Tags

, , , , , ,

Image result for narendra modi fitness challenge

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు, వడ్డీ రేటు పెంచితే మన రూపాయి విలువ మరింత దిగజారుతుందా ? అవును, ఇదేమి లంకె అనుకుంటున్నారా ? చమురు ధరలు పెరిగితే దానిని వుత్పత్తి దేశాలకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం, ఆనందం. మనకు విషాదం, తారాజువ్వల్లా ధరల పెరుగుదల ! ఎంకిపెళ్లి సుబ్బి చావుకు రావటం అంటే ఇదేనా ! ప్రపంచ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల మన రూపాయి విలువ పతన కారణాలలో ఒకటని అనేక మంది చెబుతుంటే మన చమురు, సహజవాయు శాఖ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గారు మాత్రం దానికి రూపాయి విలువ పతనం అని మరొకదాన్ని జోడించి మన దేశంలో పెట్రోలియం, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని సెలవిచ్చారు. చమురు ధరలు మన చేతుల్లో లేవు సరే మన రూపాయి విలువ కూడా మన అదుపులో లేదా ? పాపాయి వంటి రూపాయికి రక్షణ లేకుండా పోతోందని ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గుండెలు బాదుకున్న విషయం మరచిపోయారా ?

పెట్రోలు ధరల గురించి ఈ రోజు రాసింది రేపటికి చద్దివార్త అవుతోంది. ధరలు మారిపోతున్నాయి. అందువలన ఈ రోజు ఎంత అన్నది వదిలేద్దాం. కొద్ది నెలల క్రితం గోల్డ్‌మన్‌ సాచస్‌ అనే సంస్ధ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం అమెరికాలో ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతున్న కారణంగా(ఎలాంటిది, ఎంతనేది వేరే విషయం) నిరుద్యోగరేటు తగ్గుతోంది, పర్యవసానంగా 2018లో అక్కడ వడ్డీ రేట్లు నాలుగు సార్లు పెరిగే అవకాశం వుందన్నది ఒక అంశం. ఇదే జరిగితే బలహీనమైన ఆర్ధిక వ్యవస్ధలతో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడి(డాలర్ల రూపంలో) అమెరికన్‌ మార్కెట్లకు తరలిపోతుంది. అటువంటి పరిస్ధితులలో మనది బలహీన ఆర్ధిక వ్యవస్ధ కానప్పటికీ దేశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఎఫ్‌పిఐలు షేర్‌ మార్కెట్లో, అప్పు మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. ఎక్కడ మోసం చేయటానికి జనం దొరుకుతారో అక్కడికి నవారు ఆట మోసగాండ్లు ఎప్పటికప్పుడు మకాంలు ఎలా మారుస్తారో అలాగే విదేశీ మదుపుదార్లు మన దేశంలో కంటే వాటిమీద ఎక్కడ ఎక్కువ రాబడి వస్తే అక్కడకు ఇక్కడ అమ్మేసి తరలిస్తారు. వారికేమీ దేశభక్తి, మన దేశం ఏమి అవుతుంది అనేదేమీ వుండదు. అలా పెట్టుబడులు తరలిపోయినపుడు వాటి మీద ఆధారపడి ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు, విస్తరణ ఆగిపోతుంది. నిరుద్యోగం పెరుగుతుంది. అమెరికాలో పరిస్ధితులు మెరుగుపడితే మన రూపాయి విలువ పతనం అవుతుంది, దిగజారితే డాలరు విలువ తగ్గి మన రూపాయి విలువ పెరుగుతుంది. అప్పుడు మనం కొనే చమురుకు చెల్లించాల్సిన డాలర్ల మొత్తం తగ్గుతుంది. అసలు చమురు రేట్లే పెరిగితే ఆ భారం ఇంకా పెరుగుతుందని చెప్పనవసరం లేదు.

అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే అక్కడ వున్న ప్రవాస భారతీయులు అక్కడే పెట్టుబడులు పెడతారు తప్ప మన దేశానికి డాలర్లను తరలించరు. మన వారికే దేశభక్తి లేనపుడు మిగతావారి గురించి చెప్పేదేముంది. అమెరికా ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అక్కడ వాటి వడ్డీ రేట్లు పెరిగితే మన దేశం కంటే అక్కడ ఎక్కువ వచ్చేట్లయితే ఇక్కడి అప్పును అయినకాడికి అమ్మేసి డాలర్లను తీసుకుపోతారు. దీని ప్రభావం మన స్టాక్‌ మార్కెట్‌ మీద కూడా పడుతుంది. మన దేశంలో పెట్టుబడులు కావాల్సిన వారు విదేశాల నుంచి తీసుకోవాలంటే ఎక్కువ రేటు చెల్లించాలి. గతంలో మన రూపాయి విలువ ఎక్కువగా వుండి డాలరు విలువ తక్కువగా వున్నపుడు అందిన కాడికి మన కంపెనీలు అప్పులు తీసుకువచ్చాయి. తరువాత డాలరు రేటు పెరగటం, మన రూపాయి పతనంతో ఆ కంపెనీలు తలకు మించిన రుణభారంతో దెబ్బతిన్నాయి.

తిరుగుతున్న చక్రం మీద కూర్చున్న ఈగ చక్రాన్ని తానే తిప్పుతున్నట్లు భావిస్తుందట. నరేంద్రమోడీ సర్కార్‌ గత నాలుగు సంవత్సరాలలో మూడు సంవత్సరాలు విజయగీతాలాపన చేశారు. నాలుగోఏడాది పూర్తయ్యే సరికి గొంతు బొంగురు పోతోంది.యుపిఏ హయాంలో 2012-13 సంవత్సరాలలో చమురు పీపాధర 150 డాలర్ల వరకు పోయింది. సరే అప్పుడు పెట్రోలు లీటరు రు.70కి అటూ ఇటూగా వున్నపుడు ఇంత ఘోరమా అంటూ బిజెపి పెద్దలందరూ వీధులలో నిరసనలతో హోరెత్తించారు. అలాంటి ధరలు కాస్తా నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక ఒక దశలో కనిష్టంగా 33 డాలర్లకు పడిపోయాయి. అయినా పెట్రోలు రు.60కి మించి తగ్గలేదు. చమురు ఆదాయం మీద ఆధారపడిన అనేక దేశాలు అల్లాడుతుంటే మన దేశం ఎంతో లబ్ది పొందింది. అది సామాన్య జనానికి కాకుండా కార్పొరేట్లకు అన్నది తిరుగులేని నిజం. తగ్గిన చమురు భారాన్ని జనానికి బదలాయించకుండా వచ్చిన లాభాన్ని ద్రవ్యలోటు పూడ్చేందుకు వినియోగించి లోటును తగ్గించిన ఘనత మాదే అని గొప్పలు చెప్పుకున్నారు. ఇదే సమయంలో కార్పొరేట్లకు పెరిగాయి తప్ప రాయితీలు ఏమాత్రం తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజవాయు శాఖ వార్షిక నివేదికల ప్రకారం ముడి చమురు దిగుమతులు, పీపా సగటు ధరలు ఇలా వున్నాయి.

సంవత్సరం    మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు    ధర డాలర్లలో        దిగుమతి ఖర్చు రు.కోట్లు

2011-12         171.729               111.89                ======

2012-13         184.795              107.97           7,84,562

2013-14         189.238            105.52            8,64,875

2014-15         189.43                84.16            6,87,416

2015-16         202.85                46.17             4,16,579

2016-17        213.93                47.56              4,70,159

2017-18        217.08                53.59             3,42,673

2017-18 సంవత్సరంలో 217 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు దిగుమతి అంచనా కాగా మూడు లక్షల 42వేల 673 కోట్లు ఏప్రిల్‌-నవంబరు మాసాలలో దిగుమతి చేసుకున్న మొత్తానికి చెల్లించిన సొమ్ము. ఈ అంకెలు నరేంద్రమోడీ సర్కార్‌పై చమురు దిగుమతుల బిల్లు భారాన్ని ఎంతగా తగ్గించాయో చెబుతున్నాయి. ఇంత భారం తగ్గినప్పటికీ దాన్ని వినియోగదారులకు బదలాయించకపోగా మోడీ ప్రభుత్వం వినియోగదారులపై అదనంగా ఎంత భారం మోపిందో చూద్దాం.

