ఎం కోటేశ్వరరావు
ఫిబ్రవరి ఎనిమిదిన దక్షిణ కారియా నగరమైన పయోంగ్ చాంగ్‌లో శీతాకాల ఒలింపిక్స్‌పోటీలు ప్రారంభంగాక ముందే కొరియా ద్వీపకల్పం, దానితో ముడివడిన దేశాల మధ్య రాజకీయ క్రీడలతో వేడి మొదలైంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా నాయకత్వంలోని కమ్యూనిస్టు వ్యతిరేక దేశాల కూటమి క్రీడలలో కూడా రాజకీయాలను జొప్పించిన విషయం విదితమే. ఈ ఒలింపిక్స్‌కూడా దానికి మినహాయింపు కాదని అవి మరోసారి నిరూపించాయి. ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి మన రాష్ట్రపతి వంటి స్ధాయి కలిగిన వుత్తర కొరియా పార్లమెంటు అధ్యక్షుడు కిమ్ యోంగ్ నామ్ నాయకత్వంలో శుక్రవారం నాడు వచ్చిన ప్రతినిధివర్గంలో వుత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ అన్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా వున్నారు. 1950 దశకంలో కొరియా యుద్దం తరువాత దక్షిణ ప్రాంతాన్ని సందర్శించిన తొలి వున్నత స్ధాయి ప్రతినిధి వర్గం ఇదే.
పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూ ఈ పోటీల్లో ఒకేపతాకం నీడలో ఒకే గీతం పాడుతూ కదం తొక్కుదామని, వుమ్మడిగా సాంస్కృతిక ప్రదర్శనలు ఇద్దామని, వీలైతే కొన్ని పోటీలలో వుమ్మడి జట్లను బరిలోకి దింపుదామని వుత్తర కారియా చేసిన ప్రతిపాదనలకు దక్షిణ కొరియా కూడా ముందుకు వచ్చింది. అయితే పొమ్మనకుండానే పొగబెట్టినట్లు పాలకవర్గదన్ను వున్న దక్షిణ కొరియా మీడియా అవమానించేవిధంగా రాతలు రాసిన కారణంగా తాము వెనక్కు తగ్గుతున్నట్లు వుత్తర కారియా ప్రకటించింది. ఒలింపిక్స్ జరిగే సమయంలోనే అమెరికా దాడులకు దిగనుందనే వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా ఈ పోటీలకు ఐదువందల మందితో కూడిన వుత్తర కొరియా ప్రతినిధి బృందం పయోంగ్ చాంగ్ చేరుకుంది. పోటీలు జరిగే ఈ నగరం వుత్తర కొరియా సరిహద్దుకు కేవలం 80కిలోమీటర్ల దూరంలోనే వుంది.
తాము శాంతి ప్రయత్నాలు చేస్తున్నా వుత్తర కొరియా అణు పరీక్షలను కొనసాగిస్తూనే వుందని ప్రపంచం ముందు కనిపించేందుకు గతేడాది మేనెలలో ఎన్నికైన అధ్యక్షుడు మూన్ ప్రయత్నిస్తున్నాడు. శాంతి ఒలింపిక్స్ అని తమ దేశంలో జరుగుతున్న పోటీలను అభివర్ణించాడు. అణు పరీక్షలు జరిపిందనే పేరుతో మూన్‌కు ముందున్న అధ్యక్షుడు పార్క్‌గున్ హై 2016జనవరి తరువాత వుత్తర కొరియాకు సాయాన్ని నిలిపివేశాడు. ఇప్పుడున్న స్ధితిలో సాయం వద్దని జపాన్ ప్రధాని షింజో అబే వ్యక్తిగతంగా కోరినప్పటికీ మూన్ నాలుగునెలల క్రితం ఎనిమిది మిలియన్‌డాలర్ల సాయాన్ని పునరుద్దరించాడని పరిశీలకులు వ్యాఖ్యానించారు. నిజానికి అది ప్రచార ఎత్తుగడని వేరే చెప్పనవసరం లేదు. ఈ సాయాన్ని వుత్తర కొరియా మిలిటరీకి వుపయోగిస్తున్నదని అమెరికా, జపాన్ ప్రచారం చేస్తున్నాయి. ఈ రెండు దేశాల ప్రయోజనాలకోసం వుత్తర కొరియాను రెచ్చగొడుతున్నారని, ఒక వేళ యుద్ధమే వస్తే నష్టపోయేది తాము తప్ప ఆ దేశాలు కాదని దక్షిణ కొరియా పౌరులు ఆందోళన చెందుతూ సోదర కొరియాతో శాంతికోసం ప్రయత్నించాలని పెద్ద ఎత్తున వత్తిడి తెస్తున్న కారణంగానే మూన్ శాంతి ప్రకటనలు చేస్తున్నాడు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు కేవలం 35కిలోమీటర్ల దూరంలో వున్న సరిహద్దులో వుత్తర కొరియా తన భారీ ఫిరంగి దళాన్ని మోహరించింది.
రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్ ఆక్రమణకు గురైన కొరియాను విముక్తి చేసే క్రమంలో వుత్తర ప్రాంతంలో సోవియట్ సేనలు, దక్షిణ ప్రాంతంలో అమెరికా నాయకత్వంలోని సేనలు జపాన్ మిలిటరీని ఓడించాయి. దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టుల నాయకత్వంలో వుత్తర ప్రాంతంలో ఏర్పడిన ప్రభుత్వానికి సోవియట్ మద్దతు ప్రకటించగా దానికి పోటీగా అమెరికాలో వున్న కమ్యూనిస్టు వ్యతిరేకి, మాజీ కొరియా నియంత సింగమాన్ రీని అమెరికా నుంచి రప్పించి అమెరికన్లు దక్షిణ ప్రాంతంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రెండు ప్రభుత్వాలు మొత్తం కొరియాపై తమదే ఆధిపత్యం అని ప్రకటించుకున్నాయి. పరిస్ధితులు చక్కపడిన తరువాత ఐక్య కొరియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అంగీకారం కుదిరింది. తరువాత దక్షిణ కొరియాలోని నియంత ప్రభుత్వం అమెరికా దన్నుతో వుత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు దాడి చేసింది. దానిని సోవియట్, చైనా మద్దతుతో వుత్తర కొరియా కమ్యూనిస్టు ప్రభుత్వం తిప్పి కొట్టింది. వుభయుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి విలీనం గురించి వుత్తర కొరియా ప్రయత్నిండగా తగిన పరిస్ధితులు ఏర్పడలేదనే పేరుతో 1953 నుంచీ దక్షిణ కొరియా అడ్డుకొంటోంది. దీనికి అమెరికా, జపాన్ మద్దతు ఇస్తున్నాయి. వుత్తర కొరియాకు రద్దయ్యే వరకు సోవియట్, తరువాత చైనా, వియత్నాం వెన్నుదన్నుగా వున్నాయి.
వుత్తర కొరియాతో సఖ్యత, ఐక్యతకు సిద్దమంటూనే మూన్ ఒకవైపు ప్రకటనలు చేస్తుంటే మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం ఒలింపిక్ క్రీడల సమయంలోనే అవసరమైతే వుత్తర కారియాపై దాడి చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దాన్ని ఆంగ్లంలో బ్లడీనోస్ అని పిలుస్తున్నారు. (ముక్కు బద్దలు కొట్టి భయ పెట్టటం వంటిది). ఎవరు అవునన్నా కాదన్నా అణ్వస్త్ర దేశాలలో వుత్తర కొరియా ఒకటి. అమెరికా దగ్గర వెయ్యి వుంటే దాని దగ్గర ఒకటే వుండవచ్చు. వాటిని ప్రయోగిస్తే జరిగే నష్టం ఒకటైనా, వెయ్యి అయినా ఒకటే. అందువలన తక్షణమే వాటిని వుపయోగించకపోయినా మారణకాండ జరిపే ఆయుధాలు అమెరికా దగ్గర గుట్టలుగా వున్నాయి. అమెరికా గనుక యుద్దానికి పూనుకుంటే దక్షిణ కొరియాలో వున్న రెండులక్షల 30వేల మంది అమెరికన్ సైనికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా కొత్తగా నియమితుడైన విక్టర్ చా హెచ్చరించాడు.అందుకుగాను ట్రంప్ ఆ నియామకాన్ని రద్దు చేశాడు. గత ఏడాది కాలంలో అనేక సార్లు ట్రంప్ వుత్తర కొరియా నాయకత్వాన్ని తూలనాడటం, రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయటం తెలిసినదే. గతవారంలో వుత్తర కొరియా నుంచి ఫిరాయించిన వారితో సమావేశమై గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దాడులు తప్ప మరొక మార్గం లేదని నోరుపారవేసుకున్నాడు. ఒలింపిక్స్‌కు బయలుదేరి అమెరికా వుపాధ్యక్షుడు మైక్ పెన్స్ మధ్యలో అలాస్కాలోని క్షిపణి వ్యతిరేక కేంద్రాన్ని సందర్శించటంతో పాటు జపాన్‌తో చర్చలు జరపాలని నిర్ణయించాడు. నిజానికి ఇతగాడి పర్యటన వుత్తర కొరియాకు వ్యతిరేకంగా ప్రచార దాడి లక్ష్యం తప్ప తలెత్తిన వుద్రిక్తతలను వుపశమింపచేసేదిగా లేదు. క్రీడల తరువాత గతేడాది మాదిరే వుత్తర కొరియా సమీపంలో ఆధునిక ఆయుధాలతో సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కొరియా ద్వీపకల్పంపై దాడికి వీలుగా గువామ్ సైనిక కేంద్రంలో అణ్వాయుధాలను తీసుకుపోవగల బి-52, బి2 రకాల విమానాలను మోహరించారు.
