Tags

, , , , , ,

Image result for Yeddyurappa

ఎం కోటేశ్వరరావు

కర్ణాటకలో అటు ప్రజా కోర్టులో ఇటు అసెంబ్లీ అంకెల ఆటలో బిజెపి భంగపడింది. కులం, ధన, పదవీ ప్రలోభాలు, బెదిరింపులు, బుజ్జగింపులతో తమకు లేని బలాన్ని తెచ్చుకొనేందుకు ప్రయత్నించటాన్ని యావత్‌ దేశం గమనించింది. దానిలో విఫలమై అవమానకరంగా రాజీనామా చేసిన తరువాత ఏ కోశానా లేని తమ నిజాయితీ గురించి తమకు తామే ఆ పార్టీ నేతలు కితాబునిచ్చుకుంటున్నారు. 117 సీట్లు, 56.8శాతం ఓట్లు తెచ్చుకున్న కూటమి కంటే ఓట్ల చీలిక కారణంగా 104 సీట్లు వచ్చినప్పటికీ వారికి వచ్చిన 36శాతం ఓట్లను దాచి పెద్ద పార్టీ అంటూ ఇంకా ఫోజు పెడుతున్నారు. వారెంతగా ఖంగుతిన్నారంటే బలనిరూపణకు సుప్రీం కోర్టు ఇచ్చిన అవకాశాన్ని వుపయోగించుకొని మరింత గబ్బుపట్టటం కంటే ముందే తప్పుకోవటం మంచిదని రాజీనామా చేయటం నష్ట నివారణ చర్యలో భాగం. తనకు అధికారం లేకపోయిన తరువాత ఇంకేంటి అన్నట్లుగా అసెంబ్లీలో ప్రసంగం ముగించి రాజీనామా ప్రకటించిన వెంటనే లేచి వెళ్లిపోయారు. జాతీయ గీతం గురించి పెద్ద సమస్య చేసిన ఆ పార్టీ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో జాతీయగీతాలాపన ముగియ కుండానే లేచిపోవటం వారి నిజస్వరూపాన్ని వెల్లడి చేసింది. ఈ వుదంతంలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి విజయం సాధించింది అనటం కటే బిజెపి ఘోరంగా ఓడిపోయింది అని చెప్పాల్సి వుంటుంది.

తమ పార్టీ కార్యకర్తగా మాదిరి వ్యవహరించే వ్యక్తి రాజభవన్‌లో గవర్నర్‌గా వున్నందున విచక్షణాధికారం పేరుతో ముందు అధికార పీఠాన్ని సంపాదిస్తే తరువాత గతంలో మాదిరి ఏదో విధంగా దాన్ని నిలబెట్టుకోవచ్చని బిజెపి వేసిన ఎత్తుగడలు అనూహ్యంగా చిత్తయ్యాయి. తమకున్న బలానికి మరికొందరు మద్దతిస్తారని లేఖ ఇవ్వటం తప్ప ఎవరు, ఎలా ఇస్తారో ఎడ్డియూరప్ప చెప్పలేదు. మరోవైపు తమకు 117 మంది మద్దతు వుందని సంతకాలతో సహా కాంగ్రెస్‌-జెడిఎస్‌ లేఖ అందచేసినప్పటికీ గవర్నర్‌కు నమ్మకం కుదరలేదని తిరస్కరించటంతోనే కుట్రకు తెరలేచింది. లేఖలో వారం రోజుల గడువు అడిగితే గవర్నరు పదిహేను రోజులు ఇవ్వటం కూడా బిజెపి వ్యూహంలో తరువాత వచ్చిన ఆలోచన పర్యవసానమే.

బిజెపి పధక రూపకర్తలు ఎక్కడ పప్పులో కాలేశారు. కాంగ్రెస్‌ కోర్టుకు వెళ్లనున్నదని తెలిసి కోర్డు సమయం ముగిసిన తరువాత గవర్నర్‌ కార్యాలయం నుంచి లేఖ తెప్పించుకోవటం, తిరిగి కోర్టు తెరిచే లోపల ప్రమాణ స్వీకార తతంగాన్ని ముగించి కోర్టు ఆటంకాన్ని తప్పించుకోవచ్చనేంత వరకు వారు తెలివిగానే వ్యవహరించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా అర్ధరాత్రి తలుపు తట్టిన కాంగ్రెస్‌ నేతల వినతిని మన్నించి అప్పటి కప్పుడు విచారణ బెంచిని ఏర్పాటు చేసి తెల్లవార్లూ విచారణ జరపటాన్ని మాత్రం వారు వూహించలేదు. తమకు వున్న మెజారిటీ గురించి గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొనకపోవటంతో ధర్మాసనం బలనిరూపణకు ఒక రోజు మాత్రమే ఇవ్వటంతో తీరికగా చేపలకు గాలాలు విసురుదామనుకున్న కమలనాధుల ఎత్తులు చిత్తయ్యాయి. బిజెపి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఏడుగురిని ఎలాగైనా తమవైపు తిప్పుకోవచ్చని కమలనాధులు భావించారు. అందుకే మీడియాకు అనధికారికంగా ఆ ఏడుగురు తమవైపే అన్న ధీమాతో వుప్పందించారు.

