Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

మే డే అంటే ఎర్రజెండాల పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. ప్రపంచంలో కమ్యూనిస్టులు, పార్టీలు పుట్టక ముందే కార్మికులు, వారిని దోపిడీ చేసే వ్యవస్ధ వునికిలోకి వచ్చింది. ఒక్కసారి అవలోకిస్తే కార్మిక సమస్యల మీద మన దేశంలో స్పందించిందీ, వారిని సంఘటిత పరచేందుకు ముందుగా ప్రయత్నించింది కమ్యూ నిస్టులు కాదు. అసలు శాస్త్రీయ సోషలిజం భావన వునికిలోకి రాక ముందే అంటే 1848లో కమ్యూనిస్టు మానిఫెస్టో విడుదల కాక ముందు, కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం గాక ముందే ప్రపంచంలో కార్మిక చట్టాలు, ప్రాధమిక రూపంలో కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. మన దేశంలో తొలి జాతీయ కార్మిక సంఘాన్ని(ఏఐటియుసి) ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ నాయకులే. దాని తొలి అధ్యక్షుడు లాలా లజపతిరాయ్‌. తరువాతే కమ్యూనిస్టులు దానిలో చురుకుగా పనిచేసి, మిలిటెంట్‌ కార్మిక పోరాటాలను నిర్వహించారు గనుక తరువాత కమ్యూనిస్టులు నాయకత్వ స్ధానాలలోకి వచ్చారు. స్వాతంత్య్రం తరువాత రాజకీయ పార్టీలు తమ భావజాలానికి అనుగుణంగా జాతీయ కార్మిక సంఘాలను ఏర్పాటు చేశాయి.

ఎప్పుడైతే వస్తూత్పత్తి ప్రక్రియలో యంత్రాలను ప్రవేశపెట్టారో అప్పుడే వాటిపై పని చేసే పారిశ్రామిక కార్మికులు కూడా తయారయ్యారు. ఇది పారిశ్రామిక విప్లవ తొలి పర్యవసానం. దోపిడీ, అసమానతల వంటివి సరేసరి. మన వేదాల్లో అంతులేని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దాగుందని కాషాయ తాలిబాన్లు చెప్పగా వినటం తప్ప మనకు కనపడదు. నిజంగా అదే నిజమైతే పారిశ్రామిక విప్లవం భారత వుపఖండానికి బదులు ఐరోపాలో ఎందుకు ప్రారంభమైంది, పోనీ ఇప్పటికైనా వేద సాంకేతిక పరిజ్ఞానాన్ని బయటకు తీసి మేకిన్‌ ఇండియా పిలుపులో భాగంగా ఎందుకు వుత్పత్తి చేయరు, దిగుమతులను ఎందుకు ఆపరు అన్నది ఒక మౌలిక ప్రశ్న. దాని గురించి వేరే సందర్భంగా చర్చించుకుందాం. పారిశ్రామిక విప్లవం ఐరోపాలోనే జరిగినప్పటికీ దానితో ప్రభావితం గాని దేశం లేదు. మన దేశంలో సంభవించిన పర్యవసానాల గురించి 1853లో న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌ పత్రికలో కారల్‌ మార్క్స్‌రాసిన విశ్లేషణలో ఇలా వుంది.’ భారత చేనేత రంగంలో ప్రవేశించిన బ్రిటీష్‌ చొరబాటుదారుడు నేత ప్రక్రియనే నాశనం చేశాడు. ఐరోపా మార్కెట్లనుంచి భారత వస్త్రాలను బయటకు నెట్టటంతో ప్రారంభించి చివరకు హిందూస్తాన్‌లో తానే చేయితిప్పటాన్ని ప్రారంభించింది ఇంగ్లండు.నేత వస్త్రాలకు నిలయమైన దేశాన్ని తన వస్త్రాలతో ముంచివేసింది.1818-36 మధ్య గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి ఇండియాకు ఎగుమతులు 1:5,200 దామాషాలో పెరిగాయి.1824లో గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి భారత్‌కు కేవలం పది లక్షల గజాలలోపే ఎగుమతి జరగ్గా 1837నాటికి 6.40 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో ఢాకా పట్టణ జనాభా లక్షా 50వేల నుంచి ఇరవై వేలకు పడిపోయింది.ఒక నాడు తమ వస్త్రాలతో పండుగ చేసుకున్న మాదిరి కళకళలాడిన పట్టణాలు దిగజారటం దీని పర్యవసానమే. బ్రిటీష్‌ వారి ఆవిరిశక్తి, సైన్సు హిందూస్దాన్‌ అంతటా వ్యవసాయం-వుత్పాదక పరిశ్రమ మధ్య వున్న సంబంధాన్ని కూకటి వేళ్లతో పెకలించాయి.’

