Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

వేదాల్లో అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు అన్న శీర్షికతో నేను రాసిన వ్యాసంపై సామాజిక మాధ్యమంలోని ఫేస్బుక్‌లో సంస్కారయుతంగా స్పందించిన వారందరికీ ఒక దండం, అనాగరికంగా స్పందించిన వారికి వంద దండాలు. చర్చలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించటం కనీస ధర్మంగా భావిస్తున్నా.

‘వేదాలు ఎందరు చాడుతున్నారు కమ్మీ’

జ: దీనిలో చాడు ను వాడు గా అనుకున్నా కమ్మీ అనే తిట్టు తప్ప ప్రశ్న అర్ధం కాలేదు.

‘ అబ్బే అన్నీ దాస్‌ కాపిటల్‌ లోనే ఉన్నాయి పోయి చదువుకోండి.’

జ: అంత వుక్రోషం వద్దులే మిత్రమా ! ప్రపంచంలో వేదాలు చదువుతున్న వారి కంటే దాస్‌ కాపిటల్‌ చదివేవారే ఎక్కువ . గత పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో వచ్చిన సంక్షోభం తరువాత మరీ ఎక్కువగా చదువుతున్నారని వార్తలు. ప్రపంచంలో దాస్‌ కాపిటల్‌ చదివి తిరుగుబాట్లు చేశారు. వేదాలు చదివిన వారు అగ్రహారాలకే పరిమితం అయ్యారు , వాటిని కూడా సంస్కరించుకోలేకపోయారు అన్నది అంగీకరించక తప్పదు మరి. ఇదే సమయంలో ఒక కాలపు సాహిత్యంగా చరిత్రలో వేదాలకు స్ధానం వుంది.

‘రిజర్వేషన్‌ వల్ల రా కమ్మి. నీ వయసు కి విలువ ఇవ్వాలంపియట్లేదు’

జ: రిజర్వేషన్ల వ్యతిరేకత కనిపిస్తోంది. వేదాలు- మనువాదం రెండింటినీ విడదీయలేము. ప్రపంచంలో ఎక్కడా లేని రిజర్వేషన్ల విధానం రావటానికి జనాభాలో ఐదో వంతుగా వున్న దళిత, గిరిజనులను వేల సంవత్సరాలుగా అంటరాని వారిగా చూసినందువల్లనే ఇవి వచ్చాయి. ఆ దురాచారాన్ని రూపు మాపి వారిని కూడా తోటి మానవులుగా గుర్తించినపుడు రిజర్వేషన్లు వుండవు. కానీ ఇప్పుడు ఆధునిక మనువాదులు అంటరాని తనం వుండాలి, రిజర్వేషన్లు పోవాలి అంటున్నారు. ఇక నా వయస్సు, ఫేస్‌బుక్‌లో నేనే వివరాలు పెట్టాను, అందరికీ ఆధైర్యం వుండదు, అనేక మంది ఫేక్స్‌ వున్నారు. గురువు అద్వానీకే శిష్యుడు నరేంద్రమోడీ ఇచ్చిన విలువేమిటో చూశాము. వాదన, విషయంలో వున్నదానిని బట్టి విలువ ఇవ్వండి చాలు. కొంత మంది కుర్రవాళ్లు పేర్లకీ పుకార్లకీ నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. నేనైతే ఆ టైప్‌ కాదు. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా వుంది అని నమ్ముతా.

‘కమ్మీలకు స్వంత సిద్దాంతాల్లేక విదేశాలనుంచి ఎందుకు దిగుమతి చేసికొన్నారు?స్వంతంగా సిద్దాంతాలే తయారుచేసికోలేని అనామకులా కమ్మీలు?కాస్తైనా జ్ఞానంలేని మూర్ఖులైన కమ్మీలను ప్రజలెలా ఆదరిస్తారు?

