• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: May 2018

కొరియా శాంతి ఒప్పందం అమలే పెద్ద సమస్య !

04 Friday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

inter-Korean agreements, inter-Korean summit, korea peace agreement, North Korean leader Kim Jong-un, Panmunjeom Declaration, South Korean President Moon Jae-in

ఎం కోటేశ్వరరావు

‘ప్రపంచం ద అష్టిలో ఆ రెండు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది’ అన్నట్లు కనిపించే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వారం రోజుల క్రితం ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దాని పర్యవసానాల గురించి పండితులు చర్చలు చేస్తుండగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ భేటీ గురించి వార్తలు వచ్చాయి. ఎప్పుడు ఎక్కడ అన్నది ఇంకా ఖరారు కాలేదు. ఉభయ కొరియాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అమలు జరగటానికి ముందు అనేక అంశాలపై స్పష్టత రావాల్సి వుంది. రెండు దేశాలను అణు రహితంగా మార్చడం, రెండు దేశాల మధ్య వున్న శత్రుపూరిత కార్యకలపాలకు స్వస్తి పలకడం, ప్రచార దాడులను నిలిపివేసి రెండు దేశాల మధ్య వున్న మిలిటరీ రహిత ప్రాంతాన్ని శాంతి మండలంగా మార్చడం, సరిహద్దు ప్రాంతంలో ఆయుధాల సంఖ్య తగ్గింపు, అమెరికా, చైనాల ప్రమేయంతో చర్చలను ముందుకు తీసుకు పోవటం, కొరియా యుద్ధ సమయం లో విడిపోయిన కుటుంబాలను దగ్గరకు చేర్చటం, సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైలు మార్గాల నవీకరణ, ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో సహా అన్ని క్రీడలలో సంయుక్త జట్లతో పాల్గనటంపై ఒప్పందం కుదిరింది. 1953లో ఎక్కడైతే కొరియా యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో, తాత్కాలిక సరిహద్దుగా గుర్తించిన చోట, దక్షిణ కొరియా వైపున వున్న మిలిటరీ రహిత ప్రాంతమైన పాముంజోమ్‌లోని ‘శాంతి నివాసం’లో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌, దక్షిణ కొరియా నేత మూన్‌ జె ఇన్‌ భేటీలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం కుదరడం ఒక చారిత్రక సంఘటన. అయినప్పటికీ అమలు లోకి రావటం అంత తేలిక కాదని తరువాత వెలువడిన వార్తలు సూచిస్తున్నాయి. దక్షిణ కొరియాలో 1953 నుంచీ తిష్ట వేసిన అమెరికా సేనలను ఉపసంహరించాలన్నది ఉత్తర కొరియా ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌. ఒప్పంద సమయంలో దాని ప్రస్తావన లేనప్పటికీ ఆ డిమాండును అది వదులుకుంటుండా అన్నది ప్రశ్న. తమ రక్షణకు హామీ వుంటే అణ్వాయుధాలతో తమకు పని లేదని, అమెరికా సైనికుల ఉపసంహరణను కూడా పెద్దగా పట్టుపట్టబోమని పరోక్షంగా సూచించినట్లు నిర్దారణ కాని వార్తలు వచ్చాయి. అయితే శాంతి ఒప్పందా లకు, తమ దేశంలో వున్న 29 వేల అమెరికన్‌ సైనికుల ఉపసంహరణకు సంబంధం లేదని దక్షిణ కొరియా అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌-కిమ్‌ మధ్య జరగబోయే భేటీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.దక్షిణ కొరియాలో అమెరికన్‌ సైనికుల సంఖ్య తగ్గింపు గురించి పరిశీలించాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఆలోచనలు గతంలో కూడా జిమ్మీ కార్టర్‌ నుంచి అనేక మంది చేయకపోలేదు. ప్రపంచంలో అనేక చోట్ల పరాజయమే తప్ప విజయాలు లేనపుడు అమెరికా సైనికులను విదేశాలలో వుంచి పెద్ద మొత్తంలో ఎందుకు ఖర్చు చేయాలన్న చర్చ అమెరికాలో చాలా కాలం నుంచి వుంది. దక్షిణ కొరియాలో తిష్టవేసిన సైన్యానికి అయ్యే ఖర్చు తగినంత అమెరికాకు తిరిగి రావటం లేదు. ఆ సైనికులు జపాన్‌కు రక్షణగా వున్నారు తప్ప మరొకటి కాదు. ఇరవైతొమ్మిది వేల మంది సైనికులు పక్కనే వున్నా అమెరికా నుంచి అణ్వస్త్రాలను తెచ్చి దక్షిణ కొరియాలో మోహరించినా, గువాం ప్రాంతంలో బాంబర్లు, పసిఫిక్‌ సముద్రంలో జలాంతర్గాములను మోహరించినా వుత్తర కొరియా అణు, క్షిపణి పరీక్షలను నివారించలేకపోయాయి. వుత్తర కొరియన్లు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. చేతి చమురు వదలి, పరువు పోగొట్టుకోవటం ఎందుకని కొందరు అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాదితో ముగిసే దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సైనికులకు ఏడాదికి అయ్యే ఖర్చు 80కోట్ల డాలర్లలో సగమే దక్షిణ కొరియా చెల్లిస్తోంది. మొత్తం ఖర్చు భరించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. వారు వున్నా ప్రయోజనం లేనపుడు అంత ఖర్చు తామెందుకు చెల్లించాలన్న ప్రశ్న దక్షిణ కొరియాలోనూ వస్తోంది. వుభయ కొరియాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత అమెరికా సైన్యాల తిష్టను సమర్ధించుకోవటం కష్టం అవుతుందని దక్షిణ కారియా ప్రభుత్వ సలహాదారు మూన్‌ చంగ్‌ ఇన్‌ స్వయంగా చెప్పారు. గతంతో పోలిస్తే దక్షిణ కొరియా సైన్యం కూడా పటిష్టంగా తయారైంది. వుత్తర కొరియా విషయానికి వస్తే అమెరికన్‌ సైనికుల వుపసంహరణ డిమాండ్‌ గురించి తాము పట్టుపట్టకపోవచ్చని కిమ్‌ జోంగ్‌ అన్‌ దక్షిణ కారియా అధికారులతో సూచన ప్రాయంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఎత్తుగడలలో భాగం.

ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం 1991వరకు వున్నది ఒకటే, రెండు కొరియాలు లేవు.1948లో ఐక్యరాజ్యసమితి దక్షిణ కొరియాను పరిశీలక హోదాలో గుర్తించింది. వుత్తర కొరియాను గుర్తించ నిరాకరించింది. 1950లో దక్షిణ కొరియాపై వుత్తర కొరియా దాడి చేసిందనే ఫిర్యాదు రావటంతో భద్రతా మండలి వుత్తర కొరియాపై చర్య తీసుకోవాలని తీర్మా నించింది. ఆ తీర్మానాన్ని నాటి సోవియట్‌ యూనియన్‌ వీటో చేయలేదు. దాంతో అమెరికా నాయకత్వంలో వుత్తర కొరియాపై దాడి జరిగింది. ఆ దాడిని చైనా సహకారంతో వుత్తర కొరియా తిప్పి కొట్టి తన భూభాగాన్ని నిలుపు కొన్నది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 1971 వరకు ఐక్యరాజ్యసమితిలో చైనా అంటే నేటి తైవాన్‌ ప్రతినిధిగా వుంది. ఆ ఏడాది చైనాను గుర్తించిన తరువాత తైవాన్‌ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కొరియా విషయంలో భిన్నంగా జరిగింది. అది ఐరాస ఏర్పాటు సమయానికి స్వతంత్ర దేశంగా లేదు. 1971లో కమ్యూనిస్టు చైనాకు గుర్తింపు వచ్చిన తరువాత వుత్తర కొరియాకు పరిశీలక హోదా కల్పించారు. తరువాత రెండు దేశాలూ తాము శాంతియుత పద్దతుల్లో విలీనానికి చర్యలు తీసుకుంటామని సంయుక్తంగా ప్ర కటించాయి. తరువాత రెండు దేశాలకు 1991లో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. విలీస సమస్య పరిష్కారం కాలేదు. నేటి వరకు వరకు వుభయులు ప్రకటనలైతే చేస్తున్నారు గానీ ముందుకు సాగటం లేదు. అందువల్లనే ఆచరణలో మనకు కనిపిస్తున్నది ఒకే దేశం, రెండు వ్యవస్ధలు. వుత్తర కొరియా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంలో వున్న రెండున్నర కోట్ల జనాభా వున్న దేశం. దీర్ఘకాలం పాటు సైనిక నియంతల పాలనలో తరువాత సైనికాధికారుల కనుసన్నలలో పనిచేసే పౌర పాలకులతో పని చేస్తున్న ఐదు కోట్లకు పైగా జనాభాతో పెట్టుబడిదారీ వ్యవస్ధలో వున్న దేశం దక్షిణ కొరియా.

