Tags

, , ,

Image result for china communist party-catholic religion

ఎం కోటేశ్వరరావు

మతం జనం పాలిట మత్తు వంటిదన్నది కమ్యూనిస్టుల అవగాహన. కమ్యూనిజం మతానికి వ్యతిరేకం అన్నది కాథలిక్‌ మతాధికారుల భాష్యం. అటువంటి రెండు పరస్పర విరుద్ధ శక్తులు కారణాలేమైతేనేం రాజీబాటలో వున్నాయంటే నమ్మబుద్ది కావటం లేదు కదూ ! ఈ పరిణామం గురించి వ్యాఖ్యానించటానికి ఎవరి స్వేచ్చ వారికి వుంది. అనుకూల, వ్యతిరేక తీర్పుల జోలికి పోకుండా అసలేం జరుగుతోందో ముందు చూద్దాం.గత కొద్ది వారాలుగా గతంలో ఎవరి మీదా లేని విధంగా క్రైస్తవులే పోప్‌ ఫ్రాన్సిస్‌పై పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. మతాన్ని మంటగలుపుతున్నారని శాపనార్ధాలు పెడుతున్నారు. పోప్‌ కూడా చివరికి కమ్యూనిస్టు చైనాకు లో0గిపోతున్నారని, ఆ దేశం చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే జరిగితే గత వెయ్యి సంవత్సరాలుగా పోప్‌ల నియామకంపై పెత్తనం చలాయియిస్తున్న వాటికన్‌ ఓడిపోయినట్లే అని కొందరు రెచ్చగొడుతున్నారు. అది జరిగితే కొందరైతే గొర్రెపిల్లలను తోడేళ్లకు అప్పగిస్తున్న వ్యక్తిగా పోప్‌ను నిందిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది?

ప్రతి సమాజంలో ఎవరు సుప్రీం, అంతిమ అధికారం ఎవరిది అన్న అంశంపై మతం, రాజ్యాధికారం మధ్య ఏదో ఒక రూపంలో పోరు సాగింది. దోపిడీవర్గ జోక్యంతో రాజీలు, సర్దుబాట్లు జరిగాయి. తమ దోపిడీ సజావుగా సాగటానికి అటు రాజ్యాన్ని, మతాన్ని దోపిడీవర్గం కుడిఎడమల డాల్‌, కత్తుల మాదిరి సహజీవనం చేయిస్తున్నది. గత మూడు సంవత్సరాలుగా చైనా-వాటికన్‌ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నా నిర్ధిష్టంగా ఎలాంటి పురోగతి లేదు. చైనాలో 1948లో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అధికారానికి వచ్చిన ప్రభుత్వాన్ని 1971 వరకు ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అమెరికా నాయకత్వంలోని కూటమి చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌నే చైనాగా గుర్తిస్తూ వచ్చింది. బౌద్దమతాధిపతి దలైలామా అమెరికా అడుగుజాడల్లో నడుస్తూ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించి టిబెట్‌ తన పాలనలోని రాజ్యమంటూ విఫల తిరుగుబాటు చేసి భారత్‌కు పారిపోయి వచ్చాడు. ఇక్కడ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టిబెట్‌లో నిత్యం ప్రభుత్వ వ్యతిరేకులతో సంబంధాలు కలిగి వున్నాడు. గతేడాది నవంబరు 23న ఒక ప్రకటన చేస్తూ జరిగిందేదో జరిగిపోయింది, చైనాతో టిబెట్‌ కలసి వుండాలనుకొంటోంది, చైనా అంగీకరిస్తే టిబెట్‌కు తిరిగి వస్తాను అని దలైలామా ప్రకటన చేశారు. కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు వ్యతిరేకంగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్ధంలో భాగంగా కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనా నుంచి హాంకాంగ్‌ పారిపోయి తైవాన్‌, మకావుల్లో బిషప్పుగా పని చేసి రిటైరైన చైనాలోని కాధలిక్‌ మత కార్డినల్‌ జోసెఫ్‌ జెన్‌(86) మాత్రం ససేమిరా రాజీపడేది లేదు అంటున్నారు.

