Tags

, ,

ఎం కోటేశ్వరరావు

వేదాల్లోనే అన్నీ వున్నాయష అని ముందుగా ఏ మహానుభావుడు సెలవిచ్చాడో నాకైతే వివరాలు దొరకలేదు గానీ తెలుగు జాతి నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు తన మహత్తర రచన కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లతో వేదాల్లోనే అన్నీ వున్నాయష అనిపించి దాన్ని గ్రంధస్ధం చేశారు. అది నిజమే అంటూ నేడు వున్నత చదువులు చదివిన వారెందరో అతని కంటే ఘనులు అన్నట్లు ఆధునిక అగ్నిహోత్రావధానులుగా తయారయ్యారు. శనివారం నాడు మధ్య ప్రదేశ్‌లోని వుజ్జయిని పట్టణంలో జరిగిన గురుకుల సంస్ధల సమావేశంలో గురుకుల వ్యవస్ధను పునరుద్ధరించాలని, వాటికి తగిన విధంగా బోధనాంశాలను మార్చాలని, సైన్సు మరింత ముందుకు పోవాలంటే వేదాలను కూడా అధ్యయనం చేయవలసిన అవసరం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ సూచించారు. తల మీద ఒకవైపు పిలక, మరొక వైపు ఆధునిక క్రాఫ్‌ చేయించుకోవాలన్నట్లుగా వుంది. కుర్రకారు తేల్చుకోవాలి. గురుకుల, ఆధునిక విద్యలను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ సెలవిచ్చారు. ఇప్పటికే ఆవు పేడ, మూత్రంలో ఏముందో చూడాలంటూ శాస్త్రవేత్తలను వాటిలో ముంచేందుకు పూనుకున్నారు. ఇలాంటి తిరోగామి శక్తులను ఇంకా అధికారంలో కొనసాగనిస్తే ఎలాంటి విపరీత ప్రయోగాలు చేయటానికైనా వెనుదీయరు. తస్మాత్‌ జాగ్రత్త.

వేదాలను బట్టీయం వేసి ఘనపాఠీలు, చదివిన వారు పండితులయ్యారు తప్ప ఒక్కరూ శాస్త్రవేత్త ఎందుకు కాలేదో మోహన్‌ భగవత్‌ చెబుతారా అని ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో ఒక చర్చను ప్రతిపాదించాను. ఒక గ్రూపులో భారతీయ సంప్రదాయాలను కాపాడుతున్నామని నిజంగా నమ్ముతున్న భగవత్‌ అభిమానులంతా పచ్చిబూతులతో ప్రతిస్పందించటం చూసి భరతమాతా చివరకు నీకు ఎంత దుర్గతి పట్టింది ఇలాంటి నీ బిడ్డలను సరిదిద్దుకుంటావో, లేక బూతులు తప్ప మరొకటిరాని ఈ సంతును ఇలాగే వదలి వేస్తావో నువ్వే నిర్ణయించుకోవాలమ్మా అని చెప్పాను. వదిలేస్తే తరువాత బూతులు నీవంతే నమ్మా అని కూడా చెప్పాను. (అదేమిటి నీకు భరత మాత కనిపించిందా అని కొందరు నన్నడిగినపుడు మిగతా వారికి నిత్యం ప్రత్యక్షం అవుతున్నపుడు నాకు అప్పుడపుడన్నా కనపడదా అని జవాబిచ్చాననుకోండి. ) చర్చలో వెల్లడైన అభిప్రాయాలను చూస్తే గుడ్డి అనుసరణ, నమ్మకం తప్ప ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎవరు అనే ప్రశ్నలను వారు తమ దగ్గరకు రానివ్వరని తేలింది. నిజంగా వారిని చూస్తే జాలేసింది, ఎంతైనా వారు కూడా మనుషుల్లానే వున్నారు కదా అనిపించింది. అదే సమయంలో వారి బూతులు గుర్తుకు తెచ్చుకుంటే జాలి స్ధానంలో ఆగ్రహం కలిగింది. బూతులను ప్రస్తావించటం సంస్కారంకాదు కనుక అలాంటి పోస్టులను, వాటిలోని బూతులను మినహాయించి సారాంశం ఇస్తున్నాను.