ప్రపంచం దృష్టి సారించే విధంగా వుభయ దేశాల మధ్య వురుములు మెరుపులతో పాటు పెద్దగా సంప్రదింపుల వాతావరణం కూడా కనపడలేదు. కానీ రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తాపీగా ప్రకటించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. అదీ ఎక్కడా 1953లో ఎక్కడైతే కొరియా యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం కుదరిందో, తాత్కాలిక సరిహద్దుగా గుర్తించిన చోట, దక్షిణ కొరియా వైపున వున్న మిలిటరీ రహిత ప్రాంతమైన పాముంజోమ్‌లోని ‘శాంతి నివాసం’లో వుత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌, దక్షిణ కొరియా నేత మూన్‌ జె ఇన్‌ భేటీలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

రెండు దేశాలను అణురహితంగా మార్చటం, రెండు దేశాల మధ్య వున్న శత్రుపూరిత కార్యకలపాలకు స్వస్ధి పలకటం, ప్రచార దాడులను నిలిపివేసి రెండు దేశాల మధ్య వున్న మిలిటరీ రహిత ప్రాంతాన్ని శాంతి మండలంగా మార్చాలి, సరిహద్దు ప్రాంతంలో ఆయుధాల సంఖ్య తగ్గింపు, అమెరికా, చైనాల ప్రమేయంతో చర్చలను ముందుకు తీసుకుపోవటం, కొరియా యుద్ద సమయంలో విడిపోయిన కుటుంబాలను దగ్గరకు చేర్చటం, సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైలు మార్గాల నవీకరణ, ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో సహా అన్ని క్రీడలలో సంయుక్త జట్లతో పాల్గనటంపై ఒప్పందం కుదిరింది.

వివాహానికి ముందే విడాకుల గురించి చర్చించే ప్రబుద్ధుల మాదిరి రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదల గురించి వూహాగానాలు చేసే పశ్చిమ దేశాల మీడియా కుదిరిన ఒప్పందాంశాలపై కూడా మరుక్షణం నుంచే వుత్తర కొరియాపై చిత్తశుద్ధిపై రచ్చ ప్రారంభించింది. గతంలో కుదిరిన కొన్ని ఒప్పందాల నుంచి వుత్తర కొరియా వెనక్కు తగ్గిన మాట వాస్తవం. దానికంటే ముందు మరో ఒప్పంద భాగస్వామి అమెరికా వాగ్దానభంగం చేయటమే కాదు, వుత్తర కొరియాను రెచ్చగొట్టిన పర్యవసానమే అది. కొరియా ద్వీపకల్పంలో చిచ్చు పెట్టింది, పిర్ర గిల్లి జోలపాడుతోంది, దక్షిణ కొరియాను తన చేతిలో పావుగా చేసుకొని వుత్తర కొరియాకే కాదు, పక్కనే వున్న సోషలిస్టు చైనాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోంది అమెరికాయే.

వుత్తర కొరియా విశ్వసనీయతపై సందేహాలు లేవనెత్తుతున్న పశ్చిమ దేశాలు మరో నూతన ఒప్పందాన్ని ఎందుకు ప్రోత్సహించినట్లు? ఇది సమాధానం లేని ప్రశ్న. పశ్చిమ దేశాల కుట్రలు, కుయుక్తుల గురించి తెలిసీ వుత్తర కొరియా ఎందుకు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు దేశాల వెనుక పనిచేసిన వత్తిడులేమిటి? ఈ రీత్యా చూసుకున్నపుడు వుభయులకూ ఇది అవసరమే. ఎవరి ఎత్తుగడలు వారికి, ఎవరి ప్రయోజనాలు వారికీ వున్నాయి.

వేల సంవత్సరాల పాటు ఒకే దేశంగా కొనసాగిన కొరియాను కే దేశంగా 1910లో జపాన్‌ ఆక్రమించింది. దానికి వ్యతిరేకంగా కొరియన్లు పెద్ద ఎత్తున వుద్యమాలు నడిపారు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసే సమయంలో 1945 ఆగస్టు తొమ్మిదిన యాల్టా సమావేశంలో కుదిరిన ఒప్పందం మేరకు జపాన్‌పై నాటి సోవియట్‌ యూనియన్‌ యుద్ధం ప్రకటించింది. అయితే కొరియాలో అప్పటికే కమ్యూనిస్టులు విముక్తి పోరాటాలలో ముందుండటంతో విముక్తి జరిగిన తరువాత కొరియా సోవియట్‌ ప్రభావంలోకి వెళుతుందనే భయంతో 38వ అక్షాంశ రేఖ వరకు మాత్రమే సోవియట్‌ సైన్యాలు పరిమితం కావాలని మిగతా ప్రాంతాన్ని తమకు వదలాలని అమెరికా కోరింది. వారం రోజులలోపే అమెరికా సేనలు ప్రవేశించక ముందే జపాన్‌ చేతులేత్తేసింది. మరో పది రోజుల తరువాత ఎర్ర సైన్యం వుత్తర కొరియాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇరవై రోజులకు అమెరికా సేనలు వచ్చాయి. తమకు అనుకూలంగా వుంటే మిలిటరీ ప్రభుత్వాన్ని దక్షిణ కొరియాలో ఏర్పాటు చేశాయి.

Image result for korea missile

జపాన్‌ తప్పుకున్న తరువాత రెండవ ప్రపంచ యుద్ధ మిత్రరాజ్యాల పర్యవేక్షణలో కొంతకాలం కొరియాలో పాలన సాగించాలని కొందరు ప్రతిపాదించారు. అయితే దేశభక్తులు తమకు వెంటనే స్వాతంత్య్రం కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టులను, పోటీగా స్వాతంత్య్రపోరాట సమయంలో పశ్చిమ దేశాలకు పారిపోయిన, జపాన్‌తో చేతులు కలిపిన ద్రోహులను, కమ్యూనిస్టు వ్యతిరేకులను అమెరికన్లు చేరదీశారు.