పారిశ్రామిక విప్లవంలో పెరిగిన వస్తూత్పత్తిని అమ్ముకొనేందుకు యజమానులు ఇతర దేశాల మార్కెట్ల వేట సాగిస్తే వారి యంత్రాలపై పని చేసే కార్మికులు దిగజారిన తమ బతుకులను బాగుచేసుకొనేందుకు బతుకుపోరు జరిపారు. పారిశ్రామికీకరణతో వుపాధి కోల్పోయిన చేనేత వృత్తిదారుల నుంచి బ్రిటన్‌లో తొలిసారిగా యాంత్రీకరణకు ప్రతిఘటన కూడా ప్రారంభమైంది. యజమానుల చర్యలు మార్కెట్లకోసం యుద్ధాలు, వలసలు, ప్రపంచీకరణ, అంతులేని దోపిడీకి దారితీశాయి. కార్మికుల బతుకుపోరు మేడే, సోషలిజం, కమ్యూనిజం వంటి దోపిడీలేని నూతన సమాజాల అన్వేషణకు పురికొల్పాయి. ప్రతి ఏడాది మే ఒకటవ తేదీ, దీన్నే అంతర్జాతీయ కార్మిక దినం అని కొన్ని చోట్ల కార్మికదినం అని పిలుస్తారు. కొంత మంది ఆ రోజును దినోత్సవంగా జరుపుతారు, మరి కొందరు దీక్షా దినంగా పాటిస్తారు. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే ఒకటవ తేదీని ఎలా జరపాలన్నది వారి చైతన్యానికి గీటురాయి. కనీస సౌకర్యాలు కూడా లేక చెమటలు కక్కుతూ శారీరక శ్రమను, అధునాతన భవనాలలోని ఎసి గదుల్లో ఆధునిక కంప్యూటర్లపై పని చేస్తూ మేధోశక్తిని అమ్ముకుంటూ ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని పని చేసే ఐటి ఇంజనీరు, కార్యాలయ బంట్రోతు, ప్రభుత్వ వుద్యోగి, కార్మికుడు, గుమస్తా ఇలా ఎవరైనా తెల్ల చొక్కా లేక యూనిఫాం వేసుకున్నా అందరూ కార్మికులే.

మన దేశ కార్మికవర్గ చరిత్రను చూసినపుడు రైల్వేకార్మికులు అగ్రగాములలో ముఖ్యులు. దాని అనుబంధ పరిశ్రమలతో పాటు బగ్గు, పత్తి,జనపనార పరిశ్రమలతో కార్మికులు విస్తరించారు. పారిశ్రామిక విప్లవం జరిగిన ఐరోపాలోగానీ, విస్తరించిన భారత్‌ వంటి దేశాలలోగానీ దుర్భరపరిస్ధితులు, దోపిడీలో ఎలాంటి తేడా లేదు. మన కార్మికవర్గం సామ్రాజ్యవాద పాలన కింద మగ్గటంతో పాటు అటు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులదోపిడీకీ గురైంది అయింది. అందువలన దోపిడీతో పాటు సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయపోరాటంలో కూడా భాగస్వామి అయింది. అందువలన జాతీయవాదులు, వుదారవాదులే తొలి కార్మికోద్యమ నిర్మాతలుగా వుండటం ఒక సహజపరిణామం. దీని ప్రభావం కార్మికవర్గ అవగాహనమీద కూడా పడింది. కొంత మంది కార్మిక సమస్యల కంటే వారిని సామ్రాజ్యవాద వ్యతిరేకులుగా మార్చటంపైనే కేంద్రీకరించారు. బ్రిటీష్‌ యజమానులు, భారత యజమానుల ఫ్యాక్టరీల పట్ల తేడా వుండాలని చెప్పారు. కార్మిక చట్టాలను గనుక అమలు జరిపితే భారతీయ యజమానుల ఆధ్వర్యంలోని ఫ్యాక్టరీలు పోటీని తట్టుకోలేవని భావించారు.ఈ కారణంగానే 1881,91లో తెచ్చిన ఫ్యాక్టరీ చట్టాలను కొందరు వ్యతిరేకించారు. వర్గ అవగాహనతో కార్మికులను విడదీయవద్దని చెప్పారు. దయాదాక్షిణ్యాలతో కార్మికుల ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచాలని చూశారు.