2013-14లో(నరేంద్రమోడీ 2014 మే 26న పదవిలోకి వచ్చారు) యుపిఏ సర్కార్‌ పెట్రోలు, డీజిల్‌, ఇతర పెట్రోలియం వుత్పత్తుల మీద విధించిన పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం 88,600 కోట్ల రూపాయలు. ఈ మొత్తం మోడీ హయాంలో వరుసగా నాలుగు సంవత్సరాలలో 1,05,653, 1,85,598, 2,53,254, 2,01,592, 2,57,850లకు పెరిగింది. ఈ అంకెలలో 2017-18 సంవత్సరానికి చూపిన 2,01,592 కోట్ల రూపాయలు ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు మాత్రమే. అంటే మిగిలిన మూడు నెలలకు సగటున మరో 67వేల కోట్ల రూపాయలను వేసుకుంటే 2,68,790 కోట్లుగా వుంటుంది.ఈ లెక్కన నాలుగేండ్లలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల సబ్సిడీని వుపసంహరించిందో, ఎన్నిలక్షల కోట్ల భారం మోపిందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

పిఎంఓ రిపోర్డు కార్డు పేరుతో అచ్చు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ అనే భ్రమ కలిగించే ఒక బిజెపి ప్రచార వెబ్‌సైట్‌ వుంది. దాని మీద ప్రధాని బొమ్మ, మూడు సింహాలు, జాతీయ జెండా కూడా వుంటాయి. దాని మీద సామాన్యులకు అర్ధం కాకుండా అనధికారికం అనే ఒక పదం వుంటుంది. అయితే దాని ఫేస్‌బుక్‌ పేజీ చూస్తే కాని అది అనధికారికం, వలంటీర్లు నిర్వహిస్తున్నది అని తెలుస్తుంది. వలంటీర్లంటే కిరాయి బాపతు అని వేరే చెప్పనవసరం లేదు. మోడీ సర్కార్‌కు పెట్రోలు మంటల సెగ తగులుతుండటంతో ఆ గ్యాంగు ఒక పట్టికను తయారు చేసి జనం మీదకు వదిలింది.

2009-13 సంవత్సరాల మధ్య, తరువాత 2018వరకు ముంబైలో పెట్రోలు ధరలంటూ ఒక పట్టిక ఇచ్చింది. వాటిని ఎలా నిర్ధారించారో తెలియదు, వదలివేద్దాం. యుపిఏ ఐదేండ్ల కాలంలో పెట్రోలియం వుత్పత్తుల మీద ఇచ్చిన సబ్సిడీ దాని పట్టిక ప్రకారం 5,67,449 కోట్లు, తరువాత మోడీ నాలుగు సంవత్సరాల కాలంలో ఇచ్చిన మొత్తం 1,33,663 కోట్లుగా తెలిపింది. యుపిఏ హయాంలో ఇచ్చిన సబ్సిడీ నుంచి మోడీ ఏలుబడి సబ్సిడీ మొత్తాన్ని తీసి వేసి యుపిఏ కాంగ్రెస్‌ లూటీ చేసిన 4,43,308 కోట్ల రూపాయల మొత్తం ఏమైందో ఆశ్చర్యంగా వుందంటూ ఒక వ్యాఖ్యను జోడించారు. లూటీ మొత్తమంటూ పేర్కొన్నది కూడికలు తీసివేతలు కూడా సరిగా రాని వారు వేసిన అంకె. ఆ మొత్తం వినియోగదారులకు దక్కింది అని వేరే చెప్పనవసరం లేదు. ఇక్కడ మోడీగారిని అడగాల్సింది, జనానికి తెలియాల్సిందేమంటే ఆ పట్టిక ప్రకారం సబ్సిడీలో విధించిన కోత 4,33,786 కోట్లు, పెంచిన పన్నులతో వసూలు చేసిన మొత్తం 8లక్షల 20వేల కోట్లకు అటూగా వుంది. అంతకు ముందు మాదిరి పన్ను రేటు అలాగే వుందనుకుంటే అది ఏడాదికి ఒక లక్ష కోట్ల రూపాయలనుకుంటే మోడీ సర్కార్‌ జనం మీద మరో నాలుగు లక్షల కోట్ల భారం మోపినట్లే ? దీనికి కోతపెట్టిన సబ్సిడీని కూడా కలుపుకుంటే ఏడాదికి రెండులక్షల కోట్ల మేరకు జనం మీద భారం మోపినట్లే . జనం ఆశ్చర్యపోవాల్సిందీ, నిలదీయాల్సిందీ ఇంత భారం మోపి సాధించిన ప్రగతి ఏమిటీ అని?

నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో ఒక వ్యాధి మీద పరిశోధనకు అవసరమైన నిధుల సేకరణకు కొంత మంది ఒక బకెట్‌లో నీళ్లు, మంచు ముక్కలు కలుపుకొని తల మీద పోసుకొని ఇతరులు కూడా అలాగే చేయాలని సవాలు విసిరారు. జనం వేలం వెర్రిగా ఆపని చేశారు. సరే తరువాత అది ఎంత అపహాస్యమైందో ఎన్ని జోకులు పేలాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ గారిని జనం చమురు గురించి, ఇతర వాగ్దానాల గురించి నిలదీస్తుంటే వాటికి ఎక్కడా సమాధానాలు చెప్పటం లేదు. ఇప్పుడు మరోవేలం వెర్రిగా మారుతున్న ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను పట్టుకొని జనాలు తామేం చేస్తున్నదీ ఫొటోలు పెడుతున్నారు.దాన్లో భాగంగా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన భార్య అనుష్కశర్మతో పాటు ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఫిట్‌నెస్‌ సవాలు విసిరాడు. వయసులో వున్న కోహ్లీ నాలుగు కాలాలపాటు క్రికెట్‌ ఆడి, నాలుగు వాణిజ్య ప్రకటనలు చేసి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలంటే ఫిట్‌నెస్‌ అవసరం. ఆయన భార్య అనుష్కశర్మ సినిమా హీరోయిన్‌, ఆమెదీ అదే పరిస్ధితి, అందులోనూ వారిద్దరికీ ఈ మధ్యే వివాహం కూడా అయింది.ఫిట్‌నెస్‌ గురించి వారిద్దరూ ఒకరికొకరు సవాలు విసురుకున్నారంటే అందం, అర్ధం వుంది. మరి ఈ వయస్సులో నరేంద్రమోడీకి ఎందుకు ! ఒకవైపు దేశంలో మీరు ప్రధాని పదవికి అన్‌ఫిట్‌ (తగరు) అనే అభిప్రాయం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటువంటి స్ధితిలో ప్రతిపక్షాలు విసురుతున్న అనేక సవాళ్ల గురించి పట్టించుకోకుండా దేశం తగులబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తి మాదిరి నేను కూడా శారీరక ఫిట్‌నెస్‌ సవాలును స్వీకరిస్తా అంటూ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో సై అనటం నరేంద్రమోడీకి తగని పని. నీరోకూ ఆయనకు పెద్ద తేడా కనపడటం లేదు. దేశమంతటా చమురు ధరల గురించి చర్చ చేస్తుంటే చమురు సవాలును స్వీకరించాలని రాహుల్‌ గాంధీ విసిరిన సవాలు గురించి మౌన ముద్రదాల్చారు. సామాజిక మీడియాలో దాని మీద పేలుతున్న జోకులెన్నో సరేసరి. నిజానికి ఇప్పుడు నరేంద్రమోడీ ముందున్నది మరోసారి ప్రధాని పదవికి అర్హత వుందా అన్నది పెద్ద సవాల్‌. ఏ ప్రధాన సమస్య గురించి నోరు విప్పని మోడీ వాటి గురించి మాట్లాడాలి.

మన దేశంలో కేంద్రంలో ఎవరు అధికారానికి వచ్చినా ఒకే చెప్పుల్లో కాళ్లు దూర్చుతున్నారు, ఒకే బాటలో నడుస్తున్నారు. అది పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ పాలన కావచ్చు, నాలుగేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి కావచ్చు. ప్రపంచీకరణ యుగంలో మనం ఒంటరిగా వుండలేమన్నది నిజం. కిటికీ మూసుకుంటే గాలి ఆడక వుక్కిరి అవుతాం. తెరిస్తే ఈగలు, దోమలతో పాటు ఇప్పుడు కొత్తగా గబ్బిలాల వైరస్‌ కూడా ప్రవేశించే ప్రమాదం వుంది. ఇప్పటికే దేశంలో అంతకు మించి ముప్పు తెచ్చే మతోన్మాద వైరస్‌ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. దీనికి దివాళాకోరు ఆర్ధిక విధానాల కారణంగా ఆర్ధిక దిగజారుడు తోడైంది. వీటిని జంటగా ఎదుర్కోవటం పెద్ద సవాల్‌. దేశం ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తుందా ?