అమెరికా ప్రోద్బలంతో కొరియాపై తాత్కాలిక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి చేసిన ప్రతిపాదనను సోవియట్‌ యూనియన్‌ తిరస్కరించింది. తరువాత అమెరికన్లు దక్షిణ కొరియాలో ఎన్నికల తతంగం జరిపి మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారాన్ని దానికి బదలాయించారు. వుత్తర కొరియా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సోవియట్‌ సేనలు అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయాయి. అయితే దక్షిణ కొరియా మిలిటరీకి శిక్షణ ఇచ్చే నెపంతో అమెరికా సేనలు అక్కడే తిష్టవేశాయి. కొరియాను ఒకే దేశంగా పరిగణిస్తూ రెండు ప్రభుత్వాలు మొత్తం కొరియాకు తామే ప్రతినిధులమని ప్రకటించుకున్నాయి. విభజన తాత్కాలికమే అని రెండు ప్రాంతాల విలీనానికి కట్టుబడి వున్నట్లు పేర్కొన్నాయి. ఎవరికి వారు పైచేయి సాధించి దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే 1950 జూన్‌ 25న రెండు ప్రాంతాల మిలిటరీ మధ్య ఘర్షణ తలెత్తింది. దక్షిణ కొరియాలోని ప్రభుత్వానికి రక్షణ కల్పించే పేరుతో భద్రతా మండలిలో అమెరికా ఒక తీర్మానం చేయించటం, ఐరాస సేనల పేరుతో వుత్తర కొరియాపై దాడికి దిగాయి. కొద్ధి కాలం తరువాత వుత్తర కొరియాకు మద్దతుగా చైనా రంగంలోకి వచ్చింది. అమెరికా నాయకత్వంలోని సేనలను తరిమి కొట్టింది. చివరకు 1953 జూలై 27న వుభయ ప్రాంతాల మధ్య పూర్వపు సరిహద్దులను పునరుద్దరిస్తూ 38వ అక్షాంశ రేఖ పరిసరాలను మిలిటరీ రహిత ప్రాంతంగా గుర్తిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు

ఈ ఒప్పందం కాల్పుల విరమణకే పరిమితమైంది తప్ప తదుపరి శాంతి ఒప్పందం కుదరలేదు.దాన్ని కూడా దక్షిణ కొరియా పాలకులు ఆమోదించి సంతకాలు చేయలేదు, చివరకు కట్టుబడి వుంటామని మాత్రమే ప్రకటించారు.దాంతో తాము కూడా కట్టుబడటం లేదని వుత్తర కొరియా ప్రకటించింది. అందువలన ఇప్పటికీ సాంకేతికంగా కాల్పుల విరమణ జరిగింది తప్ప సాంకేతికంగా యుద్ధం ముగిసినట్లు కాదు.

కొరియా యుద్దం, దేశ విభజన కొరియన్లను అనేక కష్ట నష్టాలపాలు చేసింది. ఏడున్నరలక్షల మంది తమ కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ఎదురుగా కనిపిస్తున్నా ఒకరి నొకరు కలుసుకోలేని దుస్ధితి. రెండు ప్రాంతాల మధ్య నిత్యం వుద్రిక్తతలు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఆందోళన,భయం వెన్నాడుతూ వుంటుంది. వుభయ ప్రాంతాలను వేరు పరచి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఒకే దేశం, ఒకే ప్రజగా ప్రపంచం ముందు తలెత్తుకు నిలబడాలన్న తపన ఇంకా మెజారిటీ జనంలో వుందని అనేక సర్వేలు వెల్లడించాయి. గత ఐదు ద శాబ్దాలలో వుభయుల మధ్య విబేధాలను పెంచే అనేక వుదంతాలు జరిగాయి. వాటి వెనుక అమెరికా ప్రచ్చన్న హస్తం వుంది. కొరియా ప్రాంతంలో తిష్ట వేయాలంటే అమెరికన్లకు ఒక దేశం అవసరం. అది దక్షిణకొరియాగా వుండాలన్నది దాని వాంఛ అందుకే విలీనానికి ఇంకా సమయం రాలేదు, దక్షిణ కొరియన్లలో భయం తొలగలేదంటూ కుంటి సాకులు చెబుతున్నది. నిజానికి రెండు ప్రాంతాలు విలీనమైతే జనాభా రీత్యా చూసుకుంటే రెండున్నర కోట్ల మంది వుత్తర కొరియన్లతో పోలిస్తే ఐదుకోట్లమందికి పైగా వున్న దక్షిణ కొరియన్లే నిర్ణయాత్మక పాత్ర వహిస్తారు. అందువలన వారు భయపడుతున్నారని చెప్పటంలో అర్ధం లేదు. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక తిష్ట వుత్తర కొరియన్లనే భయపెడుతున్నది, ఎందుకంటే 1950దశకంలో వారిపై దాడి చేసింది అమెరికన్లు, వారి కనుసన్నలలో పనిచేసే దక్షిణ కొరియా మిలిటరీ తప్ప మరొకటి కాదు.

Image result for north korea  arms show

అమెరికా ఈ వైఖరి కారణంగానే వుత్తర కొరియా తన రక్షణ చర్యల్లో భాగం ఆధునిక క్షిపణులు, అణు కార్యక్రమాలను చేపట్టాల్సి వచ్చింది. ప్రపంచంలో అణు రియాక్టర్లను కలిగిన ఏ దేశమైనా అణ్వాయుధాలను తయారు చేయటానికి అవసరమైన ముడి సరకును కలిగి వున్నట్లే. అందువలన దక్షిణ కొరియా అధికారికంగా ప్రకటించలేదు తప్ప దాని దగ్గర అణ్వాయుధాలు లేవని చెప్పలేము. వుత్తర కొరియా అణుక్షిపణుల కార్యక్రమాన్ని ప్రారంభించటంతో 2003 నుంచి అమెరికా, చైనా,జపాన్‌, రష్యా, వుభయ కొరియాల( ఆరు దేశాల) మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. 2006ల వుత్తర కొరియా తొలి అణుపరీక్ష జరిపింది.

తాజా ఒప్పందానికి దారితీసిన నేపధ్యాన్ని చూస్తే వుభయుల మీద పరిస్ధితులు, పర్యవసానాలు వత్తిడి తెచ్చాయనే చెప్పాలి. తమ వనరులను మిలిటరీ అవసరాలకు ఖర్చు చేయటం వుత్తర కొరియాకు ఎల్లవేళలా సాధ్యం కాదు. అది వాంఛనీయం కూడా కాదు. చైనా ఎంతగా సాయం చేసినప్పటికీ అమెరికా విధించిన అధికారిక, అనధికారిక ఆంక్షలు వుత్తర కొరియాను ఇబ్బంది పెట్టేవే. అందువలన కాస్త వూపిరి పీల్చుకోవాలంటే దక్షిణ కొరియాతో సామరస్యక పూర్వక ఒప్పందం దానికి కూడా అవసరమే.

వుత్తర కొరియా అణు పరీక్షలు, అణ్వాయుధాలను మోసుకుపోగల దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగాల ద్వారా అమెరికా,జపాన్లపై తాము బాంబుల వర్షం కురిపించగలమని వారు చేసిన హెచ్చరిక అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా వాసులను అనిశ్చితి, భయాందోళనలకు గురిచేసింది. అమెరికా ఎన్ని బెదిరింపులు చేసినా వుత్తర కొరియా వెనక్కు తగ్గదని తేలిపోవటంతో ఏదో ఒక విధంగా రాజీ ఒప్పందం చేయించట ద్వారా తమ జనాల్లో వున్న భయాన్ని పొగొట్టేందుకు అమెరికా, జపాన్‌ పాలకులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ధనిక దేశాలలో గత పది సంవత్సరాలుగా తలెత్తి కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభం దక్షిణ కొరియాను కూడా తాకింది. అది అక్కడి కార్మికవర్గంలో అసంతృప్తికి దారితీస్తోంది. దీనికి తోడు నిత్యం వుత్తర కొరియా నుంచి ఏం జరుగుతుందో తెలియని స్ధితి దక్షిణ కారియా పాలకవర్గం వత్తిడి కలిగిస్తోంది. వుత్తర కొరియాకు తోటి సోషలిస్టు దేశ ంగా ఎన్ని విధాలుగా సాయం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ వేదికల మీద కొన్ని సందర్భాలలో చైనా కూడా గట్టిగా మాట్లాడలేని స్ధితి వుంది. ఈ విధంగా కొరియా రాజకీయాలతో ప్రమేయం వున్న అన్ని దేశాలకు అనుకూల, ప్రతికూల వత్తిళ్లు వున్నాయి. ఈ కారణంగానే వుభయ కొరియాల మధ్య ఒప్పందానికి తెరవెనుక వుండి అన్ని దేశాలూ సంతకాలు చేయటానికి సహకరించాయనే చెప్పవచ్చు. ఈ పూర్వరంగంలోనే

