ఎం కోటేశ్వరరావు
ఏదో అయింది, లేకపోతే నరేంద్రమోడీ అంతటి పెద్ద మనిషి వివాదాస్పద, మసాలా మాటలు మాట్లాడి పార్టీకి ఇబ్బంది తేవొద్దు అని హెచ్చరించిన తరువాత కూడా తమ నేతల నేతల నోళ్లు ఇంకా వాగుతూనే వున్నాయని కొందరైనా బిజెపి అభిమానులు అంతరంగంలో అయినా అనుకోకుండా వుండజాలరు. నేతల నోళ్లు పని చేస్తుండటమే కాదు, పార్టీ మరుగుజ్జు యోధుల సేన(ట్రోల్స్) తమ ఎత్తుగడలతో ఇంకా ముందుకు పోతూనే వుంది. మోడీ అంటే వీరికి లెక్క లేదా లేక మోడీ అదుపులో వీరు లేరా లేక నేను పెద్దమనిషిగా సుద్దులు చెబుతుంటాను మీరు చేసేది చేయండి అన్న మార్గదర్శక సూత్రాలేమైనా వున్నాయా అని అనుమానించక తప్పటం లేదు. ఒకటి మాత్రం స్పష్టం. పులినెక్కిన వారు ఆకస్మికంగా స్వారీని మధ్యలో ఆపలేరు. దాన్ని వారు అదుపులోకి తీసుకొని దిగాలి లేదా దానికి బలి కావాలి. బిజెపి మతోన్మాద, విద్వేష ప్రచార పులి స్వారీ చేస్తోంది. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వుమా భారతి తాజాగా చేసిన వ్యాఖ్యలను చూసిన తరువాత మోడీ సలహా నేపధ్యంలో బిజెపి వారెంత తెలివిగా తమ నోళ్లను వుపయోగిస్తున్నారో తెలుస్తోంది.
పిటిఐ అందచేసిన వార్త ఇలా వుంది. మంగళవారం నాడు కేంద్ర మంత్రి వుమా భారతి దళితులను అవమానించిన తీరు కొంతకాలంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ దళితులను దువ్వేందుకు చేస్తున్న యత్నాలను గాలికిపోయేట్లు చేసిందంటే అతిశయోక్తి కాదు. వుమా భారతి మధ్య ప్రదేశ్‌లోని చత్తర్‌పూర్ సమీపంలో నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా దళితులతో సహపంక్తి భోజనానికి గైరు హాజరయ్యారు. వారితో కలసి భోంచేసి వారిని పునీతులను చేయటానికి తానేమీ భగవంతుడు రాముడిని కాదని వ్యాఖ్యానించారు. తరువాత ఆమె క్షమాపణలు చెప్పారు. వారితో కలసి భోజనం చేయాలనే విషయం తనకు తెలియదన్నారు. రెండు రోజుల క్రితం (మే ఒకటవ తేదీ) దాద్రి గ్రామంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ ‘ఇలాంటి కార్యక్రమాలను (షెడ్యూలు కులాల వారితో కలసి సహపంక్తి భోజనాలు చేయటం) నేను సమర్ధించినప్పటికీ దళితులతో కలసి భోజనం చేసేందుకు నేను వారి ఇండ్లకు వెళ్లను’ అని చెప్పారు. దానికి బదులు వారిని తానే తన ఇంటికి ఆహ్వానిస్తానని అన్నారు. ‘ నేను మీతో ఒక రహస్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను సహపంక్తి భోజనాలలో పాల్గనను, ఎందుకంటే ఎవరైతే శబరి ఇంటికి, దళితుల వద్దకు వారిని పునీతులను చేసేందుకు వెళ్లిన భగవంతుడు రాముడిని నేను అనుకోవటం లేదు. వారితో కలసి కూర్చోవటానికి, పునీతులను చేసేందుకు నేనేమీ భగవంతుడు రాముడిని కాదు. దానికి బదులు వారు మా ఇంటికి వచ్చి వంట ఇంట్లో కూర్చుంటే మేము పునీతులం అవుతాం. మా ఇంట్లో నా భోజన బల్లమీద దళితులకు నేను వడ్డిస్తే నా ఇల్లు, పాత్రలు కూడా పునీతం అవుతాయి. ఢిల్లీ రండి, మా మేనల్లుడి భార్య మీకు భోజనం తయారు చేస్తుంది. నేను మీకు వడ్డిస్తాను, మా మేనల్లుడు మీరు తిన్నతరువాత కంచాలను తీసి శుభ్రం చేస్తాడు. నేను మా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నేను మీతో కలిసి భోజనం చేయలేను, ఎందుకంటే ఇప్పటికే తిన్నాను, నేను మీ అందరినీ ప్రేమిస్తున్నా, ఎల్లవేళలా మీతోనే వుంటా ‘ అన్నారు.
