Tags

, , , , , ,

Image result for Karnataka government formation

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో ఒక తీవ్రమైన అంశాన్ని దేశ అత్యున్నత న్యాయ స్ధానం అర్ధరాత్రి విచారణకు స్వీకరించి తెల్లవారు ఝామున ఒక తాత్కాలిక నిర్ణయాన్ని ప్రకటించి, తదుపరి విచారణ కొనసాగింపునకు నిర్ణయించటం బహుశా ఇదే ప్రధమం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాని స్ధితిలో 117 మంది బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్‌-జెడిఎస్‌ను కాదని 104 స్ధానాలున్న బిజెపిని ఆహ్వానించటం చట్టవిరుద్ధమంటూ కాంగ్రెస్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టింది, ఇది అనూహ్యమైన మలుపు. గతంలో కొన్ని కేసులలో వచ్చిన తీర్పులు, సంప్రదాయాల మార్గదర్శనం వున్నప్పటికీ గవర్నర్లు తమ విచక్షణ, వివేచనను వినియోగించిన తీరు పిచ్చివాడి చేతిలో రాయిలా ఎవరెలా వినియోగిస్తారో తెలియని స్ధితిని ముందుకు తెచ్చింది. గవర్నర్ల విచక్షణ అధికారాలకు కూడా నిర్ధిష్ట మార్గదర్శక సూత్రాలను ఏర్పాటు చేస్తూ రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం కనిపిస్తోంది. అందువలన ఈ కేసు తీర్పు లేదా నిర్ణయం పర్యవసానాలు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ ప్రతినిధులుగా పరిరక్షకులుగా వుండాల్సిన గవర్నర్ల వ్యవస్ధ మీద, రాజ్యాంగానికి, గవర్నర్ల విచక్షణకు వున్న పరిమితుల మీద భాష్యం చెప్పి దానిని కాపాడాల్సిన న్యాయవ్యవస్ధ మీద ఎలా పడతాయో చూడాల్సి వుంది. ఏ వ్యవస్ధకూ దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు గాని అవి పని చేస్తున్న తీరును విమర్శించే అవకాశం వుండటం ప్రజాస్వామ్య వ్యవస్ధ లక్షణం. అందుకు కోర్టు తీర్పులు కూడా మినహాయింపు కాకూడదు.

రాజ్యాంగానికి భాష్యం చెప్పాల్సిన వుదంతంలో ఈ కేసులో సీనియర్‌ న్యాయమూర్తులను వదలి జూనియర్లతో బెంచ్‌ ఏర్పాటు చేయటం కూడా ఇదే ప్రధమం. గవర్నర్‌ కార్యాలయం నుంచి అధికారికంగా వర్తమానం రాకముందే ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారం గురించి బిజెపి సామాజిక మాధ్యమంలో ప్రకటించటం కూడా ఇదే ప్రధమం. ప్రత్యర్ధులు కోర్టుకు వెళుతున్నారని తెలిసి దానికి అవకాశం లేకుండా చేసేందుకు సాధారణంగా కోర్టు సమయం ముగిసిన తరువాత గవర్నరు లేఖ రాయటం, మరుసటి రోజు కోర్టును తెరవక ముందే ప్రమాణ స్వీకారానికి పూనుకోవటం కూడా ఇదే ప్రధమం. ఇదంతా తెరవెనుక ఒక పధకం ప్రకారమే జరిగినట్లు కనిపిస్తోంది.

గవర్నర్‌ నిష్పాక్షితను ఎవరూ ప్రశ్నించకుండా వుండాలంటే రెండు పక్షాలు తమకే బలం వుందని చెబుతున్నపుడు, ఒక పక్షంలోని పేర్లు మరొక పక్షం జాబితాలో కనిపిస్తున్నపుడు గవర్నరు తన ముందు హాజరై సంఖ్యానిరూపణ చేసుకోమని ఎందుకు కోరలేదు. కర్ణాటక వుదంతం దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

తమకు మెజారిటీ మద్దతు వుందని చెప్పుకుంటున్న పార్టీ నేతను బుధవారం మధ్యాహ్నం లోగా జాబితాను సమర్పించాలని సుప్రీం కోర్టు కోరింది. బిజెపి నేతగా ఎన్నికైన ఎడ్డియూరప్ప గవర్నర్‌కు ముందు ఇచ్చిన జాబితాలో ఎన్నిపేర్లున్నాయి, బిజెపిగాకుండా ఇతర పార్టీలవి, ఇండిపెండెంట్లవి ఎన్ని వున్నాయన్నది ఆసక్తికర అంశం. ఒక లేఖ కాకుండా రెండు ఇచ్చారా అన్నది కొందరి సందేహం. మరోవైపు కాంగ్రెస్‌ -జెడిఎస్‌ అందచేసిన జాబితాలో 117 పేర్లు వున్నట్లు ఆ పార్టీనేతలు పేర్కొన్నారు.

