Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

‘మేం ఇంతవరకు 92 ఎన్నికలను పర్యవేక్షించాం, వెనెజులా ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే వుత్తమమైనది అని నేను చెబుతా’ ఈ మాటలన్నది అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌. ఆదివారం నాడు జరిగిన ఆ దేశ ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్‌ మదురో ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తిగాక ముందే ఈ ఎన్నికలను తాము గుర్తించటం లేదని, అక్టోబరులో తిరిగి ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష అభ్యర్ధులు ప్రకటించారు. పోలైన ఓట్ల 86లక్షల ఓట్లలో 92.6శాతం లెక్కింపు జరిగిన సమయానికి మదురోకు 58, సమీప అభ్యర్ధి హెన్రీ ఫాల్కన్‌కు 18లక్షలు వచ్చాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆంక్షలు, ప్రచారదాడి, వత్తిడి, ఆర్ధిక ఇబ్బందుల మధ్య జరిగిన ఈ ఎన్నికలలో పాలక సోషలిస్టు పార్టీ సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యత వుంది. అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో అమెరికా అనుకూల, మితవాద శక్తులు జనాన్ని తప్పుదారి పట్టించుతున్న తరుణంలో వెనెజులాలో వాటి ఆటలు సాగనివ్వలేదు. దాంతో తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఒకవైపు ప్రకటించిన ప్రతిపక్షాలు మరోవైపు స్వతంతత్రుల ముసుగులో అభ్యర్దులను నిలిపాయి. వారు ఓటమి తధ్యమని తేలగానే ఫలితాల ప్ర కటనకు ముందే ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ కొత్త పల్లవి అందుకున్నారు. డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను ముందుగానే జరపటం అక్రమాలలో ఒకటని పేర్కొన్నారు. తాను విజయం సాధిస్తే దేశ కరెన్సీని అమెరికా డాలరుగా మార్చివేస్తానని ప్రకటించిన ప్రధాన ప్రత్యర్ధి హెన్రీ ఫాల్కన్‌ ఫలితాలను తాను గుర్తించనని పేర్కొంటూ చేసిన ప్రకటనలో ప్రతిపక్షంలోని కొంత మంది ఓటింగ్‌కు రాకపోవటం తన ఓటమికి కారణమని పేర్కొన్నాడు. పోలింగ్‌ కేంద్రాల సమీపంలో ఎర్ర కేంద్రాలను ఏర్పరచి ఓటర్లపై బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించాడు. నమోదైన ఓటర్లలో 46శాతం పోలింగ్‌కు వచ్చారు.

నికొలస్‌ మదురోపై పోటీ చేసిన వారిలో ప్రధాన ప్రత్యర్ధి న్యాయవాది అయిన హెన్రీ ఫాల్కన్‌ గతంలో ఛావెజ్‌ నాయకత్వంలోని సోషలిస్టు పార్టీలో లారా రాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశాడు. ఛావెజ్‌ బ్రతికి వుండగానే 2010లో పార్టీ నుంచి వెళ్లిపోయాడు. 2013 ఎన్నికలలో మదురో ప్రత్యర్ధి హెన్రిక్‌ కాప్రిల్స్‌ ప్రచార సారధిగా పని చేశాడు.ఈ ఎన్నికలలో ప్రతిపక్షం నుంచి విడిపోయి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశాడు. ఎన్నికల బహిష్కరణ పనిచేయలేదు, అందుకే ఆ ప్రక్రియకు దూరంగా వుండదలచుకున్నాను. ఒక దేశం తరువాత మరొక దేశంలో బహిష్కరణ పిలుపులతో ప్రతిపక్షాలు ఎన్నికల రంగానికి దూరమై పాలకులు పటిష్టం కావటానికి అవకాశమిచ్చాయని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికలో రాసిన వ్యాసంతో ఫాల్కన్‌ పేర్కొన్నాడు. దేశ కరెన్సీ బలివర్‌ స్ధానంలో అమెరికా డాలర్‌ను ప్రవేశ పెట్టి దేశ ఆర్ధిక వ్యవస్ధను స్ధిరీకరించేందుకు పని చేస్తానని, ఐఎంఎఫ్‌ నుంచి సాయం పొందేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. మరొక ప్రత్యర్ధి క్రైస్తవ మత పాస్టర్‌ అయిన జేవియర్‌ బెర్టూసీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని స్వతంత్రుడనని ప్రకటించుకున్నాడు. కరెన్సీ మార్పిడిపై నియంత్రణలను ఎత్తివేస్తానని, విదేశీ పెట్టుబడులను పెంచుతానని, ఛావెజ్‌ ప్రారంభించిన సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తానని వాగ్దానం చేశాడు. మరో అభ్యర్ధి రెనాల్డో క్విజాడా తను ఛావిస్టా(ఛావెజ్‌) వుద్యమాన్ని కొనసాగిస్తానని, అయితే మదురో ప్రభుత్వానికి వ్యతిరేకినని ప్రకటించుకున్నాడు. వీరికి వరుసగా 21.1, 10.8,0.4శాతాల చొప్పున ఓట్లు వచ్చాయి. మదురో 67.7శాతం పొందారు.

