Tags
BJP, bjp constitutional coup in karnataka, karnataka developments, karnataka votes 2018, Supreme Court
ఎం.కోటేశ్వరరావు
ఒక కట్టడాన్ని కొన్ని క్షణాల్లో కూల్చివేయగల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మాయాబజార్ వంటి సినిమాలలో తప్ప నిజజీవితంలో కొన్ని క్షణాలలో ఒక కట్టడనిర్మాణానికి అవసరమైన పరిజ్ఞానం మనకు ఇంకా రాలేదు. ప్రజాస్వామ్య కట్టడం పరిస్ధితి కూడా అలాగే వుంది. ఒక వేళ తమకు తగినన్ని సీట్లు రాని పక్షంలో ప్రలోభాలతో ఫిరాయించిన వారికి నష్టం జరగకుండా ఒక రాజ్యాంగ బద్ద కుట్రద్వారా అధికారానికి రావాలని కర్ణాటకలో కమలనాధులు ముందే కుట్రపన్నారా ? జరిగిన పరిణామాలను అవలోకనం చేసుకుంటే అవుననే తేలుతున్నది. మే పదిహేడవ తేదీన తాను ప్రమాణ స్వీకారం చేస్తానని బిజెపి నేత ఎడ్డియూరప్ప ముందే చెప్పటానికి ఆ కుట్రే కారణం అన్నది మరింత తేటతెల్లమైంది.
మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని , ప్రజాతీర్పును అపహాస్యం, ఖూనీ చేయటంలో కాంగ్రెస్ పేరు మోసిన నేరస్ధురాలు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకాలం దానిని తీవ్రంగా విమర్శించి, వ్యతిరేకించిన బిజెపి తన దాకా వచ్చే సరికి అంతకంటే తక్కువ కాదని స్వయంగా వెల్లడించుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రలోభాలు, బెదిరింపులతో పాటు తన తెలివి తేటలన్నీంటినీ వినియోగించింది. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న బిజెపి ఒక అడుగు ముందుకు వేసింది. మాయాబజార్ సినిమాలో మాకు తల్పం కాదు గిల్పం కావాలని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించి చావుదెబ్బలు తిన్నవారి మాదిరి కర్ణాటకలో బిజెపి అతి తెలివి తేటలను వుపయోగించి భంగపడింది.
కోర్టు ఇచ్చిన ప్రతి తీర్పు పురోగామి లేదా ప్రజాస్వామ్య బద్దం అని చెప్పలేము గానీ కర్ణాటక వుదంతంలో మాత్రం జస్టిస్ ఎకె సిక్రి, అశోక్ భూషన్, ఎస్‌ఏ బోబ్డేలతో కూడిన బెంచ్ చేసిన తాత్కాలిక నిర్ణయాన్ని మాత్రం అభినందించాల్సిందే. అదే కమలనాధుల కలలను కల్లలయ్యేట్లు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ వినిపించిన వాదన నాటి కాంగ్రెస్ అత్యవసర పరిస్ధితిని గుర్తుకు తెచ్చింది. అత్యవసర పరిస్ధితి విధించి అనేక మంది సిపిఐ(ఎం) నేతలతో పాటు నాటికి ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ విభాగంగా వున్న జనసంఘం, ఇతర కాంగ్రెసేతర పార్టీల నేతలను అనేక మందిని అరెస్టు చేసి జైలుపాలు చేశారు.( సిపిఐ అత్యవసర పరిస్ధితిని సమర్ధించింది కనుక ఆ పార్టీ వారిని మినహాయించారు) అలా జైలుపాలైన ఒక నిర్బంధితుని అరెస్టు అక్రమం అంటూ ఒక హెబియస్ కార్పస్ పిటీషన్ సుప్రీం కోర్టులో దాఖలైంది. ఆ సమయంలో అటార్నీ జనరల్‌గా వున్న నిరేన్ డే చేసిన వాదనల సారాంశం ఇలా వుంది.
అత్యవసర పరిస్ధితి విధించిన కారణంగా పౌరులు కోర్టుకు వెళ్లే హక్కును నిలిపివేశారు. ఒక వేళ నిర్భంధం అక్రమం అయినప్పటికీ దాన్ని కోర్టులో ప్రశ్నించటానికి లేదు. అత్యవసర పరిస్ధితి నిబంధల లక్ష్యం, వుద్దేశ్యమూ కార్యనిర్వాహణ వ్యవస్ధకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం, రాష్ట్రపతి ఆదేశాలు మరియు చట్టానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ప్రాధమికహక్కులను నిరాకరిస్తూ కార్యనిర్వాహకవ్యవస్ధ ఏదైనా ఒక చర్య తీసుకుంటే దాన్ని కోర్టులో సవాలు చేయటానికి లేదు. ఆ వాదన మీద జస్టిస్ హెఆర్ ఖన్నా స్పందిస్తూ ఆర్టికల్ 21లో ప్రాణం గురించి ప్రస్తావించారు, దానికి కూడా ఇదే వర్తిస్తుందా అని ప్రశ్నించగా చట్టవిరుద్దంగా ప్రాణాలు తీసినప్పటికీ కోర్టులేమీ చేయలేవని నిరేన్ డే వాదించారు. ఆ కేసును విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో మిగతా నలుగురూ అటార్నీ జనరల్ వాదనను సమర్ధిస్తూ తీర్పు చెప్పగా జస్టిస్ ఖన్నా వ్యతిరేకించారు.
