100శాతం వరకు కార్మికులు మద్దతు తెలిపారు. నూతన సంకీర్ణ ప్రభుత్వం సామాజిక సంక్షేమంపై దాడులతో పాటు మిలిటరిజం, రాజ్య అణచివేత యంత్రాంగాన్ని పటిష్ట పరచనున్నదనే విశ్లేషణలు వెలువడుతున్న సమయంలోనే కార్మికులు వాటికి వ్యతిరేకంగా సమ్మె సన్నాహాలు చేస్తున్నారు. జర్మన్‌ కార్మికవర్గానికి సంస్కరణవాద శక్తులు నాయకత్వం వహిస్తున్నాయి. వారి పోరాట పటిమను నీరు గార్చేందుకు గతంలో అవి తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఈ కారణంగానే ఈ శక్తులకు నిలయంగా వున్న ఎస్‌పిడి దాని చరిత్రలో ఎన్నడూ రానన్ని తక్కువ ఓట్లు తెచ్చుకొని జనం నుంచి ఎంతగా వేరు పడిపోయిందీ నిరూపించుకుంది. ఆ కారణంగానే మరోసారి ప్రభుత్వంలో చేరకూడదని గంభీరంగా ప్రకటనలు చేసినా దాని స్వభావం కారణంగా మరోసారి చేతులు కలిపేందుకు పూనుకుంది.

అమెరికాలోని డెమోక్రటిక్‌ పార్టీ, బ్రిటన్‌లోని లేబర్‌ పార్టీలో కూడా ఇలాంటి ధోరణులే ప్రబలంగా వుండగా వాటికి వ్యతిరేకంగా బెర్నీశాండర్స్‌, జెర్మీ కార్బిన్‌ మాదిరి కొంత మేరకు ప్రతిఘటించేశక్తులు ముందుకు వస్తున్నట్లు ఎస్‌పిడిలో జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే వాటికి ఎన్నోపరిమితులున్నాయి. ఆ పార్టీ 28ఏండ్ల యువనేత కెవిన్‌ కుహనెట్‌ నాయకత్వంలోని యువజన విభాగం సంకీర్ణ ప్రభుత్వంలో చేరాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటును పార్టీ నాయకత్వం విఫలం చేసింది.అనేక మంది యువకులు పార్టీ వామపక్ష బాట పట్టాలని వత్తిడి తెస్తున్నారు. మరోవైపు జర్మనీలో పచ్చిమితవాద ధోరణులను కూడా ప్రోత్సహించటం, తాజా ఎన్నికలలో అలాంటి శక్తులు గణనీయమైన సీట్లు సాధించటాన్ని కూడా చూడవచ్చు. గతంలో ఎస్‌పిడి అధ్యక్షుడిగా పని చేసి ఆ పార్టీ నుంచి విబేధించి విడిపోయి వామపక్ష పార్టీని ఏర్పాటు చేసిన వారిలో ఒకరైన ఆస్కార్‌ లాఫోంటెయిన్‌ తాజా పరిణామాల గురించి మాట్లాడుతూ ఒక నూతన వామపక్ష వుద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. దానిలో వామపక్ష పార్టీ, గ్రీన్స్‌, ఎస్‌పిడిలోని కొన్నిశక్తులు దగ్గర కావచ్చునని,ఆ వుద్యమంలో సాంప్రదాయ పార్టీలే కాకుండా కార్మికోద్యమనేతలు, సామాజిక సంస్ధలు, శాస్త్రవేత్తలు, సాంస్కృతిక కార్యకర్తలు ఇతరులు కూడా తోడు కావాలని ఒక పత్రికా ఇంటర్వ్యూలో చెప్పారు. వామపక్ష పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, లాఫోంటెయిన్‌ సతీమణి అయిన సారా వాజెన్‌చెట్‌ ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతూ ఆ వుద్యమంలో ప్రముఖులు చేరితేనే ప్రయోజనం వుంటుందని, రాజకీయంగా తమ దారిలో ఒక కదలిక వున్నదన్న భరోసా, ఆశను జనంలో రేకెత్తిస్తుందని అన్నారు. అయితే కొత్త నిర్మాణాలేమీ అవసరం లేదు బలమైన వామపక్ష పార్టీ వుంటే చాలనేవారు కూడా లేకపోలేదు. దీనిలో డెమోక్రటిక్‌ సోషలిజంగా పేరు మార్చుకున్న తూర్పు జర్మనీలోని కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారు, ఎస్‌పిడి నుంచి విడిపోయిన వామపక్ష శక్తులు, ఇతర వామపక్ష శక్తులు, వ్యక్తులతో వామపక్ష పార్టీ ఏర్పడింది. ఎస్‌పిడి, గ్రీన్స్‌, వామపక్ష పార్టీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పరచి కార్మికవర్గ హక్కులను పరిరక్షించవచ్చనే ఒక అభిప్రాయం కూడా లేకపోలేదు. అయితే పార్లమెంటులో బలాబలాలు ఆవిధంగా లేవు, గతంలో ఎస్‌పిడి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినపుడు కార్మికులకు నష్టదాయకమైన చర్యలు తీసుకున్న కారణంగానే లాఫోంటెయిన్‌ వంటి వారు ఎస్‌పిడి నుంచి బయటకు వచ్చారు.