వేదాల రిసెర్చే ఘనాపాఠీ అంటే, శాస్త్రవేత్త అంటెనే ఘనాపాఠీ, ఎందుకు కావాలి ఎవరి మార్గం వారిది, మీరెందుకు కాలేదు శాస్త్రవేత్తగా, ఆ వేదాలను ఆ పండిత పామరులను రీసెర్చ్‌ చేసినవారు శాస్త్రజ్ఞులు అయ్యారు, అట్లా బట్టీ పట్టక పోతే మీలాంటి వారు వాటిని ఎప్పుడో అంతం చేసేసి ఉండేవారు. ఇప్పటికైనా ఏదైనా కొద్దిగా ఉందీ అంటే అది బట్టీ కొట్టడం వలననే. ఆ స్వరాలు లో కొద్దిగా మార్పు వచ్చినా అర్థం మారిపోతుంది. అది బట్టీ కొట్టేది అందుకే, మొత్తం ప్రపంచానికి అందించిందే హిందువులు. టెక్నాలజీని అప్పుడు హిరణ్యకశిపుడు దొంగలించాడు. ఇప్పుడు ఈ హిరణ్యకసిపుళ్ళు దొంగిలించారు అందుకే వాళ్ళను రాక్షసులూ అంటారు, ఇప్పటికి వాళ్ళు కొన్నిటిని తెలుసుకోలేకఉన్నారు తెలుకోలేరు హిందువులు వాళ్లకు తెలనివ్వరు ఎందుకంటే ప్రక తి ని నాశనము చేవాళ్లకు ఇవ్వకూడదు సమయం వచ్చినప్పుడు వాటిని ఎలా ప్రయోగించాలో అపుడు ప్రయోగించడం జరుగుతుంది చివరిగా ఒక్కవిషయం ఏఏ దేశాలు అయితే మనదేశానికి వచ్చాయో ఇపుడు ఆదేశాలు నెంబర్‌ 1 స్తానం లో ఉన్నాయి స్వామి వివేకానంద, ఎంతో మంది మేధావులు,, శాస్త్రవేత్తలు జన్మించిన దేశం ,భారతదేశం.. నీకు తెలవదు,ఎందుకంటే నీకు మెదడు లేదు..ఓసారి చరిత్ర చూడు, భారతదేశం అనగానే ఒక సంస్క తీ, సంప్రదాయాలు, ఆచారాలు, ఆద్యాత్మిక భావాలు కలిగిన దేశంగా ప్రపంచం చూస్తుంది. విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం అంతగాలేని దేశంగా చూస్తారు, ప్రపంచమే కాదు మనదేశ ప్రజలకు కూడా తెలియదు. ఐతే ఈ మధ్య కాలాలలో ప్రపంచం కూడా ప్రాచీన భారతదేశం గొప్ప విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం ఉందని మనదేశ ప్రజలు, విదేశీయులు గుర్తిస్తున్నారు. భారతదేశంలో ఎన్నో ప్రాచీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాటిలో ఎంతోమంది దేశ విదేశీయులు విధ్యనభ్యసించేవారు. అవన్నీ ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయాయి. భారతదేశం అనగానే ఒక సంస్క తీ, సంప్రదాయాలు, ఆచారాలు, ఆద్యాత్మిక భావాలు ప్రాచీన భారతదేశ విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం వాటిలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వారు ఏకాలనికి చెందిన వారు అనే విషయం అంతగా లేదు అది తెలుసుకోవడం ఎంతో అవసరం. 1 శుశ్రుత క్రీ.పూ 600 వైద్య శాస్త్రం, 2 చరక క్రీ.పూ 300 వైద్య శాస్త్రం.

3. బౌదాయన్‌ క్రీ.పూ 8-7 గణిత శాస్త్ర వేత్త.4 కన్నడ (ఆళుక్యుడు) క్రీ.పూ 8-7 ఖగోళ మరియి గణిత శాస్త్రవేత్త. 5. నాగార్జున క్రీ.శ 150-250 ఖనిజ శాస్త్రవేత్త.

ఇంతవరకూ సైన్సు వేదం లో తెలిపిన దానిలో 10% కూడా కనుక్కోలేదు. అక్షర సత్యం, సున్నా 0 లేకపోతే కంప్యూటరైజేషన్‌ అనేది ఉంది ఉండేది కాదని తెలుసుగా, హిందువుల మీద ఏడ్చి ఏడ్చి ఏప్పుడో పోయేట్టున్నావు లే, నువ్వు నమ్మే నీ దొంగ మతం..పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వెంట్రుకతో సమానం..