హ్యూగో ఛావెజ్‌ రాజకీయ వారసుడిగా 2013లో అధికారానికి వచ్చిన నికొలస్‌ మదురో గత ఆరు సంవత్సరాలుగా ఇంటా బయటా అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాడు. ప్రధాన ఆదాయ వనరైన చమురు రేట్లు గణనీయంగా పడిపోవటంతో దేశం ఆర్ధికంగా అనేక ఇబ్బందులపాలైంది. చమురు ధరల పతనం కారణంగా జిడిపి 45శాతం పడిపోయిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ప్రకటించింది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకులైన వాణిజ్యవేత్తలు బ్లాక్‌మార్కెటింగ్‌ వంటి అక్రమాలకు పాల్పడి ప్రభుత్వంతో ప్రత్యక్ష ఘర్షణకు దిగారు. ద్రవ్యోల్బణం పెరుగుదల, అనేక వస్తువుల కొరత ఏర్పడింది. బ్యాలట్లు కావాలా బుల్లెట్లు కావాలా, మాతృభూమిగా వుండాలా వలస దేశంగా మారాలా, శాంతా లేక హింసా కాండా, స్వాతంత్య్రమా, పారతంత్య్రమా నిర్ణయించేది ఈ ఓటు అన్నట్లుగా తాము పరిగణించామని కార్మిక సంఘనేత అయిన ఒక బస్‌ డ్రైవర్‌ వ్యాఖ్యానించాడు. ఓటింగ్‌ ప్రారంభం కాగానే వెనెజులా ఎన్నికలు ఒక బూటకం అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించాడు. ముఫ్పై దేశాల నుంచి 150 మంది పరిశీలకులు వెనెజులా ఎన్నికల పర్యవేక్షణకు వచ్చారు. వారిలో ఒకరైన స్పెయిన్‌ మాజీ ప్రధాని జోస్‌ లూయిస్‌ రోడ్రిగజ్‌ జపాటెరో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మీద నాకెలాంటి సందేహాలు లేవు, ఆధునిక ఆటోమాటాక్‌ ఓటింగ్‌ పద్దతిని అనుసరిస్తున్నారు. జనం తమంతట తాము ఓటింగ్‌కు వస్తున్నారా లేదా తమ విచక్షణకు అనుగుణంగా ఓట్లు వేస్తున్నారా లేదా అని పరిశీలించటానికి వచ్చాం. మేం ఇప్పుడంతా చూశాం అని పేర్కొన్నారు. ఎటువంటి సంఘటనలు లేకుండా ఎన్నికలు జరిగాయని ఇతర ప్రతినిధులు కూడా వ్యాఖ్యానించారు.

