Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ఎట్టకేలకు నరేంద్రమోడీ నాలుగేండ్ల తరువాత తాము వుపాధి కల్పించలేకపోతున్నట్లు పరోక్షంగా అయినా అంగీకరించినందుకు అభినందించకుండా ఎలా వుంటాం ! పెట్టలేని వారు పెట్టే దారన్నా చూపాలి అన్నట్లు పకోడీలు అమ్మి స్వయం వుపాధి కల్పించుకోవాలని మంచి సలహా కూడా ఇచ్చినందుకు ఆయన మేథోశక్తికి నీరాజనాలు పలకాల్సిందే. బాబొస్తే జాబొచ్చినట్లే అన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ బాబు చేయలేని ధైర్యం, తెగువను నరేంద్రమోడీ చూపారు. పకోడీ వ్యాఖ్యానం తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో యావత్‌ దేశాన్నీ ఆకర్షించేందుకు మోడీ మరో విన్యాసం చేశారు. వుద్యోగులకు ఏడాదికి మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ పదిహేనువేలు, నెలకు 16వందల ప్రయాణ అలవెన్సు వెరసి ఏడాదికి 34,200కు ఇప్పుడు పన్ను మినహాయింపు వుంది. ఈ రెండింటి బదులు గుండుగుత్తగా 40వేల రూపాయలకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ ప్రకటించారు. దీని వలన వుద్యోగులకు ఎనిమిదివేల కోట్ల రూపాయలు మిగిలితే, ఖజానాకు అంతే మొత్తం నష్టం అని చెప్పారు. ఈ వుదారత్వానికి వుద్యోగులు ఎలా పండుగ చేసుకుంటారన్నది వారికే వదలివేద్దాం.

‘కోటీ 89లక్షల మంది వేతన జీవులు ఒక్కొక్కరు 2016ా17లో చెల్లించిన సగటు పన్ను రు.76,306 కాగా వ్యక్తిగతంగా వ్యాపారులు, వైద్యులు, లాయర్ల వంటి వృత్తిదారులు 1.88 కోట్ల మంది సగటున చెల్లించింది రు.25,753 మాత్రమే. ఇవి కేంద్ర ఆర్ధిక కార్యదర్శి హష్‌ముఖ్‌ అధియా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం వెల్లడించిన వివరాలు. నిజాయితీగా పన్ను చెల్లించే తమకు భారం తగ్గించి అక్రమ మార్గాలను వెతక్కుండా సరైనదారిలో పెట్టాల్సిన ప్రభుత్వం ఆ పని చేయటం లేదు. మరోవైపు తమ కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న ఇతరుల పన్ను ఎగవేత నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇదీ స్థూలంగా బడ్జెట్‌ సందర్భంగా వేతన జీవులలో వెల్లడవుతున్న అసంతృప్తి. దిగువనున్న ఇతరులతో పోల్చుకుంటే వుద్యోగుల పరిస్ధితి మెరుగే అయినప్పటికీ పెరుగుతున్న ధరలు, అవసరాలు, గౌరవ ప్రదమైన జీవనం గడపాలంటే ప్రస్తుత వేతనాలను ఇంకా పెంచాల్సిన అవసరం వుంది. ప్రతి బడ్జెట్‌లో భారాలు మోపటం సర్వసాధారణ రివాజుగా మారింది కనుక సామాన్యులకు పెద్దగా ఆసక్తి వుండదు. ఎన్ని రాయితీలు ఇచ్చినా మంగళగిరి పానకాల రాయుడి మాదిరి ఇంకా కావాలనే వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, న్యాయమైన రాయితీల కోసం ఎదురు చూసే వేతన జీవులలోనే బడ్జెట్‌ పట్ల ఆసక్తి వుంటుంది. వ్యాపారులు, వృత్తిదారులు పన్నుల విధింపు సమాచారం గురించి కుతూహలం చూపుతారు. ఏ భారం మోపినా చివరకు దాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి వినియోగదారులు, సేవలు పొందే జనం మీదనే మోపుతారు కనుక బడ్జెట్‌లో ఏం చేసినా వారికేమీ చింత వుండదు.