ఇంకా వేదాలు పండితులు అవసరం లేదు, అంతేలే అన్యమతాల వారి ఎంగిలి మెతుకులు కోసం ఆశపడి

ఈ రకమైన పనులు చేస్తున్నారు, హిందూ ధర్మం మీద ఎంత విషం చిమ్మినా కానీ, మన మన్నెం కోటేశ్వరరావు వలన మంచే జరుగుతోంది. అతను రెచ్చగొట్టడం వలన హిందువులు ఏకమౌతున్నారు, తిక్కల ప్రశ్న. పిహెచ్‌డి చేసిన ప్రతివాడు సైంటిస్ట్‌ ఎందుకు కావడంలేదు… ప్రొఫెసర్‌లుగా ఎందుకు మారుతున్నారు.. ఇదీ అంతే, భారత్‌ను ఏలుతున్న సమయంలో ఫ్రెంచి, బ్రిటీష్‌ పాలకులు మనవేదాలను తీసుకెళ్లి అధ్యనం చేసి వాటిఆధారంగా ప్రయోగాలు చేసి విధ్యుత్‌,రేడియో,విమానం లాంటి అనేక వస్తువులను రూపొందించారనేది కాదనలేని యదార్థం. శాస్త్రవేత్తలు కాలేదని వారు చెప్పారు అల్జెబ్రా ట్రిగ్నోమెట్రీ లాంటివి చాలా కనుక్కున్నారు మేము లీలావతి భస్కర్‌ అని ఆల్జీబ్రాలో శ్లోకాలని చదివేము ఆ రోజుల్లో ఈ దేశం గురించి వాళ్లకి తెలియదు వాళ్ళగురించి మనకి తెలియదు వాళ్ళ మ్యాగజిన్‌ లో ప్రచురించకపోతే విజ్ణాన శాస్త్రమే లేదంటే ఏళ్ళ అగస్త్యుడి కా లంలోనే విమానం ఎలానడపాలి అన్నవిషయం ఉండేది నలందా విశ్వవిద్యాలయంలో కొన్ని వేల గ్రంధాలు కాల్చేసేరు మనం మనల్ని కించపరుచుకునే దుస్థితి దాపురించింది. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు ఎవర్రా…… కళ్లు దొబ్బాయా. ఆధ్యాత్మిక ప్రపంచం లో సైన్స్‌ అనేది ఒక చిన్న ముక్కమాత్రమే.అధ్యాత్మికవేత్త అనే సముద్రం ముందు సైంటిస్ట్‌ అనే పిల్ల కాలువ పరవళ్లు తొక్కుతూ సముద్రం లో కలవాల్సిందే.పాచీనకాలంలో భారత దేశమే విజ్ఞాన భాండాగారం,నీకు ఇప్పుడు బ్రాహ్మణులు మాత్రమే కనిపెట్టినవి కావాలా,లేక భారతీయులు అయినా పర్వలేదా, ఎర్ర పకోడీ గాళ్లరా మీరు భారతీయులేన లేదా?? మీరు శాస్త్రజ్ఞులు కాదనుకొనేవారికి తెలిసిన శాస్త్రాలు మీరు శాస్త్రజ్ఞులనుకొనేవారిలో ఎంతమందికి ఎన్ని తెలుసు, అసలు శాస్త్రం అంటే ఏమిటి ? శాస్త్రవేత్త

వేత్త అనగా ఎవరు? ముందు దీనిని తెలుసుకొని ప్రశ్న వేయండి. మన పుష్పక విమానం ఫార్ములాతోనే రైట్‌ సోదరులు విమానం రూపకల్పనకు పూనుకొంది. స్ధూలంగా ఇదీ ధోరణి. వీటన్నింటినీ ఎప్పటి నుంచో మెదళ్లకు ఎక్కించుకొని ఒక పిచ్చిలో మునిగి తేలుతున్నట్లు కనిపిస్తోంది. అందువలన దాన్ని పోగొట్టాలంటే కొన్ని ఆసుపత్రులు చాలవు. పెద్దఎత్తున చర్చల కౌన్సిలింగ్‌ చేయకపోతే రాబోయే తరాలను కూడా చెడగొడతారు, మన దేశాన్ని మరింతగా వెనక్కు నెడతారు, నగుబాట్ల పాలు చేస్తారు.