2015 జనవరి ఒకటిన వుత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ దక్షిణ కారియాతో వున్నత స్ధాయి చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు.అదే ఏడాది ఆగస్టులో సరిహద్దులలో సంభవించిన కొన్ని సంఘటనలు వుద్రిక్తతలను కలిగించినా సర్దుబాటు చేసుకున్నారు. శాంతి చర్చలకు సంసిద్ధతతో పాటు వుత్తర కొరియా తన అణుపరీక్షలను కూడా కొనసాగిస్తూనే వస్తోంది. 2016లోఅరవైఎనిమిద వార్షికోత్సవం సందర్భంగా ఆరవ పరీక్ష జరిపింది.కిమ్‌ జోంగ్‌ ఇన్‌ను హత్య చేసేందుకు తమ వద్ద పధకం వుందని దక్షిణ కొరియా బెదిరించింది.ఈ ఏడాది మార్చి ఆరున కిమ్‌ దక్షి ణకొరియా రాయబారులతో సమావేశమై సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌ గురించి చర్చించారు.2017 మేనెలలో అధికారానికి వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ వుత్తర కొరియా సయోధ్య కు సై అన్నాడు.2018 నూతన సంవత్సర సందేశంల సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌కు జట్టును పంపేందుకు కిమ్‌జోంగ్‌ అన్‌ సంసిద్ధత ప్రకటించారు.

రెండు సంవత్సరాల తరువాత ముఖాముఖీ చర్చలకు తెరలేచింది. సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌కు ఐస్‌ హాకీలో వుమ్మడి జట్టును, అధ్లెట్లను పంపటంతో పాటు రెండు ప్రాంతాల క్రీడాకారులు ఒకటిగానే పరేడ్‌లో పాల్గన్నారు. ఈ పోటీలకు అసాధారణ రీతిలో వుత్తర కొరియా పార్లమెంట్‌ అధ్యక్షుడి నాయకత్వంలో పెద్ద ప్రతినిధి బృందం తరలి వచ్చింది. ఈ సందర్బంగానే తమ దేశాన్ని సందర్శించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఆహ్వానం అందచేశారు. ఈ పరిణామం తరువాత వుభయ దేశాల అధికారులు వుమ్మడిగా 2021 ఆసియా శీతాకాల ఆటల నిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు. మార్చినెలలో దక్షిణకారియా ప్రతినిధి బృందం పోంగ్‌యాంగ్‌లో వుత్తర కొరియా అధ్య క్షుడు కిమ్‌ను కలసింది. తరువాత అదే బృందం వాషింగ్టన్‌ వెళ్లి కిమ్‌తో భేటీ కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆహ్వానం అందచేసింది.

ఏప్రిల్‌ ఒకటవ తేదీన దక్షిణ కారియా పాప్‌ స్టార్స్‌ పోంగ్‌యాంగ్‌ వెళ్లి వసంతం వస్తోందంటూ ఒక సంగీత కచేరి నిర్వహించింది. దానికి కిమ్‌ హాజరయ్యారు. ఈలోగా పరస్పర ప్రచార దాడులు ఆగిపోయాయి.ఏప్రిల్‌ 27న వుభయ దేశాల నేతల శిఖరాగ్ర సమావేశం జరిగింది, ఒప్పందం కుదిరింది. కొరియా యుద్దం 1953 తరువాత తొలిసారిగా వుత్తర కొరియా నేత దక్షిణ కొరియాలో అడుగు పెట్టటం ఇదే ప్రధమం. ఎక్కడైతే నాడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో అక్కడే ఈ భేటీ జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని శాంతి ఒప్పందంగా మార్చాలన్న ఆకాంక్ష ఇరువురిలో వ్యక్తమైంది. ఒంటిచేతితో చప్పట్లు రావు, చేతులు కలపాలి, చేతలు జరగాలి.అలాగే కుదిరిన ఒప్పందాన్ని ఇరు పక్షాలు, వారి వెనుక వున్న మద్దతుదార్లు చిత్తశుద్దితో వుంటేనే ఆచరణలోకి వస్తుంది. ఎవరు ద్రోహం చేసినా అది ఒక్క కారియా ద్వీపకల్పానికే కాదు, యావత్తు ప్రపంచానికి నష్టదాయకం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దళితుల ఇండ్లలో భోజనం చేస్తే వారు పునీతులు కారు అన్న వుమా భారతి

03 Thursday May 2018

Posted by raomk in BJP, Communalism, History, INDIA, NATIONAL NEWS, Opinion, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP motor mouths, Dalit, discrimination against dalits india, motormouths, Uma Bharti

Image result for Uma Bharti

ఎం కోటేశ్వరరావు

ఏదో అయింది, లేకపోతే నరేంద్రమోడీ అంతటి పెద్ద మనిషి వివాదాస్పద, మసాలా మాటలు మాట్లాడి పార్టీకి ఇబ్బంది తేవొద్దు అని హెచ్చరించిన తరువాత కూడా తమ నేతల నేతల నోళ్లు ఇంకా వాగుతూనే వున్నాయని కొందరైనా బిజెపి అభిమానులు అంతరంగంలో అయినా అనుకోకుండా వుండజాలరు. నేతల నోళ్లు పని చేస్తుండటమే కాదు, పార్టీ మరుగుజ్జు యోధుల సేన(ట్రోల్స్‌) తమ ఎత్తుగడలతో ఇంకా ముందుకు పోతూనే వుంది. మోడీ అంటే వీరికి లెక్క లేదా లేక మోడీ అదుపులో వీరు లేరా లేక నేను పెద్దమనిషిగా సుద్దులు చెబుతుంటాను మీరు చేసేది చేయండి అన్న మార్గదర్శక సూత్రాలేమైనా వున్నాయా అని అనుమానించక తప్పటం లేదు. ఒకటి మాత్రం స్పష్టం. పులినెక్కిన వారు ఆకస్మికంగా స్వారీని మధ్యలో ఆపలేరు. దాన్ని వారు అదుపులోకి తీసుకొని దిగాలి లేదా దానికి బలి కావాలి. బిజెపి మతోన్మాద, విద్వేష ప్రచార పులి స్వారీ చేస్తోంది. మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వుమా భారతి తాజాగా చేసిన వ్యాఖ్యలను చూసిన తరువాత మోడీ సలహా నేపధ్యంలో బిజెపి వారెంత తెలివిగా తమ నోళ్లను వుపయోగిస్తున్నారో తెలుస్తోంది.

