
ఎం. కోటేశ్వరరావు
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, దాని దుండగాలకు వెన్నుదన్నుగా అమెరికా మరోసారి పాలస్తీనియన్లపై దమనకాండకు పాల్పడ్డాయి. వాటి దుష్ట చరిత్రలో సోమవారం మరో చీకటి దినం. మధ్యవర్తి నంటూ ఒకవైపు ఫోజు పెడుతూనే నిస్సిగ్గుగా ఇజ్రాయెల్ వైపు నిలవటమే గాక దమనకాండపై దర్యాప్తు జరపాలన్న కనీస ప్రజాస్వామిక డిమాండ్ కూడా భద్రతామండలిలో ప్రవేశపెట్టేందుకు అమెరికా తిరస్కరించింది. పాలస్తీనియన్ల భూభాగమైన జెరూసలెంను ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ రూపొందించిన పధకాన్ని అమలు జరిపేందుకు పూనుకుంది. దానికి నిరసన తెలిపిన నిరాయుధులైన సామాన్య ప్రజానీకంపై ఇజ్రాయెల్ మిలిటరీ జరిపిన మారణకాండలో ఎనిమిదినెలల పసిపాప సహా 60మంది మరణించగా 2,700మందికిపైగా గాయపడినట్టు వార్తలు వచ్చాయి. తూర్పు జెరూసలెం పట్టణానికి తమ ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయాన్ని తరలిస్తామని రక్తపిపాసి డోనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పుడే ఈ మారణకాండకు బీజం పడింది. కాగా ఈ మారణకాండపై దర్యాప్తు జరపాలని కోరేందుకు మంగళవారం నాడు సమావేశమైన భద్రతా మండలిని అమెరికా అడ్డుకుంది. కువాయిట్ రూపొందించిన ఈ తీర్మానంలో సోమవారంనాటి దారుణంపై విచారణ జరపాలని కోరింది. జెరూసలెంలో రాయబార కార్యాలయాల ఏర్పాటు వద్దంటూ గతంలో చేసిన భద్రతా మండలి తీర్మానానికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్న విజ్ఞాపన కూడా దానిలో ఉంది. సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టరాదని అమెరికా అభ్యంతరం తెలిపింది. యూదులు, ముస్లింలు, క్రైస్తవులకు కూడా ఆరాధనా కేంద్రమైన జెరూసలెం పట్టణంపై అంతిమంగా ఒక నిర్ణయం తీసుకొనే వరకు ఎలాంటి వివాదాస్పద చర్యలకూ పాల్పడవద్దన్నది ప్రపంచ రాజ్యాల ఏకాభిప్రాయం. దానికి అమెరికా తూట్లు పొడిచింది. సోమవారంనాడు మరణించిన తమ సహచరుల అంత్యక్రియలకు పెద్ద ఎత్తున పాలస్తీనియన్లు హాజరై మరోమారు తమ నిరసన తెలిపారు.
ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ఏర్పాటు కావాల్సిన స్వతంత్ర పాలస్తీనాకు తూర్పు జెరూసలెం పట్టణాన్ని తమ రాజధానిగా చేసుకోవాలన్నది పాలస్తీనియన్ల చిరకాల వాంఛ. సరిగ్గా 70ఏండ్ల క్రితం పాలస్తీనాను రెండుగా విభజించి యూదులు మెజారిటీ ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్గా ఏర్పాటు చేయాలన్నది ఐరాస తీర్మానం. ఇజ్రాయెల్ అయితే ఏర్పడింది. అంతవరకు ఉనికిలో ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. లక్షలాది మంది అరబ్బులు తమ నివాసాల నుంచి గెంటివేతకు గురై ఇప్పటికీ చుట్టుపక్కల దేశాలలో తలదాచుకుంటున్న అన్యాయం కొనసాగుతోంది. 1948కి ముందే ఒక పధకం ప్రకారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలించిన యూదులు, సామ్రాజ్యవాద దేశాల ఆయుధాలు, అండదండలతో ఇజ్రాయెలీ సాయుధమూకలు పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. వ్యతిరేకించిన లక్షలాదిమంది అరబ్బును వారి నివాస ప్రాంతాల నుంచి తరిమివేశాయి. పాలస్తీనా ప్రభుత్వం, పాలనకు తిలోదకాలిచ్చి మొత్తం ప్రాంతాన్ని ఒక నిర్బంధశిబిరంగా మార్చివేసింది. అప్పటి నుంచి పాలస్తీనా ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ జనాభారీత్యా వాటి రూపురేఖలనే మార్చి వేసి అవికూడా యూదు ప్రాంతాలేనంటూ వాటిని కూడా తమకు అప్పగించాల్సిందే అని చెబుతోంది. తమ పౌరులకు రక్షణ పేరుతో ఆక్రమిత ప్రాంతాలలో యూదుల శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసింది.
ఈ ఆక్రమణలో భాగంగానే 1948లో అరబ్బులు మెజారిటీ ఉన్న జెరూసలెం పట్టణ ఆక్రమణకు పూనుకుంది. ఆ క్రమంలో దాని రక్షణకు వచ్చిన జోర్డాన్ తూర్పు జెరూసలెం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. పశ్చిమ జెరూసలెంను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ 1967లో ఇరుగుపొరుగు అరబ్బు దేశాలతో యుద్ధానికి తలపడి తూర్పు జెరూసలెంను కూడా ఆక్రమించుకుంది. 1980లో ఏకపక్షంగా తనకు తానే జెరూసలెం చట్టాన్ని చేసినట్టు ప్రకటించుకొని అధ్యక్ష, ప్రధాని నివాసం, పార్లమెంట్, సుప్రీం కోర్టు అనేక ప్రభుత్వ కార్యాలయాలను అక్కడికి తరలించి కబ్జాకు చట్టబద్దత కల్పించేందుకు పూనుకుంది. ఆ పట్టణం అవిభక్తమని మొత్తం తమదే అని ప్రకటించుకుంది. అయితే జెరూసలెం పాలస్తీనియులదే అని అంతర్జాతీయ సమాజం అనేక రూపాలలో ఇజ్రాయెల్ చర్యను ఖండించింది. దాని స్ధాయి నిర్ణయించేంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. దానికి అనుగుణ్యంగానే ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని గుర్తించిన దేశాలన్నీ తమ రాయబార కార్యాలయాలను రాజధాని టెల్ అవీవ్‌లో ఏర్పాటు చేశాయి.
ఇజ్రాయెల్ దాడులలో పుట్టి దాడుల మధ్య పెరిగిన పాలస్తీనా బిడ్డలందరికీ బాష్పవాయువు ప్రయోగాన్ని అధిగమించేందుకు వుల్లిపాయ ముక్కుల వద్ద పెట్టుకోవాలని పాలతో పాటు తల్లి పసితనం నుంచే నేర్పిస్తుంది
