చట్టాలను నీరు గార్చేందుకే దుర్వినియోగ ఆరోపణ
ఎం కోటేశ్వరరావు
చట్టాల వినియోగం, దుర్వినియోగం గురించి దేశంలో ఇప్పుడు సమాజంలోని కులీన, అట్టడుగు తరగతుల్లో ఒకే అంశంపై చర్చ మొదలైంది. చిత్రం ఏమిటంటే యావత్ దేశానికి చట్టాలు చేసే పార్లమెంట్ వుభయ సభలను గత ఇరవై ఐదు రోజులుగా దుర్వినియోగం చేయటాన్ని స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా యావత్ జాతి గమనించింది. పార్లమెంట్ సరిగా నడవని అన్ని రోజులకు ఎన్‌డిఏ ఎంపీలు తమ వేతనాలు, అలవెన్సులను వదులుకుంటారని బుధవారం రాత్రి పార్లమెంటరీ వ్యవహారాల కేేంద్ర మంత్రి అనంతకుమార్ ప్రకటించారు. సభను నడిపించాల్సిన అధికారపక్షం అవిశ్వాస తీర్మానాల ప్రహసనంలో అంటించుకున్న గబ్బును కాస్తయినా తగ్గించుకొనేందుకు తాము పెద్ద జవాబుదారీ అంశకు చెందిన వారమని ఫోజు పెట్టేందుకు, సమస్యను పక్కదారి పట్టించేందుకు వేసిన అతి తెలివి ఎత్తుగడ ఇది. సభను నడపాల్సిన వారు సరిగా నడపకపోతే నేనెందుకు వదులుకోవాలి అని బిజెపి సభ్యుడు సుబ్రమణ్యస్వామి గడ్డిపెట్టారనకోండి.
సమాజంలో ఏమాత్రం రక్షణ లేని దళితులు, గిరిజనులు తమ రక్షణ చట్టాన్ని దుర్వినియోగం చేశారని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు నివేదించింది, దాని ఆదారంగానే అది ఆ చట్టంలో మార్పులు చేయాలని కోర్టు ఆదేశించింది.తాము అలవెన్సులు, వేతనా వదులుకుంటామని చెప్పటం అంటే పార్లమెంట్‌ను దుర్వినియోగం చేసినట్లు అంగీకరించటమే. దానికి పరిహారంగా ఆర్ధిక ప్రయోజనాన్ని వదులుకుంటామంటే సరిపోతుందా ? అదంత స్వల్ప దుర్వినియోగమా ? ఈ విషయాన్ని ప్రజాకోర్టు తప్ప మరే కోర్టూ విచారించే అవకాశం లేదు. అటువంటి అవకాశాలే వుంటే అవిశ్వాస తీర్మానంపై నాటకం ఇంత రంజుగా నడిచేది కాదు. అందువలన అన్ని రకాల దుర్వినియోగాలు, వాటికి బాధ్యుల గురించి దేశం తీవ్రంగా చర్చించాల్సిందే.
మహిళలకు రక్షణ కల్పించే శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్, ఎస్‌సి, ఎస్‌టిలపై దాడుల నిరోధక చట్టం రెండింటినీ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నప్పటికీ రెండవ అంశం ప్రస్తుతం అనూహ్యంగా ముందుకు వచ్చింది. సాధారణంగా ఇలాంటి పరిస్ధితులు అరుదుగా వస్తుంటాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఒక చట్టాన్ని వినియోగించకుండా నీరుగారుస్తున్నారని జనాభాలో ఒక పెద్ద సమూహం, దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆ సమూహంపై తరతరాలుగా దాడులు చేసేవారు లేదా చేయటాన్ని పరోక్షంగా అయినా సమర్ధించేవారు పరిమితంగానే అయినా వీధుల్లోకి సైతం వచ్చిన వుదంతం ఏప్రిల్ రెండవ తేదీన జరిగింది. అనేక అంశాలపై సమ్మెలు, బందులు జరగటం సర్వసాధారణం. తమ రక్షణకు తెచ్చిన చట్టాన్ని నీరు గార్చటానికి లేదా ఎత్తివేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రక్షణ కోసం దళితులు, గిరిజనులు దేశ వ్యాపిత బంద్‌కు పిలుపు ఇచ్చిన వుదంతం ఎన్నడూ జరగలేదు. అది జయప్రదమైందా, విఫలమా, పాక్షికమా అన్న విషయాన్ని పక్కనపెడదాం. మూడు రాష్ట్రాలలో హింసాత్మకంగా మారి పదకొండు మంది వరకు మరణించటాన్ని బట్టి దాని తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఈ బంద్ ఒక చైతన్యానికి, పోరాటపటిమకు నిదర్శనం.
