Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

లూలాగా ప్రపంచానికి సుపరిచితమైన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వా ప్రస్తుతం జైలులో ఖైదీ. ఒక కేసులో తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నారు అనేకంటే ఒక పెద్ద కుట్రలో భాగంగా జైలు పాలు చేశారనటం సముచితంగా వుంటుంది. ఆయనేమీ పదవిని అడ్డుపెట్టుకొని వేల కోట్లను వెనకేసుకోలేదు. విదేశీబ్యాంకుల్లో దాచుకోలేదు, వాటినే తిరిగి బినామీ పెట్టుబడులుగా పెట్టలేదు. లూలాపై మోపిన నేరం ఏమిటి? గతంలో అంటే 2003-11 మధ్య అధ్యక్షుడిగా వున్న సమయంలో ఆయన అప్పుడపుడు వచ్చిపోయారని చెబుతున్న ఇంటికి ఒక కంపెనీతో మరమ్మతులు చేయించాడట. అందుకుగాను దానికి ప్రభుత్వరంగ చమురు సంస్ధలో లాభదాయకమైన కాంట్రాక్టులు ఇప్పించాడట. ఇంటి మరమ్మతుల విలువ పన్నెండులక్షల డాలర్లని, దాన్ని వుచితంగా చేయించాడు గనక అంత మొత్తం లంచం తీసుకోవటంతో సమానమే అని గతేడాది జూలై 12న కోర్టు తీర్పు చెప్పింది. ఇదంతా తనపై మోపిన రాజకీయ కుట్ర అంటూ ఆ తీర్పును సవాలు చేస్తూ మరో కోర్టుకు వెళ్లిన లూలాకు అక్కడ తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్షను పన్నెండుకు పెంచి ఖరారు చేశారు. దాంతో శనివారం నాడు ఆయన  జైలుకు వెళ్లారు.

లాటిన్‌ అమెరికా దేశాల నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్న అమెరికా అక్కడి వామపక్ష, ప్రజాతంత్రశక్తులను దెబ్బతీసేందుకు నిరంతరం కుట్రలు పన్నుతోందని వేరే చెప్పనవసరం లేదు. ఏ వంకా దొరకని వారు డొంకను చూపి ఏడ్చారన్నది ఒక సామెత.(గ్రామాలను కలిపే కాలి, బండ్లబాటను డొంకలని పిలుస్తారు) లూలాను బదనాం చేసేందుకు చీకట్లో బాణాలు వేసినట్లుగా అమెరికా సిఐఏ, ఇతర సంస్ధల మద్దతు వున్న రాజకీయ ప్రత్యర్ధులు అనేక ఆరోపణలు చేశారు. ఆయన పాలనా కాలంలో కొందరు అధికారులు లేదా అధికార పార్టీకి చెందిన వారు అవినీతికి పాల్పడలేదనీ చెప్పలేము. లూలా వాటిని వుపేక్షించారని చేస్తున్న ఆరోపణలో ఒకటో అరశాతమో నిజం వుంటే వుండవచ్చు. కానీ లూలాపై చేసిన ఇంటి మరమ్మతు ఆరోపణలో పసలేనప్పటికీ ఈ ఏడాది జరగనున్న ఎన్నికలలో అధ్యక్షపదవికి పోటీ చేయకుండా అనర్హుని గావించేందుకు చేసిన కుట్రలో భాగమే శిక్ష అన్నది స్పష్టం.

లాటిన్‌ అమెరికాలో ఎదురవుతున్న వామపక్ష సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా ఇటీవలి కాలంలో సరికొత్త కుట్రలకు తెరతీసింది.గతంలో మిలిటరీ నియంతలు, వారికి మద్దతుగా మితవాదశక్తులను రంగంలోకి తెచ్చింది. ఇప్పుడు వారి కాలంలో నియమితులైన న్యాయాధికారులతో రాజ్యాంగబద్ద కుట్రలను అమలు జరుపుతోంది. పార్లమెంట్లలో వామపక్ష శక్తులకు మెజారిటీ లేకపోవటం వాటిని అమలు జరపటం సులభమౌతోంది. ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలలో లూలాను అభ్యర్ధిగా ప్రకటించారు. ఆయన విజయం ఖాయం అనే వాతావరణం ఏర్పడటంతో పాతకేసులను రంగంలోకి తెచ్చారన్నది స్పష్టం.లాటిన్‌ అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన 72సంవత్సరాల లూలా పాలనా కాలంలో దారిద్య్రనిర్మూలనకు తీసుకున్న చర్యలు నాలుగు కోట్ల మంది జీవితాలను మెరుగుపరిచాయి. పార్లమెంటులో మెజారిటీ వున్న మితవాదశక్తులు కుట్ర చేసి 2016లో లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీకి చెందిన అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ను పదవి నుంచి తొలగించారు.

