Tags

, , , , ,

Image result for US writing the indian farmers fate

ఎం కోటేశ్వరరావు

అమెరికా ! ఎందరో యువతీ యువకులకు కలల ప్రపంచం. అమెరికా !! అక్కడి కార్పొరేట్లతో చేతులు కలిపి తెల్లవారే సరికి ధనవంతులై పోవాలని చూసే వాణిజ్య, పారిశ్రామికవేత్తలు. వారి ప్రయోజనాల కోసం చొంగకార్చుకుంటూ అమెరికా పాలకుల అడుగులకు మడుగులత్తే పాలకులు. నిజానికది అమెరికా కష్ట జీవులతో ప్రపంచ శ్రామికుల మూలుగులు పీల్చి తన కార్పొరేట్ల కడుపులు నింపేందుకు ఎంతకైనా తెగించే ఒక దుర్మార్గ వ్యవస్ధ వున్న దేశం. మన దేశం రైతాంగానికి అధిక మొత్తంలో మద్దతు ధరలు కల్పిస్తున్నారని, ఇది ప్రపంచ వాణిజ్య సంస్ధ ఆమోదించిన నియమావళికి విరుద్దమని ఈ అక్రమంపై విచారణ జరపాలని 2018 మే నెల మొదటి వారంలో అమెరికా ఫిర్యాదు చేసింది. రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న మాటలు కోటలు దాటి వూరంతటికీ వినిపించే విధంగా వాగ్దానాలు చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ కాలు ఆచరణలో గడపదాట లేదు. ఇంతవరకు కనీసం ఆ చర్యను ఖండిస్తూ గట్టిగా ఒక ప్రకటన కూడా చేయలేదు.

మన దేశంలో ప్రతి ఏటా ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదని అందరూ అంగీకరిస్తున్నదే. రైతాంగంలో వున్న ఈ అసంతృప్తిని ఓట్ల రూపంలో మలుచుకొనేందుకు 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి గత లోక్‌సభ ఎన్నికలలో వాగ్దానం చేసింది. ఆ దిశగా ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు, గత నాలుగు సంవత్సరాలలో పరిస్ధితి మరింత దిగజారిందని అనేక రాష్ట్రాలలో ప్రారంభమైన రైతాంగ వుద్యమాలే అందుకు నిదర్శనం. మన దేశంలో అమలు జరుగుతున్న విధానాల గురించి పశ్చిమ దేశాలు ఏవిధంగా ఆలోచిస్తున్నాయి? ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేసేంతగా అమెరికాను ప్రేరేపించేందుకు మన ప్రభుత్వం కొత్తగా తీసుకున్న చర్యలేమన్నా వున్నాయా?

ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటివో) వునికిలోకి వచ్చిన గత పద్దెనిమిది సంవత్సరాలుగా పశ్చిమ దేశాలు మన దేశ వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధలో ఎప్పుడు చొరబడదామా, లాభాలను ఎంత త్వరగా తరలించుకుపోదామా అని ఆతృతపడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సంస్కరణల గురించి కబుర్లు చెప్పటమే తప్ప సమూలంగా మార్చేందుకు అది ముందుకు రావటం లేదు, మేమొస్తే తెల్లవారేసరికల్లా చేయాల్సింది పూర్తి చేస్తామని దేశ, విదేశీ కార్పొరేట్‌ సంస్ధలకు బిజెపి అరచేతిలో వైకుంఠం చూపింది. ముద్దు చేసినపుడే చంకనెక్కేందుకు సరైన సమయం అన్నట్లుగా మోడీ సర్కార్‌ అధికారంలోకి రాగానే పశ్చిమ దేశాలు మరోసారి పెద్ద ఎత్తున తమ వాదనలను ముందుకు తెచ్చి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయి. కొంత మేరకు జయప్రదం అయ్యాయి. అనేక మంది మంది మంత్రులు, ఇతరులు పశ్చిమ దేశాలు చేసిన వాదనలనే చిలుక పలుకుల్లా వల్లెవేశారు.