తొలిసారిగా 1870లో శశిపాద బెనర్జీ కార్మిక క్లబ్బు స్ధాపించి, భారత శ్రమజీవి అనే పత్రికను కూడా ఏర్పాటు చేశారు. సొరాబ్జీ షాపూర్జీ బెంగాలీ చొరవతో 1878లో కార్మికుల పని పరిస్ధితుల మెరుగుదలకు బంబాయి శాసన మండలి ఒక చట్టాన్ని ఆమోదించింది.1880లో నారాయణ్‌ మేఘాజీ లోఖాండే దీన బంధు అనే పత్రికతో పాటు బంబే మిల్‌ అండ్‌ మిల్‌హాండ్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు.1899లో ముంబైలో తొలి రైల్వే కార్మిక సమ్మె జరిగింది. దానికి బాలగంగాధర తిలక్‌ వంటి వారు తమ పత్రికల ద్వారా మద్దతు ప్రకటించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ధరలు విపరీతంగా పెరిగి కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తింది. అదే సమయంలో రష్యాలో తొలి శ్రామికరాజ్యం ఏర్పడి కార్మికవర్గాన్ని ఎంతగానో వుత్తేజపరచి వుద్యమాలకు పురికొల్పింది. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) కూడా ఏర్పడింది. ఈ పూర్వరంగంలో స్వాతంత్య్ర వుద్య మాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం జాతీయ స్ధాయిలో ప్రజాసంఘాలను నిర్మించటం అవసరమని భావించింది. దాని పర్యవసానమే 1920అక్టోబరు 31ఆలిండియా ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌(ఎఐటియుసి) ఏర్పాటు. ఆ తరువాతే పెద్ద ఎత్తున చెలరేగిన పోరాటాలను అణచివేసేందుకు, ఆంక్షలు విధించేందుకు వీలుగా 1926లో ట్రేడ్‌యూనియన్‌ తరువాత, ఇతర అనేక చట్టాలను తెచ్చారు. వాటన్నింటికి పరాకాష్టగా మీరట్‌, కాన్పూరు కుట్రకేసులను బనాయించి కమ్యూనిస్టులుగా అనుమానం వున్నవారందరినీ వాటిలో ఇరికించి విచారణ జరిపారు.

బ్రిటన్‌లో తొలిసారిగా 1802లో పారిశ్రామిక కార్మికుల చట్టాన్ని తెచ్చారు. ఫ్యాక్టరీల్లో పిల్లలతో ఎన్నిగంటలు, ఎలాంటి పని చేయించాలి, ఏ తరహా సంస్ధలలో ఎలాంటి పరిస్ధితులు వుండాలో దాన్లో పేర్కొన్నారు. ఎవరైనా ఈ చట్టాన్ని వుల్లంఘించితే రెండు నుంచి ఐదు పౌండ్ల జరిమానా విధించాలని కూడా పేర్కొన్నారు. తరువాత ఆ చట్టాన్ని 1819లో సవరించారు.1833లో ఫ్యాక్టరీల తనిఖీ వ్యవస్ధను ప్రవేశపెట్టారు. 1874లో బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీపాలన రద్దయి విక్టోరియా రాణి పాలన మొదలైంది. 1875లో కార్మికుల పని పరిస్ధితులపై అధ్యయనానికి ఒక కమిటీని వేసి దాని నివేదిక ఆధారంగా వంద అంతకంటే ఎక్కువ మంది పని చేసే ఫ్యాక్టరీలలో అమలు చేసే విధంగా 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టం వచ్చింది. అధ్యయన కమిటీ విషయం తెలిసిన కొందరు 1879డిసెంబరులో రఘబా సుఖరామ్‌ అనే కార్మికుడి నాయకత్వంలో సమావేశమై రాతపూర్వకంగా తమ స్ధితిగతులను వివరించారు. దానిపై 578 మంది సంతకాలు చేశారు. భారత కార్మికోద్యమ చరిత్రలో తొలి నేతగా సుఖరామ్‌ నమోదయ్యాడు. తొలి ఫ్యాక్టరీ చట్టంపై నాటి మీడియాలో కొన్ని సమర్ధించగా మరికొన్ని తీవ్రంగా విమర్శించాయి. బ్రిటీష్‌ పాలకులకు విన్నపాలు చేయటం ఏమిటి, మన పని మనం చేసుకుందాం అంటూ కొందరు జాతీయవాదులు పత్రికల్లో రాశారు. బాలగంగాధర తిలక్‌ 1881 మార్చి 13న తన మరాఠా పత్రికలో ఇండియా పాలన ఇండియా కొరకు గాక ఇంగ్లండు ప్రయోజనాలకొరకు జరుగుతోంది.మనది పరాజిత దేశం, ఒక పరాజిత దేశంగానే పరిపాలించబడతామని దేశీయులు తెలుసుకోవాలి’ అని రాశారు. మన దేశంలో పారిశ్రామికీకరణ పందొమ్మిదవ శతాబ్ది మధ్యలో ప్రారంభమైంది. అసోంలో 1839లో తొలి తేయాకు కంపెనీ, 1843లో బెంగాల్‌ బగ్గు కంపెనీ, 1854లో బంబాయిలో తొలి బట్టల మిల్లు, కొలకత్తాలో తొలి జూట్‌మిల్లు ప్రారంభమైంది. ఆ తరువాతే ముడి సరకుల రవాణాకు రైలు మార్గాలను వేశారు. 1890నాటికి వివిధ దేశాలలో పని చేసేందుకు బ్రిటీష్‌ పాలకులు పంపిన భారతీయ కార్మికుల సంఖ్య ఐదులక్షలు కాగా దేశంలో పారిశ్రామిక కార్మికులు సంఖ్య మూడులక్షలు మాత్రమే.

రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది.దాంతో చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో అప్పీలులో శిక్షలను ఖరారు చేశారు. 1987 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని ప్రతిపాదించి ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ఖరారు చేస్తూ ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది.

పందొమ్మిదవ శతాబ్ది, ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచ కార్మికవర్గానికి అనేక పాఠాలు నేర్పింది. దుర్భర పరిస్ధితుల నుంచి బయటపడేందుకు కార్మికవర్గం చేసిన పోరాటాల ఫలితమే సాధించుకున్న హక్కులు, చట్టాలు. తొలి చట్టాలు అమలులోకివచ్చి వందసంవత్సరాలు కూడా గడవక ముందే సంస్కరణల పేరుతో వాటికి చెల్లుచీటీ ఇవ్వటం ప్రారంభమైంది. ఫలితంగా నూటయాభై సంవత్సరాల నాటి దుర్భరపరిస్ధితులైన పన్నెండు గంటల పని, తక్కువ వేతనాలు, యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేయటం పునరావృతం అవుతున్నాయి. ఇదంతా స్వేచ్చావాణిజ్యం, ప్రపంచీకరణపేరుతో జరుగుతోంది. వీటినే నయా వుదారవాద విధానాలు అని కూడా అంటున్నారు. కొంత మంది వీటిని వూట సిద్ధాంతంగా వర్ణించారు. దాని ప్రకారం సరిహద్దులు, కరెన్సీ,మిలిటరీ, పోలీసు వంటి అంశాలు తప్ప మిగిలిన అన్నింటినీ ప్రయివేటు రంగాలకు అప్పచెబితే ఆ రంగం నుంచి వచ్చే ఫలితాలు వూట మాదిరి సమాజం అంతటికీ దిగుతాయి. గత మూడున్నర దశాబ్దాల ఈ విధానాల అమలులో వూట ఎలా దిగింది? కేంద్ర ప్రభుత్వ సమాచారం, గణాంకాల ప్రకారం 1980-81లో ఒక వస్తువు తయారీ లేదా సేవ విలువ(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌- జివిఏ)లో వేతనాలు, అలవెన్సులు తదితర రూపాలలో సగటున కార్మికులకు దక్కిన లబ్ది 44శాతం. అది 2012-13 నాటికి 23.6కు పడిపోయింది. ఇదే సమయంలో వడ్డీ చెల్లింపులు 19.8 నుంచి 13.7శాతానికి తగ్గాయి. మరి లాభాల వాటా 15.7 నుంచి 44.1శాతానికి పెరిగింది. 2012 జిడిపి ఆధారంగా గుణిస్తే మన దేశంలో ఒక శ్రామికుడు గంటలో చేసిన వుత్పత్తి విలువ రెండు వందల యాభై రూపాయలు అదే రోజుకు రెండువేలు. వివిధ పరిశ్రమలు, రంగాలలో వున్న కనీస వేతనాల మొత్తాలను చూస్తే కార్మికులు ఎంత దోపిడీకి గురవుతున్నారో చెప్పనవసరం లేదు. అ తక్కువ మొత్తాలను కూడా దశాబ్దాల తరబడి సవరించని ప్రభుత్వాలున్నాయి. ఇవి చట్టాలను నీరుగార్చటమే. అవసరాల మేరకు పెంపుదల సంగతిపక్కన పెడితే అసలు ఏదో ఒక సవరణ కోసం కూడా వుద్యమించాల్సిన రోజులివి. ఈ పూర్వరంగంలో కార్పొరేట్లకు మరింత లబ్ది చేకూర్చేందుకు సంస్కరణల పేరుతో కాంగ్రెస్‌ అమలు జరప ప్రయత్నించిన వాటిని బిజెపి ఆచరించేందుకు పూనుకుంది. ఇది అధికార దుర్వినియోగం కాదా ? దీన్నెవరు ప్రశ్నించాలి, కోర్టు పరిభాషలో చెప్పాలంటే ఈ పరిస్ధితిని ఎలా సరిచెయ్యాలి?