ఇరు పక్షాలు ఇచ్చిన లేఖలు, జాబితాలను చూసిన గవర్నర్‌ తన ‘విచక్షణ ‘ అధికారాన్ని వినియోగించినట్లు కనిపిస్తోంది తప్ప జాబితాల్లో పేర్ల తకరారును నిర్ధారించుకొనేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. తమ మద్దతుదార్లందరినీ స్యయంగా గవర్నరు ముందు ప్రవేశపెడతామని కాంగ్రెస్‌-జెడిఎస్‌ చెప్పినప్పటికీ గవర్నర్‌ అంగీకరించలేదంటే, ముందే ఒక నిర్ణయానికి వచ్చారా అన్నది ఒక ప్రశ్న. ఎడ్డి యూరప్ప తన బల నిరూపణకు వారం రోజులు గడువు ఇమ్మని కోరినట్లు వార్తలు రాగా గవర్నరు పదిహేను రోజులు ఇచ్చారు. బల నిరూపణకు ఎడ్డి యూరప్ప గడువును కోరటం అంటే అధికారాన్ని అప్పగించమని కోరే సమయంలో తమకు పూర్తి మెజారిటీ లేదని అంగీకరిస్తూ, కొందరు మద్దతు ఇస్తామని చెప్పినందున గడువు ఇమ్మని కోరటం తప్ప మరొకటి కాదు. ఎన్నికల ఫలితాల నోటిఫికేషన్‌ తరువాత ఏ రాజకీయ పార్టీలోనూ నిబంధనలకు అనుగుణ్యంగా ఎలాంటి చీలికలు లేవు. అలాంటపుడు ఇతర పార్టీల వారు తమకు మద్దతు ఇస్తున్నారని చెబితే గవర్నర్‌ నమ్మటం ఏమిటి? ఎడ్డి యూరప్ప చెప్పారు, ఈ గవర్నర్‌ నమ్మారు అది అంతే అంటారా ?

గవర్నర్‌లు పాలకపార్టీల వారే గనుక వారు ఎక్కడ స్టాంపు వేయమంటే అక్కడ స్టాంపు వేస్తారని గతంలో కాంగ్రెసు, ఇపుడు బిజెపి నియమిత గవర్నర్లు నిరూపించారు. అనూహ్యంగా ఇప్పుడు బంతి కోర్టుకు వచ్చింది. గవర్నరు విచక్షణ అధికారాన్ని తాము ప్రశ్నించలేం, అందువలన దీనిలో ఎలాంటి జోక్యం చేసుకోం అని కేసును అంతటితో ముగిస్తే కధ వేరుగా వుండేది. గవర్నరు చర్యమీద, ఎడ్డి యూరప్ప ప్రమాణ స్వీకారం మీద స్టే ఇవ్వకుండా ఫిర్యాదును విచారించేందుకు పూనుకోవటం బహుశా బిజెపి వూహించి వుండదు.

అధికారాన్ని కోరిన రెండు పక్షాలు ఇచ్చిన జాబితాలను తమకు సమర్పించాలని కోర్టు కోరటం అంటే వాటిలోని నిజానిజాలను తేల్చేందుకు పూనుకోవటమే. ఇప్పటికే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక మిశ్రా తీరుతెన్నులపై సుప్రీం కోర్టు సీనియరు న్యాయమూర్తులే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు వారిని పక్కన పెట్టి ఈ కేసులో జూనియర్లతో బెంచిని ఏర్పాటు చేశారు. వారు ఇచ్చే తీర్పు కీలకం కానుంది.

గతంలో ఇదే ఎడ్డి యూరప్ప తనకు 110 సీట్లు వచ్చినపడు, కొంత మంది ఇండిపెండెంట్లను తన వైపుకు తిప్పుకోవటం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట వేటు పడకుండా ఇతర పార్టీల సభ్యులను సభకు హాజరు కాకుండా చేసి తన మెజారిటీని నిరూపించుకొని తరువాత వారిచేత రాజీనామా చేయించి తన సర్కారును కాపాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో ఫిరాయింపుదార్లను ఏకంగా మంత్రివర్గంలో చేర్చుకున్నప్పటికీ వారి మీద పిరాయింపు నిరోధక చట్టవేటు పడలేదు, వారి గురించి స్పీకర్లు ఎటూ తేల్చలేదు. అదే వ్యూహాన్ని కర్ణాటకలో కూడా అనుసరించేందుకు బిజెపి పూనుకుందా ? అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి పరిస్ధితికి తేడా వుంది. అక్కడ మెజారిటీ పక్షాలే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. తమకు అదనపు బలం అవసరం లేకపోయినా ఏదో ఒకసాకుతో ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాయి. కర్ణాటకలో పరిస్ధితి భిన్నం. గతంలో మాదిరే ఇతర పార్టీల సభ్యులను కొందరిని లోపాయకారీగా కూడగట్టుకొని గట్టెక్కాలన్నది బిజెపి ఎత్తుగడ. గత అనుభవాల రీత్యా కాంగ్రెస్‌-జెడిఎస్‌ ముందు చూపుతో తమ జాగ్రత్తలు తాము తీసుకున్నాయి. అయితే సభలో బలనిరూపణ సమయంలో పార్టీ విప్‌ను ధిక్కరించి వ్య తిరేకంగా ఓటు వేసే లేదా వేయకుండా వుండే అవకాశం వుంది.

ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ముందే, బలపరీక్ష జరగక ముందే వివాదం కోర్టుకు వెళ్లింది. సభ ఇంకా ఏర్పడ లేదు, సభ్యులు ప్రమాణ స్వీకారమే చేయలేదు. కోర్టు విచారణ సమయానికి ఏ సభ్యుడూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించలేదు. ప్రమాణ స్వీకారంపై స్టే ఇవ్వకుండా కేసు విచారణ చేస్తామని కోర్టు చెప్పటం అంటే సదరు ప్రమాణ స్వీకారం తమ తీర్పుకు లోబడి వుండాలనటం తప్ప వేరు కాదు.

కోర్టు తీర్పు పర్యవసానాలు ఏమిటి? గత తీర్పుల ప్రకారం మెజారిటీ వున్న కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని గనుక తీర్పు వస్తే మన కోర్టుల మీద జనంలో మిగిలి వున్న కొద్దో గొప్పో నమ్మకం బలపడుతుంది. ఒక వేళ గవర్నర్‌ విచక్షణ అధికారాలలో తాము జోక్యం చేసుకోలేం అని ప్రకటిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ల వ్యవస్ధను గబ్బు పట్టించటాన్ని కోర్టులు కూడా ఏమీ చేయలేవు అని వాటి మీద వున్న విశ్వాసాన్ని జనం కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌, విజిలెన్స్‌, సిబిఐ, ఇతర అనేక సంస్ధలు పాలకుల చేతుల్లో సాధనాలుగా మారాయనే విమర్శలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఈ కేసు న్యాయవ్యవస్ధకు ఒక అగ్నిపరీక్ష వంటిదే ! ఎలాగైనా అధికారానికి అంటి పెట్టుకొని వుండేందుకు కాంగ్రెస్‌, జెడిఎస్‌ సభ్యులను ఆత్మసాక్షి ప్రబోధానుసారం ఓటు వేయమని కోరతానని ఎడ్డియూరప్ప ప్రకటించారు. గతంలో తమ పార్టీ ప్రతిపాదించిన రాష్ట్రపతి పదవి అభ్యర్ధిని ఓడించేందుకు ఇందిరా గాంధీ ఆత్మప్రబోధానుసారం ఓటు వేయమని పిలుపు నిచ్చి ఒక తప్పుడు సాంప్రదాయానికి తెరతీశారు. ఇప్పుడు అది చెల్లదు, పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం అలాంటి ఓటింగ్‌ చెల్లదని తెలిసినా ఎడ్డి యూరప్ప ఆ పిలుపు ఇవ్వటం తమకు బలం లేదని అంగీకరించటమే. ఆవు ఎక్కడ కట్టినా తమ దొడ్లో ఈనితే చాలు అనుకున్నట్లుగా ఏ పార్టీ తరఫున గెలిచినా తమకు మద్దతు ఇస్తే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న బిజెపి డబ్బు, ఇతర ప్రలోభాలను ఎరచూపి, బెదిరింపులకు పాల్పడి రాజకీయంగా మరింతగా విమర్శల పాలు కావటం ఖాయం. అటు కేంద్రంలో నరేంద్రమోడీపై ఇప్పటికే వున్న మచ్చలకు తోడు ఇది మరొకటి తోడు కావటం తప్ప అదనంగా ఒరిగేదేమీ లేదు. ఈ వుదంతం చివరికి ఎలా పరిష్కారం అవుతుందో తెలియదు. ఒక వేళ కోర్టు తీర్పు ఎడ్డికి అనుకూలంగా వస్తే న్యాయవ్యవస్ధను కూడా బిజెపి ప్రభావితం చేసిందని జనం భావించే అవకాశం వుంది. అనూహ్యంగా ఎడ్డికి అవకాశం ఇవ్వటం రాజ్యాంగ విరుద్దమని తీర్పు ఇస్తే బిజెపికి అది పెద్ద భంగపాటు. ఏది జరిగినా మరికొద్ది నెలల్లో జరిగే రాజస్దాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌ ఎన్నికలపై దాని ప్రభావం పడుతుంది.