Tags

, , , ,

Image result for syria attack

ఎం కోటేశ్వరరావు

‘ఒక బీరు కొని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో కలసి తాగుతూ స్వయంగా నా అనుభవాలను పంచుకోవాలనుంది. సిరియా పౌరుల కోసం ఏదో ఒకటి చేసేందుకు ఆయన ప్రయత్నించంటం నాకు సంతోషంగా వుంది.’ గత నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో ఆశ్రయం పొంది జర్నలిస్టు ముసుగులో సిరియాపై తప్పుడు ప్రచారం సాగిస్తున్న కాశీమ్‌ ఇద్‌ అనే ఒక ఐఎస్‌ఏజంట్‌ గతవారంలో సిరియాపై దాడుల తరువాత సిఎన్‌ఎన్‌ టీవీతో చేసిన వ్యాఖ్య. అమెరికా నాయకత్వంలో ఫ్రెంచ్‌, బ్రిటన్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతర కొన్ని దేశాలు జరిపిన దాడులతో ఐఎస్‌ ఏజంట్ల ఆనందం ఎలా వుందో ఇది తెలుపుతోంది. నేను సైతం తక్కువ తిన్నానా అంటూ నాలుగు సంవత్సరాల క్రితం బరాక్‌ ఒబామా తన వంతుగా ఒక దాడి జరిపితే, నీకంటే పెద్ద వెధవాయను నేను అంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ గతేడాది ఒకసారి ఇప్పుడు మరోసారి దాడులు జరిపించాడు. గతంలో ఐఎస్‌ తీవ్రవాదులను అణచే పేరుతో, ఇప్పుడు ప్రభుత్వమే తన పౌరులపై రసాయనిక ఆయుధాలను ప్రయోగిస్తోందనే ముసుగుతో దాడికి పాల్పడింది. చరిత్రలో ఇంత వరకు నాజీలు తప్ప ఎవరూ రసాయనిక ఆయుధాలతో సామూహిక హత్యలు చేసిన వుదంతాలు కానరావు. తమ దగ్గర ఎలాంటి రసాయన ఆయుధ కార్యక్రమం లేదు కనుక వత్తిడికి తలగ్గిన సిరియా ఏవైనా వుంటే వాటి నిర్మూలనకు అమెరికాతో ఒక ఒప్పందం కూడా చేసుకుంది. దాన్ని అమలు జరపకుండా, అంతర్జాతీయ న్యాయాన్ని వుల్లంఘించి ఎలాంటి చట్టబద్దత లేకుండా జరిపిన దాడి ఇది. అణు జలాంతర్గాములు, అణ్వాయుధాలను మోసుకుపోయే విమానవాహక యుద్ధ నౌకలతో మోహరించి 2003లో ఇరాక్‌ తరువాత జరిపిన పెద్ద దాడి ఇది.ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నారనే వార్తలు ఒకవైపు, రష్యాకు చెందిన ఒక డబుల్‌ ఏజంట్‌, అతని కూతురిపై విష ప్రయోగం జరిపిందనే సాకుతో అనేక మంది రష్యా రాయబార సిబ్బందిని ఐరోపా దేశాల నుంచి బహిష్కరించటం వంటి పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు గిల్లి కజ్జాలకు పూనుకున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మిలిటీకరణ జరిగింది. ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ధలే అక్కడ ఆయుధాలు తయారు చేస్తాయి. అందువలన వాటికి లాభాలు రావాలంటే ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల రావణకాష్టం మాదిరి య దానికి ఎక్కడో ఒక చోట యుద్ధాలు, దేశాల మధ్య వుద్రిక్తతలు వుంటే తప్ప జరుగుబాటు వుండదు. మిలిటరీ పరిశ్రమలను మేపేందుకు అమెరికా పాలకవర్గం ఇప్పటికే స్కూళ్ల ప్రయివేటీకరణ, నిధుల కోత, మౌలిక సౌకర్యాల తగ్గింపు, గృహ, వైద్య రంగాల నుంచి తప్పుకోవటం వంటిచర్యల ద్వారా జనజీవితాలను దిగజార్చటంతో పాటు నిరుద్యోగం, దారిద్య్రాన్ని పెంచుతోంది. రెండోవైపు అంతర్జాతీయంగా దాడులకు తలపడుతోంది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలమని ప్రగల్భాలు పలికే పశ్చిమ దేశాలు జరిపిన ఈ దాడిని అనేక దేశాలు, సమాజాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పశ్చిమాసియాలో, తద్వారా ప్రపంచ యుద్ధానికి పశ్చిమ దేశాలు అర్రులు చాస్తున్నాయని అనేక మంది భయపడుతున్నారు.అంతర్గతంగా వైఫల్యాలబాటలో వున్న ట్రంప్‌ వాటిని పక్కదారి మళ్లించేందుకు, నవంబరులో జరగనున్న పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికలలో ఓట్లు పొందేందుకు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వచ్చాయి. సిరియా రసాయక ఆయుధాలను ప్రయోగించిందని ఆరోపించటం కాదు, అంతర్జాతీయ సంస్ధల ద్వారా దర్యాప్తు జరిపించాలి. దాని గురించి ఐక్యరాజ్యసమితిలో చర్చ జరపాలి. ఏ చర్య తీసుకున్నా దాని అనుమతితో, పర్యవేక్షణలో జరపాలి తప్ప అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ నేతలు ముగ్గురూ కూర్చొని సిరియాపై దాడులు చేయటానికి వారెవరు?