తోడేలుామేకపిల్ల కథలో మాదిరి దిల్మా రౌసెఫ్‌ను పదవీచ్యుతురాలిని చేసేందుకు చూపిన కారణం కూడా ఎంతో హాస్యాస్పదమైనదే. అదే ప్రాతిపదిక అయితే ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఎన్నికైన వారి మీద అభియోగం మోపి పదవి నుంచి దించేయవచ్చు. 2014 ఎన్నికలలో దిల్మా రౌసెఫ్‌ను గెలిపించేందుకు బడ్జెట్‌ అంకెలను తారుమారు చేశారని, దిగజారిపోతున్న దేశ ఆర్ధిక వ్యవస్ధ వాస్తవ పరిస్ధితిని మరుగుపరచేందుకు ప్రభుత్వబ్యాంకుల నుంచి నిధులను వుపయోగించారంటూ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానంతో ఆమెను తొలగించారు. ప్రస్తుత అధ్యక్షుడు మైఖేల్‌ టెమర్‌పై అనేక అవినీతి విమర్శలు రావటమే కాదు, 50లక్షల డాలర్లు లంచం తీసుకున్నట్లు గతేడాది ఒక కేసు దాఖలైంది. అయితే సుప్రీం కోర్టు దానిపై విచారణ జరపకుండా, అభిశంసన తీర్మానం పెట్టకుండా పార్లమెంటులోని టెమర్‌ అనుయాయులు అడ్డుపడటాన్ని చూస్తే లూలాపై ఎలాంటి నిర్ధిష్ట ఆరోపణ లేనప్పటికీ విచారణ తతంగం జరిపి శిక్ష విధించటం రాజకీయ ప్రేరేపితంగాక మరేమిటి?లూలా ఎలాంటి నేరానికి పాల్పడని రాజకీయ ఖైదీ మాత్రమేనని ఆయన లాయర్‌ జానిమ్‌ వ్యాఖ్యానించారు. అయన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు అందుబాటులో వున్న అన్ని చట్టబద్దమైన అవకాశాలను వుపయోగిస్తామన్నారు. లూలా నివశించారని చెబుతున్న అపార్ట్‌మెంట్‌కు ఆయనేనాడూ యజమాని కాదని, దాన్ని అద్దెకు తీసుకోవటంలో అక్రమాలకు పాల్పడినట్లు ఎలాంటి రుజువు లేదని అన్నారు.రాజకీయ కారణాలతో లూలాను జైలు పాలు చేయటంలో కుట్రదారులు సఫలమయ్యారు. అయితే అదే సమయంలో ఆయనకు నోబెల్‌ శాంతి బహమతి అవార్డుకు నామినేట్‌ చేసేందుకు మద్దతు తెలపాలన్న నోబెల్‌ బహుమతి గ్రహీత ఆడాల్ఫో పెరెజ్‌ ఎస్కివిల్‌ పిటీషన్‌పై పెద్ద ఎత్తున స్పందన వెల్లడైంది. లక్షన్నర సంతకాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా సోమవారం నాటికి లక్షా ఎనభైవేలు దాటాయి. తమ నేతను జైలు పాలు చేసినప్పటికీ అక్టోబరులో జరిగే ఎన్నికలలో ఆయనే తమ అభ్యర్ధి అని వర్కర్స్‌ పార్టీ అధ్యక్షుడు గ్లెస్సీ హాఫ్‌మన్‌ ప్రకటించారు. వర్కర్స్‌ పార్టీ కేంద్ర నాయకత్వం తమ నేత జైలులో వున్న కర్టీబా నుంచే పని చేస్తుందని, ఆయనను విడుదల చేయించేందుకు వున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని హాఫ్‌మన్‌ చెప్పారు.

బ్రిక్స్‌ కూటమి(బ్రెజిల్‌,రష్యా,ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా)లో ఒక ముఖ్యపాత్రపోషించటమేగాక లాటిన్‌ అమెరికాలో అధికార కేంద్రంగా వున్న బ్రెజిల్‌ వామపక్ష వుద్యమాలకు సైతం పట్టుగొమ్మగా వుంది. అందుకే అమెరికా ఈ ప్రాంతంలో ప్రత్యేకించి ఈ దేశంలో మితవాదులు,క్రైస్తవమతవాదులు, అవినీతి శక్తులతో చేతులు కలిపి లూలా నాయకత్వంలోని వర్కర్స్‌పార్టీని అధికారంలోకి రాకుండా చేసేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. గతంలో నియంతపాలన రుద్దిన మిలిటరీని తిరిగి రంగంలోకి తెచ్చేందుకు సైతం వెనకాడటం లేదని జరిగిన పరిణామాలు సూచిస్తున్నాయి. దిల్మా రౌసెఫ్‌ను గద్దె దింపటంలో పార్లమెంట్‌ సభ్యులుగా వున్న మాజీ సైనికాధికారులున్నారు. నగరాల్లోని మురికి వాడల్లో తిష్టవేసిన మాఫియా, గూండా గ్యాంగులను ఏరివేసే పేరుతో మిలిటరీని కూడా దించి తమ ప్రత్యర్ధులుగా వున్న వారిని హతమారుస్తున్నారు. లూలాపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడక ముందు సైనిక కమాండర్‌ ఒకడు బహిరంగ ప్రకటన చేస్తూ శిక్షల నుంచి మినహాయించటానికి స్వస్తి పలకాలని కోరటం ద్వారా లూలాను జైల్లో చూడాలన్న తన కోరికను బయటపెట్టాడు. శనివారం రాత్రి పోలీసులకు లంగిపోయిన లూలాను కర్టిబా జైలుకు తరలించేందుకు పోలీసులు విమానాన్ని సిద్ధం చేశారు. చెత్తను కిటికీ నుంచి అవతలకు పడవేయండి అంటూ పైలట్లతో మిలిటరీ రేడియోలో చేసిన వ్యాఖ్యలు రికార్డయ్యాయి. అవి లూలాను వుద్ధేశించి చేసినవే అన్నది వేరే చెప్పనవసరం లేదు. యాభైలక్షల డాలర్లు లంచం తీసుకున్న టెమర్‌ అధ్య క్ష స్ధానంలో కొనసాగుతుంటే ఇంటి మరమ్మతుల పేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ ఆధారంలేని ఆరోపణలకు గురైన వామపక్ష మాజీ అధ్యక్షుడు జైలు పాలయ్యారు. ఇదీ నేడు బ్రెజిల్‌లో వున్న పరిస్ధితి.