తమకు నచ్చని, తెలియని అంశాన్ని ఎవరైనా చర్చకు పెడితే బూతులు తిట్టి నోరు మూయించేందుకు ప్రయత్నించటం ఒక చౌకబారు ఎత్తుగడ. తాలిబాన్లు వారికి ఆదర్శం. విమర్శకుల నోరు మూయించటానికి మేకిన్‌ ఇండియా చౌకబారు తయారీ. చిత్రం ఏమిటంటే ఆ బూతుల్లో కూడా వైవిధ్యం వుండదు. వారి భావ దారిద్య్రానికి నిదర్శనం ఇది. వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించటానికి సిద్దపడిన వారికి బూతులు, అవమానాలు ఒక లెక్క కాదు. తిట్టినంత మాత్రాన విమర్శలు ఆగిపోయేట్లయితే ఈ పాటికి అది ఎప్పుడో జరిగి వుండేది. ఇంతకు మించి ఏమి తిడతారు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేదేముంది అని అనేక మంది ఇప్పటికే రాటు తేలారు. ఇప్పటి వరకు తమను వ్యతిరేకించిన వారినే తిడుతున్నారు. ఇప్పుడు నువ్వు హిందువు కాదా, నువ్వు ముస్లిం కాదా, నువ్వు క్రైస్తవుడికాదా అని రెచ్చగొడుతున్నారు.బూతులు తిట్టకపోవటం సంస్కారం, తిట్టే వారిని అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో మాతో కలసి ఎందుకు తిట్టటం లేదని మౌనంగా వున్నవారి మీద కూడా తెగబడతారని గ్రహించటం మంచిది.

ఇక వేదాలలో అన్నీ వున్నాయష అంటూ ఇంకా టెక్నాలజీని బయటకు తీయని దేశ ద్రోహుల గురించి చూద్దాం. వేదాలను వెక్కిరించే వారిని వెధవలని ఒక పత్రిక సంపాదకుడిగా పనిచేసిన ఒక కాషాయ తాలిబాన్‌ నిందించాడు. విమర్శ రూపాలలో వెక్కిరింత ఒకటి. విమర్శకులను వెధవలు అనటం సరైనదే అయితే గుడ్డిగా సమర్ధించే వారు కూడా విమర్శకులకు బంధువులే.

వేదాలను వెక్కిరించే లేదా విమర్శించే వారు వుద్భవించటానికి కారకులు ఎవరు ? వేదాల్లోనే అన్నీ వున్నాయష అని చెప్పిన వెధవలే. 1760లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని పెద్ద మలుపు తిప్పింది. వివిధ దేశాలలోని వారు ఒకరిని చూసి మరొకరు సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు పోటీ పడ్డారు. అందుకు విరుద్ధంగా మన దేశంలో మన కంటే గొప్ప మేధావులు ప్రపంచంలో లేరని, ఎవరైనా కొత్త వస్తువును కనుగొంటే అవన్నీ మన వేదాల్లో, పురాణాల్లో ఎప్పుడో వున్నాయని తమ జబ్బలను తామే చరుచుకున్నారు. పారిశ్రామిక విప్లవాన్ని మరో మలుపు తిప్పిన పరిణామం 1900 శతాబ్ది ప్రారంభ దశకంలో రైట్‌ సోదరులు కనిపెట్టిన విమానం. ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినపుడే మన వేద పారంగతులు, విజ్ఞానవేత్తలు మేల్కొని వుంటే అరే మన పురాణాల్లో వున్న పుష్పక విమానాలను పునరుద్దరించేందుకు పూనుకొని వుండేవారు. నిజంగా ఆ పని చేసి వుంటే మనకు ఎన్ని ప్రయోజనాలు సమకూరి వుండేవో.

ప్రపంచంలో అసలు పెట్రోలుతో పనిలేని విమానాలను మనమే తయారు చేసి మేకిన్‌ ఇండియా అని గొప్పగా చెప్పుకొని మనువాదులు చెబుతున్నట్లు కాలర్‌ చొక్కాలు వేసుకోవటం భారతీయం కాదు గనుక పిలకలు ఎగరేసి వుండేవారం. మన పుష్పక విమాన , కీలు గుర్రాలు, ఎగిరే కార్పెట్ల టెక్నాలజీని బయట పెట్టి వుంటే కార్లు, స్కూటర్లు, లారీల వంటి వాటితో పని వుండేది కాదు, అన్నింటికీ మించి ముస్లిం దేశాల నుంచి చమురు కొనుక్కోనే ఖర్మ పట్టేది కాదు, ఇప్పుడు వారి దగ్గర చమురు కొని, దానికి చెల్లించాల్సిన డాలర్ల కోసం కిరస్తానీ దేశాలను దేబిరించే దుర్గతి పట్టించింది కచ్చితంగా మన వేద విజ్ఞానాన్ని బయటికి తీసేందుకు ముందుకు రాని వెధవలే అన్నది స్పష్టం.

