Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

‘ప్రపంచం ద అష్టిలో ఆ రెండు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది’ అన్నట్లు కనిపించే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వారం రోజుల క్రితం ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దాని పర్యవసానాల గురించి పండితులు చర్చలు చేస్తుండగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ భేటీ గురించి వార్తలు వచ్చాయి. ఎప్పుడు ఎక్కడ అన్నది ఇంకా ఖరారు కాలేదు. ఉభయ కొరియాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అమలు జరగటానికి ముందు అనేక అంశాలపై స్పష్టత రావాల్సి వుంది. రెండు దేశాలను అణు రహితంగా మార్చడం, రెండు దేశాల మధ్య వున్న శత్రుపూరిత కార్యకలపాలకు స్వస్తి పలకడం, ప్రచార దాడులను నిలిపివేసి రెండు దేశాల మధ్య వున్న మిలిటరీ రహిత ప్రాంతాన్ని శాంతి మండలంగా మార్చడం, సరిహద్దు ప్రాంతంలో ఆయుధాల సంఖ్య తగ్గింపు, అమెరికా, చైనాల ప్రమేయంతో చర్చలను ముందుకు తీసుకు పోవటం, కొరియా యుద్ధ సమయం లో విడిపోయిన కుటుంబాలను దగ్గరకు చేర్చటం, సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైలు మార్గాల నవీకరణ, ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో సహా అన్ని క్రీడలలో సంయుక్త జట్లతో పాల్గనటంపై ఒప్పందం కుదిరింది. 1953లో ఎక్కడైతే కొరియా యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో, తాత్కాలిక సరిహద్దుగా గుర్తించిన చోట, దక్షిణ కొరియా వైపున వున్న మిలిటరీ రహిత ప్రాంతమైన పాముంజోమ్‌లోని ‘శాంతి నివాసం’లో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌, దక్షిణ కొరియా నేత మూన్‌ జె ఇన్‌ భేటీలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం కుదరడం ఒక చారిత్రక సంఘటన. అయినప్పటికీ అమలు లోకి రావటం అంత తేలిక కాదని తరువాత వెలువడిన వార్తలు సూచిస్తున్నాయి. దక్షిణ కొరియాలో 1953 నుంచీ తిష్ట వేసిన అమెరికా సేనలను ఉపసంహరించాలన్నది ఉత్తర కొరియా ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌. ఒప్పంద సమయంలో దాని ప్రస్తావన లేనప్పటికీ ఆ డిమాండును అది వదులుకుంటుండా అన్నది ప్రశ్న. తమ రక్షణకు హామీ వుంటే అణ్వాయుధాలతో తమకు పని లేదని, అమెరికా సైనికుల ఉపసంహరణను కూడా పెద్దగా పట్టుపట్టబోమని పరోక్షంగా సూచించినట్లు నిర్దారణ కాని వార్తలు వచ్చాయి. అయితే శాంతి ఒప్పందా లకు, తమ దేశంలో వున్న 29 వేల అమెరికన్‌ సైనికుల ఉపసంహరణకు సంబంధం లేదని దక్షిణ కొరియా అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌-కిమ్‌ మధ్య జరగబోయే భేటీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.దక్షిణ కొరియాలో అమెరికన్‌ సైనికుల సంఖ్య తగ్గింపు గురించి పరిశీలించాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఆలోచనలు గతంలో కూడా జిమ్మీ కార్టర్‌ నుంచి అనేక మంది చేయకపోలేదు. ప్రపంచంలో అనేక చోట్ల పరాజయమే తప్ప విజయాలు లేనపుడు అమెరికా సైనికులను విదేశాలలో వుంచి పెద్ద మొత్తంలో ఎందుకు ఖర్చు చేయాలన్న చర్చ అమెరికాలో చాలా కాలం నుంచి వుంది. దక్షిణ కొరియాలో తిష్టవేసిన సైన్యానికి అయ్యే ఖర్చు తగినంత అమెరికాకు తిరిగి రావటం లేదు. ఆ సైనికులు జపాన్‌కు రక్షణగా వున్నారు తప్ప మరొకటి కాదు. ఇరవైతొమ్మిది వేల మంది సైనికులు పక్కనే వున్నా అమెరికా నుంచి అణ్వస్త్రాలను తెచ్చి దక్షిణ కొరియాలో మోహరించినా, గువాం ప్రాంతంలో బాంబర్లు, పసిఫిక్‌ సముద్రంలో జలాంతర్గాములను మోహరించినా వుత్తర కొరియా అణు, క్షిపణి పరీక్షలను నివారించలేకపోయాయి. వుత్తర కొరియన్లు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. చేతి చమురు వదలి, పరువు పోగొట్టుకోవటం ఎందుకని కొందరు అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాదితో ముగిసే దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సైనికులకు ఏడాదికి అయ్యే ఖర్చు 80కోట్ల డాలర్లలో సగమే దక్షిణ కొరియా చెల్లిస్తోంది. మొత్తం ఖర్చు భరించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. వారు వున్నా ప్రయోజనం లేనపుడు అంత ఖర్చు తామెందుకు చెల్లించాలన్న ప్రశ్న దక్షిణ కొరియాలోనూ వస్తోంది. వుభయ కొరియాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత అమెరికా సైన్యాల తిష్టను సమర్ధించుకోవటం కష్టం అవుతుందని దక్షిణ కారియా ప్రభుత్వ సలహాదారు మూన్‌ చంగ్‌ ఇన్‌ స్వయంగా చెప్పారు. గతంతో పోలిస్తే దక్షిణ కొరియా సైన్యం కూడా పటిష్టంగా తయారైంది. వుత్తర కొరియా విషయానికి వస్తే అమెరికన్‌ సైనికుల వుపసంహరణ డిమాండ్‌ గురించి తాము పట్టుపట్టకపోవచ్చని కిమ్‌ జోంగ్‌ అన్‌ దక్షిణ కారియా అధికారులతో సూచన ప్రాయంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఎత్తుగడలలో భాగం.

ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం 1991వరకు వున్నది ఒకటే, రెండు కొరియాలు లేవు.1948లో ఐక్యరాజ్యసమితి దక్షిణ కొరియాను పరిశీలక హోదాలో గుర్తించింది. వుత్తర కొరియాను గుర్తించ నిరాకరించింది. 1950లో దక్షిణ కొరియాపై వుత్తర కొరియా దాడి చేసిందనే ఫిర్యాదు రావటంతో భద్రతా మండలి వుత్తర కొరియాపై చర్య తీసుకోవాలని తీర్మా నించింది. ఆ తీర్మానాన్ని నాటి సోవియట్‌ యూనియన్‌ వీటో చేయలేదు. దాంతో అమెరికా నాయకత్వంలో వుత్తర కొరియాపై దాడి జరిగింది. ఆ దాడిని చైనా సహకారంతో వుత్తర కొరియా తిప్పి కొట్టి తన భూభాగాన్ని నిలుపు కొన్నది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 1971 వరకు ఐక్యరాజ్యసమితిలో చైనా అంటే నేటి తైవాన్‌ ప్రతినిధిగా వుంది. ఆ ఏడాది చైనాను గుర్తించిన తరువాత తైవాన్‌ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కొరియా విషయంలో భిన్నంగా జరిగింది. అది ఐరాస ఏర్పాటు సమయానికి స్వతంత్ర దేశంగా లేదు. 1971లో కమ్యూనిస్టు చైనాకు గుర్తింపు వచ్చిన తరువాత వుత్తర కొరియాకు పరిశీలక హోదా కల్పించారు. తరువాత రెండు దేశాలూ తాము శాంతియుత పద్దతుల్లో విలీనానికి చర్యలు తీసుకుంటామని సంయుక్తంగా ప్ర కటించాయి. తరువాత రెండు దేశాలకు 1991లో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. విలీస సమస్య పరిష్కారం కాలేదు. నేటి వరకు వరకు వుభయులు ప్రకటనలైతే చేస్తున్నారు గానీ ముందుకు సాగటం లేదు. అందువల్లనే ఆచరణలో మనకు కనిపిస్తున్నది ఒకే దేశం, రెండు వ్యవస్ధలు. వుత్తర కొరియా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంలో వున్న రెండున్నర కోట్ల జనాభా వున్న దేశం. దీర్ఘకాలం పాటు సైనిక నియంతల పాలనలో తరువాత సైనికాధికారుల కనుసన్నలలో పనిచేసే పౌర పాలకులతో పని చేస్తున్న ఐదు కోట్లకు పైగా జనాభాతో పెట్టుబడిదారీ వ్యవస్ధలో వున్న దేశం దక్షిణ కొరియా.