ఎక్కువ మంది వుద్యోగులు బడ్జెట్‌లో తమకేమి రాయితీలు ప్రకటించారు అనే విషయం మీదనే ప్రధానంగా కేంద్రీకరించటం సహజం. నిజానికి పౌరులుగా, చదువుకున్న వారికి అంతకంటే ఎక్కువ ఆసక్తి, విమర్శనాత్మక వైఖరితో ఈ ప్రక్రియను చూడటం అవసరం. అందుకే అసలు బడ్జెట్‌ అంటే ఏమిటి ? ప్రజారంజక, ప్రజా సంక్షేమ బడ్జెట్‌నే ప్రవేశపెట్టామని చెప్పని పార్టీ ఏముంది? అదే నిజమైతే 2017లో దేశంలో వృద్ధి అయిన సంపదల మొత్తంలో ఒక శాతంగా వున్న ధనికులు 73శాతం దక్కించుకున్నారని ఆక్స్‌పామ్‌ అనే స్వచ్చంద సంస్ధ ఎందుకు చెప్పింది. వివిధ సంస్ధల, లెక్క విధానాలు, అంచనాలలో హెచ్చు తగ్గులుండవచ్చుగానీ సంపద కొద్ది మంది దగ్గర పోగుపడుతున్నదనేది వాస్తవమే కదా ?

ఆదాయాన్ని ఖర్చుల నిమిత్తం చేసే పంపిణీ ప్రక్రియే బడ్జెట్‌. దీనిలో సామాన్యులుగా వున్న 99శాతానికి, ఒకశాతం ధనికులకు దామాషా ప్రకారం పంపిణీ చేస్తే సమస్య లేదు. లేకపోతేనే తేడాలు వస్తాయి. కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు ప్రతిపక్షంలో వుండగా ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి అధికారం రాగానే కార్పొరేట్లకు కామధేనువులుగా మారుతున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సామాన్యులకు మంచిరోజులు( అచ్చేదిన్‌) వచ్చాయని ప్రకటించారు. ఆక్స్‌ఫామ్‌ సంస్ధ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం 2017లో దేశంలోని బిలియనీర్ల ్లబ్బులో కొత్తగా పదిహేడు మంది చేరారు. మోడీ నిజంగా రాబిన్‌హుడ్‌ అవతారం అయితే బిలియనీర్ల సంపద తగ్గాలి కదా ! గత నాలుగు సంవత్సరాలుగా తాను ఎన్నో విజయాలు సాధించానని ప్రతి నెలా మన్‌కీబాత్‌ పేరుతో (మనసులోని మాట) ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ జన్‌కీ బాత్‌(జనం మాట) వేరేగా వుంది. మొత్తంగా చూసుకున్నపుడు వుత్పత్తి, ఎగుమతులు పడిపోయాయి. అనేక చోట్ల గిట్టుబాటు ధరలు రాక రైతాంగం ఆందోళనలకు దిగింది, ఆత్మహత్యలు ఆగలేదు. అయినా మరోవైపు కార్పొరేట్ల లాభాలు తగ్గలేదు, స్టాక్‌మార్కెట్‌ సూచీలు రికార్డులను తిరగరాశాయి. పర్యవసానంగా శతకోటీశ్వరుల సంఖ్య పెరిగింది, అప్పటికే ఆ జాబితాలో వున్నవారి ఆస్ధులు ఇంకా పెరిగాయని వేరే చెప్పనవసరం లేదు. అంటే మోడీ గారు చెప్పిన మంచి రోజులు ఎవరికి వచ్చినట్లు ? ఒక చాయ్‌ వాలా పాలనలో ఎంత మంది ఫ్లాస్కుల నుంచి టీ స్టాల్స్‌, హోటల్స్‌ పెట్టే స్ధాయికి ఎదిగారు ? తాజాగా మోడీతో పాటు, అమిత్‌షా గారు కూడా చెప్పినట్లు పకోడీలు అమ్మేవారు ఎంత మంది లక్షాధికార్లు అయ్యారు అని ప్రశ్నించుకోవాలి.

