Tags

, , ,

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా తీరుతెన్నులపై మీడియాతో మాట్లాడిన నలుగురు సుప్రీం న్యాయమూర్తులు

ఎం కోటేశ్వరరావు

ప్రధాన కార్మదర్శి, నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ (ఎన్‌ఏజె)

ఒక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసిస్తూ లేదా తొలగించాలని కోరుతూ నిబంధనల ప్రకారం ఒక తీర్మానం లేదా పిటీషన్‌ అందచేయటం స్వతంత్రభారత చరిత్రలో తొలిసారిగా జరిగింది. ఇదే సమయంలో ఈ ప్రక్రియకు సంబంధించి వార్తలు ప్రచురించకుండా మీడియాను ఆదేశించాలని ఒక స్వచ్చంద పేరుతో సుప్రీం కోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు కావటం కూడా తొలిసారే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇలాంటి పిటీషన్‌ అందచేయటం తొలిసారే అయినప్పటికీ గతంలో ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి వి.రామస్వామిపై మొదటిసారి ఒక తీర్మానం అందచేయటం, దానిపై పార్లమెంటు చర్చించటం చరిత్రలో తొలిసారి. దీపక్‌ మిశ్రాపై పిటీషన్‌ రాజకీయ కుట్రలో భాగమే అని, జస్టిస్‌లోయా సహజమరణం చెందారన్న తీర్పు ఇచ్చిన కారణంగానే ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాపై తీర్మానం అందచేశారని న్యాయశాఖ మంత్రి అరుణ్‌ జెట్లీ అన్యాయమైన ఆరోపణ చేశారు. దీపక్‌ మిశ్రాపై తీర్మానానికి లోయా మరణంపై తీర్పుకు సంబంధం లేదు. జనవరి మూడవ వారంలోనే సిపిఎం నేత సీతారాం ఏచూరి తీర్మానం గురించి ఇతర పార్టీలతో సంప్రదిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసినదే. అందువలన దీపక్‌ మిశ్రాను సమర్ధించేందుకు అధికారపక్షం ముందుగానే నిర్ణయించుకున్నట్లు వేరే చెప్పనవసరం లేదు.

అభిశంసన విషయమై మీడియాను కట్టడి చేయాలని సూచన చేస్తూ లా కమిషన్‌ ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చిందని, అభిశంసన ప్రక్రియపై రాయకుండా కట్టడి చేసే అంశం రాజ్యాంగంలో కూడా వుందని, అలా రాయటం వలన న్యాయమూర్తుల విధుల నిర్వహణపై ప్రభావం పడుతుందంటూ పిటీషన్‌ దాఖలు చేసిన స్వచ్చంద సంస్ధతరఫు న్యాయవాది వాదించారు. ఈ అంశంపై రాజకీయ నాయకులు కొంతకాలంగా మాట్లాడుతున్నారని, మీడియా వాటిని నివేదిస్తున్నదని న్యాయమూర్తులు భయపడకుండా తమ విధులు నిర్వర్తించాలంటే మీడియాను కట్టడి చేయాలని కూడా కోరారు.పార్లమెంట్‌ ముందు ఎలాంటి పిటీషన్‌ లేకుండానే రాజకీయ నేతలు ఒక న్యాయమూర్తి తొలగింపు గురించి అన్ని రకాల ప్రకటనలు చేస్తున్నారని, అలాంటి చర్చలు సంబంధిత న్యాయమూర్తి పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని, అందువలన అలాంటి ప్ర కటనలు చేయకుండా వాటిని మీడియా ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎన్‌జీఓ సంస్ధ న్యాయవాది పేర్కొన్నారు.అయితే అటార్నీ జనరల్‌ ఏమి చెపుతారో వినకుండా తామేమీ నిర్ణయించలేమని పేర్కొన్న బెంచ్‌ కేసును మే 7వ తేదీకి వాయిదా వేసింది. ప్రతిపక్ష సభ్యులు గత శుక్రవారం నాడు అందచేసిన తీర్మానంపై తగినంత కసరత్తు లేకుండా రాజ్యసభ అధ్యక్షుడు, వుపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయకుడు సోమవారం నాడు తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించటంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. తీర్మాన తిరస్కరణను సుప్రీం కోర్టులోనే సవాలు చేస్తామని ప్రకటించటంతో ఒక వేళ నిజంగానే పిటీషన్‌ దాఖలైతే దాని విచారణ ఎవరితో కూడిన బెంచ్‌కు అప్పగిస్తారు అన్నది ఆసక్తికరం. ఏ కేసును ఎవరు విచారించాలన్నది ప్రధాన న్యాయమూర్తి విచక్షణే అనటాన్ని కొందరు సీనియర్‌ న్యాయమూర్తులు సవాలు చేసిన పూర్వరంగంలో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఏకంగా తన అభిశంసనపైనే వచ్చే పిటిషన్‌పై ఏం చేస్తారు అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