ప్రపంచం దృష్టి సారించే విధంగా వుభయ దేశాల మధ్య వురుములు మెరుపులతో పాటు పెద్దగా సంప్రదింపుల వాతావరణం కూడా కనపడలేదు. కానీ రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తాపీగా ప్రకటించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. అదీ ఎక్కడా 1953లో ఎక్కడైతే కొరియా యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం కుదరిందో, తాత్కాలిక సరిహద్దుగా గుర్తించిన చోట, దక్షిణ కొరియా వైపున వున్న మిలిటరీ రహిత ప్రాంతమైన పాముంజోమ్‌లోని ‘శాంతి నివాసం’లో వుత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌, దక్షిణ కొరియా నేత మూన్‌ జె ఇన్‌ భేటీలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

రెండు దేశాలను అణురహితంగా మార్చటం, రెండు దేశాల మధ్య వున్న శత్రుపూరిత కార్యకలపాలకు స్వస్ధి పలకటం, ప్రచార దాడులను నిలిపివేసి రెండు దేశాల మధ్య వున్న మిలిటరీ రహిత ప్రాంతాన్ని శాంతి మండలంగా మార్చాలి, సరిహద్దు ప్రాంతంలో ఆయుధాల సంఖ్య తగ్గింపు, అమెరికా, చైనాల ప్రమేయంతో చర్చలను ముందుకు తీసుకుపోవటం, కొరియా యుద్ద సమయంలో విడిపోయిన కుటుంబాలను దగ్గరకు చేర్చటం, సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైలు మార్గాల నవీకరణ, ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో సహా అన్ని క్రీడలలో సంయుక్త జట్లతో పాల్గనటంపై ఒప్పందం కుదిరింది.

వివాహానికి ముందే విడాకుల గురించి చర్చించే ప్రబుద్ధుల మాదిరి రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదల గురించి వూహాగానాలు చేసే పశ్చిమ దేశాల మీడియా కుదిరిన ఒప్పందాంశాలపై కూడా మరుక్షణం నుంచే వుత్తర కొరియాపై చిత్తశుద్ధిపై రచ్చ ప్రారంభించింది. గతంలో కుదిరిన కొన్ని ఒప్పందాల నుంచి వుత్తర కొరియా వెనక్కు తగ్గిన మాట వాస్తవం. దానికంటే ముందు మరో ఒప్పంద భాగస్వామి అమెరికా వాగ్దానభంగం చేయటమే కాదు, వుత్తర కొరియాను రెచ్చగొట్టిన పర్యవసానమే అది. కొరియా ద్వీపకల్పంలో చిచ్చు పెట్టింది, పిర్ర గిల్లి జోలపాడుతోంది, దక్షిణ కొరియాను తన చేతిలో పావుగా చేసుకొని వుత్తర కొరియాకే కాదు, పక్కనే వున్న సోషలిస్టు చైనాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోంది అమెరికాయే.