Image result for syria attack

సిరియా వద్ద వున్న రసాయనిక ఆయుధాల సామర్ధ్యాన్ని దెబ్బతీసే పేరుతో జరిపిన ఈ దాడులు ప్రపంచాన్ని భయపెట్టేందుకు తప్ప మరొకందుకు కాదు. నిజంగా ఎవరైనా రసాయనిక ఆయుధాలను తయారు చేస్తుంటే గత నాలుగైదు సంవత్సరాలుగా దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికా ప్రకటనల తరువాత కూడా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటారా? వర్తమాన పరిస్ధితుల్లో ఏ దేశానికాదేశం తన రక్షణ కోసం అన్ని రకాల ఆయుధాల తయారీకి పూనుకోవటం బహిరంగ రహస్యం. వాటిలో ఒకటైన జీవ, రసాయన ఆయుధాల్లేని పెద్ద దేశాలేవీ లేవు. కొన్ని బహిర్గతమైతే కొన్ని రహస్యంగా చేస్తుంటాయంతే తేడా. గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం సిరియా 1300 టన్నుల రసాయన ఆయుధాలను నాశనం చేసింది. అయినా సరే దాని దగ్గర ఇంకా ఎక్కడో వున్నాయన్నది పశ్చిమ దేశాల ఆరోపణ. ఐక్యరాజ్యసమితిలోని రసాయనాయుధాల నిషేధ సంస్ధ(ఒపిసిడబ్ల్యు) సిరియా రసాయన ఆయుధాలను ధ్వంసం చేసినందుకు గాను 2013లో నోబెల్‌ శాంతి బహుమతి కూడా పొందింది. మరుసటి ఏడాది సెప్టెంబరు నాటికి 96శాతం ఆయుధాలను నాశనం చేసినందున, తయారీ కేంద్రాల విధ్వంసానికి నిర్ణయించిందని , 2016జనవరిలో మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు ఆ సంస్ధ ప్రకటించింది. నిజానికి అవన్నీ 1970దశకం నుంచి రూపొందించినవి. అలాంటపుడు తిరిగి ఏడాది కూడా గడవక ముందే సిరియా వద్ద రసాయనిక ఆయుధాలు గుట్టలు పడ్డాయని పశ్చిమ దేశాలు ప్రకటించాయంటే ఆధారం ఏమిటి? ప్రతి దేశంలోనూ పారిశ్రామిక అవసరాల కోసం వుపయోగించే క్లోరీన్‌ గాస్‌ను రసాయనికాయుధాల తయారీకి కూడా వుపయోగించవచ్చు. దీనిని చూపే సిరియాపై పశ్చిమ దేశాలు ఆరోపణలకు దిగాయి. తరువాత ఓపిసిడబ్ల్యు, ఐరోసా సంయుక్త దర్యాప్తు వ్యవస్ధను(జిమ్‌) ఏర్పాటు చేశాయి. ఆ జిమ్‌ కొత్తగా సిరియా రసాయనికాయుధాల గురించి ఒక నివేదిక సమర్పించింది. అది అమెరికా అనుకూల తొత్తు నివేదిక అని రష్యా గుర్తించేందుకు నిరాకరిస్తోంది. దాని ఆధారంగా ఎలాంటి చర్య తీసుకోకూడదని రష్యా ఐరాసలో వీటో చేసింది. అందువలన అమెరికా నాయకత్వంలోని కూటమి ఇప్పుడు ఏకపక్షంగా దాడులు చేసింది. ఆనక తీరికగా దర్యాప్తు అంటూ కబుర్లు చెబుతోంది.

అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ చెప్పినదాని ప్రకారం 105 దీర్ఘకాలిక శ్రేణి క్షిపణులను ప్రయోగించిన పెద్ద దాడి ఇది, ఒక్కసారికే ఇది పరిమితం అని చెప్పినప్పటికీ ప్రపంచ స్పందనను చూసేందుకు చేసిన ఒక ప్రయోగమని చెప్పవచ్చు. తన నూతన, నవీకరించిన ఆయుధాలు ఎలా పని చేస్తాయో పరీక్షించేందుకు గతంలో ఇరాక్‌ మొత్తాన్ని తన యుద్ద ప్రయోగశాలగా మార్చింది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. కొద్ది రోజుల క్రితం డోనాల్డ్‌ ట్రంప్‌ రష్యాను బెదిరిస్తూ చేసిన ఒక ట్వీట్‌లో కొత్తవి, చక్కని, చిన్నవైన క్షిపణులు వస్తున్నాయి కాచుకోండి అని పేర్కొన్నారు. సిరియా రాజధాని డమాస్కస్‌లోని జీవ, రసాయన ఆయుధాల రూపకల్పన, తయారీ, పరీక్షా కేంద్రం మీద, హామ్‌ అనే పట్టణంలోని రసాయనిక ఆయుధాల గోడవున్‌ మీద, మూడవ దాడి దానికి సమీపంలోనే వున్న ఒక బంకర్‌ మీద క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికన్లు చెబుతున్నారు. అమెరికన్లు చెబుతున్నదే వాస్తవమైతే ఆయుధ గోడవున్లపై బాంబులు వేస్తే అవి పేలి ఈ పాటికి ఎంతో ప్రాణ నష్టం జరిగి వుండాల్సింది. అలాంటి వార్తలేవీ రాలేదు కనుక సిరియా ప్రకటించినట్లు దాని వైమానిక సైనిక కేంద్రాలు, విమానాశ్రయాల మీద మాత్రమే దాడులు జరిగాయని అనుకోవాల్సి వస్తుంది.మరోవైపున ప్రయోగించిన 103లో 71క్షిపణులను సిరియా వైమానిక రక్షణ వ్యవస్ధలు కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. రష్యా వద్ద వున్న అధునాతన క్షిపణి విధ్వంసక వ్యవస్ధలు సిరియాలో ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి.

సిరియా ప్రభుత్వం రసాయనిక ఆయుధాలతో దాడులు జరుపుతోందంటూ ఒక పధకం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ దేశాల మీడియా ప్రచారం చేస్తోంది. అలాంటి దాడులు జరిపింది సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు పశ్చిమ దేశాల సాయంతో దాడులు చేస్తున్న కిరాయి ఐఎస్‌ తీవ్రవాదులు తప్ప మరొకరు కాదని గతంలోనే వెల్లడైంది. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే చివరికది నిజమై కూర్చుంటుందన్న నాజీ గోబెల్స్‌ సిద్ధాంతం ప్రకారం సిరియాపై రసాయనిక ఆయుధాల ప్రయోగ ప్రచారం జరుగుతోంది. 2003లో బుష్‌ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇరాక్‌పై దాడులు చేసేందుకు చేసిన ప్రచారాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ ప్రత్యర్ధి దేశాలపై దాడులు చేసేందుకు మారణాయుధాలను గుట్టలుగా పోగేశాడంటూ పెద్ద ఎత్తున చేసిన ప్రచారాన్ని, ప్రభుత్వాన్ని కూల్చివేసి, అక్కడి చమురుబావులను స్వాధీనం చేసుకొని, సద్దాంను వురితీసిన తరువాత అలాంటి ఆయుధాలేమీ కనపడలేదని పశ్చిమ దేశాలే ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.