జెరూసలెం వివాదం కొనసాగుతుండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ రాయబార కార్యాలయాన్ని ఆ నగరానికి తరలిస్తున్నట్టు ప్రకటించి సరికొత్త వివాదానికి తెరలేపాడు. ఆ ప్రకటన వెలువడినప్పుడే పాలస్తీనియన్లతో అనేకమంది నిరసన, వ్యతిరేకత వ్యక్తం చేశారు. మార్చి నెల నుంచి ప్రతి శుక్రవారం పాలస్తీనియన్లు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. అప్పటి నుంచి ఆదివారంనాటి వరకు వివిధ సందర్భాలలో ఇజ్రాయెలీ భద్రతా సిబ్బంది జరిపిన దాడులలో కనీసం 84మంది పాలస్తీనియన్లు మరణించారు. అందువలన రాయబార కార్యాలయం ప్రారంభించే రోజు మరింత తీవ్రంగా, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఉంటాయని తెలిసినప్పటికీ ఎలాంటి చర్యతీసుకోకుండా సాగించిన ఈ మారణకాండను యావత్ ప్రపంచం ఖండించింది. ఆ రోజు మరో 60మంది మరణించారు. వ్యతిరేకతను ఖాతరు చేయకుండా సరిగ్గా 70ఏండ్ల క్రితం ఇజ్రాయెల్ ఏర్పడిన రోజునే జెరూసలెం కబ్జాను ఖరారు చేస్తూ అక్కడ సోమవారంనాడు రాయబార కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ట్రంప్ తన కుమార్తె, సలహాదారుగా వేసుకున్న ఆమె భర్త తదితరులను పంపించాడు. ఆ చర్యను నిరసిస్తూ పాలస్తీనా గాజా ప్రాంతంలోని అరబ్బు జాతీయులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అక్కడి సరిహద్దు కంచెను దాటి తమ భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారని, హింసాకాండకు పాల్పడ్డారనే పేరుతో విచక్షణారహితంగా తొలిసారిగా డ్రోన్ల ద్వారా బాష్పవాయు ప్రయోగం, కాల్పులకు తెగబడటంతో 60మంది ప్రాణాలు కోల్పోవటంతో పాటు 2700 మంది గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
కలేజా, కాంక్ష వుండాలే గాని కాళ్లు లేకపోతేనేం మాతృభూమి కోసం నేను సైతం అంటూ వడిశలతో ప్రతిఘటిస్తున్న పాలస్తీనా యువకుడు
పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ భద్రత, పోలీసు బలగాలు, యూదు దురహంకారులు దాడులు చేయటం, అవమానించటం, ఆర్థికంగా దెబ్బతీయటం నిత్యకృత్యం. ఇటీవలి కాలంలో ఒకే రోజు ఇంతమంది అరబ్బులు మరణించటం, గాయపడటం ఎప్పుడూ జరగలేదు. సోమవారం నాటి మారణకాండకు నిరసనగా మంగళవారం నాడు పలుచోట్ల నిరసన వ్యక్తమైంది. దక్షిణాఫ్రికా, టర్కీ నిరసనగా ఇజ్రాయెల్ నుంచి తమ రాయబారులను వెనక్కు రప్పించాయి. ఇజ్రాయెల్ రాయబారిని పిలిపించి ఐర్లండ్ తన నిరసన తెలిపింది. అనేక దేశాలు అభ్యంతరం తెలిపాయి. దీని గురించి భద్రతామండలి సమావేశం కానుంది. కొద్ది రోజుల క్రితం ఇరాన్‌తో కుదిరిన అణుఒప్పందాన్నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్టు అమెరికా ప్రకటించింది. అది జరిగిన వెంటనే సిరియాలోని ఇరాన్ మిలిటరీ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసింది. రాయబార కార్యాలయ ఏర్పాటు చర్య కూడా ఇరాన్, సిరియా, తదితర పశ్చిమాసియా అరబ్బు, ముస్లిం దేశాలను