Tags

, , ,

Image result for Gandhi, Karl Marx, Ambedkar

ఎం కోటేశ్వరరావు

కావేరీ జలాలపై ట్రిబ్యునల్‌ వేయాలంటూ వారాల తరబడి వేళ్ల మీద లెక్కించదగినంత మంది సృష్టించిన రభసను అనుమతించిన పాలకపార్టీ పార్లమెంటరీ వేదికలను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటాన్ని చూశాము. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా విషయంలో వాగ్దానభంగం, నమ్మించి మోసం చేసిన బిజెపిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకొనేందుకు పాలకపక్షం ప్రయోగించిన శిఖండి అన్నాడిఎంకె అన్నది ప్రతిఒక్కరికీ తెలిసిపోయింది. ప్రతి నలుగురిలో ఒకరుగా వున్న దళితులు, గిరిజనుల రక్షణకోసం వుద్దేశించిన అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోందంటూ బిజెపి సర్కార్‌ సుప్రీం కోర్టుకు చెప్పటం, అది అందచేసిన సమాచారం, వాదనలకు అనుగుణంగా ఆ చట్టాన్ని నీరుగార్చే విధంగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పటం తెలిసిందే. పార్లమెంట్‌లో వున్న దళిత, గిరిజన ఎంపీలు ఆ తీర్పుపై అప్పీలు చేయాలంటూ ఒక్క రోజు కాదు, కనీసం పది నిమిషాలపాటు సభను అడ్డుకొని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఎందుకు తీసుకుపోలేకపోయారన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయమిది. కావేరీ ట్రిబ్యునల్‌ పాటి కూడా ఈ అంశానికి ప్రాధాన్యత లేదని వారు భావించారా? బలహీనవర్గాలకు కొందరికైనా మేలు చేస్తున్న విద్య, వుద్యోగాల రిజర్వేషన్లను తొలగించాలన్న ప్రచారం, డిమాండ్‌ గతం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా వినిపిస్తున్న పూర్వరంగంలో కేవలం పది సంవత్సరాలకు పెట్టిన రిజర్వేషన్లు ఇంకెంతకాలం పొడిగిస్తారంటూ ఎవరైనా సవాలు చేస్తే పునరాలోచించాలని కోర్టులు తీర్పు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు నోరు విప్పని వారు అప్పుడైనా తెరుస్తారని నమ్మటం ఎలా ? ఇలాంటి వారినా జనం గుడ్డిగా ఎన్నుకుంటున్నది, నమ్ముతున్నది అన్న మౌలిక ప్రశ్న ముందుకు వస్తోంది.

మహిళలు, దళితుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచార దాడిని ప్రతిఘటించాల్సిన అవసరాన్ని కొందరైనా గుర్తించారు. కార్యాచరణలో ఏప్రిల్‌ రెండవ తేదీ బంద్‌ ఒక చిన్న అడుగు మాత్రమే. దీన్ని ఎలా కొనసాగించాలన్నది ప్రశ్న. చట్టాల దుర్వినియోగం అనే అంశంలోకి లోతుగా వెళితే ఈ రెండు చట్టాలలో వుందని చెబుతున్న దుర్వినియోగం సముద్రంలో కాకి రెట్ట వంటిది. కార్యనిర్వాహక వ్యవస్ధ, తోటి సమాజం నిర్లక్ష్యం చేసినపుడు, పక్షపాతం చూపినపుడు నిస్సహాయులుగా వున్నవారు కసిగా ఫిర్యాదులు చేసి వుండవచ్చు. కొందరు నిర్దోషులు ఇబ్బందులు పడి వుండవచ్చు. అలాంటివి వేళ్ల మీద లెక్కించగలిగినవే. వాటిని సక్రమంగా విచారించి నిర్దోషులను రక్షించటానికి పోలీసు, న్యాయవ్యవస్ధలకు ఎలాంటి ఆటంకాలు లేవు. అవి తమ బాధ్యతను ‘దుర్వినియోగం’ చేయకుండా సక్రమంగా వ్యవహరించి, అసలు అలాంటి నేరాలకే తావులేని పరిస్ధితిని ఏర్పరచి వుంటే చట్టాల నామమాత్ర దుర్వినియోగ పరిస్ధితే తలెత్తి వుండేది కాదు. వేల మంది లలిత్‌ మోడీలు, విజయ మాల్యలు, నీరవ్‌ మోడీలు లక్షల కోట్లు స్వాహా చేసి కోట్లాది మందికి హాని చేసి పారిపోయినా సహించవచ్చుగానీ ఒక్క జింకను చంపిన వారిలో ఒక్కరిని కూడా వదల కూడదు అన్నట్లుగా వుంది పరిస్ధితి. చట్టాలు, వాటిని అమలు జరపాల్సిన వారు, పని తీరును పర్యవేక్షించేవారు సక్రమంగా పని చేసి, దుర్వినియోగం చేయకుండా వుంటే నేరగాళ్లు తప్పించుకొనేవారా ?