2014 ఆగస్టు చివరి వారంలో డిప్లొమాట్‌ అనే పత్రికలో డాన్‌ పియర్సన్‌ అనే రచయిత పశ్చిమ దేశాల ఆలోచనా సరళిని ప్రతిబింబిస్తూ ఒక పెద్ద విశ్లేషణ రాశారు.’ ప్రమాదకరమైన భారత ఆహార రాయితీలు’ అని దానికి పేరు పెట్టారు. దాని సారాంశం, అందుకు అనుగుణ్యంగా మోడీ సర్కార్‌ తీరు తెన్నులు ఎలా వున్నాయో చూద్దాం.

‘భారత వ్యవసాయ సబ్సిడీలు(రాయితీలు) ప్రపంచ రైతాంగానికి హాని కలిగించటంతో పాటు స్వంత ఆహార భద్రతకే ముప్పు తెస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధతో భారత్‌ ఇచ్చిన అంగీకారం మేరకు ఇప్పటికే వ్యవసాయ సబ్సిడీలు ఎంతో ఎక్కువగా వున్నాయి. ప్రపంచవ్యాపితంగా వ్యవసాయ వస్తువుల రేట్లు పడిపోతున్నాయి, ఆ రాయితీలు ఇతర దేశాల్లోని రైతులను నష్టపరుస్తాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే విధంగా వారి ప్రభుత్వాలపై వుద్యుక్తులౌతారు. వ్యవసాయ వాణిజ్యం చేసే దేశాలు ఈ విషయాన్ని ప్రపంచవాణిజ్య సంస్ధ వివాదాల పరిష్కారానికి నివేదించాలి. భారత దుర్వినియోగానికి స్వస్తి పలకాలి. భారత్‌లో కృత్రిమంగా ఎక్కువ ధరలకు రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తున్నారు. తరువాత కొంత భాగాన్ని ఐదులక్షల చౌకదుకాణాల ద్వారా 80కోట్ల మంది పేదలకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వుద్దేశించిన వినియోగదారులకు 40శాతం ఆహారం చేరటం లేదని అంచనా. అనేక మంది ఇంకా ఆకలితో వుండగా ఆహార నష్టం జరగటం దుర్మార్గం. ఏటా 30లక్షల టన్నుల ఆహారాన్ని నేల మీద ప్లాస్టిక్‌ సంచులు కప్పినిలవ చేస్తున్నారు.భారత్‌ ఈ విధానాన్ని ఇంకా కొనసాగిస్తున్నది.

భారత వ్యవసాయ సబ్సిడీలు దాని స్వంత ఆర్ధిక వ్యవస్ధకే హాని కలిగిస్తున్నాయి. గోధుమ, వరి, చెరకు వంటి పంటల సాగుకు మరింత భూమి, నీటిని వినియోగించే విధంగా రైతాంగానికి రాయితీలు ఇస్తున్నారు. దీని వలన వినియోగదారులు కొనుగోలు చేయాలని కోరుకొనే ఇతర పంటలైన పండ్లు, కూరగాయలు తదితరాల వుత్పత్తి తగ్గుదలకు, అధికధరలకు దారితీస్తోంది. మౌలిక పంటల సాగును ప్రోత్సహించి ఆహార భద్రతను సాధించేందుకే ఇవన్నీ చేస్తున్నామని ముసుగులో భారత్‌ వీటిని సమర్ధించుకుంటోంది. ఇదే సాకుతో పంటలకు అధిక ధరలు ఇవ్వటాన్ని, దిగుమతులపై ఎక్కువ పన్నుల విధింపు, తదితర ఆటంకాలు కలిగించటాన్ని సమర్ధించుకుంటోంది. దిగుమతులపై ఆంక్షలు విధించటం ద్వారా సాయపడటం కంటే ఆహార భద్రత సరఫరాకు హాని ఎక్కువని అత్యధిక ఆర్ధికవేత్తలు అంగీకరిస్తారు. భారత్‌లో వార్షిక రుతుపవనాలు విఫలమైతే అది కరవుకు దారి తీసి పంటల వుత్పత్తి తగ్గుతుంది. కాబట్టి పూర్తిగా స్వంత వుత్పత్తి మీదే పూర్తిగా ఆధారపడితే సరఫరా షాక్‌లు తగిలే అవకాశం వుంది. అలాగాక పెద్దదైన, విస్తరించే గుణం వున్న ప్రపంచ మార్కెట్‌తో తన వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధను పూర్తిగా ముడివేయాలి.

