Tags
BJP leaders lies, Karnataka Legislative Assembly election 2018, karnataka votes 2018, karnataka votes facts
ఎం కోటేశ్వరరావు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికారం ఎవరికి అన్న బంతి గవర్నరు కోర్టులో వుంది. ఆ కోర్టును నియంత్రించేది బిజెపి కేంద్ర నాయకత్వం అన్నది అనధికార నిజం. గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోవా గవర్నరు చేసిందాని ప్రకారం కాంగ్రెస్-జెడిఎస్ కూటమి మెజారిటీని గుర్తించి ప్రభుత్వ ఏర్పాటకు ఆహ్వానిస్తారా లేక అతి పెద్ద పార్టీకి ముందు అవకాశం ఇవ్వటం సబబు అంటూ బిజెపిని గద్దెనెక్కిస్తారా అన్నది చూడాల్సి వుంది. గోవా సాంప్రదాయాన్ని అనుసరిస్తే బిజెపి ప్రతిపక్షంలో కూర్చోవాలి. లేదూ బిజెపిని ఆహ్వానించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి బేరసారాలకు, ఇతర ప్రలోభాలకు తెరలేపుతారా ? అదే జరిగితే మరోసారి బిజెపి రాజకీయంగా గబ్బుపట్టటం ఖాయం.
ఇక బిజెపికి వచ్చిన సీట్ల గురించి ఎవరేమన్నారు? ఇది బిజెపికి చారిత్రాత్మక విజయం: చత్తీస్‌ఘర్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో మా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి చరిత్రను సృష్టించారు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇది ఎంతవరకు నిజం ? 2004,08,13,18లో జరిగిన ఎన్నికల అంకెలేమి చెబుతున్నాయో ముందు చూద్దాం.పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతం,బ్రాకెట్లలోని అంకెలు వచ్చిన సీట్ల సంఖ్య)
సంవత్సరం బిజెపి కాంగ్రెస్ జెడి(ఎస్) ఇతరులు
2004 28.33(79) 35.27(65) 20.77(58) 15.3(22)
2008 33.86(110) 35.13(80) 19.44(28) 11.57(6)
2013 19.90(40) 36.60(122) 20.20(40) 24.40(22)
2018 36.20(104) 38.00(78) 18.40(38) 7.40 (2)
లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక ఓట్లు సీట్ల వివరాలు
2009 41.63(19) 37.5(6) 13.57(3) 5.20(0)
2014 43.00(17) 40.80(9) 11.00(2) 5.20(0)
పై అంకెలను చూసినపుడు కర్ణాటకలో తాజా ఎన్నికలలో బిజెపి బలం, పెరిగిందో తగ్గిందో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. నరేంద్రమోడీ, అమిత్ షా మాజిక్ లేనపుడు, అసలు వారెవరో కర్ణాటక ఓటర్లకు తెలియనపుడే 2009లో గరిష్టంగా ఆ పార్టీకి 41.63శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో 43శాతం ఓట్లు వచ్చాయి. అది ఇప్పుడు 36.2శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఓటింగ్‌లో పెద్ద మార్పులేమీ లేకుండా కొనసాగటాన్ని చూడవచ్చు.జెడిఎస్ బలం కూడా, అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు ఒకే విధంగానూ, పార్లమెంట్ ఎన్నికలలోనూ ఒకే విధంగా వుండటాన్ని చూడవచ్చు. నరేంద్రమోడీ, అమిత్ షాపర్యటన కారణంగా బిజెపి పెరిగిన ఓటింగ్ శాతమేమీ లేదు, అలాగని రాహుల్ గాంధీ ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు తగ్గిందేమీ లేదు. 2014 పార్లమెంట్ ఎన్నికలలోనే ఎడ్డియూరప్ప, గాలి అండ్‌కో కలిసిన కారణంగా బిజెపి ఓటింగ్ 43శాతానికి పెరిగి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 36.2శాతానికి తగ్గిందన్నది రాజకీయాల్లో ఓనమాలు వచ్చిన వారికి కూడా తెలిసిందే.తొలిసారిగా దక్షిణాదికి ముఖద్వారంగా వున్న కర్ణాటక పాగా వేశామన్నట్లుగా బిజెపి నేతలు చిత్రిస్తున్నారు. దానికి గతంలోనే గరిష్టంగా 110 స్ధానాలు వచ్చి అధికారం వెలగబెట్టి గబ్బుపట్టిన విషయాన్ని మరుగుపరుస్తున్నారు.