డిసెంబరులో వాటికన్‌ నుంచి చైనా వెళ్లిన ఒక ప్రతినిధి బృందం గ్వాంగ్‌డాంగ్‌ రాష్ట్రంలోని షాంటౌలో బిషప్పుగా పనిచేస్తున్న పీటర్‌ ఝువాంగ్‌ జియాన్‌ జియాన్‌(88)ను బీజింగ్‌లో కలసింది. బాధ్యతల నుంచి వైదొలగి చైనా ప్రభుత్వం నియమించిన పార్లమెంట్‌ సభ్యుడు, బిషప్పు హువాంగ్‌ బింగ్‌ఝాంగ్‌కు బాధ్యతలు అప్పగించేందుకు వీలు కల్పించాలని కోరింది. హువాంగ్‌ను 2011లో వాటికన్‌ అధికారులు మతం నుంచి బహిష్కరించారు. మరోబిషప్పు జోసెఫ్‌ గువో గ్జీజిన్‌ను కూడా తప్పుకోవాలని వాటికన్‌ బృందం కోరింది. 1999తో బ్రిటన్‌ కౌలు గడువు ముగిసిన హాంకాంగ్‌ చైనా ఆధీనంలోకి వచ్చినప్పటికీ విలీనం సందర్భంగా కుదురిన ఒప్పందం ప్రకారం 2050వరకు అక్కడ ప్రత్యేక పాలనా వ్యవస్ధ కొనసాగుతుంది. జోసెఫ్‌ జెన్‌ 2002లో అక్కడ బిషప్పు అయ్యాడు. తరువాత రిటైర్‌ అయిన ఈ మాజీ బిషప్పు చైనాలో హాంకాంగ్‌ విలీన వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతూ రాజకీయాలు చేస్తున్నాడు. దానిలో భాగంగానే సదరు జెన్‌ నాయకత్వంలోని ప్రతినిధి బృందం జనవరి పదిన వాటికన్‌ నగరానికి వెళ్లి అక్కడ పోప్‌ను కలిసింది. చైనా ప్రభుత్వానికి లంగిపోయి వాటికన్‌ గుర్తించిన ఇద్దరు బిషప్పుల స్ధానంలో కమ్యూనిస్టు పార్టీ ఆమోదం వున్న బిషప్పులను నియమించవద్దని వాదించింది. ఈ కలయిక, చర్చల గురించి పశ్చిమ దేశాలు, క్రైస్తవమత కేంద్రాలు, మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వెయ్యి సంవత్సరాల తరువాత మరోసా రి మతం, రాజ్యం మధ్య ఆధిపత్యపోరు కొత్త రూపంలో ముందుకు వచ్చిందన్నది వాటిలో ఒకటి.

చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత వాటికన్‌ నగరానికి చైనాకు పరస్పర గుర్తింపు, దౌత్య సంబంధాలు లేవు. అయినా వాటికన్‌ అక్కడ ఇంతకాలంగా మత పెద్దలను నియమిస్తూనే వుంది. వారిని చైనా గుర్తించటం లేదు. చట్టవిరుద్ధంగా పని చేస్తున్నవారిగానే భావిస్తున్నది. 1957లో చైనా ప్రభుత్వం కాథలిక్‌ పేట్రియాటిక్‌ అసోసియేషన్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా బిషప్పు, ఇతర మతాధికారుల నియమాకాన్ని చేపట్టింది. దీన్ని తాము గుర్తించటం లేదని అలాంటి మతాధికారులను బహిష్కరిస్తున్నట్లు 1958లో పోప్‌ 14వ బెండిక్ట్‌ ప్రకటించారు. అప్పటి నుంచి వివాదం కొనసాగుతున్నది. అప్పటి నుంచి అధికార, అనధికార బిషప్పుల నియామకాలు జరుగుతూనే వున్నాయి. అనధికార ప్రార్ధనలపై చైనా సర్కార్‌ క్రమంగా ఆంక్షలను పెంచటం ప్రారంభించింది. వాటికన్‌ అధికారాన్ని గుర్తించేందుకు చైనా ససేమిరా అంటోంది. మొత్తంగా చూసినపుడు ప్రతి మతం ప్రజల పాలిట మత్తు మందే అన్నది స్పష్టం. అయినప్పటికీ కొందరు మతాన్ని సంపూర్ణంగా సంస్కరించలేకపోయినా సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనే పురోగామివాదులు కొందరైతే మొరటుగా వెనక్కు నడిపించజూసే కొందరు అన్ని మతాల్లోనూ వుంటారు. తూర్పు ఐరోపా, సోవియట్‌ యూనియన్‌లలో సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతలో అమెరికా సామ్రాజ్యవాదులు, ఇతర ఐరోపా ధనిక దేశాలతో పాటు రెండవ పోప్‌ జాన్‌పాల్‌ కూడా పుణ్యం కట్టుకున్న రెండవ తెగకు చెందిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌పై చేస్తున్న విమర్శలు, వస్తున్న వూహాగానాలను బట్టి ఆయన జాన్‌పాల్‌ వంటి వ్యక్తి మాత్రం కాదని చెప్పవచ్చు.

తిరుగుబాటు మాజీ బిషప్‌ జెన్‌ బృందం రోమ్‌లో పోప్‌ను కలిసి చైనా ప్రభుత్వ వత్తిడికి లంగవద్దని కోరింది. దాని మీద పోప్‌ స్పందిస్తూ గతంలో హంగరీలో మాదిరి తిరుగుబాటు చేసి జైలు పాలయ్యే పరిస్ధితి తెచ్చుకోవద్దని చైనాలో రహస్యంగా పని చేస్తున్న బిషప్పులనుద్ధేశించి సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. జోసెఫ్‌ మైండ్‌జెంటీ అనే బిషప్పు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జైలు పాలయ్యాడు.1956లో ప్రతీఘాతవిప్లవ సమయంలో తిరుగుబాటుదార్లు జైలుపై దాడి చేసి మైండ్‌ జెంటీని అమెరికా రాయబార కార్యాలయంలోకి పంపారు. హంగరీ ప్రభుత్వ వత్తిడి కారణంగా మైంట్‌జెంటీని దేశం వదలి వెళ్లాలని ఆదేశించిన వాటికన్‌ ఆయన స్ధానంలో ప్రభుత్వానికి ఆమోదయోగ్యుడైన మరొక బిషప్పును నియమించింది. అటువంటి స్ధితిని మరోమారు తెచ్చుకోవద్దని చైనా బిషప్పులకు పోప్‌ సలహాఇచ్చారన్నది వార్తల సారాంశం. ‘ చైనా కాథలిక్‌ చర్చిని వాటికన్‌ చర్చి(కమ్యూనిస్టులకు) ధారాదత్తం చేస్తున్నదని నేను ఎందుకు అనుకుంటున్నానంటే గత కొద్ది సంవత్సరాలుగా, నెలలుగా వారు నడిచినబాటనే కొనసాగిస్తే అదే జరుగుతుంది. వాటికన్‌-చైనా మధ్య ఒప్పందం కుదిరే క్రమంలో నేను ప్రధాన ఆటంకం వున్నానా? ఒక వేళ అది దుష్ట లావాదేవీ అనుకుంటే దానికి ఆటంకంగా వున్నందుకు నేను సంతోషపడతాను’ అని జెన్‌ తన బ్లాగ్‌లో పేర్కొట్లు వార్తలు వచ్చాయి. జెన్‌ వైఖరి చైనా సర్కార్‌తో ఘర్షణనే కోరుతున్నట్లు వెల్లడి కావటంతో ఒప్పందాన్ని ఖరారు చేసుకొనేందుకు వుభయపక్షాలు వేగంగా కదులుతాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వాటికన్‌ విదేశాంగమంత్రి పిట్రో పారోలిన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్‌ పేరు ప్రస్తావించకుండా ‘ అవును, చైనా ప్రభుత్వ అధికారులతో ప్రస్తుత సంబంధాలను పోప్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన వైఖరికి అనుగుణంగానే ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఎవరూ అనధికార చొరవలు తీసుకోవటం లేదు. చేస్తున్న త్యాగం చైనా ప్రభుత్వం కోసం కాదు, క్రీస్తు చర్చికోసమే, అని చెప్పారు.