కర్ణాటక వుదంతంలో ఒక వ్యక్తి ప్రాణాల కంటే ఎక్కువ విలువ నిచ్చి ప్రాణాలు అర్పించటానికి సిద్దపడే ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేసినా కోర్టులకు ప్రశ్నించే హక్కు లేదని మోడీ సర్కార్ అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించారు. రాజ్యాంగం ప్రకారం అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, కానీ ఆయన అంతకంటే బిజెపి న్యాయవాది మాదిరి కోర్టులో వ్యవహరించారు. ఆ పార్టీ నేతలు చేసిన వాదననే కోర్టుకు వినిపించటమే అందుకు పక్కా నిదర్శనం. న్యాయమూర్తుల బెంచ్‌కు పూర్తి అంకెలు తెలియవు, నిన్న ప్రకటించిన మేరకు తప్ప మొత్తం తెలియదు అని వేణుగోపాల్ చెప్పగా మేము అంతకు మించి చూడలేము, మీకు మెజారిటీ వున్నదని అంకెలు చెప్పటం లేదు అని జస్టిస్ ఎకె సిక్రీ చెప్పారు. అసలు వాదన ఆ తరువాతే బయటకు వచ్చింది. కోర్టు స్పెక్యులేషన్‌లోకి పోకూడదు, ఎడ్డియూరప్పకు ఎంత మంది మద్దతు ఇస్తున్నారో ఎవరికీ తెలియదు. ప్రభుత్వ ఏర్పాటునకు ఎవరికి ఆహ్వానం వచ్చింది, బలనిరూపణ సమయంలో ఏ శాసనసభ్యుడు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అని తెలుసుకొనేందుకు సుప్రీం కోర్టు రాజకీయ పొదలోకి తొంగి చూడటానికి లేదు, ఎందుకంటే ఒక శాసనసభ్యుడిని ప్రమాణ స్వీకారం చేయక ముందే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్య తీసుకొనేందుకు అవకాశం వుందని ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఎక్కడా చెప్పలేదు. శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుంది.ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం సభలో బలనిరూపణ అంశానికి సంబంధించింది. అవన్నీ సభలోనే పరిష్కారం కావలసి వుంది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో అసలు పిటీషన్ దాఖలు చేయటానికే లేదు. సభలో బలనిరూపణ వరకు పిటీషన్ దారులు వేచి చూడాలి. ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవటానికి లేదు. దాన్ని తరువాత సుప్రీం కోర్టు సమీక్షించవచ్చు. అని వేణుగోపాల్ వాదించారు. దీంతో అవాక్కయిన బెంచ్ ఇది అసంగత వాదన(మూర్ఖ అనే అర్ధం కూడా వుంది) దాని అర్ధం వారు ప్రమాణ స్వీకారం చేయక ముందే సూట్‌కేసుల మార్పిడి అంతా పూర్తవుతుందన్నది అర్ధమా అంటూ దాన్నే మాత్రం అనుమతించటానికి వీల్లేదని వ్యాఖ్యానించింది.
ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధి ఎన్నికైనట్లు ప్రకటించిన వెంటనే ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఏ ఎంఎల్‌ఏ లేదా ఎంపీ అయినా ప్రమాణ స్వీకారం చేయటానికి నిరాకరించినా, పార్టీ నిర్ణయాన్ని ఖాతరు చేయకపోయినా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్త్తుందని పేర్కొన్నారు. అయితే ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ప్రమాణ స్వీకారం చేయకుండా సభకు గైర్హాజరైనా సభలో ఆ సమయానికి వున్న సంఖ్యను బట్టి బలనిరూపణ జరుగుతుంది తప్ప ఆగదు, తరువాత అలాంటి సభ్యులపై చర్యతీసుకోవటం వేరే విషయం అని కొంత మంది భాష్యం చెబుతున్నారు. దీన్నే అటార్నీ జనరల్ కూడా వాదించారు. బిజెపి నేతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే పధకంతోనే కొంత మంది సభ్యులను సభకు హాజరు కాకుండా చూసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి వీలుగాక భంగపడ్డారన్నది స్పష్టం అవుతోంది.
