Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

వాణిజ్య యుద్ధంలో అమెరికా ముందు చైనా చేతులెత్తేసిందా? ఏమో ! చైనా మెడలు వంచి వాణిజ్య పోరులో అమెరికా విజయం సాధించిందా ? ఏమో చెప్పలేం గానీ తాత్కాలికంగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరింది. ‘చైనాతో యుద్దం వాయిదా పడింది, కానీ ట్రంప్‌ వ్యూహ గందరగోళం కొనసాగుతూనే వుంది’ . కార్పొరేట్ల పత్రిక ఫోర్బ్స్‌ ఒప్పందంపై రాసిన తక్షణ విశ్లేషణ శీర్షిక ఇది. ‘ చైనా ముఖ్యమైన ప్రయోజనాలను కాపాడుకుంది’ ఇది చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. వివరాలేమీ తెలియకుండానే అమెరికాన్లకు చైనా లంగిపోయిందని సంతోష పడే వారికి చివరకు మిగిలేది నిరాశే అని గత చరిత్రను బట్టి చెప్పక తప్పదు.

ప్రపంచంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు వునికిలోకి తెచ్చినదే ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ). అది ఒక పక్క వుండగానే మరోవైపు దానిలోని సభ్యదేశాలు వాణిజ్య యుద్ధాలకు తలపడటం అంటే దాని వైఫల్యాన్ని సూచిస్తున్నది. నిజానికి ప్రపంచీకరణ యుగంలో రెండు దేశాల మధ్య తలెత్తే వాణిజ్యపోరు, పరిష్కారం కూడా వాటికే పరిమితం కాదు. ప్రపంచంలో ప్రతి ధనిక దేశమూ చైనాతో వాణిజ్యంలో లోటుతోనే వుంది, కనుక ప్రతి దేశమూ దానిని తగ్గించుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది. వాటిలో అమెరికా ఒకటి. దిగుమతి సుంకాల పెంపుతో ఎవరైనా చైనాను దెబ్బతీయాలని చూస్తే ఆ విబేధాన్ని వినియోగించుకొనేందుకు మిగతా దేశాలు కాచుకొని వుంటాయి, వున్నాయి. అందుకు పెద్ద వుదాహరణ మన దేశమే.

కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతుంటారు. దేశభక్తి నిరూపణకు చైనా వ్యతిరేకతను ఒక ప్రమాణంగా ముందుకు తెస్తున్నారు. అయితే గతకొద్ది నెలలుగా ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగమంత్రి మొదలు, వున్నత అధికారయంత్రాంగం మొత్తం చైనాతో సయోధ్య దిశగా ముందుకు పోతున్నారంటే అతిశయోక్తి కాదు. పాత సామెత ప్రకారం వ్యాపారి వరదనబడి పోతున్నాడంటే ఏదో లాభం కనిపించబట్టే అని వేరే చెప్పనవసరం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకతలో అమెరికా కంటే సంఘపరివారం పేరుమోసిందేమీ కాదు. అలాంటి అమెరికానే చైనాతో కాళ్లబేరానికి వస్తున్నపుడు పరివార పెద్దలైన మోడీ, మరొకరు ఎంత? వారంతా కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప మరొకరు కాదు. ఎడ్లెవిస్‌ అగ్రీవాల్యూ చైన్‌ లిమిటెడ్‌ కంపెనీ పరిశోధన విభాగ అధిపతి పెరెరాణా దేశాయ్‌ చైనా-అమెరికా వాణిజ్య పోరు గురించి ఇలా చెప్పారు.’ ఎగుమతుల ధరలు పోటాపోటీగా వున్నట్లయితే అయిల్‌ సీడ్స్‌ మీల్స్‌ అయిన సోయా, ఆవ, పత్తి మరియు మొక్కజన్న భారతీయ ఎగుమతిదార్లకు ఒక చిన్న వ్యవసాయ ఎగుమతి కిటికీ తెరుచుకుంటుంది. నూట ఆరు అమెరికా వుత్పత్తులపై చైనా 25శాతం వరకు కొత్త పన్నులు ప్రకటించింది, అంతకు ముందు 128 అమెరికా వుత్పత్తులపై పన్నులు పెంచింది. రెండు అతి పెద్ద దేశాలు ఒక వాణిజ్య యుద్ధంలోకి అడుగుపెట్టాయి.పదమూడు వందల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్నులు విధించింది.’ భారత పత్తి సంఘం అధ్యక్షుడు అతుల్‌ గణత్ర మాట్లాడుతూ ‘ అమెరికా తరువాత పత్తి ఎగుమతిలో స్థానం భారత్‌దే. చైనా 50మిలియన్‌ బేళ్ళ పత్తి దిగుమతి చేసుకుంటే దానిలో 40శాతం అమెరికా నుంచి వస్తోంది. ఆ పత్తిపై చైనా 25శాతం పన్ను విధిస్తోంది. మన పత్తిపై చైనాలో ఎలాంటి పన్నులు లేవు, అందువలన అమెరికా పత్తి కంటే మన సరకు చౌక అవుతుంది కనుక మనకు ఇది మనకు లాభదాయకం.’ సౌరాష్ట్ర జిన్నర్స్‌ అసోసియేషన్‌ ఆనంద్‌ పోపట్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియా, ఆఫ్రికన్‌ కాటన్‌ కంపెనీల కంటే మన పత్తి ధర చౌక, భారత సోయాబీన్‌పై వున్న ఆంక్షలను చైనా తొలగించినట్లయితే వారికి మనం సరఫరా చేయగల మరొక వస్తువు అవుతుంది. చైనాకు అవసరమైన 93.4 మిలియన్‌ టన్నులు సోయాలో ప్రస్తుతం అమెరికా 39శాతం సరఫరా చేస్తోంది.’ అన్నారు. చైనా పశు, కోళ్ల దాణాకు వుపయోగించే సోయాను మన దేశం నుంచి ఎగుమతి చేసేందుకు ఇప్పుడున్న ఆంక్షల ఎత్తివేతకు మన దేశవాణిజ్య శాఖ సంప్రదింపులు జరుపుతోంది.