ఐదేండ్ల కాలానికి ఎన్నుకున్న మోడీ సర్కార్‌కు ఇది చివరి, ఎన్నికల బడ్జెట్‌ కనుక సహజంగానే జనంలో ఆసక్తి కలిగించింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌ ప్రకారం మొత్తం ఆదాయం 24లక్షల కోట్ల 42 వేల 213 కోట్లు. దీనిలో పన్నుల ద్వారా వచ్చే మొత్తం రు.17,25,738 కోట్లు. అప్పుల ద్వారా సమకూర్చుకొనేది 6,24,276 కోట్లు మిగతాది ఇతర వనరుల ద్వారా వస్తుంది. దీనిలో వడ్డీ చెల్లింపులకు కేటాయింపు 5,75,795 కోట్లు. నరేంద్రమోడీ పాలనలో మన రూపాయి రాకపోకల తీరు తెన్నులు ఎలా మారాయో చూద్దాం. 2015-16 బడ్జెట్‌లో 21పైసలు అప్పుల ద్వారా సమకూర్చుకుంటే 2018-19కి అది 19కి తగ్గిపోయింది. కార్పొరేట్‌ పన్ను 20 నుంచి 19కి తగ్గింది, ఆదాయపన్ను 14 నుంచి 16కు పెరిగింది. తాజా బడ్జెట్‌ రూపాయి రాకలో నూరు పైసలకు గాను జిఎస్‌టి నుంచి 23, కార్పొరేట్‌ పన్ను నుంచి 19,అప్పుల ద్వారా 19, ఆదాయ పన్ను నుంచి 16, ఎక్సయిజ్‌, కస్టమ్స్‌ నుంచి 12, ఇతరంగా 11పైసల వంతున వస్తోంది. ఇక పోక విషయానికి వస్తే పన్నులు, డ్యూటీలలో రాష్ట్రాల వాటా 24, వడ్డీ చెల్లింపులు 18, రక్షణ, కేంద్ర పధకాలు, సబ్సిడీలకు 9చొప్పున, ఫైనాన్స్‌ కమిషన్‌ బదిలీలకు 8, ఇతర ఖర్చులకు 13పైసలు పోతోంది.

గతేడాది నోట్ల రద్దు వలన సాధారణ పెరుగుదల కంటే అదనంగా 18లక్షల మంది కొత్తగా పన్నులు చెల్లించేవారు పెరిగారని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. మంచిదే, రెండు కోట్ల ఎనభైలక్షల మంది పన్ను చెల్లింపుదార్లుండగా మరో 18లక్షల మంది కోసం పెద్ద నోట్లు రద్దు చేయాలా? ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటికే నిప్పు పెట్టిన ప్రబుద్ధులను ఈ చర్య గుర్తుకు తేవటం లేదూ? ఈ పద్దెనిమిది లక్షల మంది అదనంగా చెల్లించే పన్నెంతో, నోట్ల రద్దు వలన జరిగిన నష్టం, జనం పడిన ఇబ్బందుల గురించి అధికారంలో వున్న వారు నోరు విప్పారా ? పోనీ ఆ కారణంగా ఆదాయపన్ను రాబడి రూపాయి రాకలో రెండుశాతం పెరిగిందని అనుకుందాం. కార్పొరేట్‌ పన్ను ఆదాయం పెరగకపోగా తగ్గటానికి కారణం ఏమిటి? లోపాలను సరిచేస్తే వసూలు పెరగాలి కదా ! చెప్పే మాటలకు, చేతలకు పొత్తు కుదరటం లేదు. ఇంతకు ముందు 50 కోట్ల లావాదేవీలు వున్న కంపెనీలకు 25శాతం కార్పొరేట్‌ పన్ను వుంటే ఇప్పుడు దానిని ఏకంగా ఐదు రెట్లు అంటే 250 కోట్లకు పెంచటం వంటి వెసులుబాటు కాదా? పోనీ ఇలాంటి మినహాయింపులతో కంపెనీలు పొందిన లబ్దిని తిరిగి పెట్టుబడులుగా పెట్టిన దాఖలాలేమీ లేవు. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా మహాశయులు వుద్యోగాలు లేకపోతే పకోడీలు అమ్మాలని సెలవిచ్చారు. 2015-16 వుపాధి, నిరుద్యోగ సర్వే ప్రకారం దేశంలో పని చేస్తున్న వారిలో 46.6శాతం మంది స్వయం వుపాధి అంటే మోడీ గారి భాషలో పకోడీ వుద్యోగాలు చేస్తున్నవారే. వారి వార్షిక ఆదాయం అరవైవేల రూపాయలు. వారందరూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తుంటే కొత్తగా వుద్యోగాల కోసం చూస్తున్నవారికి నాలుగేండ్ల తరువాత మోడీ ఈ సలహా ఇచ్చారు.