రెచ్చగొట్టటం, అక్కడ మండుతున్న ఆరని అగ్నిని మరింత ఎగదొయ్యటం తప్ప మరొకటి కాదు. ఇజ్రాయల్‌లో జరిగిన అనేక అవినీతి అక్రమాల గురించి జనాన్ని పక్కదారి పట్టించేందుకు పాలకపార్టీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. గాజా నది పశ్చిమ గట్టు, తూర్పు జెరూసలెం, సిరియా నుంచి ఆక్రమించుకున్న గోలన్ గుట్టలలో గత ఐదు దశాబ్దాలలో యూదుల నివాసాలను లక్షా 60వేల నుంచి ఆరులక్షలకు పెంచింది. గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉపసంహరించి నామమాత్ర పాలస్తీనా స్వయంపాలిత ప్రభుత్వానికి అప్పగించినప్పటికీ దాన్నొక బహిరంగ జైలుగా మార్చివేసింది. దాన్నుంచి బయటకు పోవాలన్నా, ఎవరైనా లోపలికి రావాలన్నా ఇజ్రాయెల్ అనుమతి తీసుకోవాల్సిందే. పాలస్తీనా విముక్తి ఉద్యమంలో గాజాకు ఒక ప్రత్యేకత ఉంది. అన్ని రకాల ఉద్యమాలు, పీఎల్ఓ అధినేత యాసర్ అరాఫత్ ఇక్కడ పుట్టిన వ్యక్తే. తిరుగుబాటు, అన్యాయాన్ని ప్రతిఘటించటం ఆ గడ్డలోనే ఉంది. తాజా పరిస్థితికి వస్తే అనేక పార్టీలు, సంస్థలు వాటి అనుబంధాలకు అతీతంగా ఒక ప్రజా ఉద్యమంగా గత కొద్ది వారాలుగా జెరూసలెం పాలస్తీనియన్లదే అని ఎలుగెత్తి చాటుతూ ప్రదర్శనలు చేస్తున్నారు.
తన దురాక్రమణకు ఆమోద ముద్రవేయించుకొనేందుకు తమతో దౌత్య సంబంధాలున్న దేశాలన్నీ తమ రాయబార కార్యాలయాలను జెరూసలెంకు తరలించాలని ప్రధాని నెతన్యాహు పిలుపునిచ్చాడు. జెరూసలెం మాత్రమే యూదులకు రాజధాని అని ప్రకటించాడు. ఆ దురహంకారికి తాన తందాన అంటూ ట్రంప్ అక్కడ రాయబార కార్యాలయ ప్రారంభం సందర్భంగా ముస్లిం వ్యతిరేక మతాధికారి రాబర్ట్ జఫ్‌రెస్‌తో ప్రార్ధనలు చేయించి అరబ్బులను మరింతగా రెచ్చగొట్టారు. పశ్చిమాసియాలో తన ఆర్థిక, రాజకీయ వ్యూహాన్ని అమలు జరిపేందుకు ఇజ్రాయెల్‌ను ఒక గూండాగా అమెరికా వినియోగించుకొంటోంది. దానికి అవసరమైన అధునాతన ఆయుధాలను అందించటంతో పాటు భద్రతా మండలిలో అన్ని విధాలుగా ఆదుకుంటోంది. అనేక వందల తీర్మానాలను ఇప్పటి వరకు వీటో చేసింది. ఏటా నాలుగు బిలియన్ డాలర్ల వంతున ఇప్పటి వరకు 135 బిలియన్ డాలర్లు సాయం పేరుతో యూదు దురహంకారులకు అందచేసింది. రెండు అంటే పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలను ఏర్పాటు చేయాలన్న తీర్మానానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూనే అయితే దానికి రెండు దేశాల ఆమోదమూ లభిస్తేనే అనే షరతు విధిస్తోంది. పాలస్తీనియన్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని, అందుకు అవసరమైన భూభాగాలను అదనంగా అప్పగించటంతో పాటు ఇరుగు పొరుగు దేశాల నుంచి రక్షణ హామీలు కావాలంటూ ఆచరణ సాధ్యంగాని డిమాండ్లను ముందుకు తెస్తూ ఇజ్రాయెల్ పాలకులు పాలస్తీనా ఏర్పాటు అడ్డుకుంటున్నారు. చాలా కాలం పాటు తటస్ధంగా వున్నట్టు నాటకమాడిన అమెరికా ట్రంప్ హయాంలో దానికి స్వస్తి పలికి బహిరంగంగా తాము యూదు దురహంకారులవైపే ఉన్నట్టు తాజా చర్యతో లోకానికి చాటింది.