గత నాలుగు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల గురించి ఎన్ని అతిశయోక్తులు చెబుతున్నప్పటికీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా పరిస్ధితి వుంది. మన వాణిజ్యలోటు గతేడాది ఏప్రిల్‌లో 13.25బిలియన్‌ డాలర్లు వుండగా ఈ ఏడాది 13.72 బిలియన్లకు పెరిగింది. రోజు రోజుకూ చమురు ధరల పెరుగుదల కారణంగా ఇది మరింత విస్తరించటమే కాదు, మన దేశం నుంచి డాలర్లు తరలిపోవటం పెరుగుతుండటంతో విదేశీమారకద్రవ్య సమస్యకూడా తలెత్తే అవకాశం వుంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన మార్కెట్లో ప్రవేశించేందుకు మోడీని కౌగలించుకోవటం తప్ప వారి మార్కెట్లలో మనకు ప్రవేశం ఇవ్వటం లేదు. మన దేశ ధనికులు ఏ కారణం చేతో బంగారం, బంగారు ఆభరణాలు, ముత్యాలు, రంగురాళ్లు దిగుమతి చేసుకోవటం తగ్గించబట్టిగాని లేకపోతే వాణిజ్యలోటు మరింత పెరిగి వుండేది. గత ఏప్రిల్‌లో చమురు దిగుమతులకు 7.36బిలియన్‌ డాలర్లు మనం చెల్లించగా ఈ ఏడాది ఆ మొత్తం 10.41బిలియన్లకు పెరిగింది.

ప్రపంచంలో నేడు చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, పెద్ద వినియోగదారుగా కూడా మారుతోంది. అక్కడి జనాభా కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగా ఆ మార్కెట్‌ను వదులుకొనేందుకు ఏ ధనిక దేశమూ సిద్దంగా లేదు. అలాంటి దేశంతో మనం అనవసరంగా తగాదా పెట్టుకోవాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయం మన కార్పొరేట్‌ రంగంలో క్రమంగా పెరుగుతోంది. సంఘపరివార్‌ చైనా వ్యతిరేక చిల్లర ప్రచారం ఎలా వున్నప్పటికీ ప్రభుత్వపరంగా అది కుదరదని స్పష్టం చేస్తున్న కారణంగానే ఇటీవలి కాలంలో డోక్లాం దగ్గర నుంచి అనేక సానుకూల వైఖరులను వెల్లడిస్తున్నది. చైనా ఆహార, ఔషధ నియంత్రణ శాఖ వద్ద పెండింగ్‌లో వున్న 254 వుత్పత్తుల నమోదుకు వేగంగా అనుమతులు తీసుకోవాలని మన ఫార్మారంగం మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తోంది.