తరువాత ఒక ప్రకటన చేస్తూ తన అనుచరుడైన హర్షు మహరాజ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భోజనం చేయవలసిన అంశం వుందని నాకు తెలియదు అని వేదికమీదనే చెప్పాను. ఇక్కడి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో వున్న టికమ్ ఘర్ జిల్లా పాపోడాకు వెళ్లి అక్కడ విద్యాసాగర్ మహరాజ్‌ను కలవాల్సి వుందని, అందువలన వారితో కలసి భోజనం చేయలేనని వారికి క్షమాపణ చెప్పాను. సామరస్యత సాధించాలంటే దళితులతో కలసి భోజనం చేయాలన్న ఒకప్పటి కాలం గతించింది. దానికి బదులు వారిని రాజకీయంగా, సామాజికంగా, ప్రభుత్వంలోనూ, యంత్రాంగంలోనూ, ఇతర వాటిలోనూ సామరస్యత సాధించాలంటే వారిని సమానత్వంతో తీసుకుపోవాలి. రాజకీయాలలో దళితులు, వెనుకబడిన తరగతుల మధ్య సామరస్యం సాధించేందుకు ఇప్పుడు వివక్షను అధిగమించాలి. సామాజిక సామరస్యతను సాధించాలంటే ఆర్ధిక సాధికారత, సామాజిక గౌరవం, ప్రభుత్వంలో, అధికార యంత్రాంగంలో సమాన భాగస్వాములను చేయటం మాత్రమే మౌలిక అవసరాలు.’ అన్నారు. కార్యక్రమం తరువాత దళితులతో భోజనం చేయాలనుకోవటం లేదని చెప్పటం గురించి విలేకర్లు అడగటం ఆశ్చర్యంగా వుందని వ్యాఖ్యానించారు.
సామాజిక సామరస్యత, కుల తత్వానికి వ్యతిరేకంగా సహపంక్తి భోజనాలు, దళితుల ఇండ్లలో భోజనం చేయటం వంటి కార్యక్రమాలను గత కొద్ది నెలలుగా బిజెపి పెద్ద ఎత్తున ప్రచారంతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పూర్వరంగంలో ఒక కేంద్ర కాబినెట్ మంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా వుమా భారతి వ్యవహరించిన తీరు బిజెపి నేతల అంతరంగాన్ని తెలియచేస్తున్నది. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని బిజెపితో గట్టి స్నేహం చేసిన చంద్రబాబు నాయుడు గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సోమవారం నాడు వుత్తర ప్రదేశ్ మంత్రి సురేష్ రాణా అలీఘర్‌లోని ఒక దళితుని ఇంట బయటి నుంచి తెచ్చిన భోజనం చేసి విమర్శల పాలయ్యాడు.
విలేకర్లతో ప్రత్యక్షంగా మాట్లాడకూడదన్న దీక్షలో వున్నారు కనుక తమ పార్టీ నేతలునోటి తుత్తరను అదుపులో వుంచుకోవాలని మోడీ చెప్పటం వరకు బానే వుంది. కానీ ఇతర నేతలకు ఎలా సాధ్యం అవుతుంది. కాశ్మీరులో ఎనిమిదేండ్ల బాలిక అసిఫాపై జరిగిన అత్యాచారాన్ని లండన్ భారత సంతతి వారి సభలో ప్రధాని నరేంద్రమోడీ సూటిగా ఖండించకుండా కుండా అత్యాచారం అత్యాచారమే దాన్నెలా సహిస్తాం అని ఎదురు ప్రశ్నవేస్తూ రాజకీయం చేయవద్దని వ్యాఖ్యానించారు. అత్యాచార వుదంతం ప్రపంచవార్తగా తయారైంది. నిందితులపై కేసు నమోదు చేయవద్దని జమ్ము బార్ అసోసియేషన్ అడ్డుకుంది. నిందితులు నిర్దోషులంటూ హిందూ ఐక్య వేదిక పేరుతో జరిగిన సభలో ఇద్దరు కాశ్మీరు మంత్రులు, ఎంఎల్‌ఏలు పాల్గన్నారు. నష్ట నివారణ చర్యగా ఇద్దరు మంత్రులను రాజీనామా చేయాలని బిజెపి ఆదేశించింది. ఇంత జరిగాక ఆ సభలో పాల్గన్న ఒక ఎంఎల్‌ఏకు మంత్రి పదవి కట్టబెట్టారు. కవీందర్ గుప్తా అనే ఎంఎల్‌ఏను వుప ముఖ్యమంత్రిగా చేశారు. ఇంత జరిగిన తరువాత సదరు కవీందర్ అసిఫా హత్యాచార సంఘటన చాలా చిన్నదని వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి. దోషులకు మద్దతుగా పాల్గన్న ఎంఎల్‌ఏకు మంత్రి పదవి ఇవ్వటం ఏమిటని అడిగితే అది ఇప్పటి నిర్ణయం కాదు, మూడు సంవత్సరాల నాడే మంత్రి వర్గమార్పులు చేయాలని నిర్ణయించినదానిలో భాగమే అని బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సమర్ధించుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అయితే నారదుడు ఇంటర్నెట్ గూగుల్ వంటి వాడని సెలవిచ్చారు. అంతకు ముందు మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ వుండబట్టే సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ వార్తలను ఎప్పటికప్పుడు తెలియచేశాడని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ దేవ్ చెప్పిన విషయమూ తెలిసిందే. జ్ఞానపరంగా బిఆర్ అంబేద్కర్, నరేంద్రమోడీ ఇద్దరూ బ్రాహ్మలే అని గుజరాత్ స్పీకర్ రాజేంద్ర త్రివేదీ వర్ణించాడు. గుణాన్ని బట్టి కులం వుంటుందని, జ్ఞానం వున్న ప్రతి వారూ బ్రాహ్మలేనని శ్రీకృష్ణుడే చెప్పాడని, అందుకే తాను అంబేద్కర్, మోడీ ఇద్దరూ బ్రాహ్మలే అన్నానని సమర్ధించుకున్నాడు.