వేదాలను ప్రామాణిక సూత్రాల ప్రకారం సక్రమంగా చదవకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయని సెలవిచ్చారు. మన దేశంలో కొన్ని భాషాలలో కొన్ని పదాలు పలకవు. వుదాహరణకు బెంగాలీలకు వ, బ మాదిరి. ఇలా ప్రతి భాషకు వున్నాయి. దీని ప్రకారం వుచ్చారణ సరిగా లేకపోతే ఫలితాలు వ్యతిరేకంగా వుంటాయనుకోవాలి. మరి దీన్ని పరిష్కరించటం ఎలా అందువలన ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. డార్విన్‌, న్యూటన్‌ల సిద్ధాంతాలు, సూత్రాలు వద్దూ, వేదాలే ముద్దు అనే పాలకులే నేడు గద్దెల మీద వున్నారు. ఇప్పటికే మేకిన్‌ ఇండియా జయప్రదానికి ఆవుపేడ, మూత్రాలలో ఏముందో కనుగొనేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి పరిశోధనలు చేయిస్తున్నారు. వేదాలలో వున్న టెక్నాలజీని అందరికీ అర్ధం అయ్యేలా ఘనాపాఠీలకే పేటెంట్‌ హక్కులిచ్చి చమురుతో పైలెట్లు, డ్రైవర్లతో పనిలేని విమానాలు, కార్లు,ఇతర వాహనాలను తయారు చేయించండి, విమర్శకుల లేదా వెక్కిరించే వారి నోరు మూయించండి. అదేమీ లేకుండా ఎవడో కిరస్తానీవాడు కనిపెట్టిన ఫేస్‌బుక్‌లో సొల్లు కబుర్లు చెబితే లేదా విమర్శి ంచేవారిని తిడితేనో ప్రయోజనం వుండదు. అంతులేని మన టెక్నాలజీని బయటకు తీసి దేశాన్ని ముందుకు నడిపించకపోతే అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణిస్తారని మనవి.

మన సాంకేతిక పరిజ్ఞానం నిక్షిప్తమై వున్న అనేక సంస్కృత గ్రంధాలను ఇస్లామిక్‌, క్రైస్తవులు నాశనం చేశారని ఒక నోటితో చెబుతూ దానిలోని విజ్ఞానాన్ని దొంగిలించారని మరో నోటితో చెబుతారు. వినేవారు నోట్లో వేలేసుకొని చెవులప్పగిస్తున్నారు. దేన్నయినా ఎందుకు అని ప్రశ్నించిన సమాజమే ముందుకు పోతుంది. ఎందుకు అని నువ్వు పెద్ద ప్రశ్నిస్తున్నావు మన పూర్వీకుల కంటే నువ్వు గొప్పవాడివా మానాన్నకు మాతాత చెప్పారు, మానాన్న నాకు చెప్పారు, నేను నీకు చెబుతున్నాను , నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అంటూ తరతరాలుగా జిజ్ఞాసను అణచివేసిన ఆధిపత్య సమాజం మనది. అది వేదాలు, పురాణాలు, వుపనిషత్తులు, హిందూ ధర్మం ఏదైనా కావచ్చు. దేన్నీ ప్రశ్నించకుండా అణచివేశారు.

