Tags

, , , , ,

యంగ్‌ కారల్‌ మార్క్సు దృశ్యం

ఎం కోటేశ్వరరావు

తుపాకి చేతబట్టిన ఒక చెడ్డవాడిని ఆపాలంటే మరో మంచివాడు తుపాకి పట్టటమే ఏకైక మార్గం అని గతంలో సెలవిచ్చిన అమెరికా జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ అధిపతి వేనె లాపిరే తాజాగా మరో మారు రెచ్చి పోయాడు.తుపాకులను అదుపు చేయాలనే వారందరూ కమ్యూనిస్టులని, ఆచర్య స్వేచ్చను అడ్డుకోవటమే అంటూ చిందులేశాడు. ఇటీవల ఫ్లోరిడాలోని ఒక స్కూల్లో 17 మంది విద్యార్దులు, టీచర్లు ఒక దుండగుడి తుపాకి కాల్పులకు బలైన విషయం తెలిసిందే. ఇలాంటి వుదంతాలు పునరావృతం కాకూడదంటే టీచర్లందరికీ తుపాకులు ఇవ్వటమే మార్గం అని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. తుపాకులపై ఆంక్షలు విధించాలనే వారందరూ స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించాలని చూసే కమ్యూనిస్టులు తప్ప మరొకరు కాదని వేనె లాపిరే అన్నాడు. ట్రంప్‌-లాపిరే ఇద్దరూ లాభాల కోసం తుపాకులు తయారు చేసే కార్పొరేట్లకు వంత పాడుతున్నారు తప్ప వాటితో పోయే ప్రాణాల గురించి వారికి ఎలాంటి చింత లేదని నిరూపించుకున్నారు.

‘అమెరికా కాలేజీలలోె ఎక్కువగా ఇచ్చే నియోజిత పఠనం, అధ్యయనాలలో కమ్యూనిస్టు మానిఫెస్టో, ఆర్ధికవేత్తలలో కారల్‌ మార్క్స్‌ వుంటున్నారు. అనేక విశ్వవిద్యాలయాలలో ఇప్పుడు వందకు పైగా అమెరికా యువ ప్రజాస్వామ్య సోషలిస్టు శాఖలున్నాయి. సోషలిస్టు భావజాలాన్ని పెంపొందించుతున్నందుకు విద్యార్ధులు పాండిత్య ప్రదర్శక అభినందనలు కూడా పొందుతున్నారు.మీ పిల్లల్ని పాఠశాలలకు పంపే నిర్ణయం తీసుకోబోయే ముందు దీన్ని గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు. అమెరికా రాజ్యాంగాన్ని పట్టించుకోవటం లేదు, దానికి వక్రభాష్యం చెబుతున్నారు. రెండవ సవరణ ద్వారా ఈ దేశంలో ప్రసాదించిన స్వేచ్చ విస్మరించబడుతోంది. వారు గనుక అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారంటే అమెరికా స్వేచ్చలు పోతాయి, మన దేశం శాశ్వతంగా మారిపోతుంది.సోషలిజం రక్తాన్ని ఇష్టపడుతుంది’. ఇలా సాగింది వెనె లాపిరే వాచాలత్వం.

చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌

పెట్టుబడిదారీ వ్యవస్ధలో వెల్లడవుతున్న అవాంఛనీయ పోకడలను ఎలా సమర్ధించుకోవాలో తెలియని శక్తులు స్వేచ్చా, స్వాతంత్య్రాలపదజాలంతో సోషలిస్టు, పురోగామి శక్తులే కాదు, వాటితో సంబంధం లేని వారి అభిప్రాయాలపై కూడా దాడి చేస్తున్నారు. తుపాకి సంస్కృతికి గోరీ కట్టాలనేందుకు కమ్యూనిస్టులే కానవసరం లేదు. ప్రముఖ చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌ తాజా చిత్రం ”ద యంగ్‌ కారల్‌ మార్క్స్‌ ‘ (యువ కారల్‌ మార్క్స్‌) ఫిబ్రవరి 23న అమెరికాలో విడుదల అయింది. ఆ సందర్భంగా డెమోక్రసీ నౌ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో వెనె లాపిరే వాచాలత్వం గురించి రావుల్‌ పీక్‌ స్పందించారు. గతంలో ఆయన ‘ అయామ్‌ నాట్‌ యువర్‌ నీగ్రో, లుముంబా, డెత్‌ ఆఫ్‌ ఏ ఫ్రాఫెట్‌, హైతీ, ద సైలెన్స్‌ ఆఫ్‌ ద డాగ్స్‌, సమ్‌ టైమ్స్‌ ఇన్‌ ఏప్రిల్‌ ‘ వంటి చిత్రాలను నిర్మించాడు. ‘ నేను స్పందించాల్సి వుంటుందని అనుకోలేదు, ఒక విషయం చెబుతాను. అనేక మంది టీచర్లు, అనేక సంస్ధలు ఆయన చెబుతున్నట్లుగా కారల్‌ మార్క్స్‌ను బోధన ప్రణాళికలో చేర్చుతున్నట్లయితే వారు కొంతమేరకు మంచి చేస్తున్నట్లే భావించాలి. కారల్‌ మార్క్స్‌ అంటే ఎవరు, ఒక గొప్ప తత్వవేత్త, ఆర్ధికవేత్త, ఒక విధంగా చరిత్రగతినే మొత్తంగా మార్చటం గురించి, వర్గం, కార్మికవర్గం, బూర్జువాలు, పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి వంటి ఆయన చుట్టూ వున్న విషయాలు చర్చించటానికి వుపయోగపడుతుంది.

ఆయన ప్రస్తావిస్తున్న పుస్తకం కమ్యూనిస్టు మానిఫెస్టో మొదటి అధ్యాయాన్ని చదివితే ఇప్పుడు జరుగుతున్నదానిని ఎక్కువ తక్కువ లేకుండా వర్ణించటం కనిపిస్తుంది. లాభమే ధ్యేయం గల ఒక వ్యవస్ధగా ఆయన సంస్ద(ఎన్‌ఆర్‌ఏ) జాబితా మొదట్లో వుంటుంది. మీ జీవితంలో ఎప్పుడైతే లాభానిది పైచేయి అయిందంటే దాని అర్ధం తరుణ వయస్కుల్ని చంపటం, దానిని ఇంకా సమర్ధించుకోవటం వంటి అనంగీకృతమైన వాటిని అంగీకరించే స్ధితిలో మీరు వున్నట్లే. ఆ కమ్యూనిస్టు మానిఫెస్టోలో వున్నది అదే. యువతరం దానిని చదవటం ప్రారంభించి, దాని మీద చక్కటి చర్చ చేస్తే అది చాలా మంచిది.’ రావుల్‌ పీక్‌ చెప్పిన ఈ అంశం ఒక్క అమెరికా రైఫిల్‌ అసోసియేషన్‌కే కాదు, యావత్‌ ప్రపంచంలో లాభాలవేటలో వున్న ప్రతి వ్యవస్ధకూ,అన్ని జీవన రంగాలకూ ఇది వర్తిస్తుంది. యంగ్‌ కారల్‌ మార్క్సు అనే పీక్‌ సినిమాలో మార్క్స్‌ ఒక ఫౌండరీ యజమానితో చేసిన సంభాషణ దృశ్యం ఇలా సాగుతుంది.

కారల్‌ మార్క్స్‌ : ఎలా సాగుతోంది మీ పని ?

యజమాని: మిమ్మల్ని కలుసుకోవటం సంతోషంగా వుంది.

నేపధ్య వ్యాఖ్యాత :జునేలాకు ఫ్యాక్టరీలున్నాయి, పిల్లలతో సహా అనేక మందిని కార్మికులుగా నియమించాడు.

మార్క్స్‌ : మీ ఫ్యాక్టరీల్లో బాలకార్మికులున్నట్లున్నారు ?