జ: వసుధైక కుటుంబం అనే భావనలో నమ్మకం వున్న వాడిని. మన రాజ్యాంగంతో సహా అనేక అంశాలను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. ఇస్లాం, క్రైస్తవ మతాలను నిత్యం దుమ్మెత్తి పోసే వారు వారి దీనార్లు, డాలర్లు, ఇతర వస్తువులను తెచ్చుకోవటానికి, ఆ దేశాలకు వెళ్లి మరుగుదొడ్లు కడగటం నుంచి కంప్యూటర్ల వరకు ఏ పని అయినా చేయటానికి, కూలి డబ్బులు తెచ్చుకోవటానికి కోట్లాది మంది సిగ్గుపడటం లేదు. ఏం తెచ్చారో, ఎంత తెచ్చారో ఇంతవరకు తెలియకపోయినా నిత్యం నరేంద్రమోడీ విదేశాల నుంచి ఏదో ఒకటి తీసుకురావటానికే కేగా అందమైన సూట్లు వేసుకొని పైలా పచ్చీసుగా తిరుగుతోంది. భారతీయతకు ప్రతిబింబంగా కొందరు భావించే పిలక, పంచకట్టుతో ఎందుకు వెళ్లటం లేదు. ఇన్ని జరుగుతున్నపుడు, వాటికి అభ్యంతరం లేనపుడు కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతాన్ని తమకు వర్తింప చేసుకుంటే తప్పేమిటట? బౌద్దం, ఇస్లాం, క్రైస్తవం, హిందూ మతం ఒక చోట పుట్టి అనేక దేశాలకు విస్తరించింది. కమ్యూనిజం కూడా అంతే .వాటికి లేని అంటూ సొంటూ కమ్యూనిజానికికే ఎందుకు?

‘ మీ బతుకులు ఈ దేశ గొప్పదనం తక్కువ చేయడానికే. పంది బురద మెచ్చు, పన్నీరుమెచ్చునా విశ్వదాభిరామ…’

జ: నాకు తెలిసినంత వరకు ఏ కమ్యూనిస్టూ ఈ దేశ గొప్పతనాన్ని తక్కువ చేయలేదు. అలా చేసినట్లు ఒక్క వుదంతం వున్నా చూపాలని చేసిన సవాలుకు ఇంతవరకు ఎవరూ బదులివ్వలేదు. అనేక మతాలు వచ్చాయి, పెరిగాయి, తరిగాయి. మధ్య యుగాల నాటి మాదిరి భీకర మత యుద్ధాలు మహత్తరమైన భారత గడ్డమీద జరగలేదు గాని మత యుద్ధాలు మనకు కొత్త గాదు. శైవులు-వైష్ణవుల మధ్య పరిమితంగా అయినా యుద్ధాలు జరిగాయి. జైన, బౌద్ధ మతాలను, హేతువాద, భౌతిక వాదులైన చార్వాకులను హిందూ మతంగా చెప్పుకొనే వారు అణచివేచిన చరిత్ర వుంది. ఇప్పుడు క్రైస్తవం, ఇస్లాం మతాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న మెజారిటీ మతోన్మాదులు, దానికి స్పందిస్తున్న మైనారిటీ మతోన్మాదులు దొందూ దొందే. పందులు పన్నీరు మెచ్చకపోయినా నష్టం లేదు. మతోన్మాదులు ఎందరు మగువల కన్నీరు ఒలికించటానికి నీ పేరుతో ప్రయత్నిస్తున్నారో వీలైతే వారిని ఆపేట్లు చూడు రామా అని కమ్యూనిస్టులు కాని వారెందరో మొక్కుకుంటున్నారు.

‘విదేశాలకు పరుగులు తీయాలని కూడా వేదాల్లోనే ఉందట’

జ: అన్నీ వున్నాయష అన్నపడు పరుగుల గురించి ఎందుకుండదు

‘ వీళ్ళు వీళ్ళ పిచ్చ…వేదాలని ప్రశ్నిస్తే కమ్మీలు అంటారు,వాళ్లంటే అంత భయమేంటో, వాళ్ళ పేరే కలవరిస్తారు.’