ఇటీవలి కాలంలో జర్మనీతో సహా అనేక ధనిక దేశాలలో వెలువడుతున్న ధోరణుల గురించి జాగ్రత్తగా పరిశీలించాల్సి వుంది. నయా వుదారవాదం, ఆర్ధిక, సామాజిక అసమానతలను వ్యతిరేకించే శక్తులు పచ్చిమితవాద, నయా నాజీశక్తులతో కొన్ని విషయాల్లో పోటీపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వలసలను అనుమతించటం ఇటీవలి కాలంలో పెద్ద సమస్యగా వుంది. చౌకశ్రమ శక్తిని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్‌ రంగం వలస కార్మికులను అనుమతించాలని పాలకపార్టీలపై వత్తిడి తెస్తోంది.పెట్టుబడిదారీ వ్యవస్ధలో తలెత్తిన అసంతృప్తిని సంఘటిత వుద్యమాలవైపు మరల కుండా నయా వుదారవాద విధానాలను గట్టిగా సమర్ధించే నయా నాజీలు, మితవాదులు వలస కార్మికులను వ్యతిరేకిస్తూ అసంతృప్తిని దురహంకారంవైపు మళ్లించేందుకు పూనుకున్నారు. నయా వుదారవాద విధానాలను వ్యతిరేకించే శక్తులు కూడా వలసలను వ్యతిరేకిస్తూ జాతీయవాద భావాలను ప్రోత్సహిస్తున్నారు. నిజానికి ఇవి రెండూ బమ్మ బరుసు వంటివే.ఈ ధోరణులు వామపక్ష వుద్యమాల అభివృద్ధికి ఆటంకం కలిగించేవే. వుదాహరణకు ప్రత్యామ్నాయ జర్మనీ అనే మితవాద పార్టీ వలసలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. మరోవైపు ‘జర్మనీలో జీవించాలని కోరుకొనే ప్రతి ఒక్కరికీ మనం అవకాశం ఇవ్వలేము’ అని వామపక్ష పార్టీ నేతలు చెబుతున్నారు. వలసవచ్చిన వారితో తక్కువ వేతనాల రంగంలో పోటీ పెరుగుతుందని, ఇండ్ల అద్దెల పెరుగుదలతో పాటు పాఠశాలల్లో ఇబ్బందులు పెరుగుతాయని వామపక్ష పార్టీ నేత లాఫాంటెయిన్‌ పేర్కొన్నారు. ప్రపంచం ధనిక దేశాలను చుట్టుముట్టిన 2008నాటి అర్ధిక సంక్షోభం అటు పెట్టుబడిదారులతో పాటు ఇటు దాన్ని వ్యతిరేకించే వివిధ శక్తులలో కూడా ఒక మధనం ప్రారంభానికి దోహదం చేసింది.

ధనిక దేశాలలో సంక్షేమ చర్యలకు కోతతో పాటు, కార్మికవర్గ హక్కులపై నానాటికీ దాడి తీవ్రం అవుతోంది. 2008లో ప్రారంభమయిన సంక్షోభంలో ధనిక దేశాలలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సోషలిస్టులుగా, వామపక్ష శక్తులుగా చెలామణి అయిన శక్తుల ఆచరణ మిగతావారికంటే భిన్నంగా లేదనే అంశం గత పది సంవత్సరాలలో తేటతెల్లమైంది. అందువల్లనే వాటికి అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ పూర్వరంగంలో నిజమైన కార్మికవర్గ పార్టీల గురించి మరోసారి కార్మికవర్గంలో పునరాలోచన ప్రారంభమైంది. సోవియట్‌, తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత ఇదొక ఆశాజనక పరిణామం. వెంటనే ఏవో పెను మార్పులు సంభవిస్తాయని చెప్పలేము గాని తిరిగి వామపక్ష శక్తుల పెరుగుదలకు ఇది నాంది అని చెప్పవచ్చు.