కమ్యూనిస్టు సిద్ధాంతం పుట్టి రెండు వందల సంవత్సరాలైతే క్రైస్తవం దాని కంటే రెండువేల సంవత్సరాల ముందు పుట్టింది. సోదరత్వాన్ని ప్రబోధించటమే తప్ప సోదరుల మధ్య అంతరాలు,దోపిడీ పెరగటాన్ని అది నిరోధించలేకపోయింది. దోపిడీకి వ్యతిరేకంగా నూతన సమాజాన్ని నిర్మించాలన్న కమ్యూనిజాన్ని దోపిడీదారులు, వారికి వత్తాసుగా వున్న మతపెద్దలు వ్యతిరేకించేందుకు నడుం కట్టారు. దోపిడీదార్లతో మత పెద్దలు చేతులు కలపాలంటే ఏదో ఒక సాకు కావాలి కనుక మతానికి కమ్యూనిజం వ్యతిరేకం అని అర్ధాలు తీశారు. దోపిడీ మతానికి వ్యతిరేకమని ఏనాడూ పెట్టుబడిదారీ వ్యవస్ధను, సిద్ధాంతాలను మతం చెప్పలేదు. సోవియట్‌, తూర్పు ఐరోపాదేశాలలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే సామ్రాజ్యవాదులతో పాటు వారితో చేతులు కలిపిన చర్చి అధికారుల పాత్రను చైనా కమ్యూనిస్టుపార్టీ గుర్తించి కనుకనే మతం ముసుగులో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న మతాధికారులను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం పూనుకుంది. మత స్వేచ్చను అనుమతిస్తున్నది కనుకనే దాన్ని ఇంటికి పరిమితం చేసుకోవాలని, పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతోంది. ఒకసారి జనంలో మతోన్మాదాన్ని నింపితే అది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో తాలిబాన్లు, ఐఎస్‌ తీవ్రవాదులను చూస్తున్న ప్రపంచానికి వేరే చెప్పనవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అమెరికన్లు, వారితో చేతులు కలిపిన ఆ ప్రాంత కమ్యూనిస్టు వ్యతిరేకులు తాలిబాన్ల సృష్టికి తెరలేపారు. పశ్చిమాసియాలో రాజకీయంగా తమను వ్యతిరేకించే శక్తులకు వ్యతిరేకంగా తాలిబాన్లతో పాటు ఐఎస్‌ తీవ్రవాదులను కూడా పెంచి పోషించింది అమెరికా, దాని అనుయాయి దేశాలే అన్నది స్పష్టం. ఈ పరిణామాలను చూసిన తరువాత చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు వ్యవస్ధను కాపాడుకొనేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది. అందువలన చైనాలో అనధికార క్రైస్తవ, ఇస్లామిక్‌ మతకార్యకలాపాలను ఈ నేపధ్యం, దృష్టితోనే చూడాల్సి వుంది.