జ: ఇది తరతరాలుగా వస్తున్న భయం, గంగిరెద్దుల్లా తలాడించటం, మన్ను దిన్న పాముల్లా జనం పడి వుండాలని కోరుకొనే వారికి ప్రశ్నించే ఒక్కడు కనపడినా భయమే. వేద ప్రామాణ్యాన్ని ప్రశ్నించటం ఈ రోజు కాదు, వాటిని రాసిన నాటి నుంచీ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే వున్నారు. ఒక్క వేదాలే కాదు, గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటి ఏ మత గ్రంధమైనా, మరొకటైనా సమాజ పురోగతికి ఆటంకం కలిగించే ప్రతిదాన్నీ జనం ప్రశ్నిస్తారు. అలాంటి వారిని అణచివేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. దోపిడీ వర్గాన్ని సమర్ధించే వారే నాడు నేడు ఈ అణచివేతకు పాల్పడుతున్నారు.

‘ఎవడైనా సరుకున్నవాడినే రమ్మంటారు’

‘ వారికి నేర్పడానికి నాసా లో హిందువులేఎక్కువ ‘

జ: సరకున్నవాడినే ఎవరైనా రమ్మంటారన్నది కొంత వరకు నిజమే. తమకు అవసరమైన వాళ్లను కూడా రమ్మంటారు అని కూడా తెలుసుకోవాలి. అమెరికా, ఐరోపా వారు వస్తువులు తయారు చేసుకోలేకనా చివరకు …..తుడుచుకొనే కాగితంతో సహా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నది. కాదు, వ్యాపారికి లాభం కావాలి. చైనాలో తయారయ్యేందుకు అయ్యే ఖర్చు కంటే అమెరికాలో ఎక్కువ చెల్లించాలి. అందుకే ఎక్కడ శ్రమశక్తి తక్కువుంటే అక్కడి నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు. అలాగే వైద్యులు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్‌ ఇంజనీర్లు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు వారిని తయారు చేసుకోలేక కాదు. ఒక వైద్యుడు తయారు కావాలంటే అమెరికాలో అయ్యే ఖర్చు కంటే ఇండియాలో తక్కువ. మిగతావారు కూడా అంతే. మన దేశంలో వున్నన్ని జబ్బుల గురించి అమెరికా, ఐరోపాలో తెలుసుకోవాలంటే కుదరదు, అక్కడన్ని లేవు గనుక. అందుకే విదేశాల నుంచి రమ్ముంటున్నారు తప్ప మన మీద ప్రేమ వుండి కాదు, మనమే గొప్పవారం అని కాదు. ప్రపంచంలో విదేశాలలో నివసించే చైనా జాతీయులు ఐదు కోట్ల మంది అయితే మన వారు మూడు కోట్లకు పైబడి వున్నారు. అమెరికాలో కూడా భారతీయుల కంటే చైనీయులే ఎక్కువ. అందువలన మన గురించి చెప్పుకోవచ్చు తప్ప అతిశయోక్తులు చెప్ప కూడదు. నాసాలో పని చేస్తున్న మన సైంటిస్టులందరూ హిందువులే అని చెప్పటం అతిశయోక్తి. అంటే హిందువులందరూ మన దేశ పరిశోధనలను వదలి పెట్టి అమెరికన్లకు వూడిగం చేస్తున్నారను కోవాలి. ఇదేమీ దేశభక్తి ?

‘ఎప్పుడూ పక్కదేశం బానిసలుగా బతికేవారికి ఆత్మవిశ్వాసం లోపించి మనలో ఏమీ లేదు అనుకునే పర్సనాలిటీ డిసార్డర్‌, ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్‌తో బ్రతికే మానసిక రోగులు మన కమ్యూనిస్టులు. ముందు మీ పూర్వీకుల ఘనతను తెలుసుకుని,ఎవరైనా సైకాలజిస్ట్‌ దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకోండి.