కాబట్టి అమెరికా వంటి ధనిక దేశాలు ఏం కోరుకుంటున్నాయో రైతు సోదరులు, సమాజంలోని ఇతరులకు చెప్పనవసరం లేదు. 2011లో డిటిబి అసోసియేట్స్‌ అనే ఒక సంస్ధ చేసిన సర్వే ప్రకారం భారత్‌కు అనుమతించిన 37బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగానే రాయితీలిస్తున్నట్లు తేలిందని, ఇది ప్రపంచ వస్తు మార్కెట్లను, వాటిపై ఆధారపడిన రైతాంగాన్ని దెబ్బతీస్తుందని సదరు విశ్లేషకుడు పేర్కొన్నాడు. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలను భారత్‌ పాటించకపోతే ఇతర దేశాలు కూడా అదే విధానాన్ని అనుసరిస్తాయని బెదిరించిన ఈ పెద్దమనిషి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్‌లో పది సంవత్సరాలు పని చేశాడంటే ఎవరి అభిప్రాయాలను ప్రతిబింబించాడో చెప్పనవసరం లేదు.

రోగి కోరుకున్నదే వైద్యుడు ఇచ్చాడన్నది పాత లోకరీతి, బహుళజాతి గుత్త సంస్ధలు కోరుకుంటున్నవాటినే మన పాలకులు తీరుస్తున్నారన్నది నేటి రీతి. అది కాంగ్రెస్‌ అయినా బిజెపి అయినా ఒకటే. నరేంద్రమోడీ సర్కార్‌ బిజెపి సీనియర్‌ నాయకుడు శాంతకుమార్‌ అధ్యక్షతన ఒక వున్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసింది. అది చేసిన సిఫార్సులను దేశీయ, విదేశీ కార్పొరేట్లన్నీ హర్షించాయంటే అవెలాంటివో చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎఫ్‌సిఐ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా వున్నాయి. రైతులందరికీ కనీస మద్దతు ధరల లబ్ది చేకూరటం లేదు, మరోవైపు వినియోగదారులు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం ఎఫ్‌సిఐ సేకరణను పరిమితం చేస్తారు. రాష్ట్రాల అవసరాలకు పోను మిగులు వున్న ధాన్యాన్నే అదీ ప్రభుత్వాల నుంచి కొనుగోలు చేస్తారు. అసలే రాష్ట్ర ఆర్ధిక వనరులు అంతంత మాత్రంగా వున్న స్ధితిలో ఇది రాష్ట్రాలపై భారం మోపటం, కేంద్రం తన బాధ్యతల నుంచి వైదొలగటం తప్ప వేరు కాదు. అన్ని రాష్ట్రాల నుంచి, రైతులందరి నుంచి కొనుగోలు చేసి లోటు రాష్ట్రాలకు సరఫరా చేయాల్సిన ఎఫ్‌సిఐ పాత్రను చిన్న కమతాలున్న రాష్ట్రాలకే పరిమితం చేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఏ రాష్ట్రమైనా తన రైతాంగానికి బోనస్‌ ఇచ్చేట్లయితే అలాంటి రాష్ట్రాల నుంచి మిగులు ధాన్యాన్ని కూడా ఎఫ్‌సిఐ కొనుగోలు చేయరాదని పేర్కొన్నది. ఇది రైతాంగానికి అన్యాయం చేయటమే.

రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ సర్కార్‌ ఆచరణలో రైతాంగాన్ని ప్రయివేటు వ్యాపారులకు అప్పగించేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. కనీస మద్దతు ధరలే తక్కువని రైతాంగం గగ్గోలు పెడుతుంటే వాటి కంటే మార్కెట్లో ధరలు తగ్గినపుడే ప్రభుత్వం జోక్యం చేసుకోవటం అంటే అంతకు మించి కొనుగోలు చేసేందుకు ప్రయివేటు వ్యాపారులు ముందుకు రారన్నది పత్తి విషయంలో చూశాము. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొనుగోళ్లు ఎంఎస్‌పికే పరిమితం కావటం, రైతాంగం నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి మద్దతు ధరలకు కొనుగోలు చేసి వారికి లబ్ది చేకూర్చటం అందిరికీ తెలిసిందే. ఆహార భద్రతను జనాభాలో ఇప్పటి వరకు వున్న 67శాతం మందిని 40శాతానికి పరిమితం చేసేందుకు శాంతకుమార్‌ కమిటీ సిఫార్సు చేసింది.

ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్ధానం గత నాలుగు సంవత్సరాలలో ఒకటో అరా పాయింటు దిగజారింది తప్ప మెరుగుపడలేదు, అయినప్పటికీ లబ్దిదారుల సంఖ్యను తగ్గించేందుకు ఈ కమిటీ సిఫార్సు చేయటం గమనించాల్సిన అంశం. ఆహార భద్రతలో రెండు అంశాలున్నాయి. రైతులకు అధిక ధరలు కావాలి, వినియోగదారులకు తక్కువకు ఇవ్వాలి అంటే ఎలా అన్న వాదనను ముందుకు తేవటం తెలిసిందే.గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల వుదంతాలు చూశాము గానీ, తమ వుత్పత్తులకు గిట్టుబాటు ధరరాక దివాలాతీసిన పారిశ్రామికవేత్తలను ఎక్కడా చూడలేదు. అలాగే ఆత్మహత్యల కారణాలలో నమోదైన వాటిలో ధరల పెరుగుదల అంశం ఎక్కడా కనపడదు. రైతులు పండించిన వాటికి గిట్టుబాటు ధర రాక, వినియోగదారుడిగా అధిక ధరలు చెల్లించి రెండు విధాలుగా నష్టపోతున్నాడు. వినియోగదారుడికి వస్తున్న నష్టం ఒక్కటే. అందువలన ప్రభుత్వాలు ఇరువురి ప్రయోజనాలను కాపాడాల్సిందే. అది దాని బాధ్యత.