పురాతన కాలంలోనే అంటే క్రైస్తవం,ఇస్లామ్‌ మతాలు పుట్టక ముందే మన దేశంపై విదేశీయులు దండయాత్రలు చేశారు. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్‌, క్రీపూ 200ల తరువాత శకులు, యవనులు, పహ్లవులు, క్రీస్తుశం 50లో కుషాణులు, క్రీశ 400లలో హూణులు దండయాత్రలు చేశారు. వారు మన వేద విజ్ఞానాన్ని నాశనం చేశారని ఎవరూ చెప్పలేదు. అలెగ్జాండర్‌ దాడి సమయంలోనే మన దేశానికి ప్రమాదం వుందని అర్ధమైంది. మరొకరు దాడికి పూనుకోకుండా ఎవరైనా ఏం చేయాలి, అందులోనూ దేశభక్తులు, అలెగ్జాండర్‌ నుంచి హూణుల వరకు మధ్యకాలం ఏడు వందల సంవత్సరాలలో ఏ ఒక్క సమయంలోనూ మన వేద విజ్ఞానులు విమానాలు లేదా అస్త్రాలను బయటకు తీసి సంధించి దురాక్రమణదారులను తరిమివేసి వుంటే తరువాత ముస్లింలు, క్రిస్టియన్లు దాడులు చేసి వుండేవారు కాదు. మహమ్మద్‌ ఘజనీ , ఘోరీలు అన్ని సార్లు దండయాత్రలు చేసి హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే మన అస్త్రాలను బయటకు తీయకుండా మన హిందూ ధర్మ పరిరక్షకులు ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోముతూ కూర్చున్నట్లు ?

మన నలంద విశ్వవిద్యాలయాన్ని ముస్లింలు తగుల బెట్టి మన విజ్ఞాన గ్రంధాలన్నింటినీ తగుల బెట్టారన్నది ఒక ప్రచారం. అనేక మంది చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం తగులబెట్టింది వాస్తవం. ఎవరు తగులబెట్టారు ? పాట్నా హిందుస్తాన్‌ టైమ్స్‌ 2014 సెప్టెంబరు ఒకటిన రాసిన దాని ప్రకారం క్రీస్తుశకం 455-467 మధ్య స్కంధగుప్తుని కాలంలో మిహిరకులుడనే హూణ రాజు నాయకత్వంలో విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశారు. తరువాత గౌడాస్‌ నాయకత్వంలో ఏడవ శతాబ్ది ప్రారంభంలో మరోసారి నాశనం చేశారు. దాన్ని తరువాత హర్షవర్ధనుడనే రాజు పునరుద్దరించాడు.1193లో భక్తియార్‌ ఖిల్జీ సేనలు మరోసారి నాశనం చేసిన తరువాత దాని పునరుద్దరణ జరగలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు నడిపే పయనీర్‌ పత్రిక 2014 సెప్టెంబరు 20న రాసినదానిలో 1193లో టర్కీ సైన్యం దాడి చేసి విశ్వవిద్యాలయాన్ని తగుల పెట్టినట్లు పేర్కొన్నారు.

కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఖిల్జీ దాడుల నాటికే నలంద విశ్వవిద్యాలయం శిధిలమైంది. బౌద్ధంలో హీనయాన, మహాయాన శాఖల మధ్య వైరమే దీనికి కారణం అన్నది వారి వాదన. ఖిల్జీ సేనలు దాడి చేసింది నలంద జిల్లాలోనే వేరొక చోట వున్న మహావీర ఓదాంతపురి (నేటి బీహార్‌ షరీఫ్‌) కోటపై అన్నది ఒక అభిప్రాయం, నాటి చారిత్రక రచనల్లో అసలు నలంద ప్రస్తావన లేదని చెబుతున్నారు. డిల్లీ నుంచి బెంగాల్‌ వెళ్లే ప్రధాన మార్గంలో నలంద లేదని కూడా వాదించేవారున్నారు. చరిత్రకారులు ఎవరి భాష్యం వారు చెబుతున్నపుడు వాటి అధ్యయనానికి పరిమితం కావాలే తప్ప నిర్ధారణలకు రాకూడదు. ఇక్కడ సమస్య నలంద అనేది బౌద్ధ క్షేత్రం, బౌద్ధ విశ్వవిద్యాలయం అనేది నిర్వివాదం. బౌద్దులు వేద ప్రామాణ్యాన్ని నిరాకరించారు. అందువలన అక్కడున్నది వారి సాహిత్యం తప్ప వేద సంబంధిత సాహిత్యం ఎంత మాత్రమూ కాదు. ఒక వేళ వేద సాహిత్యమే నాశనం అయింది అనుకుంటే తరువాత ఎన్నో వందల సంవత్సరాల తరువాత వచ్చిన యూరోపియన్లు దొంగిలించటానికి అక్కడ ఏముంటుంది? వేదాలు, ఎంతో సాంకేతిక నైపుణ్యం వున్న సాహిత్యం సంస్కృతంలో వుందని చెబుతున్నవారు నలంద వంటి బౌద్ద విశ్వవిద్యాలయం మాదరి దేశంలో ఎక్కడా వేద విశ్వవిద్యాలయం ఎందుకు ఏర్పాటు చేయలేదు అన్నది ప్రశ్న.