తాను ఎగుమతి చేయటమే తప్ప దిగుమతులు చేసుకోవటం లేదన్న విమర్శలను పూర్వపక్షం చేసేందుకు లేదా ఎవరేమి ఎగుమతి చేయగలరో చూపండి అన్నట్లుగా ఈ ఏడాది నవంబరు నెలలో షాంఘై నగరంలో తొలిసారిగా చైనా దిగుమతుల ప్రదర్శన నిర్వహిస్తోంది. అంటే ప్రపంచ దేశాలన్నీ తమ వుత్పత్తులను అక్కడ ప్రదర్శించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో తాము పది లక్షల కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటామని చైనా చెబుతోంది. అందువలన ప్రతి దేశం తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తుంది. షాంఘై ప్రదర్శనలో చైనా తన విధానాన్ని, నిబంధనలను ప్రపంచానికి తెలియచేయనుంది. ఈ ప్రదర్శనలో మన దేశం నుంచి కనీసం వందమంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం వుంది. చైనా వస్తువుల దిగమతులు నిలిపివేసి దేశభక్తి నిరూపించుకోవాలని సంఘపరివార్‌ సంస్ధలు ఎంతగా గగ్గోలు పెట్టినా గత ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మన దేశం చైనా నుంచి 69.4బిలియన్‌ డాలర్ల మేరకు వస్తువులను దిగుమతి చేసుకోగా ఇదే సమయంలో కేవలం 11.5బిలియన్ల మేరకు మాత్రమే ఎగుమతులు చేసింది. వాణిజ్య తేడా 58 బిలియన్‌ డాలర్లు. చైనాతో సరిహద్దు సమస్యతో పాటు వాణిజ్యపరంగా ఇలాంటి ఎన్నో ప్రాధాన్యత అంశాలున్నందున వారితో వైరం తెచ్చుకోవాలని ఏ కార్పొరేట్‌ సంస్ధా కోరుకోదు. పాలకులు ఎవరైనా అలాంటి పిచ్చిపనులకు పూనుకుంటే వైఖరి మార్చుకునే విధంగా తాను చేయాల్సింది చేస్తుంది. ఈ పూర్వరంగంలోనే ఎలాంటి ముందస్తు ఎజండా లేకుండా నరేంద్రమోడీ చైనా వెళ్లినప్పటికీ సానుకూలంగా వున్నామన్న సందేశం దానిలో ఇమిడి వుంది.

అమెరికాాచైనాల మధ్య వాణిజ్య పోరుకు స్వస్థిచెప్పి వాణిజ్యలోటు సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే ఆచరణలో ఎవరి ప్రయోజనాలు వారికి వున్నాయి గనుక అమలు ప్రశ్న తలెత్తుతోంది. గతంలో కూడా ప్రతి అమెరికా అధ్యక్షుడూ ఏదో ఒక దశలో వాణిజ్యపోరు పేరుతో బెదిరింపులకు దిగిన వారే. ట్రంప్‌ వైఖరి మొరటుగా వుంది. తన పదవీకాలం పూర్తయ్యే నాటికి రెండు దేశాల మధ్య వున్న వాణిజ్యలోటులో 200బిలియన్‌ డాలర్లను తగ్గించాలని చెబుతున్నాడు. అయితే హడావుడి చేస్తోందని చైనీయులు చెబుతున్నారు. మేడిన్‌ చైనా 2025 పేరుతో చైనా తన వుత్పాదక పరిశ్రమను వున్నత స్ధాయికి పెంచుకొనేందుకు దీర్ఘకాలిక క్రీడను ప్రారంభించిందని, దానిని పడనివ్వకుండా చేయటంతో పాటు అమెరికా తాత్కాలిక ప్రయోజాలను కోరుతోందని, చైనా కీలక ప్రయోజనాలను ఎట్టి పరిస్ధితులలో ఫణంగా పెట్టదని పరిశోధకులు చెబుతున్నారు.