ఆసియా,ఐరోపా, ఆఫ్రికా ఖండాల సంగమ ప్రాంతం వంటి మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా మిలిటరీ రీత్యా వ్యూహాత్మకం, చమురువంటి సహజ సంపదల నిలయమైన ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకొనేందుకు చరిత్రలో ప్రతి సామ్రాజ్యవాదీ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రపంచాన్ని తన గుప్పిటలో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా ఆలోచన నిరంతరం దీని చుట్టూతిరుగుతూనే వుంటుంది. అందుకు గాను గోతికాడ నక్కలా అవకాశాల కోసం వేచి చూస్తుంటుంది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ప్రాంత దేశాల పాలకులపై పెల్లుబికిన అసంతృప్తితో 2010లో ట్యునీసియాలో ప్రారంభమై మధ్య ప్రాచ్యం, వుత్తర ఆఫ్రికాలోని పలు దేశాలకు విస్తరించిన ఆందోళనలను అరబ్‌ వసంతోదయంగా వర్ణించారు. ఆ సమయంలో పనిలో పనిగా అమెరికన్లు తమ అజెండాల్లో వున్న దేశాలలోని పాలకులను తొలగించేందుకు తమ తొత్తులు ఏజంట్లను ప్రయోగించి అక్కడ కూడా తిరుగుబాట్లు ప్రారంభమైనట్లు ఒక పెద్దకుట్రకు తెరతీశారు. దానిలో ఒకటి సిరియా. గోడల మీద ప్రభుత్వవ్యతిరేక నినాదాలు రాసిన విద్యార్దులను అరెస్టు చేసిందనే పేరుతో 2011 మార్చినెలలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు తెరతీశారు.తొలుత అంతర్గత తిరుగుబాటుగా మీడియా చిత్రించింది. కొద్ది నెలల్లోనే వివిధ దేశాల నుంచి ఐఎస్‌ తీవ్రవాదులు, కిరాయి మూకలను సమీకరించి పశ్చిమ దేశాలు అడుతున్న నాటకంగా వెల్లడైంది. ప్రతిగా వారిని అణచివేసేందుకు సిరియా సర్కార్‌ పూనుకుంది. తాము కూడా ఐఎస్‌ తీవ్రవాదులను అణచివేసేందుకు సిద్ధమే, సిరియాకు సాయం చేస్తామంటూ సరికొత్త నాటాకానికి తెరతీసిన పశ్చిమ దేశాలు త్వరలోనే అక్కడి అసాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసే సత్తా ఐఎస్‌ తీవ్రవాదులకు లేదని గ్రహించించాయి. తీవ్రవాదులకు ఆయుధాలు ఇచ్చింది కూడా వారేనని తేలింది. అప్పటి నుంచి తీవ్రవాదుల పట్టులో వున్న ప్రాంతాలను స్వాధీనం చేసుకొనేందుకు రసాయనికి ఆయుధాలను ప్రయోగిస్తోందంటూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. నిజానికి వాటిని ప్రయోగించింది తిరుగుబాటుదారులే అని తేలింది.