యజమాని: మాకు వేరే గత్యంతరం లేదు, బాల కార్మికులు లేకపోతే మేం మార్కెట్లో అమ్ముకోలేము.

మార్క్స్‌ : మీ వంటి వారు లేకుండా దోపిడీ లేని ఒక సమాజం ఎక్కడ వుంటుంది, మీరు కూడా పని చేస్తున్నారు, ఇది దుర్భరంగా అనిపించటం లేదా ?

వ్యాఖ్యాత : వ్యవస్ధతో మనం పోరాడాలి, త్వరలో పాత వ్యవస్ధ కూలిపోతుంది.

మార్క్స్‌: రెండు రకాల మనుషులున్నారు. ఒకరు కష్టించి పని చేసే వారు, మరొకరు ఆ కష్టార్జిత ఫలం నుంచి లబ్ది పొందేవారు.

యజమాని : దీన్ని ఆపాల్సిందే, సహించకూడదు, మీరెంత అదృష్టవంతులో చూడండి, నేను మిమ్మల్ని తొలగించలేను.

మార్క్స్‌ : నేను పెద్ద మనుషులను ద్వేషిస్తాను, తృణీకరిస్తాను, కార్మికుల స్వేదంతో బజ్జలు పెంచే పందులు వారు.

యజమాని : మేము చెత్తబుట్టలోకి నెట్టదగిన వారమనేగా మీరు చెబుతోంది.

వ్యాఖ్యాత : ఆయన చెప్పింది విన్నారుగా దయచేయండి. వారు మనల్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారు మన బుర్రలను నిరోధించలేరు.

వ్యాఖ్యాత : కారల్‌ , ఫెడరిక్‌ ఎంగెల్స్‌ను పరిచయం చేసేందుకు నన్ను అనుమతించండి.

ఎంగెల్స్‌ : మీ రచనలను నేను చదివాను, నా వాటిని మీరు చదివారా ? మనకాలపు గొప్ప మేధావులలో మీరు ఒకరు !

వ్యాఖ్యాత : తిరుగుబాటుకు సంతోషం అవసరం !

మార్క్స్‌ : ప్రతిదీ మారుతుంది, ఏదీ శాశ్వతంగా వుండదు, పాత వ్యవస్ధను మనం తోసివేయాలి.

ఎంగెల్స్‌ : మేలుకోవాల్సిన సమయమిది !

మార్క్స్‌ : ఇప్పటి వరకు తత్వవేత్తలు ప్రపంచానికి భాష్యం చెప్పారు. కానీ దాన్ని మార్చాల్సి వుంది.

వ్యాఖ్యాత : బూర్జువాలు, కార్మికులు సోదరులా ?

కార్మికులు : కాదు !

ఎంగెల్స్‌ : కాదు, వారు సోదరులు కాదు, శత్రువులు !