యుపిఏ , ఎన్‌డిఏ రెండూ సంస్కరణలు అమలు జరిపాయి. అవి ఎవరికి లబ్ది చేకూర్చాయి? గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను రాబడిలో ఏ రంగం నుంచి ఎంత వచ్చిందో బడ్జెట్‌ పత్రాలలో వివరించారు. దాని ప్రకారం 2009-10లో మొత్తం పన్ను రాబడి 6,24,528 కోట్లకు గాను కార్పొరేట్‌, ఆదాయ పన్ను వాటాలు 39,19.6 శాతం చొప్పున వున్నాయి. అదే 2018-19 బడ్జెట్‌లో 27.3,23.2 శాతాలుగా వున్నాయి. అంటే పదేండ్లలో కార్పొరేట్లకు పన్నెండుశాతం వరకు లబ్ది చేకూరితే వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదార్లపై 3.6శాతం భారం పెరిగింది. ఆదాయ అసమానతలు పెరగటానికి శతకోటీశ్వరులు వృద్ధి చెందటానికి ఇది కారణం కాదా ? వుద్యోగులకు మొత్తం ఆదాయం మీద పన్ను విధిస్తుండగా కార్పొరేట్‌లు, వ్యాపారులు, ఇతర వృత్తిదారులకు ఖర్చులు పోను నిఖర ఆదాయం మీదనే పన్ను వేస్తున్నారు. ఇదొక అన్యాయం. వుద్యోగులకు కుటుంబ ఖర్చులను లెక్కవేసే వేతనాలు నిర్ణయిస్తున్నారు తప్ప ప్రతి ఏటా వారికి ఇంత మిగులు వుండాలనే ప్రాతిపదికేమీ వుండదు. హష్‌ముఖ్‌ చెప్పినదాని ప్రకారం ఏడు లక్షల నమోదైన కంపెనీలలో సగం సమర్పించిన ఆదాయ వివరాల ప్రకారం సున్నా మిగులు లేదా నష్టాలను చూపారు. వుద్యోగులకు ఇటువంటి అవకాశం లేదు. నిజానికి వారు వినియోగదారులుగా ఇతర పన్నులతో పాటు అదనంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నారు. ‘బ్రిటీరాజ్యం నుంచి బిలియనీర్‌ రాజ్యం వరకు ‘ అనే శీర్షికతో ప్రముఖ ఆర్ధికవేత్తలు ల్యూకాస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెట్టి ఆదాయ పన్ను చట్టం చేసిన 1922 నుంచి 2014 వరకు మన దేశ ఆర్ధిక వ్యవస్ధలో అసమానతల గురించి ఒక అధ్యయన పత్రాన్ని తయారు చేశారు. దాని ప్రకారం 2014లో పదిశాతం ధనికులు వార్షికాదాయంలో 56శాతాన్ని పోగేసుకున్నారు.1930 దశకంలో ఒకశాతం ధనికులు మొత్తం ఆదాయంలో 21శాతం లోపు కలిగి వుండగా అది 1980దశకం ప్రారంభానికి ఆరుశాతానికి పడిపోయి 2014నాటికి 22శాతానికి పెరిగింది. గతేడాది ఆక్స్‌ఫామ్‌ సర్వే ప్రకారం ప్రపంచ ధనికులలో ఒక శాతం మంది 50శాతం సంపదను కలిగి వుండగా మన దేశంలో అది 58శాతంగా వుంది. 2017 వివరాల ప్రకారం ఒకశాతం ధనికుల సంపద 20.9లక్షల కోట్లకు అంటే కేంద్ర బడ్జెట్‌కు సమంగా చేరుకుంది. మన దేశంలోని ఒక ప్రముఖ వస్త్రకంపెనీ సిఇఓ ఒక ఏడాది ఆదాయాన్ని పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో కనీస వేతనం పొందుతున్న కార్మికుడు 941 సంవత్సరాలు పనిచేయాల్సి వుంటుంది. మరో విధంగా లెక్క వేస్తే గ్రామీణ కార్మికుడు జీవితాంతం(50 సంవత్సరాలు) పని చేస్తే సంపాదించే మొత్తాన్ని అదే సిఇఓ కేవలం 17.5 రోజుల్లో సంపాదిస్తాడట. అదే అమెరికాలో ఒక కార్మికుడు ఏడాది మొత్తంలో పొందిన వేతనాన్ని ఒక కంపెనీ సిఇవో ఒక రోజులో పొందుతాడని ఆక్స్‌ఫామ్‌ పేర్కొన్నది.