2012 ఆగస్టు 20న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక ప్రకటన చేస్తూ సిరియా సర్కార్‌ రసాయన ఆయుధాలను గనుక ప్రయోగిస్తే అమెరికా గీచిన ఎర్ర(హెచ్చరిక అనే బెదిరింపు) గీతను దాటినట్లుగానే భావించాల్సి వుంటుందని బెదిరించాడు.2014లో ఒబామా సిరియా మీద దాడులు చేయించాడు. అయితే ఐఎస్‌,ఆల్‌ఖైదా వుగ్రవాదుల మీద దాడి అంటూనే సిరియా సామర్ధాన్ని దెబ్బతీసేందుకు పెద్ద ప్రయత్నం చేసి బక్కబోర్లాపడ్డాడు. అప్పటి వరకు అంతర్జాతీయ వేదికల మీద రాజకీయ మద్దతు మాత్రమే తెలుపుతున్న రష్యా ప్రత్యక్షంగా 2015 సెప్టెంబరు నుంచి తన మిలిటరీ నిపుణులు, సామగ్రిని సిరియాకు తరలించి తిరుగుబాటుదార్లను అణచేందుకు తోడ్పడుతోంది. అప్పటి నుంచి సిరియాపై దాడులకు పెంటగన్‌ ఎదురు చూస్తోంది. అదే ఏడాది నవంబరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎన్నికైతే ఐఎస్‌పై దాడులకు సిరియాకు పదాతి దళాలను కూడా పంపేందుకు వెనుకాడను అని ప్రకటించాడు. ఎన్నిక తరువాత తిరిగి అదే ప్రకటన చేస్తూ రష్యాతో పోరును కూడా మనం ముగించాల్సి వుంది అని సిరియా అధ్య క్షుడు అసద్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించాడు. గతేడాది ఏప్రిల్‌లో అమెరికా 59 తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను సిరియాపై ప్రయోగిచింది. సిరియాను ఆక్రమించేందుకు అమెరికన్లు చేస్తున్న తప్పుడు ప్రచారం దాని బలహీనతలనే బయటపెడుతున్నది. నిజంగానే అసాద్‌ ప్రభుత్వం వద్ద రసాయన ఆయుధాలు వుంటే, ఇటీవల కూడా ప్రయోగించినట్లు అమెరికా చెప్పటం అంటే నాలుగు సంవత్సరాలలో జరిపిన మూడు దాడులు ఎలాంటి ప్రభావం చూపలేదన్నది స్పష్టం. అయితే తాజాగా మూడోసారి ఎందుకు జరిపినట్లు అన్నది ప్రశ్న. బ్రిటీష్‌ రక్షణ మంత్రి గవిన్‌ విలియమ్స్‌న్‌ బిబిసితో మాట్లాడుతూ తాము చేసిన దాడి అక్కడి అంతరుద్ద్యంలో జోక్యం లేదా పాలకుల మార్పు కోసం చేసింది కాదు, ఇది ఆప్రాంతంలో వుద్రిక్తతలు మరింతగా పెరగకుండా తీసుకున్న పరిమిత, లక్షిత దాడి అన్నారు. తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డికోసమన్న సమాధానమిది. ఈనెల ఏడవ తేదీన సిరియా మిలిటరీ ప్రయోగించిన క్లోరీన్‌, ఇతర గుర్తు తెలియని గ్యాస్‌ వల్ల అనేక మంది పౌరులు మరణించారన్న కట్టుకథను ఆధారం చేసుకొని పదమూడవ తేదీన దాడి జరిపారు. ముందే చెప్పుకున్నట్లు అమెరికాలో ఆయుధాలను తయారు చేసేది ప్రయివేటు సంస్ధలు. ఇప్పుడు ప్రయోగిస్తున్న తోమహాక్‌ క్షిపణులను రేథియాన్‌ అనే కాంట్రాక్టరు. అంటే వాడికి పని ఇవ్వాలనే ఒప్పందం వుంది గనుక ఏదో ఒక సాకుతో ఎక్కడో ఒకచోట వాటిని ప్రయోగించాలి. ఈక్షిపణికి అమర్చన బాంబు పేలబోయే ముందు గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి నిర్దేశిత లక్ష్యంపై బాంబు వేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా ఈ రకం క్షిపణులను వినియోగిస్తున్నప్పటికీ నవీకరించిన తరువాత తొలిసారిగా 900కిలోల బాంబును తాజాదాడిలో దానికి అమర్చి ప్రయోగించారు. అయితే ఇవి ఎంత మేరకు నష్టం చేకూర్చుతున్నాయనేది సందేహమే. గతేడాది సిరియా వైమానిక స్ధావరంపై చేసిన దాడిలో అనేక విమానాలు, రన్‌వే ధ్వంసమైనట్లు అమెరికన్లు వీడియోలద్వారా ప్రపంచానికి చూపారు. అయితే మరుసటి రోజు నుంచే ఆ రన్‌వేను వుపయోగిస్తున్నట్లు బయటపడింది. అంటే అవి నకిలీ వీడియోలన్నది స్పష్టం. తాజా దాడులలో 71క్షిపణులను మధ్యలోనే కూల్చివేసినట్లు రష్యా చెబుతోంది. కొందరు నిపుణుల వాదనల ప్ర కారం ఖండాంతర క్షిపణుల కంటే అమెరికా ఇప్పుడు ప్రయోగించిన క్రూయిజ్‌ క్షిపణులు చాలా తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి కనుక మధ్యలోనే వాటిని కూల్చివేయటానికి అవకాశాలను కాదనలేము. వాటిని కూల్చివేయగల రష్యా ఎస్‌-400 వ్యవస్ధలున్నాయనే అనుమానం వుంటే వాటి పరిధిలోకి పైలట్లతో కూడిన విమానాలను దాడులకు పంపేందుకు అమెరికా దాని మిత్రపక్షాలు భయపడతాయి. ఈ దాడులను రష్యా, చైనాలు ఖండించాయి. ఈ దాడి జరగటం తమ నాయకుడు పుతిన్‌కు అవమానకరం అని రష్యా దౌత్యవేత్తలు వ్యాఖ్యానించినట్లు నిర్ధారణకాని వార్తలు వెల్లడించాయి. ఇవి పుతిన్‌ను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు ప్రచారంలో పెట్టినవి కూడా కావచ్చు.