ఇక్కడ కమ్యూనిస్టులు, వామపక్ష అభిమానులకు ఒక సందేహం రావటం సహజం.మతం మత్తు మందు అని చెప్పే కమ్యూనిస్టులు మతాన్ని నిర్మూలించకుండా అధికారికంగా అనుమతించటం ఏమిటి అన్నదే అది. కమ్యూనిస్టు పార్టీ అంగీకారంతో నియమించే బిషప్పులు కూడా అదే క్రీస్తు, అదే బైబిల్‌నే ప్రచారం చేస్తారు కదా తేడా ఏముంది అని ప్రశ్నించ వచ్చు. మన సమాజంలో మతం అన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి వేళ్లూనుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ లేదా మరో అధికార కమ్యూనిస్టు పార్టీ దాని ప్రభావాన్ని తగ్గించటానికి చర్యలు తీసుకుంటున్నదా, మతభావాలను పెంచేవిధంగా వ్యవహరిస్తున్నదా అన్నదే గీటురాయి. ఆ విధంగా చూసినపుడు చైనా ప్రభుత్వం మతంతో సహా అనేక అన్యవర్గధోరణులను అరికట్టేందుకు ఓపికతో పని చేయాలే తప్ప నిషేధాలతో కాదు. అక్కడ ఇంకా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం ఇంకా ప్రాధమిక దశలోనే వుంది, ఎన్నో దశ లను అధిగమించాల్సి వుంది. అటువంటపుడు అన్యవర్గ ధోరణులు అంతమయ్యే అవకాశ ం లేదు. కనుక కొంత కాలం పాటు కుట్రలూ, కూహకాలకు అవకాశం లేని మత స్వేచ్చను అనుమతించటం తప్ప మరో మార్గం లేదు.జనం తమ అనుభవం ద్వారా మత ప్రభావం నుంచి బయటపడాల్సి వుంది.

విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం చైనాలోని 140 కోట్ల జనాభాలో ఏడు కోట్ల మంది ప్రొటెస్టెంట్‌ క్రైస్తవులుంటే కోటి మంది కాథలిక్కులున్నారని అంచనా. చైనా కమ్యూనిస్టుపార్టీ చరిత్ర, ఏడు దశాబ్దాల ప్రభుత్వ తీరుతెన్నులను గమనిస్తే మతం రాజ్యానికి లోబడి వుండాలే తప్ప రాజ్యంపై మత పెత్తనాన్ని అంగీకరించేది లేదని రుజువైంది. కమ్యూనిస్టు పార్టీ అధికారానికి రాగానే బౌద్ద మతాధిపతి దలైలామా తాను సర్వస్వతంత్రుడనని, తన ఆధీనంలోని టిబెట్‌ తన రాజ్యమని ప్రకటించుకోవటమేగాక కమ్యూనిస్టు ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో తిరుగుబాటు విఫలమై మన దేశానికి పారిపోయి రావటం, మన ప్రభుత్వం ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన చరిత్ర తెలిసిందే. క్రైస్తవ మత చరిత్రలో బిషప్పులు, ఇతర మతాధికారులను నియమించే అధికారం రాజులదా, పోప్‌దా అనే ఆధిపత్యపోరు సాగింది.అది పదకొండవ శతాబ్దిలో తారాస్ధాయికి చేరింది. పోప్‌ ఏడవ గ్రెగరీ ఆధిపత్యాన్ని రోమన్‌ లేదా జర్మన్‌ చక్రవర్తి నాలుగవ హెన్రీ సవాలు చేయటంతో ముగ్గురు పోప్‌లు ఐదుసార్లు అతడిని మతం నుంచి బహిష్కరించారు. ఇటలీ, జర్మనీలలో అంతర్యుద్ధాలు సంభవించాయి. ఆ పోరులో బలహీనపడిన హెన్రీ 1076,77 సంవత్సరాలనాటికి చేతులెత్తేశాడు. ఈ పోరులోనే పోప్‌ ఏడవ గ్రెగరీని కిడ్నాప్‌ చేసి ఇటలీలోని కానోసా కోటలో బంధించారు. అయితే కొంత మంది ప్రభువుల అండతో తప్పించుకున్నాడు. కిడ్నాప్‌లో హెన్రీ హస్తం వుందని భావించారు. చివరకు హెన్రీ పోప్‌కు లంగిపోవాల్సి వచ్చింది. పోప్‌ నివాసానికి వెళ్లి మూడు రోజుల పాటు చెప్పుల్లేకుండా మంచులో బయట నిలబడి తన తప్పులను క్షమించాలని వేడుకున్నాడు. తరువాత పోప్‌ ఇతరులకు మద్దతు ఇచ్చి మరోసారి హెన్రీని మతం నుంచి బహిష్కరించాడు.