ఎప్పుడూ అనేక అంశాలపై చర్చ జరుగుతూనే వుంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. దళితుల, గిరిజనుల రక్షణ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో దేశంలో వివిధ చట్టాల వినియోగం, దుర్వినియోగం గురించిన చర్చ ముందు పీఠీకి వచ్చింది. తిరోగమన వాదులకు సంకటమైన ఈ చర్చను పురోగమనవాదులు మరింతగా ముందుకు తీసుకుపోవాల్సిన తరుణమిది. ఒక కుక్కను చంపాలనుకుంటే పిచ్చిదని ప్రచారం చేయాలన్నది పాత సామెత. ఒక అవాస్తవాన్ని నిజం చేయాలంటే వందసార్లు చెప్పాలని ఫాసిస్టు గోబెల్స్ పాలకవర్గాలకు సరికొత్త ఆయుధాన్ని అందించాడు. తమకు కంటగింపుగా వున్న చట్టాలను నీరుగార్చి, పసలేని వాటిగా చేయాలన్నా, తొలగించాలన్నా అవాస్తవాలతో పాటు వాటిని దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలన్నది నేటి పాలకవర్గాల నీతి. కేంద్రంలో అధికారంలో వున్న పాలకపక్షం బహుశా మొదటిసారిగా తాను అమలు జరుపుతున్న ఒక చట్టాన్ని అందునా సమాజంలో సమాజంలో అట్టడుగున వున్నవారు దుర్వినియోగం చేస్తున్నారని దేశ అత్యున్నత న్యాయ స్ధానానికి నివేదించటం, దానిని ప్రాతిపదికగా తీసుకొని అవును నిజమే అని తీర్పు చెప్పటం నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి సాధించిన ‘ఒక ఘనత’.
భూస్వామ్య శక్తులతో రాజీపడి ఆ వ్యవస్ధను కొనసాగిస్తూనే తమ ప్రయోజనాలకు పెద్ద పీటవేసుకొనే బడా పెట్టుబడిదారుల నాయకత్వంలో నడుస్తున్నది మన దేశం. కాంగ్రెస్, ఇతర పార్టీలలో కూడా ఈశక్తులకు ప్రాతినిధ్యం వహించేవారు వున్నప్పటికీ అత్యధికంగా మాజీ రాజులు,రాణులు, జమిందార్లు,దేశముఖులు, భూస్వాములు అదే సమయంలో బడాపెట్టుబడిదారులను కుడి ఎడమల ఢాల్ కత్తుల మాదిరి కలిగి వున్న ఏకైక పెద్ద పార్టీ బిజెపి. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలోని చట్టాలపై ద్విముఖ దాడి జరుగుతున్నది. అదిప్పుడు మరింతగా పెరిగింది. ఆ ఖ్యాతి తమదే అని బిజెపి ప్రపంచం ముందుకు వస్తోంది. పారిశ్రామిక సంబంధాలు, చట్టాల సంస్కరణల పేరుతో కార్మికులకు రక్షణ కల్పించే, సంక్షేమ చర్యలను చేపట్టాల్సిన అనేక చట్టాలను నీరుగారుస్తున్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. మరోవైపు మొత్తంగా మహిళలపై సాగించే వరకట్న తదితర వేధింపుల నిరోధక అంశాలు, సామాజికంగా బలహీన వర్గాలుగా వున్న ఎస్‌సి,ఎస్‌టిలపై దాడుల నిరోధక చట్టంపై బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, దాని వాదనలకు అనుగుణ్యంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, దాని పర్యవసానాలు వాటిని నీరుగార్చేందుకు దారితీసేవిగా వున్నాయి.