అనేక మంది ముందుగా వూహించినట్లుగానే వెనెజులా ఎన్నికల ఫలితాలను తాము గుర్తించటం లేదని ప్రకటించటం ద్వారా లాటిన్‌ అమెరికాలో తన కుట్రలను కొనసాగించేందుకే అమెరికా నిర్ణయించుకున్నదని స్పష్టమైంది. అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జి20విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గనేందుకు వచ్చిన అమెరికా డిప్యూటీ మంత్రి జాన్‌ సులివాన్‌ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను గుర్తించేది లేదని చెబుతూనే చమురుపై ఆంక్షలు విధించటం గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

ఛావెజ్‌ హయాంలో, తరువాత మదురోకు వ్యతిరేకంగా పని చేసిన ప్రతిపక్ష పార్టీలు ఇటీవలి కాలంలో డెమోక్రటిక్‌ యూనిటీ రౌండ్‌ టేబుల్‌ పేరుతో ఒకటిగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలలో పాల్గనాలా వద్దా అనే విషయంలో దానిలో రెండు అభిప్రాయాలు వెల్లడయ్యాయి. పోటీ చేస్తే మదురో పాలన చట్టబద్దమైనదే అని అంగీకరించినట్లు అవుతుందని కొందరు, మార్పుకోసం వచ్చిన అవకాశాన్ని పోటీ చేసి వినియోగించుకోవాలని కొందరు వాదించినా అంతిమంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అది ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన హెన్రిక్‌ కాప్రిల్స్‌ గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కారణంగా పదిహేను సంవత్సరాలు ఎన్నికలలో పోటీ చేయటానికి అనర్హుడయ్యాడు. మరోనేత లియోపాల్డో లోపెజ్‌ పలుకేసులలో నిందితుడిగా వుండటంతో గృహనిర్బంధంలో వున్నాడు. ఈ పూర్వరంగంలో ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయాన్ని హెన్రీ ఫాల్కన్‌ వ్యతిరేకించి బయటకు వచ్చి స్వతంత్రుడిగా పోటీ చేశాడు. బహిష్కరణ పిలుపు తన విజయాన్ని దెబ్బతీసిందని చెప్పుకున్నాడు.

తమ దేశంలో వున్న చమురు సంపదలను కొల్లగొట్టేందుకు, తమ సంక్షేమ చర్యలకు స్వస్తి పలికేందుకు అమెరికా ఒక అంతర్జాతీయ కుట్ర చేస్తోందని అధ్యక్షుడు మదురో ప్రచారం చేశారు. ఛావెజ్‌ నాయకత్వంలో సోషలిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత వెనెజులా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిపోయిందని అంతర్జాతీయ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చమురు సంపదలతో వున్న ఆదేశం 1998లో ఛావెజ్‌ అధికారానికి రాకముందు తీవ్ర అసమానతలు, పట్టణాలలో దారిద్య్రం తాండవించిందని, దానికి ఐఎంఎఫ్‌ సూచించిన విధానాలే కారణమనే వాస్తవాలను దాచిపెడుతోంది. ఛావెజ్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ చమురు సంస్ధను పటిష్టపరచి చమురు సంపదను దేశ అంటే ప్రజాప్రయోజనాల కోసం వినియోగించటం ప్రారంభించటంతో అప్పటి వరకు ఆ రంగాన్ని పీల్చిపిప్పి చేసి లాభపడిన అమెరికా, దేశీయ కార్పొరేట్‌ సంస్ధలు వ్యతిరేకతను పెంచుకున్నాయి. అప్పటి నుంచి ఏదో ఒక కుట్ర చేస్తూనే వున్నాయి.2002లో ఛావెజ్‌పై విఫల కుట్ర చేశారు. ఆయనకు అనుకూలంగా వున్న మిలిటరీ, కార్మికుల మద్దతుతో తిరిగి అధికారానికి వచ్చారు.