కేంద్ర మంత్రి అనంత కుమార హెగ్డే కర్ణాటక ఎన్నికల సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేవాలయాలకు వెళ్లినపుడు కావి(కాషాయ) దుస్తులు, మఠాలకు పోయినపుడు రుద్రాక్షలు, కోడి ఈకలతో మసీదులకు, శిలువ ధరించి చర్చ్‌లకు వెళతాడు, ఇప్పుడు ఆయన శ్రావణ బెళగొళ వెళతాడు అంటూ ఎద్దేవా చేశాడు. ఎలాంటి దుస్తులు ధరించని జైన్ దిగంబర ఆలయం అది అన్న విషయం తెలిసిందే. తమ మనోభావాలను కేంద్ర మంత్రి కించపరిచాడంటూ జైనులు ఇప్పుడు నిరసన తెలుపుతున్నారనుకోండి. ఇలా నోరుపారవేసుకోకపోతే కార్యకర్తలకు కిక్కు ఎక్కదు, మీడియాలో ప్రచారం రాదని బిజెపి నేతలకు బాగా తెలుసు. అయితే ఇలాంటి వాటిని వుపయోగించుకొని పార్టీలో ప్రతీకారం తీర్చుకొనే అవకాశాలు కూడా లేకపోలేదు. కథువా(అసిఫా) అత్యాచారం వెనుక పాకిస్ధాన్ హస్తం వుందని వ్యాఖ్యానించిన బిజెపి మధ్యప్రదేశ్ అధ్యక్షుడు నంద కుమార్ సింగ్ చౌహాన్ పార్టీ వుద్యోగం పొగొట్టుకున్నాడు. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన వుప ఎన్నికలలో బిజెపి ఓడిపోవటానికి ఎవరో ఒకరిని బలిపశువును చేయాలి కనుక ఈ వ్యాఖ్యలను చూపి ఇంటికి పంపించారనే వార్తలు కూడా వచ్చాయి. సదరు నేతకు నోరు పారవేసుకోవటం సాధారణం. రాజకీయ నేతలు నేరగాళ్లకు విధిగా మద్దతు ఇవ్వాలని గతంలో ప్రకటించాడు. తమ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా నాలుక కోస్తా అని బిజెపి ఎంఎల్‌ఏ చేసిన వ్యాఖ్యలు ఒక వుప ఎన్నికలో బిజెపిని దెబ్బతీశాయి. అదే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరీ శంకర్ బిసేన్ తమ గ్రామంలో తాగటానికి మంచి నీళ్లు లేవంటే అయితే మీకు బిస్లరీ వాటర్ సరఫరా చేస్తాంలే అని వ్యంగోక్తితో ఆగ్రహం తెప్పించాడు. ఫ్రెంచి విప్లవ సమయంలో తినటానికి రొట్టెలు దొరకటం లేదని జనం ఆగ్రహంతో వున్నారు మహరాణీ అంటే అయితే వారు కేకులు తినవచ్చు కదా అన్న మారీ అంటోనియెట్‌ను ఈ మంత్రి గుర్తుకు తెచ్చారు. తమకు ఓటు వేయని వారంతా పాకిస్తానీలే అని సహకారశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ నోరుపారవేసుకున్నాడు. రైతుల ఆత్మహత్యలు డబ్బుకోసం, ఒక ఫాషనైపోయింది అన్న వ్యాఖ్యలు చేసిన అనేక మంది గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి తమకు ఎదురు లేదనే అధికార దురహంకారం ఒక కారణమైతే, అడుగుజారుతున్న సమయంలో వ్యక్తమయ్యే అసహనానికి కూడా ఇవి చిహ్నమే. అంతేకాదు, వారి అంతరంగాన్ని కూడా ఇవి బయటపెడతాయి. మేకతోలు కప్పుకున్న పులులు, గోముఖ వ్యాఘ్రాలు కూడా ఇలాగే వుంటాయి.