Image result for Gandhi, Karl Marx, Ambedkar

ఇక్కడ ప్రధాన సమస్య, ఆందోళనకరమైనది సక్రమంగా అమలు జరపాల్సిన అధికార యంత్రాంగం నూటికి నూరుశాతం దుర్వినియోగం, జనాల మీద దాడులకు వుపయోగిస్తున్న ఇతర చట్టాల మాటేమిటి? యావత్‌ శ్రామిక సమాజానికి జరుగుతున్న అన్యాయం మాటేమిటి? ఎవరైనా ఒక వ్యక్తి చట్టాన్ని దుర్వినియోగం చేస్తే మరొక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు ప్రభావితులౌతారు. సంస్కరణలనో మరొక పేరుతోనే అదే మొత్తం చట్టాన్ని దుర్వినియోగం చేస్తే, ఎసరుబెడితే జరిగే తీవ్ర నష్టం మాటేమిటి? వుదాహరణకు కార్మిక చట్టాలు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్ధలు సైతం వాటిని నీరుగార్చటం, వుల్లంఘించటంలో ఎలాంటి తేడా కనపడదు. అలాంటిది ప్రయివేటు రంగం సంగతి చెప్పాల్సిన పనేముంది. నరేంద్రమోడీ సర్కార్‌, బిజెపి ఇతర అనేక రాష్ట్రాల పాలకులు(వామపక్షాలు మినహా) సంస్కరణల పేరుతో చేస్తున్న మార్పులు కార్పొరేట్‌ యజమానులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న చేస్తున్న దుర్వినియోగం తప్ప మరొకటి కాదు. వీటి ద్వారా గోడదెబ్బ, చెంపదెబ్బ అన్నట్లు సామాజిక రక్షణ చట్టానికి తూట్లు పడి దళితులు, మొత్తంగా మహిళలు రెండు విధాలుగా నష్టపోవటం లేదా ? ఎగుమతుల పేరుతో సెజ్‌లకు కార్మిక చట్టాల అమలు మినహాయింపులు చట్టదుర్వినియోగమా కాదా ?