చైనాతో పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం తప్పిపోయిందని విజయోత్సవాలు చేసుకోవటం తప్ప సాధించిందేమిటో తెలియదని అమెరికాలో విమర్శకులు అంటున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధతో కలవకుండా తన ప్రయోజాలకే పెద్ద పీట వేస్తున్న చైనాను ఒంటరి పాటు చేయటం లేదా అంకెకు తీసుకురావటం అన్న అసలు లక్ష్యాన్ని ట్రంప్‌ పట్టించుకోవటం లేదన్న విమర్శలు చెలరేగాయి. అసలు చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో అడుగుపెట్టనివ్వటమే అమెరికా చేసిన పెద్ద తప్పిదమని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒక నివేదికలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్ధలో రాజ్య జోక్యం చేసుకోకుండా చైనాను కట్టడి చేయటమే అంతి మ లక్ష్యం అయితే అమెరికా వస్తువులను కొనుగోలు చేయించమని చైనాను కోరటం ప్రతికూలమౌతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

అమెరికా ఇప్పుడు ఒక్క చైనా మీదే కాదు మా వస్తువులు కొంటారా లేక మీ వస్తువుల మీద దిగుమతి పన్ను విధించమంటారా తేల్చుకోండని అన్ని దేశాలను బెదిరిస్తున్నది. వాటిలో జపాన్‌ ఒకటి. రాజకీయంగా చైనాకు వ్యతిరేకంగా దానిని కూడగడుతున్నప్పటికీ ఆర్ధిక విషయాల్లో జపాన్‌పై అమెరికా తన షరతులను రుద్దేందుకు పూనుకుంది. తమ వుక్కు, అల్యూమినియం వస్తువులపై 25,10 శాతం చొప్పున దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా పూనుకుంటే తాము కూడా ప్రతి చర్యలకు దిగక తప్పదని ప్రపంచవాణిజ్య సంస్ధకు జపాన్‌ తెలియచేసింది. అమెరికా బెదిరింపులకు చైనా లంగకపోవటం జపాన్‌కు వూతమిచ్చి అమెరికాను హెచ్చరించేంత వరకు వెళ్లిందని పరిశీలకులు భావిస్తున్నారు. 1970,80 దశకాలలో అమెరికాను ఎదిరించే శక్తిలేని జపాన్‌ ప్లాజా ఒప్పందాన్ని అంగీకరించాల్సి వచ్చిందని పర్యవసానంగా జపాన్‌లో దీర్ఘకాల ఆర్ధిక తిరోగమనానికి దారి తీసిందని ఇప్పుడు అమెరికా గొంతెమ్మ కోర్కెలను చైనా అంగీకరించటం లేదని అందువలన చైనా నుంచి నేర్చుకోవాల్సి వుందని జపాన్‌ భావిస్తున్నది.

చిత్రం ఏమిటంటే ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలుపుతున్న అక్కడి ధనిక దేశాలు కూడా జపాన్‌ చర్యను చూసి అమెరికా దిగుమతి సుంకాలకు ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై అదనపు సుంకాలను విధించాల్సి వుంటుందని ఐరోపా యూనియన్‌ పేర్కొన్నది.అయితే ఈ హెచ్చరికలేవీ జపాన్‌-ఐరోపాయూనియన్‌- అమెరికా మధ్య వున్న రాజకీయ బంధాన్ని దెబ్బతీసేవిగా మారే అవకాశాలు ఇప్పటికైతే లేవు. మన దేశంపై అమెరికా వాణిజ్య యుద్దానికి దిగకపోయినప్పటికీ మన వ్యవసాయ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు వత్తిడి తెస్తోంది. దానిలో భాగంగానే మన దేశంలో ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరలను ఎక్కువగా నిర్ణయిస్తోందని, వ్యవసాయ, ఆహార రాయితీలను పరిమితికి ఇస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్ధకు కొద్దివారాల క్రితం ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో వుక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలు మన దేశానికి కూడా వర్తిస్తాయని మన దేశం కూడా వాణిజ్య సంస్ధకు నోటీసు అందచేసింది. మొత్తం మీద చూసినపుడు మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికొస్తూ మాకేమి తెస్తారు అన్న రీతిలో అమెరికా ప్రవర్తిస్తోంది. అందువలన దాని వైఖరికి ప్రభావితులయ్యే ప్రతి ఒక్కరు ఏదో విధంగా సమన్వయం చేసుకొని పెద్దన్న వైఖరిని అడ్డుకోవటం అవసరం. ఈ దృష్ట్యా కూడా చైనాతో మన దేశం సఖ్యంగా వుండి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటం అవసరం.