జ: కమ్యూనిస్టులు ఏ దేశం వారినైనా వారు దోపిడీ చేసేవారా, దోపిడీకి గురయ్యే వారా అని మాత్రమే చూస్తారు తప్ప మతం, కుల ప్రాతిపదికన చూడరు. పక్కన వున్న వాడికి ఒక కన్ను పోవాలనుకుంటే మనకు రెండూ పోతాయి. సమాజంలో కొంత మంది కంటే తాము గొప్ప వారమనే సుపీరియారిటీ రోగాన్ని పెంచిన మనువాదం మొత్తంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధను ప్రోత్సహించి, నిర్మించి సమాజానికి చేసిన హాని అంతా ఇంతా కాదు. మహిళలను అణచివేసింది, వారికి విద్య, వివేకం లేకుండా చేసింది. పంచముల పేరుతో నాలుగోవంతు, ఇతర వృత్తుల పేరుతో మరి కొ ందరిని ఈ దేశం మాది అనుకొనే స్ధితి లేకుండా చేసింది. ఎందరు హిందూ రాజులు పాలించినా వేల సంవత్సరాలు అదే స్ధితి కొనసాగింది. అందువలన, విదేశీయులు, హూణులు, తరుష్కులు, యూరోపియన్లు ఎవరు దేశం మీద దాడులు చేసినా, మొత్తాన్ని ఆక్రమించుకున్నా మన బతుకులు మారేదేమీ వుండదని ఏం జరిగితే మనకెందుకు లెమ్మని మెజారిటీ జనం ప్రేక్షక పాత్ర పోషించబట్టే దేశం వందల సంవత్సరాలు పరాధీనమైంది. ఎక్కడ ఏమాత్రం గౌరవం, ఆదరణ, సాటి మనిషిగా గుర్తింపు వుంటుందని భావించినా అనేక మంది మతమార్పిడులకు సిద్దపడటానికి కూడా కారణమదే. ఇప్పటికీ అదే స్ధితి. అందుకు అంబేద్కరే ప్రత్యక్ష నిదర్శనం. అందువలన మన గత ఘనత గురించి మరీ ఎక్కువగా చెప్పుకొనే మానసిక రోగులకే ముందు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. బుర్రలను మరమ్మతు చేయాలి.

ౖ’వేదాలలలో అన్ని ఉన్నాయి విదేశీయులు వఛ్చి అన్ని వేదిలేసేం ఇప్పటి అమెరికా వైద్యం కన్నా మంచి వైద్యం మన దగ్గర ఉండేది ఎంసెట్‌ రాంక్‌ వఛ్చినవాడు ఎం బి బి ఎస్‌ చదువుతాడుకాని ఆయుర్వేదం చదవడుకదా జెర్మనీ వాడు మానవేదాలని ఉపయోగించుకుని ఆయుధాలు మందులు చేసుకుంటున్నాడు మన రాజమండ్రి ఆయనని అక్కడకి తీసుకునివెళ్ళి మరి ఆయుధాల విద్య నేర్చుకున్నారు మనకి మాత్రం అలుసు మన పూర్వులగురించి తెలియదు తెలుసుకోము విదేశీయులంటే మోజు అన్ని ఉన్న విజ్ఞానం మనది

జ: ఇలాంటి నమ్మకాలు వున్న వారు రెండు తరగతులు.లోతైన అధ్యయనం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎక్కడ అనే ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా నమ్మి ప్ర చారం చేసేవారు. కావాలని దురహంకారాన్ని రెచ్చగొట్టే వారు. ఈ దేశంలో ఇప్పుడు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో వున్నది వేదాలలో అన్నీ వునాయష అని నమ్మే తిరోగమన భావజాలం వున్న వారే. దేశీయ వైద్యాన్ని అభివృద్ధి చేయటానికి వారికి ఎవరు అడ్డుపడ్డారు. కార్పొరేట్‌ ప్రయివేటు వైద్య విద్య, చికిత్సను ప్రోత్సహిస్తున్నారు. మన రాజమండ్రి ఆయనని తీసుకొనివెళ్లి జర్మన్లు ఆయుధాల విద్య నేర్చుకున్నారని చెప్పటం అమాయకత్వం తప్ప మరొకటి కాదు.