వుత్తర కొరియా విశ్వసనీయతపై సందేహాలు లేవనెత్తుతున్న పశ్చిమ దేశాలు మరో నూతన ఒప్పందాన్ని ఎందుకు ప్రోత్సహించినట్లు? ఇది సమాధానం లేని ప్రశ్న. పశ్చిమ దేశాల కుట్రలు, కుయుక్తుల గురించి తెలిసీ వుత్తర కొరియా ఎందుకు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు దేశాల వెనుక పనిచేసిన వత్తిడులేమిటి? ఈ రీత్యా చూసుకున్నపుడు వుభయులకూ ఇది అవసరమే. ఎవరి ఎత్తుగడలు వారికి, ఎవరి ప్రయోజనాలు వారికీ వున్నాయి.

వేల సంవత్సరాల పాటు ఒకే దేశంగా కొనసాగిన కొరియాను కే దేశంగా 1910లో జపాన్‌ ఆక్రమించింది. దానికి వ్యతిరేకంగా కొరియన్లు పెద్ద ఎత్తున వుద్యమాలు నడిపారు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసే సమయంలో 1945 ఆగస్టు తొమ్మిదిన యాల్టా సమావేశంలో కుదిరిన ఒప్పందం మేరకు జపాన్‌పై నాటి సోవియట్‌ యూనియన్‌ యుద్ధం ప్రకటించింది. అయితే కొరియాలో అప్పటికే కమ్యూనిస్టులు విముక్తి పోరాటాలలో ముందుండటంతో విముక్తి జరిగిన తరువాత కొరియా సోవియట్‌ ప్రభావంలోకి వెళుతుందనే భయంతో 38వ అక్షాంశ రేఖ వరకు మాత్రమే సోవియట్‌ సైన్యాలు పరిమితం కావాలని మిగతా ప్రాంతాన్ని తమకు వదలాలని అమెరికా కోరింది. వారం రోజులలోపే అమెరికా సేనలు ప్రవేశించక ముందే జపాన్‌ చేతులేత్తేసింది. మరో పది రోజుల తరువాత ఎర్ర సైన్యం వుత్తర కొరియాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇరవై రోజులకు అమెరికా సేనలు వచ్చాయి. తమకు అనుకూలంగా వుంటే మిలిటరీ ప్రభుత్వాన్ని దక్షిణ కొరియాలో ఏర్పాటు చేశాయి.

Image result for korea missile

జపాన్‌ తప్పుకున్న తరువాత రెండవ ప్రపంచ యుద్ధ మిత్రరాజ్యాల పర్యవేక్షణలో కొంతకాలం కొరియాలో పాలన సాగించాలని కొందరు ప్రతిపాదించారు. అయితే దేశభక్తులు తమకు వెంటనే స్వాతంత్య్రం కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టులను, పోటీగా స్వాతంత్య్రపోరాట సమయంలో పశ్చిమ దేశాలకు పారిపోయిన, జపాన్‌తో చేతులు కలిపిన ద్రోహులను, కమ్యూనిస్టు వ్యతిరేకులను అమెరికన్లు చేరదీశారు.

అమెరికా ప్రోద్బలంతో కొరియాపై తాత్కాలిక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి చేసిన ప్రతిపాదనను సోవియట్‌ యూనియన్‌ తిరస్కరించింది. తరువాత అమెరికన్లు దక్షిణ కొరియాలో ఎన్నికల తతంగం జరిపి మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారాన్ని దానికి బదలాయించారు. వుత్తర కొరియా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సోవియట్‌ సేనలు అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయాయి. అయితే దక్షిణ కొరియా మిలిటరీకి శిక్షణ ఇచ్చే నెపంతో అమెరికా సేనలు అక్కడే తిష్టవేశాయి. కొరియాను ఒకే దేశంగా పరిగణిస్తూ రెండు ప్రభుత్వాలు మొత్తం కొరియాకు తామే ప్రతినిధులమని ప్రకటించుకున్నాయి. విభజన తాత్కాలికమే అని రెండు ప్రాంతాల విలీనానికి కట్టుబడి వున్నట్లు పేర్కొన్నాయి. ఎవరికి వారు పైచేయి సాధించి దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే 1950 జూన్‌ 25న రెండు ప్రాంతాల మిలిటరీ మధ్య ఘర్షణ తలెత్తింది. దక్షిణ కొరియాలోని ప్రభుత్వానికి రక్షణ కల్పించే పేరుతో భద్రతా మండలిలో అమెరికా ఒక తీర్మానం చేయించటం, ఐరాస సేనల పేరుతో వుత్తర కొరియాపై దాడికి దిగాయి. కొద్ధి కాలం తరువాత వుత్తర కొరియాకు మద్దతుగా చైనా రంగంలోకి వచ్చింది. అమెరికా నాయకత్వంలోని సేనలను తరిమి కొట్టింది. చివరకు 1953 జూలై 27న వుభయ ప్రాంతాల మధ్య పూర్వపు సరిహద్దులను పునరుద్దరిస్తూ 38వ అక్షాంశ రేఖ పరిసరాలను మిలిటరీ రహిత ప్రాంతంగా గుర్తిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు

ఈ ఒప్పందం కాల్పుల విరమణకే పరిమితమైంది తప్ప తదుపరి శాంతి ఒప్పందం కుదరలేదు.దాన్ని కూడా దక్షిణ కొరియా పాలకులు ఆమోదించి సంతకాలు చేయలేదు, చివరకు కట్టుబడి వుంటామని మాత్రమే ప్రకటించారు.దాంతో తాము కూడా కట్టుబడటం లేదని వుత్తర కొరియా ప్రకటించింది. అందువలన ఇప్పటికీ సాంకేతికంగా కాల్పుల విరమణ జరిగింది తప్ప సాంకేతికంగా యుద్ధం ముగిసినట్లు కాదు.

కొరియా యుద్దం, దేశ విభజన కొరియన్లను అనేక కష్ట నష్టాలపాలు చేసింది. ఏడున్నరలక్షల మంది తమ కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ఎదురుగా కనిపిస్తున్నా ఒకరి నొకరు కలుసుకోలేని దుస్ధితి. రెండు ప్రాంతాల మధ్య నిత్యం వుద్రిక్తతలు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఆందోళన,భయం వెన్నాడుతూ వుంటుంది. వుభయ ప్రాంతాలను వేరు పరచి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఒకే దేశం, ఒకే ప్రజగా ప్రపంచం ముందు తలెత్తుకు నిలబడాలన్న తపన ఇంకా మెజారిటీ జనంలో వుందని అనేక సర్వేలు వెల్లడించాయి. గత ఐదు ద శాబ్దాలలో వుభయుల మధ్య విబేధాలను పెంచే అనేక వుదంతాలు జరిగాయి. వాటి వెనుక అమెరికా ప్రచ్చన్న హస్తం వుంది. కొరియా ప్రాంతంలో తిష్ట వేయాలంటే అమెరికన్లకు ఒక దేశం అవసరం. అది దక్షిణకొరియాగా వుండాలన్నది దాని వాంఛ అందుకే విలీనానికి ఇంకా సమయం రాలేదు, దక్షిణ కొరియన్లలో భయం తొలగలేదంటూ కుంటి సాకులు చెబుతున్నది. నిజానికి రెండు ప్రాంతాలు విలీనమైతే జనాభా రీత్యా చూసుకుంటే రెండున్నర కోట్ల మంది వుత్తర కొరియన్లతో పోలిస్తే ఐదుకోట్లమందికి పైగా వున్న దక్షిణ కొరియన్లే నిర్ణయాత్మక పాత్ర వహిస్తారు. అందువలన వారు భయపడుతున్నారని చెప్పటంలో అర్ధం లేదు. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక తిష్ట వుత్తర కొరియన్లనే భయపెడుతున్నది, ఎందుకంటే 1950దశకంలో వారిపై దాడి చేసింది అమెరికన్లు, వారి కనుసన్నలలో పనిచేసే దక్షిణ కొరియా మిలిటరీ తప్ప మరొకటి కాదు.