ఎంతకైనా తెగించే బిజెపి తీరుతెన్నుల గురించి జాగ్రత్తపడిన కాంగ్రెస్‌ాజెడిఎస్‌లు తమ సభ్యులను కాపాడుకొనేందుకు గట్టి చర్యలు తీసుకోవటంతో ఎడ్డి మడ్డి వ్యవహారం బెడిసి కొట్టింది. కర్ణాటకలో బిజెపి గతంలో అధికారం వెలగబెట్టినప్పటికీ ఇప్పుడే మొదటిసారి దక్షిణాదిన తమ పాదం మోపుతున్నామనే భ్రమ కలిగే విధంగా ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. దానికి మీడియాకూడా ఎలాంటి వెనుక ముందులు చూడకుండా నిజమే అన్నట్లు ప్రచారం చేసింది. ఇక్కడ బిజెపికి ఎదురైన సమస్యలేమిటి? 2008లో కాంగ్రెస్‌తో సంకీర్ణం నుంచి బయటకు వచ్చిన జెడిఎస్‌ను బిజెపి దగ్గరకు తీసి తనకు అధిక సీట్లు వున్నప్పటికీ జెడిఎస్‌ నేత హెచ్‌డి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే బిజెపితో స్నేహం ధృతరాష్ట్ర కౌగిలి వంటిదని జెడిఎస్‌కు త్వరలోనే అర్ధమై బిజెపి నుంచి దూరం జరిగింది. ఈ ఎన్నికలలో కూడా అదే విధంగా బిజెపి పెద్ద పార్టీగా, కాంగ్రెస్‌, జెడిఎస్‌లు రెండు, మూడు స్ధానాలలో నిలిచాయి. దక్షిణాదిలో తమ పార్టీ విస్తరణలో భాగంగా ఎట్టి పరిస్ధితిలోనూ తమ పార్టీనేతనే ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి ఎప్పుడో నిర్ణయించుకుంది. అవసరమైతే జెడిఎస్‌ను తమ జూనియర్‌ భాగస్వామిగానే వుంచుకోవాలనుకుంది. అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో దేవెగౌడమీద ఎక్కడ లేని గౌరవం ఒలకపోశాడు. అవసరమైతే ఈ సారి కూడా ముఖ్యమంత్రిగా కుమారస్వామిని చేయాలని, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తమ వారు లేకపోయినా ఇబ్బంది లేదు అని బిజెపి అనుకొని వుంటే పరిస్ధితులు భిన్నంగా వుండేవి. గతంలో కలిగిన అనుభవం దృష్టిలో వున్నప్పటికీ కాంగ్రెస్‌ వివేకం ప్రదర్శించి బేషరతుగా జెడిఎస్‌కు మద్దతు ప్రకటిస్తుందని బిజెపి వూహించలేకపోయింది. దాంతో ప్రలోభాల బాట పట్టింది, భంగపడింది.