పిటిఐ అందచేసిన వార్త ఇలా వుంది. మంగళవారం నాడు కేంద్ర మంత్రి వుమా భారతి దళితులను అవమానించిన తీరు కొంతకాలంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దళితులను దువ్వేందుకు చేస్తున్న యత్నాలను గాలికిపోయేట్లు చేసిందంటే అతిశయోక్తి కాదు. వుమా భారతి మధ్య ప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌ సమీపంలో నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా దళితులతో సహపంక్తి భోజనానికి గైరు హాజరయ్యారు. వారితో కలసి భోంచేసి వారిని పునీతులను చేయటానికి తానేమీ భగవంతుడు రాముడిని కాదని వ్యాఖ్యానించారు. తరువాత ఆమె క్షమాపణలు చెప్పారు. వారితో కలసి భోజనం చేయాలనే విషయం తనకు తెలియదన్నారు. రెండు రోజుల క్రితం (మే ఒకటవ తేదీ) దాద్రి గ్రామంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ ‘ఇలాంటి కార్యక్రమాలను (షెడ్యూలు కులాల వారితో కలసి సహపంక్తి భోజనాలు చేయటం) నేను సమర్ధించినప్పటికీ దళితులతో కలసి భోజనం చేసేందుకు నేను వారి ఇండ్లకు వెళ్లను’ అని చెప్పారు. దానికి బదులు వారిని తానే తన ఇంటికి ఆహ్వానిస్తానని అన్నారు. ‘ నేను మీతో ఒక రహస్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను సహపంక్తి భోజనాలలో పాల్గనను, ఎందుకంటే ఎవరైతే శబరి ఇంటికి, దళితుల వద్దకు వారిని పునీతులను చేసేందుకు వెళ్లిన భగవంతుడు రాముడిని నేను అనుకోవటం లేదు. వారితో కలసి కూర్చోవటానికి, పునీతులను చేసేందుకు నేనేమీ భగవంతుడు రాముడిని కాదు. దానికి బదులు వారు మా ఇంటికి వచ్చి వంట ఇంట్లో కూర్చుంటే మేము పునీతులం అవుతాం. మా ఇంట్లో నా భోజన బల్లమీద దళితులకు నేను వడ్డిస్తే నా ఇల్లు, పాత్రలు కూడా పునీతం అవుతాయి. ఢిల్లీ రండి, మా మేనల్లుడి భార్య మీకు భోజనం తయారు చేస్తుంది. నేను మీకు వడ్డిస్తాను, మా మేనల్లుడు మీరు తిన్నతరువాత కంచాలను తీసి శుభ్రం చేస్తాడు. నేను మా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నేను మీతో కలిసి భోజనం చేయలేను, ఎందుకంటే ఇప్పటికే తిన్నాను, నేను మీ అందరినీ ప్రేమిస్తున్నా, ఎల్లవేళలా మీతోనే వుంటా ‘ అన్నారు.

Image result for Uma Bharti

తరువాత ఒక ప్రకటన చేస్తూ తన అనుచరుడైన హర్షు మహరాజ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భోజనం చేయవలసిన అంశం వుందని నాకు తెలియదు అని వేదికమీదనే చెప్పాను. ఇక్కడి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో వున్న టికమ్‌ ఘర్‌ జిల్లా పాపోడాకు వెళ్లి అక్కడ విద్యాసాగర్‌ మహరాజ్‌ను కలవాల్సి వుందని, అందువలన వారితో కలసి భోజనం చేయలేనని వారికి క్షమాపణ చెప్పాను. సామరస్యత సాధించాలంటే దళితులతో కలసి భోజనం చేయాలన్న ఒకప్పటి కాలం గతించింది. దానికి బదులు వారిని రాజకీయంగా, సామాజికంగా, ప్రభుత్వంలోనూ, యంత్రాంగంలోనూ, ఇతర వాటిలోనూ సామరస్యత సాధించాలంటే వారిని సమానత్వంతో తీసుకుపోవాలి. రాజకీయాలలో దళితులు, వెనుకబడిన తరగతుల మధ్య సామరస్యం సాధించేందుకు ఇప్పుడు వివక్షను అధిగమించాలి. సామాజిక సామరస్యతను సాధించాలంటే ఆర్ధిక సాధికారత, సామాజిక గౌరవం, ప్రభుత్వంలో, అధికార యంత్రాంగంలో సమాన భాగస్వాములను చేయటం మాత్రమే మౌలిక అవసరాలు.’ అన్నారు. కార్యక్రమం తరువాత దళితులతో భోజనం చేయాలనుకోవటం లేదని చెప్పటం గురించి విలేకర్లు అడగటం ఆశ్చర్యంగా వుందని వ్యాఖ్యానించారు.

సామాజిక సామరస్యత, కుల తత్వానికి వ్యతిరేకంగా సహపంక్తి భోజనాలు, దళితుల ఇండ్లలో భోజనం చేయటం వంటి కార్యక్రమాలను గత కొద్ది నెలలుగా బిజెపి పెద్ద ఎత్తున ప్రచారంతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పూర్వరంగంలో ఒక కేంద్ర కాబినెట్‌ మంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా వుమా భారతి వ్యవహరించిన తీరు బిజెపి నేతల అంతరంగాన్ని తెలియచేస్తున్నది. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని బిజెపితో గట్టి స్నేహం చేసిన చంద్రబాబు నాయుడు గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సోమవారం నాడు వుత్తర ప్రదేశ్‌ మంత్రి సురేష్‌ రాణా అలీఘర్‌లోని ఒక దళితుని ఇంట బయటి నుంచి తెచ్చిన భోజనం చేసి విమర్శల పాలయ్యాడు.

విలేకర్లతో ప్రత్యక్షంగా మాట్లాడకూడదన్న దీక్షలో వున్నారు కనుక తమ పార్టీ నేతలునోటి తుత్తరను అదుపులో వుంచుకోవాలని మోడీ చెప్పటం వరకు బానే వుంది. కానీ ఇతర నేతలకు ఎలా సాధ్యం అవుతుంది. కాశ్మీరులో ఎనిమిదేండ్ల బాలిక అసిఫాపై జరిగిన అత్యాచారాన్ని లండన్‌ భారత సంతతి వారి సభలో ప్రధాని నరేంద్రమోడీ సూటిగా ఖండించకుండా కుండా అత్యాచారం అత్యాచారమే దాన్నెలా సహిస్తాం అని ఎదురు ప్రశ్నవేస్తూ రాజకీయం చేయవద్దని వ్యాఖ్యానించారు. అత్యాచార వుదంతం ప్రపంచవార్తగా తయారైంది. నిందితులపై కేసు నమోదు చేయవద్దని జమ్ము బార్‌ అసోసియేషన్‌ అడ్డుకుంది. నిందితులు నిర్దోషులంటూ హిందూ ఐక్య వేదిక పేరుతో జరిగిన సభలో ఇద్దరు కాశ్మీరు మంత్రులు, ఎంఎల్‌ఏలు పాల్గన్నారు. నష్ట నివారణ చర్యగా ఇద్దరు మంత్రులను రాజీనామా చేయాలని బిజెపి ఆదేశించింది. ఇంత జరిగాక ఆ సభలో పాల్గన్న ఒక ఎంఎల్‌ఏకు మంత్రి పదవి కట్టబెట్టారు. కవీందర్‌ గుప్తా అనే ఎంఎల్‌ఏను వుప ముఖ్యమంత్రిగా చేశారు. ఇంత జరిగిన తరువాత సదరు కవీందర్‌ అసిఫా హత్యాచార సంఘటన చాలా చిన్నదని వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి. దోషులకు మద్దతుగా పాల్గన్న ఎంఎల్‌ఏకు మంత్రి పదవి ఇవ్వటం ఏమిటని అడిగితే అది ఇప్పటి నిర్ణయం కాదు, మూడు సంవత్సరాల నాడే మంత్రి వర్గమార్పులు చేయాలని నిర్ణయించినదానిలో భాగమే అని బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ సమర్ధించుకున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ అయితే నారదుడు ఇంటర్నెట్‌ గూగుల్‌ వంటి వాడని సెలవిచ్చారు. అంతకు ముందు మహాభారత కాలంలోనే ఇంటర్నెట్‌ వుండబట్టే సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ వార్తలను ఎప్పటికప్పుడు తెలియచేశాడని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ దేవ్‌ చెప్పిన విషయమూ తెలిసిందే. జ్ఞానపరంగా బిఆర్‌ అంబేద్కర్‌, నరేంద్రమోడీ ఇద్దరూ బ్రాహ్మలే అని గుజరాత్‌ స్పీకర్‌ రాజేంద్ర త్రివేదీ వర్ణించాడు. గుణాన్ని బట్టి కులం వుంటుందని, జ్ఞానం వున్న ప్రతి వారూ బ్రాహ్మలేనని శ్రీకృష్ణుడే చెప్పాడని, అందుకే తాను అంబేద్కర్‌, మోడీ ఇద్దరూ బ్రాహ్మలే అన్నానని సమర్ధించుకున్నాడు.