‘చదువుకున్నా చదువుకు సరైన ఉపాదిలభించక ఉపాధిని పొందడమే జీవిత లక్ష్యం

వేదాలలో …. నిర్వేదం ఉంది కాబట్టి

అవి శుద్ద దండగా అని నిరూపించడానికి……….

ఇప్పుడు అభివ ద్ధిలో ఉన్న దేశాలు కొన్ని ఒకప్పుడు భారతదేశానికి వచ్చి బాగు పడిపోయినవి.

డబ్బు కోసం తెల్లోని తొత్తులాయ్‌ మతం మరి సలాం కొట్టి గులాం గిరి చేసారు

వాడు వచ్చి మనని దోచి మన వేదాలను బూడిద చేసి మన దేవాలయాలను కూలగొట్టి

మన దేశం లో మనకే రాజు గామారి న తరవాత మనం ఇప్పుడు వాణి దెగ్గర గులాం చేయక ఎం చేస్తారు

అదే మన వేదాలను మన దెగ్గర భద్ర పరిస్తే ఈ పరిస్థితి ఉండేదా.

వేదాలు చదివిన ఘనాపాఠిలను చూసి వాళ్ళు ఏ కొత్త టెక్నా జీని ఆవిష్కరించలేక పోతున్నారని వారే విదేశీయ ఉత్పత్తుల కొరకు ఆరాటపడి పోతున్నారని నిర్ధారించుకొని విదేశాలకు పరుగులు పెడుతున్నారు. ఏ దేశంలో లేని ఖనిజ సంపద వనరులు కలిగిన మన మాత  భూమిని భారతదేశాన్ని కాలదన్ని విదేశీ మోజుతో వెళ్ళిపోతున్నారు.

వేదాల్లో అన్నీ ఉంటే వేదాలు చదివిన వేద పండితులు ప్రపంచానికి అవసరమైన ఆవిష్కరణలు చేసి భారత ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఎగరవేసేవారు. ప్రపంచ ప్రజలు .. ఇది భారత వేద పండితులచే కనిపెట్టబడినదని చెప్పుకొనే కనీసం ఒక వస్తువైనా ఉందా

జ: నా వ్యాసంలోను వీటి గురించి కొంత చర్చించి నందున కొన్నింటిపై వ్యాఖ్య అవసరం లేదని భావిస్తున్నాను. చివరగా ఒక మిత్రుడు ప్రశ్న వేదిక వేదాల గురించి వేమన ఎలా స్పందించిందీ చూడండి అంటూ రెండు పద్యాలు పంపారు.

వేద విద్యలెల్ల వేశ్యల వంటివి

భ్రమలు పెట్టి తేట పడగ నీవు

గుప్త విద్య యొకటె కులకాంత వంటిది

విశ్వదాభిరామ వినుర వేమ.

వేన వేలు చేరి వెర్రి కుక్కల వలె

అర్ధ హీన వేద మరచు చుంద్రు

కంఠ శోష కంటె కలిగెడి ఫలమేమి

విశ్వదాభిరామ వినుర వేమ!

మహాకవి వేమన హేతువాద భావజాలాన్ని అనుసరించే, ముందుకు తీసుకుపోయే అనేక మందిపై మతోన్మాదశక్తులు దాడులు చేస్తున్నాయి, ప్రాణాలు కూడా తీస్తున్నాయి. జనంలో ప్రతికూల స్పందన వస్తుందని భయపడిపోయి గానీ వేమనను కూడా కమ్యూనిస్టు , జాతి, హిందూ వ్యతిరేకి అని వున్మాదులు తిట్టి పోసే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు. భిన్నాభిప్రాయాన్ని అణచివేయాలని చూస్తున్న శక్తుల పట్ల ఎవరు వుపేక్షించినా వారు తమంతట తమ నోటిని మూసుకోవటమే. తరువాత తెరవాలన్నా తెరవనీయరు.