Image result for US writing the indian farmers fate

ప్రభుత్వాల ద్రవ్యలోటు తగ్గాలంటే సమాజంలోని బలహీనవర్గాలకు ఇస్తున్న రాయితీలన్నింటికీ కోత పెట్టాలని ఎక్కువ మంది చెబుతారు. అదే సమయంలో వుపాధి కల్పించాలంటే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రాయితీలు ఇవ్వాలని కూడా ఆ వాదన చేసే వారే చెబుతారు. జరుగుతున్నదేమిటి? దేశంలో ఇస్తున్న రాయితీలన్నింటికీ కోత పెట్టారు. పెట్రోలు,డీజిల్‌ రాయితీ ఎత్తివేశారు. గ్యాస్‌, కిరోసిన్‌పై క్రమంగా ఎత్తివేస్తున్నారు. కాంప్లెక్స్‌ ఎరువులపై ధర నియంత్రణ ఎత్తివేశారు. వాటి మీద ఇచ్చే రాయితీలను తగ్గించటం లేదా ఒక పరిమితిదాట కుండా చూస్తున్నారు. ఎరువుల విషయం చూద్దాం. పౌష్టికాధార ప్రాతిపదికన రాయితీ విధానం(ఎన్‌బిఎస్‌) కింద నైట్రోజన్‌(ఎన్‌) కిలోకు 2011-12లో రు.27.15 ఇస్తే 2016-17కు రు.15.85కు తగ్గింది. ఇదే విధంగా ఫాస్ఫేట్‌ (పి)కు రు.32.34 నుంచి 13.24కు, పొటాష్‌(కె)కు రు.26.75 నుంచి 15.47కు తగ్గింది. ఇదే సమయంలో సల్ఫర్‌(ఎస్‌)కు రు.1.78 నుంచి 2.04కు పెరిగింది.(కేంద్ర ఎరువుల శాఖ 2016-17వార్షిక నివేదిక, పేజీ 41) యూరియా మీద రాయితీ కొనసాగుతున్నది, పెరుగుతున్నది. అన్నింటికీ ద్రవ్యోల్బణం ప్రాతిపదికన రేట్లు పెరుగుతున్నపుడు ఎరువుల రాయితీ మొత్తం కూడా ఆమేరకు పెరగాలి, కానీ అలా జరగటం లేదు. భారత ఫెర్టిలైజర్స్‌ అసోసియేషన్‌ సమాచారం మేరకు 2011-12 నుంచి 2014-15 మధ్య యూరియా మీద ఇస్తున్న రాయితీ 20,208 కోట్ల నుంచి 36వేల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇదే సమయంలో ధరల నియంత్రణ ఎత్తివేసిన కాంప్లెక్‌ ఎరువులపై ఇస్తున్న రాయితీ రు.36,089 కోట్ల నుంచి 24,670 కోట్లకు పడిపోయింది. దిగుమతులతో సహా అన్ని రకాల ఎరువులకు ఇచ్చిన రాయితీలు వరుసగా నాలుగు సంవత్సరాలలో 70013,65613, 67971, 72970 కోట్ల వంతున వున్నాయి. ఈ ఏడాది మార్చినెలలో ప్రకటించిన బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2017-18 సంవత్సరంలో ఇచ్చిన రాయితీల సవరించిన మొత్తం రు.64,973 కోట్లు కాగా దీనిలో 42,721 కోట్లు యూరియా వాటా, వర్తమాన సంవత్సరం అంటే 2018-19లో మొత్తం సబ్సిడీ రు.70,079 కోట్లకు పెంచగా దానిలో యూరియా నిమిత్తం 44,989 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే మొత్తంగా ఎరువుల రాయితీ తగ్గుతున్నట్లా పెరుగుతున్నట్లా ?

ఒకటి రెండు సంవత్సరాలలో తప్ప జనానికి ఇచ్చే ఆహార, పెట్రోలియం వుత్పత్తుల, ఎరువుల సబ్సిడీ మొత్తం జిడిపిలో ఒకశాతానికి అటూ ఇటూగా వుంటున్నాయి. ఇదే సమయంలో కార్పొరేట్‌లకు ఇస్తున్న రాయితీలు ఐదు నుంచి ఎనిమిదిశాతం మధ్యన వుంటున్నాయి. ఐదుశాతం రాయితీలు ఇస్తున్నామని, వాటిని ఎత్తివేస్తే జిడిపిలో పన్ను 22శాతానికి పెరుగుతుందని ప్రధాని ఆర్ధిక సలహా మండలి అధ్యక్షుడు వివేక్‌ దేవరాయ్‌ 2017 డిసెంబరులో చెప్పారు. మన దేశంలో జిడిపిలో పన్ను 15శాతమే, అదే ఇతర బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌లో 25.4, రష్యాలో 23,చైనాలో 18.9, దక్షిణాఫ్రికాలో 26శాతం కాగా అమెరికాలో 28, స్కాండినేవియన్‌ దేశాలలో 45-50శాతం మధ్య వున్నాయి. అందువలన రకరకాల ముసుగుల్లో విదేశాలకు, దేశీయ కార్పొరేట్‌ సంస్ధలకు తరలిపోతున్న లాభాలపై పన్ను రేటు పెంచి ఆ వచ్చిన మొత్తాన్ని అటు రైతాంగం, ఇటు వినియోగదారులకు రాయితీలు ఇస్తే ఎవరూ ఇబ్బంది పడకుండా వుంటారు. అలాంటి సంస్కరణలకు ఈ పాలకులు పూనుకుంటారా ?