కేంద్ర మంత్రి అనంత కుమార హెగ్డే కర్ణాటక ఎన్నికల సభలో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ దేవాలయాలకు వెళ్లినపుడు కావి(కాషాయ) దుస్తులు, మఠాలకు పోయినపుడు రుద్రాక్షలు, కోడి ఈకలతో మసీదులకు, శిలువ ధరించి చర్చ్‌లకు వెళతాడు, ఇప్పుడు ఆయన శ్రావణ బెళగొళ వెళతాడు అంటూ ఎద్దేవా చేశాడు. ఎలాంటి దుస్తులు ధరించని జైన్‌ దిగంబర ఆలయం అది అన్న విషయం తెలిసిందే. తమ మనోభావాలను కేంద్ర మంత్రి కించపరిచాడంటూ జైనులు ఇప్పుడు నిరసన తెలుపుతున్నారనుకోండి. ఇలా నోరుపారవేసుకోకపోతే కార్యకర్తలకు కిక్కు ఎక్కదు, మీడియాలో ప్రచారం రాదని బిజెపి నేతలకు బాగా తెలుసు. అయితే ఇలాంటి వాటిని వుపయోగించుకొని పార్టీలో ప్రతీకారం తీర్చుకొనే అవకాశాలు కూడా లేకపోలేదు. కథువా(అసిఫా) అత్యాచారం వెనుక పాకిస్ధాన్‌ హస్తం వుందని వ్యాఖ్యానించిన బిజెపి మధ్యప్రదేశ్‌ అధ్యక్షుడు నంద కుమార్‌ సింగ్‌ చౌహాన్‌ పార్టీ వుద్యోగం పొగొట్టుకున్నాడు. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన వుప ఎన్నికలలో బిజెపి ఓడిపోవటానికి ఎవరో ఒకరిని బలిపశువును చేయాలి కనుక ఈ వ్యాఖ్యలను చూపి ఇంటికి పంపించారనే వార్తలు కూడా వచ్చాయి. సదరు నేతకు నోరు పారవేసుకోవటం సాధారణం. రాజకీయ నేతలు నేరగాళ్లకు విధిగా మద్దతు ఇవ్వాలని గతంలో ప్రకటించాడు. తమ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా నాలుక కోస్తా అని బిజెపి ఎంఎల్‌ఏ చేసిన వ్యాఖ్యలు ఒక వుప ఎన్నికలో బిజెపిని దెబ్బతీశాయి. అదే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరీ శంకర్‌ బిసేన్‌ తమ గ్రామంలో తాగటానికి మంచి నీళ్లు లేవంటే అయితే మీకు బిస్లరీ వాటర్‌ సరఫరా చేస్తాంలే అని వ్యంగోక్తితో ఆగ్రహం తెప్పించాడు. ఫ్రెంచి విప్లవ సమయంలో తినటానికి రొట్టెలు దొరకటం లేదని జనం ఆగ్రహంతో వున్నారు మహరాణీ అంటే అయితే వారు కేకులు తినవచ్చు కదా అన్న మారీ అంటోనియెట్‌ను ఈ మంత్రి గుర్తుకు తెచ్చారు. తమకు ఓటు వేయని వారంతా పాకిస్తానీలే అని సహకారశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ నోరుపారవేసుకున్నాడు. రైతుల ఆత్మహత్యలు డబ్బుకోసం, ఒక ఫాషనైపోయింది అన్న వ్యాఖ్యలు చేసిన అనేక మంది గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి తమకు ఎదురు లేదనే అధికార దురహంకారం ఒక కారణమైతే, అడుగుజారుతున్న సమయంలో వ్యక్తమయ్యే అసహనానికి కూడా ఇవి చిహ్నమే. అంతేకాదు, వారి అంతరంగాన్ని కూడా ఇవి బయటపెడతాయి. మేకతోలు కప్పుకున్న పులులు, గోముఖ వ్యాఘ్రాలు కూడా ఇలాగే వుంటాయి.

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వేదాలను ప్రశ్నించిన మహాకవి వేమన కూడా జాతి వ్యతిరేకి, కమ్యూనిస్టేనా ?

02 Wednesday May 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION

≈ 1 Comment

Tags

ANTI NATIONAL, communal forces, communalism, communist, everything lies in veda’s only, Religious Fundamentalists, vedas, Vemana

ఎం కోటేశ్వరరావు

వేదాల్లో అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు అన్న శీర్షికతో నేను రాసిన వ్యాసంపై సామాజిక మాధ్యమంలోని ఫేస్బుక్‌లో సంస్కారయుతంగా స్పందించిన వారందరికీ ఒక దండం, అనాగరికంగా స్పందించిన వారికి వంద దండాలు. చర్చలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించటం కనీస ధర్మంగా భావిస్తున్నా.

‘వేదాలు ఎందరు చాడుతున్నారు కమ్మీ’

జ: దీనిలో చాడు ను వాడు గా అనుకున్నా కమ్మీ అనే తిట్టు తప్ప ప్రశ్న అర్ధం కాలేదు.

‘ అబ్బే అన్నీ దాస్‌ కాపిటల్‌ లోనే ఉన్నాయి పోయి చదువుకోండి.’

జ: అంత వుక్రోషం వద్దులే మిత్రమా ! ప్రపంచంలో వేదాలు చదువుతున్న వారి కంటే దాస్‌ కాపిటల్‌ చదివేవారే ఎక్కువ . గత పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో వచ్చిన సంక్షోభం తరువాత మరీ ఎక్కువగా చదువుతున్నారని వార్తలు. ప్రపంచంలో దాస్‌ కాపిటల్‌ చదివి తిరుగుబాట్లు చేశారు. వేదాలు చదివిన వారు అగ్రహారాలకే పరిమితం అయ్యారు , వాటిని కూడా సంస్కరించుకోలేకపోయారు అన్నది అంగీకరించక తప్పదు మరి. ఇదే సమయంలో ఒక కాలపు సాహిత్యంగా చరిత్రలో వేదాలకు స్ధానం వుంది.

‘రిజర్వేషన్‌ వల్ల రా కమ్మి. నీ వయసు కి విలువ ఇవ్వాలంపియట్లేదు’

జ: రిజర్వేషన్ల వ్యతిరేకత కనిపిస్తోంది. వేదాలు- మనువాదం రెండింటినీ విడదీయలేము. ప్రపంచంలో ఎక్కడా లేని రిజర్వేషన్ల విధానం రావటానికి జనాభాలో ఐదో వంతుగా వున్న దళిత, గిరిజనులను వేల సంవత్సరాలుగా అంటరాని వారిగా చూసినందువల్లనే ఇవి వచ్చాయి. ఆ దురాచారాన్ని రూపు మాపి వారిని కూడా తోటి మానవులుగా గుర్తించినపుడు రిజర్వేషన్లు వుండవు. కానీ ఇప్పుడు ఆధునిక మనువాదులు అంటరాని తనం వుండాలి, రిజర్వేషన్లు పోవాలి అంటున్నారు. ఇక నా వయస్సు, ఫేస్‌బుక్‌లో నేనే వివరాలు పెట్టాను, అందరికీ ఆధైర్యం వుండదు, అనేక మంది ఫేక్స్‌ వున్నారు. గురువు అద్వానీకే శిష్యుడు నరేంద్రమోడీ ఇచ్చిన విలువేమిటో చూశాము. వాదన, విషయంలో వున్నదానిని బట్టి విలువ ఇవ్వండి చాలు. కొంత మంది కుర్రవాళ్లు పేర్లకీ పుకార్లకీ నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. నేనైతే ఆ టైప్‌ కాదు. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా వుంది అని నమ్ముతా.

‘కమ్మీలకు స్వంత సిద్దాంతాల్లేక విదేశాలనుంచి ఎందుకు దిగుమతి చేసికొన్నారు?స్వంతంగా సిద్దాంతాలే తయారుచేసికోలేని అనామకులా కమ్మీలు?కాస్తైనా జ్ఞానంలేని మూర్ఖులైన కమ్మీలను ప్రజలెలా ఆదరిస్తారు?