బిజెపి పాలిత రాజస్ధాన్‌ కార్మిక చట్టాల సవరణ ప్రయోగశాలగా తయారైంది.అక్కడి పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి తిరిగి పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన ఘనత బిజెపి ఖాతాలో చేరింది. ఇది దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది. యాంత్రీకరణ, రోబోల వినియోగం మరింతగా పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి సవరణలు చేయటం అంటే అత్యధిక ఫ్యాక్టరీలు, సంస్ధలను కార్మిక చట్టాల పరిధి నుంచి తొలగించటమే. అలాంటపుడు కనీసవేతనాలను సవరించినా వుపయోగం ఏముంది? ప్రభుత్వం యజమానులు ఏం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతిచ్చే చర్యలకు ముద్దుగా ‘సంస్కరణలు’ అని పేరు పెట్టింది.

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. ఇటువంటి పరిస్ధితిని అన్ని రాష్ట్రాలలో రుద్దాలని చూస్తున్నారు. లేదా వున్న చట్టాలను అమలు జరపకుండా వుపేక్షిస్తున్నారు. కార్మికవర్గానికి ఇదొక సవాల్‌.

ప్రపంచవ్యాపితంగా ధనిక దేశాలన్నింటా అప్రెంటిస్‌షిప్‌(నైపుణ్య శిక్షణ) పేరుతో పెద్ద ఎత్తున పర్మనెంటు కార్మికుల స్ధానంలో కార్మిక చట్టాల పరిధిలో లేని కార్మికులను నియమిస్తున్నారు. వారికి తక్కువ వేతనాలు, అలవెన్సులు చెల్లించేందుకు ఇదొక దొంగదారి అన్నది తెలిసిందే. మన దేశంలో కూడా అప్రెంటిస్‌షిప్‌ చట్టాన్ని సవరించి శిక్షణలో వున్న వారు చేయకూడని పనులను కూడా వారితో చేయించేందుకు, పెద్ద ఎత్తున నియామకానికి తెరతీశారు. శిక్షణా కాలంలో అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించేవిధంగా పధకాలు సిద్దం చేశారు. ఇది యజమానులకు మరొక అదనపు రాయితీ.

ే మన సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్న మనువాదుల దృష్టిలో మేడే పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. నిజమే ! మనం చెప్పుకుంటున్న ప్రజాస్వామిక వ్యవస్ధ, భావజాలం సైతం పశ్చిమ దేశాల నుంచి అనుకరించింది కాదేమిటి? అంతెందుకు మన నిత్య జీవితంలో ఇతర దేశాల నుంచి అనుకరిస్తున్నవి, వినియోగిస్తున్నవి ఎన్ని వున్నాయో ఎవరికి వారు ఆలోచించుకోండి. ప్రపంచ మానవుడు ఎక్కడ మంచి వుంటే దాన్ని, ఎవరు జీవనాన్ని సుఖమయం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తే దానిని స్వంతం చేసుకోలేదా ? ఒక దేశం నుంచి ఖండం నుంచి మన దేశం ప్రపంచానికి నాగరికత అంటే ఏమిటో నేర్పిందని కొంత మంది చెబుతారు. మన దాన్ని ఇతరులు అనుసరించినపుడు మే డే వంటి వాటిని దాని వెనుక వున్న పురోగామి భావజాలాన్ని విదేశీ అంటూ మనకు పనికి రాదని పక్కన పెట్టమంటున్నారంటే అర్ధం ఏమిటి? ఏ పదజాలం వెనుక ఏ అర్ధం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే వుంటారని మార్క్సిజాన్ని తొలిసారిగా తమ దేశానికి అన్వయించి తొలి శ్రామికవర్గ రాజ్య స్ధాపనకు నాయకత్వం వహించిన లెనిన్‌ చేసిన హెచ్చరికను తీసుకోవటానికి ఆయన విదేశీయత అడ్డం వస్తుందా ?