Image result for the young karl marx

తన సినిమా బాక్సాఫీసు వద్ద ఆర్ధికంగా విజయం సాధించటం కంటే ప్రపంచంలో నేడు పెరిగిపోతున్న మితవాద, పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా వున్న రకరకాల వామపక్ష, పురోగామిశక్తుల సమీకరణ కేంద్రంగా తన సినిమా పనిచేస్తే అది పెద్ద విజయమని పీక్‌ భావిస్తున్నారు. ప్రముఖ పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ తన చిత్రం పట్ల ఫ్రాన్స్‌లో వెల్లడైన స్పందనను వివరిస్తూ రాజకీయ విబేదాలతో ఏకీభావం లేని పార్టీల వారందరినీ తన చిత్రం ఒక దగ్గరకు చేర్చిందని, ఇతివృత్తం గురించి చర్చలకు దోహదం చేసిందన్నారు. మార్క్స్‌ పిడివాది కాదు, మీవర్తమాన, చారిత్రక పరిస్ధితులను పున:సమీక్షించుకోవాలని మార్క్స్‌ ఎల్లవేళలా చెప్పేవారని అన్నారు. ‘ నా జీవిత పాఠం, రాజకీయాల అనుభవం కారణంగా ఒక వ్యక్తి ఏ ఒక్కరినీ రక్షించలేరని నేను నమ్ముతాను. అలాంటివి ఎన్నికలలో ప్రజాకర్షణకు బాగుంటాయని మనం చూడవచ్చు, దీని నుంచి బయటపడి నూతన వుమ్మడి సమూహాలను నిర్మించాలి. మీకు ఓటు వేయాలని కొంత మందిని మీరు బలవంతం చేయలేరు. వారిని ఒప్పించాలి. అది చర్చల ద్వారా మీరు చెబుతున్నదానిని రుజువు చేసుకోవాలి. కనుక అది దీర్ఘమైన బాట, దీనిలో రహస్యమేమీ లేదు. ఈ రోజు మనకు అపురూప వ్యక్తి మన ముందు ప్రత్యక్షమైన మనలను వెలుగులోకి తీసుకుపోవాలని వూహించుకోవచ్చు, కానీ అలాంటిదెన్నడూ జరగలేదు, అదొక క్రమం. నేడు సమాజాన్ని అవగాహన చేసుకోవాలనుకొనే వారందరికీ మార్క్స్‌, ఎంగెల్స్‌ వారి సమయంలో అందించిన పరికరాలు – దీర్ఘకాల చరిత్ర అందించిన సూచనలు- ఇప్పటికీ లభ్య మౌతున్నాయి. సినిమా ఒక హీరో కేంద్రంగా నడిచేది కాదు. భావవిప్లవం, సామాజికమార్పు కోసం నూతన రాజకీయ సంఘటనల నిర్మాణం, సుదీర్ఘచర్చలు, ఒక యంత్రాంగ నిర్మాణం, అంతర్గత విభేదాలు, పిలుపులతో కూడిన ఒక వాస్తవం ఆధారంగా సాగింది ‘ అన్నారు.

‘ మెరిసిన జుట్టు పెరిగిన గడ్డం వుండే వృద్ధుడైన రాజకీయవేత్తగా కాదు, ఒక అసాధారణ తత్వవేత్తగా చూపించినప్పటికీ ఒక యువకుడిగా, అప్పులతో ఇబ్బందులు పడిన మార్క్స్‌ను, వుద్యమం నుంచి వుద్భవించిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఎలా వచ్చిందో ఈ చిత్రంలో చూస్తారు. కేటుంబం, ముఖ్యంగా భార్యజెన్నీ, స్నేహితుల మధ్య మార్క్స్‌ ఎలా పెరిగారో చూపటం దీనిలో నా తొలి అంశం. మేం ధనికులం, మేం మధ్యతరగతి లేదా పారిశ్రామిక కుటుంబాలకు చెందినవారం అయినప్పటికీ మా చుట్టూ జరుగుతున్నదానిని మేం అంగీకరించం అని చెప్పిన ముగ్గురు యువకుల జీవితాలను యువతరం చూడాలని కోరుకున్నాను. మానవులుగా వారికి నేనెంతో సన్నిహితం, వారు కేవలం పోరాటం మాత్రమే చేయలేదు, వాటితోనే జీవించారు. తమకు ప్రమాదకరమైన నిర్ణయాలను వారు తీసుకున్నారు, సర్వం కోల్పోయారు. వారు పేదలయ్యారు అయినప్పటికీ వారిది పెద్ద జీవితం, మేథావులుగా తయారయ్యారు.యువకులుగా స్పందించారు, ప్రతిదీ మార్చదగినదిగానే వారికి కనిపించింది. పశ్చిమ దేశాలలో మార్క్సు గురించి మరో చిత్రం లేకపోవటం ఈ చిత్ర నిర్మాణానికి ఒక కారణం.’ అన్నారు పీక్‌.