మూడు పార్టీలలో అవకాశవాదులు, పదవీ వ్యామోహపరులకు కొదవేమీ లేదు . అధికారం ఎక్కడ వుంటే అక్కడకు చేరే వాతావరణం వున్న ఈ రోజుల్లో బిజెపి ప్రలోభాలకు కాంగ్రెస్‌,జెడిఎస్‌ కూటమిలోని ఎంఎల్‌ఏలు ఎందుకు ప్రభావితం కాలేదు అన్నది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్ధితి ఒక ఏడాది ముందు వచ్చి వుంటే ప్రలోభాలు పని చేసి వుండేవన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పుడెందుకు పని చేయలేదు. కేంద్రంలో బిజెపి అన్ని రంగాలలో విఫలమైందని జనం గుర్తించటం ప్రారంభమైంది.గత లోక్‌సభ ఎన్నికలలో 17 సీట్లు, 43శాతం ఓట్లు, 130 అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజారిటీ తెచ్చుకున్న బిజెపి ఈ సారి 104సీట్లకు, 36శాతం ఓట్లకే పరిమితం అయింది. అంటే నరేంద్రమోడీని చూసి జనం ఓట్లెయ్యరు అన్నది స్పష్టం. దీర్ఘకాలం ముఖ్య మంత్రిగా వున్న గుజరాత్‌లో నరేంద్రమోడీ చెమటోడ్చితిరిగినా చావు తప్పి కన్నులట్టపోయినట్లుగా బిజెపి బతికి బయటపడింది. వుత్తరాదిన ఆ పార్టీ గతంలో మాదిరి ఓట్లను అకర్షించే స్ధితిలో లేదని అనేక రాష్ట్రాల వుప ఎన్నికలలో బిజెపి ఓడిపోవటం స్పష్టం చేసింది. 2014లో బిజెపి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన సీట్లు 282 తెచ్చుకున్నప్పటికీ దానికి వచ్చిన ఓట్లు 31.34 శాతమే, దాని మిత్రపక్షాలవి కలుపుకున్నా వచ్చినవి 38.5శాతమే. ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోవటం కారణంగానే బిజెపి అన్ని సీట్లు తెచ్చుకుందన్నది స్పష్టం. ఈసారి బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ సర్దుబాటు చేసుకుంటాయన్న వాతావరణం రోజురోజుకూ బలపడుతోంది. పెద్ద రాష్ట్రమైన వుత్తర ప్రదేశ్‌లో వుప్పు-నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు రెండు లోక్‌సభ వుప ఎన్నికలలో ఐక్యంగా పోటీ ఇచ్చి బిజెపి అభ్యర్ధులను ఓడించాయి. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్‌డిఏ నుంచి బయటకపోయినవి తప్ప కొత్తగా ఒక్క పార్టీ కూడా చేరే పరిస్ధితి లేదన్నది స్పష్టం కావటం. ఆరు నెలల్లో రాజస్ధాన్‌,మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు నరేంద్రమోడీ సన్నద్దమౌతున్నారన్నది స్పష్టంగా కనిపించటం. మోడీ భవితవ్యమే ఎలావుంటుందో తెలియనపుడు బిజెపితో జట్టుకడితే ఆరునెలల్లో పరిస్ధితి తారుమారైతే తమ పరిస్ధితి ఏమిటన్న దూరాలోచన కూడా అవకాశ వాదులలో తలెత్తి వుండవచ్చు. అందువలన తాత్కాలికంగా ప్రలోభాలకు లంగకపోయినప్పటికీ అవకాశవాదులతో ఆ ముప్పు ఎప్పుడూ మెడమీద కత్తిలా వేలాడుతూనే వుంటుంది.

ఈ ఎన్నికలు బిజెపి అవకాశవాదం,అప్రజాస్వామిక చర్యలను ఎంతగానో బయట పెట్టాయి. అనేక మంది ఆ పార్టీ అభిమానులుగా వున్నవారు పరస్పర విరుద్దమైన వాదనలు చేయటాన్ని సమర్ధించుకోలేని స్ధితిలో పడ్డారు. మెజారిటీ కూటమిని కాదని, మెజారిటీ లేని పార్టీ పెద్దది అనే పేరుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌ చర్యను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. దాని మీద పదివారాల తరువాత విచారణకు చేపట్టనుంది. గతంలో వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులు వున్నప్పటికీ వాటికి తమదైన భాష్యాలు చెబుతూ గవర్నర్‌ విచక్షణాధికారాల పేరుతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ అవకాశవాదానికి పాల్పడుతున్నది. దీని మీద కూడా మరింత స్పష్టత వచ్చే విధంగా సుప్రీం తీర్పు వుండవచ్చని అనేక మంది ఆశిస్తున్నారు. ఎన్నికల ముందు దుమ్మెత్తి పోసుకొని వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలు తరువాత కూటమి కట్టటం ఏమిటని బిజెపి ఒక వాదనను ముందుకు తెచ్చింది, దాని గురించి ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు గుండెలు బాదుకుంటున్నారు.

గోవా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలలో తలపడిన పార్టీలు, స్వతంత్రులతో జతకట్టిన బిజెపి, అదే కర్ణాటకలో జరిగితే తప్పుపట్టటం ఏమిటన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని జెడియు, బిజెపి ఎంత హోరాహోరీగా పోటీ చేసింది, పరస్పరం ఎన్నిమాటల తూటాలను ప్రయోగించిందీ చూశాము. అలాంటి నితీష్‌ కుమార్‌కు మద్దతు ఇవ్వటానికి బిజెపికి, తీసుకోవటానికి నితీష్‌ కుమార్‌కు ఎలాంటి సమస్య ఎదురు కానపుడు కాంగ్రెస్‌-జెడిఎస్‌ను ఎందుకు తప్పుపడుతున్నట్లు ? ఇలాంటి విషయాలన్నీ అటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ, సామాజిక మాధ్యమంలోనూ పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇంతకాలం కాంగ్రెస్‌ను విమర్శించిన బిజెపి ఆచరణలో అదేపని చేస్తున్నదనే అంశాన్ని ఈ సందర్భంగా అదనంగా మరికొంత మంది గ్రహించారు. ఇవన్నీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ఏతర పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకొనేందుకు దాని అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు జాగరూకతతో వుండేందుకు ఈ వుదంతం తోడ్పడింది.