Image result for north korea  arms show

అమెరికా ఈ వైఖరి కారణంగానే వుత్తర కొరియా తన రక్షణ చర్యల్లో భాగం ఆధునిక క్షిపణులు, అణు కార్యక్రమాలను చేపట్టాల్సి వచ్చింది. ప్రపంచంలో అణు రియాక్టర్లను కలిగిన ఏ దేశమైనా అణ్వాయుధాలను తయారు చేయటానికి అవసరమైన ముడి సరకును కలిగి వున్నట్లే. అందువలన దక్షిణ కొరియా అధికారికంగా ప్రకటించలేదు తప్ప దాని దగ్గర అణ్వాయుధాలు లేవని చెప్పలేము. వుత్తర కొరియా అణుక్షిపణుల కార్యక్రమాన్ని ప్రారంభించటంతో 2003 నుంచి అమెరికా, చైనా,జపాన్‌, రష్యా, వుభయ కొరియాల( ఆరు దేశాల) మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. 2006ల వుత్తర కొరియా తొలి అణుపరీక్ష జరిపింది.

తాజా ఒప్పందానికి దారితీసిన నేపధ్యాన్ని చూస్తే వుభయుల మీద పరిస్ధితులు, పర్యవసానాలు వత్తిడి తెచ్చాయనే చెప్పాలి. తమ వనరులను మిలిటరీ అవసరాలకు ఖర్చు చేయటం వుత్తర కొరియాకు ఎల్లవేళలా సాధ్యం కాదు. అది వాంఛనీయం కూడా కాదు. చైనా ఎంతగా సాయం చేసినప్పటికీ అమెరికా విధించిన అధికారిక, అనధికారిక ఆంక్షలు వుత్తర కొరియాను ఇబ్బంది పెట్టేవే. అందువలన కాస్త వూపిరి పీల్చుకోవాలంటే దక్షిణ కొరియాతో సామరస్యక పూర్వక ఒప్పందం దానికి కూడా అవసరమే.

వుత్తర కొరియా అణు పరీక్షలు, అణ్వాయుధాలను మోసుకుపోగల దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగాల ద్వారా అమెరికా,జపాన్లపై తాము బాంబుల వర్షం కురిపించగలమని వారు చేసిన హెచ్చరిక అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా వాసులను అనిశ్చితి, భయాందోళనలకు గురిచేసింది. అమెరికా ఎన్ని బెదిరింపులు చేసినా వుత్తర కొరియా వెనక్కు తగ్గదని తేలిపోవటంతో ఏదో ఒక విధంగా రాజీ ఒప్పందం చేయించట ద్వారా తమ జనాల్లో వున్న భయాన్ని పొగొట్టేందుకు అమెరికా, జపాన్‌ పాలకులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ధనిక దేశాలలో గత పది సంవత్సరాలుగా తలెత్తి కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభం దక్షిణ కొరియాను కూడా తాకింది. అది అక్కడి కార్మికవర్గంలో అసంతృప్తికి దారితీస్తోంది. దీనికి తోడు నిత్యం వుత్తర కొరియా నుంచి ఏం జరుగుతుందో తెలియని స్ధితి దక్షిణ కారియా పాలకవర్గం వత్తిడి కలిగిస్తోంది. వుత్తర కొరియాకు తోటి సోషలిస్టు దేశ ంగా ఎన్ని విధాలుగా సాయం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ వేదికల మీద కొన్ని సందర్భాలలో చైనా కూడా గట్టిగా మాట్లాడలేని స్ధితి వుంది. ఈ విధంగా కొరియా రాజకీయాలతో ప్రమేయం వున్న అన్ని దేశాలకు అనుకూల, ప్రతికూల వత్తిళ్లు వున్నాయి. ఈ కారణంగానే వుభయ కొరియాల మధ్య ఒప్పందానికి తెరవెనుక వుండి అన్ని దేశాలూ సంతకాలు చేయటానికి సహకరించాయనే చెప్పవచ్చు. ఈ పూర్వరంగంలోనే

