Tags

, ,

ఎం కోటేశ్వరరావు

తమ విలువైన సంపదలు పశ్చిమ దేశాల కార్పొరేట్‌ సంస్ధల పాలవుతున్నా గుడ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ముస్లిం దేశాల పౌరులున్నారు. మరోవైపు అదే సంస్ధల ఆధీనంలో వున్న మీడియా పని గట్టుకొని చేస్తున్న ప్రచారం, జరుగుతున్న కొన్ని వుదంతాల వలన మానసికంగా గాయపడిన, అవమానభారాలకు, గందరగోళానికి, ఆత్మన్యూనతకు గురి అవుతున్నారు. అలాంటి వారు వూరట పొందేందుకు, వాస్తవాలను అర్ధం చేసుకొనేందుకు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పిన అంశాలు నిస్సందేహంగా తోడ్పడతాయి. అత్యధిక ముస్లిం దేశాలలో పశ్చిమ దేశాలు, వారి ప్రయోజనాలతో ముడిపడి వున్న శక్తులతో సంబంధాలున్న నిరంకుశశక్తులు అధికారంలో వున్నాయి. వారు మిలిటరీ లేదా అవినీతి అక్రమాలకు నిలయంగా వున్నారు. అందువలన తమకు అవసరమైనది తప్ప ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ ఆయా దేశాల జనానికి తెలియకుండా నియంత్రిస్తున్నారు. వారికి అందుబాటులో వున్నదంతా పశ్చిమ దేశాల కృత్రిమ తయారీ సమాచారమే. ఒక అంచనా ప్రకారం గత అర్ధశాతాబ్దంలో దాదాపు కోటి మంది సామాన్య ముస్లింలు పశ్చిమ దేశాల కుట్రలకు బలై ప్రాణాలర్పించారని అంచనా. ఇందుకు కారకులైన దుర్మార్గాలను మరుగుపరచి ముస్లింలందరూ వుగ్రవాదులు గాకపోయినా వుగ్రవాదులందరూ ముస్లింలే అనే పేరుతో అందరినీ అవమానాలకు గురి చేస్తున్నారు. ఇదంతా పశ్చిమ దేశాలు, వాటితో చేతులు కలిపిన తమ దేశాల పాలకవర్గాల పుణ్యమే అని గ్రహించలేని వారెందరో. అలాంటి వారిలో కొందరికైనా సౌదీ పాలకుడు అధికారికంగా అంగీకరించిన అంశం వుపకరిస్తుంది.

ఇస్లామిక్‌ దేశాలలో మతోన్మాదశక్తులు పెరగటానికి అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదశక్తులే కారణం అన్నది ఎప్పటి నుంచో తెలిసిన బహిరంగ రహస్యం. 1960వ దశకంలో ఇండోనేషియాలో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, సోవియట్‌ సేనలపై దాడులకు ముజాహిదీన్‌ లేదా తాలిబాన్ల పేరుతో వున్న మతశక్తులకు ఆయుధాలిచ్చాయి. ఇప్పుడు సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల కిరాయి మూకలుగా వాటిని వుపయోగిస్తున్నారు. ముస్లిం దేశాలు సోవియట్‌ ప్రభావంలో పడకుండా వుండేందుకు గాను పశ్చిమ దేశాల సలహా మేరకు వహాబియిజాన్ని వ్యాప్తి చేసేందుకు తాము పెద్ద మొత్తంలో నిధులు అంద చేస్తున్నట్లు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వెల్లడించారు. గతనెల మూడవ వారంలో అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌ పోస్టు పత్రిక జర్నలిస్టుల ఇష్టాగోష్టి సమావేశంలో పాల్గని అనేక విషయాలు చెప్పారు. ప్రచ్చన్న యుద్ద(కమ్యూనిజంపై సామ్రాజ్యవాదుల దాడికి పెట్టిన పేరు) సమయంలో సోవియట్‌ ప్రభావం (అంటే కమ్యూనిస్టు వుద్యమ) పెరగకుండా చూసేందుకు పశ్చిమ దేశాల సలహా సౌదీ అరేబియా వ్యవహరించిన తీరును వివరించారు. ఇష్టాగోష్టిగా చెప్పినప్పటికీ తరువాత కొన్ని విషయాలను ప్రచురించి, ప్రసారం చేయటానికి సౌదీ రాయబారకార్యాలయం వాషింగ్టన్‌ పోస్టు పత్రికకు అనుమతిచ్చింది.ఆ విధంగా పై వివరాలు బయటకు వచ్చాయి.