వేదాలను బ్రహ్మ సృష్టించాడని చెబుతారు, అలాంటి వాటిని మానవ మాత్రులు నాశనం చేయటం ఏమిటి? శృతి, అనుశృతుల ద్వారా వేదాలు, వుపనిషత్తులు, పురాణాలను పరంపరగా తరువాతి తరాలకు అందించారు, అందువలన వాటిని భౌతికంగా నాశనం చేశారని చెప్పటం చెవుల్లో పూలు పెట్టటమే. చతుర్వేదాలు, పంచమ వేదంగా మహాభారతాన్ని చెప్పుకుంటున్నాం తప్ప నాశనం చేశారని, లేదా దొంగిలించారని చెబుతున్న వేదాల గురించి ఇంతవరకు ఎవరూ ఎందుకు చెప్పటం లేదు. పోనీ కాన్నింటినీ నాశనం చేశారని అనుకుందాం, అవన్నీ పోయిన తరువాత కూడా మన వారు వేదాల్లో అన్నీ వున్నాయష అన్నారు తప్ప కొన్నే వున్నాయష అన లేదు. అందువలన కొన్ని నాశనం చేశారని చెప్పటం ఇటీవలి కట్టుకధలు తప్ప మరొకటి కాదు. ముస్లిం పాలకులు మన దేశం మీద దండ యాత్రలు చేసినపుడు మన విజ్ఞానాన్నినాశనం చేశారని ఒక కధ, ఎవరైనా విజ్ఞానాన్ని గ్రహించి తాము వుపయోగించుకుంటారు. నిజంగానే వారు మన టెక్నాలజీని చోరీ చేసి వుంటే ముస్లిం దేశాలు నేడు సాంకేతిక పరంగా ఎంతో ముందుండాలి, దానికి బదులు పశ్చిమ దేశాల మీద ఎందుకు ఆధారపడుతున్నట్లు ? బ్రిటీష్‌, ఫ్రెంచి వారు అపహరించారంటారు. వారు మన దేశానికి రాకపూర్వమే ఐరోపాలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది కదా, దాంతో పెరిగిన వుత్పత్తి అయిన వస్తువులను అమ్ముకొనేందుకే కదా మన దేశం వచ్చింది. మరి వారికి ఆ టెక్నాలజీ ఎలా వచ్చినట్లు ? సున్నా కనిపెట్టింది భారతీయులంటారు, ఎవరు నిర్ధారించారు? మూడువేల సంవత్సరాలకు పూర్వమే ఈజిప్టులో దాని ప్రస్తావన వున్నట్లు, నేటి సున్నాకు రూపమిచ్చింది చైనీయులని చరిత్ర వుంది. మనది కూడా పురాతన సమాజాలలో ఒకటి కనుక సున్నా గురించి పురాతన ప్రస్తావనలు మనకూ వున్నాయి. వేదాల్లో అన్నీ వున్నాయని చెప్పిన తరువాత ప్రతి దానిని మన ఖాతాలో వేసుకుంటే ప్రపంచం నవ్విపోతుంది. అంతెందుకు విదేశీ విడి భాగాలు లేకుండా మనం ఫోన్‌, కారు, టీవీ వంటి వాటిల్లో ఒక్కదానినైనా స్వంతంగా తయారు చేస్తున్నామా ? మనకు వున్న కీలకపేటెంట్లు ఎన్ని? చివరికి పెద్ద విగ్రహం తయారు చేసుకొనేందుకు కూడా చైనా వద్దకు పరుగెడుతున్నామే ఎంత సిగ్గు చేటు ?