కారిపోతున్న ‘సంపద బక్కెట్‌ ‘ కన్నాలు పూడ్చాలని కార్పొరేట్లకు పన్ను రాయితీలు రద్దు చేయాలని, పన్ను నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్స్‌ఫామ్‌ కోరింది. గతేడాదినాటికి మన దేశంలోని బిలియనీర్ల సంపద 20.7లక్షల కోట్లకు పెరిగితే దానిలో గతేడాదే 4.89లక్షల కోట్లు చేరింది. ఈ మొత్తంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చు, ప్రతి రాష్ట్రంలో జాతీయ ప్రాజక్టులకు ధారాళంగా నిధులు కేటాయించవచ్చు. బాహుబలి సినిమా వసూలు చేసిన మొత్తమంత కూడా తమకు కేటాయించలేదని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం వుండదు.

ఆర్ధిక సర్వే, బడ్జెట్‌లోని మరికొన్ని విషయాలను చూద్దాం. ఆర్ధిక సర్వే, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు అంకెలన్నీ ఒకచోటనే తయారు చేసి స్వల్ప మార్పులతో ఎవరికి వారు ప్రకటించుకున్నట్లుగా వుంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో జిడిపి పెరుగుదల రేటు 6.75శాతం వుంటుందని అంచనా వేస్తే కేంద్ర గణాంకశాఖ 6.5శాతంగానూ, ఐఎంఎఫ్‌ 6.7గా చెప్పింది, వచ్చేఏడాది పెరుగుదల రేట్లను 7.5,7.4శాతాలుగా పేర్కొన్నాయి. పెరుగుదల రేట్లు అచ్చేదిన్‌ అంచనాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే మన చేతుల్లో లేని ప్రపంచ చమురు మార్కెట్‌ రేట్ల మీద ఇవి ఆధారపడి వుంటాయి. స్టాక్‌ మార్కెట్‌ ఇప్పుడు మంచి కాక మీద వుంది కనుక లాభాలు దండిగా సంపాదించుకొనేందుకు విదేశీ కంపెనీలు డాలర్లను కుమ్మరించి వాటాలను కొనుగోలు చేస్తున్నాయి. ఆ మొత్తాలను మన విదేశీ మారక నిల్వలుగా చూపుతున్నాం, వాటితో చమురు కొనుగోలు చేస్తున్నాం. స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా, చమురు ధరలు పూర్వపు స్ధాయికి పెరిగినా మన పరిస్ధితి ఢమాల్‌. ఒకవేళ స్టాక్‌ మార్కెట్‌ బుడగ మరికొంత కాలం కొనసాగిందనుకుందాం. అది వుండగానే మన పారిశ్రామిక వుత్పత్తి పడిపోయింది, ఎగుమతులు తగ్గిపోయాయి. అందువలన ఈ పరిస్ధితి కొనసాగదన్న గ్యారంటీ ఏముంది? ముదిమది తప్పిన మాదిరి డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై కాలుదువ్వుతున్న పూర్వరంగంలో ఇప్పటికే పీపా చమురు 