1967లో కాంగ్రెస్ అనేక వుత్తరాది రాష్ట్రాలలో ఓడిపోయినపుడు అధికారం కోసం అడ్డదారులు తొక్కింది. హర్యానాలో గయా లాల్ అనే స్వతంత్ర సభ్యుడు పక్షం రోజుల్లో మూడు సార్లు పార్టీ మారగా ఒక రోజు తొమ్మిది గంటల వ్యవధిలోనే ఒక ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించడు. నాటి కాంగ్రెస్ నేతరావు బీరేంద్ర సింగ్ గయాలాల్‌ను ఛండీఘర్‌లో మీడియా ముందు ప్రదర్శిస్తూ గయారామ్ నౌ ఆయారామ్ ( పోయిన రాముడు ఇప్పుడు తిరిగి వచ్చాడు) అని చమత్కరించాడు.అప్పటి నుంచి పార్టీ ఫిరాయింపుదార్లను ఆయారామ్ గయారామ్ అని ఎద్దేవా చేస్తున్నారు. 1985లో కాంగ్రెస్‌కు పార్లమెంట్‌లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటంతో వారిని నిలబెట్టుకొనేందుకు, ముఠారాజకీయాలు చేయకుండా నిరోధించేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని తీసుకు వచ్చింది తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాదు. ఇప్పుడు బిజెపి ఆ చట్టంలోని లసుగులను వుపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు పూనుకుంది. తాత్కాలిక స్పీకర్‌గా సభలోని సీనియర్ సభ్యుడిని నియమించటం ఒక సాంప్రదాయంగా వచ్చింది తప్ప నిబంధనలేమీ లేవు. గతంలో అలాంటి సాంప్రదాయాన్ని కొన్ని పార్టీలు వుల్లంఘించాయి. ఇప్పుడు ఆ జాబితాలో బిజెపి కూడా చోటు దక్కించుకుంది. అయితే తాత్కాలిక స్పీకర్ అయినప్పటికీ సభలో బలనిరూపణ సమయంలో స్పీకర్‌కు వుండే అధికారాలు వుంటాయి. అందువలన అవసరమైతే అందుకు వుపయోగించుకొనేందుకు బిజెపి తన సభ్యుడినే గవర్నర్ ద్వారా నియమింపచేసుకుంది.
కర్ణాటక వుదంతం గవర్నర్ల విచక్షణ అధికార అంశంతో పాటు స్పీకర్ల అధికారాల గురించి కూడా చర్చ, సమస్యను మరోసారి ముందుకు తెచ్చింది. కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన బిజెపి ఎంపీలు ఎడ్డియూరప్ప, బిశ్రీరాములు బెంగళూరు నుంచి పంపిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ వెంటనే ఆమోదించి అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. స్వయంగా నెలన్నర క్రితం అందచేసిన వైఎస్‌ఆర్‌సి సభ్యుల రాజీనామాలను మాత్రం ఇంతవరకు ఆమోదించలేదు. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర శాసనసభలలో పార్టీలు ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన సభ్యుల విషయాన్ని తేల్చకుండా స్పీకర్లు నానబెడుతున్నారు. ఫిరాయింపుదారులు మంత్రులు కూడా అయ్యారు. అదే విధంగా తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి రాజీనామా సమర్పించి కాంగ్రెస్‌లో చేరినా అసెంబ్లీ స్పీకర్ ఆ రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పూర్వరంగంలో కర్ణాటక వుదంతాన్ని విచారణకు చేపట్టిన సుప్రీం కోర్టు ఈ విషయాల మీద కూడా స్పష్టత ఇవ్వటం అవసరం. గత ఏడు దశాబ్దాల చరిత్రను చూసినపుడు ప్రజాస్వామ్యం గురించి పెద్ద కబుర్లు చెప్పిన పార్టీలే దానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నించాయి. మరోవైపు పాలకవర్గ ప్రజాస్వామిక వ్యవస్ధల మీద నమ్మకం లేని కమ్యూనిస్టులు దానికి కట్టుబడి వుండటం కనిపిస్తుంది. వున్నత న్యాయస్ధానాలు ప్రజాసామ్యాన్ని బలపరిచేందుకు వీలుగా రాజ్యాంగానికి భాష్యం చెప్పటం, లోపాలను ఎత్తి చూపి సవరించేవిధంగా మార్గదర్శనం చేయాల్సి వుంది. దీనికి ఎన్నో పరిమితులు,ఆటంకాలు వున్నాయి. ఇది ఒక ఎత్తయితే ప్రజాకోర్టులో న్యాయమూర్తులైన ఓటర్లు ఫిరాయింపుదారులు, అవకాశవాదుల పట్ల ఎప్పుడైతే సరైన తీర్పు ఇచ్చేందుకు పూనుకుంటారో అప్పుడే స్వచ్చ రాజకీయాలవైపు పరిణామాలు మలుపు తిరుగుతాయి.ప్రజలకు ఎలాంటి ఆటంకాలు వుండవు, వున్నా వాటిని త్రోసి రాజని ముందుకు పోయే హక్కు, అవకాశం వుంది.