Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమానికి వుత్తేజం కలిగించే మరో పుట చరిత్రకు తోడైంది. ఇటీవలి పార్లమెంట్‌, రాష్ట్రాల ఎన్నికలలో ఐక్యంగా పోటీచేసిన నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ(యుఎంఎల్‌), నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ( మావోయిస్టు సెంటర్‌)లను ఒకే పార్టీగా విలీనమైంది. ఈ మేరకు లాంఛనంగా రెండు పార్టీల నేతలు ఏడు అంశాల ఒప్పందంపై సోమవారం నాడు సంతకాలు చేశారు. దీని ప్రకారం కొత్త పార్టీకి నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(సిపిఎన్‌) నామకరణం చేశారు. మార్క్సిజం-లెనిజం వేగుచుక్కగా పార్టీ పని చేస్తుంది. యుఎంఎల్‌ అధ్య క్షుడు, ప్రధాని అయిన కెపి శర్మ ఓలి, ఝాలా నాధ్‌ ఖనాల్‌, మాధవ కుమార్‌ నేపాల్‌, వామ్‌దేవ్‌ గౌతమ్‌, ఈశ్వర్‌ పోఖరెల్‌, మావోయిస్టు సెంటర్‌ తరఫున పార్టీ అధ్యక్షుడు పుష్పకమల్‌ దహాల్‌( ప్రచండ) నారాయణ్‌ కాజీ శ్రేష్ట, రామ్‌ బహదూర్‌ థాపా సంతకాలు చేశారు. ఐక్యపార్టీ మహాసభ జరిగే వరకు పార్టీకి కెపి శర్మ ఓలీ, ప్రచండ ఇద్దరూ అధ్యక్షులు వుంటారు, ఇద్దరూ అధికారంలో పాలుపంచుకుంటారు. దిగువ స్ధాయిలో కూడా రెండు పార్టీల కమిటీలు విలీనం అవుతాయి. అంగీకరించిన ఏడు అంశాలు ఇలా వున్నాయి.1.పార్టీపేరు నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ.2.పార్టీ సిద్ధాంతాలను అంతిమంగా పార్టీ మహాసభ నిర్ణయిస్తుంది.3. అప్పటి వరకు మార్క్సిజం-లెనినిజం వుమ్మడి పార్టీ సిద్ధాంత అంశంగా వుంటుంది.4. వుమ్మడి పార్టీ స్టాండింగ్‌ కమిటీ, పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీలు చిన్నవిగా వుంటాయి.5. ప్రధానిగా కెపిశర్మ ఓలి, ప్రపండ రెండు సమానవంతుల వారీ పని చేస్తారు.6. పార్లమెంట్‌ అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్‌గా యుఎంఎల్‌, స్పీకర్‌, వుపాధ్యక్షులుగా మావోయిస్టు సెంటర్‌ ప్రతినిధులు వుంటారు.7.మంత్రుల సంఖ్యను తరువాత ఖరారు చేస్తారు.(15 మందితో కాబినెట్‌ వుండాలని సమన్వయ కమిటీ సిఫార్సు చేసింది). మార్చినెల అయిదవ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశ కొత్త దేశాధ్యక్షుడు, వుపాధ్యక్షుడిని ఎన్నుకొంటుంది.

పదిరోజుల క్రితం ప్రధానిగా కెపి శర్మ ఓలి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసినదే.మార్చి ఐదవ తేదీన పార్లమెంట్‌ తొలి సమావేశం జరుగుతుంది. వుభయ సభలలోనూ నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ మెజారిటీ సభ్యులను కలిగి వుంది. చట్టపరమైన లాంఛనాలు కూడా పూర్తి కావాల్సి వున్నందున విలీన ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరో నెల రోజులు పట్టవచ్చు.ఈ లోగా రెండు పార్టీల కేంద్రకమిటీలు సమావేశమై విలీన తీర్మానాలను అమోదించాల్సి వుంది. విభిన్న నేపధ్యాలు కలిగిన ఈ రెండు పార్టీల విలీనం అనేక మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది, అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు. రెండువందల నలభయి సంవత్సరాల హిందూరాజ్య పాలన సాగిన నేపాల్‌లో గత రెండు దశాబ్దాలుగా రాజరికానికి వ్యతిరేకంగా పోరాడిన శక్తులు అక్కడి రాజకీయాలలో ప్రధాన పాత్రపోషిస్తున్నాయి. కమ్యూనిస్టులు, నేపాలీ కాంగ్రెస్‌ కలిసి రాచరిక వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కాగా మావోయిస్టు సెంటర్‌ పార్టీ సాయుధపోరు బాటను అనుసరించింది.2006లో కుదిరిన శాంతి ఒప్పందం ప్రకారం మావోయిస్టులు ఆయుధాలను విసర్జించారు. ఆ పార్టీ నేత ప్రచండ ప్రధాని అయ్యారు. అయితే ఇటీవలి కాలంలో మావోయిస్టు పార్టీ ప్రభావం తగ్గిపోయింది. తాజా ఎన్నికలలో సంఖ్యరీత్యా అది మూడో స్ధానానికి పరిమితమైంది. నేపాల్‌ మావోయిస్టు పోరాటాన్ని ‘ ద బుల్లెట్‌ అండ్‌ బాలట్‌ బాక్సు’ పేరుతో గ్రంధస్తం చేసిన ఆదిత్య అధికారి విలీనం అసాధారణమైనదని వర్ణించారు. వారు ఐక్యతకు కట్టుబడి వుంటే అది నేపాల్‌ రాజకీయ భవితవ్యాన్నే మార్చివేస్తుందని, అయితే అధికారాన్ని పంచుకోవటంలో వుమ్మడి పార్టీలో కూడా వారు రెండు పక్షాలుగా వ్యవహరించే అవకాశం వుందని అన్నారు. గత పదకొండు సంవత్సరాలలో తొమ్మిది సంకీర్ణాలను చూసి విసుగెత్తిన నేపాలీ ఓటర్లు తాజా ఎన్నికలలో కమ్యూనిస్టులకు పార్లమెంట్‌ వుభయ సభలు, రాష్ట్రాలలో తిరుగులేని మెజారిటీని కట్టబెట్టి అస్ధిరతకు తెరదించారు. అందువలన వుమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సి వుంది. తాము అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నామని, శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు, పూజలకు మాత్రమే పరిమితమైతే కుదరదని పార్టీ నాయకులు చెబుతున్నారు.