అమెరికా విధించిన ఆంక్షలు, సరకులు బ్లాక్‌మార్కెట్లోకి పోవటం, చట్టవిరుద్ధమైన కరెన్సీ చలామణిలోకి రావటం, చమురు ధరలు పతనం కావటంతో అక్కడి ప్రభుత్వానికి కొన్ని తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. ప్రజలలో కొంత అసంతృప్తి కూడా తలెత్తింది. గత పార్లమెంట్‌ ఎన్నికలలో ప్రతిపక్షాలకు మెజారిటీ సీట్లు వచ్చాయి. తరువాత మదురో తన స్ధానాన్ని పటిష్ట పరుచుకొనేందుకు చర్యలు తీసుకున్నారు. దాంతో గతేడాది దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు, అంతర్జాతీయ ఏజన్సీలు పెద్ద కుట్ర చేశాయి. ప్రభుత్వ ఆస్ధులను విధ్వంసం చేయటం, అధికారపార్టీ మద్దతుదారులను సజీవ దహనం చేయటం, ఆయుధాలతో జనం మీద, భద్రతా సిబ్బందిపై దాడులకు దిగటం వంటి చర్యలకు పాల్పడ్డాయి. వాటిని సాకుగా చూపి వెంటనే ఎన్నికలు జరపాలని అమెరికా, తదితర దేశాలు పిలుపుల నిచ్చాయి. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ యూనిటీ రౌండ్‌ టేబుల్‌ ప్రభుత్వంతో చర్చించి కుదుర్చుకున్న అవగాహన ప్రకారం డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను ఏప్రిల్‌లోనే జరపాల్సి వుంది. ఆమేరకు అనూహ్యంగా వెనెజులా ఎన్నికల సంఘం మధ్యంతర ఎన్నికల ప్రకటన చేయటంతో అది అక్రమం అంటూ అమెరికా, ప్రతిపక్షాలు మాట మార్చాయి. మదురో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్‌ను తాము గుర్తించటం లేదని ప్రకటించాయి. ఒప్పందం నుంచి తాను వైదొలుగుతున్నట్లు రౌండ్‌ టేబుల్‌ ప్రకటించింది. ఇది జరిగిన రెండు రోజుల తరువాత వెనెజులా మిలిటరీ తిరుగుబాటు చేసి నియంత మదురోను అధికారం నుంచి కూలదోస్తే తాము మద్దతు ఇస్తామని అమెరికా రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ మార్కో రుబియో ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. అదే వారంలో టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో మాట్లాడిన అప్పటి విదేశాంగశాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ పాలకులు ఏమాత్రం ప్రజలకు సేవచేయలేనపుడు, పరిస్ధితులు దిగజారినపుడు లాటిన్‌ అమెరికాలో తరచుగా మార్పులను తెచ్చింది మిలిటరీయే అని చరిత్ర చెబుతోందని వ్యాఖ్యానించాడు. అంతెందుకు స్వయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ వెనెజులా విషయంలో అవసరం అయితే మిలిటరీని వుపయోగించుకుంటా అని విలేకర్లతో చెప్పాడు. అంటే మిలిటరీ కుట్రలను నిస్సిగ్గుగా సమర్ధించటం తప్ప మరొకటికాదు.

లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలకు నిత్యం అమెరికా కుట్రలు, కూహకాల ముప్పు వెన్నాడుతూనే వుంటుంది. దోపిడీ వ్యవస్ధలను విధ్వంసం చేయకుండా వాటిని అలాగే కొనసాగనిస్తూ తమకున్న వెసులు బాటు మేరకు అమలు జరుపుతున్న సంక్షేమ చర్యలకు ప రిమితులు వచ్చినపుడు జనాలలో అసంతృప్తి తలెత్తటం, దానిని మితవాద శక్తులు వినియోగించుకోవటం ఇటీవలి కాలంలో చూశాము. అందువలన పెట్టుబడిదారీ వ్యవస్ధ సంస్కరణబాటను వదలి విప్లవాత్మక చర్యలు తీసుకొనేందుకు పూనుకుంటేనే లాటిన్‌ అమెరికా వామపక్షాలకు భవిష్యత్‌ వుంటుంది.