70 డాలర్లకు చేరింది. తగ్గే పరిస్ధితి కనిపించటం లేదు. అందుకే మనకు రోజూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికా సర్కార్‌ మన ఐటి ఎగుమతులను దెబ్బతీసే విధంగా, మన ఇంజనీర్లకు వీసాలు నిరాకరించే ధోరణిలో వ్యవహరిస్తోంది. అది కూడా మనకు నష్టం చేకూర్చే పరిస్థితే. ప్రపంచ ధనిక దేశాలలో పరిస్ధితులు చక్కబడితే తప్ప మన ఎగుమతులు పెరగవు అని తేలిపోయింది. వాటి పరిస్ధితి కూడా అంత ఆశావహంగా కనిపించటం లేదు. అనేక దేశాలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. వాటి ప్రభావం మన మీద పడింది కనుకనే మన ప్రధాని దవోస్‌ సమావేశ వేదికపై వుగ్రవాదం ఎంత చెడ్డదో రక్షణ చర్యలు కూడా అంతే అని చెప్పాల్సి వచ్చింది.

ఈ సమస్యల నుంచి బయట పడాలంటే అంతర్గత మార్కెట్‌ను పెంచుకోవటం తప్ప మరొక మార్గం లేదు. అది జరగాలంటే జనంలో కొనుగోలు శక్తి పెరగాలి. ఇప్పుడు ఎగుమతుల కోసం లేదా కార్పొరేట్‌ సంస్ధలకు ఇస్తున్న ఇతర రాయితీల మొత్తాన్ని వేతన పెరుగుదల లేదా జనం కొనుగోలు శక్తి పెంపుదలకు మళ్లిస్తే పారిశ్రామిక వుత్పత్తి పెరగటంతో పాటు వుపాధి అవకాశాలు పెరుగుతాయి. బడ్జెట్‌ విషయానికి వస్తే 2022 నాటికి వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తామన్నది ఒక పెద్ద వాగ్దానం. అయితే దానికి తోడ్పడే చర్యలేమీ లేవు. రానున్న ఎన్నికలకు రైతులకు విసిరిన ఎర. ప్రత్యక్ష పన్నుల వాటా 51.6 నుంచి 50.6శాతానికి తగ్గనున్నట్లు చెప్పటమంటే కార్పొరేట్లకు రాయితీ ఇవ్వటమే. ఏడాదికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు చెల్లించేందుకు వీలుగా పది కోట్ల కుటుంబాలకు ఆరోగ్యబీమా. పాత పధకాలన్నీ కలిపి కొత్తగా చెప్పిన అంకె. జన ఆరోగ్యం కంటే పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్న బీమా కంపెనీలకు పెద్ద ఎత్తున సొమ్ము ముట్టచెప్పే ఎత్తుగడ దీని వెనుక వుందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ప్రయివేటు రంగం పెట్టుబడులు పెద్దగా రావటం లేదు. వచ్చినవి కూడా వుపాధి రహిత వృద్ధికే దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు నానాటికీ తగ్గుతున్నాయి. అనేక పధకాలకు కేటాయింపులు తగ్గించారు. డబ్బు మొత్తాలు స్వల్పంగా పెరగవచ్చుగానీ జిడిపితో పోల్చితే శాతాలన్నీ తగ్గిపోయాయి. పోనీ పేర్కొన్నవాటిని కూడా పూర్తిగా ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిరుద్యోగ యువతను పకోడీలమ్మించే దిశగా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని చెప్పవచ్చు.