నయా వుదారవాద విధానాల పేరుతో అమలు జరుపుతున్న పెట్టుబడిదారీ విధానాలను కొంత మంది దళిత మేధావులతో సహా వామపక్ష భావజాలం లేని వారందరూ వూట సిద్ధాంతం పేరుతో సమర్ధించారు. దాని ప్రకారం సరిహద్దులు, కరెన్సీ,మిలిటరీ, పోలీసు వంటి అంశాలు తప్ప మిగిలిన అన్నింటినీ ప్రయివేటు రంగాలకు అప్పచెబితే ఆ రంగం నుంచి వచ్చే ఫలితాలు వూట మాదిరి సమాజం అంతటికీ దిగుతాయి. గత మూడున్నర దశాబ్దాల ఈ విధానాల అమలులో వూట ఎలా దిగింది? కేంద్ర ప్రభుత్వ సమాచారం, గణాంకాల ప్రకారం 1980-81లో ఒక వస్తువు తయారీ లేదా సేవ విలువ(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌- జివిఏ)లో వేతనాలు, అలవెన్సులు తదితర రూపాలలో సగటున కార్మికులకు దక్కిన లబ్ది 44శాతం. అది 2012-13 నాటికి 23.6కు పడిపోయింది. ఇదే సమయంలో వడ్డీ చెల్లింపులు 19.8 నుంచి 13.7శాతానికి తగ్గాయి. మరి లాభాల వాటా 15.7 నుంచి 44.1శాతానికి పెరిగింది. 2012 జిడిపి ఆధారంగా గుణిస్తే మన దేశంలో ఒక శ్రామికుడు గంటలో చేసిన వుత్పత్తి విలువ రెండు వందల యాభై రూపాయలు అదే రోజుకు రెండువేలు. వివిధ పరిశ్రమలు, రంగాలలో వున్న కనీస వేతనాల మొత్తాలను చూస్తే కార్మికులు ఎంత దోపిడీకి గురవుతున్నారో చెప్పనవసరం లేదు. అ తక్కువ మొత్తాలను కూడా దశాబ్దాల తరబడి సవరించని ప్రభుత్వాలున్నాయి. ఇవి చట్టాలను నీరుగార్చటం కాదా? అవసరాల మేరకు పెంపుదల సంగతిపక్కన పెడితే అసలు ఏదో ఒక సవరణ కోసం కూడా వుద్యమించాల్సిన రోజులివి. ఈ పూర్వరంగంలో కార్పొరేట్లకు మరింత లబ్ది చేకూర్చేందుకు సంస్కరణల పేరుతో కాంగ్రెస్‌ అమలు జరప ప్రయత్నించిన వాటిని బిజెపి ఆచరించేందుకు పూనుకుంది. ఇది అధికార దుర్వినియోగం కాదా ? దీన్నెవరు ప్రశ్నించాలి, కోర్టు పరిభాషలో చెప్పాలంటే ఈ పరిస్ధితిని ఎలా సరిచెయ్యాలి?

బిజెపి పాలిత రాజస్ధాన్‌ కార్మిక చట్టాల సవరణ ప్రయోగశాలగా తయారైంది.అక్కడి పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి తిరిగి పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. యాంత్రీకరణ, రోబోల వినియోగం మరింతగా పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి సవరణలు చేయటం అంటే అత్యధిక ఫ్యాక్టరీలు, సంస్ధలను కార్మిక చట్టాల పరిధి నుంచి తొలగించటమే. అలాంటపుడు కనీసవేతనాలను సవరించినా వుపయోగం ఏముంది? ప్రభుత్వం యజమానులు ఏం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతిచ్చే చర్యలకు ముద్దుగా ‘సంస్కరణలు’ అని పేరు పెట్టింది. శాశ్వత స్వభావం వున్న పరిశ్రమలలో కూడా కాంట్రాక్టు కార్మికులను అనుమతించటాన్ని ఏమనాలి. ఒక సంస్ధలో సిబ్బందిని రిట్రెంచ్‌ లేదా లే ఆఫ్‌ చేయాలన్నా గతంలో ప్రభుత్వ అనుమతి అవసరం, ఇప్పుడు యజమాని చిత్తానికి వదలివేశారు.డెబ్బయిశాతం పరిశ్రమలు, సంస్ధలను కార్మిక చట్టాల పరిధి నుంచి తప్పించారు. తనిఖీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే సాకుతో లేబర్‌ అధికారుల తనిఖీలపై సవాలక్ష ఆంక్షలు విధించి ఆచరణలో లేకుండా చేశారు. పేరుకు కార్మికశాఖ అయినా అది యజమానుల సేవలో మునిగి తేలుతుందని, కార్మిక చట్టాల అమలు కంటే వుల్లంఘనే ఎక్కువ అన్నది కార్మికులకు తెలిసిన నగ్నసత్యం.

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. ఇది చట్టదుర్వినియోగం గాక మరేమిటి? ఈ దుర్వినియోగం వెనుక రాజ్యంలోని అన్ని విభాగాలు లేవా ? చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన ఘనత బిజెపి ఖాతాలో చేరింది. ఇది దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది.