వుత్తర కొరియాపై దాడులు చేసేందుకు అమెరికా అవకాశం కోసం చూస్తున్నది. దానిలో భాగంగానే జనవరి 13వ తేదీన హవాయి దీవుల వైపు ఖండాంతర క్షిపణి వస్తున్నదని, ఇది డ్రిల్లు కాదు, వెంటనే రక్షణ తీసుకోండనే తప్పుడు సమాచారాన్ని జనంలో ప్రచారంలో పెట్టారు. దాంతో వీధుల్లోని జనం కార్లను వదలి పరుగులు తీసిన వుదంతం తెలిసిందే. ముఫ్నై ఎనిమిది నిమిషాలపాటు జనం కకావికలయ్యారు. అది వాస్తవం కాదని విన్యాసమని కూడా సమాచారంలో వుందని తరువాత అధికారులు చెబుతున్నప్పటికీ చివరలో డ్రిల్లు కాదని కూడా పేర్కొన్నందున జనం నిజమని భావించారు. అబద్దాలు చెప్పి జనాన్ని బురిడీ కొట్టించటంలో అమెరికా గూడచార, మీడియా సంస్ధలు పేరు మోశాయి. జపాన్‌పై అణుబాంబును ప్రయోగించేందుకు సాకుగా రెండవ ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్‌పై దాడి చేసిందనే పెద్ద అబద్దాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. వియత్నాంపై దాడి చేసేందుకు 1964లో టోంకిన్ గల్ఫ్‌లో తమ యుద్ధ నౌకపై దాడి జరిపిందనే సాకుతో దాడులకు దిగిన విషయం దాస్తే దాగేది కాదు నిన్నగాక మొన్న ఇరాక్‌లో మారణాయుధాలను గుట్టలుగా పోశాడనే పేరుతో సద్ధాం హుస్సేన్‌పై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. వుగ్రవాదంపై పోరు పోరు పేరుతో ఇప్పుడు దాడులు చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ వుగ్రవాదులను సృష్టించిందీ అమెరికాయే అన్న విషయం తెలిసిందే.
ఒకవైపు శీతాకాల ఒలింపిక్స్ వుత్సవాలకు ప్రతినిధి బృందాలను పంపిన వుత్తర కొరియా నాయకత్వం మరోవైపు ఏప్రిల్ 25న జరగాల్సి కొరియా ప్రజాసైన్య 70వ వార్షికోత్సవాన్ని ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి ఒక రోజు ముందే జరిపేందుకు పూనుకున్నదని, తన దగ్గర వున్న దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రదర్శన ద్వారా అమెరికాను బెదిరించేందుకు పూనుకుందని, అందువలన శాంతి కావాలనే ఎత్తుగడతో దక్షిణ కొరియా, దాని మిత్రపక్షాల మధ్య అంతరం పెంచేందుకు వుద్దేశించిన దాని ప్రచారాన్ని నమ్మవద్దని జపాన్, పశ్చిమ దేశాల మీడియా గగ్గోలు పెడుతోంది. తను అణుకార్యక్రమాన్ని కొనసాగించేందుకు అవసరమైన వ్యవధి తీసుకొనేందుకు అది శాంతి గురించి మాట్లాడుతున్నదని ఆరోపణలు చేస్తున్నది.
గత ఏడు దశాబ్దాల పరిణామాలను గమనించినపుడు వుభయ కొరియాల విలీనానికి అడ్డుపడుతున్నది అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశాల కూటమి అన్నది స్పష్టం.1950 దశకంలో వుత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు అమెరికా మద్దతుతో దక్షిణకొరియా ప్రయత్నించింది తప్ప ఇంతవరకు ఏ నాడూ దక్షిణ కొరియాపై సోషలిస్టు వుత్తర కొరియా దాడిచేసిన దాఖలాలు లేవు. అయినప్పటికీ విలీనానికి ఇంకా అనుమానాలు తొలగలేదనే పాచిపాటనే పశ్చిమ దేశాలు పాడుతున్నాయి. శీతాకాల ఒలింపిక్స్ సందర్భంగా చేస్తున్న ప్రచారదాడి దానిలో భాగమే.