నిజంగా రాజ్యాంగంలో మీడియాను నియంత్రించాలనే స్పష్టమైన నిబంధన వుంటే లేదా లా కమిషన్‌ సూచనకు చట్టబద్దత వుంటే సుప్రీం కోర్టు ఈ పాటికి నిషేధం విధించి వుండేది. అది లేదు కనుకనే సుప్రీం కోర్టు బెంచి ఎలాంటి వుత్తరువు జారీ చేయకుండా అటార్నీ జనరల్‌ అంటే ప్రభుత్వ సాయం కోరింది. ప్రజాప్రతినిధులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని వ్యాఖ్యానించింది. అభిశంసన ప్రక్రియపై నివేదించకుండా లేదా వ్యాఖ్యానించకుండా చర్యతీసుకోవచ్చని అటార్నీ జనరల్‌ సూచిస్తే సమస్య ఏమిటన్నది ప్రశ్న. ఇప్పటికే కుహనా లేదా నకిలీ వార్తల సాకుతూ జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేసేందుకు సమాచార, ప్రసారశాఖ ప్రయత్నించి నిరసనతో వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశంపై కూడా జర్నలిస్టులు మౌనం దాల్చితే రేపు ఏం జరిగినా ఆశ్చర్యం లేదు.

నేడు దేశంలో ఏ వ్యవస్ధా విమర్శకు అతీతంగా లేదు. ఏకంగా నలుగు సుప్రీం కోర్టు న్యాయమూర్తులే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీరుతెన్నులను తప్పుపడుతూ మీడియాకు ఎక్కిన తరువాత మీడియాను కట్టడి చేయటమంటే అది మీడియా స్వేచ్చను అడ్డుకోవటం తప్ప వేరు కాదు. రాజ్యాంగంలో న్యాయమూర్తులను తొలగించేందుకు అవకాశం వున్నపుడు, అవసరమని భావించినపుడు ప్రజాప్రతినిధులు దానిని వుపయోగించుకోవటం, మీడియాలో చర్చ జరగటం ప్రజాస్వామిక లక్షణం తప్ప వేరు కాదు. అటార్నీ జనరల్‌ సలహా కోరటమంటే ఇతరుల భుజాలమీద నుంచి కాల్చేందుకు చేసే యత్నమని అనుకొనే అవకాశం లేదా ? రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే ఆర్టికల్‌ 124(4) ఆర్టికల్‌ 125(5) మేరకు పార్లమెంట్‌ వుభయ సభలలో హాజరైన సభ్యులలో మూడింట రెండువంతులకు తక్కువ కాకుండా తీర్మానం ఆమోదించినపుడు, అదే సమావేశాలలో అధ్యక్షుడికి అందచేసినపుడు తొలగిస్తూ వుత్తరువు జారీ చేసినపుడు అమలులోకి వస్తుంది.