పార్లమెంట్‌ ఎగువ సభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులు మెజారిటీ సీట్లు గెలుచుకున్నారు. ఎగువ సభను కలిగి వుండటం నేపాల్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంట్‌, రాష్ట్రాల శాసనసభ్యులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్ధానిక సంస్ధల అధ్యక్షులు, వుపాధ్యక్షులతో కూడిన ఎలక్ట్రొరల్‌ కాలేజీ 59 సభ్యులుండే ఎగువ సభలో 56 మందిని ఎన్నుకుంటుంది. ముగ్గురిని దేశాధ్యక్షుడు నియమిస్తారు. ఏడు రాష్ట్రాలు సమాన ప్రాతిపదికన ఒక్కొక్క చోట నుంచి ఎనిమిది మందిని ఎన్నుకోవాల్సి వుంది. వీరిలో ముగ్గురు మహిళలు, ఒకరు దళితులు, ఒకరు వికలాంగుల ప్రతినిధి వుండాలి. ఈ మేరకు సోమవారం నాడు అధ్యక్షుడు విద్యాదేవి భండారి ప్రభుత్వం సిఫార్సు చేసిన ముగ్గురిని నియమించారు. ఒకరు జాతీయ ప్రణాళికా సంఘ మాజీ వుపాధ్యక్షుడు, మరొకరు ప్రణాళికా సంఘమాజీ సభ్యుడు కాగా మరొకరు న్యాయవాది. ఎగువ సభలో అధికార పక్షానికి చెందిన యుఎంఎల్‌కు 27, మావోయిస్టు సెంటర్‌కు 12, ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌కు 13, రాష్ట్రీయ జనతా పార్టీ, ఫెడరల్‌ సోషలిస్టు పార్టీ రెండేసి స్ధానాల చొప్పున కలిగి వున్నాయి.

నేపాల్‌ రాజ్యాంగం ప్రకారం వుభయ సభలలో 33శాతం మహిళలు సభ్యులుగా వుండాలి. దిగువ సభలోని 275 స్ధానాలకు గాను 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు, 110 స్ధానాలకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీ నుంచి అయినా రెండు తరగతులలో ఎన్నికైన వారు 33శాతం విధిగా వుండాలి. ప్రత్యక్ష ఎన్నికలలో కేవలం ఆరుగురు మాత్రమే ఎన్నికయ్యారు. వీరిలో ముగ్గురు మావోయిస్టు సెంటర్‌, ఇద్దరు యుఎంఎల్‌, మరొకరు మరొకపార్టీ నుంచి ఎన్నికయ్యారు. దాంతో 33శాతం వుండే విధంగా పార్టీలు దామాషా నియోజకవర్గాల జాబితాలను అందచేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఈ మేరకు యుఎంఎల్‌ పార్టీకి దామాషా కోటాలో వచ్చిన 41 స్ధానాలలో మహిళలు 37, నేపాలీ కాంగ్రెస్‌కు వచ్చిన 40లో 20, మావోయిస్టు సెంటర్‌ 17లో పదహారు మంది మొత్తం 84 మంది మహిళలు ఎన్నికయ్యారు. మొత్తంగా చూసినపుడు అన్ని పార్టీల తరఫున దిగువ సభలో 90 మంది, ఎగువ సభలో 21 మంది ఎన్నికయ్యారు. దామాషా పద్దతిలో కొన్ని సీట్లు వుండటం, రెండింటిలో కలిపి 33శాతం విధిగా ఎన్నిక అవాలన్న నిబంధన కారణంగానే ఇంత మంది మహిళలకు అవకాశం వచ్చింది. ఒక వేళ దామాషా పద్దతిలో ఆశాతం పూర్తి కానట్లయితే ఆమేరకు ప్రత్యక్ష ఎన్నికలో వచ్చిన సీట్లు పార్టీ కోల్పోవాల్సి వుంటుంది. దిగువ సభ ఎన్నికలలో కనీసం మూడుశాతం ఓట్లు వచ్చిన పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది. కేవలం ఐదు పార్టీలు మాత్రమే ఆ మేరకు ఓట్లు పొందాయి, 44 విఫలమయ్యాయి. చట్ట సభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల గురించి మన దేశంలో ప్రధాన పార్టీలు కబుర్లు చెప్పటం తప్ప ఆచరణలో అడుగు ముందుకు వేయటం లేదు. పక్కనే వున్న నేపాల్‌లో అది కార్యరూపం దాల్చటానికి కమ్యూనిస్టులు ప్రధాన పాత్రధారులుగా వుండటమే కారణం.