మార్క్స్‌పై చిత్ర నిర్మాణానికి పీక్‌ పది సంవత్సరాలు పని చేశారు. డబ్బు సమస్యలెదురయ్యాయి.ౖ ‘ నేను మూలాల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను.కమ్యూనిస్టు మానిఫెస్టో వంటి ఒక ముఖ్యమైన పుస్తకం మీరు చదివినపుడు అది సులభమార్గంలో వారి పోరాటాలు, జీవితాలను అర్ధం చేసుకొనేందుకు కార్మికుల కోసం రాసిన ఒక పుస్తకం అని అర్ధం అవుతుంది. దానిలో తొలి అధ్యాయం చదివితే గత మూడుదశాబ్దాలలో జరిగినదానిని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తుంది. పెట్టుబడిదారీవిధాన విస్తరణ, వూహాకల్పన(స్పెక్యులేషన్‌) మీద సంపూర్ణ వెర్రి, మొత్తం భూగోళంపై దాని దాడి. సరిగ్గా అదే జరిగింది, కనుక మన చరిత్రను తెలుసుకోవటం ఎంతో ముఖ్యమైంది. లేనట్లయితే మీకు స్వర్గాన్ని చూపించే తదుపరి ప్రజాకర్షకకులను అనుసరించే ఒక కీలుబమ్మ అవుతావు.’ అని రావుల్‌ పీక్‌ చెప్పారు.

ఈ చిత్రం న్యూయార్క్‌, లాస్‌ ఏంజల్స్‌ నగరాలలో ఫిబ్రవరి 23న విడుదల అయింది. రెండు గంటల నిడివి వున్న ఈ చిత్రాన్ని జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియంలలో చిత్రీకరించారు. కారల్‌ మార్క్స్‌గా అగస్ట్‌ డిహెల్‌, ఎంగెల్స్‌గా స్టెఫాన్‌ కోనార్సకె, జెన్నీగా వికీ క్రిప్స్‌ నటించారు. మార్క్స్‌-ఎంగెల్స్‌ తమ కాలంలో ప్రబలంగా వున్న పలు రాజకీయ, తాత్విక ఆలోచనా ధోరణుల నుంచి శాస్త్రీయ సోషలిజాన్ని ఎలా వేరు పరచారన్నదే ప్రధానాంశంగా ఈ చిత్రంలో వున్నదని కొన్ని సమీక్షలలో పేర్కొన్నారు. చిత్ర దర్శక నిర్మాత రావుల్‌ పీక్‌ బెర్లిన్‌ విశ్వవిద్యాలయంలో నాలుగు సంవత్సరాల అధ్యయనంలో దాస్‌ కాపిటల్‌ ఒక భాగంగా అభ్యసించారు.

ప్రపంచ గతినే మలుపు తిప్పిన కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి ప్రచురణకు 170 ఏండ్లు. ఈగ్రంధ ముద్రణ 1848 ఫిబ్రవరి చివరి వారంలో లండన్‌లోని ఒక అజ్ఞాత ప్రాంతంలో జరిగింది. వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ పేరుతో దానిని ప్రచురించారు. తొలుత దానికి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక అని పేరు పెట్టారు. 2008 ఆర్ధిక సంక్షోభం తరువాత ఈ గ్రంధ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. బ్రిటన్‌లో వాటర్‌ స్టోన్స్‌ అనే విక్రేత 2015 ఫిబ్రవరిలో వారం రోజుల్లోనే 30వేల కాపీలు విక్రయించారు. ప్రత్యేకించి పెట్టుబడిదారీ సంక్షోభం నెలకొని వున్న ప్రస్తుత సమయంలో మార్క్సిజం పట్ల ఆసక్తి తిరిగి రేకెత్తించటానికి, పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించేందుకు ప్రత్యేకించి యువకులకు అది తోడ్పడుతుందని 2012లో బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ పేర్కొన్నది.’మనకు తెలిసిన పెట్టుబడిదారీ వ్యవస్ధ జవాబుదారీతనం లేని పెద్ద ప్రపంచవ్యాపిత బ్యాంకులు, కార్పొరేషన్ల ఆధిపత్యంలో వుంది. అది నాలుగు రోడ్ల కూడలిలో వుంది, దాన్ని సంస్కరించి, నవీకరించాల్సి వుంది’ అని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం చితికిపోయింది, దానిని తక్షణమే సంస్కరించటం అవసరం, ఎందుకంటే తలిదండ్రుల కంటే వారి పిల్లలను దుర్భరస్ధితిలో వదలి వేస్తున్నదని టెలిగ్రాఫ్‌ పత్రిక గతేడాది సెప్టెంబరు 5న పేర్కొన్నది.

అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో జనం సోషలిజానికి అనుకూలంగా మాట్లాడేందుకు వీలుగా అక్కడి పరిస్ధితి వుంది. 2016లో యు గవ్‌ అనే సంస్ధ జరిపిన సర్వేలో 32శాతం బ్రిటీషర్లు సోషలిజాన్ని వ్యతిరేకించగా 36శాతం మంది అనుకూలం అని తేలింది. నూతన సహస్రాబ్దిలో పుట్టిన వారిలో 40శాతం అమెరికన్లు సోషలిజానికి అనుకూలంగా వున్నట్లు గతేడాది నవంబరులో జరిగిన సర్వేలో వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే 83శాతం మంది బ్రిటీషర్లు నీటి సరఫరా సంస్దల ప్రయివేటీకరణ బదులు ప్రభుత్వ ఆధీనంలోనే వుండాలని, విద్యుత్‌, గ్యాస్‌ కంపెనీలను తిరిగి జాతీయం చేయాలని 77శాతం, రైల్వేలను తిరిగి ప్రభుత్వఆధీనంలోకి తీసుకోవాలని 76శాతం కోరుతున్నారు. 170 ఏండ్ల నాటి కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి చిత్తు ప్రతితో పాటు, మార్క్స్‌, ఎంగెల్స్‌ల చేతిరాత ప్రతులు అనేక నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ హిస్టరీ(ఐఐఎస్‌హెచ్‌)లో వున్నాయి.’ 1990 దశకంలో మార్క్స్‌ ఇంకేమాత్రం పనికిరాడు అని కొంత మంది చెప్పారు. అమెరికా, ఐరోపాలలో తరువాత సంభవించిన అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం,స్పెక్యులేషన్‌, బుడగలు పేలిపోయిన తరువాత జనాలు ఆకస్మికంగా ఇది గతంలో ఒకసారి జరిగింది, దాన్ని పరిశోధించారు, మరోసారి మార్క్సును చదివితే ఏమౌతుంది, అది ఇప్పటికీ పనికొస్తుందా, అవును ఇది పనికొచ్చేట్లే కనిపిస్తోంది అనే ఆలోచనలో పడ్డారని’ సంస్ద అధిపతి మారియన్‌ వాన్‌డెర్‌ హెజ్డన్‌ వ్యాఖ్యానించారు.

సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎన్ని విధాలుగా కుత్సిత వ్యాఖ్యానాలు చేసినా వాస్తవాన్ని కాదనలేరు. కమ్యూనిస్టు మానిఫెస్టోను రాసిన నాటికీ నేటికీ ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చిన మాట వాస్తవం. దోపిడీ తీవ్రత, ఆర్ధిక అసమానతల్లో ఎలాంటి మార్పు లేదు. దోపిడీ కొనసాగుతూనే వుంది. అందువలన దానిని అంతం చేయాలని కోరిన కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే మరొక మెరుగైన సిద్ధాంతం, కార్మికవర్గ అస్త్రం మరొకటి కనిపించటం లేదు. లేదు ఎవరైనా అంతకంటే త్వరగా దోపిడీని అంతం చేసే భావజాలం,అస్త్రాలను కార్మికవర్గానికి అందచేస్తే అంతకంటే కావాల్సింది లేదు. అవి లేకుండా అందుబాటులో వున్న ఆయుధాలు పనికి రావు అని చెప్పటం అంటే కార్మికవర్గాన్ని నిరాయుధం చేసే మోసపు ఎత్తుగడతప్ప మరొకటి కాదు !