ఈ తీర్పుపై అనూహ్యరీతిలో దళితులు, గిరిజనుల్లో వెల్లడైన ఆగ్రహాన్ని వూహించని బిజెపి సర్కార్ కోర్టులో తీర్పు సమీక్ష పిటీషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు దళితులు, గిరిజనుల మీద బిజెపికి వున్న శ్రద్ధ ఎలాంటిదో, అంతరంగంలో వున్నదేమిటో కళ్లు తెరిపించేవిగా వున్నాయి. దళితులు, గిరిజనులపై దాడుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతున్నదని గణాంకాలు కూడా సమర్పించింది మీ ప్రభుత్వమే కదా అని జస్టిస్ ఏకె గోయల్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కోర్టుకు సాయపడేందుకు గాను అమికస్ క్యూరీగా వ్యవహరించిన అమరేంద్ర షరాన్ ‘ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సమాచారం అందించి దుర్వినియోగం గురించి విన్నపాలు చేసింది, ఇప్పుడు అదే ప్రభుత్వ తీర్పును సవాలు చేస్తోంది’ అని అభ్యంతరం తెలిపారు.కోర్టుకు అందచేసిన సమాచారం, దాని మీద దుర్వినియోగ వ్యాఖ్యానాలతో వాదనలు చేయటం ఫ్యూడల్ వ్యవస్ధకు ప్రతినిధులైన భూస్వాములు, మాజీ జమిందార్లు, రాజాలు, ఆ భావజాలం వున్న ఇతరులను సంతృప్తి పరచేందుకు, ఆ చట్టాన్ని తొలగించేందుకు అన్నది స్పష్టం. దాని మీద ఈ తరగతుల్లో వ్యక్తమైన హర్షాతిరేకాల కంటే బాధితులుగా వుంటున్న దళితులు, గిరిజనుల్లో వెల్లడైన వ్యతిరేకతను చూసి బిజెపి ఎక్కువగా భయపడింది. దీనికి కారణం వచ్చే ఎన్నికల్లో ఓట్ల గురించి తలెత్తిన బెంగ, దాని పర్యవసానమే కోర్టులో సమీక్ష పిటీషన్.
బ్రిటీష్ వారి విభజించు పాలించు అనే సూత్రాన్ని మన పాలకవర్గం మరింతగా నవీకరించి అమలు జరుపుతోంది. ఏ తరగతికి ఆ తరగతి వారు తమ దాకా వచ్చినపుడు చూసుకుందాంలే అనే వుపేక్షాభావంతో వున్నారు. దళితులు చూపిన చొరవను గతంలో వివిధ చట్టాల సందర్భంగా అందరూ చూపి వుంటే ఇప్పుడీ పరిస్ధితి తలెత్తి వుండేది కాదు. వుదాహరణకు మహిళా రక్షణ చట్టాల విషయమే చూద్దాం. ప్రపంచంలో ఎక్కడైనా ఒక మహిళ చట్టాన్ని వుపయోగించుకుంటే దాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తారు, అదే మన దేశంలో అయితే దుర్వినియోగంతో పాటు సదరు మహిళ చెడునడత కలదని ముద్రవేయటం సర్వసాధారణం. ఏడాది క్రితం కట్న వేధింపుల వుదంతాలలో శిక్షాస్మృతి 498ఏ కింద ఫిర్యాదులు నమోదైనపుడు వాటిని నిర్ధారించుకోకుండా అరెస్టులు చేయరాదని సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. దాని ప్రకారం ప్రతి జిల్లాలో కట్నవేధింపుల కేసుల ఫిర్యాదులను పరిశీలించేందుకు కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాల్సి వుంది. ఇప్పటికే పోలీసు వ్యవస్ధలో కొంత నీరుకారుతుంటే మరొక దొంతర తోడు చేయటమే ఇది. సమాజంలో కట్నకానుకల దురాచారం లేదా దోపిడీ గురించి తెలియని వారు లేరు. వాటికోసం మహిళలను వేధించటం జగమెరిగిన సత్యం. ఎవరైనా తెగించి ఫిర్యాదు చేస్తే చట్టాన్ని దుర్వినియోగం చేశారనే నిందతో సమాజం, పోలీసులు,కోర్టులలో లాయర్ల ప్రశ్నలతో మరో వేధింపు పర్వం ప్రారంభం అవుతుంది. అంతదాకా నిలబడిన మహిళపై చివరకు చెడునడత నింద. సహించలేక ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే వేధింపులు ఆగేందుకు ప్రయత్నం కాకుండా కుటుంబపరువు పోతుందనే పేరుతో అసలు కేసునే వెనక్కు తీసుకొనే ప్రయత్నం అటు పోలీసుల నుంచి ఇటు ఇతరుల నుంచీ జరుగుతుంది. అందుకే వరకట్న వేధింపులు, దళితులు, గిరిజనులపై అత్యాచారాలు, దాడుల కేసులు అత్యధికం విచారణ వరకు రావు, వచ్చినా శిక్షలు పడేది చాలా తక్కువగా వుంటున్నాయి. కారణం విధిలేక రాజీపడేవి కొన్నయితే బలవంతపు రాజీ,ప్రలోభాలతో నీరుగారేవి ఎన్నో. ఈ గణాంకాలను చూపే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం దుర్వినియోగమవుతున్నదని వాదించగా ప్రభుత్వమే సాధికారికంగా దుర్వినియోగం గురించి చెబుతున్నపుడు కోర్టులు అందుకు అనుగుణ్యంగా తీర్పు చెప్పకుండా ఎలా వుంటాయి? కట్నవివాదాలలో అత్తమామలను చేర్చి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అనేక సందర్భాలలో కోర్టులే వ్యాఖ్యానించిన వుదంతాలు వున్నాయి. తమ కుమారుడు కోడల్ని వేధిస్తున్నాడని అత్తమామలు ఫిర్యాదు చేసిన వుదంతం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవటానికి కారణం ఏమిటి? మనది పితృస్వామిక వ్యవస్ధ ఇలాంటి వాటిలో ఏం చేసినా ఆడది అణగిమణగి వుండాలన్నది తరతరాలుగా వస్తున్న ఆధిపత్య భావజాలమే. దీని అర్ధం చట్టాలు దుర్వినియోగం అవటం లేదని కాదు. తప్పుదారి పట్టేవారు సమాజంలోని ప్రతి తరగతిలో వుంటారు. అలాంటి అనేక వుదంతాలలో గ్రామ కక్షలలో, పట్టణాలలో వివాదాలలో పావులుగా మార్చుకొని ప్రత్యర్ధులపై తప్పుడు ఫిర్యాదులు చేయించేది పెత్తందారులు, అవాంఛనీయ శక్తులే. అలాంటి వారిపై తగు చర్య తీసుకొనేందుకు అవకాశం వున్నప్పటికీ మన వ్యవస్ధలు తమ అధికారం, బాధ్యతలను దుర్వినియోగపరుస్తున్నాయి. మహిళా చట్టాన్ని నీరుగార్చినపుడే తీవ్ర స్ధాయిలో వ్యతిరేకత వ్యక్తమై వుంటే దళితులు తమ రక్షణకోసం చేసిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వారిపైనే బిజెపి సర్కార్ నెపం మోపే సాహసం చేసి వుండేదా ?