కొన్ని ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులను కూడా ఇది వెల్లడి చేసింది. పొరుగునే వున్న రాష్ట్రానికి వెళ్లి జెడిఎస్‌కు మద్దతు ప్రకటించి వచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు లేదా టిఆర్‌ఎస్‌ అక్కడి పరిణామాలపై మౌనం దాల్చటం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. లోపాయకారీగా బిజెపితో అవగాహన నిజమే అనేందుకు ఆస్కారం కలిగించింది.తాము మద్దతు ఇచ్చిన జెడిఎస్‌ నాయకుడే ముఖ్యమంత్రి అవుతున్నా టిఆర్‌ఎస్‌కు అది ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే తెలంగాణాలో తమను సవాలు చేస్తున్నది కాంగ్రెస్‌ కావటం, ఆ పార్టీ మద్దతుతోనే కుమారస్వామి కర్ణాటక ముఖ్య మంత్రి కావటం టిఆర్‌ఎస్‌ వూహించిన పరిణామం కాదు. మరొక ఫ్రంటు అంటూ కెసిఆర్‌ చేస్తున్న యత్నాలకు ఇది చెప్పులో రాయిలా ఇబ్బంది పెట్టే అంశమే.

తమతో కలసి అధికారంలో భాగస్వాములౌతూనే వైఎస్‌ఆర్‌సిపితో కధనడుపుతున్న బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకొనేందుకు ప్రత్యేక రాష్ట్రహోదా కల్పనలో వాగ్దాన భంగాన్ని తెరమీదకు తెచ్చింది. కర్ణాటకలో ఒక వేళ బిజెపి గెలిస్తే తదుపరి తమను వేధిస్తారనే అనుమానం కలగటం లేదా అలాంటి సూచనలు కనపడటం వలనగానీ తెలుగుదేశం నేతలు కర్ణాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ను గెలిపించమని చెప్పలేదు గానీ బిజెపిని ఓడించమని ప్రచారం చేశారు. అంటే బిజెపి మీద ఎవరు గెలిచే సత్తా వుంటే వారిని గెలిపించమన్నదే దాని అంతరార్ధం. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య అంతరం మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక చీలిక, సంక్షోభానికి తెరలేపనున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. వుక్రోషంతో బిజెపి అందుకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. అయితే అలాంటిదేదో జరగాలని తెలుగుదేశం కూడా అంతరంగంలో కోరుకుంటున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై బిజెపి ద్రోహం చేసిందనే ప్రచారం చేస్తున్న ఆ పార్టీనేతలపై కొత్త కేసులు పెట్టినా పాత కేసులను తిరగదోడినా తమపై వేధింపులకు పూనుకుందంటూ బాధిత ఫోజు పెట్టి జనం ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. కర్ణాటకలో తమ గురించి గొప్పలు చెప్పుకుంటున్న బిజెపికి, ఇతర పార్టీలకు గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల, సీట్ల వివరాలు ఇలా వున్నాయి.పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతం,బ్రాకెట్లలోని అంకెలు వచ్చిన సీట్ల సంఖ్య)

సంవత్సరం బిజెపి            కాంగ్రెస్‌          జెడి(ఎస్‌)    ఇతరులు

2004    28.33(79) 35.27(65)   20.77(58) 15.3(22)

2008    33.86(110) 35.13(80)  19.44(28) 11.57(6)

2013     19.90(40) 36.60(122)  20.20(40) 24.40(22)

2018      36.20(104) 38.00(78)  18.40(38) 7.40 (2)

లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక ఓట్లు సీట్ల వివరాలు

2009 41.63(19) 37.5(6) 13.57(3) 5.20(0)

2014 43.00(17) 40.80(9) 11.00(2) 5.20(0)

నరేంద్రమోడీ, అమిత్‌ షా మాజిక్‌ లేనపుడు, అసలు వారెవరో కర్ణాటక ఓటర్లకు తెలియనపుడే 2009లోక్‌సభ ఎన్నికలలో గరిష్టంగా ఆ పార్టీకి 41.63శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో 43శాతం ఓట్లు వచ్చాయి. అది ఇప్పుడు 36.2శాతానికి పడిపోయింది. నరేంద్రమోడీ, అమిత్‌ షాపర్యటన కారణంగా బిజెపి పెరిగిన ఓటింగ్‌ శాతమేమీ లేదు, అలాగని రాహుల్‌ గాంధీ ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు తగ్గిందేమీ లేదు. 2014 పార్లమెంట్‌ ఎన్నికలలోనే ఎడ్డియూరప్ప, గాలి సోదరులు అండ్‌కో కలిసిన కారణంగా బిజెపి ఓటింగ్‌ 43శాతానికి పెరిగి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 36.2శాతానికి తగ్గింది.