2015 జనవరి ఒకటిన వుత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ దక్షిణ కారియాతో వున్నత స్ధాయి చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు.అదే ఏడాది ఆగస్టులో సరిహద్దులలో సంభవించిన కొన్ని సంఘటనలు వుద్రిక్తతలను కలిగించినా సర్దుబాటు చేసుకున్నారు. శాంతి చర్చలకు సంసిద్ధతతో పాటు వుత్తర కొరియా తన అణుపరీక్షలను కూడా కొనసాగిస్తూనే వస్తోంది. 2016లోఅరవైఎనిమిద వార్షికోత్సవం సందర్భంగా ఆరవ పరీక్ష జరిపింది.కిమ్‌ జోంగ్‌ ఇన్‌ను హత్య చేసేందుకు తమ వద్ద పధకం వుందని దక్షిణ కొరియా బెదిరించింది.ఈ ఏడాది మార్చి ఆరున కిమ్‌ దక్షి ణకొరియా రాయబారులతో సమావేశమై సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌ గురించి చర్చించారు.2017 మేనెలలో అధికారానికి వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ వుత్తర కొరియా సయోధ్య కు సై అన్నాడు.2018 నూతన సంవత్సర సందేశంల సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌కు జట్టును పంపేందుకు కిమ్‌జోంగ్‌ అన్‌ సంసిద్ధత ప్రకటించారు.

రెండు సంవత్సరాల తరువాత ముఖాముఖీ చర్చలకు తెరలేచింది. సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌కు ఐస్‌ హాకీలో వుమ్మడి జట్టును, అధ్లెట్లను పంపటంతో పాటు రెండు ప్రాంతాల క్రీడాకారులు ఒకటిగానే పరేడ్‌లో పాల్గన్నారు. ఈ పోటీలకు అసాధారణ రీతిలో వుత్తర కొరియా పార్లమెంట్‌ అధ్యక్షుడి నాయకత్వంలో పెద్ద ప్రతినిధి బృందం తరలి వచ్చింది. ఈ సందర్బంగానే తమ దేశాన్ని సందర్శించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఆహ్వానం అందచేశారు. ఈ పరిణామం తరువాత వుభయ దేశాల అధికారులు వుమ్మడిగా 2021 ఆసియా శీతాకాల ఆటల నిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు. మార్చినెలలో దక్షిణకారియా ప్రతినిధి బృందం పోంగ్‌యాంగ్‌లో వుత్తర కొరియా అధ్య క్షుడు కిమ్‌ను కలసింది. తరువాత అదే బృందం వాషింగ్టన్‌ వెళ్లి కిమ్‌తో భేటీ కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆహ్వానం అందచేసింది.

ఏప్రిల్‌ ఒకటవ తేదీన దక్షిణ కారియా పాప్‌ స్టార్స్‌ పోంగ్‌యాంగ్‌ వెళ్లి వసంతం వస్తోందంటూ ఒక సంగీత కచేరి నిర్వహించింది. దానికి కిమ్‌ హాజరయ్యారు. ఈలోగా పరస్పర ప్రచార దాడులు ఆగిపోయాయి.ఏప్రిల్‌ 27న వుభయ దేశాల నేతల శిఖరాగ్ర సమావేశం జరిగింది, ఒప్పందం కుదిరింది. కొరియా యుద్దం 1953 తరువాత తొలిసారిగా వుత్తర కొరియా నేత దక్షిణ కొరియాలో అడుగు పెట్టటం ఇదే ప్రధమం. ఎక్కడైతే నాడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో అక్కడే ఈ భేటీ జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని శాంతి ఒప్పందంగా మార్చాలన్న ఆకాంక్ష ఇరువురిలో వ్యక్తమైంది. ఒంటిచేతితో చప్పట్లు రావు, చేతులు కలపాలి, చేతలు జరగాలి.అలాగే కుదిరిన ఒప్పందాన్ని ఇరు పక్షాలు, వారి వెనుక వున్న మద్దతుదార్లు చిత్తశుద్దితో వుంటేనే ఆచరణలోకి వస్తుంది. ఎవరు ద్రోహం చేసినా అది ఒక్క కారియా ద్వీపకల్పానికే కాదు, యావత్తు ప్రపంచానికి నష్టదాయకం.