ఇది పదకొండవ శతాబ్దం కాదు, చైనా పాలకులకు నాలుగవ హెన్రీకి, ఏడవ పోప్‌ గ్రెగరీకి, ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌కు పోలికేలేదు. ఆయన స్ధానంలో మరొకరుండి పెత్తనం చెలాయించాలని చూసినా చైనాను కట్టడి చేసే శక్తివంతులెవరూ నేడు ప్రపంచంలో లేరు. పోప్‌దే సర్వాధికారం అని రుజువు చెయ్యటానికి పాలకులు యుద్ధాలు చేసే పరిస్ధితీ లేదు. వాటికన్‌ మొండిగా వ్యవహరించి చైనాలో రహస్యకార్యకలాపాలు నిర్వహిస్తున్న కాథలిక్కులను ప్రోత్సహించటమంటే ప్రభుత్వ వ్యతిరేకులుగా తయారు చేయటం, తద్వారా వారిని ఇబ్బందుల పాలు చేయటం తప్ప మరొకటి కాదు. గతంతో పోల్చితే ఒక్క క్రైస్తవమే కాదు అన్నిరకాల మతకార్యకలాపాలను అదుపు చేసేందుకు మరిన్ని చర్యలను తీసుకొనేందుకు చైనా నాయకత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి రహస్య ప్రార్ధనలను ఏమాత్రం సహించేది లేదని ప్రభుత్వం నిర్ణయించినట్లు చైనా తిరుగుబాటు బిషప్‌ జెన్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. ఆసియా న్యూస్‌ అనే పత్రిక 2015లో ప్రచురించిన ఒక వార్తను వుటంకిస్తూ దాని సంపాదకుడు వ్యాఖ్యానించారు. జైలు పాలైన మతాధికారుల గురించి చైనా ప్రభుత్వం అసలు చర్చలకే అంగీకరించలేదు, అప్పుడూ ఇప్పుడు తాము ప్రతిపాదించిన బిషప్పును గుర్తిస్తేనే వాటికన్‌ను గుర్తిస్తామని చైనా చెబుతోంది. ఆంక్షల పెంపుదలకు ఒకటే వుద్ధేశం. అదేమంటే కమ్యూనిస్టు పార్టీ అధికారాన్ని సుస్ధిరం చేసుకొనేందుకు, ఎవరైనా దాని వునికిని సవాలు చేస్తే అణచివేసేందుకు’ అన్నాడు. పదజాలం ఎలా వున్నప్పటికీ చైనా సోషలిస్టు వ్యవస్ధకు హాని తలపెట్టే ఏ పరిణామాన్ని కూడా అక్కడి నాయకత్వం తక్కువ చేసి చూడటం లేదని, దానిని రక్షించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు ఇప్పటికే అనేక పరిణామాలు స్పష్టం చేశాయి. వాటికన్‌-చైనా సంబంధాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు ఏ రీత్యాచూసినా ఆహ్వానించదగినవే అని చెప్పవచ్చు. మతానికి కమ్యూనిజానికి మధ్య కట్టిన అడ్డుగోడల కూల్చివేతకు ఏ మాత్రం తోడ్పడినా మంచిదే !