జ: వసుధైక కుటుంబం అనే భావనలో నమ్మకం వున్న వాడిని. మన రాజ్యాంగంతో సహా అనేక అంశాలను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. ఇస్లాం, క్రైస్తవ మతాలను నిత్యం దుమ్మెత్తి పోసే వారు వారి దీనార్లు, డాలర్లు, ఇతర వస్తువులను తెచ్చుకోవటానికి, ఆ దేశాలకు వెళ్లి మరుగుదొడ్లు కడగటం నుంచి కంప్యూటర్ల వరకు ఏ పని అయినా చేయటానికి, కూలి డబ్బులు తెచ్చుకోవటానికి కోట్లాది మంది సిగ్గుపడటం లేదు. ఏం తెచ్చారో, ఎంత తెచ్చారో ఇంతవరకు తెలియకపోయినా నిత్యం నరేంద్రమోడీ విదేశాల నుంచి ఏదో ఒకటి తీసుకురావటానికే కేగా అందమైన సూట్లు వేసుకొని పైలా పచ్చీసుగా తిరుగుతోంది. భారతీయతకు ప్రతిబింబంగా కొందరు భావించే పిలక, పంచకట్టుతో ఎందుకు వెళ్లటం లేదు. ఇన్ని జరుగుతున్నపుడు, వాటికి అభ్యంతరం లేనపుడు కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతాన్ని తమకు వర్తింప చేసుకుంటే తప్పేమిటట? బౌద్దం, ఇస్లాం, క్రైస్తవం, హిందూ మతం ఒక చోట పుట్టి అనేక దేశాలకు విస్తరించింది. కమ్యూనిజం కూడా అంతే .వాటికి లేని అంటూ సొంటూ కమ్యూనిజానికికే ఎందుకు?

‘ మీ బతుకులు ఈ దేశ గొప్పదనం తక్కువ చేయడానికే. పంది బురద మెచ్చు, పన్నీరుమెచ్చునా విశ్వదాభిరామ…’

జ: నాకు తెలిసినంత వరకు ఏ కమ్యూనిస్టూ ఈ దేశ గొప్పతనాన్ని తక్కువ చేయలేదు. అలా చేసినట్లు ఒక్క వుదంతం వున్నా చూపాలని చేసిన సవాలుకు ఇంతవరకు ఎవరూ బదులివ్వలేదు. అనేక మతాలు వచ్చాయి, పెరిగాయి, తరిగాయి. మధ్య యుగాల నాటి మాదిరి భీకర మత యుద్ధాలు మహత్తరమైన భారత గడ్డమీద జరగలేదు గాని మత యుద్ధాలు మనకు కొత్త గాదు. శైవులు-వైష్ణవుల మధ్య పరిమితంగా అయినా యుద్ధాలు జరిగాయి. జైన, బౌద్ధ మతాలను, హేతువాద, భౌతిక వాదులైన చార్వాకులను హిందూ మతంగా చెప్పుకొనే వారు అణచివేచిన చరిత్ర వుంది. ఇప్పుడు క్రైస్తవం, ఇస్లాం మతాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న మెజారిటీ మతోన్మాదులు, దానికి స్పందిస్తున్న మైనారిటీ మతోన్మాదులు దొందూ దొందే. పందులు పన్నీరు మెచ్చకపోయినా నష్టం లేదు. మతోన్మాదులు ఎందరు మగువల కన్నీరు ఒలికించటానికి నీ పేరుతో ప్రయత్నిస్తున్నారో వీలైతే వారిని ఆపేట్లు చూడు రామా అని కమ్యూనిస్టులు కాని వారెందరో మొక్కుకుంటున్నారు.

‘విదేశాలకు పరుగులు తీయాలని కూడా వేదాల్లోనే ఉందట’

జ: అన్నీ వున్నాయష అన్నపడు పరుగుల గురించి ఎందుకుండదు

‘ వీళ్ళు వీళ్ళ పిచ్చ…వేదాలని ప్రశ్నిస్తే కమ్మీలు అంటారు,వాళ్లంటే అంత భయమేంటో, వాళ్ళ పేరే కలవరిస్తారు.’

జ: ఇది తరతరాలుగా వస్తున్న భయం, గంగిరెద్దుల్లా తలాడించటం, మన్ను దిన్న పాముల్లా జనం పడి వుండాలని కోరుకొనే వారికి ప్రశ్నించే ఒక్కడు కనపడినా భయమే. వేద ప్రామాణ్యాన్ని ప్రశ్నించటం ఈ రోజు కాదు, వాటిని రాసిన నాటి నుంచీ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే వున్నారు. ఒక్క వేదాలే కాదు, గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటి ఏ మత గ్రంధమైనా, మరొకటైనా సమాజ పురోగతికి ఆటంకం కలిగించే ప్రతిదాన్నీ జనం ప్రశ్నిస్తారు. అలాంటి వారిని అణచివేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. దోపిడీ వర్గాన్ని సమర్ధించే వారే నాడు నేడు ఈ అణచివేతకు పాల్పడుతున్నారు.

‘ఎవడైనా సరుకున్నవాడినే రమ్మంటారు’

‘ వారికి నేర్పడానికి నాసా లో హిందువులేఎక్కువ ‘

జ: సరకున్నవాడినే ఎవరైనా రమ్మంటారన్నది కొంత వరకు నిజమే. తమకు అవసరమైన వాళ్లను కూడా రమ్మంటారు అని కూడా తెలుసుకోవాలి. అమెరికా, ఐరోపా వారు వస్తువులు తయారు చేసుకోలేకనా చివరకు …..తుడుచుకొనే కాగితంతో సహా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నది. కాదు, వ్యాపారికి లాభం కావాలి. చైనాలో తయారయ్యేందుకు అయ్యే ఖర్చు కంటే అమెరికాలో ఎక్కువ చెల్లించాలి. అందుకే ఎక్కడ శ్రమశక్తి తక్కువుంటే అక్కడి నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు. అలాగే వైద్యులు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్‌ ఇంజనీర్లు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు వారిని తయారు చేసుకోలేక కాదు. ఒక వైద్యుడు తయారు కావాలంటే అమెరికాలో అయ్యే ఖర్చు కంటే ఇండియాలో తక్కువ. మిగతావారు కూడా అంతే. మన దేశంలో వున్నన్ని జబ్బుల గురించి అమెరికా, ఐరోపాలో తెలుసుకోవాలంటే కుదరదు, అక్కడన్ని లేవు గనుక. అందుకే విదేశాల నుంచి రమ్ముంటున్నారు తప్ప మన మీద ప్రేమ వుండి కాదు, మనమే గొప్పవారం అని కాదు. ప్రపంచంలో విదేశాలలో నివసించే చైనా జాతీయులు ఐదు కోట్ల మంది అయితే మన వారు మూడు కోట్లకు పైబడి వున్నారు. అమెరికాలో కూడా భారతీయుల కంటే చైనీయులే ఎక్కువ. అందువలన మన గురించి చెప్పుకోవచ్చు తప్ప అతిశయోక్తులు చెప్ప కూడదు. నాసాలో పని చేస్తున్న మన సైంటిస్టులందరూ హిందువులే అని చెప్పటం అతిశయోక్తి. అంటే హిందువులందరూ మన దేశ పరిశోధనలను వదలి పెట్టి అమెరికన్లకు వూడిగం చేస్తున్నారను కోవాలి. ఇదేమీ దేశభక్తి ?

‘ఎప్పుడూ పక్కదేశం బానిసలుగా బతికేవారికి ఆత్మవిశ్వాసం లోపించి మనలో ఏమీ లేదు అనుకునే పర్సనాలిటీ డిసార్డర్‌, ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్‌తో బ్రతికే మానసిక రోగులు మన కమ్యూనిస్టులు. ముందు మీ పూర్వీకుల ఘనతను తెలుసుకుని,ఎవరైనా సైకాలజిస్ట్‌ దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకోండి.