ప్రపంచవ్యాపితంగా ధనిక దేశాలన్నింటా అప్రెంటిస్‌షిప్‌(నైపుణ్య శిక్షణ) పేరుతో పెద్ద ఎత్తున పర్మనెంటు కార్మికుల స్ధానంలో కార్మిక చట్టాల పరిధిలో లేని కార్మికులను నియమిస్తున్నారు. వారికి తక్కువ వేతనాలు, అలవెన్సులు చెల్లించేందుకు ఇదొక దొంగదారి అన్నది తెలిసిందే. మన దేశంలో కూడా అప్రెంటిస్‌షిప్‌ చట్టాన్ని సవరించి శిక్షణలో వున్న వారు చేయకూడని పనులను కూడా వారితో చేయించేందుకు, పెద్ద ఎత్తున నియామకానికి తెరతీశారు. శిక్షణా కాలంలో అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించేవిధంగా పధకాలు సిద్దం చేశారు. ఇది యజమానులకు మరొక అదనపు రాయితీ. ఇలా కార్మికవర్గం, అన్ని తరగతుల వారు గుర్తించాల్సిన, గళమెత్తాల్సిన దుర్వినియోగాలు ఇంకా చాలా వున్నాయి.

స్వాతంత్య్ర వుద్యమ వారసత్వంతో ఏమాత్రం సంబంధం లేని, బ్రిటీష్‌ వారికి లంగిపోయిన భావజాలంతో పని చేసే శక్తుల ఆధిపత్యంలోకి తొలిసారిగా పూర్తిగా మనపాలనా వ్యవస్ధ పోయింది. మహాత్ముడు కన్న కలలు కల్లయ్యాయి. ఆయన వారసులుగా బయలు దేరిన వారు వేరే గాంధీల విధేయులమని చెబుతున్నారు తప్ప అసలు గాంధీని విస్మరించారు. అలాంటి వారిని కనీసం ఒక్కసారి చూసేందుకు కూడా మహాత్మా గాంధీ మనస్కరించరు. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా మహాత్ముడిపట్ల భక్తిని ప్రదర్శిస్తూనే ఆయనను హత్య చేసిన వాడికి జేజేలు పలికే శక్తులు గాంధీ ప్రవచించిన అహింసను, మతసామరస్యాన్ని ఏడునిలువులలోతున పాతిపెట్టి హింసో పరమ ధర్మ: అన్నట్లుగా చెలరేగిపోతున్నాయి. మనుషుల కంటే ఆవు రక్షణ ముఖ్యం అంటూ మనుషుల ప్రాణాలను తీస్తున్నవారిని కాపాడుతున్న రాజ్యం నడుస్తోంది. సాంఘిక, సామాజిక న్యాయం గురించి ఆశపడిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఒక్కసారి వెనక్కు వచ్చి చూస్తే హతాశుడౌతారు. తన అధ్యక్షతన జరిగిన రాజ్యాంగరచన, దాని స్ఫూర్తి, నిబంధనలకు అనుగుణ్యంగా ఆమోదించిన అనేక ప్రజానుకూల చట్టాలకు తూట్లుపొడిచే ప్రయత్నాలను,మనువాదాన్ని మరో రూపంలో తీసుకువచ్చే తీవ్ర యత్నాలను చూసి సంఘటితపడమని మరో పిలుపు ఇవ్వకపోడు. దోపిడీ రహిత సమాజం కోసం తాను ప్రతిపాదించిన దోపిడీ రహిత సమాజం కోసం పోరాడే కార్మికవర్గాన్ని, వారికి వెన్నుదన్నుగా నిలిచే రాజకీయశక్తులను పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైపైకి అంటూ తన స్నేహితుడు ఎంగెల్స్‌తో కలసి కారల్‌ మార్క్స్‌ సందేశమిస్తూనే వుంటాడు. కార్మికుల రక్షణకోసం చేసిన చట్టాల రూపు మార్చి వాటిని యజమానుల ఆయుధాలుగా మారుస్తున్న వారిని కూలదోస్తే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని నిస్సంకోచంగా చెబుతాడు. అందుకే ముగ్గురూ వచ్చి కార్యాచరణ కర్తవ్యబోధ చేయాలని యావత్‌జాతి కోరుతోందంటే అతిశయోక్తి కాదు.