క్రీస్తుకు పూర్వమే వున్న చరకుడు, ఆర్యభట్టు, శుశ్రుతుడు అంటూ ఒక జాబితాను వల్లె వేస్తున్నారు. వారితో ఎవరికి పేచీ వుంది ? వారి పరిజ్ఞానం ఎంత అన్న మీమాంస ఎప్పుడూ వుంటుంది. అతిశయోక్తులు జోడిస్తేనే వెక్కిరింతలు వస్తాయి. వినాయకుడికి ఏనుగు తలను అతికించిన గొప్ప శస్త్ర నిపుణులున్నారని చెబుతారా ? మనిషికి మనిషి తలదొరక్కపోతే దానికి సమబరువుతో వుంటే మరో కుక్కో, నక్క తలో అంటించాలిగాని మోయలేని ఏనుగు తలను అంటించే మొరటు వారా నాటి వైద్యులు. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్‌ వుందని ఒక ముఖ్యమంత్రి ప్రవచిస్తాడా ? అదే నిజమైతే ముస్లింలు, అంతకు ముందు ఇతరుల దండయాత్రల గురించి ఎందుకు హెచ్చరించలేదు, తలలో మెదడు వుండి చెబుతున్న మాటలేనా ? పురాతన సమాజాలలో ఒకటైన మన దేశంలో కొన్ని రంగాలలో పని చేసిన ప్రముఖులను గుర్తించటానికి, వారి ఘనతను పొగటానికి ఎవరికీ ఇబ్బంది లేదు. వారందరూ వేదాలనుంచే ప్రావీణ్యం పొందారని చెబుతుంటేనే సవాలక్ష ప్రశ్నలు వస్తున్నాయి. వారికీ వేదాలకు సంబంధం వుండి వుండదు. ఒక వేళ వుంటే అదే వేదాల నుంచి తరువాతి తరాలు మరింత నైపుణ్యంతో వైద్యం, ఇతర శాస్త్రాలను ఎందుకు మెరుగుపరచలేకపోయారు? వేదాలతో సంబంధం లేకపోయినా వారి అనుచరులు తరువాత ఎందుకు నిపుణులుగా రాణించలేకపోయారు అన్నది పరిశోధించాల్సిన అంశం. వేదాలలో ఏముంది, అది పనికి వచ్చేదా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక సాహిత్యంగా చూసినపుడు వాటిని కంఠోపాఠం చేసి తరతరాలకు అందించినందుకు ఘనపాఠీలను అభినందించాల్సిందే. అదే సమయంలో వారి చాదస్తాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. అణకువ, ఆసక్తి, తపన వున్న సమాజమే ఎప్పుడైనా ముందుకు పోతుంది. అహంకారం, గర్వం వుంటే ఎక్కడో అక్కడ బొక్కబోర్లా పడి ముక్కు బద్దలు చేసుకుంటాం. సాయంత్రం కాగానే సత్రాలకు చేరుకొని గంజాయి దమ్ముకొట్టి మనం తెల్లవారిన తరువాత అది చేయాలి, ఇది చేయాలి అని ప్రగల్భాలు పలికి తెల్లవారి మత్తుదిగగానే ఎవరి కర్రాబుర్రా పట్టుకుని అడుక్కొనేందుకు పోయే సోమరిపోతుల మాదిరి కబుర్లు కాదు కావాల్సింది. వేదాల్లోనే అన్నీ వున్నాయని చెబుతున్న వారు విదేశాలకు ఎందుకు పరుగులు తీస్తున్నట్లు ? తమ బిడ్డలకు శ్లోకాలు నేర్పించటం ఒక దేశభక్తిగా అనేక మంది ప్రదర్శించుకుంటున్నారు. డాలర్ల కక్కుర్తి తప్ప దేశభక్తి ఏమైనా వుందా ?

ఇక గురుకులాల వ్యవస్ధను పునరుద్ధరించాలని మోహన్‌ భగవత్‌ చెబుతున్నారు. మదర్సాలనుంచి తాలిబాన్లు వస్తున్నారని నిత్యం ప్రచార దాడులు చేస్తున్న వారే వాటికి పోటీగా గురుకులాలను ఏర్పరచాలని అంటున్నారు. అంటే మైనారిటీ తాలిబాన్లతో పాటు మెజారిటీ తాలిబాన్లను తయారు చేసి సమాజాన్ని మధ్యయుగాల నాటికి తీసుకు పోయి రక్తపుటేరులు పారిద్దామనా ? ఏమిటీ వున్మాదం ? దీన్ని నాగరిక సమాజం సహించాలా ? ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్ధిస్తున్న వారిలో తమ బిడ్డలను గురుకులాల్లో చేర్పించటానికి ఎందరు ముందుకు రాగలరో చెప్పగలరా ?