జ: కమ్యూనిస్టులు ఏ దేశం వారినైనా వారు దోపిడీ చేసేవారా, దోపిడీకి గురయ్యే వారా అని మాత్రమే చూస్తారు తప్ప మతం, కుల ప్రాతిపదికన చూడరు. పక్కన వున్న వాడికి ఒక కన్ను పోవాలనుకుంటే మనకు రెండూ పోతాయి. సమాజంలో కొంత మంది కంటే తాము గొప్ప వారమనే సుపీరియారిటీ రోగాన్ని పెంచిన మనువాదం మొత్తంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధను ప్రోత్సహించి, నిర్మించి సమాజానికి చేసిన హాని అంతా ఇంతా కాదు. మహిళలను అణచివేసింది, వారికి విద్య, వివేకం లేకుండా చేసింది. పంచముల పేరుతో నాలుగోవంతు, ఇతర వృత్తుల పేరుతో మరి కొ ందరిని ఈ దేశం మాది అనుకొనే స్ధితి లేకుండా చేసింది. ఎందరు హిందూ రాజులు పాలించినా వేల సంవత్సరాలు అదే స్ధితి కొనసాగింది. అందువలన, విదేశీయులు, హూణులు, తరుష్కులు, యూరోపియన్లు ఎవరు దేశం మీద దాడులు చేసినా, మొత్తాన్ని ఆక్రమించుకున్నా మన బతుకులు మారేదేమీ వుండదని ఏం జరిగితే మనకెందుకు లెమ్మని మెజారిటీ జనం ప్రేక్షక పాత్ర పోషించబట్టే దేశం వందల సంవత్సరాలు పరాధీనమైంది. ఎక్కడ ఏమాత్రం గౌరవం, ఆదరణ, సాటి మనిషిగా గుర్తింపు వుంటుందని భావించినా అనేక మంది మతమార్పిడులకు సిద్దపడటానికి కూడా కారణమదే. ఇప్పటికీ అదే స్ధితి. అందుకు అంబేద్కరే ప్రత్యక్ష నిదర్శనం. అందువలన మన గత ఘనత గురించి మరీ ఎక్కువగా చెప్పుకొనే మానసిక రోగులకే ముందు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. బుర్రలను మరమ్మతు చేయాలి.

ౖ’వేదాలలలో అన్ని ఉన్నాయి విదేశీయులు వఛ్చి అన్ని వేదిలేసేం ఇప్పటి అమెరికా వైద్యం కన్నా మంచి వైద్యం మన దగ్గర ఉండేది ఎంసెట్‌ రాంక్‌ వఛ్చినవాడు ఎం బి బి ఎస్‌ చదువుతాడుకాని ఆయుర్వేదం చదవడుకదా జెర్మనీ వాడు మానవేదాలని ఉపయోగించుకుని ఆయుధాలు మందులు చేసుకుంటున్నాడు మన రాజమండ్రి ఆయనని అక్కడకి తీసుకునివెళ్ళి మరి ఆయుధాల విద్య నేర్చుకున్నారు మనకి మాత్రం అలుసు మన పూర్వులగురించి తెలియదు తెలుసుకోము విదేశీయులంటే మోజు అన్ని ఉన్న విజ్ఞానం మనది

జ: ఇలాంటి నమ్మకాలు వున్న వారు రెండు తరగతులు.లోతైన అధ్యయనం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎక్కడ అనే ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా నమ్మి ప్ర చారం చేసేవారు. కావాలని దురహంకారాన్ని రెచ్చగొట్టే వారు. ఈ దేశంలో ఇప్పుడు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో వున్నది వేదాలలో అన్నీ వునాయష అని నమ్మే తిరోగమన భావజాలం వున్న వారే. దేశీయ వైద్యాన్ని అభివృద్ధి చేయటానికి వారికి ఎవరు అడ్డుపడ్డారు. కార్పొరేట్‌ ప్రయివేటు వైద్య విద్య, చికిత్సను ప్రోత్సహిస్తున్నారు. మన రాజమండ్రి ఆయనని తీసుకొనివెళ్లి జర్మన్లు ఆయుధాల విద్య నేర్చుకున్నారని చెప్పటం అమాయకత్వం తప్ప మరొకటి కాదు.

‘చదువుకున్నా చదువుకు సరైన ఉపాదిలభించక ఉపాధిని పొందడమే జీవిత లక్ష్యం

వేదాలలో …. నిర్వేదం ఉంది కాబట్టి

అవి శుద్ద దండగా అని నిరూపించడానికి……….

ఇప్పుడు అభివ ద్ధిలో ఉన్న దేశాలు కొన్ని ఒకప్పుడు భారతదేశానికి వచ్చి బాగు పడిపోయినవి.

డబ్బు కోసం తెల్లోని తొత్తులాయ్‌ మతం మరి సలాం కొట్టి గులాం గిరి చేసారు

వాడు వచ్చి మనని దోచి మన వేదాలను బూడిద చేసి మన దేవాలయాలను కూలగొట్టి

మన దేశం లో మనకే రాజు గామారి న తరవాత మనం ఇప్పుడు వాణి దెగ్గర గులాం చేయక ఎం చేస్తారు

అదే మన వేదాలను మన దెగ్గర భద్ర పరిస్తే ఈ పరిస్థితి ఉండేదా.

వేదాలు చదివిన ఘనాపాఠిలను చూసి వాళ్ళు ఏ కొత్త టెక్నా జీని ఆవిష్కరించలేక పోతున్నారని వారే విదేశీయ ఉత్పత్తుల కొరకు ఆరాటపడి పోతున్నారని నిర్ధారించుకొని విదేశాలకు పరుగులు పెడుతున్నారు. ఏ దేశంలో లేని ఖనిజ సంపద వనరులు కలిగిన మన మాత  భూమిని భారతదేశాన్ని కాలదన్ని విదేశీ మోజుతో వెళ్ళిపోతున్నారు.

వేదాల్లో అన్నీ ఉంటే వేదాలు చదివిన వేద పండితులు ప్రపంచానికి అవసరమైన ఆవిష్కరణలు చేసి భారత ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఎగరవేసేవారు. ప్రపంచ ప్రజలు .. ఇది భారత వేద పండితులచే కనిపెట్టబడినదని చెప్పుకొనే కనీసం ఒక వస్తువైనా ఉందా

జ: నా వ్యాసంలోను వీటి గురించి కొంత చర్చించి నందున కొన్నింటిపై వ్యాఖ్య అవసరం లేదని భావిస్తున్నాను. చివరగా ఒక మిత్రుడు ప్రశ్న వేదిక వేదాల గురించి వేమన ఎలా స్పందించిందీ చూడండి అంటూ రెండు పద్యాలు పంపారు.

వేద విద్యలెల్ల వేశ్యల వంటివి

భ్రమలు పెట్టి తేట పడగ నీవు

గుప్త విద్య యొకటె కులకాంత వంటిది

విశ్వదాభిరామ వినుర వేమ.

వేన వేలు చేరి వెర్రి కుక్కల వలె

అర్ధ హీన వేద మరచు చుంద్రు

కంఠ శోష కంటె కలిగెడి ఫలమేమి

విశ్వదాభిరామ వినుర వేమ!

మహాకవి వేమన హేతువాద భావజాలాన్ని అనుసరించే, ముందుకు తీసుకుపోయే అనేక మందిపై మతోన్మాదశక్తులు దాడులు చేస్తున్నాయి, ప్రాణాలు కూడా తీస్తున్నాయి. జనంలో ప్రతికూల స్పందన వస్తుందని భయపడిపోయి గానీ వేమనను కూడా కమ్యూనిస్టు , జాతి, హిందూ వ్యతిరేకి అని వున్మాదులు తిట్టి పోసే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు. భిన్నాభిప్రాయాన్ని అణచివేయాలని చూస్తున్న శక్తుల పట్ల ఎవరు వుపేక్షించినా వారు తమంతట తమ నోటిని మూసుకోవటమే. తరువాత తెరవాలన్నా తెరవనీయరు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
Newer posts →

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: