పుతిన్‌ అధ్యక్ష ఎన్నిక ఓ ప్రహసనం!

Tags

,

ఎం.కోటేశ్వరరావు

         బద్దకంగా కలలు కనేవారికి నియంతృత్వం కూడా ఒక పాలనా విధానం మాదిరే కనిపించి మాయ చేస్తుంది. వారికి మరొక ప్రత్యామ్నాయం కనిపించదు. ఇది ఆదివారం నాడు జరిగిన రష్యన్‌ ఎన్నికల్లో మరోమారు ఎన్నికైన వ్లాదిమిర్‌ పుతిన్‌ విజయం గురించి ఒక వ్యాఖ్యాత చేసిన వర్ణన వాస్తవానికి ఎంతో దగ్గరగా వుంది. అసలు ఎన్నికలే జరపని నియంతలు కొందరైతే ప్రత్యర్థులకు అవకాశాలు లేకుండా చేసి అప్రజాస్వామికంగా యంత్రాంగాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మలచుకొనే తరగతికి చెందిన వ్యక్తి పుతిన్‌. అందుకే అతగాడు తప్ప మరొకరు విజయం సాధించలేరని, ఎన్నిక లాంఛనప్రాయమే అని పరిశీలకులు ముందుగా వూహించినట్టుగానే ఫలితాలూ వచ్చాయి. ఎన్నికల్లో అవినీతి, అక్రమాల ఆరోపణల మధ్య పుతిన్‌కు 77, కమ్యూనిస్టుపార్టీ బలపరిచిన అభ్యర్థి గ్రడనిన్‌కు 12, మితవాది జిరినోవస్కీకి 5.65శాతం ఓట్లు వచ్చాయి. మరో ఆరేండ్లు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ కొనసాగేందుకు వీలు కల్పించిన ఏకపక్ష ఎన్నికల గురించి నిజానికి ఎవరికీ పెద్ద భ్రమలు లేవు. సోవియట్‌ విచ్ఛిన్నంతో మిగిలిపోయే రష్యా గురించి సామ్రాజ్యవాదులు వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. గత రెండు ప్రపంచ యుద్ధాల్లో ఏదో ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోయి అది బలహీనపడటం చరిత్ర. ఉదాహరణ టర్కీ, బ్రిటన్‌, జపాన్‌, అయితే ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియట్‌ యూనియన్ను కూల్చేసిన తరువాత ప్రపంచ రాజకీయ రంగంలో తమకు పోటీదారుగా రష్యా ముందుకు రావటాన్ని సామ్రాజ్యవాదులు వూహించి వుంటే పరిణామాలు మరోవిధంగా వుండేవి. పుతిన్‌ హయాంలో రష్యా ప్రపంచ అగ్రరాజ్యంగా ముందుకు వచ్చింది. తన సత్తా నిరూపించేందుకు నాటో కూటమిని సవాలు చేస్తూ తన పక్కలో బల్లెంగా మారకుండా చూసుకొనేందుకు ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించుకుంది. సిరియాలో అసద్‌ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి సామ్రాజ్యవాదుల వెన్నుదన్నుగా వున్న శక్తులను దెబ్బతీయటంలో రష్యా పాత్ర బహిరంగం. ఇదే సమయంలో మొత్తం మీద చూసినప్పుడు సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్థలను కూల్చేసిన సామ్రాజ్యవాద, ధనిక పెట్టుబడి దారీ దేశాలన్నీ తరతమ తేడాలతో అభివృద్ధి గిడసబారటం లేదా తగ్గటం వంటి సంక్షోభాలకు గురయ్యాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.