ఇస్లామిక్‌ దేశాలలో సోవియట్‌ ప్రభావం విస్తరించకుండా చూసేందుకు ఆ దేశాలలో సున్నీ తెగ ముస్లింల మసీదుల నిర్మాణం, మదార్సాల ఏర్పాటుకు నిధులివ్వాలని ప్రచ్చన్న యుద్ధ కాలంలో తమ దేశాన్ని పశ్చిమ దేశాలు కోరాయని, మధ్యలో కొన్ని సౌదీ ప్రభుత్వాలకు వాటితో సంబంధాలు తెగిపోయినప్పటికీ ఇప్పుడు తిరిగి పునరుద్ధరించుకున్నామని, వాటికి నిధులు ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రధానంగా సౌదీలోని ధార్మిక సంస్ధల ద్వారా అంద చేస్తున్నట్లు యువరాజు వెల్లడించారు. తరువాత కొద్ది రోజుల తరువాత అట్లాంటిక్స్‌ పత్రిక సంపాదకుడితో మాట్లాడుతూ వహాబియిస్టులకు నిధులు ఇస్తున్న మాట వాస్తవమేనని అయితే వహాబియిజం అంటే నిర్వచనం ఏమిటో తనకు తెలియదని వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. ఇస్లామ్‌ను సంస్కరించే పేరుతో 1703-1791 మధ్య సౌదీ ప్రాంతంలో నివశించిన మహమ్మద్‌బిన్‌ అబ్దల్‌ వహాబ్‌ అనే ఇస్లామిక్‌ పండితుడు సున్నీ ముస్లింలు కఠోరనైతికతా వాదంతో ఎలా వుండాలో ప్రవచించిన దానినే వహాబియిజమ్‌ అని వ్యవహరిస్తున్నారు. దానికి పలు వ్యాఖ్యానాలున్నాయి. అయితే ఇప్పుడు తాలిబాన్లు, ఆల్‌ఖైదా, ఐఎస్‌, బోకో హారం పేరుతో వ్యవహరిస్తున్న మత వుగ్రవాద సంస్ధలన్నీ తాము వహాబియిజాన్నే అనుసరిస్తున్నామని, అలాంటి ముస్లిం సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతూ జనం మీద అనేక ఆంక్షలు విధిస్తున్నాయి, అమలు జరపనివారి మీద దాడులు చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమ దేశాలతో చేతులు కలపని ముస్లిందేశాల పాలకులందరిని మత ద్రోహులుగా ముద్రవేసి పవిత్రపోరాటం పేరుతో అమెరికా తదితర దేశాలు ఇచ్చిన ఆయుధాలు, డబ్బుతో కిరాయిదాడులకు పాల్పడుతున్నాయి.

జనంలో తంపులు పెట్టటం, తిరోగమన శక్తులను పెంచి పోషించటంలో అందెవేసిన బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు వహాబియిజాన్ని సాధనంగా చేసుకొని తమ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు. తరువాత అమెరికా పెద్దన్న పాత్ర తీసుకొని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. దీనిలో భాగంగానే బిన్‌ లాడెన్‌ వంటి దుష్టశక్తులను పెంచి పెద్ద చేశారు. ఆల్‌ఖైదా తీవ్రవాదులు 2001సెప్టెంబరు 11న న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసినప్పటికీ అమెరికన్లు ఈ మత వుగ్రవాదులకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. దానికి తన ప్రయోజనాలు తప్ప తాను పెంచిన వుగ్రవాదులు తన దేశపౌరులపై దాడులు చేసినప్పటికీ దానికేమీ చీమకుట్టినట్లు లేదని తరువాత పరిణామాలు స్పష్టం చేశాయి. సౌదీలోని పాలకులకు ఈ శక్తులు వెన్నుదన్నుగా వున్నాయి. ఆఫ్రికాలోని ఎమెన్‌ ప్రాంతం మిలిటరీ వ్యూహరీత్యా ఎంతో కీలకంగా వుండటంతో అక్కడ తిష్టవేసేందుకు అమెరికా గత యాభై సంవత్సరాలుగా చేయని దుర్మార్గం లేదు. ఆ కుట్రలు ఫలించకపోవటంతో సౌదీ అరేబియాను ముందు పెట్టి దాని నాయకత్వంలో గత కొద్ది సంవత్సరాలుగా ఎమెన్‌పై దాడులు చేయిస్తున్నారు. కొన్ని లక్షల మందిని చంపివేసినా, కరవు కాటకాలకు, కలరా వంటి వ్యాధులకు గురిచేసినా, లక్షల మందిని దేశం నుంచి తరిమివేసినా దాన్ని స్వాధీనం చేసుకోవటం సాధ్యం కావటం లేదు. అక్కడి సామ్రాజ్యవాద వ్యతిరేకశక్తులు మొక్కవోని ధైర్యంతో ప్రతిఘటిస్తున్నాయి. సౌదీ అరేబియన్‌ పౌరుల రక్షణకు మాత్రమే తాము అక్కడ జోక్యం చేసుకుంటున్నామని సల్మాన్‌ సమర్ధించుకున్నారు.

సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా మతోన్మాద, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల వలలో పడిన ముస్లిం యువతలో, యావత్‌ ఇస్లామిక్‌ దేశాలలో పురోగామి ఆలోచనలు రేకెత్తించటానికి, సామ్రాజ్యవాదుల కుట్రల పట్ల మరింత అప్రమత్తం కావటానికి సౌదీ యువరాజు వెల్లడించిన అంశాలు తోడ్పడతాయి. కమ్యూనిస్టు వుద్యమం విస్తరించకుండా చూసేందుకు సామ్రాజ్యవాదులు అనుసరించిన వ్యూహంలో ఎన్నో అంశాలున్నాయి. అరబ్‌ సోషలిజం పేరుతో సంస్కరణవాదశక్తులను ప్రోత్సహించారు. దానికి పెద్ద వుదాహరణ బాత్‌ పార్టీ సోషలిజం పేరుతో సద్ధాం హుసేన్‌ రంగంలోకి రావటానికి, సమర్ధించటంలో అమెరికా తోడ్పడింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆ సద్దాంనే ప్రయోగించి యుద్దం చేయించిన వుదంతం మన కళ్ల ముందే వున్నది. అమెరికా కుట్రలను ఎరిగిన సోవియట్‌ యూనియన్‌ అనేక అరబ్బు దేశాలలో సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులకు మద్దతిచ్చి నిలబెట్టింది. అలాంటి వారిలో గడాఫీ ఒకరు. ఇదే సమయంలో సౌదీ అరేబియా వంటి దేశాల పాలకులతో చేతులు కలిపి తాలిబాన్లు,ఆల్‌ఖైదా వంటి ఛాందస వుగ్రవాదుల తయారీని చూశాము. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత తనను వ్యతిరేకించే అరబ్బు జాతీయశక్తులను దెబ్బతీసేందుకు అమెరికా పావులు కదిపింది. ఇరాక్‌ , లిబియాలో జరిగింది అదే. ఇరాన్‌లో విఫలయత్నం చేసింది. సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల పాలకులను మార్చేందుకు ఇప్పటికీ దాడులు కొనసాగిస్తున్నది. తమ చేతికి మట్టి అంటకుండా ఇస్లామ్‌ పునీకరించేపేరుతో మతఛాందసాన్ని మెదళ్లకు ఎక్కించటం, ప్రపంచాధిపత్యంలో భాగంగా అపార చమురు, ఇతర సహజ సంపదలున్న ప్రాంతాలపై ఆధిపత్యం, మిలిటరీ రీత్యా కీలక ప్రాంతాలను తమ చేతుల్లో వుంచుకొనేందకే ఇదంతా చేస్తున్నారు.

సామ్రాజ్యవాదులు కేవలం ఇస్లామిక్‌ సమాజాలు, ఇస్లామిక్‌ దేశాల మీదే కేంద్రీకరించాయనుకుంటే పొరపాటు. అది మతం, ప్రాంతీయం, భాష, వేర్పాటు వాదం ఏదైనా కావచ్చు. వాటి వెనుక సామ్రాజ్యవాదుల హస్తం వుంటుంది. మన దేశంలో హిందూ తాలిబాన్లు,గతంలో పంజాబ్‌ తీవ్రవాదులు, ఇప్పుడు కాశ్మీరులో తీవ్రవాదులు, ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ వుగ్రవాదులు, ఐరోపా దేశాలలో నయా నాజీ బృందాల వెనుక పశ్చిమ దేశాల హస్తం, డబ్బు లేకుండా ఇంతగా రెచ్చిపోవటం సాధ్యం కాదు. తాము తయారు చేసిన వుగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ కొన్ని చోట్ల తమ అదుపు తప్పటంతో లేదా తమ వ్యతిరేకులైన ఇరాన్‌ ప్రభావంలోకి పోవటం వంటి పరిణామాలతో అవే పశ్చిమ దేశాలు ఒక ఎత్తుగడగా వుగ్రవాద వ్యతిరేక ఫోజుపెడుతున్నాయి. తమతో సంబంధాలలో వున్న వారితో సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల కిరాయి మూకలుగా వుపయోగించుకుంటున్నాయి. నిజానికి వంద సంవత్సరాల క్రితం ముస్లిం తీవ్రవాదం గురించి ప్రపంచానికి తెలియదు, అటువంటి వుగ్రవాద చర్యలు కూడా లేవు. ముస్లిం సమాజం వుగ్రవాదానికి లోనై వుంటే పశ్చిమాసియాలో వారి మెజారిటీగా వున్న ప్రాంతాలకు ప్రపంచంలో వున్న యూదులందరినీ సమీకరించి కొన్ని ప్రాంతాల రూపురేఖలను మార్చివేస్తుంటే సహించి వుండేవారా ? తమ ప్రాంతాల నుంచి తమను వెళ్లగొట్టటం ప్రారంభమైన తరువాతే పాలస్తీనియన్లు ఆయుధాలు పట్టారు తప్ప అంతకు ముందు ఎంతో సౌమ్యంగా వున్న సమాజాలవి. నిజానికి ఇస్లాం ఒక మతమే కాదు, ఒక సంస్కృతి కూడా. ప్రతి సంస్కృతిలో కొన్ని మినహాయింపులున్నట్లే దానికి భిన్నంగా ప్రవర్తించేవారు ఆ సమాజంలో వుండట ఆశ్చర్యమేమీ కాదు.