మన దేశంలో మీడియా స్వేచ్చను అడ్డుకొనేందుకు ఏ అవకాశం దొరికినా ఎవరూ వదలటం లేదు. అదే సమయంలో పలు సందర్భాలలో కోర్టులు దానిని కాపాడేందుకు చేస్తున్న కృషిని కూడా మరువలేము. ప్రతి వ్యవస్ధ అధికారంతో ప్రభావితమౌతున్న పూర్వరంగంలో మీడియా స్వేచ్చ విషయంలో ఎవరు అతీతంగా వుండగలరన్న ఆందోళన వ్యక్తం కావటం సహజం. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జయంత్‌ షా వ్యాపారలాభం ఇబ్బడి ముబ్బడిగా పెరగటంపై వార్తను ప్రచురించిన ‘వైర్‌’ వెబ్‌సైట్‌పై పరువు నష్టం కేసుదాఖలు చేసిన విషయం తెలిసినదే. ఈ కేసు విచారణ సందర్భంగా మీడియాను వార్తలు ప్రచురించకుండా కట్టడి చేయాలని జయంత్‌ షా తరఫున్యాయవాదులు చేసిన వినతిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా తిరస్కరిస్తూనే మీడియాను తీవ్రంగా విమర్శించారు. ఆధారం లేని వార్తలు ప్రచురిస్తున్నప్పటికీ వాటిని కట్టడి చేస్తూ వుత్తరువు జారీ చేయటం లేదన్నారు. తన అభిప్రాయాలను కొందరు విమర్శిస్తారని, తన తీర్పులు పత్రికా స్వేచ్చ పరిమితులను కుదించాయనే విమర్శలకు వాటికి పెద్ద తేడాలేదన్నారు.’ ఏమి రాయటానికైనా వారికి స్వేచ్చ వుందా ? వారు రాసినవి కొన్ని సందర్భాలలో పూర్తిగా కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయి. బుర్రలోకి ఏది వచ్చినా దానిని రాయటం జర్నలిజం సంస్కృతి కాదని, వారికి కొన్ని స్వంత వెబ్‌సైట్లు వున్నంత మాత్రాన దేన్నిబడితే దానిని వారు ప్రచురించరాదని అన్నారు. 2015లో జస్టిస్‌ మిశ్రా చారిత్రకంగా గౌరవనీయులైన వ్యక్తులపై విమర్శల జోలికి పోకుండా వుండేందుకు ప్రయత్నించాలని, భావ ప్రకటనా స్వేచ్చ, వ్యక్తీకరణకు పరిమితులు వుండాలన్నారు. మరొక కేసులో 2016లో ఆయన నాయకత్వంలోని బెంచ్‌ క్రిమినల్‌ డిఫమేషన్‌ చట్టాన్ని సమర్ధిస్తూ భావ ప్ర కటనా స్వేచ్చ కంటే కీర్తి ప్రతిష్టలు వున్నతమైనవని వ్యాఖ్యా నించింది. సినిమా హాళ్లలో జాతీయగీతాన్ని విధిగా వినిపించాలని, ఆ సందర్భంగా మినహాయింపులున్నవారు తప్ప ప్రతి ఒక్కరూ విధిగా లేచి నిలబడాలని తీర్పు నిచ్చింది కూడా మిశ్రాయే అన్న విషయం తెలిసిందే. ఏడాది తరువాత ఆ వుత్తరువును వుపసంహరించుకున్న అంశమూ ఎరిగినదే.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాను అభిశంసిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన తీర్మానాన్ని వుపరాష్ట్రపతి, రాజ్యసభ వుపాధ్యక్షుడు ఎం వెంకయ్య నాయుడు సోమవారం నాడు త్రోసిపుచ్చారు. తీర్మానంపై సంతకాలు చేసిన వారు తమ వాదనలను సమర్ధించుకొనేందుకు తగినన్ని వాస్తవాలను అందించలేకపోయారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ విలేకర్లతో మాట్లాడుతూ వుపరాష్ట్రపతి నిర్ణయం చట్టవిరుద్దమని, అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించటంపై సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. దీనిని విచారణకు తీసుకోవాలా తిరస్కరించాలా అనే అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని తాము కోరుకుంటున్నామని, కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని సిబల్‌ చెప్పారు. వుపరాష్ట్రపతి ఇంత వేగంగా తీర్మానంపై నిర్ణయం తీసుకోవటాన్ని తప్పుపడుతూ అసలు ఆయనకు తీర్మాన మంచి చెడ్డలను నిర్ణయించే, తిరస్కరించే అధికారమే లేదని, ఇచ్చిన తీర్మానం సరిగ్గా వుందా లేదా తగినంత మంది సంతకాలు చేశారా లేదా చేసిన సంతకాలు నిజమైనవా కాదా అని మాత్రమే నిర్ణయించేందుకు పరిమితం కావాలని సిబల్‌ చెప్పారు.

స్వతంత్ర భారత చరిత్రలో ఇంత వరకు ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీదనే అభిశంసన తీర్మానం వచ్చింది. అది కూడా వీగిపోయింది. తాజాగా దీపక్‌ మిశ్రామీద వచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ వుపాధ్యక్షుడు తిరస్కరించటంతో కొత్త సమస్య తలెత్తింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామస్వామి పంజాబ్‌-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1987నవంబరు 12 నుంచి 1989 అక్టోబరు ఆరువరకు పని చేసి తరువాత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినపుడు ఆయన నివాసం పేరుతో చేసిన దుబారా ఖర్చుల గురించి 1990లో మీడియా రాసింది.1991 ఫిబ్రవరి ఒకటిన సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఒక తీర్మానం చేస్తూ ఆయనను తొలగించాలని, ఎలాంటి న్యాయపరమైన పని అప్పగించవద్దని నాటి ప్రధాన న్యాయమూర్తికి నివేదించింది. నాడు ప్రతిపక్షంలో వున్న బిజెపి, వామపక్ష పార్టీలు కలసి పార్లమెంట్‌కు ఒక అభిశంసన నోటీసు అందచేశాయి.లోక్‌సభ స్పీకర్‌ రబీరే నోటీసులోని ఆరోపణలపై విచారణకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి పిబి సావంత్‌, బోంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిడి దేశాయ్‌, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఓ చిన్నప్పరెడ్డితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రామస్వామిపై వచ్చిన 14లో 11ఆరోపణలు వాస్తవమే అని తేల్చారు. 1993 మే పదవ తేదీన లోక్‌సభ తీర్మానంపై చర్చ జరిపింది.ఓటింగ్‌ నిర్వహించగా అనుకూలంగా 196 ఓట్లు వచ్చాయి. వ్యతిరేక ఓట్లేమీ రాలేదుగానీ 205 మంది కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాల సభ్యులు ఓటింగ్‌కు గైరు హాజరు కావటంతో తగినన్ని ఓట్లు లేక వీగిపోయింది. దీపక్‌ మిశ్రాపై ఇచ్చిన తీర్మానంపై ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటి తీర్మానాలపై చర్చ జరగకుండా మీడియాను కట్టడి చేయాలా లేదా అనే అంశంపై అటార్నీ జనరల్‌ ఏ అభిప్రాయం చెబుతారు, సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, అది మీడియా స్వేచ్చపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనేది యావత్‌ జర్నలిస్టులకే కాదు, మొత్తం సమాజానికి సంబంధించి అంశం.